Skip to main content

విదేశాల్లో 34 లక్షల కోట్ల నల్లధనం

విదేశాల్లో భారతీయుల నల్లధనం రూ.15 లక్షల కోట్ల నుంచి రూ.33.9 లక్షల కోట్ల వరకు ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
ఇదంతా కేవలం 1980-2010 సంవత్సరాల మధ్య దాచిన మొత్తమే అని తేలింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్‌సీఏఈఆర్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐఎఫ్‌ఎమ్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ ఫైనాన్స్ (ఎన్‌ఐపీఎఫ్‌పీ) సంస్థలు వేర్వేరుగా ఈ అధ్యయనాలు నిర్వహించాయి. వీటన్నింటినీ కలిపి ‘దేశ, విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనం వివరాలు’పేరిట నివేదికలో పొందుపరిచాయి. దీనికి సంబంధించిన స్టాండింగ్ కమిటీ నివేదికను జూన్ 24న లోక్‌సభ ముందుంచాయి.

దేశ విదేశాల్లో కచ్చితంగా ఇంత మొత్తంలో నల్లధనం ఉంటుందని చెప్పడం కష్టమని.. కానీ సుమారుగా అంచనా వేయగలమని ఈ సంస్థలు పేర్కొన్నాయి. భారతీయులు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని రియల్ ఎస్టేట్, మైనింగ్, ఫార్మాస్యూటికల్స్, పాన్‌మసాలా, గుట్కా, పొగాకు, విద్య, సినిమాలు వంటి రంగాల్లో పెట్టుబడిగా పెడుతున్నారని అధ్యయనంలో గుర్తించాయి. దేశ విదేశాల్లో ఉన్న భారతీయుల నల్లధనంపై నివేదిక తయారుచేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2011లో ఈ మూడు సంస్థలను కోరింది.

ఎన్‌సీఏఈఆర్ విశ్లేషణ: 1980-2010 మధ్య విదేశాల్లో మూలుగుతున్న భారతీయుల అక్రమ సంపద రూ.26.65 లక్షల కోట్ల నుంచి రూ.33.9 లక్షల కోట్ల వరకు ఉండొచ్చు.

ఎన్‌ఐఎఫ్‌ఎమ్ అంచనా: 1990-2008 సంవత్సరాల మధ్య రూ.9,41,837 కోట్ల నల్లధనాన్ని భారతీయులు విదేశాల్లో దాచారు. లెక్కల్లోకి రాని ఆదాయంలో దేశం వెలుపలకు వెళ్తున్న అక్రమాదాయం సుమారు 10 శాతం ఉండొచ్చు.

ఎన్‌ఐపీఎఫ్‌పీ అంచనా: 1997 నుంచి 2009 మధ్య కాలంలో అక్రమంగా దేశం వెలుపలకు వెళ్లిన సొమ్ము స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 0.2 శాతం నుంచి 7.4 శాతం.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారతీయుల నల్లధనం రూ.15 లక్షల కోట్ల నుంచి రూ.33.9 లక్షల కోట్ల వరకు ఉంటుంది
ఎప్పుడు : జూన్ 24
ఎవరు : ఎన్‌సీఏఈఆర్, ఎన్‌ఐఎఫ్‌ఎమ్, ఎన్‌ఐపీఎఫ్‌పీ
ఎక్కడ : విదేశాల్లో
Published date : 25 Jun 2019 06:03PM

Photo Stories