Daily Current Affairs in Telugu: 2021, అక్టోబర్ 20 కరెంట్ అఫైర్స్
GFS Index 2021: ప్రపంచ ఆహార భద్రతా సూచీలో భారత్ స్థానం?
లండన్‌కు చెందిన ఎకనమిస్ట్ ఇంపాక్ట్ సంస్థ కోర్టెవా అగ్రిసైన్స్ సాయంతో రూపొందించిన ప్రపంచ ఆహార భద్రతా సూచీ(గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్–జీఎఫ్‌ఎస్ ఇండెక్స్)–2021 విడుదలైంది. 113 దేశాలతో కూడిన ఈ వార్షిక నివేదికలో భారత్ 71వ స్థానంలో నిలిచింది. ఆహార లభ్యత, నాణ్యత, భద్రత, సహజవనరులు వంటి అంశాల ఆధారంగా 113 దేశాల్లో ఆహార భద్రతను ఈ నివేదిక అంచనా వేసింది. అంతేకాకుండా ఆహార భద్రతకు సంబంధించి ఆర్థిక అసమానతల వంటి 58 అంశాలను సైతం పరిగణనలోకి తీసుకుంది. అక్టోబర్ 19న విడుదలైన ఈ ఇండెక్స్‌లో 71వ స్థానంలో ఉన్న భారత్‌కు మొత్తమ్మీద 57.2 పాయింట్లు దక్కాయి.
జీఎఫ్‌ఎస్ ఇండెక్స్–ముఖ్యాంశాలు...
- భారత పొరుగుదేశాలైన పాకిస్తాన్ 52.6 పాయింట్లతో 75వ స్థానంలో, శ్రీలంక 62.9 పాయింట్లతో 77వ స్థానంలో, నేపాల్ 79, బంగ్లాదేశ్ 84వ స్థానంలో ఉన్నాయి. చైనా 34వ స్థానాన్ని కైవసం చేసుకుంది.
- ఈ సూచీలో ఐర్లాండ్, ఆస్ట్రేలియా, యూకే, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, కెనడా, జపాన్, ఫ్రాన్స్, అమెరికా మొత్తమ్మీద 77.8–80 మధ్య మార్కులతో టాప్ ర్యాంకులను దక్కించుకున్నాయి.
- ఆహార లభ్యత, నాణ్యత, భద్రత, ఆహారోత్పత్తిలో సహజ వనరుల పరిరక్షణ వంటి అంశాల్లో పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక కంటే భారత్ మెరుగైన స్థానంలో ఉంది.
- ఆహార భద్రత విషయంలో గత పదేళ్లుగా భారత్ సాధించిన అభివృద్ధి పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్‌ల కంటే వెనుకంజలోనే ఉంది.
- 2012లో భారత స్కోర్ 54.5 కాగా కేవలం 2.7 పాయింట్లు పెరిగి 2021కి 57.2 పాయింట్లకు చేరుకుంది.
- సరసమైన ధరలకు ఆహారం లభించే దేశాల్లో భారత్ కంటే పాకిస్తాన్, శ్రీలంక మెరుగైన స్థానాల్లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ ఆహార భద్రతా సూచీ( గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్–జీఎఫ్‌ఎస్ ఇండెక్స్)–2021లో 71వ స్థానంలో ఉన్న దేశం?
ఎప్పుడు : అక్టోబర్ 19
ఎవరు : భారత్
ఎక్కడ : ప్రపంచ వ్యాప్తంగా 113 దేశాల్లో...
ఎందుకు : ఆహార లభ్యత, నాణ్యత, భద్రత, సహజవనరులు వంటి అంశాల ఆధారంగా...
Submarine: సరిహద్దు నుంచి ఎన్ని మైళ్ల మేరకు ప్రాదేశిక జలాలు ఉంటాయి?
భారత జలాంతర్గామి అరేబియా సముద్రంలో తమ ప్రాదేశిక జలాల్లోకి రాకుండా అడ్డుకున్నామని పాకిస్తాన్ ప్రభుత్వం వెల్లడించింది. అక్టోబర్ 16న భారత జలాంతర్గామి తమ జలాల్లోకి ప్రవేశించే ప్రయత్నం చేయగా పాక్ వైమానిక దళానికి చెందిన గస్తీ విమానం దీన్ని పసిగట్టి ఆ ప్రయత్నాన్ని వమ్ము చేసిందని అక్టోబర్ 19న తెలిపింది.
ప్రాదేశిక జలాలు: దేశం సరిహద్దు నుంచి 12 నాటికల్ మైళ్ల మేరకు ప్రాదేశిక జలాలు ఉంటాయి. దీన్ని ఆ దేశం అధీనంలోని సముద్రభాగంగా గుర్తిస్తారు.
బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
ఉత్తర కొరియా అక్టోబర్ 19న సముద్రజలాల్లో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. సిన్‌పో నౌకాశ్రయం సమీపంలోని సముద్ర జలాల్లో జలాంతర్గామి నుంచి తక్కువ శ్రేణి క్షిపణిని ఉత్తర కొరియా ప్రయోగించిందని దక్షిణ కొరియా మిలటరీ ప్రకటించింది.
ఉత్తర కొరియా రాజధాని: ప్యాంగ్యాంగ్; కరెన్సీ: నార్త్ కొరియన్ వన్
ఉత్తర కొరియా ప్రస్తుత అధ్యక్షుడు: కిమ్ జోంగ్ఉన్
Cricket: ఎంసీసీలో జీవితకాల సభ్యత్వం పొందిన భారత క్రికెటర్లు?
భారత మాజీ క్రికెటర్లు జవగళ్ శ్రీనాథ్, హర్భజన్ సింగ్‌లకు ప్రసిద్ధ మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)లో జీవితకాల సభ్యత్వం లభించింది. టెస్టు క్రికెట్ ఆడే 12 దేశాల నుంచి ఎనిమిది దేశాల క్రికెటర్లకు 2021 ఏడాది జీవితకాల సభ్యత్వం ఇచ్చినట్లు ఎంసీసీ అక్టోబర్ 19న ఒక ప్రకటనలో తెలిపింది. మేటి పేసర్‌గా భారత జట్టుకు సేవలందించిన శ్రీనాథ్ ప్రస్తుతం ఐసీసీ ఎలైట్ మ్యాచ్ రిఫరీ ప్యానెల్‌లో ఉన్నారు. శ్రీనాథ్ తన అంతర్జాతీయ కెరీర్‌లో వన్డేల్లో 315 వికెట్లు, టెస్టుల్లో 236 వికెట్లు పడగొట్టాడు. హర్భజన్ మూడు ఫార్మాట్లలో కలిపి 711 వికెట్లు తీశాడు.
టీటీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచిన రెండో భారతీయుడు?
భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) యువతార పాయస్ జైన్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీటీ సమాఖ్య ప్రపంచ ర్యాంకింగ్స్ అండర్–17 బాలుర సింగిల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఇటీవల పాయస్ జైన్ మూడు అంతర్జాతీయ టైటిల్స్ సాధించాడు. మానవ్ ఠక్కర్ (అండర్–21) తర్వాత ఐటీటీఎఫ్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచిన రెండో భారతీయ ప్లేయర్‌గా పాయస్ జైన్ నిలిచాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రసిద్ధ మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)లో జీవితకాల సభ్యత్వం పొందిన భారత క్రికెటర్లు?
ఎప్పుడు : అక్టోబర్ 19
ఎవరు : భారత మాజీ క్రికెటర్లు జవగళ్ శ్రీనాథ్, హర్భజన్ సింగ్
ఎందుకు : ఎంసీసీ నిర్ణయం మేరకు...
Indian Banking System: బ్యాంకింగ్ అవుట్‌లుక్‌ను స్టేబుల్‌కు మార్చిన రేటింగ్ ఏజెన్సీ?
భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ అవుట్‌లుక్‌ను అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ‘నెగటివ్’ నుంచి ‘స్టేబుల్’కు అప్‌గ్రేడ్ చేసింది. మొండిబకాయిల (ఎన్‌పీఏ) పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశాలు ఉండడం, ఎకనమీ రికవరీతో రుణ వృద్ధికి అవకాశాలు దీనికి కారణంగా పేర్కొంది. 2021–22, 2022–23 ఆర్థిక సంవత్సరంల్లో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వరుసగా 9.3 శాతం, 7.9 శాతంగా నమోదవుతుందన్నది తమ అంచనా అని ప్రకటించింది. ఈ మేరకు అక్టోబర్ 19న ఒక నివేదికను విడుదల చేసింది.
2021, అక్టోబర్ నెల మొదట్లో మూడీస్... భారత్ సావరిన్ రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’ నంచి ‘స్టేబుల్’కు మార్చింది. అయితే సావరిన్ రేటింగ్‌ను మాత్రం ‘బీఏఏ3’గా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. జంక్ (చెత్త) స్టేటస్‌కు ఇది ఒక అంచ ఎక్కువ. మూడీస్ ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న 7 వరల్డ్ ట్రేడ్ సెంటర్(డబ్ల్యూటీసీ–7) ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’ నుంచి ‘స్టేబుల్’కు అప్‌గ్రేడ్ చేసిన సంస్థ?
ఎప్పుడు : అక్టోబర్ 19
ఎవరు : అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్
ఎందుకు : మొండిబకాయిల (ఎన్‌పీఏ) పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశాలు ఉండడం, ఎకనమీ రికవరీతో రుణ వృద్ధికి అవకాశాలు ఉండటంతో...
World Gold Council: డబ్ల్యూజీసీ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
భారత్‌లో పసిడికి 2022లో భారీ డిమాండ్ నెలకొనే అవకాశం ఉందని ప్రపంచ స్వర్ణ మండలి(వరల్డ్ గోల్డ్ కౌన్సిల్–డబ్ల్యూజీసీ) పేర్కొంది. అయితే కోవిడ్–19 సంబంధ సవాళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో 2021 మాత్రం బంగారం డిమాండ్ తగ్గిపోతుందని అభిప్రాయపడింది. ఈ మేరకు ‘భారత్‌లో బంగారం డిమాండ్‌కు చోదకాలు’ అన్న శీర్షికన ఒక నివేదికను విడుదల చేసింది. డబ్ల్యూజీసీ ప్రధాన కార్యాలయం యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్ నగరంలో ఉంది.
పారస్ ఏరోస్పేస్‌తో జట్టు కట్టిన యూరప్ సంస్థ?
యూరప్‌కు చెందిన కమర్షియల్ డ్రోన్‌లు, సాఫ్ట్‌వేర్ తయారీ సంస్థ ఫిక్సార్ భారత మార్కెట్లో ప్రవేశించింది. ఇందుకోసం పారస్ డిఫెన్స్ అనుబంధ సంస్థ పారస్ ఏరోస్పేస్‌తో జట్టు కట్టింది. ముందుగా తమ ఉత్పత్తుల్లో ప్రధానమైన ఫిక్సిడ్ వింగ్ డ్రోన్ ఫిక్సార్007ను భారత మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు అక్టోబర్ 19న వెల్లడించింది. పారస్, ఫిక్సార్‌ల ఒప్పందం ప్రకారం వచ్చే 6–8 నెలల్లో భారత్‌లోని ఆపరేటర్లకు దాదాపు 150 డ్రోన్‌లు అందించాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పారస్ డిఫెన్స్ అనుబంధ సంస్థ పారస్ ఏరోస్పేస్‌తో జట్టు కట్టిన సంస్థ?
ఎప్పుడు : అక్టోబర్ 19
ఎవరు : యూరప్‌కు చెందిన కమర్షియల్ డ్రోన్‌లు, సాఫ్ట్‌వేర్ తయారీ సంస్థ ఫిక్సార్
ఎందుకు : భారత మార్కెట్లో ప్రవేశించేందుకు...
GHI 2021: ప్రపంచ ఆకలి సూచీలో భారత్ ర్యాంకు?
భారత్‌ను ఆకలి సమస్య తీవ్రంగా బాధిస్తోంది. 2021 సంవత్సరానికి గాను రూపొందించిన ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబల్ హంగర్ ఇండెక్స్–జీహెచ్‌ఐ)లో 27.5 స్కోరుతో భారత్ 101వ స్థానంలో నిలిచింది. మొత్తం 116 దేశాల్లోని పరిస్థితులపై అక్టోబర్ రెండో వారంలో వెలువడిన ఈ సూచీని ఐరిష్ ఎయిడ్ ఏజెన్సీ అయిన ‘కన్సర్న్ వరల్డ్‌వైడ్’, జర్మనీకి చెందిన ‘వెల్ట్ హంగర్ హిల్ఫే’ సంస్థ సంయుక్తంగా రూపొందించాయి. సూచీ రూపకల్పనలో భాగంగా పౌష్టికాహార లోపం, పిల్లల్లో ఎదుగుదల, అయిదేళ్లలోపు పిల్లల్లో ఎత్తుకు తగ్గ బరువు, మాతా శిశు మరణాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. జీహెచ్‌ఐ–2020లో 107 దేశాలకు గాను భారత్ 94వ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ ఆకలి సూచీ(జీహెచ్‌ఐ)లో భారత్‌కు 101వ స్థానం
ఎప్పుడు : అక్టోబర్ రెండో వారం
ఎవరు : కన్సర్న్ వరల్డ్‌వైడ్, వెల్ట్ హంగర్ హిల్ఫే సంస్థలు
ఎక్కడ : ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 116 దేశాల్లో...
ఎందుకు : భారత్‌ను ఆకలి సమస్య తీవ్రంగా ఉండటంతో...
APTEL: విద్యుత్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ పదవికి ఎవరు అర్హులు?
విద్యుత్ అప్పిలేట్ ట్రిబ్యునల్(అప్పిలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ-ఏపీటీఈఎల్) చైర్మన్ ఎంపిక కోసం భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైంది. ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణితో పాటు కేంద్ర నూతన–పునరుత్పాదక ఇంధన శాఖ, పెట్రోలియం–సహజ వాయువుల శాఖల కార్యదర్శులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. రెండు పేర్లను కమిటీ సిఫార్సు చేస్తుంది. ట్రిబ్యునల్ చైర్మన్ స్థానంలో కొనసాగిన జస్టిస్ మంజులా చెల్లూర్ 2021, ఆగస్టు 12న పదవీ విరమణ చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు/ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా చేసిన వారే ఈ పదవికి అర్హులు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు
ఎప్పుడు : అక్టోబర్ 19
ఎందుకు : విద్యుత్ అప్పిలేట్ ట్రిబ్యునల్(అప్పిలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ) చైర్మన్ ఎంపిక కోసం...
World Statistics Day 2021: ప్రపంచ గణాంకాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
అధికారిక గణాంకాల ప్రాథమిక సూత్రాల ప్రాముఖ్యతను వివరించడం కోసం ప్రతి ఏడాది అక్టోబర్ 20న గణాంకాల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్ రూపొందించింది. ఈ మేరకు ఈ దినోత్సవాన్ని 2010 నుంచి గుర్తించడం మొదలైంది.
జాతీయ గణాంకాల దినోత్సవం: భారత్‌లో జూన్ 29న బెంగాల్‌కు చెందిన గణాంక శాస్రవేత్త ప్రశాంత చంద్ర మహలనోబిస్ జన్మదినం పురస్కరించుకుని జాతీయ గణాంకాల దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
యాదాద్రి క్షేత్రం ఏ జిల్లాలో ఉంది?
తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభ తేదీని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అక్టోబర్ 19న యాదాద్రిలో ప్రకటించారు. 2022 మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణతో గర్భాలయంలో స్వామి వారి దర్శనం భక్తులకు లభిస్తుందని తెలిపారు. ఆలయ పునఃప్రారంభ కార్యక్రమం త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో జరుగుతుందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ గణాంకాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
ఎప్పుడు : అక్టోబర్ 20
ఎక్కడ : ప్రపంచ వ్యాప్తంగా
ఎందుకు : అధికారిక గణాంకాల ప్రాథమిక సూత్రాల ప్రాముఖ్యతను వివరించడం కోసం...
చదవండి: Daily Current Affairs in Telugu: 2021, అక్టోబర్ 19 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్