Skip to main content

వైఎస్సార్ కాపు నేస్తంకు ఏపీ కేబినెట్ ఆమోదం

మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకానికి ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

Current Affairs


ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన నవంబర్ 27న వెలగపూడిలోని సచివాలయంలో సమావేశమైన మంత్రి మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాపు నేస్తంతోపాటు పలు తీర్మానాలను మంత్రిమండలి ఆమోదించింది.

వైఎస్సార్ కాపు నేస్తం
కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఉప కులాల మహిళల జీవన ప్రమాణాలు పెంపు, ఆర్థిక స్వావలంబన, ఉపాధి మెరుగుపరిచేందుకు ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కోసం ఈ ఏడాది రూ.1,101 కోట్లు కేటాయించేందుకు ఆమోదం కేబినెట్ ఆమోదం తెలిపింది. 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు ఏటా రూ.15 వేలు చొప్పున ఐదేళ్లపాటు రూ.75 వేలు ఆర్థిక సాయం అందిస్తారు. ఈ పథకానికి వచ్చే ఏడాది నుంచి ఏటా రూ.900 కోట్లు వ్యయమవుతుందని అంచనా.

కడప స్టీల్ ప్లాంట్
వైఎస్సార్ కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌కు 2019, డిసెంబరు 26వతేదీన శంకుస్థాపన చేయాలని కేబినెట్ నిర్ణయించింది. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి - పెద్ద నందలూరు గ్రామాల మధ్య స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనుంది. స్టీల్‌ప్లాంట్ కోసం 3,295 ఎకరాల భూసేకరణకు కేబినెట్ ఆమోదించింది. స్టీల్‌ప్లాంట్‌కు ఇనుప ఖనిజం కోసం ఎన్‌ఎండీసీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది.

అధికారుల బృందం ఏర్పాటు
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం(సీపీఎస్) రద్దు ప్రక్రియపై మంత్రుల బృందం ఏర్పాటైంది. ఈ మంత్రుల బృందానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అధికారుల బృందం ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటయ్యే అధికారుల బృందానికి ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
వైఎస్సార్ కాపు నేస్తం పథకానికి ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి
ఎందుకు : కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఉప కులాల మహిళల జీవన ప్రమాణాలు పెంపు, ఆర్థిక స్వావలంబన, ఉపాధి మెరుగుపరిచేందుకు
Published date : 28 Nov 2019 06:00PM

Photo Stories