Daily Current Affairs in Telugu: 2021, అక్టోబర్ 26 కరెంట్ అఫైర్స్
General Abdel Fattah: ఆఫ్రికాలోని ఏ దేశంలో సైనిక తిరుగుబాటు జరిగింది?
ఆఫ్రికా దేశం సూడాన్‌లో సైన్యం అధికారం హస్తగతం చేసుకుంది. ఆపద్ధర్మ ప్రధానమంత్రి అబ్దుల్లా హర్దోక్‌ని అదుపులోకి తీసుకున్న సైన్యం.. దేశంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ప్రస్తుతం దేశ పరిపాలనా బాధ్యతలను నిర్వహిస్తున్న సార్వభౌమత్వ (సావరిన్) కౌన్సిల్‌ను రద్దు చేయడంతోపాటు ప్రధాని హర్దోక్‌ను పదవీచ్యుతుడిని చేస్తున్నట్లు జనరల్ అబ్దుల్ ఫతా అల్–బుర్హాన్ చేసిన ప్రకటన అక్టోబర్ 25న టీవీల్లో ప్రసారమైంది.
విభేదాల వల్లే...
రాజకీయ పక్షాల మధ్య కొనసాగుతున్న విభేదాల వల్లే తాము అధికారాన్ని చేజిక్కించుకున్నామని అబ్దుల్ ఫతా చెప్పారు. సజావుగా ఎన్నికలు నిర్వహించి... అధికారాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి అప్పగిస్తామన్నారు.
బషీర్‌ను తొలగించాక...
సూడాన్‌లో దాదాపు మూడు దశాబ్దాల పాటు(1993, అక్టోబర్ 16 నుంచి 2019, ఏప్రిల్ 11 వరకు) అధికారంలో ఉన్న అధ్యక్షుడు ఒమర్ అల్ బషీర్‌పై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆయన అధ్యక్ష పదవి నుంచి 2019లో వైదొలగాల్సి వచ్చింది. అనంతరం ప్రజాస్వామ్య పాలనకు ప్రయత్నాలు జరిగాయి. అధికారం చేపట్టేందుకు సైన్యం– ప్రజాస్వామ్యవాదుల మధ్య ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా ప్రధానిగా హర్దోక్ మూడేళ్ల కాలానికి బాధ్యతలు చేపట్టారు. తాజాగా హర్దోక్‌ను నిర్బంధించి.. సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రజా ప్రభుత్వానికి 2021, నవంబర్‌లో అధికారం అప్పగించాల్సి ఉంది. ఇక స్వాతంత్య్రం పొందిన 1956 నుంచి సూడాన్‌లో సైన్యం తిరుగుబాటు చేయడం ఇది ఎనిమిదోసారి.
సూడాన్...
రాజధాని: ఖార్తూమ్; కరెన్సీ: సూడానీస్ పౌండ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : సూడాన్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైన్యం
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : జనరల్ అబ్దుల్ ఫతా అల్–బుర్హాన్
ఎందుకు : రాజకీయ పక్షాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని...
COVID-19: మూడేళ్ల చిన్నారులకూ టీకా వేయనున్న దేశం?
దేశ జనాభాలో మూడొంతుల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసిన చైనా ప్రభుత్వం.. ఐదు(హుబే, ఫుజియాన్, హైనాన్, జెజియాంగ్, హునాన్) ప్రావిన్సుల్లో 3–11 ఏళ్ల మధ్య చిన్నారులకు కూడా టీకా వేయాలని నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో కొత్తగా కరోనా కేసులు వెలుగులోకి వస్తుండటమే ఇందుకు కారణమని ప్రభుత్వం చెబుతోంది. దేశీయంగా తయారైన సినోఫాం, సినోవాక్ టీకాలను పిల్లలకు ఇచ్చేందుకు అనుమతులిచ్చింది. ఈ వ్యాక్సిన్లను ఇప్పటికే చిలీ, అర్జెంటీనా, కాంబోడియా ప్రభుత్వాలు తమ దేశాల్లోని చిన్నారులకు ఇవ్వడం ప్రారంభించాయి.
ప్రపంచంలోనే అత్యధికంగా 140 కోట్లున్న చైనా జనాభాలో 100 కోట్ల మందికి పైగా అంటే 76 శాతం మందికి దేశీయంగా తయారైన సినోఫాం, సినోవాక్ టీకాలను ఇచ్చారు.
50 ఏళ్లు...
చైనాను ఒక దేశంగా ఐక్యరాజ్యసమితి గుర్తించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అక్టోబర్ 25న నిర్వహించిన ప్రత్యేక సదస్సులో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మాట్లాడారు. అంతర్జాతీయ నిబంధనలను ఏవో కొన్ని దేశాలు నిర్దేశించలేవని, ఐక్యరాజ్యసమితిలోని 193 సభ్యదేశాలు మాత్రమే కలిసికట్టుగా రూపొందిస్తాయని అన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 3–11 ఏళ్ల మధ్య చిన్నారులకు కూడా టీకా వేయాలని నిర్ణయించిన దేశం?
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : చైనా
ఎక్కడ : హుబే, ఫుజియాన్, హైనాన్, జెజియాంగ్, హునాన్ ప్రావిన్సుల్లో...
ఎందుకు : కరోనా వైరస్ నియంత్రణ కోసం...
Ayushman Bharat: ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌ను ఎక్కడ ప్రారంభించారు?
దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగం బలోపేతానికి రూ.64 వేల కోట్లతో చేపట్టిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ ప్రారంభమైంది. అక్టోబర్ 25న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి జిల్లాలోని వారణాసి పట్టణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. మరోవైపు వారణాశిలో రూ.5,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లో తొమ్మిది వైద్య కళాశాలలను కూడా ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు.
మహమ్మారులను ఎదుర్కోవడానికి...
భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులను ఎదుర్కోవడానికి, ఆరోగ్య రంగంలో స్వయం సమృద్ధి సాధించడం లక్ష్యంగా ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ తీసుకొచ్చారు. ఇందులో భాగంగా... నాలుగేళ్లలో గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్రం చర్యలు చేపట్టనుంది. 17,788 గ్రామీణ ఆరోగ్య, వెల్‌నెస్ కేంద్రాలతోపాటు 11,024 అర్బన్ హెల్త్, వెల్‌నెస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : వారణాసి, వారణాసి జిల్లా, ఉత్తరప్రదేశ్
ఎందుకు : గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు...
Indian Premier League: ఐపీఎల్‌లో కొత్తగా చేరిన జట్ల పేర్లు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కొత్తగా అహ్మదాబాద్, లక్నో జట్లు చేరాయి. దీంతో లీగ్‌లో జట్ల సంఖ్య పదికి చేరింది. ఈ రెండు జట్లకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బిడ్డింగ్ ప్రక్రియను నిర్వహించింది. ఈ ప్రక్రియలో భాగంగా అక్టోబర్ 25న టెండర్లు తెరువగా... భారత కార్పొరేట్ సంస్థ గోయెంకా గ్రూప్, అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్ (ఐరిలియా కంపెనీ లిమిటెడ్)లు వరుసగా లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలను దక్కించుకున్నాయి. లక్నో కోసం రాజీవ్ ప్రతాప్ సంజీవ్ గోయెంకా (ఆర్‌పీఎస్‌జీ) వెంచర్స్ లిమిటెడ్ రికార్డు స్థాయిలో రూ.7,090 కోట్లు (సుమారు బిలియన్ డాలర్లు) వెచ్చించింది. ఐరిలియా కంపెనీ (సీవీసీ క్యాపిటల్) రూ. 5,625 కోట్లతో అహ్మదాబాద్‌ను దక్కించుకుంది. 2022లో జరిగే ఐపీఎల్ –15 సీజన్‌లో లక్నో, అహ్మదాబాద్ క్రికెట్ జట్లు బరిలోకి దిగుతాయి.
Formula One Race: యూఎస్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన రెడ్‌బుల్ డ్రైవర్?
2021 ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్‌లో రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ ఎనిమిదో విజయం సాధించాడు. అమెరికాలోని ఆస్టిన్‌లో అక్టోబర్ 25న జరిగిన యూఎస్ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసులో వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు. 56 ల్యాప్‌ల ప్రధాన రేసును పోల్ పొజిషన్ నుంచి ఆరంభించిన వెర్‌స్టాపెన్ అందరికంటే ముందుగా గంటా 34 నిమిషాల 36.552 సెకన్లలో ముగించాడు. మెర్సిడెస్ డ్రైవర్ హామిల్టన్ రెండో స్థానంలో నిలిచాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాడు?
ఆస్ట్రేలియా జట్టు ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ప్యాటిన్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫిట్‌నెస్ సమస్యలతో యాషెస్ సిరీస్ ఆడలేనని నిర్ణయించుకున్న 31 ఏళ్ల ప్యాటిన్సన్ ఆటకు వీడ్కోలు పలికాడు. తన పదేళ్ల కెరీర్‌లో 21 టెస్టులు ఆడి 81 వికెట్లు, 15 వన్డేలు ఆడి 16 వికెట్లు తీశాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫార్ములావన్ (ఎఫ్1) రేసు యూఎస్ గ్రాండ్‌ప్రి–2021 విజేత?
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్
ఎక్కడ : ఆస్టిన్, అమెరికా
ఎందుకు : 56 ల్యాప్‌ల ప్రధాన రేసును వెర్‌స్టాపెన్ అందరికంటే ముందుగా గంటా 34 నిమిషాల 36.552 సెకన్లలో ముగించినందున...
Pragati OS: ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసిన సంస్థ?
భారతీయ మొబైల్ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జియోఫోన్ నెక్ట్స్‌ని రూపొందిస్తున్నట్లు రిలయన్స్ జియో సంస్థ తెలిపింది. దీనిని 2021 ఏడాది దీపావళి పండుగకు విడుదల చేయనున్నట్లు అక్టోబర్ 25న వెల్లడించింది. జియోఫోన్ నెక్ట్స్ కోసం ఆన్‌డ్రాయిడ్ ఆధారిత అత్యాధునిక ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్‌ను దిగ్గజ సంస్థ గూగుల్‌తో కలిసి జియో ప్లాట్‌ఫామ్స్ అభివృద్ధి చేసింది. క్వాల్‌కామ్ ప్రాసెసర్‌ను ఈ స్మార్ట్‌ఫోన్‌కు పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ వద్ద ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్‌నకు చెందిన నియోలింక్ ప్లాంట్లలో ఇవి తయారుకానున్నాయి. 10 భాషలను అనువదించే ఫీచర్ ఈ ఫోన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసిన సంస్థ?
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : రిలయన్స్ జియో సంస్థ(దిగ్గజ సంస్థ గూగుల్‌తో కలిసి)
ఎందుకు : భారతీయ మొబైల్ వినియోగదారుల కోసం...
COVID-19 Vaccine: బయోలాజికల్ ఈ (బీఈ)తో జట్టు కట్టిన అంతర్జాతీయ సంస్థ?
కోవిడ్–19పై పోరులో భాగంగా మరిన్ని టీకాలను అందుబాటులోకి తెచ్చే దిశగా వ్యాక్సిన్ల తయారీ దిగ్గజం బయోలాజికల్ ఈ (బీఈ)తో అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి ఫైనాన్స్ కార్పొరేషన్ (యూఎస్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్–డీఎఫ్‌సీ) చేతులు కలిపింది. బీఈ టీకాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు డీఎఫ్‌సీ 50 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 375 కోట్లు) నిధులు సమకూర్చనుంది. అక్టోబర్ 25న హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన అధికారిక ఒప్పందంపై బీఈ ఎండీ మహిమా దాట్ల, డీఎఫ్‌సీ సీవోవో డేవిడ్ మార్చిక్ సంతకాలు చేశారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, అమెరికా కాన్సల్ జనరల్ జోయెల్ రీఫ్‌మాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మరోవైపు కోవిడ్–19కి సంబంధించి తమ కోర్బివ్యాక్స్ టీకా 2021, నవంబర్ ఆఖరు నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని మహిమా దాట్ల వెల్లడించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వ్యాక్సిన్ల తయారీ దిగ్గజం బయోలాజికల్ ఈ (బీఈ)తో ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి ఫైనాన్స్ కార్పొరేషన్ (యూఎస్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్–డీఎఫ్‌సీ)
ఎక్కడ : హైదరాబాద్, తెలంగాణ
ఎందుకు : బీఈ టీకాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు 50 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 375 కోట్లు) నిధులు సమకూర్చేందుకు...
IGGCARL: ఇండో–జర్మన్ గ్లోబల్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు కానుంది?
ప్రకృతి సాగుపై లోతైన పరిశోధనలు, పంటల సర్టిఫికేషన్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో ఇండో–జర్మన్ గ్లోబల్ సెంటర్ ఫర్ అగ్రోకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ సెంటర్ (ఐజీజీసీఏఆర్‌ఎల్) ఏర్పాటు కానుంది. ఈ అంతర్జాతీయ స్థాయి పరిశోధన కేంద్రం కోసం జర్మనీ ప్రభుత్వం రూ.174 కోట్లను (20 మిలియన్ యూరోలు) గ్రాంట్‌గా ఇస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ‘ప్రకృతి సాగు’పై పరిశోధనలకు ఏర్పాటవుతోన్న తొలి పరిశోధన కేంద్రం ఇదే. ఈ ప్రతిష్టాత్మక పరిశోధన కేంద్రానికి 60 ఎకరాల భూమితోపాటు భవనాలను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది.
అన్నభాగ్య పథకాన్ని అమలు చేయనున్న రాష్ట్రం?
రేషన్ సరుకులను ఇంటివద్దే డోర్ డెలివరీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న ‘‘ఇంటివద్దకే రేషన్ సరుకుల సరఫరా’’ పథకం తరహాలో ‘‘అన్నభాగ్య’’ పథకం చేయడంపై కర్ణాటక ప్రభుత్వం దృష్టి సారించింది. ఇంటి వద్దకే రేషన్ విధానాన్ని 2022, జనవరి నుంచి అమలు చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఇటీవల ప్రకటించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జర్మనీ ఆర్థిక సహకారంతో ఇండో–జర్మన్ గ్లోబల్ సెంటర్ ఫర్ అగ్రోకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ సెంటర్ (ఐజీజీసీఏఆర్‌ఎల్) ఏర్పాటు
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : పులివెందుల, వైఎస్సార్ కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ఎందుకు : ప్రకృతి సాగుపై లోతైన పరిశోధనలు, పంటల సర్టిఫికేషన్‌కు...
చదవండి: Daily Current Affairs in Telugu: 2021, అక్టోబర్ 25 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్