Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 9 కరెంట్‌ అఫైర్స్‌

2021 Nobel Peace Prize

నోబెల్‌ శాంతి పురస్కారం–2021

ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛ ప్రతికూలతలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న పాత్రికేయ గళానికి ప్రపంచంలోనే అత్యున్నత నోబెల్‌ శాంతి పురస్కారం వరించింది. ఫిలిప్పీన్స్‌కి చెందిన మహిళా జర్నలిస్టు మరియా రెస్సా, రష్యాకు చెందిన దిమిత్రీ మురటోవ్‌లకు సంయుక్తంగా 2021 ఏడాది నోబెల్‌ శాంతి పురస్కారాన్ని ఇస్తున్నట్టుగా అక్టోబర్‌ 8న నార్వే రాజధాని ఓస్లోలోని నార్వే నోబెల్‌ ఇన్‌స్టిస్ట్యూట్‌ ప్రకటించింది. శాంతి బహుమతి కింద స్వర్ణపతకంతో పాటుగా 11.4 లక్షల డాలర్ల నగదు పురస్కారం విజేతలకు లభిస్తుంది. రెస్సా, దిమిత్రీ ధైర్యసాహసాలతో పోరాడుతున్నారని నార్వే నోబెల్‌ కమిటీ చైర్మన్‌ ఉమన్‌ బెరిట్‌ రీస్‌ ఆండర్సన్‌ ప్రశంసించారు.

ప్రభుత్వ వ్యతిరేక గళం...
ఫిలిప్పీన్స్‌కి చెందిన మహిళా జర్నలిస్టు మరియా రెస్సా (58) 2012లో రాప్లర్‌ అనే వెబ్‌సైట్‌ని స్థాపించారు. అధికార ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ఎన్నో సంచలనాత్మక కథనాలను ధైర్యంగా ప్రచురించారు. ఫిలీప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటర్టె తెచ్చిన వివాదాస్పద ‘యాంటీ డ్రగ్‌’ కార్యక్రమంపై ఆమె సాహసోపేతంగా విమర్శనాత్మక కథనాలు రాశారు. డ్రగ్‌ మాఫియా సభ్యులుగా పేర్కొంటూ వేల మందిని అంతమొందించిన తీరును వెలుగులోకి తెచ్చారు. వీటిపై కథనాలను ప్రచురించిన రెస్సాపై ఎన్నో క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో ఆరేళ్ల కారాగార శిక్ష పడింది. బెయిల్‌పై బయటకొచ్చిన ఆమె తన కేసులపైన కూడా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.

దశాబ్దాలుగా పోరాటం..
రష్యాకి చెందిన పాత్రికేయుడు దిమిత్రీ మురటోవ్‌ 1993లో స్థాపించిన నొవయా గజెటా అనే పత్రిక వ్యవస్థాపకుల్లో ఒకరు. ఇది.. రష్యాలో అత్యంత స్వతంత్ర పత్రిక. వాస్తవ ఆధారిత పాత్రికేయం, వృత్తిపరమైన నిబద్ధతను చాటింది. దేశంలో పేరుకుపోయిన అవినీతి, విధానపరమైన హింస, చట్ట వ్యతిరేక అరెస్టులు, ఎన్నికల్లో మోసాలు వంటి ఎన్నో సంచలనాత్మక కథనాలను నొవయా ప్రచురించింది. దీంతో ఎన్నోసార్లు ఈ పత్రికకు బెదిరింపులు వచ్చాయి. ఇప్పటివరకూ ఈ సంస్థకు చెందిన ఆరుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. నొవయా పత్రికకి సేవలు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ప్రఖ్యాత జర్నలిస్టు అన్నా పొలిట్‌కోవస్క్య సహా ఆరుగురు పాత్రికేయులకు సగం పురస్కారం ఇస్తున్నట్టుగా దిమిత్రీ ప్రకటించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : నోబెల్‌ శాంతి పురస్కారం–2021 విజేతలు
ఎప్పుడు  : అక్టోబర్‌ 8
ఎవరు    : జర్నలిస్టులు మరియా రెస్సా(ఫిలిప్పీన్స్‌), దిమిత్రీ మురటోవ్‌(రష్యా) 
ఎందుకు : ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛ ప్రతికూలతలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నందున...


Belgium Scientists: కొబ్బరి చెట్లను క్లోనింగ్‌ చేసిన యూనివర్సిటీ?

Coconut

చాలా నెమ్మదిగా పెరిగే కొబ్బరి చెట్లను కూడా తాము క్లోనింగ్‌ చేయగలిగినట్లు బెల్జియంలోని కె.యు.ల్యువెన్‌ యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించారు. కె.యు.ల్యువెన్‌ వర్సిటీ, అలయెన్స్‌ ఆఫ్‌ బయో డైవర్సిటీ ఇంటర్నేషనల్‌కు చెందిన పరిశోధకులు... వేగంగా కొబ్బరి మొక్కలను ఎక్కువ సంఖ్యలో పెంచడంతోపాటు, కొబ్బరి జన్యు మూలాలను దీర్ఘకాలం పరిరక్షించడంలో విజయం సాధించారు. వీరు సాధించిన విజయంతో భారత్‌ వంటి దేశాల్లోని కొబ్బరి రైతులు ఎదుర్కొనే వ్యాధులు, వాతావరణ మార్పులు, సముద్ర మట్టాల్లో పెరుగుదల వంటి సమస్యల నుంచి విముక్తి కలగనుంది. ఈ ఫలితాలు సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌ జర్నల్‌ సెప్టెంబర్‌ ఎడిషన్‌లో ప్రచురితమయ్యాయి. అరటి పండుపై సాగించిన పరిశోధనల ఫలితాల స్ఫూర్తితోనే ఈ విజయం సాధించినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. మా పరిశోధన కొబ్బరి జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు, కొబ్బరికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు సాయపడుతుందని వివరించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : కొబ్బరి చెట్లను క్లోనింగ్‌ చేసిన శాస్త్రవేత్తలు
ఎప్పుడు : అక్టోబర్‌ 8
ఎవరు    : కె.యు.ల్యువెన్‌ వర్సిటీ, అలయెన్స్‌ ఆఫ్‌ బయో డైవర్సిటీ ఇంటర్నేషనల్‌కు చెందిన పరిశోధకులు...  
ఎందుకు : కొబ్బరి జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు, కొబ్బరికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు సాయపడుతుందని...


USS Connecticut: దక్షిణ చైనా సముద్రంలో ప్రమాదానికి గురైన జలాంతర్గామి?

Submarine

వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో అమెరికాకు చెందిన అణు జలాంతర్గామి ‘యూఎస్‌ఎస్‌ కనెక్టికట్‌’ ప్రమాదానికి గురైంది. కనెక్టికట్‌ అక్టోబర్‌ 2న అంతర్జాతీయ జలాల్లో నీటి అడుగున దేనినో ఢీకొట్టిందనీ, ఈ ఘటనలో పలువురు నావికులు గాయపడ్డారని అక్టోబర్‌ 7న యూఎస్‌ పసిఫిక్‌ ఫ్లీట్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ‘సబ్‌మెరీన్‌ కనెక్టికట్‌ సురక్షితంగానే ఉంది. అందులోని న్యూక్లియర్‌ ప్రొపల్షన్‌ ప్లాంట్, ఇతర వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయి’ అని పేర్కొంది.

మసీదులో మారణకాండ
పశ్చిమ అఫ్గానిస్తాన్‌ కుందుజ్‌ ప్రావిన్సులోని గోజార్‌ ఇ సయీద్‌ అబాద్‌ మసీదులో అక్టోబర్‌ 8న సంభవించిన పేలుడులో 60మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. తామే ఈ పేలుళ్లు జరిపామని ఐసిస్‌ అనుబంధ సంస్థ ఐసిస్‌– కె ప్రకటించింది. అఫ్గాన్‌ పగ్గాలు తాలిబన్ల చేతికి వచ్చాక జరిగిన పెద్దదాడిగా దీన్ని భావిస్తున్నారు.

ఏమిటీ ఐసిస్‌–కె?
ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌) ఉగ్రవాద సంస్థలో కార్యకలాపాలు సాగిస్తున్న కరడుగట్టిన భావజాలం ఉన్న ఉగ్రవాదులు కొందరు 2014లో ఒక గ్రూప్‌గా ఏర్పడ్డారు. పాకిస్తానీ తాలిబన్‌ ఫైటర్లు మొదట్లో ఈ గ్రూపులో చేరారు. తూర్పు అఫ్గానిస్తాన్‌లో తొలిసారిగా వీరి కదలికలు కనిపించాయి. ప్రస్తుత అఫ్గానిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్, టర్క్‌మెనిస్తాన్‌లో భాగంగా ఉన్న ఒక ప్రాంతాన్ని ఖొరాసన్‌ అని పిలిచేవారు. వీరి ప్రధాన కార్యాలయం ఈ ప్రాంతంలోనే ఉంది. పాకిస్తాన్‌కి మాదకద్రవ్యాలు, అక్రమంగా మనుషుల్ని రవాణా చేయాలంటే ఈ మార్గంలోనే వెళ్లాలి. ఈ ప్రాంతానికి గుర్తుగా వీరిని ఐసిస్‌–కె లేదంటే ఐఎస్‌–కె అని పిలుస్తారు. మధ్య, దక్షిణాసియాల్లో తమ సామ్రాజ్యాన్ని విస్తరించడమే వీరి లక్ష్యం.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి  : దక్షిణ చైనా సముద్రంలో ప్రమాదానికి గురైన జలాంతర్గామి?
ఎప్పుడు : అక్టోబర్‌ 2
ఎవరు : యూఎస్‌ఎస్‌ కనెక్టికట్‌(అమెరికా) 
ఎందుకు : అంతర్జాతీయ జలాల్లో నీటి అడుగున దేనినో ఢీకొట్టినందున...


Tata Group: ప్రభుత్వ రంగ ఎయిరిండియాను సొంతం చేసుకున్న సంస్థ?

Air India

పారదర్శకమైన బిడ్డింగ్‌ ప్రక్రియలో, ప్రభుత్వ రంగ ఎయిరిండియాను అత్యధికంగా రూ. 18,000 కోట్ల బిడ్‌తో టాటా గ్రూప్‌ దక్కించుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా టాటా గ్రూప్‌లో భాగమైన టాలేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌... ఎయిరిండియాకు సంబంధించి రూ. 15,300 కోట్ల రుణభారాన్ని తీసుకోవడంతో పాటు రూ. 2,700 కోట్లు నగదును కేంద్రానికి చెల్లించనుంది. ఈ విషయాలను అక్టోబర్‌ 8న కేంద్ర పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే వెల్లడించారు. 2021 డిసెంబర్‌ నాటికి లావాదేవీ పూర్తి కావచ్చని భావిస్తున్నామన్నారు.

ఏడాది దాకా ఉద్యోగుల కొనసాగింపు...
బిడ్డింగ్‌ నిబంధనల ప్రకారం లావాదేవీ పూర్తయిన నాటి నుంచి ఏడాది పాటు ఎయిరిండియా ఉద్యోగులందరినీ టాటా గ్రూప్‌ కొనసాగించాలని విమానయాన శాఖ కార్య దర్శి రాజీవ్‌ బన్సల్‌ తెలిపారు. రెండో ఏడాదిలో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) అవకాశం ఇవ్వొచ్చు. ఎయిరిండియాలో 12,085 మంది ఉద్యోగులు (8,084 మంది పర్మనెంట్, 4,001 మంది కాంట్రాక్ట్‌) ఉన్నారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 1,434 మంది సిబ్బంది ఉన్నారు.

రెండో పెద్ద ఎయిర్‌లైన్స్‌ గ్రూప్‌...
ఎయిరిండియాను దక్కించుకోవడంతో టాటా గ్రూప్‌లో మూడో ఎయిర్‌లైన్‌ బ్రాండ్‌ చేరినట్లవుతుంది. టాటా గ్రూప్‌ ఇప్పటికే ఎయిర్‌ఏషియా, విస్తార (సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో కలిసి) విమానయాన సంస్థలను నిర్వహిస్తోంది. ఈ మూడు సంస్థల కన్సాలిడేషన్‌ ప్రక్రియ గానీ పూర్తయితే దేశీయంగా ఇండిగో తర్వాత రెండో అతి పెద్ద ఎయిర్‌లైన్స్‌గా టాటా గ్రూప్‌ ఆవిర్భవించనుంది.

1932లో ప్రారంభం...
స్వాతంత్రానికి పూర్వమే జంషెడ్‌జీ టాటా 1932లో టాటా ఎయిర్‌లైన్స్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత 1946లో ఎయిర్‌ ఇండియాగా పేరు మార్చారు. ఆ తర్వాత 1953 సెప్టెంబరు 29న టాటా ఎయిర్‌లైన్స్‌ని కేంద్రం జాతీయం చేసింది. దీంతో ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌ కాస్తా ప్రభుత్వ ఎయిరిండియాగా మారింది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఎయిరిండియాలో వంద శాతం వాటాను కేంద్రం అమ్మకానికి పెట్టింది. ఈ మేరకు బిడ్లను ఆహ్వానించగా టాటా గ్రూపు సంస్థ ఇందులో విజేతగా నిలిచింది. తాజా పరిణామంతో 1953లో జాతీయం చేశాక, దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత ఎయిరిండియా సొంత గూటికి చేరినట్లయింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ప్రభుత్వ రంగ ఎయిరిండియాను సొంతం చేసుకున్న సంస్థ?
ఎప్పుడు  : అక్టోబర్‌ 8
ఎవరు    : టాటా గ్రూప్‌లో భాగమైన టాలేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
ఎందుకు : పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా నిర్వహించిన బిడ్డింగ్‌ ప్రక్రియలో టాటా గ్రూప్‌ విజేతగా నిలిచినందున...


RBI Monetary Policy Committee: ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు ఎంత శాతంగా ఉంది?RBI Governor Shaktikanta Das

కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్‌ రెపో రేటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) యథాతథంగా కొనసాగించింది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఆధ్వర్యంలో ముంబైలో అక్టోబర్‌ 6 నుంచి 8 వరకు వరుసగా మూడు రోజులు సమావేశమైన ఆరుగురు సభ్యుల ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (మానిటరీ పాలసీ కమిటీ–ఎంపీసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్‌బీఐ రెపో రేటు 4.00 శాతం, రివర్స్‌ రెపో రేటు 3.35 శాతంగానే కొనసాగనున్నాయి. వృద్ధే లక్ష్యంగా వరుసగా ఎనిమిది ద్వైమాసికాల నుంచి ఆర్‌బీఐ సరళతర వడ్డీరేట్ల విధానాన్ని అనుసరిస్తోంది. రిటైల్‌ ద్రవ్యోల్బణం పూర్తి అదుపులోనికి వస్తుందన్న అంచనాలతో రెపో యథాతథం కొనసాగింపునకు కమిటీ ఆమోదముద్ర వేసింది.

ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం–ముఖ్యాంశాలు

  • రిటైల్‌ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక ఏడాదిలో సగటు 5.7 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలను తాజాగా 5.3 శాతానికి కుదించింది.
  • 2021–22 ఏడాదిలో దేశ వృద్ధి రేటు 9.5 శాతం నమోదవుతుందని అంచనా వేసింది. తొలి 10.5 శాతం అంచనాలను జూన్‌ పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ 9.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.
  • కోవిడ్‌ ప్రతికూల ప్రభావాలకు గురయిన రాష్ట్రాలకు ద్రవ్య లభ్యత విషయంలో ఎటువంటి సమస్యలూ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 2021–22 ఏడాది ‘వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌ (డబ్ల్యూఎంఏ), ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌలభ్యం ద్వారా పెంచిన రుణ పరిమితులను అన్ని విధాలా కొనసాగించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.
  • ఐఎంపీఎస్‌ (ఇమీడియట్‌ పేమెంట్‌ సర్వీస్‌) ద్వారా ప్రస్తుత లావాదేవీ పరిమితి రూ.2 లక్షలు కాగా, దీనిని రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం జరిగింది. డిజిటల్‌ లావాదేవీల పెంపు ఈ నిర్ణయ ప్రధాన లక్ష్యం. ఐఎంపీఎస్‌ను నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) నిర్వహిస్తోంది.

పాలసీలో మరికొన్ని ముఖ్యాంశాలు

  • ఫైనాన్షియల్‌ మోసాల నివారణే లక్ష్యంగా కొత్త విధాన రూపకల్పన జరగనుంది.
  • బ్యాంకుల తరహాలోనే బడా నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (ఎన్‌బీఎప్‌సీ) కస్టమర్ల సమస్యల పరిష్కారానికి అంతర్గత అంబుడ్స్‌మన్‌ యంత్రాంగం ఏర్పాటు కానుంది.
  • దేశంలోకి భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో గ్లోబల్‌బాండ్‌ ఇండిసీస్‌లో చేరే విషయంలో భారత్‌ ముందడులు వేస్తోంది. ఆర్‌బీఐ, కేంద్రం  ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఇండెక్స్‌ ప్రొవైడర్లతో చర్చిస్తున్నాయి.  
  • తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్‌ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరగనుంది.

రెపో, రివర్స్‌ రెపో రేటు అంటే ఏమిటీ?
ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీని రెపో రేటు అంటారు. ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై పొందే వడ్డీ రేటును రివర్స్‌ రెపో రేటుగా వ్యవహరిస్తారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్‌ రెపో రేటును యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం
ఎప్పుడు : అక్టోబర్‌ 8
ఎవరు    : ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (మానిటరీ పాలసీ కమిటీ–ఎంపీసీ)
ఎక్కడ    : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : రిటైల్‌ ద్రవ్యోల్బణం పూర్తి అదుపులోనికి వస్తుందన్న అంచనాలతో...


Minister Pushpa Srivani: రాష్ట్రంలోని ఏ జిల్లాలో గిరిజన మ్యూజియానికి శంకుస్థాపన చేశారు?

Tribal Museum

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం తాజంగిలో రూ.35 కోట్లతో నిర్మిస్తున్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణానికి అక్టోబర్‌ 9న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీ వాణి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటైన సభలో ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 21 ఎకరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మ్యూజియాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టాయన్నారు. పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అధ్యక్షతన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాన్ని తాజంగిలో నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యూజియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణానికి శంకుస్థాపన
ఎప్పుడు : అక్టోబర్‌ 8
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీ వాణి
ఎక్కడ    : తాజంగి, చింతపల్లి మండలం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌


Amber Enterprises: యాంబర్‌ ఏసీ తయారీ యూనిట్‌ ఎక్కడ ఏర్పాటు కానుంది?

Amber at sri city

రూమ్‌ ఎయిర్‌ కండిషనర్లు, విడిభాగాల తయారీలో పేరుగాంచిన యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తయారీ యూనిట్‌కు అక్టోబర్‌ 8న భూమిపూజ చేసింది. చిత్తూరు జిల్లా శ్రీసిటీలో 16.3 ఎకరాల్లో సుమారు రూ.250 కోట్లతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఇండియా లిమిటెడ్‌కు ఇది దేశంలో 15వ ప్లాంట్‌ కాగా దక్షిణాదిన తొలి యూనిట్‌. ఎల్‌జీ, కారియర్, హిటాచీ, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ వంటి 20కిపైగా ప్రముఖ కంపెనీలకు ఉత్పత్తులను యాంబర్‌ అందిస్తుంది. ఈ యూనిట్‌ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 వేలమందికి ఉపాధి లభిస్తుందని అంచనా.

15 రోజుల్లో మూడు యూనిట్లు
గత 15 రోజుల్లో మూడు ప్రముఖ సంస్థలు ఏసీ తయారీ యూనిట్లు పనులు ప్రారంభించాయి. ఇప్పటికే జపాన్‌కు చెందిన డైకిన్, ఇండియాకు చెందిన బ్లూస్టార్‌ కంపెనీలు శ్రీ సిటీలో పెట్టుబడులు పెట్టగా, తాజాగా యాంబర్‌ ఇండియా కూడా నిర్మాణ పనులు ప్రారంభించింది. ఈ మూడు యూనిట్ల ద్వారా రూ.1,790 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు సుమారు 5 వేలమందికి ఉపాధి లభించనుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఏసీ తయారీ యూనిట్‌ నిర్మాణానికి శంకుస్థాపన
ఎప్పుడు  : అక్టోబర్‌ 8
ఎవరు    : యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఇండియా లిమిటెడ్‌
ఎక్కడ    : శ్రీసిటీ, చిత్తూరు జిల్లా
ఎందుకు : రూమ్‌ ఎయిర్‌ కండిషనర్లు, విడిభాగాల తయారీ కోసం...


Justice Prashant Kumar Mishra: ఏపీ హైకోర్టు నూతన సీజేగా నియమితులైన న్యాయమూర్తి?

Justice Prashant Kumar Mishra

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు చీఫ్‌ జస్టిస్‌ల నియామకం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ నియమితులయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అక్టోబర్‌ 9న ఆమోదం తెలిపారు.

జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా నేపథ్యం...
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రాయగఢ్‌లో 1964, ఆగస్టు 29న జన్మించిన జస్టిస్‌ మిశ్రా... బిలాస్‌పూర్‌లోని గురు ఘాసిదాస్‌ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు. 1987 సెప్టెంబరు 4న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. రాయ్‌గఢ్‌లోని జిల్లా కోర్టు, జబల్‌పూర్‌లోని మధ్యప్రదేశ్‌ హైకోర్టు, బిలాస్‌పూర్‌లోని ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టుల్లో ప్రాక్టీసు చేశారు. సివిల్, క్రిమినల్‌ కేసుల్లో పేరుగాంచారు. ఛత్తీస్‌గఢ్‌ బార్‌ కౌన్సిల్‌కు చైర్మన్‌గా పనిచేశారు. 2004 జూన్‌ 26 నుంచి 2007 ఆగస్టు 31 వరకు ఆ రాష్ట్ర అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా పనిచేశారు. అనంతరం సెప్టెంబరు 1, 2007 నుంచి న్యాయమూర్తి అయ్యే వరకూ అడ్వొకేట్‌ జనరల్‌గా కొనసాగారు. డిసెంబరు 10, 2009న ఛత్తీస్‌గఢ్‌ న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఏపీ హైకోర్టు నూతన సీజేగా నియమితులైన న్యాయమూర్తి?
ఎప్పుడు  : అక్టోబర్‌ 9
ఎవరు    : జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా
ఎందుకు : సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలపడంతో...

 

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 8 కరెంట్‌ అఫైర్స్‌

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌


డౌన్‌లోడ్‌ వయా ఆపిల్‌ ఐ స్టోర్

Published date : 09 Oct 2021 07:37PM

Photo Stories