Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 23 కరెంట్‌ అఫైర్స్‌

100 crore vaccine

Covid-19 Vaccination: కరోనా టీకా పంపిణీలో 100 కోట్ల డోసుల మైలురాయిని చేరుకున్న రెండో దేశం?

కరోనా మహమ్మారిపై పోరాటంలో భారతదేశం మరో మైలురాయిని అధిగమించింది. తొమ్మిది నెలల్లోనే వంద కోట్ల కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ డోసుల్ని పంపిణీ చేసి ఘన కీర్తి సాధించింది. కరోనాపై పోరాటంలో రక్షణ కవచమైన భారీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని 2021, జనవరి 16న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. తొలుత ఆరోగ్య, వైద్య సిబ్బందికి టీకా డోసులు ఇచ్చి.. విడతల వారీగా, ప్రణాళికతో ఒక్కో వయసు వారికి ఇస్తూ ముందుకు వెళ్లింది. 2021, అక్టోబర్‌ 21 నాటికి వంద టీకా డోసుల్ని పూర్తి చేసి.. చైనా తర్వాత 100 కోట్ల డోసుల్ని పంపిణీ చేసిన రెండో దేశంగా ప్రపంచ దేశాల ప్రశంసల్ని అందుకుంది.

100 crore vaccine graph

ప్రత్యేక గీతం విడుదల 
వంద కోట్ల డోసుల పంపిణీని విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఒక ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. గాయకుడు కైలాష్‌ ఖేర్‌ ఆలపించిన ఈ గీతం ఆడియో విజువల్‌ ఫిల్మ్‌ని ఎర్రకోట వద్ద విడుదల చేశారు. 

మువ్వన్నెల వెలుగులు
శత కోటి టీకా డోసులు అరుదైన చరిత్రను సాధించినందుకుగాను ఢిల్లీలోని కుతుబ్‌మినార్‌ నుంచి హైదరాబాద్‌లోని గోల్కొండ కోట వరకు 100 వారసత్వ కట్టడాలను త్రివర్ణ శోభతో కాంతులు ప్రసరించేలా కేంద్ర పురావస్తు శాఖ చర్యలు తీసుకుంది. ఇక 1,400 కేజీల బరువైన ఖాదీ జాతీయ పతాకాన్ని ఎర్రకోట వద్ద ఆవిష్కరించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : కోవిడ్‌ టీకా పంపిణీలో 100 కోట్ల డోసుల మైలురాయిని చేరుకున్న రెండో దేశం?
ఎప్పుడు : అక్టోబర్ 21 
ఎవరు : భారత్
ఎక్కడ    : ప్రపంచంలో...
ఎందుకు : కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా...


Truth Social: ఏ దేశ మాజీ అధ్యక్షుడు నూతన సోషల్‌ మీడియాను ప్రారంభించనున్నారు?

donald trump

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నూతన సామాజిక మాధ్యమ వేదిక(సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌)ను ప్రారంభించనున్నారు. ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌ ఆధ్వర్యంలో ‘ట్రూత్‌ సోషల్‌’ అనే సామాజిక మాధ్యమ వేదికను త్వరలోనే ప్రారంభిస్తానని అక్టోబర్ 21న ట్రంప్‌ తెలిపారు. గతంలో అమెరికా అధ్యక్షుడిగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఫాలోయింగ్‌ ఉన్న నేతగా డొనాల్డ్‌ ట్రంప్‌ కొనసాగారు. 2021, జనవరి 6న అమెరికాలోని కేపిటల్‌ భవనంపై జరిగిన దాడిలో ప్రమేయం ఉందంటూ ట్రంప్‌ను ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థలు ట్విట్టర్, ఫేస్‌బుక్‌ సుమారు 9 నెలల క్రితం బహిష్కరించిన విషయం తెలిసిందే.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి     : ట్రూత్‌ సోషల్‌ అనే సామాజిక మాధ్యమ వేదికను త్వరలోనే ప్రారంభిస్తానని వెల్లడించిన వ్యక్తి?
ఎప్పుడు    : అక్టోబర్ 21 
ఎవరు        : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 
ఎందుకు    :  ట్రంప్‌ను ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థలు ట్విట్టర్, ఫేస్‌బుక్‌ బహిష్కరించిన నేపథ్యంలో...


Unnati Program: దేశవ్యాప్తంగా డేటా ఆధారిత ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయనున్న సంస్థ?

Intel

పరిశోధనకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే దిశగా ఎలక్ట్రానిక్‌ చిప్‌ తయారీ దిగ్గజం ఇంటెల్‌ వచ్చే ఏడాది వ్యవధిలో దేశవ్యాప్తంగా పలు కళాశాలల ప్రాంగణాల్లో డేటా ఆధారిత ల్యాబ్స్‌ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 100 పైచిలుకు యూనివర్సిటీలు, ఇంజినీరింగ్‌ కళాశాలలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని భావిస్తోంది. ’ఉన్నతి’ కార్యక్రమంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అక్టోబర్ 21న సంస్థ వెల్లడించింది. ల్యాబ్స్‌ ఏర్పాటుకయ్యే వ్యయాలను ఆయా విద్యా సంస్థలు భరించనుండగా, సాంకేతిక.. నాలెడ్జ్‌ భాగస్వామిగా ఇంటెల్‌ తోడ్పాటు అందిస్తుంది.

తాన్లా ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఎక్కడ ఏర్పాటు కానుంది?
దేశీ  సీపాస్‌ (కమ్యూనికేషన్‌ ప్లాట్‌ఫాం యాజ్‌ ఏ సర్వీస్‌) దిగ్గజం తాన్లా ప్లాట్‌ఫామ్స్‌.. కొత్త ఆవిష్కరణలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా దాదాపు రూ. 70 కోట్లతో హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఇన్నోవేషన్‌ అండ్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తోంది. ప్రత్యేకంగా బ్లాక్‌చెయిన్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషీ న్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), క్రిప్టోగ్రఫీ తదితర అంశాల్లో ఆవిష్కరణల కోసం దీన్ని ఉపయోగించనుంది. ఈ విషయాలను కంపెనీ వ్యవస్థాపక చైర్మన్, సీఈవో ఉదయ్‌ రెడ్డి తెలిపారు.    
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి     : ’ఉన్నతి’ కార్యక్రమంలో భాగంగా... దేశవ్యాప్తంగా పలు కళాశాలల ప్రాంగణాల్లో డేటా ఆధారిత ల్యాబ్స్‌ ఏర్పాటు
ఎప్పుడు  : అక్టోబర్ 21 
ఎవరు : ఎలక్ట్రానిక్‌ చిప్‌ తయారీ దిగ్గజం ఇంటెల్‌ 
ఎక్కడ    : భారత్
ఎందుకు : పరిశోధనకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు...


WAIPA President: వైపా ప్రెసిడెంట్‌గా ఎన్నికైన దక్షిణాసియా దేశం?

Invest India

పెట్టుబడుల ప్రోత్సాహక ఏజెన్సీలకు సంబంధించిన వరల్డ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ ఏజెన్సీస్‌ (వైపా - WAIPA) ప్రెసిడెంట్‌గా భారత ప్రభుత్వానికి చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ ఏజెన్సీ ‘‘ఇన్వెస్ట్‌ ఇండియా’’ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ విషయాన్ని అక్టోబర్ 22న అధికార వర్గాలు తెలిపాయి. 2021–23 కాలానికి వైపా స్టీరింగ్‌ కమిటీలో ప్రెసిడెంట్‌గా ఇన్వెస్ట్‌ ఇండియా ఉండనుండగా, ఈజిప్ట్‌.. స్విట్జర్లాండ్‌ వైస్‌–ప్రెసిడెంట్లుగా వ్యవహరించనున్నాయి. బ్రెజిల్, దక్షిణ కొరియా మొదలైన తొమ్మిది దేశాలు ప్రాంతీయ డైరెక్టర్లుగా ఉంటాయి. స్విట్జర్లాండ్‌ కేంద్రంగా పనిచేసే వైపా మండలిలో ఐక్యరాజ్య సమితికి చెందిన వివిధ సంస్థలు, వరల్డ్‌ బ్యాంక్‌ మొదలైన వాటికి సభ్యత్వం ఉంది. భారత్‌లో పెట్టుబడుల అవకాశాలు పరిశీలిస్తున్న ఇన్వెస్టర్లకు తోడ్పడేందుకు జాతీయ పెట్టుబడి ప్రోత్సాహక, సమన్వయ ఏజెన్సీగా ఇన్వెస్ట్‌ ఇండియా ఏర్పాటైంది.    
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి     :  వరల్డ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ ఏజెన్సీస్‌ (వైపా) ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ఏజెన్సీ ?
ఎప్పుడు    : అక్టోబర్ 22
ఎవరు        : ఇన్వెస్ట్‌ ఇండియా 
ఎందుకు    : పెట్టుబడుల అవకాశాలు పరిశీలిస్తున్న ఇన్వెస్టర్లకు తోడ్పడేందుకు...


Best Novel Award: కొంగవాలు కత్తి నవలను ఎవరు రచించారు?

Telugu University

తెలుగు సాహిత్యంలో ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018వ ఏడాదికి సాహితీ పురస్కారాలను 2021, అక్టోబర్ 21న ప్రకటించింది. ఈ అవార్డుల్లో ‘కొంగవాలు కత్తి’ ఉత్తమ నవలా పురస్కారం దక్కింది. గడ్డం మోహన్‌రావు రాసిన కొంగవాలు కత్తికి కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కార్-2019 లభించిన విషయం విదితమే. అక్టోబర్‌  29న తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరగనుంది. తెలుగు విశ్వవిద్యాలయం ప్రకటించిన అవార్డుల వివరాలు ఇలా...

  • పద్య కవితా ప్రక్రియలో మొవ్వ వృషాద్రిపతి రచన (శ్రీ కృష్ణదేవరాయ విజయ ప్రబంధము)
  • వచన కవితా ప్రక్రియలో కాంచనపల్లి గోవర్ధన్‌ రాజు (కల ఇంకా మిగిలే ఉంది)
  • బాల సాహిత్యంలో సామలేటి లింగమూర్తి (పాటల పల్లకి)
  • కథానికా ప్రక్రియలో రావుల పాటి సీతారాంరావు (ఖాకీకలం)
  • నవలా ప్రక్రియలో డాక్టర్‌ గడ్డం మోహన్‌ రావు (కొంగవాలు కత్తి)
  • సాహిత్య విమర్శలో డాక్టర్‌ కిన్నెర శ్రీదేవి (సీమకథ అస్తిత్వం)
  • నాటకం/నాటికల్లో ఎన్‌.ఎస్‌.నారాయణబాబు (అశ్శరభ శరభ)
  • అనువాదంలో కె.సజయ (అ శుద్ధ భారత్‌)
  • వచన రచనల విభాగంలో లక్ష్మణరావు పతంగే (హైదరాబాద్‌ నుండి తెలంగాణ దాక)
  • రచయిత్రి ఉత్తమ గ్రంథం విభాగం లో సమ్మెట ఉమాదేవి (రేలపూలు)

 

UN Peace Medal : ఐక్యరాజ్య సమితి శాంతి పతకం పొందిన మహిళ?  

DSP Peddareddy Sitareddy

 

తెలంగాణ పోలీసు విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసుగా (డీఎస్పీ) విధులు నిర్వర్తిస్తున్న పెద్దారెడ్డి సీతారెడ్డి తెలంగాణ రాష్ట్రం తరఫున ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో పని చేస్తున్నారు. 2021, ఏడాది దక్షిణ భారత దేశం నుంచి ఎంపికైన వారిలో సీతారెడ్డి మాత్రమే ఏకైక మహిళ. ఈమెకు ఐక్యరాజ్య సమితి (యూఎన్‌) అక్టోబర్ 22న (భారత కాలమాన ప్రకారం) పీస్‌ మెడల్(శాంతి పతకం), సర్టిఫికెట్‌ ప్రదానం చేసింది. హైదరాబాద్‌కు చెందిన సీతారెడ్డి... 1996లో సబ్‌–ఇన్‌స్పెక్టర్‌గా చేరి... డీఎస్పీ స్థాయికి చేరారు. తెలంగాణ రాష్ట్ర నేర పరిశోధన విభాగంలో (సీఐడీ) డీఎస్పీ గా పని చేస్తుండగా ఐరాస శాంతి పరిరక్షక దళంలో పని చేయడానికి ఎంపికయ్యారు. ఐరాస శాంతి పరిరక్షక దళంలోకి సీతారెడ్డి ఎంపిక కావడం ఇది రెండోసారి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి     : ఐక్యరాజ్య సమితి శాంతి పతకం పొందిన మహిళ?    
ఎప్పుడు    : అక్టోబర్ 22
ఎవరు        : తెలంగాణ పోలీసు విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న పెద్దారెడ్డి సీతారెడ్డి
ఎందుకు    : ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో... 


Abhyas: మానవరహిత విమానం ‘అభ్యాస్’ ను పరీక్షించిన దేశం?

Abhyas

గగనతలంలో వివిధ అస్త్రాలకు లక్ష్యంగా ఉపయోగపడే ‘హై స్పీడ్‌ ఎక్సెపెండబుల్‌ ఏరియల్‌ టార్గెట్‌’ (హీట్‌)ను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అక్టోబర్ 22న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఐటీఆర్‌) నుంచి ఈ ప్రయోగం జరింగింది. ఈ మానవరహిత విమానానికి ‘అభ్యాస్‌’ అని పేరు పెట్టారు. దీన్ని వివిధ రకాల క్షిపణుల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఆకాశంలో ఒక లక్ష్యంగా వాడొచ్చు. బెంగళూరులో ఉన్న డీఆర్‌డీవో అనుబంధ సంస్థ ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఏడీఈ) దీన్ని అభివృద్ధి చేసింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి     : మానవరహిత విమానం ‘అభ్యాస్’ ను పరీక్షించిన దేశం?
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు    : భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)
ఎక్కడ    : ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఐటీఆర్‌), చాందీపూర్‌, ఒడిశా
ఎందుకు : గగనతలంలో వివిధ అస్త్రాలకు లక్ష్యంగా వినియోగించేందుకు...


AY.4.2 Spreads: ఏవై.4.2 అనేది ఏ వ్యాధికి సంబంధించిన వైరస్?

కోవిడ్-19 వైరస్‌కి సంబంధించి... డెల్టా వేరియెంట్‌ ఉపవర్గమైన ఏవై.4.2 రకం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే), అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌లో ఏవై.4.2 కరోనా కేసులు నమోదవుతున్నాయి. 2020, అక్టోబర్‌లో తొలిసారిగా భారత్‌లో వెలుగులోకి వచ్చిన డెల్టా వేరియెంట్‌లో ఇప్పటిదాకా 55 సార్లు జన్యుపరమైన మార్పులు జరిగాయి. వీటిలో ఏవై.4.2 మినహా మిగిలినవన్నీ పెద్దగా ప్రమాదకరంగా మారలేదు. ఏవై.4.2 వేరియంట్ తొలి సారిగా 2021, జూలైలో యూకేలో బయటపడింది. కరోనా వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌ మ్యుటేషన్లు అయిన ఏ222వీ, వై145హెచ్‌ల సమ్మేళనంగా ఈ కొత్త వేరియెంట్‌ పుట్టిందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.

యూనియన్‌ బ్యాంక్‌ ఎండీగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి?
ప్రభుత్వ రంగ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా రజనీష్‌ కర్ణాటక అక్టోబర్ 22న బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికి దాకా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా వ్యవహరించారు. బ్యాంకింగ్‌ రంగంలో 27 ఏళ్ల సుధీర్ఘ అనుభవం కలిగిన రజనీష్‌ డిజిటల్‌ బ్యాంకింగ్, క్రిడెట్, లార్జ్‌ కార్పొరేట్, మిడ్‌ కార్పొరేట్‌ రుణ విభాగాల్లో పనిచేశారు.

 

Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 21 కరెంట్‌ అఫైర్స్

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి:

తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

 

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...

డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 23 Oct 2021 06:40PM

Photo Stories