Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 11 కరెంట్‌ అఫైర్స్‌

Twindemic

EVD: ట్విండెమిక్‌ అంటే ఏమిటీ? ఫైలో వైరస్‌ అని దేన్ని అంటారు?

అమెరికాలో ప్రస్తుతం శీతాకాలం జరుగుతోంది. దీంతో కరోనా రోగంతో పాటు సీజనల్‌గా వచ్చే ఫ్లూ (జలుబు) కూడా సోకుతోంది. ప్రస్తుతం కరోనాను పాండెమిక్‌ (మహమ్మారి) అని పిలుస్తున్న నేపథ్యంలో కరోనా, సీజనల్‌ ఫ్లూని కలిపి ట్విండెమిక్‌గా (రెండు పాండెమిక్‌లు కలసి) వ్యవహరిస్తారు. ఈ తరహా రూపంలో వచ్చే కేసులను ప్రస్తుతం మేథమేటికల్‌ మోడల్స్‌ ద్వారా అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కోవిడ్‌పై పోరాడేందుకు తీసుకునే చర్యలు ఫ్లూకి కూడా అడ్డుకట్ట వేస్తాయని అన్నారు.

కాంగోలో ఎబోలా కేసు.. 
ప్రమాదకరమైన ఎబోలా వైరస్‌ సోకి మూడేళ్ల బాలుడు మరణించిన ఘటన కాంగోలో చోటు చేసుకుంది. అక్టోబర్‌ 6న ఇది జరిగిందని అధికారులు తెలిపారు. గత అయిదు నెలలుగా కాంగోలో ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదు. అంతకు ముందు 6 మంది ఎబోలా కారణంగా మరణించారు.

ఫైలో వైరస్‌...
ఎబోలా వైరస్‌ వ్యాధి ... వన్య ప్రాణుల నుంచి మనిషికి సోకి, ఆ తర్వాత మనుషుల మధ్య విజృంభిస్తుంది. ఫ్రూట్‌బ్యాట్స్‌ అనే గబ్బిలాలు ఎబోలా వైరస్‌కు ఆశ్రయం ఇస్తాయి. మొదటిసారిగా 1976లో బెల్జియం పరిశోధకుడు పీటర్‌ పయట్‌ ఎబోలా వైరస్‌ను గుర్తించారు. ఒకేసారి ఆఫ్రికాలోని సూడాన్‌లో గల జారా ప్రాంతంతో పాటు కాంగోలోని ఎబోలా నది ఒడ్డున యంబుకు ప్రాంతంలో వ్యాధి మొదటిసారిగా అలజడి సృష్టించింది. అప్పట్నుంచి ఎబోలా వ్యాధిగా పిలుస్తున్నారు. ఎబోలా వైరస్‌.. ఫైలో విరిడే కుటుంబానికి చెందింది. కాబట్టి దీన్ని ఫైలో వైరస్‌ అని కూడా అంటారు.

Ebola


Reunification: తైవాన్‌ను చైనాతో విలీనం చేస్తామని ప్రకటించిన నేత?

తైవాన్‌ను చైనాతో విలీనం చేసితీరతామని ఆదేశాధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ మరోమారు స్పష్టం చేశారు. తైవాన్‌ విలీనం శాంతియుతంగా, ఇరు ప్రాంతాల ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. తైవాన్‌ అంశంలో బయటివారి ప్రమేయం అవసరం లేదంటూ పరోక్షంగా యూఎస్, జపాన్‌కు హెచ్చరికలు పంపారు. చైనా విముక్తి వార్షికోత్సవాల్లో జింగ్‌పింగ్‌ తాజా వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తైవాన్‌కు అండగా ఉంటామని అమెరికా చెబుతోంది. ఇందుకోసం తైవాన్‌ అగ్రిమెంట్‌ను కుదుర్చుకుంది. తైవాన్‌ సార్వభౌమదేశంగా తనను తాను భావిస్తుండగా, చైనా మాత్రం అది తమ ఆధీనంలోని స్వయం ప్రతిపత్తిఉన్న ప్రాంతంగా భావిస్తోంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : తైవాన్‌ను చైనాతో విలీనం చేస్తామని ప్రకటించిన నేత?
ఎప్పుడు  : అక్టోబర్‌ 9
ఎవరు    : చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ 
ఎందుకు : తైవాన్‌ తమ ఆధీనంలోని స్వయం ప్రతిపత్తిఉన్న ప్రాంతమని...


Qadeer Khan: పాకిస్తాన్‌ అణు పితామహుడు అని ఎవరిని పిలుస్తారు?

Abdul Qadeer Khan

పాకిస్తాన్‌కు చెందిన ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త, ఆ దేశ అణు పితామహుడిగా పేరు తెచ్చుకున్న అబ్దుల్‌ ఖదీర్‌ఖాన్‌ (85) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో అక్టోబర్‌ 10న తుదిశ్వాస విడిచారు. 1936లో మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ నగరంలో ఖదీర్‌ ఖాన్‌ జన్మించారు. దేశ విభజన సమయంలో 1947లో ఖదీర్‌ ఖాన్‌ కుటుంబం పాకిస్తాన్‌కు వలసవెళ్లింది.

తొలి ముస్లిం దేశం...
పాకిస్తాన్‌ 1998లో అణు పరీక్ష నిర్వహించడంతో ఖదీర్‌ ఖాన్‌ పేరు మారుమోగిపోయింది. ముస్లిం దేశాల్లో మొట్టమొదటి సారిగా అణు బాంబు తయారీ సామర్థ్యం సొంతం చేసుకున్న దేశంగా పాకిస్తాన్‌ నిలిచిపోయింది. అయితే, పాకిస్తాన్‌ నుంచి ఇరాన్, ఉత్తరకొరియాలకు అణు పరిజ్ఞానం బదిలీ చేసినట్లు బహిరంగంగా అంగీకరించడం ఆయన ప్రతిష్టను దెబ్బతీసింది. 2004 నుంచి ఐదేళ్లపాటు ప్రభుత్వం ఆయన్ను గృహ నిర్బంధంలో ఉంచింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త, పాకిస్తాన్‌ అణు పితామహుడు కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్‌ 10
ఎవరు    : అబ్దుల్‌ ఖదీర్‌ఖాన్‌ (85)
ఎక్కడ    : ఇస్లామాబాద్, పాకిస్తాన్‌
ఎందుకు  : అనారోగ్యం కారణంగా...


Military Talks: భారత్‌–చైనా మధ్య 13వ దఫా చర్చలు ఎక్కడ జరిగాయి?

India-China Flag

భారత్‌–చైనా మధ్య 13వ దఫా కార్ప్స్‌ కమాండర్‌ స్థాయి సైనిక చర్చలు అక్టోబర్‌ 10న జరిగాయి. ఇరు దేశాల నడుమ చుషుల్‌–మోల్డో బోర్డర్‌ పాయింట్‌ వద్ద చైనా వైపు భూభాగంలో 8.30 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ చర్చల్లో.. భారత్‌ తరఫు బృందానికి లేహ్‌లోని 14 కార్ప్స్‌ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ పి.జి.కె.మీనన్‌ నేతృత్వం వహించారు.

పీపీ–15 గురించి...
తాజా చర్చల్లో ప్రధానంగా తూర్పు లద్దాఖ్‌ హాట్‌స్ప్రింగ్స్‌ ప్రాంతంలోని పెట్రోలింగ్‌ పాయింట్‌(పీపీ)–15 నుంచి బలగాల ఉపసంహరణ గురించే చర్చించినట్లు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. తూర్పు లద్దాఖ్‌లో మిగిలిన వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా బలగాలు సాధ్యమైనంత త్వరగా వెనక్కి వెళ్లిపోవాలని... చైనాకు తేల్చిచెప్పినట్లు పేర్కొన్నాయి.

బారాహోతి సెక్టార్‌...
ఇటీవల చైనా సైన్యం వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)ను అతిక్రమించి ఉత్తరాఖండ్‌లోని బారాహోతి సెక్టార్, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. ఇరు దేశాల అధికారులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో 13వ దఫా చర్చలు సాఫీగా సాగాయి.

గోగ్రా నుంచి ఉపసంహరణ పూర్తి
2020 మే 5వ తేదీన తూర్పు లద్దాఖ్‌లో భారత్‌–చైనా సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా వివిధ స్థాయిల్లో అధికారులు సంప్రదింపులు ప్రారంభించారు. 12వ దఫా కార్ప్స్‌ కమాండర్‌ స్థాయి చర్చలు 2021, జూలై 31న జరిగాయి. ఈ చర్చల్లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గోగ్రా నుంచి తమ బలగాల ఉపసంహరణ ప్రక్రియను భారత్, చైనా పూర్తి చేశాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారత్‌–చైనా మధ్య 13వ దఫా కార్ప్స్‌ కమాండర్‌ స్థాయి సైనిక చర్చలు
ఎప్పుడు  : అక్టోబర్‌ 10
ఎవరు     : భారత్, చైనా సైన్యాధికారులు
ఎక్కడ    : తర్పూ లద్దాఖ్‌లోని చుషుల్‌–మోల్డో బోర్డర్‌ పాయింట్‌ వద్ద చైనా వైపు భూభాగంలో..
ఎందుకు : తూర్పు లద్దాఖ్‌లో వివాదాస్పద ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ గురించి చర్చించేందుకు...


Badminton: బల్గేరియన్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచిన భారతీయురాలు?

Samia Imad Farooqi

హైదరాబాద్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సామియా ఇమాద్‌ ఫారూఖీ అక్టోబర్‌ 10న ముగిసిన బల్గేరియన్‌ ఓపెన్‌ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచింది. బల్గేరియా రాజధాని సోఫియా నగరంలో జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో సామియా 16–21, 21–20, 21–11తో రెండో సీడ్‌ ఒజ్గె బేరక్‌ (టర్కీ)పై గెలిచింది. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో భారత్‌కే చెందిన మీరాబా లువాంగ్‌ మైస్నమ్‌ 21–19, 7–21, 21–14తో ఐదో సీడ్‌ డానియల్‌ నికోలవ్‌ (బల్గేరియా)పై నెగ్గి టైటిల్‌ దక్కించుకున్నాడు.

భారత్‌ ఖాతాలో 30 పతకాలు
పెరూ రాజధాని లిమా నగరంలో జరిగిన ప్రపంచ జూనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ తొలి స్థానంలో నిలిచింది. టోర్నీలో ఏకంగా 13 స్వర్ణాలు, 11 రజతాలు, 6 కాంస్యాలతో మొత్తం 30 పతకాలు సాధించిన భారత్‌ పతకాల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. 20 (6 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలతో) పతకాలు గెలిచిన అమెరికాకు రెండో స్థానం దక్కింది.

అఫ్గాన్‌ జట్టు కన్సల్టెంట్‌గా ఫ్లవర్‌
టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే అఫ్గానిస్తాన్‌ జట్టుకు జింబాబ్వే మాజీ కెప్టెన్, ఇంగ్లండ్‌ మాజీ కోచ్‌ ఆండీ ఫ్లవర్‌ కన్సల్టెంట్‌గా వ్యవహరించనున్నాడు. 53 ఏళ్ల ఫ్లవర్‌ 63 టెస్టులు, 213 వన్డేలు ఆడాడు. అఫ్గాన్‌ టీమ్‌కు లాన్స్‌ క్లూస్‌నర్‌ హెడ్‌ కోచ్‌గా, షాన్‌ టెయిట్‌ బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : బల్గేరియన్‌ ఓపెన్‌ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన భారతీయురాలు?
ఎప్పుడు  : అక్టోబర్‌ 10
ఎవరు     :  సామియా ఇమాద్‌ ఫారూఖీ
ఎక్కడ    : సోఫియా, బల్గేరియా 
ఎందుకు  : మహిళల సింగిల్స్‌ ఫైనల్లో సామియా 16–21, 21–20, 21–11తో రెండో సీడ్‌ ఒజ్గె బేరక్‌ (టర్కీ)పై గెలిచినందున....


Commonwealth Games: ప్రస్తుతం కేంద్ర క్రీడల మంత్రిగా ఎవరు ఉన్నారు?

2021 ఏడాది జరిగే కామన్వెల్త్‌ గేమ్స్‌ నుంచి భారత హాకీ జట్లు తప్పుకుంటున్నట్లు హాకీ ఇండియా (హెచ్‌ఐ) తీసుకున్న ఏకపక్ష నిర్ణయం చెల్లదని అక్టోబర్‌ 10న కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్పష్టం చేశారు. జాతీయ క్రీడా సమాఖ్యలు ఇలాంటి కీలక అంశాలపై ప్రభుత్వాన్ని లేదంటే సంబంధిత శాఖను సంప్రదించాలన్నారు. నిర్ణయాధికారాన్ని ప్రభుత్వానికే వదిలేయాలని... జట్లు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాయని, క్రీడా సమాఖ్యలకు కాదని ఠాకూర్‌ అన్నారు.

టర్కీ గ్రాండ్‌ప్రి విజేత?
ఫార్ములావన్‌ రేసు టర్కీ గ్రాండ్‌ప్రి విజేతగా మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ వాల్తెరి బొటాస్‌ నిలిచాడు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో అక్టోబర్‌ 10న జరిగిన ఈ రేసులో 58 ల్యాప్‌ల దూరాన్ని బొటాస్‌ అందరి కంటే ముందుగా గంటా 31 నిమిషాల 04.103 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. బొటాస్‌ కెరీర్‌లో ఇది పదో విజయం. రెడ్‌బుల్‌ డ్రైవర్లు మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్, పెరెజ్‌లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు యూఎస్‌ గ్రాండ్‌ప్రి అక్టోబర్‌ 24న జరుగుతుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 2021 ఏడాది జరిగే కామన్వెల్త్‌ గేమ్స్‌ నుంచి భారత హాకీ జట్లు తప్పుకుంటున్నట్లు హాకీ ఇండియా (హెచ్‌ఐ) తీసుకున్న ఏకపక్ష నిర్ణయం చెల్లదు
ఎప్పుడు : అక్టోబర్‌ 10
ఎవరు     : కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌
ఎందుకు  : నిర్ణయాధికారాన్ని ప్రభుత్వానికే వదిలేయాలని...


REC Solar Holdings: నార్వే సంస్థ ఆర్‌ఈసీని కొనుగోలు చేసిన భారతీయ సంస్థ?

RIL-REC Solar Holdings

బిలియనీర్‌ ముకేశ్‌ అంబానీ కొత్తగా ఏర్పాటు చేసిన రిలయన్స్‌ న్యూ ఎనర్జీ సోలార్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎన్‌ఈఎస్‌ఎల్‌) తొలిసారి ఒక విదేశీ కంపెనీని కొనుగోలు చేసింది. చైనా నేషనల్‌ బ్లూస్టార్‌(గ్రూప్‌) కో నుంచి... ఆర్‌ఈసీ సోలార్‌ హోల్డింగ్స్‌ను సొంతం చేసుకుంది. నార్వేకు చెందిన ఆర్‌ఈసీ సోలార్‌ హోల్డింగ్స్‌(ఆర్‌ఈసీ గ్రూప్‌)లో 100 శాతం వాటాను 77.1 కోట్ల డాలర్ల(సుమారు రూ. 5,783 కోట్లు) ఎంటర్‌ప్రైజ్‌ విలువకు కొనుగోలు చేసినట్లు అక్టోబర్‌ 10న రిలయన్స్‌ న్యూ ఎనర్జీ తెలిపింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌)కు పూర్తి అనుబంధ సంస్థగా రిలయన్స్‌ న్యూ ఎనర్జీ ఏర్పడిన సంగతి తెలిసిందే.

కంపెనీ తీరిలా..
నార్వే, సింగపూర్‌ కేంద్రాలుగా ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా పసిఫిక్‌ ప్రాంతాలలో కార్యకలాపాలు విస్తరించిన ఆర్‌ఈసీ సోలార్‌ హోల్డింగ్స్‌(ఆర్‌ఈసీ గ్రూప్‌)నకు సోలార్‌ ఎనర్జీలో పట్టుంది. 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ కొత్తతరహా సాంకేతిక ఆవిష్కరణలు, అత్యంత మన్నికైన దీర్ఘకాలిక సోలార్‌ సెల్స్, ప్యానల్స్‌ను రూపొందిస్తోంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : నార్వేకు చెందిన ఆర్‌ఈసీ సోలార్‌ హోల్డింగ్స్‌(ఆర్‌ఈసీ గ్రూప్‌)ను కొనుగోలు చేసిన భారతీయ సంస్థ?
ఎప్పుడు : అక్టోబర్‌ 10
ఎవరు : రిలయన్స్‌ న్యూ ఎనర్జీ సోలార్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎన్‌ఈఎస్‌ఎల్‌)
ఎందుకు  : రిలయన్స్‌ న్యూ ఎనర్జీ విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా...


Chief Justice: తెలంగాణ హైకోర్టు సీజేగా నియమితులైన న్యాయమూర్తి?

Justice Satish Chandra Sharma

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సీజేగా జస్టిస్‌ పీకే మిశ్రా నియమితులయ్యారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా 13 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు. సెప్టెంబర్‌ 16న సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఈ మేరకు అక్టోబర్‌ 9న నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ నేపథ్యం...

  • 1961 నవంబర్‌ 30న మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో జన్మించారు.
  • డాక్టర్‌ హరిసింగ్‌గౌర్‌ వర్సిటీ నుంచి బీఎస్సీ పట్టా, న్యాయ పట్టా అందుకొన్నారు.
  • 1984, సెప్టెంబర్‌ 1న మధ్యప్రదేశ్‌ బార్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. రాజ్యాంగం, సేవలు, సివిల్, క్రిమినల్‌ విషయాల్లో ప్రాక్టీస్‌ చేశారు.
  • 1993లో అడిషనల్‌ సెంట్రల్‌ గవర్నమెంట్‌ కౌన్సెల్‌గా నియమితులై... 2004లో సీనియర్‌ ప్యానెల్‌ కౌన్సెల్‌గా పదోన్నతి పొందారు.
  • 2003లో మధ్యప్రదేశ్‌ హైకోర్టు నుంచి సీనియర్‌ న్యాయవాది హోదాను పొందారు. 42 ఏళ్లకే ఈ హోదా పొందిన వ్యక్తిగా గుర్తింపు దక్కించుకున్నారు.
  • 2008, జనవరి 18న మధ్యప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010, జనవరి 15న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 
  • 2021, ఆగస్టు 31 నుంచి ఆ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. తాజాగా తెలంగాణ హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
  • పలు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలతో అనుసంధానమై ఉన్నారు. ఎన్నో పరిశోధన పత్రాలు ప్రచురించారు.
బదిలీ అయిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు..
జస్టిస్‌ అఖిల్‌ఖురేషి త్రిపుర నుంచి రాజస్తాన్‌ 
జస్టిస్‌ ఇంద్రజిత్‌ మహంతి రాజస్తాన్‌ నుంచి త్రిపుర 
జస్టిస్‌ మొహమ్మద్‌ రఫీఖ్‌ మధ్యప్రదేశ్‌ నుంచి హిమాచల్‌ప్రదేశ్‌ 
జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి ఏపీ నుంచి ఛత్తీస్‌గఢ్‌ 
జస్టిస్‌ బిశ్వనాథ్‌ సోమద్దర్‌ మేఘాలయ నుంచి సిక్కిం

 

పదోన్నతిపై హైకోర్టు సీజేగా నియమితులైన వారు
సీజే పేరు హైకోర్టు 
జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ తెలంగాణ 
జస్టిస్‌ పీకే మిశ్రా ఆంధ్రప్రదేశ్‌ 
జస్టిస్‌ రాజేష్‌ బిందాల్‌ అలహాబాద్‌
జస్టిస్‌ ప్రకాశ్‌ శ్రీవాస్తవ కలకత్తా 
జస్టిస్‌ రితురాజ్‌ అవస్థి కర్ణాటక 
జస్టిస్‌ అరవింద్‌కుమార్‌ గుజరాత్‌ 
జస్టిస్‌ ఆర్‌వీ మలిమాత్‌ మధ్యప్రదేశ్‌ 
జస్టిస్‌ రంజిత్‌ వి మోరే మేఘాలయ

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం
ఎప్పుడు  : అక్టోబర్‌ 10
ఎవరు     : జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ
ఎందుకు : జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలపడంతో...


AP High Court: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ అమానుల్లా ప్రమాణం

Justice Ahsanuddin Amanullah

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా అక్టోబర్‌ 10న ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని హైకోర్టులో జరిగిన కార్యక్రమంలో జస్టిస్‌ అమానుల్లాతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి ప్రమాణం చేయించారు. పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ అమానుల్లాను రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. పాట్నా హైకోర్టులో నాల్గవ స్థానంలో కొనసాగిన ఆయన... ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో రెండవ స్థానంలో కొనసాగుతారు.

1963 మే 11న బీహార్‌లో జన్మించిన జస్టిస్‌ అమానుల్లా.. బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ చదివారు. 1991 సెప్టెంబర్‌ 27న బీహార్‌ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదయ్యారు.అనేక అంచెలు దాటి 2011 జూన్‌ 20న పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

ఎన్‌సీఎల్‌టీ సభ్యురాలిగా జస్టిస్‌ రజని
నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ), అమరావతి సభ్యురాలిగా ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ తేలప్రోలు రజని నియమితులయ్యారు. అదేవిధంగా ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ జ్యుడీషియల్‌ సభ్యుడిగా న్యాయవాది నందుల వెంకటరామకృష్ణ బద్రీనాథ్‌.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈశాన్య రాష్ట్రాల డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌ న్యాయమూర్తి వేములపల్లి కిశోర్‌ ముంబై ఎన్‌సీఎల్‌టీ జ్యుడీషియల్‌ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం అక్టోబర్‌ 10న నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు  : అక్టోబర్‌ 10
ఎవరు     : జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా
ఎక్కడ    : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు, అమరావతి, గుంటూరు జిల్లా
ఎందుకు : రాష్ట్రపతి ఉత్తర్వులు మేరకు...

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 9 కరెంట్‌ అఫైర్స్‌

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

    
డౌన్‌లోడ్‌ వయా ఆపిల్‌ ఐ స్టోర్‌

Published date : 11 Oct 2021 07:14PM

Photo Stories