Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 12 కరెంట్‌ అఫైర్స్‌

Nobel Prize 2021 in Economics

Nobel Prize: ఆర్థిక నోబెల్‌ పురస్కారం–2021

సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు సహజ పరిశోధనలతో వినూత్న పరిష్కార మార్గాలను సూచించిన అమెరికాకు చెందిన ముగ్గురు ఆర్థికవేత్తలు డేవిడ్‌ కార్డ్‌ (65), జాషువా ఆంగ్రిస్ట్‌(61), గైడో ఇంబెన్స్‌(58)లకు 2021 ఏడాది ఆర్థిక నోబెల్‌ పురస్కారం లభించింది. స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోమ్‌లో ఉన్న రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఈ విషయాన్ని అక్టోబర్‌ 11న ప్రకటించింది. నోబెల్‌ బహుమతిగా లభించే 11.45లక్షల డాలర్లలో సగం మొత్తం డేవిడ్‌ కార్డ్‌కు, మిగతా సగాన్ని జాషువా, గైడోలకు పంచుతారు.

డేవిడ్‌ కార్డ్‌...

  • 1956లో కెనడాలో జన్మించి అమెరికాలో స్థిరపడిన డేవిడ్‌ కార్డ్‌... అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ(1983) చేశారు.
  • ప్రస్తుతం కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
  • 1980వ దశకంలో అలెన్‌ క్రూగర్‌తో కలిసి వలస కార్మిక విపణి, కనీస వేతనాలపై పరిశోధన సాగించారు.
  • ఈ రంగాల్లో సంప్రదాయ భావనలను సవాల్‌ చేసేలా వినూత్న విశ్లేషణలను, లోతైన పరిజ్ఞానాన్ని అందించారు. కనీస వేతనాలను పెంచడం వల్ల ఇతరులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయనే ఆందోళన అవసరంలేదని నిరూపించారు. 
  • వలస కార్మికుల వల్ల స్వదేశంలోని వ్యక్తుల ఆదాయం వృద్ధిచెందడంతోపాటు పలు ప్రయోజనాలు కలుగుతాయని స్పష్టం చేశారు. డేవిడ్‌ కార్డ్‌ ఈ అంశాన్ని నిరూపించే వరకు కొత్త వలసలపై ప్రతికూలమైన అభిప్రాయాలు ఉండేవి. 
  • డేవిడ్‌ కార్డ్‌కు మిత్రుడైన అలెన్‌ క్రూగర్‌ గతంలోనే నోబెల్‌ ప్రైజ్‌ గెలుచుకున్నారు. అలెన్‌ 58 ఏళ్ల వయసులో 2019లో మరణించారు.

జాషువా, డేవిడ్‌...

  • అమెరికాలోని కొలంబస్‌లో 1960లో జన్మించిన జాషువా... ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ చేశారు. ప్రస్తుతం మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా ఉన్నారు.
  • 1963లో నెదర్లాండ్స్‌లో జన్మించి అమెరికాలో స్థిరపడిన డేవిడ్‌  అమెరికాలోని బ్రౌన్‌ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ చేశారు. ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా ఉన్నారు.
  • వీరిద్దరూ వ్యక్తులపై సుదీర్ఘ విద్య చూపేప్రభావాన్ని విశ్లేషించారు.
  • ఒక బృందంలోని వ్యక్తుల చదువును ఏడాదిపాటు పొడిగించినప్పుడు వారందరిపై పడే ప్రభావం ఒకే విధంగా ఉండదని, దీనిపై ఒక నిశ్చితాభిప్రాయానికి రాలేమని అప్పటి వరకు అనుకునేవారు. కానీ, 1990లో ఇదే అంశంపై సహజ పరిశోధనలను కొనసాగించిన జాషువా, డేవిడ్‌ విధాన ప్రకియలో ఎదురవుతున్న సమస్యను పరిష్కరించారు.
  • సహజ పరిశోధనల ద్వారా కార్యకారణ సంబంధాన్ని విశ్లేషిస్తూ కచ్చితమైన నిర్ధారణలకు రావచ్చని నిరూపించారు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి : ఆర్థిక నోబెల్‌ పురస్కారం–2021 విజేతలు
ఎప్పుడు : అక్టోబర్‌ 11
ఎవరు : డేవిడ్‌ కార్డ్‌ (65), జాషువా ఆంగ్రిస్ట్‌(61), గైడో ఇంబెన్స్‌(58) 
ఎందుకు : సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు సహజ పరిశోధనలతో వినూత్న పరిష్కార మార్గాలను సూచించినందున...


ISpA: ఇండియన్‌ స్పేస్‌ అసోసియేషన్‌ ప్రధాన ఉద్దేశం?

 

అంతరిక్ష రంగంలో భాగస్వామ్య పక్షాలకు సహకారం అందించేందుకు ఉద్దేశించిన భారత అంతరిక్ష సంఘం(ఇండియన్‌ స్పేస్‌ అసోసియేషన్‌–ఐఎస్‌పీఏ) ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్‌ 11న న్యూఢిల్లీ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఐఎస్‌పీఏను ప్రారంభించి, ప్రసంగించారు. అంతరిక్ష రంగం ప్రభుత్వ రంగానికి పర్యాయపదంగా మారిందని, ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా  మోదీ అన్నారు. ఐఎస్‌పీఏ అనేది అంతరిక్ష, ఉపగ్రహ సంబంధిత అగ్రశ్రేణి పరిశ్రమల సంఘం. ఇందులో ఎల్‌ అండ్‌ టీ, నెల్కో(టాటా గ్రూప్‌), వన్‌ వెబ్, భారతీ ఎయిర్‌టెల్, మ్యాప్‌మైఇండియా, వాల్‌చంద్‌నగర్‌ ఇండస్ట్రీస్, అనంత్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ సంస్థలు వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నాయి. గోద్రేజ్, హ్యూస్‌ ఇండియా, అజిస్టా–బీఎస్‌టీ ఏరోస్పేస్‌ ప్రైవేటు లిమిటెడ్, బీఈఎల్, సెంటమ్‌ ఎలక్ట్రానిక్స్, మాక్సర్‌ ఇండియా కోర్‌ సభ్యులుగా ఉన్నాయి.

తొలి చైర్మన్‌గా జయంత్‌ పాటిల్‌...
ఐఎస్‌పీఏ తొలి చైర్మన్‌గా ఎల్‌అండ్‌టీ సీనియర్‌ ఈవీపీ జయంత్‌ పాటిల్‌ చైర్మన్‌గాను, భారతి ఎయిర్‌టెల్‌ చీఫ్‌ రెగ్యులేటరీ ఆఫీసర్‌ రాహుల్‌ వత్స్‌ వైస్‌ చైర్మన్‌గాను వ్యవహరిస్తారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారత అంతరిక్ష సంఘం(ఇండియన్‌ స్పేస్‌ అసోసియేషన్‌–ఐఎస్‌పీఏ) 
ఎప్పుడు : అక్టోబర్‌ 11
ఎవరు    : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎందుకు : అంతరిక్ష రంగంలో భాగస్వామ్య పక్షాలకు సహకారం అందించేందుకు...


Danish PM: ప్రధాని మోదీతో సమావేశమైన డెన్మార్క్‌ ప్రధాని పేరు?

PM Modi and Denmark PM

భారత ప్రధాని నరేంద్ర మోదీతో డెన్మార్క్‌ ప్రధాని మెటె ఫ్రెడెరిక్‌సెన్‌ సమావేశమయ్యారు. అక్టోబర్‌ 9న న్యూఢిల్లీలో జరిగిన ఈ భేటీలో ఇండో డెన్మార్క్‌ గ్రీన్‌ స్ట్రాటజిక్‌ భాగస్వామ్య పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. ఆరోగ్య, వ్యవసాయ, నీటి నిర్వహణ, వాతావరణ మార్పు, పునర్వినియోగ ఇంధనాల విషయంలో సహకారాన్ని మరింత పెంచుకునేందుకు అంగీకరించారు. నాలుగు అంశాలపై రెండు దేశాల మధ్య ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా భారత్, డెన్మార్క్‌ దేశాలు 2020 ఏడాదిలో గ్రీన్‌స్ట్రాటజిక్‌ ఒప్పందాన్ని చేసుకున్నాయి.

యూకే ప్రధానితో చర్చలు
భారత్‌ అందజేస్తున్న కరోనా వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లను గుర్తిస్తూ యూకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇరు దేశాల ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, బోరిస్‌ జాన్సన్‌ స్వాగతించారు. ఇరువురు నేతలు అక్టోబర్‌ 11న ఫోన్‌లో మాట్లాడుకున్నారు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్‌ ప్రభుత్వంతో వ్యవహరించే విషయంలో ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని వారిద్దరూ పేర్కొన్నారు. కోవిడ్‌–19 మహమ్మారిపై కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించుకున్నారు. .‘భారత్‌–యూకే రోడ్‌మ్యాప్‌ 2030’ ప్రగతిని సమీక్షించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం
ఎప్పుడు  : అక్టోబర్‌ 9
ఎవరు    : డెన్మార్క్‌ ప్రధాని మెటె ఫ్రెడెరిక్‌సెన్‌
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : ఆరోగ్య, వ్యవసాయ, నీటి నిర్వహణ, వాతావరణ మార్పు, పునర్వినియోగ ఇంధనాలు వంటి విషయాలపై చర్చలు జరిపేందుకు...


Female Prime Minister: ట్యునీసియా తొలి మహిళా ప్రధాని బాధ్యతలు చేపట్టిన నేత?

Najla Bouden

ఆఫ్రికా దేశం ట్యునీసియా ప్రథమ మహిళా ప్రధానమంత్రిగా నజ్లా బౌడెన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. దేశ రాజధాని ట్యునిస్‌లో అక్టోబర్‌ 11న జరిగిన ఈ కార్యక్రమంలో బౌడెన్‌ మాట్లాడుతూ... అవినీతిపై పోరాటమే తమ లక్ష్యమని ప్రకటించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం 24 మంత్రులతో కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. వీరిలో ప్రధానితో కలిపి అత్యధిక సంఖ్యలో 10 మంది మహిళలే ఉండటం గమనార్హం. ట్యునీసియా అధ్యక్షుడు కైస్‌ సయీద్‌ దాదాపు రెండు నెలల క్రితం అప్పటి కేబినెట్‌ను బర్తరఫ్‌ చేసి, సర్వాధికారాలను చేజిక్కించుకున్నారు. అనంతరం సెప్టెంబర్‌ 29వ తేదీన ఆయన ప్రధాని పదవికి బౌడెన్‌ పేరును ప్రతిపాదించారు. దీంతో బౌడెన్‌ ప్రధాని పదవిని చేపట్టారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆఫ్రికా దేశం ట్యునీసియా ప్రథమ మహిళా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : అక్టోబర్‌ 11
ఎవరు    : నజ్లా బౌడెన్‌
ఎక్కడ    : ట్యునిస్, ట్యునీసియా 
ఎందుకు : ట్యునీసియా అధ్యక్షుడు కైస్‌ సయీద్‌ నిర్ణయం మేరకు...


World Record: అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో సెంచరీ చేసిన పిన్న వయస్కురాలు?

Amy Hunter

అంతర్జాతీయ క్రికెట్‌లో (పురుషులు, మహిళలు కలిపి) వన్డేల్లో సెంచరీ సాధించిన పిన్న వయస్కురాలిగా ఐర్లాండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు బ్యాటర్‌ ఎమీ హంటర్‌ ప్రపంచ రికార్డు సృష్టించింది. జింబాబ్వే రాజధాని హరారేలో అక్టోబర్‌ 11న జింబాబ్వేతో జరిగిన చివరిదైన నాలుగో వన్డేలో 16 ఏళ్ల ఎమీ హంటర్‌ ఈ ఘనత నమోదు చేసింది. అక్టోబర్‌ 11నే తన 16వ జన్మదినాన్ని జరుపుకున్న ఎమీ హంటర్‌ 127 బంతుల్లో 8 ఫోర్లతో 121 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఈ క్రమంలో 22 ఏళ్లుగా భారత క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ పేరిట ఉన్న ఈ రికార్డును ఎమీ హంటర్‌ బద్దలు కొట్టింది. 1999లో జూన్‌ 26న ఐర్లాండ్‌ జట్టుతో జరిగిన వన్డేలో 16 ఏళ్ల 205 రోజుల వయసులో మిథాలీ రాజ్‌ (114 నాటౌట్‌) సెంచరీ సాధించింది. పురుషుల క్రికెట్‌లో ఈ రికార్డు పాకిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది పేరిట ఉంది. 1996లో అక్టోబర్‌ 4న శ్రీలంకతో జరిగిన వన్డేలో 16 ఏళ్ల 217 రోజుల వయసులో అఫ్రిది (102 పరుగులు) శతకం సాధించాడు.

భారత బాక్సింగ్‌ కోచ్‌లుగా నియమితులైన క్రీడాకారులు?
భారత మాజీ బాక్సర్లు దేవేంద్రో సింగ్, సురంజయ్‌ సింగ్‌ కోచ్‌లుగా మారారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత బాక్సర్లకు నిర్వహించే శిక్షణ శిబిరం కోసం ఎంపిక చేసిన 14 మంది కోచ్‌లలో దేవేంద్రో, సురంజయ్‌లకు స్థానం లభించింది. 35 ఏళ్ల సురంజయ్‌ 2009 ఆసియా చాంపియన్‌షిష్, 2010 కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణాలు నెగ్గాడు. 29 ఏళ్ల దేవేంద్రో  2014 కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజతం గెలిచాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో సెంచరీ చేసిన పిన్న వయస్కురాలు?
ఎప్పుడు  : అక్టోబర్‌ 11
ఎవరు    : ఐర్లాండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు బ్యాటర్‌ ఎమీ హంటర్‌
ఎక్కడ    : హరారే, జింబాబ్వే
ఎందుకు : జింబాబ్వేతో జరిగిన చివరిదైన నాలుగో వన్డేలో 16 ఏళ్ల ఎమీ హంటర్‌ 127 బంతుల్లో 8 ఫోర్లతో 121 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచినందున...


Civil Aviation Ministry: కేంద్రం అనుమతులు పొందిన కొత్త విమానయాన సంస్థ?

Akash Air

ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా కొత్త విమానయాన సంస్థ ‘ఆకాశ ఎయిర్‌’కు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. భారత పౌర విమానయాన శాఖ ‘నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌వోసీ)’ జారీ చేసినటు అక్టోబర్‌ 11న కంపెనీ వెల్లడించింది. దీనితో 2022 వేసవి నాటికి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని ఆకాశ ఎయిర్‌ హోల్డింగ్‌ సంస్థ ఎస్‌ఎన్‌వీ ఏవియేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేర్కొంది. రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ఇన్వెస్ట్‌ చేస్తున్న ఆకాశ ఎయిర్‌ బోర్డులో ప్రైవేట్‌ రంగ ఎయిర్‌లైన్స్‌ దిగ్గజం ఇండిగో మాజీ ప్రెసిడెంట్‌ ఆదిత్య ఘోష్‌ కూడా ఉన్నారు. కంపెనీ సీఈవోగా నియమితులైన వినయ్‌ దూబే గతంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. వచ్చే నాలుగేళ్లలో సుమారు 70 విమానాలను ఆపరేట్‌ చేయాలని కంపెనీ యోచిస్తోంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన కొత్త విమానయాన సంస్థ? 
ఎప్పుడు : అక్టోబర్‌ 11
ఎవరు    : ఆకాశ ఎయిర్‌
ఎందుకు : విమాన సర్వీసులను ప్రారంభించే క్రమంలో...


Andhra Pradesh: గోప్రదక్షిణ మందిరాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ ప్రారంభించారు?

CM Jagan At Tirumala

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చిత్తూరు జిల్లా తిరుపతిలోని అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద నిర్మించిన శ్రీ వేంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిర సముదాయాన్ని అక్టోబర్‌ 11న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. గో సంరక్షణకు పెద్దపీట వేస్తూ గోవిందుని, గోవు విశిష్టతను తెలియజేసే ఉద్దేశంతో ఈ మందిరాన్ని నిర్మించారు. చెన్నైకి చెందిన దాత శేఖర్‌రెడ్డి అందించిన రూ.15 కోట్ల విరాళంతో టీటీడీ దీనిని నిర్మించింది. మరోవైపు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్‌.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

చిన్న పిల్లల ఆస్పత్రికి శ్రీకారం
తిరుపతిలోని బర్డ్‌ ఆస్పత్రి వద్ద టీటీడీ సహకారంతో రూ.64 కోట్లతో నిర్మించిన బాలల ఆరోగ్య వరప్రదాయని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. అలాగే అలిపిరి నుంచి తిరుమల వరకు పునర్నిర్మించిన నడకమార్గం పైకప్పును కూడా ప్రారంభించారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ రూ.25 కోట్లతో ఈ పైకప్పును నిర్మించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : శ్రీ వేంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిర సముదాయం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్‌ 11
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ  : అలిపిరి శ్రీవారి పాదాల మండపం, తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం
ఎందుకు : గో సంరక్షణకు పెద్దపీట వేస్తూ గోవిందుని, గోవు విశిష్టతను తెలియజేసే ఉద్దేశంతో...


Telangana High Court: రాష్ట్ర హైకోర్టు సీజేగా ప్రమాణం చేసిన న్యాయమూర్తి?

Justice Satish Chandra Sharma at Raj Bhavan

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. అక్టోబర్‌ 11న హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు, మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ జి.చంద్రయ్య, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలి చైర్మన్‌ భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఇప్పటివరకు తెలంగాణ సీజేగా విధులు నిర్వర్తించిన జస్టిస్‌ హిమాకోహ్లికి ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ శర్మకు సీజేగా పదోన్నతి కల్పిస్తూ ఇక్కడికి బదిలీ చేశారు.

నాలుగో సీజేగా...
తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటైన తర్వాత మొదటి సీజేగా జస్టిస్‌ తొట్టతిలి బి.నాయర్‌ రాధాకృష్ణన్‌ సేవలందించగా తర్వాత జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, జస్టిస్‌ హిమాకోహ్లి సేవలందించారు. నాలుగో సీజేగా జస్టిస్‌ శర్మ బాధ్యతలు చేపట్టారు.

జస్టిస్‌ అమర్‌నా«థ్‌ గౌడ్‌ బదిలీ
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అమర్‌నా«థ్‌ గౌడ్‌ను త్రిపుర హైకోర్టుకు బదిలీ చేసేందుకు కేంద్రం ఆమోదముద్ర తెలిపింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : అక్టోబర్‌ 11
ఎవరు    : జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ
ఎక్కడ    : రాజ్‌భవన్, హైదరాబాద్‌
ఎందుకు : తెలంగాణ సీజేగా విధులు నిర్వర్తించిన జస్టిస్‌ హిమాకోహ్లికి ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించిన ఈ నేపథ్యంలో...

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 11 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్

Published date : 12 Oct 2021 06:37PM

Photo Stories