Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 19 కరెంట్‌ అఫైర్స్‌

Non-Lethal Weapons

Non-Lethal Weapons: త్రిశూల్, వజ్ర పేర్లతో ఆయుధాలకు రూపకల్పన చేసిన సంస్థ?

భారత్, చైనా మధ్య గతంలో జరిగిన గల్వాన్‌ లోయ ఘర్షణల్లో... చైనా బలగాలు ఇనుపరాడ్లు, ఇనుప ముళ్లు లాంటి సంప్రదాయ ఆయుధాలతో భారత సైనికులపైకి దాడికి వచ్చిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో ఘర్షణల సమయంలో ప్రాణహాని కలిగించని ఆయుధాలనే వాడాలంటూ రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల మేరకు చైనా ఆర్మీ అప్పట్లో వీటిని ఉపయోగించింది. ఈ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని భారత బలగాలు దీటైన వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి.

సంప్రదాయ ఆయుధాలే...
చైనా సైన్యం(పీఎల్‌ఏ) వాడిన మాదిరిగా సంప్రదాయ ఆయుధాలనే భారత సైన్యం కూడా సమకూర్చుకుంటోంది. ఈ మేరకు బాధ్యతలను నోయిడాకు చెందిన అపాస్టెరాన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ త్రిశూల్, వజ్ర, సప్పర్‌ పంచ్‌(చేతికి వేసుకునే గ్లవ్స్‌ మాదిరిగా ఉండే ఆయుధం) వంటి పేర్లతో ప్రాణహాని కలిగించని సంప్రదాయ ఆయుధాలకు రూపకల్పన చేసింది. ఈ ఆయుధాల ద్వారా శత్రువుకు విద్యుత్‌ షాక్‌ తగిలేలా చేయవచ్చని అపాస్టెరాన్‌ సంస్థ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ మోహిత్‌ కుమార్‌ అక్టోబర్‌ 18న తెలిపారు. శివుని చేతిలో త్రిశూలం స్ఫూర్తిగా తీసుకుని ‘త్రిశూల్‌’ను తయారు చేశామన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : త్రిశూల్, వజ్ర, సప్పర్‌ పంచ్‌(చేతికి వేసుకునే గ్లవ్స్‌ మాదిరిగా ఉండే ఆయుధం) వంటి పేర్లతో సంప్రదాయ ఆయుధాల తయారీ
ఎప్పుడు  : అక్టోబర్‌ 18
ఎవరు    : అపాస్టెరాన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌  
ఎందుకు : భారత సైన్యం కోసం...


Covid-19: ఇటీవల కన్నుమూసిన కొలిన్‌ పావెల్‌ ఏ దేశస్థుడు?

Colin Powell

అమెరికా మాజీ జాయింట్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కొలిన్‌ పావెల్‌(84) కన్నుమూశారు. కోవిడ్‌ కారణంగా అక్టోబర్‌ 18న మేరిల్యాండ్‌ రాష్ట్రంలోని బెథెస్డాలో తుదిశ్వాస విడిచారు. అమెరికా ఆర్మీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ పదవి చేపట్టిన మొట్టమొదటి నల్లజాతీయుడిగా పేరు తెచ్చుకున్న ఆయన.. ఇరాక్‌పై యుద్ధాన్ని సమర్థించుకునే క్రమంలో అపప్రథ మూటగట్టుకున్నారు. డెమోక్రాటిక్, రిపబ్లికన్‌ పార్టీలకు చెందిన దేశాధ్యక్షుల హయాంలో ఆయన సమర్థవంతమైన సేవలందించారు.

హత్యకు గురైన బ్రిటిష్‌ ఎంపీ
యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)లో అధికార కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీ డేవిడ్‌ అమెస్‌(69)ను ఓ దుండగుడు అక్టోబర్‌ 15న కత్తితో పలుమార్లు పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఎస్సెక్స్‌లోని బెల్‌ఫెయిర్స్‌ మెథడిస్టు చర్చిలో ఈ ఘటన జరిగింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :  అమెరికా ఆర్మీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ పదవి చేపట్టిన మొట్టమొదటి నల్లజాతీయుడు కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్‌ 18
ఎవరు    : కొలిన్‌ పావెల్‌(84)
ఎక్కడ    : బెథెస్డా, మేరిల్యాండ్‌ రాష్ట్రం, అమెరికా
ఎందుకు : కోవిడ్‌ వైరస్‌ కారణంగా...


Tennis: ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్‌లో చాంపియన్‌గా అవతరించిన క్రీడాకారిణి?

Paula Badosa, Cameron Norrie

ప్రతిష్టాత్మక ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్‌ డబ్ల్యూటీఏ ప్రీమియర్, ఏటీపీ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీలో పౌలా బదోసా (స్పెయిన్‌), కామెరాన్‌ నోరి (బ్రిటన్‌) చాంపియన్స్‌గా అవతరించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో అక్టోబర్‌ 18న జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో పౌలా బదోసా 7–6 (7/5), 2–6, 7–6 (7/2)తో మాజీ నంబర్‌వన్‌ అజరెంకా (బెలారస్‌)పై గెలిచింది. తాజా గెలుపుతో బదోసా 14 స్థానాలు ఎగబాకి 27వ ర్యాంక్‌ నుంచి 13వ ర్యాంక్‌కు చేరుకుంది.

తొలి బ్రిటన్‌ ప్లేయర్‌...
పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో 26వ ర్యాంకర్‌ కామెరాన్‌ నోరి 3–6, 6–4, 6–1తో బాసిలాష్‌విలి (జార్జియా)పై గెలిచి ఈ టోర్నీ చరిత్రలో విజేతగా నిలిచిన తొలి బ్రిటన్‌ ప్లేయర్‌గా నిలిచాడు. చాంపియన్స్‌ బదోసా, నోరికి 12,09,730 డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ దక్కింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ప్రతిష్టాత్మక ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్‌ డబ్ల్యూటీఏ ప్రీమియర్‌ టోర్నీలో విజేతగా అవతరించిన క్రీడాకారిణి?
ఎప్పుడు    : అక్టోబర్‌ 18
ఎవరు    : పౌలా బదోసా (స్పెయిన్‌)
ఎక్కడ    : కాలిఫోర్నియా, అమెరికా
ఎందుకు    : మహిళల సింగిల్స్‌ ఫైనల్లో పౌలా బదోసా 7–6తో మాజీ నంబర్‌వన్‌ అజరెంకా (బెలారస్‌)పై విజయం సాధించడంతో...


Tokyo Olympics: వెయిట్‌లిఫ్టర్‌ చాను ఏ సంస్థ అంబాసిడర్‌గా నియమితులైంది?

Chanu and Bajrang

టోక్యో ఒలింపిక్స్‌–2020 విజేతలైన వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయ్‌ చాను, రెజ్లర్‌ బజరంగ్‌ పునియాలను బ్రాండ్‌ అంబాసిడర్లుగా నియమించుకున్నట్లు అమృతాంజన్‌ హెల్త్‌కేర్‌ వెల్లడించింది. జాయింట్‌ మజిల్‌ స్ప్రే, పెయిన్‌ ప్యాచ్, బ్యాక్‌ పెయిన్‌ రోల్‌ ఆన్‌ వంటి నొప్పి నివారణ ఉత్పత్తులకు వీరు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తారని సంస్థ సీఎండీ శంభు ప్రసాద్‌ అక్టోబర్‌ 18న తెలిపారు. 2021 ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌–2020లో  వెయిట్‌ లిఫ్టింగ్‌ మహిళల 49 కిలోల విభాగంలో రజత పతకం సాధించింది. ఇక రెజ్లింగ్‌ పురుషుల ఫ్రీస్టయిల్‌ 65 కేజీల విభాగం బజరంగ్‌ పూనియా కాంస్య పతకం గెలిచాడు.

హిస్సార్‌లో బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌
హరియాణ రాష్ట్రం హిస్సార్‌లో అక్టోబర్‌ 21 నుంచి జరిగే జాతీయ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనడం లేదని భారత స్టార్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ తెలిపింది. జాతీయ చాంపియన్‌షిప్‌ లో విజేతలుగా నిలిచిన వారిని మాత్రమే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులోకి ఎంపిక చేస్తారు. అయితే మేరీకోమ్‌ పాల్గొనే 48–51 కేజీల విభాగానికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని భారత బాక్సింగ్‌ సమాఖ్య (బీఎఫ్‌ఐ) భావిస్తోంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : అమృతాంజన్‌ హెల్త్‌కేర్‌ బ్రాండ్‌ అంబాసిడర్లుగా నియామకం
ఎప్పుడు : అక్టోబర్‌ 18
ఎవరు    : వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయ్‌ చాను, రెజ్లర్‌ బజరంగ్‌ పునియా 
ఎందుకు : సంస్థ ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా వ్యవహరించేందుకు...


High Court judge: ఏ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ రవినాథ్‌ ప్రమాణం చేశారు?

Justice Ravi Nath Tilhari

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి ప్రమాణం చేశారు. అక్టోబర్‌ 18న అమరావతిలోని హైకోర్టులో జరిగిన కార్యక్రమంలో తిల్హరి చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ప్రమాణం చేయించారు. అలహాబాద్‌ హైకోర్టు లక్నో బెంచ్‌లో న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్‌ తిల్హరీని ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసుకు ఇటీవల రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.

యాంఫి చైర్మన్‌గా బాలసుబ్రమణియన్‌
ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఏఎంసీ ఎండీ, సీఈవోగా ఉన్న ఏ.బాలసుబ్రమణియన్‌.. మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) చైర్మన్‌గా నియమితులయ్యారు. ఎడెల్‌వీజ్‌ ఏఎంసీ ఎండీ, సీఈవో రాధికా గుప్తా.. యాంఫి వైస్‌ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. కోటక్‌ ఏఎంసీ ఎండీ నీలేష్‌షా ఇప్పటి వరకు యాంఫి చైర్మన్‌గా వ్యవహరించగా.. వైస్‌ చైర్‌పర్సన్‌ బాధ్యతలను ఇన్వెస్కో ఏఎంసీ సీఈవో సౌరభ్‌ నానావతి చూశారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం
ఎప్పుడు : అక్టోబర్‌ 18
ఎవరు    : జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి
ఎక్కడ    : ఏపీ హైకోర్టు, అమరావతి, గుంటూరు జిల్లా
ఎందుకు : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉత్తర్వల మేరకు...


Covid-19 Vaccination: ఎక్కువమందికి టీకా వేసిన రాష్ట్రాల్లో తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం?

Covid Vaccine India Map

దేశంలో ఇప్పటివరకు 20.3 శాతం మందికి రెండు డోసుల కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసినట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి. ఈ గణాంకాల ప్రకారం.. ఎక్కువమందికి టీకా వేసిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కేరళ మొదటి స్థానంలో నిలిచింది. కేరళలో 36 శాతం మందికి వ్యాక్సిన్‌ వేశారు. కేరళ తర్వాత వరుసగా గుజరాత్‌(35.3 శాతం), న్యూఢిల్లీ(34 శాతం), జమ్మూకశ్మీర్‌(33.3 శాతం), ఆంధ్రప్రదేశ్‌(30.5 శాతం) నిలిచాయి.

ఆఫ్రికా దేశం టాంజానియా రాజధాని నగరం పేరు?
ఆఫ్రికా ఖండంలో ఎత్తయిన పర్వతం కిలిమంజారోను గుంటూరు జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రుడు కుందేటి నాగరాజు అధిరోహించారు. గుంటూరు జిల్లా అద్దేపల్లికి చెందిన నాగరాజు 1998లో అమెరికా వెళ్లి వాషింగ్టన్‌ డీసీలో స్థిరపడ్డారు. కిలిమంజారో పర్వతం ఆఫ్రికా దేశం టాంజానియాలో ఉంది.

టాంజానియా రాజధాని: డోడోమా; కరెన్సీ: టాంజానియన్‌ షిల్లింగ్‌
టాంజానియా ప్రస్తుత అధ్యక్షుడు: సమీయా సులుహు
టాంజానియా ప్రస్తుత ప్రధానమంత్రి: కస్సిమ్‌ మజలివా
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఎక్కువమందికి కరోనా టీకా వేసిన రాష్ట్రాల్లో తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం?
ఎప్పుడు  : అక్టోబర్‌ 18
ఎవరు    : కేరళ
ఎక్కడ    : దేశవ్యాప్తంగా...
ఎందుకు : కోవిడ్‌–19 నియంత్రణ కోసం...


FTA: ఏ దేశంతో భారత్‌ ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌ చేసుకోనుంది?

Jaishankar and Yair Lapid

భారత్, ఇజ్రాయెల్‌ దేశాల మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం (ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌–ఎఫ్‌టీఏ) జరగనుంది. ఈ ఒప్పంద విషయమై 2021, నవంబర్‌ నెలలో చర్చలు ప్రారంభంకానున్నాయి. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్, ఇజ్రాయెల్‌ ప్రత్యామ్నాయ ప్రధానిగా వ్యవహరిస్తున్న విదేశాంగ మంత్రి యయర్‌ లాపిడ్‌ అక్టోబర్‌ 18న జెరూసలేంలో జరిపిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎఫ్‌టీఏపై గత పదేళ్లుగా కొనసాగుతున్న చర్చలను త్వరగా పునఃప్రారంభించి వచ్చే జూన్‌ నాటికి ముగించాలని ప్రతిపాదించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జైశంకర్‌ ఇజ్రాయెల్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

ఇజ్రాయెల్‌ రాజధాని: జెరూసలేం; కరెన్సీ: న్యూ షెకెల్‌
ఇజ్రాయెల్‌ ప్రస్తుత అధ్యక్షుడు: ఐజాక్‌ హెర్జోగ్‌
ఇజ్రాయెల్‌ ప్రస్తుత ప్రధానమంత్రి: నాఫ్తాలి బెన్నెట్‌
ఇజ్రాయెల్‌ ప్రత్యామ్నాయ ప్రధాని: యయర్‌ లాపిడ్‌ 
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఏ దేశంతో భారత్‌ ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌ చేసుకోనుంది?
ఎప్పుడు : అక్టోబర్‌ 18
ఎవరు    : ఇజ్రాయెల్‌
ఎందుకు : భారత్, ఇజ్రాయెల్‌ దేశాల మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్యం కోసం...


Innovation Award 2021: క్లారివేట్‌ అవార్డును అందుకున్న ప్రభుత్వ రంగ సంస్థ?

BHEL Clarivate Award

ప్రభుత్వ రంగ ఇంజనీరింగ్‌ దిగ్గజం భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) తాజాగా క్లారివేట్‌ సౌత్, సౌత్‌ ఈస్ట్‌ ఏషియా ఇన్నోవేషన్‌ అవార్డ్‌ దక్కించుకుంది. అత్యంత వినూత్న కంపెనీగా 2021 సంవత్సరానికిగాను భారీ పరిశ్రమల విభాగంలో సంస్థకు ఈ గౌరవం దక్కింది. అక్టోబర్‌ 18న న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో క్లారివేట్‌ ప్రతినిధి రజత్‌ సిక్కా నుంచి ఈ అవార్డును బీహెచ్‌ఈఎల్‌ అధికారి రేణుక గెరా స్వీకరించారు. 2018, 2020లోనూ క్లారివేట్‌ అవార్డ్‌ను బీహెచ్‌ఈఎల్‌ సొంతం చేసుకుంది. 1956లో స్థాపితమైన బీహెచ్‌ఈఎల్‌ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.

ఎల్‌అండ్‌టీతో వొడాఫోన్‌ జట్టు
5జీ ఆధారిత స్మార్ట్‌ సిటీ సొల్యూషన్స్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు నిర్మాణ రంగ దిగ్గజం లార్సన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌అండ్‌టీ)తో టెలికం సంస్థ వొడాఫోనా ఐడియా (వీఐఎల్‌) జట్టుకట్టింది. ప్రభుత్వం కేటాయించిన స్పెక్ట్రంతో ప్రస్తుతం నిర్వహిస్తున్న 5జీ ట్రయల్స్‌లో ఇది భాగంగా ఉంటుందని వీఐఎల్‌ వెల్లడించింది. పుణెలో ఈ పైలట్‌ ప్రాజెక్టును నిర్వహించనున్నట్లు పేర్కొంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : క్లారివేట్‌ సౌత్, సౌత్‌ ఈస్ట్‌ ఏషియా ఇన్నోవేషన్‌ అవార్డు-2021ను అందుకున్న ప్రభుత్వ రంగ సంస్థ?
ఎప్పుడు  : అక్టోబర్‌ 18
ఎవరు    : భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌)
ఎక్కడ    : న్యూఢిల్లీ

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 18 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 19 Oct 2021 08:12PM

Photo Stories