Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, న‌వంబ‌ర్ 2 కరెంట్‌ అఫైర్స్‌

Modi at Cop 26

COP26 Summit: పర్యావరణ పరిరక్షణకు ఐదు సూత్రాల అజెండాకు ప్రకటించిన దేశం?

యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో భాగమైన స్కాట్‌లాండ్‌లో ఉన్న గ్లాస్గో నగరంలో జరుగుతున్న కాప్‌ –26 సదస్సు(కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ 26వ సదస్సు–2021)లో భారత ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్‌ 1న ప్రసగించారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో భారత్‌ సంకల్పాన్ని వివరిస్తూ ఐదు సూత్రాల ప్రణాళికలను మోదీ ప్రకటించారు. 2021, అక్టోబర్‌ 31న ప్రారంభమైన ఈ సదస్సు నవంబర్‌ 12 వరకు కొనసాగనుంది. పర్యావరణ పరిరక్షణ అంశాలపై చర్చలు జరిపేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.

మోదీ ప్రసంగం–ముఖ్యాంశాలు

  • వాతావరణ మార్పులను ఎదుర్కొనే విషయంలో పారిస్‌ ఒప్పందాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న ఏకైక దేశం భారత్‌ మాత్రమే.
  • ప్రపంచ జనాభాలో 17 శాతం మంది భారత్‌లో నివసిస్తున్నప్పటికీ మొత్తం ప్రపంచ కర్బన ఉద్గారాల్లో తమ దేశ వాటా కేవలం 5 శాతమే. 
  • ప్రపంచ స్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది.
  • జీవన విధానంలో మార్పులు చేసుకుంటే భూగోళాన్ని కాపాడుకోవడం సులభమే. గ్లోబల్‌ మిషన్‌గా మారాలి.
  • క్లైమేట్‌ ఫైనాన్స్‌ కింద ట్రిలియన్‌ డాలర్లు అందజేస్తామంటూ ఇచ్చిన హామీని అభివృద్ధి చెందిన దేశాలు నిలబెట్టుకోవాలి.
  • సంప్రదాయ పద్ధతుల ప్రకారం ప్రకృతితో కలిసి జీవించడాన్ని పాఠశాలల్లో పాఠ్య ప్రణాళికలో(సిలబస్‌) చేర్చాల్సిన అవసరం ఉంది.

ఐదు సూత్రాల అజెండా
1. శిలాజ ఇంధనాల వినియోగానికి క్రమంగా స్వస్తి. సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 2030 నాటికి 500 గిగావాట్లకు పెంచుతాం.
2. పునరుత్పాదక ఇంధన వనరులకు పెద్ద    పీట. 2030 నాటికి దేశ ఇంధన అవసరాల్లో 50 శాతం ఇంధనం పునరుత్పాదక వనరుల ద్వారా సమకూర్చుకుంటాం.
3. ఇప్పటి నుంచి 2030 దాకా ఒక బిలియన్‌ (100 కోట్ల) టన్నుల మేర కర్బన ఉద్గారాల తగ్గిస్తాం.
4. కర్బన ఉద్గారాల వల్ల ఆర్థిక వ్యవస్థపై     పడే ప్రతికూల ప్రభావాన్ని 2030 నాటికి 45 శాతం కంటే తక్కువకు పరిమితం చేస్తాం.
5. నెట్‌ జిరో(శూన్య) కర్బన ఉద్గారాలు అనే లక్ష్యాన్ని 2070 నాటికి భారత్‌ సాధిస్తుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :  కాప్‌ –26 సదస్సు(కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ 26వ సదస్సు–2021)లో ప్రసంగం
ఎప్పుడు : నవంబర్‌ 1
ఎవరు    : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ    : గ్లాస్గో నగరం, స్కాట్‌లాండ్, యునైటెడ్‌ కింగ్‌డమ్‌
ఎందుకు : పర్యావరణ పరిరక్షణ విషయంలో భారత్‌ సంకల్పాన్ని వివరించేందుకు...


World Bank: ఇండియా గ్రీన్‌ గ్యారంటీ ఇస్తామని ప్రకటించిన ఐరోపా దేశం?

Modi with Boris

భాగస్వామ్య పక్షాల 26వ శిఖరాగ్ర సదస్సులో (కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌–కాప్‌) భాగంగా రెండు రోజులపాటు జరిగే ప్రపంచ దేశాల అధినేతల సదస్సు ప్రారంభమైంది. నవంబర్‌ 1న స్కాటిష్‌ ఈవెంట్‌ క్యాంపస్‌లో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఈ సదస్సుని ప్రారంభించారు. సదస్సులో తొలిరోజు భారత ప్రధాని మోదీ సహా దాదాపు 120 దేశాల అధినేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఇటలీ సహకారంతో బ్రిటన్‌ ఆతిథ్యం ఇస్తున్న కాప్‌–26 సదస్సు 2021, అక్టోబర్‌ 31న ప్రారంభమైంది. నవంబర్‌ 12 దాకా కొనసాగనుంది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో భాగమైన స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో స్కాటిష్‌ ఈవెంట్‌ క్యాంపస్‌ ఉంది.

2015లో పారిస్‌లో జరిగిన కాప్‌ సదస్సులో నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు ఏకాభిప్రాయం సాధించడంతోపాటు కర్బన ఉద్గారాలకు కత్తెర వేసే దిశగా కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి గ్లాస్గోలో కాప్‌–26 నిర్వహిస్తున్నారు.

ఇండియా గ్రీన్‌ గ్యారంటీ...
భారత్‌లో హరిత ప్రాజెక్టుల కోసం అదనంగా 750 మిలియన్‌ పౌండ్లు విడుదల చేయడానికి ప్రపంచ బ్యాంక్‌కు ‘ఇండియా గ్రీన్‌ గ్యారంటీ’ ఇస్తామని బ్రిటన్‌ ప్రకటించింది. క్లీన్‌ ఎనర్జీ, రవాణా, పట్టణాభివృద్ధి తదితర రంగాల్లో మౌలిక సదుపాయాల కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గ్రీన్‌ ప్రాజెక్టులకు ప్రైవేట్‌ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్‌ గ్రూప్‌ నుంచి 210 మిలియన్‌ పౌండ్ల రుణ సాయం అందిస్తామని యూకే ప్రకటించింది.

తొలి భేటీ ఇదే...
కాప్‌–26 సదస్సు నేపథ్యంలో... బ్రిటిష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో మోదీ నవంబర్‌ 1న సమావేశమయ్యారు. గ్రీన్‌ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన వనరులు, క్లీన్‌ టెక్నాలజీ, ఆర్థికం, రక్షణ తదితర రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. జాన్సన్, మోదీ మధ్య జరిగిన తొలి ముఖాముఖి భేటీ ఇదే.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : కాప్‌–26 సదస్సు(కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌–కాప్‌)లో భాగంగా రెండు రోజులపాటు జరిగే ప్రపంచ దేశాల అధినేతల సదస్సు ప్రారంభం 
ఎప్పుడు : నవంబర్‌ 1
ఎవరు    : బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌
ఎక్కడ    : స్కాటిష్‌ ఈవెంట్‌ క్యాంపస్, గ్లాస్గో నగరం, స్కాట్‌లాండ్, యునైటెడ్‌ కింగ్‌డమ్‌
ఎందుకు : వాతావరణ మార్పులపై చర్చలు జరిపేందుకు...


Bharat Biotech: భారత్‌ తయారీ కోవిడ్‌ టీకా కోవాగ్జిన్‌ను గుర్తించిన దేశం?

Covaxin

భారత్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ తయారీ కోవిడ్‌ టీకా కోవాగ్జిన్‌ను గుర్తిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కోవాగ్జిన్‌తోపాటు చైనాలోని సినోఫామ్‌ తయారుచేసిన బీబీఐబీపీ–కోర్‌వి టీకాను కూడా గుర్తిస్తున్నట్లు నవంబర్‌ 1న వెల్లడించింది. దీంతో కోవాగ్జిన్‌ తీసుకున్న 12 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసున్న వారు ఇకపై ఆస్ట్రేలియా వెళ్లవచ్చు. ఆస్ట్రాజెనెకా–ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం సంయుక్తంగా రూపొందించిన కొవిషీల్డ్‌ను ఇప్పటికే ఆ దేశం అధికారికంగా గుర్తించింది. కోవిడ్‌ మహమ్మారితో సరిహద్దులను మూసివేసిన ఆస్ట్రేలియా దాదాపు 20 నెలల తర్వాత మొదటిసారిగా దేశంలోకి ప్రయాణికులను అనుమతించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారత్‌ తయారీ కోవిడ్‌ టీకా కోవాగ్జిన్‌ను గుర్తించిన దేశం?
ఎప్పుడు : నవంబర్‌ 1
ఎవరు    : ఆస్ట్రేలియా 
ఎందుకు : కోవాగ్జిన్‌ టీకా తీసుకున్న వారిని దేశంలోని అనుమతించేందుకు...


Elon Musk: భారత్‌లో ఏర్పాటైన స్పేస్‌ఎక్స్‌ అనుబంధ సంస్థ పేరు?

SpaceX

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ తాజాగా భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించే దిశగా సన్నాహాలు వేగవంతం చేసింది. స్థానికంగా బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించేందుకు భారత్‌లో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. స్టార్‌లింక్‌ శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఎస్‌సీపీఎల్‌) పేరిట న్యూఢిల్లీలో దీన్ని నెలకొల్పినట్లు నవంబర్‌ 1న స్టార్‌లింక్‌ కంట్రీ డైరెక్టర్‌ (ఇండియా) సంజయ్‌ భార్గవ తెలిపారు.

ఇండియన్‌ ఆయిల్‌ మలీక్‌ అన్‌హైడ్రైడ్‌ ప్లాంట్‌ ఎక్కడ ఏర్పాటుకానుంది?
ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) భారీ స్థాయిలో మలీక్‌ అన్‌హైడ్రైడ్‌ ప్లాంట్‌ను రూ.3,681 కోట్లతో ఏర్పాటు చేస్తోంది. పాలిస్టర్‌ రెసిన్స్, సర్ఫేస్‌ కోటింగ్స్‌ ప్లాస్టిసైజర్స్, అగ్రోకెమికల్స్, లూబ్రికెంట్‌ అడిటివ్స్‌ వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకై హర్యానాలోని పానిపట్‌ వద్ద ఉన్న సంస్థకు చెందిన రిఫైనరీ, పెట్రోలియం కాంప్లెక్స్‌ వద్ద ఈ కేంద్రాన్ని స్థాపించనుంది. 54 నెలల్లో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఏటా 1,20,000 టన్నుల తయారీ సామర్థ్యంతో ఇది రానుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : స్టార్‌లింక్‌ శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఎస్‌సీపీఎల్‌) పేరుతో అనబంధ సంస్థ ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్‌ 1
ఎవరు    : స్పేస్‌ఎక్స్‌
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : భారత్‌లో స్థానికంగా బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించేందుకు...


Lifetime Achievement Awards: మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?

Abul Kalam Azad

స్వతంత్ర భారతావని తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతిని పురస్కరించుకొని నవంబర్‌ 11న నిర్వహించే జాతీయ మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో పలువురికి జీవితకాల సాఫల్య పురస్కారాలు (లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు)ను ప్రదానం చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ హెచ్‌ నదీమ్‌ అహ్మద్‌ తెలిపారు. ఉర్దూ భాష అభివృద్ధి, సాహిత్య, విభిన్న విభాగాల్లో అత్యుత్తమ సేవలందించిన మహోన్నతులకు ఈ పురస్కారాలను అందజేస్తామని చెప్పారు. ఈ మేరకు నవంబర్‌ 1న ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలోని వివరాల ప్రకారం...

  • మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జాతీయ పురస్కారానికి ఎంపికైన వారికి రూ.1.25 లక్షల ప్రోత్సాహంతోపాటు జ్ఞాపిక, సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తారు.
  • డాక్టర్‌ అబ్దుల్‌ హఖ్‌ ప్రాంతీయ (దక్షిణ భారతదేశం) పురస్కారానికి ఎంపికైన వారికి రూ.లక్షతోపాటు జ్ఞాపిక, «సర్టిఫికెట్‌ అందిస్తారు.
  • ఉర్దూ భాషాభివృద్ధి కోసం కృషి చేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, ఉర్దూ భాషతో అత్యున్నత శ్రేణిలో రాణించిన ముగ్గురు విద్యార్థులకు ఉత్తమ విద్యార్థి పురస్కారం అందించనున్నారు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : జాతీయ మైనార్టీ సంక్షేమ దినోత్సవం(నవంబర్‌ 11) సందర్భంగా పలువురికి జీవితకాల సాఫల్య పురస్కారాల (లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు) ప్రదానం
ఎప్పుడు  : నవంబర్‌ 1
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ హెచ్‌ నదీమ్‌ అహ్మద్‌
ఎందుకు : ఉర్దూ భాష అభివృద్ధి, సాహిత్య, విభిన్న విభాగాల్లో అత్యుత్తమ సేవలందించినందున...


New Zealand: కుక్‌ జలసంధిని విద్యుత్‌ విమానం దాటిన తొలివ్యక్తి?

Electric Plane

న్యూజిలాండ్‌లోని ఉత్తర, దక్షిణ దీవులను కలిపే కుక్‌ జలసంధిని తొలిసారి విద్యుత్‌ విమానంలో దాటడం ద్వారా గ్యారీ ఫ్రీడ్‌మ్యాన్‌ అనే వ్యక్తి తాజాగా చరిత్ర సృష్టించారు. రెండు సీట్లుండే చిన్న విమానంలో బ్లెన్‌హీమ్‌ నుంచి ఒంటరిగా బయలుదేరిన ఆయన.. 40 నిమిషాల్లో వెల్లింగ్టన్‌ చేరుకున్నారు. మొత్తం 78 కిలోమీటర్లు ప్రయాణించారు. పర్యావరణ హితమైన ప్రయాణాల దిశగా ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే ఈ యాత్ర చేపట్టినట్లు 49 ఏళ్ల ఫ్రీడ్‌మ్యాన్‌ తెలిపారు.

కొన్ని జలసంధులు...

  • ఆస్ట్రేలియా, టాస్మానియాను వేరుచేస్తున్న జలసంధి: బాస్‌ జలసంధి
  • ఫసిఫిక్‌–అట్లాంటిక్‌ సముద్రాలను కలిపే జల సంధి: మ్యాజిలాన్‌ జలసంధి
  • ఉత్తర–దక్షిణ అమెరికాలను వేరు చేసే జలసంధి: పనామా కాలువ
  • మధ్యధరా, ఎర్ర సముద్రాలను కలిపే జలసంధి: సూయాజ్‌ కాలువ
  • ఉత్తర అమెరికా, ఆసియాలను వేరు చేసే జలసంధి: బేరింగ్‌ జలసంధి

ఎస్‌బీఐ మాజీ చైర్మన్‌ అరెస్ట్‌..
బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మాజీ ఛైర్మన్‌ ప్రతీప్‌ చౌదరి నవంబర్‌ 1న అరెస్టయ్యారు. రూ.25 కోట్ల రుణ చెల్లింపు వైఫల్యం వ్యవహారంలో దాదాపు 200 కోట్ల హోటల్‌ ఆస్తి జప్తు, ఆ ఆస్తిని అతి తక్కువ ధర దాదాపు రూ.25 కోట్లకు అసెట్‌ రికన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఏఆర్‌సీ)కి విక్రయించడం తత్సంబంధ లావాదేవీల్లో తీవ్ర అవకతవకలు జరిగినట్లు ఆయనపై ఆరోపణ. ఢిల్లీలో ఆయనను అరెస్ట్‌ చేసి, రాజస్తాన్‌లోని జైసల్మేర్‌కు తీసుకువచ్చినట్లు సమాచారం.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : కుక్‌ జలసంధిని తొలిసారి విద్యుత్‌ విమానంలో దాటిన వ్యక్తి?
ఎప్పుడు : నవంబర్‌ 1
ఎవరు    : గ్యారీ ఫ్రీడ్‌మ్యాన్‌
ఎక్కడ    : న్యూజిలాండ్‌
ఎందుకు : పర్యావరణ హితమైన ప్రయాణాల దిశగా ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే...


Peace Research Institute: పీఆర్‌ఐవో లెక్కల ప్రకారం... కరోనాతో మరణించిన వారి సంఖ్య?

Covid-19 Deaths

ప్రపంచంలో తొలిసారిగా వెలుగు చూసిన నాటి నుంచి కేవలం రెండేళ్లలోపే కరోనా మహమ్మారి తన కరాళ నృత్య విశ్వరూపాన్ని చూపించింది. కరోనా రక్కసి కోరలకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 50లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోనే శాన్‌ ఫ్రాన్సిస్కో, లాస్‌ ఏంజిలెస్‌ నగరాల మొత్తం జనాభా కంటే ఎక్కువ. నార్వే రాజధాని ఓస్లోలోని శాంతి అధ్యయన సంస్థ(పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఓస్లో–పీఆర్‌ఐవో) వెల్లడించిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. పీఆర్‌ఐవో తెలిపిన వివరాల ప్రకారం...

  • 1950 ఏడాది నుంచి ప్రపంచంలో వేర్వేరు చోట్ల పలు దేశాల మధ్య జరిగిన యుద్ధాల్లో కారణంగా నమోదైన మరణాల కంటే కూడా కోవిడ్‌ మరణాల సంఖ్య చాలా ఎక్కువ.
  • భూమండలంపై హృద్రోగం, గుండెపోటుతర్వాత కోవిడ్‌ ఊహకందని స్థాయిలో ప్రాణాలను హరిస్తూ మూడో అతిపెద్ద ప్రాణాంతక వ్యాధిగా అవతరించింది.
  • ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఒక్క అమెరికాలోనే 7.40లక్షలకు పైగా కోవిడ్‌ మరణాలు నమోదయ్యాయి.


Unity Small Finance Bank: ఏ సంస్థల భాగస్వామ్యంతో యూనిటీ బ్యాంక్‌ ఏర్పాటైంది?

Unity Bank

యూనిటీ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ తన కార్యకలాపాలను ప్రారంభించింది. దీంతో రూ. 7,000 కోట్ల రుణ కుంభకోణంతో కూరుకుపోయిన పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోఆపరేటివ్‌ (పీఎంసీ) బ్యాంక్‌... రానున్న కాలంలో యూనిటీ బ్యాంక్‌లో విలీనం కావడానికి మార్గం సుగమం అయ్యింది. సెంట్రమ్‌ గ్రూప్,  పేమెంట్స్‌ యాప్‌ భారత్‌పే 51:49 భాగస్వామ్యంతో యూనిటీ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఏర్పాటయ్యింది. 2021, అక్టోబర్‌ 12న సంస్థ ఆర్‌బీఐ లైసెన్స్‌ పొంది రికార్డు సమయంలో కార్యకలాపాలు ప్రారంభించింది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.

మరొక బ్యాంక్‌ను స్వాధీనం చేసుకోవలంటే...
పీఎంసీ బ్యాంక్‌ను యూనిటీ బ్యాంక్‌ స్వాధీనం చేసుకోవాలన్న ప్రతిపాదన ఉంది. ఆర్‌బీఐ దీనికి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఒక బ్యాంక్‌ మరొక బ్యాంక్‌ను స్వాధీనం చేసుకోవలంటే, ఆ బ్యాంక్‌ మొదట వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండాలి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : యూనిటీ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ కార్యకలాపాలు ప్రారంభం
ఎప్పుడు : నవంబర్‌ 1 
ఎవరు    : సెంట్రమ్‌ గ్రూప్, పేమెంట్స్‌ యాప్‌ భారత్‌పే
ఎక్కడ    : దేశంలో...
ఎందుకు : బ్యాంకింగ్‌ కార్యకలాపాల నిర్వహణ కోసం...

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, న‌వంబ‌ర్ 1 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 02 Nov 2021 06:48PM

Photo Stories