Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 27 కరెంట్‌ అఫైర్స్‌

IPPB

IPPB: ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌తో జట్టు కట్టిన బ్యాంక్‌?

ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా ఐపీపీబీకి చెందిన సుమారు 4.7 కోట్ల మంది కస్టమర్లకు గృహ రుణాలను అందించేందుకు అవకాశం కల్పిస్తారు. ఐపీపీబీ నెట్‌వర్క్‌లో 650 శాఖలు, 1,36,000కుపైగా పోస్టాఫీస్‌లు ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ గృహ రుణ ఉత్పత్తులు కోట్లాది మందికి చేరేందుకు ఈ భాగస్వామ్యం దోహదం చేయనుంది.

ఆర్‌బీఎంఎల్‌ తొలి మొబిలిటీ స్టేషన్‌ ఎక్కడ ప్రారంభమైంది?
పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్, బ్రిటన్‌ సంస్థ బీపీ కలిసి ఏర్పాటు చేసిన జాయింట్‌ వెంచర్‌ సంస్థ రిలయన్స్‌ బీపీ మొబిలిటీ (ఆర్‌బీఎంఎల్‌) తొలి పెట్రోల్‌ బంకును ఆవిష్కరించింది. జియో–బీపీ బ్రాండ్‌ కింద నవీ ముంబైలోని నావ్డేలో దీన్ని ప్రారంభించింది. ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్, అడిటివైజ్డ్‌ ఇంధనాలు, రిఫ్రెష్‌మెంట్లు, ఆహారం మొదలైన వివిధ సర్వీసులన్నీ ఈ మొబిలిటీ స్టేషన్‌లలో అందుబాటులో ఉంటాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ)తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం 
ఎప్పుడు : అక్టోబర్‌ 26
ఎవరు    : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 
ఎందుకు : హెచ్‌డీఎఫ్‌సీ గృహ రుణ ఉత్పత్తులను ఐపీపీబీ వినియోగదారులకు చేరవేసేందుకు...


Climate Tech Investment: వాతావరణ పెట్టుబడుల్లో భారత్‌ ఎన్నో స్థానంలో నిలిచింది?

Climate Tech Investment

గత అయిదేళ్లుగా వాతావరణ పరిరక్షణ టెక్నాలజీ పెట్టుబడులకు ఆకర్షణీయంగా నిలుస్తున్న మొదటి పది(టాప్‌ 10) దేశాల జాబితాలో భారత్‌ తొమ్మిదో స్థానంలో నిలిచింది. భారత్‌కి చెందిన క్లైమేట్‌ టెక్‌ సంస్థలు 2016–2021 మధ్య కాలంలో 1 బిలియన్‌ డాలర్ల మేర వెంచర్‌ క్యాపిటల్‌ పెట్టుబడులు దక్కించుకున్నాయి. ప్యారిస్‌ ఒప్పందం(2016, ఏప్రిల్‌ 22) అనంతరం అయిదేళ్లుగా చోటు చేసుకున్న పరిణామాలపై లండన్‌ అండ్‌ పార్ట్‌నర్స్, డీల్‌రూమ్‌డాట్‌కో రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

అగ్రస్థానంలో అమెరికా...
నివేదిక ప్రకారం ప్యారిస్‌ ఒప్పందం తర్వాత ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్‌ టెక్‌ కంపెనీల్లోకి పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. ఈ పెట్టుబడులు అందుకున్న టాప్‌ 10 దేశాల్లో 48 బిలియన్‌ డాలర్లతో అమెరికా అగ్రస్థానంలో, 18.6 బిలియన్‌ డాలర్లతో చైనా రెండో స్థానంలో, 5.8 బిలియన్‌ డాలర్లతో స్వీడన్‌ మూడో స్థానంలో నిలిచాయి. కాలుష్యకారక ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించే దిశగా అంతా సమిష్టిగా పనిచేయడంపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలని నివేదిక పేర్కొంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 2016–2021 మధ్య కాలంలో వాతావరణ పరిరక్షణ టెక్నాలజీ పెట్టుబడులకు ఆకర్షణీయంగా నిలుస్తున్న దేశాల్లో భారత్‌కు తొమ్మిదో స్థానం
ఎప్పుడు : అక్టోబర్‌ 26
ఎవరు    : లండన్‌ అండ్‌ పార్ట్‌నర్స్, డీల్‌రూమ్‌డాట్‌కో
ఎక్కడ    : ప్రపంచ వ్యాప్తంగా...


Men's FIH Hockey: హాకీ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న ఆసియా దేశం?

Mens Hockey Odisha

పురుషుల జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌–2021కు ఆసియా దేశం భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం వేదికగా 2021, నవంబర్‌ 24 నుంచి డిసెంబర్‌ 5 వరకు ఈ మెగా ఈవెంట్‌ జరగనుంది. కరోనా నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే ఈ టోర్నీని నిర్వహించనున్నట్లు అక్టోబర్‌ 26న హాకీ ఇండియా (హెచ్‌ఐ) వెల్లడించింది. టోర్నీలో భారత్‌తో సహా మరో 15 జట్లు (అర్జెంటీనా, బెల్జియం, కెనడా, చిలీ, ఈజిప్ట్, ఫ్రాన్స్, జర్మనీ, కొరియా, మలేసియా, పాకిస్తాన్, పోలాండ్, దక్షిణాఫ్రికా, స్పెయిన్, నెదర్లాండ్స్, అమెరికా) పాల్గొననున్నాయి. కరోనా వల్ల టోర్నీకి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు దూరంగా ఉన్నాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : పురుషుల జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌–2021కు ఆతిథ్యం ఇవ్వనున్న ఆసియా దేశం?   
ఎప్పుడు : అక్టోబర్‌ 26
ఎవరు    : భారత్‌
ఎక్కడ    : కళింగ స్టేడియం, భువనేశ్వర్, ఒడిశా రాష్ట్రం


FIDE: గ్రాండ్‌ స్విస్‌ టూర్‌ చెస్‌ టోర్ని ఎక్కడ జరగనుంది?

Chess

లాత్వియా రాజధాని నగరం రిగాలో అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో 2021, అక్టోబర్‌ 27వ తేదీ నుంచి గ్రాండ్‌ స్విస్‌ టూర్‌ చెస్‌ టోర్నమెంట్‌-2021 జరగనుంది. ఓపెన్‌ విభాగం, మహిళల విభాగంలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ప్రపంచ చెస్‌లోని అగ్రశ్రేణి క్రీడాకారులు ఈ మెగా ఈవెంట్‌లో పోటీపడుతున్నారు.

నిహాల్‌ సరీన్‌ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందినది?
గ్రాండ్‌ స్విస్‌ టూర్‌ చెస్‌ టోర్నీ ఓపెన్‌ విభాగంలో భారత్‌ నుంచి పది మంది గ్రాండ్‌మాస్టర్లు బరిలోకి దిగనున్నారు. పెంటేల హరికృష్ణ, ఆధిబన్, నిహాల్‌ సరీన్, డి.గుకేశ్, కృష్ణన్‌ శశికిరణ్, ఎరిగైసి అర్జున్, సేతురామన్, ప్రజ్ఞానంద, సూర్యశేఖర గంగూలీ, రౌనక్‌ సాధ్వాని బరిలో ఉన్నారు. మహిళల విభాగంలో ద్రోణవల్లి హారిక, పద్మిని రౌత్, వంతిక అగర్వాల్, దివ్యా దేశ్‌ముఖ్‌ ఆడుతున్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 2021, అక్టోబర్‌ 27వ తేదీ నుంచి గ్రాండ్‌ స్విస్‌ టూర్‌ చెస్‌ టోర్నమెంట్‌-2021 ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్‌ 27
ఎవరు    : అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే)
ఎక్కడ    : రిగా, లాత్వియా


Royal Status: రాచరిక హోదాను వదులుకున్న జపాన్‌ యువరాణి పేరు?

Mako Komuro

జపాన్‌ యువరాణి మాకో(ప్రిన్సెస్‌ మాకో ఆఫ్‌ అకిషినో) తాను ప్రేమించినవాడితో జీవితాన్ని పంచుకోవడం కోసం డబ్బుని, విలాసవంతమైన జీవితాన్ని, రాచరిక హోదాని వదులుకొని సామాన్యురాలిగా మారిపోయింది. ప్రేమికుడు కీ కొమురొని పెళ్లాడింది. వారిద్దరి వివాహ ధ్రువీకరణ పత్రాన్ని జపాన్‌ రాజభవనం అధికారులు అక్టోబర్‌ 26న అధికారికంగా విడుదల చేశారు.

రాజభరణాన్ని తిరస్కరించి..
జపాన్‌ రాచరిక చట్టాల ప్రకారం అమ్మాయిలు సామాన్యుల్ని పెళ్లి చేసుకుంటే రాణీవాసాన్ని, రాజభోగాల్ని వదులుకోవాలి. అందు కోసం రాజభరణం కింద 14 కోట్ల యెన్‌లు (దాదాపుగా రూ 9.30 కోట్లు) చెల్లిస్తారు. కానీ మాకో రాజభరణాన్ని తిరస్కరించి కట్టుబట్టలతో రాజప్రసాదాన్ని వీడింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రాజభరణాన్ని వద్దనుకొని సామాన్యుడి వెంట అడుగులు వేసిన యువరాణి మాకో ఒక్కరే. కొమురొ, మాకో జంట అమెరికాలోని న్యూయార్క్‌లో తమ భావి జీవితాన్ని గడపనున్నారు. న్యూయార్క్‌లో కొమురొ లాయర్‌ వృత్తిలో ఉన్నారు. వీరిద్దరినీ ఇప్పుడు బ్రిటన్‌ రాచరిక జంట ప్రిన్స్‌ హ్యారీ, మేఘాన్‌ మార్కెల్‌లతో పోలుస్తున్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : రాచరిక హోదాను వదులుకున్న జపాన్‌ యువరాణి పేరు?
ఎప్పుడు : అక్టోబర్‌ 26
ఎవరు    : మాకో(ప్రిన్సెస్‌ మాకో ఆఫ్‌ అకిషినో)
ఎందుకు : తాను ప్రేమించిన వాడు కీ కొమురొనితో జీవితాన్ని పంచుకోవడం కోసం...


Farmers: వైఎస్సార్‌ యంత్రసేవా పథకం ఉద్దేశం?

Three Schemes-CM Jagan

వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్‌ యంత్రసేవా పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నగదును జమచేసింది. పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదును రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబర్‌ 26న తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి జమ చేశారు. ఈ పథకాల ద్వారా రైతులకు దాదాపు రూ.2,190 కోట్ల మేర ప్రయోజనం చేకూరినట్టైంది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ప్రసంగించారు.

1. రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం: 50.37 లక్షల మంది రైతులకు లబ్ధి.  2021, ఆగస్టులో విడుదల చేసిన రూ.977 కోట్లతో కలిపి రెండో విడతలో మొత్తం రూ.2,052 కోట్లు ప్రయోజనం.
2. సున్నా వడ్డీ పంట రుణాలు: 6.67 లక్షల మంది ఖాతాల్లో రూ.112.7కోట్లు జమ.
3. యంత్రసేవా పథకం: 1,720 రైతు బృందాలకు రూ.25.55 కోట్లు జమ. సాగు ఖర్చు తగ్గించేందుకు అవసరమైన యంత్రపరికరాలను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు యంత్ర సేవాపథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. పథకం ద్వారా 40 శాతం సొమ్మును సబ్సిడీగా ఇస్తోంది.

యంత్రసేవా పథకం గురించి సీఎం జగన్‌ ప్రసంగం...

  • యంత్రసేవా పథకం కింద 1,720 రైతు గ్రూపులకు అంటే ఒక్కో కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్‌కు వారు కొన్న యంత్రాలకు రూ.25.55 కోట్ల సబ్సిడీని వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. దీనిద్వారా రైతులు నిర్దేశించిన సరసమైన అద్దెకే  యంత్రసేవలు వారికి అందుబాటులోకి వస్తాయి.
  • రాష్ట్రవ్యాప్తంగా రూ.2,134 కోట్ల వ్యయంతో రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా 10,750 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం.
  • వరి ఎక్కువగా సాగయ్యే గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మండలానికి అదనంగా ఐదు చొప్పున 1,035 కంబైన్డ్‌ హార్వెస్టర్లతో కూడిన క్లస్టర్‌ స్టాయి కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లను (సీహెచ్‌సీలను) అందుబాటులోకి తెస్తున్నాం.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్‌ యంత్రసేవా పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ
ఎప్పుడు : అక్టోబర్‌ 26
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు జిల్లా
ఎందుకు : రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు...


Tamil Film: భారత్‌ తరపున ఆస్కార్‌ పోటీలో నిలిచిన చిత్రం?

Koozhangal Movie

2022 ఏడాది ఆస్కార్‌ అవార్డుల(94వ ఆస్కార్‌ అవార్డులు)కు సంబంధించి విదేశీ విభాగంలో... భారత్‌ తరఫున పోటీలో నిలవడానికి తమిళ చిత్రం ‘కూళాంగల్‌’ ఎంపికైంది. ఈ మేరకు అక్టోబర్‌ 23న అధికారిక ప్రకటన వెలువడింది. పీఎస్‌ వినోద్‌ రాజ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ దర్శకుడు విఘ్నేష్‌ శివన్, హీరోయిన్‌ నయనతార ‘రౌడీ పిక్చర్స్‌’ బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. కూళాంగల్‌ అంటే.. గులకరాయి అని అర్థం. తాగుబోతు తండ్రిని మార్చి ఇంట్లోంచి వెళ్లిపోయిన తన తల్లిని తీసుకు రావడానికి ఓ అబ్బాయి చేసే ప్రయత్నమే ఈ చిత్ర కథ. 2022 మార్చి 27న 94వ ఆస్కార్‌ అవార్డ్‌ వేడుక జరగనుంది.

టైగర్‌ అవార్డు...
‘ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ రోటర్‌డామ్‌’ (ఐఎఫ్‌ఎఫ్‌ఆర్‌)లో ‘కూళాంగల్‌’ ప్రతిష్టాత్మక టైగర్‌ అవార్డు దక్కించుకుంది. 50 ఏళ్ల ఐఎఫ్‌ఎఫ్‌ఆర్‌ చరిత్రలో 2017లో మన దేశానికి తొలి అవార్డును తెచ్చిన మలయాళ ‘దుర్గా’ తర్వాత ఈ అవార్డు దక్కించుకున్న మరో సినిమా ‘కూళాంగల్‌’ కావడం విశేషం.


Nirmala Sitharaman: ఏఐఐబీ ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది?

Nirmala

ఆసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ) గవర్నర్ల బోర్డ్‌ ఆరవ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి అక్టోబర్‌ 26న భారత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వర్చువల్‌ విధానం ద్వారా ప్రసంగించారు. సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి పెట్టుబడుల అవకాశాలను ఏఐఐబీ అన్వేషించాలని ఆమె సూచించారు. భారత్‌లో ఏఐఐబీ రెసిడెంట్‌ బోర్డ్, రీజినల్‌ ఆఫీస్‌లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. చైనా రాజధాని నగరం బీజింగ్‌లో ఏఐఐబీ ప్రధాన కార్యాలయం ఉంది.

క్రెడిట్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమం అంటే?
భారత్‌ బ్యాంకింగ్‌ ‘క్రెడిట్‌ అవుట్‌రీచ్‌’ కార్యక్రమం కింద దాదాపు 2 లక్షల మంది రుణ గ్రహీతలకు రూ.11,168 కోట్ల రుణాలను అందజేసిందని మంత్రి నిర్మల తెలిపారు. ఈ కార్యక్రమం కింద, బ్యాంకులు అర్హులైన రుణగ్రహీతలకు రుణాలను మంజూరు చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నారు. బ్యాంకులు–నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ), ఫిన్‌టెక్‌ సెక్టార్‌ల మధ్య సహ–రుణ  ఏర్పాట్ల ద్వారా కేంద్రం క్రెడిట్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతంలో కూడా ఇలాంటి అవుట్‌రీచ్‌ కార్యక్రమాలను బ్యాంకులు నిర్వహించాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ) గవర్నర్ల బోర్డ్‌ సమావేశాన్ని ఉద్దేశించి వర్చువల్‌ విధానం ద్వారా ప్రసంగం
ఎప్పుడు : అక్టోబర్‌ 26
ఎవరు    : భారత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌
ఎందుకు : ఏఐఐబీ గవర్నర్ల బోర్డ్‌ ఆరవ వార్షిక సమావేశం సందర్భంగా...

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 26 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 27 Oct 2021 06:39PM

Photo Stories