Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 8 కరెంట్‌ అఫైర్స్‌

Abdul Razak Gurna

Nobel Prize: సాహిత్య నోబెల్‌ పురస్కారం–2021

శరణార్థుల కన్నీళ్ల కథల్ని అక్షరబద్ధం చేసిన టాంజానియా రచయిత అబ్దుల్‌ రజాక్‌ గుర్నా(73)కు 2021 ఏడాది సాహితీ నోబెల్‌ పురస్కారం లభించింది. వలసవాదంపై పోరాటం చేస్తూనే, శరణార్థుల సమస్యల్ని కళ్లకు కట్టినట్టుగా ఆవిష్కరించినందుకుగాను ఆయనకు ఈ అవార్డును ఇస్తున్నట్టుగా స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోమ్‌లోని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సెన్సైస్‌ అక్టోబర్‌ 6న ప్రకటించింది. పురస్కారం కింద అబ్దుల్‌కు 11 లక్షల డాలర్ల నగదు బహుమతి లభిస్తుంది. 1986లో వోల్‌ సోయింకా తర్వాత ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నల్ల జాతి ఆఫ్రికన్‌గా అబ్దుల్‌ గుర్తింపు పొందారు. ఆఫ్రికాలో జన్మించిన రచయిత ఒకరికి నోబెల్‌ రావడం ఇది ఆరోసారి. ఇటీవల యూకేలోని కెంట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేసిన అబ్దుల్‌... తనకు వచ్చిన నోబెల్‌ పురస్కారాన్ని ఆఫ్రికాకు, ఆఫ్రికన్లకు, పాఠకులకు అంకితం ఇస్తున్నట్టు ప్రకటించారు.

ఒక శరణార్థి...
1948, డిసెంబర్‌ 20న హిందూమహాసముద్రంలోని జంజీబార్‌ ద్వీపంలో అబ్దుల్‌ రజాక్‌ గుర్నా జన్మించారు. బ్రిటీష్‌ వలస పాలనలో ఉండే ఈ ద్వీపం 1964లో స్వాతంత్య్రం పొంది టాంజానియాలో భాగంగా మారింది. అయితే అక్కడ అశాంతి ప్రజ్వరిల్లడంతో ఆయన 1968లో బ్రిటన్‌కు వలస వెళ్లారు. స్వయంగా ఒక శరణార్థి  అయిన అబ్దుల్‌... శరణార్థులకు ఎదురయ్యే చేదు అనుభవాలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా చూశారు.

శరణార్థుల వ్యథలే కథా వస్తువుగా....
21 ఏళ్ల వయసులోనే కలం పట్టిన అబ్దుల్‌... శరణార్థులకి మద్దతుగా పోరాటం చేస్తూ వారి కన్నీటి కథల్ని అక్షరబద్ధం చేశారు. మొత్తం 10 నవలలు, లెక్కకు మించి చిన్న  కథలు రాశారు. శరణార్థుల వ్యథలనే కథా వస్తువుగా తీసుకున్నప్పటికీ ఆ రచనల్లో ఖండాలు, దేశాల, సంస్కృతుల మధ్య ఉన్న తేడాలు, జీవన వైవిధ్యాలు.. అంతర్లీనంగా ప్రేమ, దుఃఖం, ఆవేదన, ఆక్రోశం వంటి వివిధ భావాల సమ్మేళనంగా సాగాయి. ఆయన రచనల్లో మెమొరీ ఆఫ్‌ డిపార్చర్, పిలిగ్రిమ్స్‌ వే, ప్యారడైజ్, బై ది సీ, డిజర్షన్‌ నవలలు ప్రసిద్ధి పొందాయి. ప్యారడైజ్‌ నవల 1994లో బుకర్‌ప్రైజ్‌ షార్ట్‌లిస్టులో అర్హత సంపాదించింది. అబ్దుల్‌ మాతృభాష స్వహిలి అయినప్పటీకి రచనలు మాత్రం ఆంగ్లంలో సాగాయి.

అబ్దుల్‌ రజాక్‌ గుర్నా రచించిన పుస్తకాలు

  • మెమొరీ ఆఫ్‌ డిపార్చర్‌(1987)
  • పిలిగ్రిమ్స్‌ వే(1988)
  • డాటీ(1990)
  • పారడైజ్‌(1994)
  • అడ్మైరింగ్‌ సైలెన్స్‌(1996)
  • బై ది సీ(2001)
  • డిజర్షన్‌(2005)
  • ది లాస్ట్‌ గిఫ్ట్‌(2011)
  • గ్రేవల్‌ హార్ట్‌(2017)
  • ఆఫ్టర్‌ లైవ్స్‌(2020)

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : సాహిత్య నోబెల్‌ పురస్కారం–2021 విజేత
ఎప్పుడు : అక్టోబర్‌ 7
ఎవరు    : అబ్దుల్‌ రజాక్‌ గుర్నా(73) 
ఎందుకు : వలసవాదంపై పోరాటం చేస్తూనే, శరణార్థుల సమస్యల్ని కళ్లకు కట్టినట్టుగా ఆవిష్కరించినందుకుగాను...


President Kovind: చామరాజనగర మెడికల్‌ ఆస్పత్రిని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?

Kovind at Chamarajanagar

కర్ణాటక రాష్ట్రం చామరాజనగర జిల్లాలోని చామరాజనగర శివార్లలో 450 పడకల చామరాజనగర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఆస్పత్రి ప్రారంభమైంది. భారత రాష్ట్రపతి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అక్టోబర్‌ 7న ఈ ఆస్పత్రిని ప్రారంభించారు. కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్, సీఎం బసవరాజ బొమ్మై పాల్గొన్నారు. అంతకుముందు జిల్లాలోని బిళిగిరి రంగనాథ స్వామి ఆలయాన్ని కోవింద్‌ దర్శించుకున్నారు.

35 పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్ల ప్రారంభం
దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కనీసం ఒక వైద్య కళాశాల ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్‌లను నెలకొల్పే దిశగా కృషి కొనసాగుతోందని వివరించారు. పీఎం కేర్స్‌ ఫండ్‌ కింద 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన 35 ప్రెషర్‌ స్వింగ్‌ అబ్సార్ప్‌షన్‌(పీఎస్‌ఏ) ఆక్సిజన్‌ ప్లాంట్లను మోదీ అక్టోబర్‌ 7న ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌ ‘ఎయిమ్స్‌’ ఈ కార్యక్రమానికి వేదికగా మారింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : చామరాజనగర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఆస్పత్రి ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్‌ 7
ఎవరు    : అబ్దుల్‌ రజాక్‌ గుర్నా(73) 
ఎక్కడ    : చామరాజనగర శివారు ప్రాంతం, చామరాజనగర జిల్లా, కర్ణాటక రాష్ట్రం 


2021 Nobel Peace Prize: ఇద్దరు వ్యక్తులకు నోబెల్‌ శాంతి బహుమతి

2021 Nobel Peace Prize

ఏటా ప్రపంచంలో శాంతి నెలకొల్పేందుకు వ్యక్తులు, సంస్ధలు చేసిన కృషికి ప్రతిఫలంగా ప్రకటించే నోబెల్‌ శాంతి పురస్కారానికి ఈ ఏడాది(2021) మరియా రెస్సా, దిమిత్రి మరటోవ్‌ కు ఎంపికయ్యారు. నార్వేజియన్‌ నోబెల్‌ కమిటీ అక్టోబర్‌ 8న శాంతి పురస్కారం విజేతను ప్రకటించింది. ప్రజాస్వామ్యానికి మూలమైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిరక్షణ కోసం చేసిన కృషికి గానూ వీరిని ఈ విశిష్ట పురస్కారానికి ఎంపిక చేసినట్లు నోబెల్‌ కమిటీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ పరంగా తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం వీరు ధైర్యంగా పోరాడుతున్నారని ప్రశంసించింది. దిమిత్రి మరటోవ్‌ ఒక రష్యన్‌ జర్నలిస్ట్, నోవాయా గజెటా వార్తాపత్రిక ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌. 24 ఏళ్ల పాటు ఆ పత్రిక ఎడిటర్‌గా చేశారు. మరియా రెస్సా ఫిలిప్పినో–అమెరికన్‌ జర్నలిస్ట్‌. ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజం కోసం 2012లో ఆమె ‘రాప్లర్‌’ పేరుతో ఓ డిజిటల్‌ మీడియా కంపెనీని స్థాపించారు.

Shooting: షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో నాలుగో స్వర్ణం సాధించిన షూటర్‌?

పెరూ రాజధాని నగరం లిమాలో జరుగుతున్న ప్రపంచ జూనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ మనూ భాకర్‌ నాలుగో స్వర్ణం సాధించింది. అక్టోబర్‌ 7న జరిగిన మహిళల టీమ్‌ 25 మీటర్ల పిస్టల్‌ విభాగం ఫైనల్లో మనూ, రిథమ్, నామ్యా కపూర్‌లతో కూడిన టీమిండియా 16–4తో అమెరికాపై నెగ్గింది. పురుషుల ట్రాప్‌ టీమ్‌ ఈవెంట్‌లో, 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ విభాగంలో భారత్‌కు రజతాలు దక్కాయి.

భారత క్రీడాకారిణి అన్షు మలిక్‌ ఏ క్రీడలో ప్రసిద్ధురాలు?
నార్వే రాజధాని నగరం ఓస్లోలో జరుగుతున్న ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారతీయ మహిళా రెజ్లర్‌ అన్షు మలిక్‌కు రజత పతకం లభించింది. అక్టోబర్‌ 7న జరిగిన మహిళల 57 కేజీల ఫైనల్లో 20 ఏళ్ల అన్షు ‘బై ఫాల్‌’ పద్ధతిలో టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, 2016 రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ హెలెన్‌ లూయిస్‌ మరూలీస్‌ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. ఫలితంగా రజతం దక్కింది. ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో రజతం గెలిచిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా అన్షు గుర్తింపు పొందింది.

సరితాకు కాంస్యం
ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లోని మహిళల 59 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన సరితా మోర్‌ కాంస్యంతో మెరిసింది. సారా జోనా లిండ్‌బోర్గ్‌ (స్వీడన్‌)తో జరిగిన కాంస్య పతక పోరులో సరిత 8–2తో విజయం సాధించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ప్రపంచ జూనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ మహిళల టీమ్‌ 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో సర్ణ గెలిచిన జట్టు?
ఎప్పుడు : అక్టోబర్‌ 7
ఎవరు    : మనూ, రిథమ్, నామ్యా కపూర్‌లతో కూడిన టీమిండియా జట్టు
ఎక్కడ    : లిమా, పెరూ
ఎందుకు : ఫైనల్లో టీమిండియా 16–4తో అమెరికా జట్టుపై విజయం సాధించినందున...


GDP growth: ఫిచ్‌ అంచనాల ప్రకారం 2021–22లో భారత్‌ వృద్ధి రేటు?Fitch Ratings

2021–2022 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ వృద్ధి రేటు అంచనాలను 10 శాతం నుంచి 8.7 శాతానికి తగ్గిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ‘ఫిచ్‌ రేటింగ్స్‌’ వెల్లడించింది. కరోనా రెండో విడత ఎక్కువ కాలం పాటు ఉండడాన్ని తన అంచనాల తగ్గింపునకు కారణమని తెలిపింది. ఈ మేరకు అక్టోబర్‌ 7న ఒక నివేదికను విడుదల చేసింది. 2021–2022లో భారత్‌ వృద్ధి రేటు 12.8 శాతంగా నమోదవ్వొచ్చని తొలుత ఫిచ్‌ అంచనా వేసింది. అయితే దాన్ని 12.8 నుంచి 10 శాతానికి తగ్గించింది. తాజాగా 10 శాతం నుంచి 8.7 శాతానికి తగ్గించింది.

2021–2022 భారత్‌ వృద్ధి రేటుకు సంబంధించి ఇతర అంచనాలు ఇలా...

  • ఆర్‌బీఐ – 9.5 శాతం
  • ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ – 9.5 శాతం
  • మూడిస్‌ – 9.3 శాతం  
  • ప్రపంచబ్యాంకు – 8.3 శాతం

యూనికార్న్‌గా రెబెల్‌ ఫుడ్స్‌...
ఫాసోస్, బెహ్రౌజ్‌ బిర్యానీ, మాండరిన్‌ ఓక్‌ తదితర బ్రాండ్ల స్టార్టప్‌ రెబెల్‌ ఫుడ్స్‌ తాజాగా 17.5 కోట్ల డాలర్ల(రూ. 1,300 కోట్లు) పెట్టుబడులను సమీకరించింది. దీంతో కంపెనీ 1.4 బిలియన్‌ డాలర్ల(రూ. 10,400 కోట్లు) విలువను సాధించింది. తద్వారా యూనికార్న్‌(బిలియన్‌ డాలర్ల విలువ) హోదాను సాధించింది. రెబెల్‌ ఫుడ్స్‌ను 2011లో జైదీప్‌ బర్మన్, కల్లోల్‌ బెనర్జీ ఏర్పాటు చేశారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 2021–2022 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ వృద్ధి రేటు అంచనాలు 10 శాతం నుంచి 8.7 శాతానికి తగ్గింపు
ఎప్పుడు : అక్టోబర్‌ 7
ఎవరు : అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ‘ఫిచ్‌ రేటింగ్స్‌’
ఎందుకు : కరోనా రెండో విడత ఎక్కువ కాలం పాటు ఉండటంతో...


Andhra Pradesh: వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని తొలుత ఎప్పుడు ప్రారంభించారు?

YSR Asara

పొదుపు సంఘాల మహిళలకు ఆర్ధిక తోడ్పాటు అందించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్‌ ఆసరా పథకం’ రెండో విడతను అక్టోబర్‌ 7న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... ‘‘రాష్ట్రంలో 7,97,000 పొదుపు సంఘాల్లో ఉన్న 78,76,000 మంది అక్కచెల్లెమ్మలు 2019 ఏప్రిల్‌ నాటికి రూ.25,517 కోట్లు బ్యాంకులకు బాకీ పడ్డారు. ఈ మొత్తాన్ని వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా 4 విడతల్లో ఉచితంగా వారి చేతికే అందిస్తామని చెప్పాం. ఆ మాటకు కట్టుబడి తొలి ఏడాది రూ.6,318 కోట్లు ఇచ్చాం. రెండో ఏడాది రూ.6,440 కోట్లు జమ చేస్తున్నాం. రెండు విడతల్లో రూ.12,758 కోట్లు లబ్ధి కలిగించాం.’’అని పేర్కొన్నారు.

2020, సెప్టెంబర్‌ 11న...
2019, ఏప్రిల్‌ 11 నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉండే అప్పు మొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లించే వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 2020, సెప్టెంబర్‌ 11న లాంఛనంగా ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి తొలి దశలో రూ.6,792.20 కోట్లను పొదుపు సంఘాల మహిళల ఖాతాలకు సీఎం జమ చేశారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : వైఎస్సార్‌ ఆసరా పథకం రెండో విడత ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్‌ 7
ఎవరు    : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ    : పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాల, ఒంగోలు, ప్రకాశం జిల్లా
ఎందుకు  : పొదుపు సంఘాల మహిళలకు ఆర్ధిక తోడ్పాటు అందించేందుకు...


Indian School of Business: హైదరాబాద్‌కు చెందిన ఐఎస్‌బీతో ఒప్పందం చేసుకున్న రాష్ట్రం?

ISB Hyderabad

యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామి కావడానికి హైదరాబాద్‌కు చెందిన ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) ముందుకొచ్చింది. జాతీయ నూతన విద్యా విధానం ప్రకారం కొత్త కోర్సుల్లో శిక్షణ ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ), ఏపీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అకాడమీతో (అపిట) కలసి శిక్షణ కార్యక్రమాల్లో ఐఎస్‌బీ పాలుపంచుకోనుంది. ఈ మేరకు ఏపీఎస్‌ఎస్‌డీసీ, అపిట, ఐఎస్‌బీ మధ్య ఒప్పందం జరగనుంది. ఒప్పందంలో భాగంగా ప్రవర్తన నైపుణ్యాలు, వ్యాపార దక్షత కోర్సుల్లో శిక్షణకు ఐఎస్‌బీ సహకారం అందిస్తుంది.

దావో ఈవీటెక్‌తో ఒప్పందం
ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మాన్యుఫార్చురింగ్‌ కంపెనీ దావో ఈవీటెక్, అనుబంధ సంస్థ అమరావతి ఈవీ కన్సల్టింగ్‌ అండ్‌ ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో అక్టోబర్‌ 7న ఏపీఎస్‌ఎస్‌డీసీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఈ కామర్స్‌ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)తో ఒప్పందం చేసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం
ఎప్పుడు : అక్టోబర్‌ 7
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం
ఎందుకు : యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో...

 

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 7 కరెంట్‌ అఫైర్స్‌

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌


డౌన్‌లోడ్‌ వయా ఆపిల్‌ ఐ స్టోర్‌

Published date : 08 Oct 2021 07:48PM

Photo Stories