Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 25 కరెంట్‌ అఫైర్స్‌

Kangana Ranaut

67th National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు - 2019 

ప్రతిష్టాత్మక 67వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానోత్సవం 2021, అక్టోబర్‌ 25న న్యూఢిల్లీలో జరిగింది. సినీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతో పాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు అందజేశారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు. ‘మణికర్ణిక’ చిత్రానికి గానూ కంగనా రనౌత్‌ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్నారు.

తెలుగు సినిమాకు నాలుగు పురస్కారాలు...

Jersey


2019 సంవత్సరంలో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని 67వ జాతీయ చలన చిత్ర పురస్కారాలకు ఎంపిక చేశారు. 2021, మార్చి 22న ఢిల్లీలో ప్రకటించిన ఈ అవార్డుల్లో తెలుగు సినిమా 4 పురస్కారాలను దక్కించుకుంది. బెస్ట్‌ పాపులర్‌ ఫిల్మ్‌గా మహర్షి ఎంపిక కాగా, ఉత్తమ తెలుగు చిత్రంగా జెర్సీ అవార్డు గెలిచింది. రాజు సుందరం(మహర్షి) ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా, నవీన్‌ నూలి(జెర్సీ) ఉత్తమ ఎడిటర్‌గా అవార్డులకు ఎంపికయ్యారు. ఉత్తమ నటుడి అవార్డును తమిళ నటుడు ధనుష్‌ (చిత్రం ‘అసురన్‌’) – హిందీ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ (‘భోన్‌స్లే’)లకు సంయుక్తంగా ప్రకటించారు.

మలయాళ సినిమాకు 11 అవార్డులు... 
2019 జాతీయ సినిమా అవార్డుల్లో మలయాళ సినిమాకు మొత్తం 11 పురస్కారాలు దక్కాయి. ఫీచర్‌ఫిల్మ్‌ విభాగంలో ఉత్తమ చిత్రం, స్పెషల్‌ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్స్, గీతరచన, మేకప్, సినిమాటోగ్రఫీ సహా 9 అవార్డులు, నాన్‌–ఫీచర్‌ఫిల్మ్‌ విభాగంలో 2 అవార్డులు – మొత్తం 11 అవార్డులను మలయాళ సినిమా గెలుచుకుంది.

ఒకటికి రెండు...
67వ చలన చిత్ర అవార్డుల్లో మలయాళ ‘మరక్కర్‌...’కు 3, మలయాళ ‘హెలెన్‌’కు 2, తమిళ ‘అసురన్‌’, ‘ఒత్త సెరుప్పు సైజ్‌ 7’కు చెరి రెండేసి, హిందీ ‘తాష్కెంట్‌ ఫైల్స్‌’కు 2, తెలుగు చిత్రాలు ‘మహర్షి’, ‘జెర్సీ’ లకు చెరి రెండేసి అవార్డులు, మరాఠీ ‘ఆనందీ గోపాల్‌’కు 2, బెంగాలీ చిత్రం ‘జ్యేష్ఠ పుత్రో’కు 2 అవార్డులు వచ్చాయి. వాస్తవానికి, 2020 ఏడాది మే నాటికే ఈ 2019 అవార్డుల ప్రదానం జరగాల్సి ఉంది. కానీ, కరోనా విజృంభణ నేపథ్యంలో అవార్డుల ప్రకటన – ప్రదానం ఆలస్యమైంది.

Dhanush

అవార్డులు–విజేతలు...
ఉత్తమ చిత్రం: ‘మరక్కర్‌: ది అరేబియన్ కడలింటె సింహం’ (మలయాళం)
ఉత్తమ నటుడు: ధనుష్‌ (‘అసురన్’), మనోజ్‌ బాజ్‌పాయ్‌ (‘భోన్‌స్లే’),
ఉత్తమ నటి: కంగనా రనౌత్‌ (మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్‌ ఝాన్సీ, పంగా)
ఉత్తమ సహాయ నటుడు: విజయ్‌ సేతుపతి (తమిళ ‘సూపర్‌ డీలక్స్‌’)
ఉత్తమ సహాయ నటి: పల్లవీ జోషి (హిందీ ‘తాష్కెంట్‌ ఫైల్స్‌’)
ఉత్తమ బాల నటుడు: నాగ విశాల్‌ (తమిళ చిత్రం – ‘కె.డి’)
ఉత్తమ దర్శకుడు: సంజయ్‌ పూరణ్‌ సింగ్‌ చౌహాన్ (హిందీ ‘బహత్తర్‌ హూరేన్’)
ఉత్తమ వినోదాత్మక చిత్రం: ‘మహర్షి’  
ఉత్తమ తెలుగు చిత్రం: ‘జెర్సీ’
ఉత్తమ ఎడిటింగ్‌: నవీన్ నూలి (జెర్సీ)
ఉత్తమ కొరియోగ్రాఫర్‌: రాజుసుందరం (మహర్షి)
ఉత్తమ సంగీత దర్శకుడు: డి. ఇమాన్ (తమిళ చిత్రం ‘విశ్వాసం’)
ఉత్తమ గాయకుడు: బి. ప్రాక్‌ (హిందీ ‘కేసరి’)
ఉత్తమ గాయని: సావనీ రవీంద్ర (మరాఠీ ‘బర్దో’)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: గిరీశ్‌ గంగాధరన్‌ (మలయాళ చిత్రం – ‘జల్లికట్టు’)
ఉత్తమ యాక్షన్‌ డైరెక్షన్‌: విక్రమ్‌ మోర్‌ (కన్నడ  ‘అవనే శ్రీమన్నారాయణ’)
ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌: సిద్ధార్థ్‌ ప్రియదర్శన్‌ (మలయాళ ‘మరక్కర్‌: ది అరేబియన్’) 
ఉత్తమ కాస్ట్యూమ్స్‌: సుజిత్‌ సుధాకరన్, వి. సాయి (‘మరక్కర్‌...’)
ఉత్తమ తమిళ చిత్రం: ‘అసురన్’   
ఉత్తమ మలయాళ చిత్రం: ‘కల్ల నోట్టమ్‌’
ఉత్తమ కన్నడ చిత్రం: ‘అక్షి’  
ఉత్తమ హిందీ చిత్రం: ‘ఛిఛోరే’
ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం: ‘తాజ్‌మహల్‌’ (మరాఠీ) 
స్పెషల్‌ జ్యూరీ అవార్డు: ‘ఒత్త సెరుప్పు సైజ్‌ 7’ (తమిళం)

రజనీకాంత్‌కు ఫాల్కే అవార్డు
భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి ఏడాది ఇచ్చే దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు ప్రదానం చేశారు. వెంకయ్య చేతుల మీదుగా 51వ దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును రజనీ అందుకున్నారు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ప్రతిష్టాత్మక 67వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానోత్సవం
ఎప్పుడు : అక్టోబర్‌ 25
ఎవరు  : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : సినీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందున...


Dadasaheb Phalke Award: 51వ దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు విజేత?

Rajini

ప్రతిష్టాత్మక 67వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానోత్సవం 2021, అక్టోబర్‌ 25న న్యూఢిల్లీలో జరిగింది. సినీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతో పాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు అందజేశారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు. భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి ఏడాది ఇచ్చే దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు ప్రదానం చేశారు. వెంకయ్య చేతుల మీదుగా 51వ దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును రజనీ అందుకున్నారు. 2019 సంవత్సరంలో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని 67వ చలన చిత్ర పురస్కారాలకు ఎంపిక చేశారు. వాస్తవానికి, 2020 ఏడాది మే నాటికే ఈ 2019 అవార్డుల ప్రదానం జరగాల్సి ఉంది. కానీ, కరోనా విజృంభణ నేపథ్యంలో అవార్డుల ప్రకటన – ప్రదానం ఆలస్యమైంది.

దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం...
భారత చలన చిత్ర రంగంలో అత్యున్నత అవార్డుగా ’దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డును పరిగణిస్తారు. భారతీయ చలన చిత్ర పితామహుడు దాదాసాహెబ్‌ ఫాల్కే పేరున ఈ అవార్డును ఏర్పాటు చేశారు. ఆయన శత జయంతి సంవత్సరం 1969 నుంచి భారత ప్రభుత్వం ఏటా ఫాల్కే అవార్డులను సినీ రంగ ఉన్నతికి జీవిత కాల కృషి చేసిన ప్రముఖులకు అందిస్తోంది. బహుమతిగా రూ.10 లక్షల నగదుతో పాటు స్వర్ణ కమలం, శాలువతో సత్కరిస్తారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు 51వ దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ప్రదానం
ఎప్పుడు : అక్టోబర్‌ 25
ఎవరు    : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : భారతీయ సినిమా ఉన్నతికి విశేష కృషి చేసినందుకు...


New Land Border Law: సరిహద్దు భూ చట్టానికి ఆమోదం తెలిపిన దేశం?

China Flag

సరిహద్దు ప్రాంతాల్ని మరింతగా ఆక్రమించుకోవడానికి వీలుగా కొత్త సరిహద్దు భూ చట్టానికి డ్రాగన్‌ దేశం చైనా ఆమోదముద్ర వేసింది. చైనా ప్రజల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత అత్యంత పవిత్రమైనవని, ఎవరూ దానిని ఉల్లంఘించడానికి వీల్లేదని ఆ చట్టంలో పేర్కొంది. 2022, జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ చట్టాన్ని నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌కి చెందిన స్టాండింగ్‌ కమిటీ అక్టోబర్‌ 23న ఆమోదించినట్టుగా జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. సరిహద్దులు, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగిస్తే చైనా ఎంతటి చర్యలకైనా దిగుతుందని చట్టంలో ఉంది. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు, అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెంపు, సరిహద్దు ప్రాంతాల రక్షణ, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొంది.

14 దేశాలతో...
మొత్తం 14 దేశాలతో సరిహద్దుల్ని పంచుకుంటున్న చైనాకి ప్రస్తుతం భారత్, భూటాన్‌లతోనే సమస్యలున్నాయి. మిగిలిన 12 దేశాలతో సరిహద్దు సమస్యల్ని ఆ దేశం పరిష్కరించుకుంది. భారత్‌తో సరిహద్దు వివాదాలు రాజుకుంటున్న నేపథ్యంలో తాజా చట్టాన్ని తెచ్చింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : కొత్త సరిహద్దు భూ చట్టానికి ఆమోదం తెలిపిన దేశం?
ఎప్పుడు : అక్టోబర్‌ 23
ఎవరు    : చైనా 
ఎందుకు : భారత్‌తో సరిహద్దు వివాదాలు రాజుకుంటున్న నేపథ్యంలో...


Indian-American: వైట్‌హౌస్‌ స్టాఫ్‌ సెక్రటరీగా నియమితులైన మహిళ?

Neera Tanden

భారత సంతతి అమెరికన్‌ నీరా టాండన్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే సీనియర్‌ అడ్వైజర్‌ హోదాలో ఉన్న ఆమెను వైట్‌హౌస్‌ స్టాఫ్‌ సెక్రటరీగా నియమించారు. అధ్యక్ష భవనం స్టాఫ్‌ సెక్రటరీగా అధికార యంత్రాంగం, ఫెడరల్‌ ప్రభుత్వం నుంచి అధ్యక్షుడికి అందే అన్ని రకాల ఫైళ్ల బాధ్యతలను 51 ఏళ్ల నీరా పర్యవేక్షించాల్సి ఉంటుంది. వైట్‌హౌస్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ రాన్‌ క్లెయిన్‌కు ఆమె తన విభాగం తరఫున నివేదికలను అందజేస్తారు. ఈ నియామకానికి సెనేట్‌ ఆమోదం అవసరం లేదు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : వైట్‌హౌస్‌ స్టాఫ్‌ సెక్రటరీగా నియామకం
ఎప్పుడు : అక్టోబర్‌ 23
ఎవరు    : భారత సంతతి అమెరికన్‌ నీరా టాండన్‌
ఎందుకు : అమెరికా అధ్యక్షుడికి అందే అన్ని రకాల ఫైళ్ల బాధ్యతలను పర్యవేక్షించేందుకు...


Football: ఐఎస్‌ఎల్‌లో తొలి భారతీయ హెడ్‌ కోచ్‌గా నియమితులైన వ్యక్తి?

Khalid Jamil

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నీలో ఓ ప్రాంచైజీకి తొలిసారి ఓ భారతీయుడు హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. భారత్‌ తరఫున 11 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన 44 ఏళ్ల ఖాలిద్‌ జమీల్‌ను నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా ఆ ఫ్రాంచైజీ నియమించింది. గతేడాది జమీల్‌ జట్టును అసాధారణంగా మార్చేశాడు. వరుస పరాజయాలతో నార్త్‌ ఈస్ట్‌ డీలాపడగా... హెడ్‌ కోచ్‌ గెరార్డ్‌ నుస్‌ నుంచి తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన ఖాలిద్‌ వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో విజేతగా నిలిపాడు.

కాల్చివేతకు గురైన అథ్లెట్‌?
ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో ఈక్వెడార్‌కు తొలి పతకాన్ని అందించిన అథ్లెట్‌ అలెక్స్‌ క్వినెజ్‌ను దుండగులు కాల్చిచంపారు. ఈక్వెడార్‌లోని గ్వాయకిల్‌ నగరంలో అక్టోబర్‌ 24న అతను కాల్చివేతకు గురయ్యాడు. 32 ఏళ్ల అలెక్స్‌ 2019లో దోహాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 200 మీటర్ల స్ప్రింట్‌లో కాంస్య పతకం సాధించాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఐఎస్‌ఎల్‌ ప్రాంచైజీ నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా నియామకం
ఎప్పుడు : అక్టోబర్‌ 24
ఎవరు    : ఖాలిద్‌ జమీల్‌


Integrated Defence Factory: దేశంలోనే తొలి రక్షణ వ్యవస్థల కేంద్రం ఎక్కడ ఏర్పాటు కానుంది?

VEM Technologies

తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ సమీపంలోని ఎల్గోయి వద్ద దాదాపు 511 ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే తొలి ‘సమీకృత రక్షణ వ్యవస్థల కేంద్రం’ ఏర్పాటుకు వీఈఎం(వెమ్‌) టెక్నాలజీస్‌ కంపెనీ ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి  కంపెనీకి, తెలంగాణ ప్రభుత్వానికీ మధ్య అక్టోబర్‌ 24న ఒప్పందం కుదిరింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఒప్పందం కార్యక్రమంలో తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, వెమ్‌ టెక్నాలజీ అధ్యక్షుడు వెంకట్‌రాజు, డీఆర్‌డీవో చైర్మన్‌ సతీశ్‌రెడ్డి, డీఆర్‌డీవో మాజీ చైర్మన్‌ డాక్టర్‌ వీకే సారస్వత్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పాల్గొన్నారు. క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేసేందుకు అనువుగా ఉన్న ఈ కేంద్రం కోసం వెమ్‌ టెక్నాలజీస్‌ రూ.వెయ్యికోట్ల పెట్టుబడి పెట్టనుందని ఐటీ మంత్రి తెలిపారు. 
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : దేశంలోనే తొలి ‘సమీకృత రక్షణ వ్యవస్థల కేంద్రం’ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్‌ 24
ఎవరు    : వీఈఎం(వెమ్‌) టెక్నాలజీస్‌ కంపెనీ 
ఎక్కడ    : ఎల్గోయి, జహీరాబాద్‌ సమీపం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం
ఎందుకు : క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేసేందుకు...


Dubai: బుర్జ్‌ ఖలీఫాపై ఏ రాష్ట్ర పండుగ వీడియోను ప్రదర్శించారు?

Burj Khalifa-Bathukamma

తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా ‘బతుకమ్మ’ను విశ్వ వేదికపై ప్రదర్శించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత చొరవతో యూఏఈలోని దుబాయ్‌ నగరంలో ఉన్న ప్రపంచంలోనే అతి ఎత్తయిన కట్టడం బుర్జ్‌ ఖలీఫా తెరపై తెలంగాణ రాష్ట్ర ప్రజలు జరపుకునే పండుగ ‘బతుకమ్మ’ విశిష్టతను చాటేలా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. బతుకమ్మ పండుగపై రూపొందించిన మూడు నిముషాలు నిడివిగల వీడియోను అక్టోబర్‌ 23న రాత్రి 9.30కు, తిరిగి 10.30కు రెండు పర్యాయాలు ప్రదర్శించారు. ‘జై తెలంగాణ’, ‘జై హింద్‌’ నినాదాలతో పాటు బతుకమ్మ చిత్రాలు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రాన్ని బుర్జ్‌ ఖలీఫా తెరపై ప్రదర్శించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : బతుకమ్మ పండుగ వీడియో ప్రదర్శన
ఎప్పుడు : అక్టోబర్‌ 23
ఎవరు    : యూఏఈ ప్రభుత్వం
ఎక్కడ    : బుర్జ్‌ ఖలీఫా తెరపై, దుబాయ్, యూఏఈ
ఎందుకు : తెలంగాణ రాష్ట్ర ప్రజలు జరపుకునే పండుగ ‘బతుకమ్మ’ విశిష్టతను చాటేందుకు...


Amit Shah: ఏ కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పించనున్నారు?

Amit Shah

ఉగ్రవాదులతో సుదీర్ఘంగా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్లు, ముష్కరుల నుంచి పెరిగిపోతున్న ముప్పు, సాధారణ పౌరుల్ని కాల్చి చంపడం, సరిహద్దుల నుంచి ఉగ్రవాదుల చొరబాట్లతో జమ్మూ,కశ్మీర్‌లో అస్థిరత నెలకొన్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మూడు రోజుల కశ్మీర్‌ పర్యటన చేపట్టారు. కశ్మీర్‌లో భద్రతపై జమ్మూలోని రాజ్‌భవన్‌లో అక్టోబర్‌ 23న సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో భద్రతా సంస్థల అధికారులతోపాటు కశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా పాల్గొన్నారు. 2019 ఆగస్టులో ఆర్టికల్‌ 370 రద్దు చేసిన తర్వాత అమిత్‌ షా కశ్మీర్‌కు రావడం ఇదే తొలిసారి.

రాష్ట్ర హోదా...
కశ్మీర్‌ పర్యటన సందర్భంగా మంత్రి షా మాట్లాడుతూ... జమ్మూ, కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని చెప్పారు. కశ్మీర్‌ లోయ అభివృద్ధిని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

జమ్మూ,కశ్మీర్‌ రాజధాని : శ్రీ నగర్‌(వేసవి), జమ్మూ (శీతాకాలం)

ప్రస్తుతం కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు?
బాంబే హైకోర్టు ఔరంగాబాద్‌ బెంచ్‌కు చెందిన భవనాలను అక్టోబర్‌ 23న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరచాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా జస్టిస్‌ రమణ పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే పాల్గొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : జమ్మూ, కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తాం
ఎప్పుడు : అక్టోబర్‌ 23
ఎవరు    : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా 
ఎందుకు : జమ్మూ,కశ్మీర్‌ ప్రాంత అభివృద్ధి కోసం...

చ‌దవండి: Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 23 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 25 Oct 2021 07:39PM

Photo Stories