Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, మార్చి 14 కరెంట్‌ అఫైర్స్‌

DA-CAs-Mar-14

President of Chile: చిలీ కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నేత?

Gabriel Boric Font

వామపక్ష భావజాలమున్న గాబ్రియెల్‌ బొరిక్‌ ఫాంట్‌ చిలీ కొత్త అధ్యక్షుడిగా మార్చి 11న ప్రమాణ స్వీకారం చేశారు. చిలీలోని వాల్పరైసో నగరంలో ఈ కార్యక్రమం జరిగింది. దేశంలో ఆర్థిక అసమానతలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో 36 ఏళ్ల బొరిక్‌ రాకతో ప్రజల్లో కొత్త ఆశలు నెలకొన్నాయి. ఆర్థికంగా సంపన్న దేశమైన చిలీలో అసమానతలు ఎక్కువగా ఉండడంతో తరచూ ఆందోళనలు జరుగుతుంటాయి. పదిహేడేళ్ల పాటు మిలటరీ నియంతృత్వం రాజ్యమేలి, రక్తపాతం జరిగిన చిలీలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించి నాలుగేళ్లే అయింది.

56 శాతం ఓట్లతో విజయం..
బొరిక్‌ తన కేబినెట్‌లో 14 మంది మహిళల్ని చేర్చుకొని తమది ఫెమినెస్ట్‌ కేబినెట్‌ అని చాటి చెప్పారు. మరో 10 మంది పురుషులు మంత్రులుగా ప్రమాణం చేశారు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో 56% ఓట్లతో కన్జర్వేటివ్‌ అయిన జాస్‌ ఆంటోనియా కాస్ట్‌పై గాబ్రియెల్‌ బొరిక్‌ విజయం సాధించారు.

చిలీ..
రాజధాని:
శాంటియాగో; కరెన్సీ: చిలియన్‌ పెసో
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
చిలీ కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నేత?
ఎప్పుడు : మార్చి 11
ఎవరు    : గాబ్రియెల్‌ బొరిక్‌ ఫాంట్‌
ఎక్కడ    : వాల్పరైసో, చిలీ
ఎందుకు : 2021, డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో 56 శాతం ఓట్లతో కన్జర్వేటివ్‌ అయిన జాస్‌ ఆంటోనియా కాస్ట్‌పై గాబ్రియెల్‌ బొరిక్‌ విజయం సాధించినందున..

Tennis: ఐటీఎఫ్‌ టోర్నీలో విజేతగా నిలిచిన జోడి?​​​​​​​​​​​​​​

Yuki Bhabri and Saket Myneni

భారత డేవిస్‌కప్‌ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని తన కెరీర్‌లో 26వ అంతర్జాతీయ డబుల్స్‌ టైటిల్‌ను సాధించాడు. మార్చి 12న భోపాల్‌లో ముగిసిన అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) టోర్నీలో సాకేత్‌–యూకీ బాంబ్రీ (భారత్‌) జంట విజేతగా నిలిచింది. 56 నిమిషాల్లో ముగిసిన ఫైనల్లో సాకేత్‌–యూకీ బాంబ్రీ ద్వయం 6–4, 6–1తో లోహితాక్ష–అభినవ్‌ సంజీవ్‌ (భారత్‌) జోడీపై గెలిచింది.

క్రికెట్‌ ఆటగాడు డు ప్లెసిస్‌ ఏ దేశానికి చెందినవాడు?
ఐపీఎల్‌ ఫ్రాంచైజీ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) 2022 సీజన్‌ కోసం కొత్త కెప్టెన్‌ పేరును ప్రకటించింది. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ డు ప్లెసిస్‌ ఆర్‌సీబీ టీమ్‌కు సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ సీజన్‌కు చాలా ముందే విరాట్‌ కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఆర్‌సీబీ జట్టుకు కెప్టెన్‌ ఎంపిక అనివార్యమైంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) టోర్నీలో విజేతగా నిలిచిన జోడీ?
ఎప్పుడు : మార్చి 11
ఎవరు    : సాకేత్‌–యూకీ బాంబ్రీ (భారత్‌) జంట
ఎక్కడ    : భోపాల్, మధ్యప్రదేశ్‌
ఎందుకు : ఫైనల్లో సాకేత్‌–యూకీ బాంబ్రీ ద్వయం 6–4, 6–1తో లోహితాక్ష–అభినవ్‌ సంజీవ్‌ (భారత్‌) జోడీపై విజయం సాధించడంతో..

Russia-Ukraine War: ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీని ఏ దేశానికి మార్చనున్నారు?

Russia and Ukraine War

ఉక్రెయిన్‌లోని తన రాయబార కార్యాలయాన్ని(ఎంబసీ) పొరుగు దేశం పోలండ్‌కు తాత్కాలికంగా మార్చాలని భారత్‌ నిర్ణయించింది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో... మార్చి 13న భారత ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ఉన్న ఇండియన్‌ ఎంబసీ  సిబ్బంది ఇప్పటికే లెవివ్‌ నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. లెవివ్‌ నగరం కూడా ఉక్రెయిన్‌లోనే ఉంది. 

యుద్ధం 18వ రోజు..
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మార్చి 13వ తేదీ నాటికి 18వ రోజుకు చేరుకుంది. రష్యా సైన్యం భీకర  దాడులు కొనసాగిస్తోంది. రాజధాని కీవ్‌తోపాటు ముఖ్య నగరాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా క్షిపణులతో నిప్పుల వర్షం కురిపిస్తోంది. సైనిక స్థావరాలనే కాదు, సాధారణ నివాస గృహాలను కూడా విడిచిపెట్టడం లేదు. కీవ్, మారియుపోల్‌లో పరిస్థితి భీతావహంగా మారింది. 2022, ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించింది.

యారోవివ్‌ మిలటరీ రేంజ్‌ ఎక్కడ ఉంది?
పశ్చిమ ఉక్రెయిన్‌లోని లెవివ్‌ నగర సమీపంలో ఉన్న యారోవివ్‌ సైనిక శిక్షణా కేంద్రంపై మార్చి 13న రష్యా గగనతల దాడుల్లో 35 మంది మరణించారు. మరో 57 మంది గాయపడ్డారు. పోలండ్‌ సరిహద్దుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న యారోవివ్‌ మిలటరీ రేంజ్‌పై రష్యా సైన్యం రాకెట్లు ప్రయోగించిందని ఉక్రెయిన్‌ అధికారులు చెప్పారు. దీన్ని యారోవివ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌కీపింగ్, సెక్యూరిటీ సెంటర్‌గానూ పిలుస్తారు. అమెరికా సైనికాధికారులు ఇక్కడ ఉక్రెయిన్‌ సైన్యానికి స్వయంగా శిక్షణ ఇస్తుంటారు. ఈ మిలటరీ రేంజ్‌లో నాటో దేశాల సైనిక విన్యాసాలు జరుగుతుంటాయి.

Russia-Ukraine War: శరణార్థులకు ఆశ్రయమిస్తే భత్యం అందజేస్తామని ప్రకటించిన దేశం?​​​​​​​

Ukraine Refugees

ఉక్రెయిన్‌ శరణార్థులకు ఇళ్లల్లో ఉచితంగా వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తే నెలకు 350 పౌండ్లు చొప్పున భత్యం అందజేస్తామని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ప్రకటించింది. కనీసం 6 నెలలపాటు ఆశ్రయం కల్పించాల్సి ఉంటుందని మార్చి 13న యూకే హౌసింగ్‌ సెక్రెటరీ మైఖేల్‌ గోవ్‌ చెప్పారు. ఉక్రెయిన్‌ నుంచి ఎంతోమంది ప్రాణభయంతో తరలివస్తున్నారని పేర్కొన్నారు. వైద్య సేవలు, వారి పిల్లల స్కూళ్ల ఫీజులు సైతం ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. శరణార్థులు మూడేళ్లపాటు ఉండొచ్చని తెలిపారు.

మరో మేయర్‌ను అపహరించిన రష్యా!
దినిప్రొరుడ్నె నగర మేయర్‌ యెవ్‌హెన్‌ మాట్‌వెయెవ్‌ను మార్చి 13న రష్యా సైనికులు కిడ్నాప్‌ చేశారని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి డిమిత్రో కులేబా ఆరోపించారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. ఇప్పటికే మెలిటోపోల్‌ సిటీ మేయర్‌ ఇవాన్‌ ఫెడోరోవ్‌ను రష్యా సైన్యం అపహరించినట్లు వార్తలు రావడం తెలిసిందే.

రష్యా దాడుల్లో అమెరికా జర్నలిస్టు మృతి
ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సమీపంలోని ఇర్పిన్‌లో రష్యా దాడుల్లో ప్రఖ్యాత ‘ద న్యూయార్క్‌ టైమ్స్‌’లో పనిచేసిన బ్రెంట్‌ రెనాడ్‌(51) మృతి చెందినట్లు ‘కీవ్‌ ఇండిపెండెంట్‌’ పత్రిక మార్చి 13న వెల్లడించింది. మరో ఇద్దరు అమెరికా జర్నలిస్టులు గాయపడ్డారని తెలియజేసింది. అమెరికాకు చెందిన బ్రెంట్‌ రెనాడ్‌ సినీ దర్శకుడిగానూ పని చేస్తున్నారు.

ఉక్రెయిన్‌ సైన్యంలోకి... స్నైపర్‌ వలీ
‘రష్యాపై జరుగుతున్న యుద్ధంలో మాకు సహాయం చేయండి’ అంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేసిన విజ్ఞప్తి పట్ల కెనడా మాజీ సైనికులు సానుకూలంగా స్పందించారు. కెనడా రాయల్‌ 22వ రెజిమెంట్‌కు చెందిన పూర్వ సైనికులు ఉక్రెయిన్‌ సైన్యంలో చేరారు. వీరిలో ప్రపంచంలోనే అత్యుత్తమ స్నైపర్‌ వలీ కూడా ఉన్నారు. గతంలో ఇరాక్‌లో ఐసిస్‌ ఉగ్రవాదులపై పోరాడిన కుర్దిష్‌ దళాలకు వలీ సాయం అందించారు. వలీ ఒక్కరోజులో కనీసం 40 మందిని హతమార్చగలడంటారు. 2017 జూన్‌లో ఇరాక్‌లో 3,540 మీటర్ల దూరంలో ఉన్న ఐసిస్‌ జిహాదిస్ట్‌ను సునాయాసంగా కాల్చి చంపాడు.

BrahMos Supersonic Cruise Missile: బ్రహ్మోస్‌ కొత్త వెర్షన్‌ పరిధి ఎన్ని కిలోమీటర్లు?

Brahmos

బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ మిస్సైల్‌ కొత్త వెర్షన్‌ను భారత్‌ అభివృద్ధి చేస్తోంది. వాయుమార్గాన ప్రయోగించే ఈ కొత్త వెర్షన్‌ బ్రహ్మోస్‌ 800 కిలోమీటర్లు ప్రయాణం చేసి లక్ష్యాన్ని ఛేదించగలదని అంచనా. ఇప్పటివరకు దీని పరిధి దాదాపు 300 కిలోమీటర్లుంది. బ్రహ్మోస్‌ రేంజ్‌ ఎప్పటికప్పుడు వృద్ధి చేస్తూ వస్తున్నారని, సాఫ్ట్‌వేర్‌లో చిన్న మార్పుతో రేంజ్‌ను 500 కిలోమీటర్లు పెంచవచ్చని, తాజాగా దీని టార్గెట్‌ రేంజ్‌ను 800కిలోమీటర్లకు చేరనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీన్ని çసుఖోయ్‌– 30 ఎంకేఐ కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ నుంచి ప్రయోగిస్తారు. ప్రస్తుతం భారత వాయుసేన వద్ద బ్రహ్మోస్‌ మిస్సైల్‌ అమర్చిన çసుఖోయ్‌–30 విమానాలు 40 ఉన్నాయి.

ముఖ్యాంశాలు..

  • విమానాలు, నౌకలు, జలాంతర్గాములు, నేల మీద నుంచి నిర్దేశించిన లక్ష్యాలను బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌  క్షిపణులు  ఛేదించగలవు.
  • భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)తో కలిసి బీఏపీఎల్‌ బ్రహ్మోస్‌ క్షిపణుల్ని తయారు చేస్తోంది. ఇండో–రష్యన్‌ జాయింట్‌ వెంచర్‌లో భాగంగా బ్రహ్మోస్‌ను అభివృద్ధి చేసిన విషయం విదితమే. 
  • ఫిలిప్పీన్స్‌ నేవీకి యాంటీ–షిప్‌ బ్రహ్మోస్‌ క్షిపణుల సరఫరా చేయడానికి ఇటీవల ఒప్పందం కుదిరిన విషయం విదితమే.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
800 కిలోమీటర్ల రేంజ్‌తో బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ మిస్సైల్‌ కొత్త వెర్షన్‌ను అభివృద్ధి చేస్తోన్న దేశం?
ఎప్పుడు : మార్చి 13
ఎవరు    : భారత్‌
ఎక్కడ    : భారత్‌
ఎందుకు : భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు..

Yamuna River: నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ గంగా డైరెక్టర్‌గా ఎవరు ఉన్నారు?​​​​​​​

Yamuna River

రాబోయే డిసెంబర్‌ చివరకు యమునా నదిలోకి ఎలాంటి మురికి నీరు చేరదని నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ గంగా(ఎన్‌ఎమ్‌సీజీ) డైరెక్టర్‌ జనరల్‌ అశోక్‌ కుమార్‌ చెప్పారు. నదిలోకి దారితీసే అన్ని మురుగుకాల్వలను అప్పటికల్లా మూసివేస్తారని మార్చి 13న తెలిపారు. నదిలోకి మురుగునీరు వదిలే డ్రెయిన్స్‌ను మూసివేసి, మురుగునీటిని సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు మళ్లించే పనులు చేపడతామని పేర్కొన్నారు. ప్లాంట్లలో శుద్ధి చేసిన నీటిని నదిలోకి వదులుతారని, దీంతో నదిలో పరిశుభ్రమైన నీరు మాత్రమే ప్రవహిస్తుందని వివరించారు. యమునా నదిని శుభ్రపరిచేందుకు ఎన్‌జీయోధా(నమామి గంగే యమునా ఆఫ్‌ ఢిల్లీ ఏరియా)ను ప్రారంభిస్తామన్నారు. ఎన్‌ఎమ్‌సీజీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.

1,376 కిలోమీటర్ల పొడవున..
1,376 కిలోమీటర్ల పొడవున ప్రవహించే యమునా నది దేశంలోని అత్యంత కలుషిత నదుల్లో ఒకటిగా నిలుస్తోంది. ఈ నది నుంచి దేశ రాజధాని నగరం న్యూఢిల్లీకి మంచినీటి సరఫరా జరుగుతోంది. ఢిల్లీలో నది 22 కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తుంది. కానీ నదిలోని 98 శాతం కలుషితమంతా ఇక్కడనుంచే వస్తోంది. యమునా నది హిమాలయ పర్వతాలలో ‘యమునోత్రి’లో జన్మించి ఉత్తరాఖండ్, హిమాచల ప్రదేశ్, హర్యాన, ఉత్తరప్రదేశ్, ఢిల్లీల గుండా ప్రవహించి ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమం వద్ద గంగానదిలో కలుస్తుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
రాబోయే డిసెంబర్‌ చివరకు యమునా నదిలోకి ఎలాంటి మురికి నీరు చేరదు
ఎప్పుడు : మార్చి 13
ఎవరు : నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ గంగా(ఎన్‌ఎమ్‌సీజీ) డైరెక్టర్‌ జనరల్‌ అశోక్‌ కుమార్‌  
ఎందుకు : నదిలోకి దారితీసే అన్ని మురుగుకాల్వలను అప్పటికల్లా మూసివేయడం ద్వారా..

Chairman and Managing Director: ఆయిల్‌ ఇండియా సీఎండీగా ఎంపికైన వ్యక్తి?

Dr Ranjit Rath

దేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్‌ ఉత్పత్తి సంస్థ– ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌(సీఎండీ)గా రంజిత్‌ రాత్‌ ఎంపికయ్యారు. ఈ మేరకు మార్చి 13న ప్రభుత్వ రంగ నియామకాల బోర్డ్‌ (పీఈఎస్‌బీ) ఒక ప్రకటన విడుదల చేసింది. 50 సంవత్సరాల రంజిత్‌ రాత్‌ ప్రస్తుతం మినీరత్న కంపెనీగా గుర్తింపు పొందిన మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ కార్పొరేషన్‌ (ఎంఈసీఎల్‌) చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయిల్‌ ఇండియా ప్రధాన కార్యాలయం అస్సాం రాష్ట్రం, దిబ్రూఘర్‌ జిల్లా, దులియాజన్‌ పట్టణంలో ఉంది.

ప్రస్తుత సీఎండీగా సుశీల్‌..
ఆయిల్‌ ఇండియా ప్రస్తుత సీఎండీగా సుశీల్‌ చంద్ర మిశ్రా పనిచేస్తున్నారు. ఆయన ఈ ఏడాది జూన్‌ 30వ తేదీన పదవీ విరమణ చేస్తారు. అటు తర్వాత రాత్‌ ఈ బాధ్యతలను స్వీకరిస్తారు. అయితే ఇందుకు తొలుత ఆయన సచ్చీలతపై సీవీసీ, సీబీఐ వంటి అవినీతి నిరోధక శాఖల నుంచి క్లియరెన్స్‌లు ఇవ్వాలి. అటు తర్వాత రాత్‌ ఎంపికకు నియామకపు వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఆమోదముద్ర వేయాలి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌(సీఎండీ)గా ఎంపికైన వ్యక్తి?
ఎప్పుడు : మార్చి 13
ఎవరు  : రంజిత్‌ రాత్‌
ఎక్కడ : దులియాజన్‌ పట్టణం, దిబ్రూఘర్‌ జిల్లా, అస్సాం
ఎందుకు : ఆయిల్‌ ఇండియా ప్రస్తుత సీఎండీ సుశీల్‌ చంద్ర మిశ్రా.. 2022, జూన్‌ 30వ తేదీన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో..

AGA: విశిష్ట విద్యావేత్త అవార్డుకు ఎంపికైన తొలి భారతీయుడు?​​​​​​​

Dr Nageshwar Reddy

అమెరికన్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ అసోసియేషన్‌(ఏజీఏ) ప్రదానం చేసే ‘విశిష్ట విద్యావేత్త’ అవార్డుకు ఏసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్టోఎంటరాలజీ(ఏఐజీ) చైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డి ఎంపికయ్యారు. దీంతో ఈ అవార్డుకు ఎంపికైన తొలి భారతీయుడిగా ఆయన గుర్తింపు పొందారు. అమెరికన్‌ గ్యాస్ట్రోఎంటరాలాజికల్‌ అసోసియేషన్‌ (ఏజీఏ) 2022లో ఇచ్చే వార్షిక గుర్తింపు బహుమతులలో డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డి పేరును ప్రకటించింది.

అమెరికన్‌ గ్యాస్ట్రోఎంటరాలాజికల్‌ అసోసియేషన్‌ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన శాస్త్రీయ పరిశోధనాసంస్థ. గ్యాస్ట్రో ఎంటరాలజీ, హెపటాలజీ విభాగాల్లో అత్యుత్తమ సహకారం అందించే, విజయాలను సాధించే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలను వైద్యులను గుర్తించి వారికి బహుమతి ప్రదానం చేస్తుంది. భారతదేశంలో ఎండోస్కోపిక్‌ విద్య కోసం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదల కోసం డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి చేస్తున్న జీవితకాల కృషికి ఈ అవార్డే నిదర్శనం.

మూడు దశాబ్దాలుగా..
డాక్టర్‌ రెడ్డి నాయకత్వంలో ఏఐజీ హాస్పిటల్స్‌ ఇప్పుడు జీర్ణకోశ సంబంధ వ్యాధుల పరిశోధనలకు, ఎండోస్కోపీ శిక్షణ కోసం ప్రపంచానికి కేంద్రబిందువుగా అవతరించింది. మూడు దశాబ్దాలుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వెయ్యి మందికి పైగా గ్యాస్ట్రోఎంటరాలజిస్టులకు అధునాతన ఎండోస్కోపీ విధానాలలో శిక్షణ ఇచ్చినట్లు ఏఐజీ వెల్లడించింది. అమెరికాలో 2022, మే 21 నుంచి 24 తేదీ వరకు జరిగే ‘డైజెస్టివ్‌ డిసీజ్‌ వీక్‌ కాన్ఫరెన్స్‌’లో డాక్టర్‌ రెడ్డిని  విశిష్ట విద్యావేత్త అవార్డుతో సత్కరిస్తారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అమెరికన్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ అసోసియేషన్‌(ఏజీఏ) ప్రదానం చేసే ‘విశిష్ట విద్యావేత్త’ అవార్డుకు ఎంపికైన భారతీయుడు?
ఎప్పుడు : మార్చి 13
ఎవరు :  ఏసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్టోఎంటరాలజీ(ఏఐజీ) చైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డి
ఎందుకు : ఎండోస్కోపిక్‌ విద్య కోసం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదల కోసం చేస్తున్న కృషికిగాను..

​​​​​​​​​​​​​​చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu >> 2022, మార్చి 11 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 14 Mar 2022 07:06PM

Photo Stories