Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 5 కరెంట్‌ అఫైర్స్‌

2021 Medicine Nobel Prize

Nobel Prize: వైద్యశాస్త్ర నోబెల్‌ అవార్డు–2021

మానవ నాడి కొసళ్లలో ఉండే అతిసూక్ష్మమైన సెన్సర్లు వేడిని... శరీరంలోని ప్రత్యేకమైన సెన్సర్లు ఒత్తిడిని గుర్తిస్తాయని ప్రపంచానికి తెలిపిన అమెరికా శాస్త్రవేత్తలు డేవిడ్‌ జూలియస్, ఆర్డెమ్‌ పటాపౌటేయిన్‌లకు 2021 ఏడాది వైద్యశాస్త్ర నోబెల్‌ అవార్డు లభించింది. స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోమ్‌లో ఉన్న కారోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో అక్టోబర్‌ 4న నోబెల్‌ అవార్డు కమిటీ ఈ విషయాన్ని ప్రకటించింది. వేడి, ఒత్తిడిలను శరీరం ఎలా పసిగడుతోందో తెలుసుకోవడం వల్ల వైద్యశాస్త్రంలో ఎన్నో ప్రయోజనాలు ఏర్పడ్డాయని పేర్కొంది. త్వరలో ఒక ప్రత్యేక ఉత్సవంలో వీరిద్దరికి సంయుక్తంగా ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. నోబెల్‌ పురస్కారంలో భాగంగా బంగారు పతకంతో పాటు 11 లక్షల డాలర్ల నగదును డేవిడ్, ఆర్డెమ్‌లకు అందజేస్తారు. వీరిద్దరూ విడివిడిగా జరిపిన పరిశోధనల్లో ఇంద్రియానుభూతులను శరీరం ఎలా గ్రహించగలుతోంది అన్నది ఆవిష్కరించారు.

డేవిడ్‌ జూలియస్‌...
న్యూయార్క్‌లో జన్మించిన డేవిడ్‌ శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. మిరపకాయలోని కాప్‌సేసన్‌ను ఉపయోగించడం ద్వారా మన నాడుల చివర్లలో కొన్ని సెన్సర్ల వంటివి ఉంటాయని, ఇవి వేడి, మంట వంటి అనుభూతులను మెదడుకు చేరవేస్తాయని ఆయన తెలుసుకోగలిగారు. మనిషి శరీరంలో కాప్సాయిసిన్‌ అనే పదార్థానికి స్పందించే ప్రత్యేక రకం(టీఆర్‌పీవీ1) జన్యు కణం ఉన్నట్లు కనుగొన్నారు. మంటకు, నొప్పికి కారణమైన ఉష్ణోగ్రతకు కూడా ఇది స్పందిస్తుందని వెల్లడైంది.

ఆర్డెమ్‌ పటాపౌటేయిన్‌...
లెబనాన్‌లోని బీరూట్‌లో జన్మించిన ఆర్డెమ్‌ ప్రస్తుతం కాలిఫోర్నియాలోని స్క్రిప్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఒత్తిడిని గుర్తించే ప్రత్యేక కణాలను వాడి చర్మం, శరీరం లోపలి భాగాల్లోని ప్రత్యేక సెన్సర్లు యాంత్రిక ప్రేరణను ఎలా గుర్తిస్తాయో ఆయన తెలుసుకున్నారు. చలి లేదా చల్లదనానికి స్పందించే గ్రాహక కణ పదార్థం(టీఆర్‌పీఎం8)ను కనుగొన్నారు.
క్విక్‌ రివ్యూ :
ఏమిటి : వెద్యశాస్త్ర నోబెల్‌ అవార్డు–2021 విజేతలు
ఎప్పుడు : అక్టోబర్‌ 4
ఎవరు : అమెరికా శాస్త్రవేత్తలు డేవిడ్‌ జూలియస్, ఆర్డెమ్‌ పటాపౌటేయిన్‌
ఎందుకు : మానవ నాడి కొసళ్లలో ఉండే అతిసూక్ష్మమైన సెన్సర్లు వేడిని... శరీరంలోని ప్రత్యేకమైన సెన్సర్లు ఒత్తిడిని గుర్తిస్తాయని ప్రపంచానికి తెలిపినందున...


Helping: రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడితే.. ఎంత మొత్తాన్ని అందించనున్నారు?

Road Accident

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలను కాపాడే వారిని ప్రోత్సహిం చేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకంతో ముందుకొచ్చింది. క్షతగాత్రులను మొదటి గంటలోగా (గోల్డెన్‌ అవర్‌) ఆస్పత్రికి తరలించిన వారికి రూ. 5 వేల ప్రోత్సాహక బహుమతి అందించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం 2021 అక్టోబర్‌ 15 నుంచి అందుబాటులోకి వచ్చి, 2026 మార్చి 31 వరకు కొనసాగుతుందని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల రవాణా శాఖలకు అక్టోబర్‌ 4న సమాచారం పంపింది.

జాతీయ అవార్డు అందజేత...
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలను కాపాడిన వారికి రూ. 5 వేల ప్రోత్సాహకంతో పాటు అభినందన సర్టిఫికెట్‌ను అందించనున్నట్లు కేంద్రం తెలిపింది. అత్యంత విలువైన సాయం అందించిన వారి నుంచి కొంత మందిని ఎంపిక చేసి ఏడాదికోసారి జాతీయ స్థాయి అవార్డులను ప్రకటించనున్నట్లు పేర్కొంది. వారికి రూ. లక్ష చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపింది. ఒకరి కంటే ఎక్కువ మంది బాధితులను, ఒకరి కంటే ఎక్కువ మంది కాపాడితే ఒక్కొక్కరికి రూ. 5 వేల చొప్పున ఇవ్వనున్నట్లు వివరించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను మొదటి గంటలోగా (గోల్డెన్‌ అవర్‌) ఆస్పత్రికి తరలించిన వారికి రూ. 5 వేల ప్రోత్సాహక బహుమతి అందజేత
ఎప్పుడు : అక్టోబర్‌ 4
ఎవరు    : భారత ప్రభుత్వం
ఎక్కడ    : దేశ వ్యాప్తంగా...
ఎందుకు : రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలను కాపాడే వారిని ప్రోత్సహించేందుకు...


IITF 2021: ఇండియా ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఫెయిర్‌ థీమ్‌ ఏమిటీ?

IITF 2021

భారత రాజధాని నగరం న్యూఢిల్లీలోని ప్రగతిమైదాన్‌లో ఇండియా ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఫెయిర్‌ (ఐఐటీఎఫ్‌) 40వ ఎడిషన్‌ను నిర్వహించనున్నారు. నవంబర్‌ 14 నుంచి 27వ తేదీ వరకు జరిగే ఈ ట్రేడ్‌ ఫెయిర్‌లో... ఆర్థికాంశం, ఎగుమతి సామర్ధ్యం, మౌలిక సదుపాయాలు, సరఫరా, డిమాండ్‌ అంశాలపై దృష్టి సారించనున్నారు. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటిస్తూ బీటుబీ , బీటుసీ సమావేశాలతో పాటు ట్రేడ్‌ ఫెయిర్‌ నిర్వహించనున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ అక్టోబర్‌ 4న ప్రకటించింది. వాణిజ్యం, పరిశ్రమ సంబంధిత సమావేశాలు, సెమినార్‌లు మాత్రమే కాకుండా, ఫెయిర్‌ ప్రాంగణంలోని కొన్ని ప్రదేశాలలో ఇన్‌స్టాల్‌ చేసిన పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై బ్రాండింగ్‌ అవకాశాన్ని అందించనున్నారు.

ఐఐటీఎఫ్‌–2021 థీమ్‌: ఆత్మనిర్భర్‌ భారత్‌

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : నవంబర్‌ 14 నుంచి 27వ తేదీ వరకు ఇండియా ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఫెయిర్‌ (ఐఐటీఎఫ్‌) 40వ ఎడిషన్‌ నిర్వహణ
ఎప్పుడు  : అక్టోబర్‌ 4
ఎవరు    : కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ
ఎక్కడ : ప్రగతిమైదాన్, న్యూఢిల్లీ
ఎందుకు : ఆర్థికాంశం, ఎగుమతి సామర్ధ్యం, మౌలిక సదుపాయాలు, సరఫరా, డిమాండ్‌ అంశాలపై సమావేశాలు నిర్వహించేందుకు...


Namyaa Kapoor: భారత్‌కు స్వర్ణం అందించిన నామ్యా ఏ క్రీడలో ప్రసిద్ధురాలు?

Namyaa Kapoor

పెరూ రాజధాని నగరం లిమాలో జరుగుతున్న ప్రపంచ జూనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన 14 ఏళ్ల నామ్యా కపూర్‌ స్వర్ణం గెలుచుకుంది. 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో ఆమె మొదటి స్థానంలో నిలిచింది. అక్టోబర్‌ 4న జరిగిన 25 మీటర్ల పిస్టల్‌ విభాగం ఫెనల్లో నామ్యా 36 పాయింట్లు స్కోర్‌ చేసింది. ఇదే ఈవెంట్‌లో మరో భారత షూటర్‌ మనూ భాకర్‌ కాంస్యం గెలుచుకోగా, ఫ్రాన్స్‌కు చెందిన కెమిల్‌ జెడ్‌జెవ్‌స్కీ రజతం సాధించింది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో భారత్‌కు 7 స్వర్ణాలు సహా మొత్తం 16 పతకాలు వచ్చాయి.

సత్యన్‌ జ్ఞానశేఖరన్‌ ఏ క్రీడకు చెందినవాడు?
ఖతార్‌ రాజధాని నగరం దోహాలో జరుగుతున్న ఆసియా సీనియర్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) చాంపియన్‌షిప్‌ టోర్నీలో భారత్‌కు రెండు కాంస్య పతకాలు లభించాయి. పురుషుల డబుల్స్‌ విభాగంలో అక్టోబర్‌ 4న జరిగిన తొలి సెమీఫైనల్లో భారత ద్వయం హర్మీత్‌ దేశాయ్‌– మానవ్‌ ఠక్కర్‌ 4–11, 6–11, 12–10, 11–9, 8–11తో వూజిన్‌ జాంగ్‌– జాంగ్‌వూన్‌ లిమ్‌ (దక్షిణ కొరియా) జోడీ చేతిలో ఓడింది. అనంతరం జరిగిన రెండో సెమీస్‌ పోరులో ఆచంట శరత్‌ కమల్‌–సత్యన్‌ జ్ఞానశేఖరన్‌ జంట 5–11, 9–11, 11–13తో యుకియా ఉడా–షున్‌సుకే తొగామీ (జపాన్‌) జోడీ చేతిలో ఓడింది. భారత జోడీలు  సెమీస్‌లో ఓడటంతో కాంస్యాలు దక్కాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ప్రపంచ జూనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో స్వర్ణం గెలిచిన భారత క్రీడాకారిణి?  
ఎప్పుడు : అక్టోబర్‌ 4
ఎవరు    : నామ్యా కపూర్‌
ఎక్కడ    : లిమా, పెరూ


NARCL: బ్యాడ్‌ బ్యాంక్‌కు ఏ చట్టం కింద ఆర్‌బీఐ లైసెన్స్‌ను మంజూరు చేసింది?

Bad Bank

బ్యాంకుల మొండిబకాయిల (ఎన్‌పీఏ) సమస్య పరిష్కారం దిశలో ఇండియన్‌  బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) ఏర్పాటు చేస్తున్న బ్యాడ్‌ బ్యాంక్‌ లేదా జాతీయ రుణ పునర్‌వ్యవస్థీకరణ సంస్థ (నేషనల్‌ అసెట్‌ రికన్‌స్ట్రక్షన్‌ కంపెనీ – ఎన్‌ఏఆర్‌సీఎల్‌)కు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) లైసెన్స్‌ ఇచ్చింది. ఈ విషయాన్ని ఐబీఏ సీఈఓ సునిల్‌ మెహతా అక్టోబర్‌ 4న ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. సర్ఫేసీ చట్టం 2002, సెక్షన్‌ 3 కింద ఈ లైసెన్స్‌ మంజూరయినట్లు పేర్కొన్నారు. ఎన్‌ఏఆర్‌సీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పీఎం నయ్యర్‌ నియమితులైన విషయం విదితమే. కంపెనీ బోర్డ్‌లో ఉన్న ఇతర డైరెక్టర్లలో ఐబీఏ సీఈఓ మెహతా, ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ నాయర్, కెనరా బ్యాంక్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ అజిత్‌ కృష్ణన్‌ నాయర్‌ ఉన్నారు.

అదానీ గ్రీన్‌ చేతికి ఎస్‌బీ ఎనర్జీ 
ఐదు నెలల క్రితం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఎస్‌బీ ఎనర్జీ ఇండియా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసినట్లు అదానీ గ్రీన్‌ ఎనర్జీ(ఏజీఈఎల్‌) తాజాగా వెల్లడించింది. ఇందుకు 3.5 బిలియన్‌ డాలర్లు(రూ. 26,000 కోట్లు) వెచ్చించినట్లు తెలియజేసింది. దీంతో ఎస్‌బీ ఎనర్జీలో 100 శాతం వాటాను ఏజీఈఎల్‌ సొంతం చేసుకుంది.

నాడ్‌విన్‌తో పీవీఆర్‌ జట్టు
గేమ్స్‌కి సంబంధించి లైవ్‌ టోర్నమెంట్‌లను థియేటర్లలో వెండి తెరపై ప్రదర్శించే దిశగా ఈ–స్పోర్ట్స్‌ కంపెనీ నాడ్‌విన్‌ గేమింగ్‌తో జట్టు కట్టినట్లు థియేటర్ల చెయిన్‌ పీవీఆర్‌ వెల్లడించింది. హైదరాబాద్‌తో పాటు ముంబై, గురుగ్రామ్, ఇండోర్‌ వంటి నాలుగు నగరాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నట్లు సంస్థ చీఫ్‌ ఆఫ్‌ స్ట్రాటజీ కమల్‌ జ్ఞాన్‌చందాని తెలిపారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : బ్యాడ్‌ బ్యాంక్‌ లేదా జాతీయ రుణ పునర్‌వ్యవస్థీకరణ సంస్థ (నేషనల్‌ అసెట్‌ రికన్‌స్ట్రక్షన్‌ కంపెనీ – ఎన్‌ఏఆర్‌సీఎల్‌)కు లైసెన్స్‌ జారీ
ఎప్పుడు  : అక్టోబర్‌ 4
ఎవరు    : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)
ఎందుకు  : బ్యాంకుల మొండిబకాయిల (ఎన్‌పీఏ) సమస్య పరిష్కారం కోసం..


NCDC: రాష్ట్రంలోని ఏ జిల్లాలో అతిపెద్ద ల్యాబొరేటరీ ఏర్పాటు కాబోతోంది?

Laboratary

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని విజయవాడ నగర సమీపంలో అతిపెద్ద ల్యాబొరేటరీ ఏర్పాటు కాబోతోంది. ఇప్పటివరకూ క్లిష్టమైన నమూనాలను పూణె వైరాలజీ ల్యాబొరేటరీ లేదా సీసీఎంబీ (సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ–హైదరాబాద్‌)కు పంపించేవారు. ఇకపై ఈ స్థాయి ల్యాబొరేటరీని విజయవాడ సమీపంలో ఏర్పాటు చేయబోతున్నారు. తాజాగా ఎన్‌సీడీసీ (నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌) అధికారులు స్థల సేకరణకు వచ్చారు. ఇందుకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం గన్నవరం విమానాశ్రయం వద్ద 3 ఎకరాల స్థలాన్ని మంజూరు చేసింది. ఈ ల్యాబొరేటరీ నిర్మాణానికి రూ. 15 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వరకూ అవుతుందని అంచనా. దీన్ని రెండేళ్లలో అందుబాటులోకి తెస్తారు.

ఉపయోగాలివే.. 

  • ఈ ల్యాబొరేటరీలో అన్ని రకాల వైరస్‌లే కాదు, బ్యాక్టీరియా నమూనాలు, కీటకాలు, ఎల్లో ఫీవర్‌.. తదితర ఎలాంటి నమూనాలనైనా పరిశీలించవచ్చు.
  • ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జినోమిక్‌ సీక్వెన్సీ ల్యాబ్‌ (వైరస్‌ ఉనికిని కనుక్కునే ల్యాబ్‌) లేదు. ఇకపై ఇలాంటి టెస్టులు ఇక్కడే చేసుకోవచ్చు. 
  • దీనికి సంబంధించిన నిర్మాణ వ్యయం, మానవ వనరులు కేంద్రం చూసుకుంటుంది. స్థలం మాత్రం ఏపీ సర్కారు ఇస్తుంది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : అతిపెద్ద ల్యాబొరేటరీ ఏర్పాటు
ఎప్పుడు  : అక్టోబర్‌ 4
ఎవరు    : ఎన్‌సీడీసీ (నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌)
ఎక్కడ    : విజయవాడ నగర సమీపం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు  : అన్ని రకాల వైరస్‌లు, బ్యాక్టీరియా నమూనాలు, కీటకాలు వంటి తదితరాల నమూనాలను పరిశీలించేందుకు...


Indian Navy: ఏ యూనివర్సిటీతో ఇండియన్‌ నేవీ ఎంవోయూ చేసుకుంది?

Indian Navy, AU

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం(ఏయూ)తో ఇండియన్‌ నేవీ ఎంవోయూ కుదుర్చుకుంది. నావికాదళ ప్రాజెక్టుల నిర్వహణలో ఏయూ సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఆచార్యుల సహకారాన్ని కోరుతూ ఈ పరస్పర అవగాహన ఒప్పందం జరిగింది. అక్టోబర్‌ 4న ఏయూలో ఈ ఒప్పంద కార్యక్రమం జరిగింది.

ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధవన్‌ అంతరిక్ష కేంద్రం(షార్‌)లోని ఎంఆర్‌ కురూప్‌ ఆడిటోరియంలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్‌ 4న తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఈ వారోత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమంలో షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌ పాల్గొన్నారు.

గ్లోబల్‌ క్యాన్సర్‌ రన్‌ పోస్టర్‌ ఆవిష్కరణ
క్యాన్సర్‌ వ్యాధిపై అవగాహన కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పోలీసు శాఖ, గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా అక్టోబర్‌ 10న నిర్వహించనున్న ‘గ్లోబల్‌ క్యాన్సర్‌ రన్‌’ పోస్టర్‌ను ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ అక్టోబర్‌ 4న విజయవాడలో ఆవిష్కరించారు. ఈ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా 93 దేశాల్లో ఒకేసారి వేలాదిమంది పాల్గొంటారని ఫౌండేషన్‌ ప్రతినిధులు తెలిపారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆంధ్ర విశ్వవిద్యాలయం(ఏయూ)తో ఒప్పందం 
ఎప్పుడు : అక్టోబర్‌ 4
ఎవరు    : ఇండియన్‌ నేవీ
ఎక్కడ    : విశాఖపట్నం, విశాఖపట్నం జిల్లా
ఎందుకు : నావికాదళ ప్రాజెక్టుల నిర్వహణలో ఏయూ సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఆచార్యుల సహకారం కోసం...


Hypersonic Missile: జిక్రోన్‌ క్రూయిజ్‌ క్షిపణులను పరీక్షించిన దేశం?

Tsirkon Missile

రష్యా మొట్టమొదటి సారిగా ఓ అణు జలాంతర్గామి నుంచి హైపర్‌సోనిక్‌ క్షిపణులను పరీక్షించింది. మొత్తం రెండు జిక్రోన్‌ క్రూయిజ్‌ క్షిపణులను విజయవంతంగా ప్రయోగించినట్లు రష్యా రక్షణ శాఖ అక్టోబర్‌ 4న తెలిపింది. అవి బారెంట్స్‌ సముద్రంలోని మాక్‌ లక్ష్యాలను ఛేదించాయని పేర్కొంది. రెండు క్షిపణుల్లో ఒక దాన్ని భూతలం నుంచి మరోదాన్ని తెల్ల సముద్రంలో నీటిలో నుంచి పరీక్షించినట్లు వెల్లడించింది. జిక్రోన్‌ క్షిపణి ధ్వని కంటే 9 రెట్లు వేగంతో ప్రయాణించగలదని, 1000 కిలోమీటర్ల రేంజ్‌ ఉంటుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తెలిపారు. 2021 ఏడాదిలోగా మరికొన్ని పరీక్షలు జరిపి, 2022లో రష్యన్‌ నేవీలో చేరుస్తామన్నారు. ఈ క్షిపణులు రష్యా రక్షణ రంగానికి మరింత బలాన్ని చేకూరుస్తాయని పేర్కొన్నారు.

కోవిడ్‌ మరణాలను తగ్గిస్తున్నాయి...
బ్లడ్‌ థిన్నర్లు (రక్తాన్ని పలుచగా చేసే మందులు) కోవిడ్‌ మరణాలను అడ్డుకోవడంలో సమర్థవంతంగా పని చేస్తున్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు లాన్సెట్‌ ఈ–క్లినికల్‌ మెడిసిస్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అమెరికాలోని 60 ఆస్పత్రుల్లో 2020 మార్చి 4 నుంచి ఆగస్టు 27 వరకు, 6,195 మంది రోగులపై జరిపిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అమెరికాలోని మిన్నెసోటా యూనివర్సిటీ, స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు దాదాపు 90 రోజలు పాటు యాంటీ కోయాగ్యులేషన్‌ థెరపీ ఇచ్చి ఈ వివరాలను సేకరించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : రెండు జిక్రోన్‌ క్రూయిజ్‌ క్షిపణుల పరీక్ష విజయవంతం
ఎప్పుడు : అక్టోబర్‌ 4
ఎవరు  : రష్యా రక్షణ శాఖ
ఎక్కడ : తెల్ల సముద్రం
ఎందుకు  : రష్యా రక్షణ రంగానికి మరింత బలాన్ని చేకూర్చేందుకు...


Andhra Pradesh: మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం?

CLAP-Jagananna Swachh Sankalpam

గ్రామీణ, పట్టణ, ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించి.. రోజు వారీ తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి.. వాటిని శాస్త్రీయ పద్ధతుల్లో నిర్మూలించే బృహత్తర కార్యక్రమం.. ‘‘వైఎస్సార్‌ జగనన్న స్వచ్ఛ సంకల్పం – క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌(ఇఔఅ్క)’’ ప్రారంభమైంది. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజైన అక్టోబర్‌ 2న విజయవాడలోని బెంజి సర్కిల్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెత్త సేకరణకు 4,097 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం–ముఖ్యాంశాలు

  • ‘మన ఊరును మనమే పరిశుభ్రంగా చేసుకుందాం’ అనే నినాదంతో పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగనుంది. 
  • రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ.. వంద రోజుల పాటు ప్రజల్లో దీనిపై అవగాహన కల్పిస్తారు.
  • గ్రామీణ ప్రాంతాల్లో రోజూ వారి వచ్చే 13,500 టన్నుల చెత్తను 23 వేల మంది గ్రీన్‌ అంబాసిడర్‌ల ద్వారా సేకరించనున్నారు.
  • ఈ కార్యక్రమం వల్ల గ్రామీణ ప్రాంతాలు పరిశుభ్రంగా.. ఆహ్లాదకరంగా తయారవుతాయి. పర్యావరణం మెరుగు పడుతుంది. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి.
  • దేశంలో చెత్త నిర్మూలనకు.. పారిశుద్ధ్య సమస్యకు సంపూర్ణ పరిష్కారం చూపిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలుస్తుంది.
  • ఈ కార్యక్రమం శాశ్వతంగా, సుస్ధిరంగా, నిరంతరాయంగా కొనసాగించడానికి.. ప్రజల్లో జవాబుదారీతనం పెంచడానికి నిర్వహణ ఖర్చులకు మాత్రమే గ్రామాల్లో ఇంటికి రోజుకు కేవలం 50 పైసల నుండి రూ.1 వరకు.. పట్టణాల్లో ఇంటికి రోజుకు కేవలం రూ.1 నుండి రూ.4 వరకు యూజర్‌ చార్జీలు వసూలు చేస్తారు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :  ‘‘వైఎస్సార్‌ జగనన్న స్వచ్ఛ సంకల్పం – క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌(ఇఔఅ్క)’’ ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్‌ 2
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ    : విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు: గ్రామీణ, పట్టణ, ప్రాంతాల్లో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కోసం... 

 

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 4 కరెంట్‌ అఫైర్స్‌

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌


డౌన్‌లోడ్‌ వయా ఆపిల్‌ ఐ స్టోర్‌

 

Published date : 05 Oct 2021 07:09PM

Photo Stories