వారికి జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉంది: హైకోర్టు
వివాహాల విషయంలో హిందువా, ముస్లిమా అన్నది న్యాయస్థానాలకు అవసరం లేదని, వారు మేజర్లా కాదా అన్నదే ముఖ్యమని జస్టిస్ పంకజ్ నక్వి వివేక్ అగర్వాల్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. సలామత్ అన్సారి, ప్రియాంక ఖర్వార్ అలియాస్ అలియా దంపతులు తమకు రక్షణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను నవంబర్ 24న విచారించిన హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఆర్టికల్ 21 ప్రకారం...
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఇద్దరి మేజర్ల మధ్య వ్యక్తిగతంగా ఏర్పడే బంధాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదని, అలా చేస్తే భిన్నత్వంలో ఏకత్వం అనే దేశ విలక్షణమైన స్వరూపానికే భంగం వాటిల్లుతుందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
ఏమిటీ కేసు?
ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌కి చెందిన సలామత్ అన్సారి, ప్రియాంక ఖర్వార్‌లు 2019 ఆగస్టులో పెద్దల్ని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందే ప్రియాంక ఇస్లాం మతాన్ని పుచ్చుకొని తన పేరు అలియా అని మార్చుకుంది. ఈ పెళ్లిని వ్యతిరేకిస్తూ ప్రియాంక తండ్రి సలామత్, మరికొందరిపై అప్పట్లోనే మైనర్‌ని వివాహం చేసుకున్నారంటూ కేసు పెట్టారు. ఆ కేసు కొట్టేయాలంటూ సలామత్, ప్రియాంక తాము మేజర్లమని వాదించారు.