Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 21 కరెంట్‌ అఫైర్స్‌

Kushinagar AIrport

Buddhist Circuit: ఇటీవల ప్రారంభమైన కుషీనగర్‌ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది?

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం కుషీనగర్‌ జిల్లా కుషినగర్‌లో రూ. 260 కోట్లతో నిర్మించిన‌ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. అక్టోబర్‌ 20న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అనతరం పలు ఇతర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కుషీనగర్‌లో నిర్వహించిన అభిదమ్మ దినోత్సవం(అక్టోబర్‌ 20)లో ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బుద్ధిస్టు టూరిజం సర్క్యూట్‌కు మరింత ఊతం ఇవ్వడంలో భాగంగా కుషీనగర్‌ విమానాశ్రయాన్ని నిర్మించారు.

స్వదేశ్‌ దర్శన్‌ పథకం కింద... 


దేశంలో బౌద్ధ సర్క్యూట్‌ అభివృద్ధికి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రణాళికలు రూపొందించింది. స్వదేశ్‌ దర్శన్‌ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, గుజరాత్‌ రాష్ట్రాలలో బౌద్ధ సర్క్యూట్‌ అభివృద్ధి కోసం రూ.325.53 కోట్ల విలువైన 5 ప్రాజెక్టులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్ర పర్యాటక శాఖ అక్టోబర్‌ 5న తెలిపింది. దేశంలో కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న పర్యాటక రంగ అభివృద్ధి, పురోగతిలో కీలక పాత్ర పోషించే విదేశీ, దేశీయ పర్యాటకంలో బౌద్ధ పర్యాటకం ఒకటిగా కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగా బుద్ధ సర్క్యూట్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి వివిధ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంది. 2021, నవంబర్‌ 17 నుంచి 21 వరకు అంతర్జాతీయ బౌద్ధ సమావేశాలు జరుగనున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర పర్యాటక శాఖ ప్రణాళికలను ఇప్పటికే అమలుచేస్తోంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : కుషినగర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్‌ 20
ఎవరు    : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ    : కుషీనగర్, కుషీనగర్‌ జిల్లా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం
ఎందుకు : బుద్ధిస్టు టూరిజం సర్క్యూట్‌కు మరింత ఊతం ఇవ్వడంలో భాగంగా...


COVID-19: కరోనా టీకాల గుర్తింపుకు భారత్‌ ఎన్ని దేశాలతో ఒప్పందం చేసుకుంది?

Covid-19 Vaccine

కోవిడ్‌–19 వ్యాక్సిన్లను పరస్పరం గుర్తించే విషయంలో 11 దేశాలతో భారత్‌ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అక్టోబర్‌ 20న వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఆమోదించిన వ్యాక్సిన్లు ఇందులో ఉన్నాయని తెలిపింది. యూకే, ఫ్రాన్స్, జర్మనీ, నేపాల్, బెలారస్, లెబనాన్, ఆర్మేనియా, ఉక్రెయిన్, బెల్జియం, హంగెరీ, సెర్బియా దేశాలతో భారత్‌ ఈ ఒప్పందాలు కుదుర్చుకుందని పేర్కొంది. ఆయా దేశాల్లో పూర్తిగా వ్యాక్సినేట్‌ అయిన పర్యాటకులు భారత్‌కు వచ్చిన తర్వాత హోంక్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని, మళ్లీ కరోనా టెస్టు చేయించుకోవాల్సిన పని లేదని వివరించింది. కానీ, వారు ఆర్‌టీ–పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది.

కేవాడియాలో సీవీసీ, సీబీఐ సదస్సు...
మన దేశానికి ద్రోహం చేసినవారికి ప్రపంచంలో ఇంకెక్కడా స్వర్గధామాలు లేకుండా చేయాలని సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌(సీవీసీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులకు ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేశారు. గుజరాత్‌లోని కేవాడియాలో అక్టోబర్‌ 20న సీవీసీ, సీబీఐ ఉమ్మడి సదస్సులో మోదీ వర్చువల్‌ విధానం ద్వారా మాట్లాడారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : యూకే, ఫ్రాన్స్, జర్మనీ, నేపాల్, బెలారస్, లెబనాన్, ఆర్మేనియా, ఉక్రెయిన్, బెల్జియం, హంగెరీ, సెర్బియా దేశాలతో ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్‌ 20
ఎవరు    : భారత్‌ 
ఎందుకు : కోవిడ్‌–19 వ్యాక్సిన్లను పరస్పరం గుర్తించే విషయంలో...


Sakharov Prize: ఈయూ మానవ హక్కుల పురస్కారానికి ఎంపికైన వ్యక్తి?

Alexei Navalny

జైలు జీవితం గడుపుతున్న రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీని యురోపియన్‌ యూనియన్‌(ఈయూ) అత్యున్నత పురస్కారం వరించింది. మానవతావాది, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత ఆండ్రీ సఖరోవ్‌ పేరు మీద ఇస్తున్న మానవ హక్కుల పురస్కారాన్ని నావల్నీకి ప్రకటించారు. ఈ బహుమతి కింద ఆయనకు 50,000 యూరోలు (దాదాపు రూ.43.59 లక్షలు) అందజేయనున్నారు. మానవహక్కులపై నావల్నీ రాజీ లేని పోరాటం చేస్తున్నారని ఈయూ తెలిపింది. ‘రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అవినీతి చర్యలపై సామాజిక మాధ్యమ ఖాతాలు, ఇతర రూపాల్లో నావల్నీ నిరంతర ప్రచారం చేశారు. అధికార దుర్వినియోగాన్ని ఎండగట్టడంలో ప్రజల మద్దతు సమీకరించారు.’ అని పేర్కొంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : మానవతావాది, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత ఆండ్రీ సఖరోవ్‌ పేరు మీద ఇస్తున్న మానవ హక్కుల పురస్కారానికి అలెక్సీ నావల్నీ ఎంపిక 
ఎప్పుడు : అక్టోబర్‌ 20
ఎవరు    : యురోపియన్‌ యూనియన్‌(ఈయూ) 
ఎందుకు : మానవహక్కులపై రాజీలేని పోరాటం చేస్తున్నందున...


IMF: ఐఎంఎఫ్‌ చీఫ్‌ ఎకానమిస్ట్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ?

Gita Gopinath

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) చీఫ్‌ ఎకానమిస్ట్‌గా వ్యవహరిస్తున్న గీతా గోపీనాథ్‌ 2022 ఏడాది పదవి నుంచి వైదొలగనున్నారు. ప్రతిష్టాత్మక హార్వర్డ్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా తిరిగి చేరనున్నారు. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ అండ్‌ ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌ అయిన 49 ఏళ్ల గీతా గోపీనాథ్‌ .. ఐఎంఎఫ్‌ తొలి మహిళా చీఫ్‌ ఎకానమిస్ట్‌గా 2019 జనవరిలో బాధ్యతలు చేపట్టారు. ఆమె సెలవును హార్వర్డ్‌ యూనివర్సిటీ పొడిగించడంతో మూడేళ్ల పాటు ఐఎంఎఫ్‌లో కొనసాగారు. తాజాగా అదే వర్సిటీకి తిరిగి రానున్నారు. గీతా గోపీనాథ్‌ స్థానంలో మరొకరిని ఎంపిక చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభిస్తామని అక్టోబర్‌ 20న ఐఎంఎఫ్‌ ఎండీ క్రిస్టలీనా జార్జియేవా తెలిపారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 2022 ఏడాది అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) చీఫ్‌ ఎకానమిస్ట్‌ పదవి నుంచి వైదొలగనున్న ఆర్థిక వేత్త? 
ఎప్పుడు : అక్టోబర్‌ 20
ఎవరు : గీతా గోపీనాథ్‌
ఎందుకు : హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ అండ్‌ ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న నేపథ్యంలో...


Mens Hockey: ప్రపంచకప్‌ హాకీ టోర్నమెంట్‌-2021 ఏ నగరంలో జరగనుంది?

2021, నవంబర్‌ 24 నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ భువనేశ్వర్‌లో ఉన్న  కళింగ స్టేడియం వేదికగా జరిగే జూనియర్‌ పురుషుల ప్రపంచకప్‌ హాకీ టోర్నమెంట్‌–2021 షెడ్యూల్‌ను అక్టోబర్‌ 20న విడుదల చేశారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ నవంబర్‌ 24న జరిగే తమ తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌తో తలపడనుంది. డిసెంబర్‌5న ఫైనల్స్‌ జరుగుతాయి. పూల్‌ ‘బి’లో భారత్‌తోపాటు కెనడా, ఫ్రాన్స్, పోలాండ్‌ జట్లకు చోటు కల్పించారు. పూల్‌ ‘ఎ’లో బెల్జియం, చిలీ, మలేసియా, దక్షిణాఫ్రికా... పూల్‌ ‘సి’లో దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, స్పెయిన్, అమెరికా... పూల్‌ ‘డి’లో అర్జెంటీనా, ఈజిప్ట్, జర్మనీ, పాకిస్తాన్‌ జట్లు ఉన్నాయి. 2016 ప్రపంచకప్‌ టోర్నీకి కూడా భారతే(ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరం) వేదికగా నిలిచింది.

దక్షిణాఫ్రికాలో మహిళల టోర్ని...
2021, డిసెంబర్‌ 5 నుంచి 16 వరకు దక్షిణాఫ్రికాలోని పాట్‌చెఫ్‌స్ట్రూమ్‌ నగరంలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ వెస్ట్‌ వేదికగా జరిగే జూనియర్‌ మహిళల ప్రపంచకప్‌ హాకీ టోర్నమెంట్‌–2021 షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. పూల్‌ ‘సి’లో ఉన్న భారత్‌ డిసెంబర్‌ 6న తొలి మ్యాచ్‌లో రష్యాతో ఆడుతుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : జూనియర్‌ పురుషుల ప్రపంచకప్‌ హాకీ టోర్నమెంట్‌–2021
ఎప్పుడు : అక్టోబర్‌ 21
ఎవరు    : భారత్‌
ఎక్కడ    : కళింగ స్టేడియం, భువనేశ్వర్, ఒడిశా


Andhra Pradesh: జగనన్న తోడు పథకం తొలుత ఎప్పడు ప్రారంభమైంది?

Jagananna Thodu scheme

జగనన్న తోడు పథకం కింద రుణాలు తీసుకున్న చిరు వ్యాపారులు సకాలంలో రుణం చెల్లించి, సున్నా వడ్డీ రాయితీ పొందాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. అక్టోబర్‌ 20న ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న తోడు పథకం కింద 2020 నవంబర్‌ నుంచి 2021 సెప్టెంబర్‌ 30 వరకు రూ.10 వేలు చొప్పున రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 4,50,546 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.16.36 కోట్ల వడ్డీని కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి జమ చేశారు.

2020, నవంబర్‌ 25న ప్రారంభం...
చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులకు రూ.పది వేల వరకు వడ్డీలేని రుణం అందించేందుకు ఉద్దేశించిన ‘జగనన్న తోడు’ పథకం 2020, నవంబర్‌ 25న ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద చిరు వ్యాపారులతో పాటు, కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక, బొబ్బిలి వీణ, ఇత్తడి పాత్రల తయారీదారులు, కలంకారీ పనులు చేసే వారికి కూడా రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తారు. సకాలంలో రుణం చెల్లించిన వారి ఖాతాలో వడ్డీని ప్రభుత్వం జమ చేస్తుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : జగనన్న తోడు పథకం కింద 4,50,546 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.16.36 కోట్ల వడ్డీ జమ
ఎప్పుడు : అక్టోబర్‌ 20
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ    : సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు జిల్లా
ఎందుకు : 2020 నవంబర్‌ నుంచి 2021 సెప్టెంబర్‌ 30 వరకు రూ.10 వేలు చొప్పున రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించినందున...

 

Skills: ఏ రాష్ట్రంలో వరల్డ్‌ స్కిల్స్‌ అకాడమీ ఏర్పాటు కానుంది?

Visakhapatnam


నైపుణ్యాభివృద్ధి విషయంలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న వరల్డ్‌ స్కిల్స్‌ అకాడమీని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి కేంద్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని విశాఖట్నంలో దీనిని ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించింది. ఈ విషయాలను అక్టోబర్‌ 20న ఏపీ నైపుణ్యాభివృద్ధి శాఖ తెలిపింది. రెండేళ్లకు ఒకసారి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే వరల్డ్‌ స్కిల్స్‌ పోటీలో పాల్గొనే వారికి ఈ అకాడమీ ద్వారా శిక్షణ అందిస్తారు. కనీసం 20 విభాగాల్లో శిక్షణ ఇచ్చే విధంగా ఈ అకాడమీని ఏర్పాటు చేస్తున్నారు.

యుద్ధం తర్వాత...
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం గల మానవ వనరుల కొరతను తీర్చేందుకు కొన్ని దేశాలు కలిపి ‘వరల్డ్‌ స్కిల్‌’ పేరుతో నైపుణ్య శిక్షణ సంస్థను ఏర్పాటు చేశాయి. ఈ సంస్థ 83కు పైగా ఉన్న సభ్య సంస్థల ద్వారా ప్రపంచంలోని మూడింట రెండొంతుల నైపుణ్య అవసరాలను తీరుస్తోంది. మన దేశంలో కూడా నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో కలిపి వరల్డ్‌ స్కిల్స్‌ ఇండియా పేరుతో నైపుణ్య శిక్షణను అందిస్తోంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : వరల్డ్‌ స్కిల్స్‌ అకాడమీ ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు  : అక్టోబర్‌ 20
ఎవరు    : కేంద్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ మంత్రిత్వ శాఖ
ఎక్కడ    : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు  : నైపుణ్యాభివృద్ధి విషయంలో శిక్షణ అందించేందుకు...

 

Kidney Transplant: ఏ దేశ శాస్త్రవేత్తలు తొలిసారిగా మనిషికి పంది కిడ్నీని అమర్చారు?

PIG kidney transplant

జంతువుల అవయవాలు మానవులకు అమర్చేందుకు చాలా ఏళ్ల నుంచి శాస్త్రవేత్తలు ప్రయోగాలు జరుపుతున్నారు. తాజాగా ఈ ప్రక్రియలో ఉన్న లోపాలను అధిగమించి వారు విజయం సాధించారు. ప్రపంచంలోనే తొలిసారిగా మనిషికి పంది కిడ్నీని విజయవంతంగా అమర్చారు. న్యూయార్క్‌లోని ఎన్‌వైయూ లంగోన్‌ హెల్త్‌ ఆస్పత్రి వైద్య బృందం పందిలో జన్యుపరమైన మార్పులు చేయడం ద్వారా ఈ విజయం సాధించింది. కిడ్నీ పనిచేయని స్థితిలో ఉన్న ఓ బ్రెయిన్‌ డెడ్‌  మహిళకు ఈ అవయవ మార్పిడి చేశారు.

ఎలా చేశారు..?
యునైటెడ్‌ థెరప్యూటిక్స్‌ కార్ప్‌కు చెందిన రెవివికోక్‌ యూనిట్‌ పరిశోధకులు... తొలుత పంది పిండంలోని జన్యువుల్లో మార్పులు చేశారు. తర్వాత ఆ పిండాన్ని వేరే పంది గర్భంలోకి ప్రవేశపెట్టారు. తద్వారా మానవ రోగ నిరోధక వ్యవస్థతో సరిపోలే వ్యవస్థ కలిగి ఉన్న పంది పిల్ల పుట్టింది. దీనికి గాల్‌సేఫ్‌ అని పేరుపెట్టారు. ఇది పెరిగాక చిన్నపాటి శస్త్రచికిత్స చేసి ఊపిరితిత్తులకు పైన ఉండే థైమస్‌ గ్రంథి (ఇది తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది)ని దాని కిడ్నీకి కలిపారు. కొత్త కిడ్నీ శరీరంలో అమర్చినా కూడా మానవ రోగ నిరోధక శక్తి దాన్ని తిరస్కరించకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చేశారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఏ దేశ శాస్త్రవేత్తలు తొలిసారిగా మనిషికి పంది కిడ్నీని అమర్చారు?
ఎప్పుడు : అక్టోబర్‌ 20
ఎవరు    : అమెరికా వైద్య శాస్త్రవేత్తలు
ఎక్కడ    : ఎన్‌వైయూ లంగోన్‌ హెల్త్‌ ఆస్పత్రి, న్యూయార్క్, అమెరికా

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 20 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 21 Oct 2021 06:27PM

Photo Stories