Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 6 కరెంట్‌ అఫైర్స్‌

Nobel Prize in Physics 2021

Nobel Prize: భౌతికశాస్త్ర నోబెల్‌ పురస్కారం–2021

వాతావరణం వంటి అత్యంత సంక్లిష్టమైన విషయాన్ని అర్థం చేసుకునేందుకు దోహదపడే పరిశోధనలు చేసినందుకు 2021 ఏడాది భౌతికశాస్త్ర నోబెల్‌ అవార్డును స్యూకోరో మనాబే (90), క్లాస్‌ హాసెల్‌మాన్‌ (89), జియోర్గియో పరిసీ (73) అనే ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రకటించారు. స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోమ్‌లో ఉన్న రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఈ విషయాన్ని అక్టోబర్‌ 5న ప్రకటించింది. అవార్డు కింద అందే నగదు బహుమతి 11 లక్షల డాలర్లలో సగం పరిసీ దక్కనుండగా మిగిలిన సగం మొత్తాన్ని స్యూకోరో, క్లాస్‌లు చెరిసగం పంచుకుంటారని తెలిపింది. మానవ చర్యలు భూ వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకునేందకు స్యూకోరో, క్లాస్‌ పునాదులేయగా... సంక్లిష్ట వ్యవస్థల్లోనూ ఒక పద్దతిని కనుక్కునేందుకు పరిసీ సహకరించారు.

స్యూకోరో మనాబే...
జపాన్‌లోని షింగోలో జన్మించిన స్యూకోరో ప్రస్తుతం అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ యూనివర్శిటీలో సీనియర్‌ వాతావరణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. వందలాది అంశాల ఆధారంగా పనిచేసే భూ వాతావరణాన్ని అర్థం చేసుకునేందుకు 1960లలోనే ప్రయోగాలు చేశారు. వాతావరణంలో కార్బన్‌ డైయాక్సైడ్‌ ఎక్కువైతే భూ ఉపరితల ఉష్ణోగ్రతలు ఎలా పెరుగుతాయన్నది ప్రయోగపూర్వకంగా రుజువు చేశారు. భూ వాతావరణానికి సంబంధించిన భౌతిక నమూనాలను సిద్ధం చేశారు. రేడియేషన్‌ సమతౌల్యం; గాలి కదలికల మధ్య చర్యలను తొలిసారిగా పరిశోధించారు. ఆయన కృషి ప్రస్తుతం వాతవరణాన్ని అంచనా వేసేందుకు అవసరమైన క్లైమెట్‌ మోడల్స్‌ సిద్ధమయ్యాయి.

క్లాస్‌ హాసెల్‌మాన్‌....
జర్మనీలోని హాంబర్గ్‌లో జన్మించిన క్లాస్‌ ప్రస్తుతం హాంబర్గ్‌లోని మ్యాక్స్‌ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మీటిరియాలజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. స్థానిక వాతావరణం, ప్రపంచం మొత్తమ్మీది వాతావరణాలకు మధ్య ఉన్న సంబంధాలను అర్థం చేసుకునేందుకు ఓ మోడల్‌ను తయారు చేశారు. తద్వారా స్థానిక వాతావరణంలో ఎంత గందరగోళంగా ఉన్నా ప్రపంచ వాతావరణాన్ని అర్థం చేసుకోవడంలో క్లైమెట్‌ మోడల్స్‌ ఎలా నమ్మదగ్గవో క్లాస్‌ హాసెల్‌మాన్‌ మోడల్‌ ద్వారా స్పష్టమైంది. ఈ పద్ధతుల వల్ల వాతావరణంలోకి కార్బన్‌డైయాక్సైడ్‌ ఎక్కువగా చేరడం వంటి మానవ చర్యల వల్ల భూమి ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతోందని (భూతాపోన్నతి) రుజువు చేయడం వీలైంది.

జియోర్గియో పరిసీ...
ఇటలీలోని రోమ్‌లో జన్మించిన పరిసీ... రోమ్‌లోని సాపియోంజా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. గణితం, జీవశాస్త్రం, నాడీ శాస్త్రం, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి అనేక సంక్లిష్ట వ్యవస్థలను అర్థం చేసుకునేందుకు పరిసీ పరిశోధనలు ఉపయోగపడుతున్నాయి. వీటిల్లో చాలా అంశాలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఒక పద్ధతిని అనుసరించకుండా వ్యవహరిస్తున్నట్లు కనిపించినా.. అంతర్గతంలో వాటిల్లోనూ ఒక క్రమపద్ధతి ఉంటుందని గుర్తించారు జియోర్గియో పరిసీ.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భౌతికశాస్త్ర నోబెల్‌ పురస్కారం–2021 విజేతలు
ఎప్పుడు : అక్టోబర్‌ 5
ఎవరు    : స్యూకోరో మనాబే (జపాన్‌), క్లాస్‌ హాసెల్‌మాన్‌ (జర్మనీ), జియోర్గియో పరిసీ (ఇటలీ)
ఎందుకు : వాతావరణం వంటి అత్యంత సంక్లిష్టమైన విషయాన్ని అర్థం చేసుకునేందుకు దోహదపడే పరిశోధనలు చేసినందుకు...


Space Station: ఏ సినిమా కోసం అంతరిక్షంలో షూటింగ్‌ జరపనున్నారు?

Challenge-Movie

తొలిసారిగా భూకక్ష్యలో సినిమా షూటింగ్‌ జరగనుంది. ఇందుకోసం రష్యా నటి, సినిమా డైరెక్టర్‌ అక్టోబర్‌ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)కు చేరుకున్నారు. కజకిస్తాన్‌లోని బైకనూర్‌ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి ఎగిసిన సోయుజ్‌ అంతరిక్ష నౌక ద్వారా ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. ఈ బృందంలో నటి యులియా పెరెసిల్డ్‌(37), దర్శకుడు క్లిమ్‌ షిపెంకో(38)తోపాటు వ్యోమగామి అంటోన్‌ ష్కాప్లెరోవ్‌ ఉన్నారు. ఇప్పటికే మూడు పర్యాయాలు అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన అంటోన్‌ ఈ ప్రయాణానికి నాయకత్వం వహించారు.

ఛాలెంజ్‌ సినిమా కోసం...
ఛాలెంజ్‌ అనే పేరున్న సినిమాలో నటి యులియా సర్జన్‌గా నటిస్తున్నారు. అంతరిక్ష కేంద్రంలోని ఒక సభ్యుడికి గుండెపోటు రావడంతో ఆమె అక్కడికి వెళ్లి చికిత్స అందించే సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇప్పటికే ఐఎస్‌ఎస్‌లో ఉన్న నోవిట్‌స్కీ, పీటర్‌ డుబ్రోవ్‌ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో నటించనున్నారు. నోవిట్‌స్కీ గుండెపోటుకు గురైన వ్యోమగామి పాత్ర పోషించనున్నారు. అక్టోబర్‌ 17వ తేదీన భూమికి చేరుకుని, సినిమాలోని మిగతా సన్నివేశాలను షూట్‌ చేస్తారు. ఈ ప్రయాణం కోసం నాలుగు నెలల నుంచి కఠిన శిక్షణ పొందారు.

చానెల్‌ వన్‌ నిర్మాణంలో...
‘ఛాలెంజ్‌’ను రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్‌ సాయంతో ప్రభుత్వ టీవీ ‘చానెల్‌ వన్‌’ నిర్మిస్తోంది. ఈ మిషన్‌ రష్యా శక్తి, సామర్థ్యాలను మరోసారి ప్రపంచానికి చాటి చెబుతుందని రష్యా ప్రభుత్వ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ అన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : అంతరిక్షంలో సినిమా షూటింగ్‌
ఎప్పుడు  : అక్టోబర్‌ 5
ఎవరు    : రష్యా దేశస్థులు
ఎక్కడ    : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)
ఎందుకు  : రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్‌ సాయంతో రష్యా ప్రభుత్వ టీవీ ‘చానెల్‌ వన్‌’ నిర్మిస్తోన్న ఛాలెంజ్‌ సినిమా కోసం...


Swadesh Darshan: ఏ పథకంలో భాగంగా బౌద్ధ సర్క్యూట్‌ను అభివృద్ధి చేయనున్నారు?

Buddhist Circuit

దేశంలో బౌద్ధ సర్క్యూట్‌ అభివృద్ధికి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రణాళికలు రూపొందించింది. స్వదేశ్‌ దర్శన్‌ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, గుజరాత్‌ రాష్ట్రాలలో బౌద్ధ సర్క్యూట్‌ అభివృద్ధి కోసం రూ.325.53 కోట్ల విలువైన 5 ప్రాజెక్టులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్ర పర్యాటక శాఖ అక్టోబర్‌ 5న తెలిపింది. దేశంలో కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న పర్యాటక రంగ అభివృద్ధి, పురోగతిలో కీలక పాత్ర పోషించే విదేశీ, దేశీయ పర్యాటకంలో బౌద్ధ పర్యాటకం ఒకటిగా కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగా బుద్ధ సర్క్యూట్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి వివిధ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

2021, నవంబర్‌ 17 నుంచి 21 వరకు అంతర్జాతీయ బౌద్ధ సమావేశాలు జరుగనున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర పర్యాటక శాఖ ప్రణాళికలను ఇప్పటికే అమలుచేస్తోంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : రూ.325.53 కోట్ల విలువైన 5 ప్రాజెక్టులు మంజూరు
ఎప్పుడు : అక్టోబర్‌ 5
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : స్వదేశ్‌ దర్శన్‌ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, గుజరాత్‌ రాష్ట్రాలలో బౌద్ధ సర్క్యూట్‌ అభివృద్ధి కోసం...


Venkaiah Naidu: ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ల్యాబ్‌ ఫెసిలిటీని ఉపరాష్ట్రపతి ప్రారంభించారు?

Venkaiah Naidu-IBSD

మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోరీసోర్సెస్‌ అండ్‌ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ (ఐబీఎస్‌డీ) ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫైటో–ఫార్మాస్యూటికల్‌ ల్యాబ్‌ ఫెసిలిటీ కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అక్టోబర్‌ 5న ప్రారంభించారు. భారతదేశాభివృద్ధి సమర్థులైన, దేశభక్తులైన శాస్త్రవేత్తల చేతుల్లోనే ఉందని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని మళ్లీ విశ్వగురు స్థానంలో నిలపడంలో శాస్త్రవేత్తలు, పరిశోధకుల పాత్ర ఎంతో కీలకమన్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్‌లోని 40వ జాతీయ రహదారిలో షిల్లాంగ్‌ – డౌకి రహదారి అభివృద్ధి పనులకు అక్టోబర్‌ 4న శంకుస్థాపన చేసి ప్రసంగించారు. కార్యక్రమంలో మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్, ముఖ్యమంత్రి కాన్రాడ్‌ కె. సంగ్మా పాల్గొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఫైటో–ఫార్మాస్యూటికల్‌ ల్యాబ్‌ ఫెసిలిటీ కేంద్రం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్‌ 5
ఎవరు    : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 
ఎక్కడ    : ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోరీసోర్సెస్‌ అండ్‌ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ (ఐబీఎస్‌డీ) ప్రాంగణం, ఇంఫాల్, మణిపూర్‌


Hockey India: కామన్వెల్త్‌ గేమ్స్‌–2022ను ఎక్కడ నిర్వహించనున్నారు?

Hockey

ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగే ప్రతిష్టాత్మక కామన్వెల్త్‌ గేమ్స్‌–2022 నుంచి భారత హాకీ జట్టు వైదొలిగింది. ఈ మేరకు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్‌ బత్రాకు హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడు జ్ఞానేంద్రో నింగోమ్‌బామ్‌ అక్టోబర్‌ 5న‌ సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ తీవ్రత కొనసాగుతోంది. అంతేకాకుండా భారత్‌ నుంచి వచ్చే పర్యాటకులపై అక్కడి ప్రభుత్వం వివక్షపూరిత ఆంక్షలు అమలు చేస్తోంది. దీంతో ఏషియాడ్‌∙(ఆసియా క్రీడలు)పై దృష్టి పెట్టి కామన్వెల్త్‌ గేమ్స్‌ నుంచి వైదొలగాలని హాకీ ఇండియా నిర్ణయం తీసుకుంది. మరోవైపు భువనేశ్వర్‌లో జరిగే జూనియర్‌ ప్రపంచకప్‌ హాకీ–2021 నుంచి ఇంగ్లండ్‌ వైదొలిగిన విషయం విదితమే.

ముఖ్యాంశాలు...

  • కామన్వెల్త్‌ గేమ్స్, ఆసియా క్రీడలు 2022 ఏడాదే జరుగనున్నాయి. జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు కామన్వెల్త్‌ గేమ్స్‌... సెప్టెంబర్‌ 10 నుంచి 25 వరకు హాంగ్జౌ (చైనా)లో ఆసియా క్రీడలు జరుగుతాయి.  
  • ఈ మెగా ఈవెంట్ల మధ్య కేవలం 32 రోజుల విరామమే ఉంది. దీంతో కామన్వెల్త్‌ను పక్కన పెట్టి.. ఏషియాడ్‌ విజేతగా నిలిచి 2024 పారిస్‌ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత  సాధించాలని హాకీ ఇండియా భావించింది. 
  • కామన్వెల్త్‌ గేమ్స్‌లో 1998లో హాకీని మెడల్‌ ఈవెంట్‌గా ప్రవేశపెట్టారు. 
  • భారత పురుషుల హాకీ జట్టు రెండు సార్లు (2010, 2014) రజతం...మహిళల జట్టు స్వర్ణం (2002), రజతం (2006) సొంతం చేసుకున్నాయి.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ప్రతిష్టాత్మక కామన్వెల్త్‌ గేమ్స్‌–2022 నుంచి వైదొలగాలని నిర్ణయం
ఎప్పుడు  : అక్టోబర్‌ 5
ఎవరు    : హాకీ ఇండియా (హెచ్‌ఐ)
ఎక్కడ    : బర్మింగ్‌హామ్, ఇంగ్లండ్‌
ఎందుకు : భారత్‌ నుంచి వచ్చే పర్యాటకులపై ఇంగ్లండ్‌ ప్రభుత్వం వివక్షపూరిత ఆంక్షలు అమలు చేస్తుండటంతో...


2021 Nobel Prize: రసాయన శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి

Nobel Prize in Chemistry 2021

అసిమెట్రిక్‌ ఆర్గానోక్యాటలసిస్‌ను అభివృద్ధి చేసినందుకు గానూ శాస్త్రవేత్తలు జర్మనీకి చెందిన బెంజమిన్‌ లిస్ట్, స్కాట్లాండ్‌కు చెందిన డేవిడ్‌ వి.సి. మెక్‌మిల్లన్‌లకు 2021 ఏడాది రసాయన శాస్త్ర నోబెల్‌ అవార్డు లభించింది. ఈ మేరకు అక్టోబర్‌ 6న రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ప్రకటించింది. విజేతలకు 11 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. బెంజిమిన్‌ లిస్ట్, మెక్‌మిలన్‌ల ఆవిష్కరణతో ఫార్మాసూటికల్‌ పరిశోధనలపై భారీగా ప్రభావం చూపనుంది. ఈ క్యాటలసిస్‌ను శాస్త్రవేత్తలు 2000 సంవత్సరంలో అభివృద్ధి చేసినట్లు అకాడమీ తెలిపింది. వీరి కృషి ఇప్పటికే మానవాళికి ఎంతో ఉపయుక్తంగా ఉందని ప్రశంసించింది. ప్రస్తుతం మ్యాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌కు బెంజమిన్‌ లిస్ట్‌  డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. మెక్‌మిలన్‌ ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా ఉన్నారు.


World Championship: షూటింగ్‌లో కొత్త రికార్డును నెలకొల్పిన భారతీయుడు?Aishwary Pratap Singh Tomar

పెరూ రాజధాని నగరం లిమాలో జరుగుతున్న ప్రపంచ జూనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత యువ షూటర్‌ ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ స్వర్ణ పతకం సాధించాడు. అక్టోబర్‌ 5న జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ విభాగం ఫైనల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన తోమర్‌ 463.4 పాయింట్లతో విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో అతడు 462.9 పాయింట్లతో ఫిలిప్‌ నెపిచాల్‌ (చెక్‌ రిపబ్లిక్‌) పేరిట ఉన్న జూనియర్‌ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఫ్రాన్స్‌ షూటర్‌ లుకాస్‌ క్రిజ్స్‌ (456.5 పాయింట్లు) రజతాన్ని... అమెరికాకు చెందిన గావిన్‌ బార్నిక్‌ (446.5 పాయింట్లు) కాంస్యాన్ని దక్కించుకున్నారు. ఓవరాల్‌గా ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ 8 స్వర్ణాలు, 6 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి మొత్తం 17 పతకాలతో అగ్రస్థానంలో ఉంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రపంచ జూనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతో పాటు పసిడి పతకం గెలుచుకున్న భారతీయుడు?
ఎప్పుడు  : అక్టోబర్‌ 5
ఎవరు    : ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌
ఎక్కడ    : లిమా, పెరూ
ఎందుకు : పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ విభాగం ఫైనల్లో తోమర్‌ 463.4 పాయింట్లతో విజేతగా నిలిచినందున...


PKL 2021: ప్రొ కబడ్డీ లీగ్‌ ఎనిమిదో సీజన్‌ను ఎక్కడ నిర్వహించనున్నారు?

Pro Kabaddi

ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) ఎనిమిదో సీజన్‌ 2021, డిసెంబర్‌ 22 నుంచి మొదలుకానుంది. అయితే మ్యాచ్‌లను తిలకించేందుకు ప్రేక్షకుల్ని అనుమతించడం లేదు. కోవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో ఆటగాళ్లు, ఇతర సిబ్బంది ఆరోగ్య భద్రత దృష్ట్యా ఎనిమిదో సీజన్‌ ఒకే ఒక వేదికలో నిర్వహిస్తున్నారు. మ్యాచ్‌లన్నీ కర్ణాటక రాజ«ధాని బెంగళూరులోనే నిర్వహిస్తామని లీగ్‌ కమిషనర్, మశాల్‌ స్పోర్ట్స్‌ సీఈఓ అనుపమ్‌ గోస్వామి అక్టోబర్‌ 5న తెలిపారు. 2020 ఏడాది కరోనా భయాందోళనల నేపథ్యంలో ఈవెంట్‌ను రద్దు చేశారు. పీకేఎల్‌–7 చివరిసారిగా 2019లో జరగ్గా బెంగాల్‌ వారియర్స్‌ జట్టు విజేతగా నిలిచింది.

లవ్లీనా బొర్గోహైన్‌ ఏ క్రీడలో ప్రసిద్ధురాలు?
2021, డిసెంబర్‌లో ఇస్తాంబుల్‌లో జరిగే మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత బాక్సింగ్‌ జట్టులో లవ్లీనా బొర్గోహైన్‌కు చోటు కల్పిస్తున్నట్లు భారత బాక్సింగ్‌ సమాఖ్య (బీఎఫ్‌ఐ) తెలిపింది. అక్టోబర్‌ 21 నుంచి హరియాణాలోని హిసార్‌ వేదికగా జరిగే జాతీయ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాలు నెగ్గే బాక్సర్లను మాత్రమే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులోకి ఎంపిక చేస్తారు. అయితే టోక్యో ఒలింపిక్స్‌–2020లో లవ్లీనా (69 కేజీలు) కాంస్య పతకంతో మెరవడంతో ఆమెకు భారత జట్టులో నేరుగా ప్రవేశం కల్పించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 2021, డిసెంబర్‌ 22 నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) ఎనిమిదో సీజన్‌ ప్రారంభం
ఎప్పుడు  : అక్టోబర్‌ 5 
ఎవరు    : లీగ్‌ కమిషనర్, మశాల్‌ స్పోర్ట్స్‌ సీఈఓ అనుపమ్‌ గోస్వామి
ఎక్కడ    : బెంగళూరు, కర్ణాటక

 

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 5 కరెంట్‌ అఫైర్స్‌

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌


డౌన్‌లోడ్‌ వయా ఆపిల్‌ ఐ స్టోర్‌

 

Published date : 06 Oct 2021 07:12PM

Photo Stories