Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 7 కరెంట్‌ అఫైర్స్‌

Nobel Prize Chemistry 2021

రసాయన శాస్త్ర నోబెల్‌ పురస్కారం–2021

కొత్త మందుల తయారీకి అవసరమైన పద్ధతి ఒకదాన్ని ఆవిష్కరించినందుకు జర్మనీకి చెందిన శాస్త్రవేత్త బెంజిమన్‌ లిస్ట్, అమెరికా శాస్త్రవేత్త డేవిడ్‌ డబ్ల్యూసీ మెక్‌మిలన్‌లకు 2021 ఏడాది రసాయన శాస్త్ర నోబెల్‌ బహుమతి లభించింది. ఈ విషయాన్ని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సెన్సైస్‌ అక్టోబర్‌ 6న స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోమ్‌లో ప్రకటించింది. నోబెల్‌ బహుమతి కింద ఇద్దరు శాస్త్రవేత్తలు బంగారు పతకంతో పాటు 11 లక్షల అమెరికన్‌ డాలర్లను అందుకోనున్నారు. బెంజమిన్‌ లిస్ట్‌ ప్రస్తుతం మ్యాక్స్‌ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కోలన్‌ఫార్‌షుంగ్‌(జర్మనీ)కు డైరెక్టర్‌గా పనిచేస్తుండగా, ప్రిన్స్‌టన్‌ యూనివర్శిటీ (అమెరికా) ప్రొఫెసర్‌గా డేవిడ్‌ మెక్‌మిలన్‌ ఉన్నారు.

 

ఆర్గానోకెటాలసిస్‌ విధానం అభివృద్ధి..
పరమాణువుల అమరికను సరికొత్త మార్గంలో అభివృద్ధిపరిచే ‘అసిమెట్రిక్‌ ఆర్గానోకెటాలసిస్‌’ అనే కొత్త విధానాన్ని బెంజిమన్, డేవిడ్‌ ఆవిష్కరించారు. ఆర్గానోకెటాలసిస్‌ పద్ధతి ఇప్పటికే మానవాళికి ఎంతో ఉపయోగకరంగా మారిందని, ఫార్మా పరిశోధనల్లో కీలకపాత్ర పోషించడమే కాకుండా.. రసాయన శాస్త్రాన్ని మరింత పర్యావరణ హితంగా మార్చిందని నోబెల్‌ అవార్డుల కమిటీ పేర్కొంది. శాస్త్రవేత్తలు ఇద్దరూ ఈ ఆర్గానిక్‌ కెటాలసిస్‌ను 2000 సంవత్సరంలో వేర్వేరుగా అభివృద్ధి చేశారని తెలిపింది. నోబెల్‌ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం...

  • పరమాణువులను ఒక ప్రత్యేక క్రమంలో అనుసంధానం చేసి... అవసరమైన లక్షణాలు, ధర్మాలతో అణువులను తయారు చేయడం చాలా కష్టమైన ప్రక్రియ. అందుకు చాలా సమయంపడుతుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి 2000 ఏడాది ప్రారంభం వరకు శాస్త్రవేత్తలు లోహ ఉత్ప్రేరకాలు లేదా ఎంజైములను ఉపయోగించారు.
  • లోహ ఉత్ప్రేరకాలను ఉపయోగించినప్పుడు పర్యావరణానికి హాని కలిగించే విషపూరితాలు వెలువడుతుంటాయి. అయితే బెంజమిన్, డేవిడ్‌ పరమాణువులను వినియోగించి ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండానే కావాల్సిన ఫలితాన్ని సాధించే మూడో విధానాన్ని కనుగొన్నారు. అసిమెట్రిక్‌ ఆర్గానోకెటాలసిస్‌ అనే ఈ నూతన విధానం ఇప్పుడు విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది.
  • అత్యంత సులభమైన, తక్కువ వ్యయంతో కూడిన ఆర్గానోకెటాలసిస్‌ ప్రక్రియ నూతన ఔషధాల తయారీ, ప్రత్యేక రసాయనాల ఉత్పత్తికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆహార ఉత్పత్తుల్లో రుచులను పెంపొందించే విధానాలకూ దోహదపడుతోంది. వాహనాలు విడుదల చేసే ఇంధన కాలుష్యాల తీవ్రతను తగ్గించేందుకు కూడా నూతన పక్రియ తోడ్పడుతోంది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : రసాయన శాస్త్ర నోబెల్‌ పురస్కారం–2021 విజేతలు
ఎప్పుడు : అక్టోబర్‌ 6
ఎవరు    : బెంజిమన్‌ లిస్ట్‌(జర్మనీ), డేవిడ్‌ డబ్ల్యూసీ మెక్‌మిలన్‌(అమెరికా)
ఎందుకు : కొత్త మందుల తయారీకి అవసరమైన పద్ధతి(అసిమెట్రిక్‌ ఆర్గానోకెటాలసిస్‌) ఒకదాన్ని ఆవిష్కరించినందుకు...


PM-MITRA: దేశంలో కొత్తగా ఎన్ని మెగా టెక్స్‌టైల్‌ పార్కులు ఏర్పాటుకానున్నాయి?

Textile Industry

దేశవ్యాప్తంగా కొత్తగా ఏడు ‘‘ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ రీజియన్‌ అండ్‌ అపెరెల్‌ పార్కు’’ (పీఎం మిత్ర)ల ఏర్పాటుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ అక్టోబర్‌ 6న ఆమోదం తెలిపింది. వస్త్ర రంగంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ పడేవిధంగా రూ.4,445 కోట్లతో వీటిని నెలకొల్పనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రభుత్వ–ప్రైవేట్‌ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో ఈ పార్కులను అభివృద్ధి చేస్తాయి.

ముఖ్యాంశాలు...

  • ఆర్థిక వ్యవస్థలో వస్త్ర రంగం వాటాను మరింత పెంచడానికే ఈ టెక్స్‌టైల్‌ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు.
  • ఆసక్తి చూపిన రాష్ట్రాల్లో గ్రీన్‌ ఫీల్డ్‌/బ్రౌన్‌ఫీల్డ్‌ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.
  •  అభివృద్ధి ఆధారిత పెట్టుబడి మద్దతు కింద గ్రీన్‌ఫీల్డ్‌కు గరిష్టంగా రూ.500 కోట్లు, బ్రౌన్‌ ఫీల్డ్‌కు గరిష్టంగా రూ.200 కోట్లు ఇవ్వనున్నారు. రూ.300 కోట్ల ప్రోత్సాహక మద్దతు అందించనున్నారు.
  • ప్రైవేట్‌ రంగం భాగస్వామ్యంతో ప్రాజెక్టును ఆకర్షణీయంగా రూపొందించడానికి గ్యాప్‌ ఫండ్‌ సైతం అందజేయనుంది.
  • ఏడు మెగా టెక్స్‌టైల్‌ పార్కులతో 7 లక్షల మందికి ప్రత్యక్షంగా, మరో 14 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని కేంద్రం అంచనా.
  • టెక్స్‌టైల్‌ పార్కులో వర్కర్స్‌ హాస్టళ్లు, హౌసింగ్, లాజిస్టిక్‌ పార్క్, గిడ్డంగులు, వైద్య, శిక్షణ, నైపుణ్య అభివృద్ధి తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తారు.
  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్, అస్సాం, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు టెక్స్‌టైల్‌ పార్కుల పట్ల ఆసక్తి వ్యక్తం చేసినట్లు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : కొత్తగా ఏడు ‘‘ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ రీజియన్‌ అండ్‌ అపెరెల్‌ పార్కు’’ (పీఎం మిత్ర)ల ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : అక్టోబర్‌ 6
ఎవరు    : కేంద్ర కేబినెట్‌
ఎక్కడ    : దేశవ్యాప్తంగా...
ఎందుకు : ఆర్థిక వ్యవస్థలో వస్త్ర రంగం వాటాను మరింత పెంచడానికి...


Public Office: రాజ్యాంగ పదవిలో 20 ఏళ్ళు పూర్తిచేసుకున్న నేత?

Modi

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగ పదవిలో బాధ్యతలు స్వీకరించి నేటికి 20 ఏళ్ళు పూర్తయ్యాయి. 2001 అక్టోబర్‌ 7న గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఆయన అధికార పీఠానెక్కారు. అనంతరం 13 సంవత్సరాలు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా కొనసాగారు. తదనంతరం 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి, ఏడేళ్లుగా అదే పదవిలో కొనసాగుతున్నారు. ఆయన వివిధ రాజ్యాంగబద్ధ పదవుల్లో పనిచేయడం ఆరంభించి నేటికి 20 సంవత్సరాలు అవుతోంది. ఈ పదవుల్లో ఆయన అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కొన్ని నిర్ణయాలు క్లుప్తంగా... 

  • నోట్లరద్దు: 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో నల్లధనం గురించి ప్రస్తావించిన మోదీ ప్రధానైన రెండేళ్లకు 2016 నవంబర్‌ 8 వతేదీ రాత్రి 8 గంటలకు రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు.
  • సర్జికల్‌ స్ట్రైక్స్‌: 2016 సెప్టెంబర్‌ 18న జమ్మూ కాశ్మీర్‌ ఉరి సెక్టార్‌లోని ఆర్మీ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 19 మంది సైనికులు వీరమరణం పొందగా, 30 మందికి పైగా సైనికులు గాయపడ్డారు. ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృత్యువాతపడ్డారు. ఈదాడికి ప్రతికారంగా ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం ప్రకారం 2016 సెప్టెంబర్‌ 28న భారత సైన్యంలోని 25మంది పారా కమాండోలు పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద కేంద్రాలపై సర్జికల్‌ స్ట్రైక్‌ను విజయవంతంగా నిర్వహించారు. 
  • వైమానిక దాడి: 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్‌ పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు చేసిన దాడిలో40 మంది సైనికులు వీరమరణం పొందారు. దీనికి ప్రతిగా మోదీ ఆదేశాల మేరకు2019 ఫిబ్రవరి  26న భారత వైమానిక దళం పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో వైమానిక దాడి చేసింది. ఇందులో 300–400 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.  
  • ఆర్టికల్‌ 370 రద్దు: జమ్మూ కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే 370 అధికరణాన్ని మోదీ 2019 ఆగస్టు 5న రద్దుచేశారు. అదే సమయంలో జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చారు ఏర్పాటు చేశారు. నిర్ణయానంతరం రాష్ట్రంలో ఎలాంటి హింస జరగకుండా పలు చర్యలు తీసుకున్నారు.  
  • ముస్లిం మహిళా వివాహ హక్కు రక్షణ: 2017 ఆగస్టు 22న సుప్రీంకోర్టు ట్రిపుల్‌ తలాక్‌ చట్ట విరుద్ధమని ప్రకటించింది. దీనికనుగుణంగా కేంద్ర ప్రభుత్వం 2017 డిసెంబర్‌ 28న ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) బిల్లు 2017 ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది కానీ రాజ్యసభ ఆమోదం పొందలేకపోయింది. రెండో దఫా ప్రధానిగా ఎన్నికైన తర్వాత మోదీ ప్రభుత్వం మరోసారి లోక్‌సభ, రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేయించింది. 
  • నూతన విద్యా విధానం: 1986 తరువాత  దేశంలో మొదటిసారిగా ప్రభుత్వం నూతన  జాతీయ విద్యా విధానాన్ని 2020 జూలై 29న ప్రకటించింది. ఇందులోభాగంగా 2030 నాటికి దేశంలో 100 శాతం స్థూల నమోదు నిష్పత్తిని సాధించాలని లక్ష్యం నిర్దేశించారు. స్థానిక, మాతృభాషలో 5వ తరగతి వరకు విద్యను, ఉన్నత విద్యాసంస్థల్లో ఏకరీతి విద్యను అందించేందుకు ఈ విధానంలో ప్రాధాన్యత ఇచ్చారు.  
  • స్వచ్ఛ భారత్‌ అభియాన్‌: 2014 గాంధీ జయంతి నాడు స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ను మోదీ ప్రారంభించారు. పరిసరాలను పరిశుభ్రతే ఈ మిషన్‌ లక్ష్యం. మిషన్‌ కోసంపరిశుభ్రత పన్ను అంటే సెస్‌ కూడా తీసుకువచ్చారు. 
  • జన్‌ ధన్‌ యోజన: దేశంలో అందరికీ  బ్యాంకింగ్‌ సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో  2014 ఆగస్టు 28న ప్రారంభించారు. పథకం ప్రారంభోత్సవం రోజున 1.5 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచారు. ప్రభుత్వ పథకాల సబ్సిడీ నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు దేశంలో 20 కోట్లకు పైగా జన్‌ ధన్‌ బ్యాంక్‌ ఖాతాలు తెరిచారు.  
  • ఆయుష్మాన్‌ భారత్‌: దేశంలోని పేదలకు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలను అందించేందుకు 2018 సెప్టెంబర్‌ 23న ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని మోదీ ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా పేదల కుటుంబాలకు రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమాను కేంద్రం అందిస్తుంది.  
  • అంతర్జాతీయ యోగా దినోత్సవం: 2014 సెప్టె ంబర్‌ 27న మొదటిసారిగా ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆయన విజ్ఞప్తిని అంగీకరించి జూన్‌ 21ని ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐరాస గుర్తించింది.

 

Pakistan Army: ఐఎస్‌ఐ చీఫ్‌గా నియమితులైన లెఫ్టినెంట్‌ జనరల్‌?

Pakistan Flag

పాకిస్తాన్‌ ఆర్మీ తమ సైనికాధికారుల పదవుల్లో కీలక మార్పులు చేసింది. పాక్‌ గూఢచార విభాగమైన ఇంటర్‌–సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ నదీమ్‌ అంజుమ్‌ను నియమించింది. ఇప్పటి వరకూ ఐఎస్‌ఐ చీఫ్‌గా పని చేసిన లెఫ్టినెంట్‌ జనరల్‌ ఫయాజ్‌ హమీద్‌ను పెషావర్‌ కార్ప్స్‌ కమాండర్‌గా నియమించింది. ఈ రెండు విభాగాలు పాకిస్తాన్‌ ఆర్మీలో అత్యంత కీలకమైనవి. సాధారణంగా పాక్‌ ఆర్మీ సూచన మేరకు ప్రధాన మంత్రి ఐఎస్‌ఐ చీఫ్‌ను నియమిస్తారు.

నైపుణ్యాలు కలిగిన వ్యక్తిగా...
ఐఎస్‌ఐ చీఫ్‌ నదీమ్‌ పంజాబ్‌ రెజిమెంట్‌కు చెందినవారు. కరాచీ కార్ప్స్‌ కమాండర్‌గానూ, క్వెట్టాలో కమాండ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ కమాండంట్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. కీలకమైన నైపుణ్యాలు కలిగిన వ్యక్తిగా నదీమ్‌కు పేరుంది.

రావణ పాత్రధారి అరవింద్‌ త్రివేది కన్నుమూత
1986లో వచ్చిన రామాయణం సీరియల్‌లో రావణుడి పాత్ర పోషించిన ప్రముఖ నటుడు అరవింద్‌ త్రివేది కన్నుమూశారు. గుండెపోటు కారణంగా అక్టోబర్‌ 5న ముంబైలో తుదిశ్వాస విడిచారు. 1991లో అరవింద్‌ బీజేపీ తరఫున సబర్కాతా నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. 1996 వరకు ఆయన ఎంపీగా సేవలందించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : పాకిస్తాన్‌ గూఢచార విభాగమైన ఇంటర్‌–సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) చీఫ్‌గా నియామకం
ఎప్పుడు : అక్టోబర్‌ 6
ఎవరు : లెఫ్టినెంట్‌ జనరల్‌ నదీమ్‌ అంజుమ్‌ 
ఎందుకు : పాకిస్తాన్‌ ఆర్మీ నిర్ణయం మేరకు...


World Championships: రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయురాలు?

Anshu Malik

ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌–2021లో భారత యువ రెజ్లర్, హరియాణకి చెందిన అన్షు మలిక్‌ అద్భుత ప్రదర్శన చేసింది. నార్వే రాజధాని నగరం ఓస్లోలో అక్టోబర్‌ 6న జరిగిన 57 కేజీల విభాగం సెమీఫైనల్లో అన్షు 11–0 పాయింట్లతో ‘టెక్నికల్‌ సుపీరియారిటీ’ పద్ధతిలో సొలోమియా వినిక్‌ (ఉక్రెయిన్‌)పై విజయం సాధించింది. ఫలితంగా అన్షు స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. దీంతో ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా 20 ఏళ్ల అన్షు రికార్డు నెలకొల్పింది. ఫైనల్లో 2016 రియో ఒలింపిక్స్‌ చాంపియన్, 2020 టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత హెలెన్‌ లూయిస్‌ మరూలిస్‌ (అమెరికా)తో అన్షు తలపడుతుంది.

ఆరో మహిళా రెజ్లర్‌: ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో పతకం ఖాయం చేసుకున్న ఆరో భారతీయ మహిళా రెజ్లర్‌ అన్షు మలిక్‌. గతంలో అల్కా తోమర్‌ (2006లో; 59 కేజీలు), బబితా ఫొగాట్‌ (2012లో; 51 కేజీలు), గీతా ఫొగాట్‌ (2012లో; 55 కేజీలు), పూజా ధాండా (2018లో; 57 కేజీలు), వినేశ్‌ ఫొగాట్‌ (2019లో; 53 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌?
ఎప్పుడు : అక్టోబర్‌ 6
ఎవరు    : అన్షు మలిక్‌
ఎక్కడ    : ఓస్లో, నార్వే
ఎందుకు : 57 కేజీల విభాగం సెమీఫైనల్లో అన్షు 11–0 పాయింట్లతో ‘టెక్నికల్‌ సుపీరియారిటీ’ పద్ధతిలో సొలోమియా వినిక్‌ (ఉక్రెయిన్‌)పై విజయం సాధించడంతో...


FIH Awards: ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డుకు ఎంపికైన హాకీ క్రీడాకారిణి?

Hockey Awards

అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ప్రకటించిన 2021 వార్షిక అవార్డుల్లో భారత క్రీడాకారులే అన్ని అవార్డుల్ని సొంతం చేసుకున్నారు. ఓటింగ్‌ పద్ధతిలో భారత పురుషులు, మహిళల జట్లకు చెందిన ఆరుగురు క్రీడాకారులు, హెడ్‌ కోచ్‌లు ఎఫ్‌ఐహెచ్‌ అత్యుత్తమ పురస్కారాలు దక్కించుకున్నారు.

అవార్డులు వివరాలు ఇలా... 

  • పురుషుల విభాగంలో హర్మన్‌ప్రీత్‌ సింగ్, మహిళల విభాగంలో గుర్జీత్‌ కౌర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డులకు ఎంపికయ్యారు.
  • పురుషుల విభాగంలో పీఆర్‌ శ్రీజేశ్‌... మహిళల విభాగంలో సవితా పూనియా ‘ఉత్తమ గోల్‌కీపర్‌’ ట్రోఫీలు గెలుచుకున్నారు. 
  • ‘బెస్ట్‌ రైజింగ్‌ స్టార్‌’లుగా పురుషుల విభాగంలో వివేక్‌ సాగర్‌... మహిళల విభాగంలో షర్మిలా దేవి విజేతలుగా నిలిచారు.
  • పురుషుల విభాగంలో ఉత్తమ కోచ్‌గా రీడ్‌... మహిళల విభాగంలో ఉత్తమ కోచ్‌గా జోయెర్డ్‌ మరీన్‌ ఎంపికయ్యారు.

ఓటింగ్‌లో 79 దేశాలు...

  • 79 దేశాలకు చెందిన హాకీ సమాఖ్యలు ఓటింగ్‌లో పాల్గొన్నాయి. సుమారు మూడు లక్షల మంది అభిమానులు కూడా ఈ ఓటింగ్‌లో పాలుపంచుకున్నట్లు ఎఫ్‌ఐహెచ్‌ తెలిపింది.  
  • ఆగస్టు 23న మొదలైన ఓటింగ్‌ ప్రక్రియ గత నెల 15న ముగిసింది. మొత్తం 100 శాతంలో హాకీ జట్ల కోచ్‌లు, కెప్టెన్లకు 50 శాతం ఓటింగ్‌ కోటా ఉండగా... 25 శాతం ఆటగాళ్లు, అభిమానులు వేసుకోవచ్చు. మిగతా 25 శాతం మీడియాకు కేటాయించారు.
  • అయితే ఓటింగ్‌ విధానంపై టోక్యో ఒలింపిక్స్‌ చాంపియన్, ప్రపంచ చాంపియన్‌ బెల్జియం హాకీ జట్టు ఆక్షేపించింది. పారదర్శకంగాలేదని ఓటింగ్‌ పద్ధతిని తప్పుబట్టింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల జట్టు 41 ఏళ్ల తర్వాత కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే.


Unicorn Company: యూనికార్న్‌ హోదా పొందిన క్రిప్టో ఎక్స్ఛేంజీ నిర్వాహక స్టార్టప్‌?

CoinSwitch Kuber

క్రిప్టో ఎక్స్ఛేంజీ నిర్వాహక స్టార్టప్‌ కాయిన్‌స్విచ్‌ కుబేర్‌ యూనికార్న్‌గా అవతరించింది. కంపెనీ విలువ బిలియన్‌ డాలర్లను తాకడంతో ఈ హోదాను పొందింది. పలు సంస్థల నుంచి తాజాగా 26 కోట్ల డాలర్లు(రూ. 1,943 కోట్లు) సమీకరించడంతో కంపెనీ విలువ 1.9 బిలియన్‌ డాలర్ల(రూ. 14,198 కోట్లు)కు బలపడింది. వెరసి క్రిప్టో ఎక్సే్ఛంజీ సంస్థలలో రెండో యూనికార్న్‌గా నిలిచింది. ఇంతక్రితం కాయిన్‌డీసీఎక్స్‌ సైతం బిలియన్‌ డాలర్ల విలువను అందుకున్న సంగతి తెలిసిందే.

లిషియస్‌ సైతం..
తాజా మాంసం, సీఫుడ్‌ బ్రాండ్‌ ఆన్‌లైన్‌ విక్రయాల స్టార్టప్‌ లిషియస్‌ సైతం యూనికార్న్‌ హోదాను పొందింది. 5.2 కోట్ల డాలర్లు(రూ. 389 కోట్లు) సమీకరించడంతో కంపెనీ విలువ తాజాగా బిలియన్‌ డాలర్లకు(రూ. 7,473 కోట్లు) చేరింది. డైరెక్ట్‌ టు కన్జూమర్‌(డీటూసీ) విభాగంలో తొలి స్టార్టప్‌గా ఈ హోదాను సాధించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : యూనికార్న్‌ హోదా పొందిన క్రిప్టో ఎక్సే్ఛంజీ నిర్వాహక స్టార్టప్‌?
ఎప్పుడు  : అక్టోబర్‌ 6
ఎవరు    : కాయిన్‌స్విచ్‌ కుబేర్‌
ఎక్కడ    : భారత్‌
ఎందుకు : తాజాగా కంపెనీ విలువ 1.9 బిలియన్‌ డాలర్ల(రూ. 14,198 కోట్లు)కు చేరండంతో...


Andhra Pradesh: శానిటరీ న్యాప్‌కిన్ల పంపిణీకి ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం?Swechha

మహిళలు, కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల మందికి పైగా విద్యార్థినులకు రూ.32 కోట్లతో నాణ్యమైన బ్రాండెడ్‌ శానిటరీ న్యాప్‌కిన్లు ఉచితంగా పంపిణీ చేసే ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబర్‌ 5న తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించి పోస్టర్‌ విడుదల చేశారు. రుతుక్రమం ఇబ్బందులతో 23 శాతం మంది బాలికలు స్కూలుకు దూరమవుతున్న పరిస్థితులు నెలకొన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయని, వారికి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ‘స్వేచ్ఛ’ ద్వారా చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా గ్రామీణ మహిళలకు వైఎస్సార్‌ చేయూత స్టోర్స్‌ ద్వారా తక్కువ ధరకే నాప్‌కిన్స్‌ సరఫరా చేసేందుకు పీ అండ్‌ జీ (విస్పర్‌), నైన్‌ బ్రాండ్‌ల ప్రతినిధులు సీఎం జగన్‌ సమక్షంలో సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నారు.

ముఖ్యాంశాలు...

  • స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది లక్షల మందికిపైగా 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న టీనేజ్‌ బాలికలకు రూ.32 కోట్ల వ్యయంతో నాణ్యమైన, బ్రాండెడ్‌ శానిటరీ నాప్‌కిన్స్‌ ఉచితంగా అందజేస్తారు. 
  • ప్రొక్టర్‌ అండ్‌ గాంబిల్, హైజీన్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌కు చెందిన విస్పర్‌ బ్రాండెడ్‌ శానిటరీ నాప్‌కిన్స్‌తో పాటు గోరఖ్‌పూర్‌ (యూపీ)కు చెందిన ప్రఖ్యాత నైన్‌ ప్రై వేట్‌ లిమిటెడ్‌ కంపెనీ కూడా నాప్‌కిన్స్‌ సరఫరా చేస్తోంది. 
  • ఒక్కొక్క చిట్టితల్లికి నెలకు పది చొప్పున ఏడాదికి 120 శానిటరీ నాప్‌కిన్స్‌ను ఉచితంగా అందజేస్తారు. ఎండాకాలంలో వేసవి సెలవుల కంటే ముందే ఒకేసారి పాఠశాలలో పంపిణీ చేస్తారు. 
  • స్వేచ్ఛ పథకం అమలు కోసం ప్రతి పాఠశాల, కళాశాలలో నోడల్‌ అధికారిగా ఒక మహిళా అధ్యాపకురాలిని నియమిస్తారు.
  • వినియోగించిన శానిటరీ నాప్‌కిన్స్‌  సురక్షితంగా డిస్పోజ్, పర్యావరణానికి ఇబ్బంది లేకుండా భస్మం చేసేందుకు ‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌’ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6,417 ఇన్సినరేటర్లను ఏర్పాటు చేశారు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : స్వేచ్ఛ కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్‌ 5
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 
ఎక్కడ    : సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు జిల్లా
ఎందుకు : మహిళలు, కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల మందికి పైగా విద్యార్థినులకు నాణ్యమైన బ్రాండెడ్‌ శానిటరీ న్యాప్‌కిన్లు ఉచితంగా పంపిణీ చేసేందుకు...


ESCAP, ADB: ట్రేడ్‌ ఫెసిలిటేషన్‌ రిపోర్ట్‌ను విడుదల చేసిన సంస్థలు?

ESCAP, ADB Report

వాణిజ్యం విషయంలో దేశాలు అనుసరించే రక్షణాత్మక విధానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎన్నటికీ మంచిది కాదని, దీనివల్ల సానుకూల ఫలితాలు ఎప్పుడూ కనబడలేదని ఐక్యరాజ్యసమితి ఆసియా పసిఫిక్‌ వ్యవహారాల ఎకనమిక్‌అండ్‌ సోషల్‌ కమిషన్‌ (ఈఎస్‌సీఏపీ), ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) పేర్కొన్నాయి. స్వేచ్ఛా వాణిజ్య విధానాలతోనే ప్రపంచ ఆర్థిక అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశాయి. ఈ మేరకు ‘ఆసియా– పసిఫిక్‌ ట్రేడ్‌ ఫెసిలిటేషన్‌ రిపోర్ట్‌ 2021’ శీర్షికన ఒక నివేదికను ఆవిష్కరించాయి.

టెలికంలో 100 శాతం ఎఫ్‌డీఐలు
టెలికం సేవల రంగంలో ఆటోమేటిక్‌ పద్ధతిలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ మేరకు అక్టోబర్‌ 5న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇప్పటిదాకా టెలికం రంగంలో 49 శాతం ఎఫ్‌డీఐలను మాత్రమే అనుమతించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆసియా– పసిఫిక్‌ ట్రేడ్‌ ఫెసిలిటేషన్‌ రిపోర్ట్‌ 2021 విడుదల
ఎప్పుడు : అక్టోబర్‌ 6
ఎవరు : ఐక్యరాజ్యసమితి ఆసియా పసిఫిక్‌ వ్యవహారాల ఎకనమిక్‌అండ్‌ సోషల్‌ కమిషన్‌ (ఈఎస్‌సీఏపీ), ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ)
ఎందుకు : వాణిజ్యం విషయంలో దేశాలు అనుసరించే, అనుసరించాల్సిన విధానాలను గురించి వివరించేందుకు...

 

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 6 కరెంట్‌ అఫైర్స్‌

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌


డౌన్‌లోడ్‌ వయా ఆపిల్‌ ఐ స్టోర్‌

Published date : 07 Oct 2021 07:26PM

Photo Stories