Daily Current Affairs in Telugu: 2021, అక్టోబర్ 18 కరెంట్ అఫైర్స్
IPL 2021: ఐపీఎల్ 14వ సీజన్‌లో విజేతగా నిలిచిన జట్టు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)–2021(ఐపీఎల్ 14వ సీజన్) విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు నిలిచింది. అక్టోబర్ 15న యూఏఈలోని దుబాయ్‌లో ఉన్న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో చెన్నై 27 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులే చేయగలిగింది. తాజా విజయంతో చెన్నై జట్టు నాలుగోసారి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్నట్లయింది. చెన్నై జట్టుకు ఎమ్‌ఎస్ ధోని కెప్టెన్‌గా వ్యవహరించగా, కోల్‌కతా జట్టుకు ఇయోన్ మోర్గాన్ సారథ్యం వహించాడు.
ఐపీఎల్–2021 అవార్డులు
- ఆరెంజ్ క్యాప్(అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్): రుతురాజ్ గైక్వాడ్ 635 పరుగులు(చెన్నై సూపర్ కింగ్స్); ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు
- ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్: రుతురాజ్ గైక్వాడ్; ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు
- పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్): హర్షల్ పటేల్(32 వికెట్లు), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు; ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు
- మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్: హర్షల్ పటేల్; ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు
- గేమ్ చేంజర్ ఆఫ్ ద సీజన్: హర్షల్ పటేల్; ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు
- పర్‌ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్: రవి బిష్ణోయ్ (పంజాబ్ కింగ్స్); ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు
- సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్: హెట్‌మైర్(ఢిల్లీ క్యాపిటల్స్); ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు
- పవర్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్: వెంకటేశ్ అయ్యర్(కోల్‌కతా నైట్‌రైడర్స్); ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు
- అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్: కేఎల్ రాహుల్ (30 సిక్స్‌లు), పంజాగ్ కింగ్స్; ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు
- ఫెయిర్ ప్లే టీమ్ ఆఫ్ ద సీజన్: రాజస్తాన్ రాయల్స్
మరికొన్ని అంశాలు...
- టి20ల్లో కెప్టెన్‌గా ధోనికిది 300వ మ్యాచ్. భారత జట్టుతో పాటు చెన్నై, పుణే, ఇండియన్స్ టీమ్‌లకు అతను సారథిగా వ్యవహరించాడు. అతని నాయకత్వంలో 177 మ్యాచ్‌లలో గెలుపు, 118 మ్యాచ్‌లలో పరాజయాలు ఎదురయ్యాయి. 2 మ్యాచ్‌లు ‘టై’ కాగా, మరో 3 మ్యాచ్‌లలో ఫలితం రాలేదు.
- సచిన్ టెండూల్కర్ (2010), రాబిన్ ఉతప్ప (2014), కోహ్లి (2016), కేఎల్ రాహుల్ (2020) తర్వాత ఐపీఎల్‌లో ‘ఆరెంజ్ క్యాప్’ గెలిచిన ఐదో భారత క్రికెటర్ రుతురాజ్.
- చెన్నై జట్టు తాజా విజయంతో... టి20 ఫార్మాట్‌లో అత్యధిక టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో రికార్డు నెలకొల్పాడు. 15 టైటిల్స్‌తో వెస్టిండీస్‌కే చెందిన కీరన్ పొలార్డ్ పేరిట ఉన్న రికార్డును బ్రావో బద్దలు కొట్టాడు.
ఏడాది | విజేత |
2008 | రాజస్తాన్ రాయల్స్ |
2009 | దక్కన్ చార్జర్స్ |
2010 | చెన్నై సూపర్ కింగ్స్ |
2011 | చెన్నై సూపర్ కింగ్స్ |
2012 | కోల్‌కతా నైట్‌రైడర్స్ |
2013 | ముంబై ఇండియన్స్ |
2014 | కోల్‌కతా నైట్‌రైడర్స్ |
2015 | ముంబై ఇండియన్స్ |
2016 | సన్‌రైజర్స్ హైదరాబాద్ |
2017 | ముంబై ఇండియన్స్ |
2018 | చెన్నై సూపర్ కింగ్స్ |
2019 | ముంబై ఇండియన్స్ |
2020 | ముంబై ఇండియన్స్ |
2021 | చెన్నై సూపర్ కింగ్స్ |
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐపీఎల్ 14వ సీజన్(ఐపీఎల్–2021)లో విజేతగా నిలిచిన జట్టు?
ఎప్పుడు : అక్టోబర్ 15
ఎవరు : చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు
ఎక్కడ : దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్, యూఏఈ
ఎందుకు : ఫైనల్లో చెన్నై 27 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)పై విజయం సాధించినందున...
SAFF 2021: శాఫ్ చాంపియన్‌షిప్‌లో ఎనిమిదోసారి విజేతగా నిలిచిన జట్టు?
దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) చాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఎనిమిదోసారి విజేతగా నిలిచింది. మాల్దీవుల రాజధాని మాలీలో అక్టోబర్ 16న జరిగిన ఫైనల్లో సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత జట్టు 3–0 గోల్స్ తేడాతో నేపాల్ జట్టుపై గెలిచింది. భారత్ తరఫున సునీల్ ఛెత్రి, సురేశ్ సింగ్, అబ్దుల్ సమద్ ఒక్కో గోల్ చేశారు. ఈ మ్యాచ్‌లో చేసిన గోల్‌తో సునీల్ ఛెత్రి ప్రస్తుతం అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆడుతున్న వారిలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో లయెనెల్ మెస్సీ (అర్జెంటీనా–80 గోల్స్)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానానికి చేరాడు. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్–115 గోల్స్) టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు.
సౌరాష్ట్ర క్రికెటర్ అవి బరోట్ హఠాన్మరణం
భారత అండర్–19 క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, సౌరాష్ట్ర రంజీ ప్లేయర్ అవి బరోట్(29) మరణించాడు. అక్టోబర్ 15న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గుండెపోటు కారణంగా హఠాన్మరణం చెందాడు. బరోట్ తన కెరీర్‌లో 38 ఫస్ట్‌క్లాస్, 38 లిస్ట్ ‘ఎ’, 20 టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2019–20 రంజీ ట్రోఫీ చాంపియన్‌గా నిలిచిన సౌరాష్ట్ర జట్టులో సభ్యుడిగానూ ఉన్నాడు. 2011లో అండర్–19 భారత జట్టుకు సారథిగా కూడా బరోట్ వ్యవహరించాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) చాంపియన్‌షిప్–2021లో విజేతగా నిలిచిన జట్టు?
ఎప్పుడు : అక్టోబర్ 16
ఎవరు : భారత జట్టు
ఎక్కడ : మాలీ, మాల్దీవులు
ఎందుకు : ఫైనల్లో సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత జట్టు 3–0 గోల్స్ తేడాతో నేపాల్ జట్టుపై గెలవడంతో...
Badminton: థామస్ కప్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన జట్టు?
థామస్ కప్ పురుషుల టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్–2020లో ఇండోనేసియా జట్టు విజేతగా నిలిచింది. డెన్మార్క్‌లోని అర్హుస్ నగరంలో 2021, అక్టోబర్ 17న జరిగిన ఫైనల్లో ఇండోనేసియా జట్టు 3–0తో చైనా జట్టుపై గెలిచి 14వసారి థామస్ కప్‌ను సొంతం చేసుకుంది. చివరిసారి ఇండోనేసియా జట్టు 2002లో ఈ మెగా చాంపియన్‌పిష్‌ను దక్కించుకుంది. మరోవైపు ఉబెర్ కప్ మహిళల టీమ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో చైనా 3–1తో జపాన్‌ను ఓడించి 15వసారి చాంపియన్‌గా నిలిచింది. 2020 ఏడాది జరగాల్సిన థామస్ కప్‌ను కరోనా మహమ్మారి కారణంగా 2021 ఏడాదికి వాయిదా వేశారు.
రన్నరప్‌గా తరుణ్...
సైప్రస్ ఇంటర్నేషనల్ ఫ్యూచర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్-2021లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ ప్లేయర్ కాటం తరుణ్ రెడ్డి రన్నరప్‌గా నిలిచాడు. సైప్రస్ రాజధాని నగరం నికోసియాలో అక్టోబర్ 17న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 20 ఏళ్ల తరుణ్ రెడ్డి 20–22, 21–9, 11–21తో నాలుగో సీడ్ దిమిత్రీ పనారిన్ (కజకిస్తాన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : థామస్ కప్ పురుషుల టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్–2020లో విజేతగా నిలిచిన జట్టు?
ఎప్పుడు : అక్టోబర్ 17, 2021
ఎవరు : ఇండోనేసియా జట్టు
ఎక్కడ : అర్హుస్, డెన్మార్క్
ఎందుకు : ఫైనల్లో ఇండోనేసియా జట్టు 3–0తో చైనా జట్టుపై గెలిచినందున...
Ordnance Factory Board: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను విలీనం చేసింది?
రక్షణరంగ ఉత్పత్తులకు సంబంధించి కొత్తగా ఏర్పాటు చేసిన ఏడు కార్పొరేషన్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 15న ప్రారంభించారు. ఢిల్లీలోని డీఆర్డీఓ భవన్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్, డిఫెన్స్ ప్రొడక్షన్, డిఫెన్స్ మినిస్ట్రీ కింద దేశ వ్యాప్తంగా ఉన్న 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలతో ఈ కొత్త సంస్థలు ఏర్పడ్డాయి. ఈ సంస్థలు సాయుధ దళాలకు సంబంధించి వివిధ రకాల ఉత్పత్తులను సరఫరా చేయనున్నాయి. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ... ఈ ఏడు సంస్థలు వంద శాతం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తాయని పేర్కొన్నారు.
కొత్తగా ఏర్పాటైన ఏడు సంస్థలు...
1 . యంత్రా ఇండియా లిమిటెడ్ (YIL)
2. అడ్వాన్స్‌డ్ వెపన్స్ అండ్ ఎక్విమెంట్ ఇండియా లిమిటెడ్ (AWE India)
3. ఆర్మర్డ్ వెహికిల్స్ నిగమ్ లిమిటెడ్ (AVANI)
4. ట్రూప్ కంఫోర్ట్స్ లిమిటెడ్ (TCL)
5. మునిషన్స్ ఇండియా లిమిటెడ్ (MIL)
6. ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ (IOL)
7. గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్ (GIL)
క్విక్ రివ్యూ :
ఏమిటి : 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను విలీనం చేస్తూ ఏర్పాటు చేసిన ఏడు కొత్త సంస్థల ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 16
ఎవరు : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : డీఆర్డీఓ భవన్, ఢిల్లీ
ఎందుకు : సంస్థల సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు...
The Challenge: అంతరిక్షంలో సినిమా చిత్రీకరించిన తొలి దేశం?
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 12 రోజుల పాటు సినిమా షూటింగ్ విజయవంతంగా ముగించుకుని రష్యా సినిమా బృందం తిరిగి భూమికి చేరుకుంది. ఒలెగ్ నోవిట్‌స్కీ(వ్యోమగామి), యులియా పెరెసిల్డ్(నటి), క్లిమ్ షిపెంకో(దర్శకుడు)లతో కూడిన సోయుజ్ అంతరిక్ష నౌక అక్టోబర్ 17న కజకిస్తాన్‌లోని మైదాన ప్రాంతంలో దిగింది. ‘‘ది చాలెంజ్’’ అనే సినిమా చిత్రీకరణ కోసం దర్శకుడు షిపెంకో, నటి యులియాతో కలిసి 2021, అక్టోబర్ 5వ తేదీన అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఐఎస్‌ఎస్‌లోనే ఉన్న వ్యోమగామి నోవిట్‌స్కీతో కలిసి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అక్కడ షూటింగ్ ముగియడంతో వీరు భూమిని చేరుకున్నారు. దీంతో అంతరిక్షంలో సినిమా చిత్రీకరించిన తొలి దేశంగా రష్యా నిలిచింది. ‘ఛాలెంజ్’ను రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్ సాయంతో ప్రభుత్వ టీవీ ‘చానెల్ వన్’ నిర్మిస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతరిక్షంలో సినిమా చిత్రీకరించిన తొలి దేశం?
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : రష్యా
ఎక్కడ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)
ఎందుకు : ది చాలెంజ్ సినిమా కోసం రష్యా సినిమా బృందం అంతరిక్షంలో షూటింగ్ విజయవంతంగా జరపడంతో...
Konark Sun Temple: కోణార్క్ సాంకేతికత స్పూర్తిగా ఏ ఆలయాన్ని నిర్మించనున్నారు?
సూర్యుని కిరణాలు ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున అయోధ్య భవ్య రామమందిరం గర్భగుడిలోని శ్రీరాముని విగ్రహం(రామ్‌లల్లా)పై పడేలా నిర్మాణం చేపడతామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ఒడిశా ఒడిశాలోని 13వ శతాబ్దం నాటి కోణార్క్ సూర్యదేవాలయం నిర్మాణాన్ని స్ఫూర్తిగా తీసుకుని, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో చర్చలు జరిపి ఈ మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అక్టోబర్ 17న తెలిపింది. ఇందుకోసం, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్, ఢిల్లీ, ముంబై, రూర్కీ ఐఐటీలకు చెందిన నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేశామని పేర్కొంది. 2023 డిసెంబర్ కల్లా గర్భగుడి నిర్మాణం పూర్తవుతుందని వివరించింది. ఒడిశా రాష్ట్రం పూరి జిల్లాలో ఉన్న కోణార్క్ సూర్యదేవాలయాన్ని గంగావంశానికి చెందిన లాంగులా నరసింహదేవ I నిర్మించాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కోణార్క్ సూర్యదేవాలయ సాంకేతికత స్పూర్తిగా అయోధ్య రాయాలయ నిర్మాణం
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్
ఎక్కడ : అయోధ్య, ఫైజాబాద్ జిల్లా, ఉత్తరప్రదేశ్
S Jaishankar: ప్రస్తుతం ఇజ్రాయెల్ అధ్యక్షునిగా ఎవరు ఉన్నారు?
భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఇజ్రాయెల్‌లో తన ఐదు రోజుల పర్యటనను అక్టోబర్ 17న ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్, ప్రధాని నాఫ్తాలి బెన్నెట్‌తో చర్చలు జరుపుతారు. వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంతోపాటు, దైపాక్షిక సహకారాన్ని పెంచుకునేందుకు అవకాశం ఉన్న రంగాలను అన్వేషిస్తారు. అక్టోబర్ 17న ఆయన రక్షణ సహా వివిధ రంగాలకు చెందిన ఇజ్రాయెల్ వాణిజ్యవేత్తలతో సమావేశమై భారత్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు.
బంగ్లాదేశ్‌లో మత కలహాలు
దుర్గాపూజల సందర్భంగా దైవదూషణకు పాల్పడ్డారనే ఆరోపణలతో బంగ్లాదేశ్‌లో మొదలైన మత కలహాలు కొనసాగుతున్నాయి. అక్టోబర్ 16న దుండగులు మున్షిగంజ్‌లోని కాళీ మందిరంలోని ఆరు విగ్రహాలను ధ్వంసం చేశారని వార్తా సంస్థలు తెలిపాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ అధ్యక్షునిగా అబ్దుల్ హమీద్, ప్రధానిగా షేక్ హసీనాఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇజ్రాయెల్ పర్యటన ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్
ఎందుకు : వ్యూహాత్మక, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్, ప్రధాని నాఫ్తాలి బెన్నెట్‌తో చర్చలు జరిపేందుకు...
Statue of Unity: రాష్ట్రీయ ఏక్తా దివస్‌ను ఎప్పుడు నిర్వహించనున్నారు?
గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలోని కేవాడియాలో సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ ఐక్యతా శిల్పం సందర్శనను అక్టోబర్ 28 నుంచి నవంబర్ 1వ తేదీ దాకా నిలిపివేస్తున్నట్లు అధికారులు అక్టోబర్ 17న ప్రకటించారు. పటేల్ 147వ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవాలను(రాష్ట్రీయ ఏక్తా దివస్) నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రీయ ఏక్తా దివస్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి వీలుగా సందర్శకుల రాకను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’(ఐక్యతా విగ్రహం)పేరుతో నిర్మించిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంను పటేల్ 143వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2018, అక్టోబర్ 31న ఆవిష్కరించారు.
నర్సరీ రాజ్యానికి రారాజు పుస్తకావిష్కరణ
ఎమెస్కో బుక్స్ ప్రచురించిన ‘‘నర్సరీ రాజ్యానికి రారాజు–పల్ల వెంకన్న’’ పుస్తకాన్ని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. అక్టోబర్ 17న హైదరాబాద్‌లో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ పుస్తకాన్ని జి.వల్లీశ్వర్ రచించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్టాట్యూ ఆఫ్ యూనిటీ(ఐక్యతా విగ్రహం) సందర్శన నిలిపివేత
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : ప్రభుత్వం
ఎక్కడ : కేవాడియా, నర్మదా జిల్లా, గుజరాత్ రాష్ట్రం
ఎందుకు : రాష్ట్రీయ ఏక్తా దివస్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి వీలుగా...
చదవండి: Daily Current Affairs in Telugu: 2021, అక్టోబర్ 16 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్