Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, మార్చి 11 కరెంట్‌ అఫైర్స్‌

DA-CAs-March-11

NLMC: నేషనల్‌ ల్యాండ్‌ మానిటైజేషన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు ఉద్దేశం?

union-cabinet

ప్రైవేటీకరిస్తున్న సంస్థలు లేదా మూసివేస్తున్న ప్రైవేట్‌ రంగ సంస్థలకు సంబంధించిన మిగులు స్థలాలు, భవంతులను మానిటైజ్‌ చేయడానికి నేషనల్‌ ల్యాండ్‌ మానిటైజేషన్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎల్‌ఎంసీ) పేరుతో కొత్త కంపెనీని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ మార్చి 9న ఆమోదముద్ర వేసింది. స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ)గా పనిచేసే ఎన్‌ఎల్‌ఎంసీలో పూర్తి వాటాలు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి. నిరుపయోగంగా ఉన్న, పూర్తి సామర్థ్యం మేరకు వినియోగించుకోలేకపోతున్న ప్రధాన వ్యాపారయేతర అసెట్స్‌ను ఉపయోగంలోకి తెచ్చి, ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్నది మానిటైజేషన్‌ స్కీము లక్ష్యం. ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఇది ఊతం అందించగలదని కేంద్రం ఆశిస్తోంది.

ఆర్థిక శాఖ పరిధిలో..
ఎన్‌ఎల్‌ఎంసీ ఆర్థిక శాఖ పరిధిలో ఏర్పాటవుతుంది. వ్యూహాత్మక డిజిన్వెస్ట్‌మెంట్, మూసివేతలో ప్రక్రియలో ఉన్న సంస్థల అసెట్స్‌ను ఎన్‌ఎల్‌ఎంసీకి బదలాయిస్తారు. కీలకయేతర మిగులు అసెట్స్‌ను గుర్తించి, వాటి నుంచి విలువను రాబట్టడంలో ప్రభుత్వ రంగ సంస్థలకు ఇది సలహాలు, మద్దతు అందిస్తుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
నేషనల్‌ ల్యాండ్‌ మానిటైజేషన్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎల్‌ఎంసీ) పేరుతో కొత్త కంపెనీ ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : మార్చి 9
ఎవరు    : కేంద్ర కేబినెట్‌ 
ఎందుకు : ప్రైవేటీకరిస్తున్న సంస్థలు లేదా మూసివేస్తున్న ప్రైవేట్‌ రంగ సంస్థలకు సంబంధించిన మిగులు స్థలాలు, భవంతులను మానిటైజ్‌ చేయడానికి..

Rebrand: రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్‌గా పేరు మార్చుకున్న సంస్థ?

సమగ్ర పర్యావరణ నిర్వహణ సర్వీసులు అందించే రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్‌ లిమిటెడ్‌ పేరు మారింది. ’రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్‌’గా దీన్ని రీబ్రాండ్‌ చేస్తున్నట్లు సంస్థ సీఈవో, ఎండీ గౌతమ్‌ రెడ్డి తెలిపారు. వచ్చే రెండు నెలల్లో దేశీయంగా తమ తొలి ఈ–వేస్ట్‌ రిఫైనింగ్‌ ప్లాంటును హైదరాబాద్‌లో ఆవిష్కరిస్తున్నట్లు ఆయన వివరించారు. ‘ప్రస్తుతం భారత్‌ .. రీసైక్లింగ్‌ కోసం ఈ–వ్యర్థాలను యూరప్‌నకు ఎగుమతి చేస్తోంది. మేము హైదరాబాద్‌లో ఈ–వేస్ట్‌ రిఫైనింగ్‌ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నాం. ఇది రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుంది.’ అని గౌతమ్‌ రెడ్డి పేర్కొన్నారు. భారత్, సింగపూర్, మధ్య ప్రాచ్య దేశాల్లో.. రామ్‌కీ ఎన్విరో కంపెనీ ఏటా 6–7 మిలియన్‌ టన్నుల మేర ఘన వ్యర్ధాలను ప్రాసెస్‌ చేస్తోంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్‌గా పేరు మార్చుకున్న సంస్థ?
ఎప్పుడు : మార్చి 9
ఎవరు    : రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్‌ లిమిటెడ్‌

Retirement: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత జట్టు మాజీ సభ్యుడు?

s sreesanth

అన్ని రకాల క్రికెట్‌ ఫార్మాట్‌ల నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు భారత జట్టు మాజీ సభ్యుడు, వివాదాస్పద క్రికెటర్‌ శాంతకుమారన్‌ నాయర్‌ శ్రీశాంత్‌ తాజగా ప్రకటించాడు. కేరళకు చెందిన 39 ఏళ్ల శ్రీశాంత్‌ భారత్‌ తరఫున 27 టెస్టులు (87 వికెట్లు), 53 వన్డేలు (75 వికెట్లు), 10 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు (7 వికెట్లు) ఆడాడు. ధోని నాయకత్వంలో భారత్‌ గెలిచిన 2007 టి20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్‌ జట్లలో శ్రీశాంత్‌ సభ్యుడిగా ఉన్నాడు. 2013 ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో నిందితుడైన శ్రీశాంత్‌పై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) జీవితకాల నిషేధం విధించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు జోక్యంతో శ్రీశాంత్‌పై ఉన్న జీవితకాల నిషేధాన్ని బీసీసీఐ తొలగించి దానిని ఏడేళ్లకు కుదించింది. దాంతో నిషేధం గడువు పూర్తయ్యాక శ్రీశాంత్‌ కేరళ రంజీ జట్టులో పునరాగమనం చేశాడు. 2022, ఫిబ్రవరి నెలలో మేఘాలయ జట్టుతో జరిగిన రంజీ మ్యాచ్‌లో చివరిసారి శ్రీశాంత్‌ బరిలోకి దిగాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అన్ని రకాల క్రికెట్‌ ఫార్మాట్‌ల నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించిన భారత జట్టు మాజీ సభ్యుడు?
ఎప్పుడు : మార్చి 9
ఎవరు    : శాంతకుమారన్‌ నాయర్‌ శ్రీశాంత్‌  

Russia-Ukraine War: యూనిసెఫ్‌ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

ukraine children

ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలయ్యాక ఇప్పటివరకు ఏకంగా 10 లక్షల మందికి పైగా చిన్నారులు తల్లులతో కలిసి సరిహద్దులు దాటినట్టుగా యూనిసెఫ్‌(UNICEF) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  ‘‘ఈ స్థాయిలో చిన్నారులు దేశం విడిచి పెట్టడం ఇదే మొదటిసారి. చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయం’’ అని యూనిసెఫ్‌ అధికార ప్రతినిధి జేమ్స్‌ ఎల్డర్‌ చెప్పారు. ఇప్పటివరకు 20 లక్షల మందికి పైగా దేశం విడిచిపెట్టి వెళితే వారిలో సగం మంది పిల్లలే ఉన్నారు. ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ బాలల సంక్షేమ నిధి (United Nations Children's Fund–యునిసెఫ్‌) ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్‌ నగరం ఉంది.

రష్యాలో వ్యాపారాలు నిలిపివేసిన సంస్థలు?
రష్యాలో తాత్కాలికంగా తమ వ్యాపారాలు నిలిపివేస్తున్నట్లు కోకో కోలా, పెప్సీకో, మెక్‌డొనాల్డ్స్, స్టార్‌బక్స్, జనరల్‌ ఎలక్ట్రిక్‌ తదితర అంతర్జాతీయ సంస్థలు ప్రకటించాయి. ఉక్రెయిన్‌ దురాక్రమణకు నిరసనగా ఈచర్యకు దిగామని చెప్పాయి. యూనిలీవర్, అమెజాన్‌ తదితర సంస్థలు సైతం రష్యాలో వ్యాపారాన్ని తగ్గించుకుంటున్నట్లు ప్రకటించాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
10 లక్షల మందికి పైగా చిన్నారులు తల్లులతో కలిసి ఉక్రెయిన్‌ సరిహద్దులు దాటారు
ఎప్పుడు : మార్చి 9
ఎవరు    : అంతర్జాతీయ బాలల సంక్షేమ నిధి(యూనిసెఫ్‌)
ఎందుకు : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా..

Star State: సుపరిపాలనలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?

andhra pradesh

సుపరిపాలనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. మార్చి 9న ‘స్కోచ్‌’ సంస్థ విడుదల చేసిన ‘‘స్కోచ్‌ స్టేట్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ రిపోర్ట్‌ కార్డ్‌ ఫర్‌ 2021’’ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న పరిపాలన సంస్కరణలు, అన్ని వర్గాల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు, సమగ్రాభివృద్ధికి తీసుకున్న చర్యలపై అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు. ‘స్కోచ్‌ స్టేట్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ రిపోర్ట్‌ కార్డ్‌ ఫర్‌ 2020’ నివేదికలోనూ ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచిన విషయం విదితమే.

తెలంగాణకు ఆరో స్థానం..
స్కోచ్‌ స్టేట్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ రిపోర్ట్‌ కార్డ్‌ ఫర్‌ 2021 నివేదికలో ఆంధ్రప్రదేశ్‌ తర్వాత.. రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్, మూడో స్థానంలో ఒడిశా, 4వ స్థానంలో గుజరాత్, 5వ స్థానంలో మహారాష్ట్ర నిలవగా తెలంగాణ ఆరో స్థానాన్ని దక్కించుకుంది. ఆ  తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్‌(7), మధ్యప్రదేశ్‌ (8), అస్సాం(9), హిమాచల్‌ప్రదేశ్‌ (10), బిహార్‌(11), హరియాణా (12) ఉన్నాయి.

స్టార్‌ రాష్ట్రాలు ఇవీ..
సర్వేలో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన వాటిని స్టార్‌ రాష్ట్రాలుగా గుర్తించారు.

రాష్ట్రం

స్థానం

ఆంధ్రప్రదేశ్‌

1

పశ్చిమ బెంగాల్‌

2

ఒడిశా

3

గుజరాత్‌ 

4

మహారాష్ట్ర

5

 

పర్‌ఫార్మర్‌ రాష్ట్రాలు ఇవే.. 
సర్వేలో 6 నుంచి 10 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలను సత్ఫలితాలు సాధిస్తున్న రాష్ట్రాలు(పర్‌ఫార్మర్స్‌)గా పేర్కొన్నారు. 

రాష్ట్రం

స్థానం

తెలంగాణ

6

ఉత్తరప్రదేశ్‌

7

మధ్యప్రదేశ్‌

8

అసోం

9

హిమాచల్‌ప్రదేశ్‌

10

 

క్యాచింగ్‌ అప్‌ రాష్ట్రాలు ఇవే..
సర్వేలో 11 నుంచి 15 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలను అవకాశాలను అందిపుచ్చుకుంటూ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు(క్యాచింగ్‌ అప్‌)గా గుర్తించారు.

రాష్ట్రం

స్థానం

బిహార్‌

11

హరియాణ

12

జమ్మూకశ్మీర్‌

13

ఛత్తీస్‌గఢ్‌

14

రాజస్థాన్‌

15

 

స్కోచ్‌ సర్వేల్లో ఏ రాష్ట్రం ఏ స్థానంలో ఉంది?
2021 సర్వేలో..

2021-Skoch-Report


2020 సర్వేలో..

2020-Skoch-Report

​​​​​​​క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
సుపరిపాలనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది
ఎప్పుడు : మార్చి 9
ఎవరు    : స్కోచ్‌ స్టేట్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ రిపోర్ట్‌ కార్డ్‌ ఫర్‌ 2021
ఎక్కడ    : దేశంలో..
ఎందుకు : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పరిపాలన అందిస్తుండటం, సంక్షేమాభివృద్ధి పథకాలను సమర్థంగా అమలు చేస్తుండటంతో.. 

TS Socio Economic Outlook: తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2021–22

Telangana Socio Economic Outlook 2022

ఏ సంక్షోభాన్నైనా ఎదుర్కొని నిలబడగలదని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మళ్లీ నిరూపించుకుంది. గత రెండేళ్లలో కోవిడ్‌–19 మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి వృద్ధి రేటులో తెలంగాణ మళ్లీ పూర్వపు దూకుడును అందుకుంది. స్థిర ధరల వద్ద 2021–22 ఆర్థిక సంవత్సరంలో జాతీయ వృద్ధి రేటు 8.9 శాతం కాగా, తెలంగాణ 11.2 శాతం సాధించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మార్చి 7న శాసనసభలో ప్రవేశపెట్టిన "తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే-2022" నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ నివేదిక ప్రకారం... ప్రస్తుత ధరల వద్ద 2021–22లో రాష్ట్రం 19.1 శాతం వృద్ధి రేటు సాధించగా, జాతీయ సగటు 19.4 శాతంగా నమోదైంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) విలువ రూ.11.6 లక్షల కోట్లు.

జీఎస్‌డీపీ అంటే..
ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశం/రాష్ట్రంలో ఉత్పత్తి అయిన తుది సరుకులు, సేవల మొత్తం విలువను స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)/ రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ) అంటారు. ఆర్థికాభివృద్ధికి సూచికలుగా జీడీపీ, జీఎస్‌డీపీలను పరిగణిస్తారు.

జాతీయ వృద్ధి రేటును అధిగమించి రాష్ట్రం సాధించిన ఆర్థికాభివృద్ధి

TS and National GDP-GSDP GraphGDP and GSDP Box

తలసరి ఆదాయం

వ్యక్తిగత స్థాయిలో ప్రజల ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాల మెరుగుదలకు సూచికైన తలసరి ఆదాయం వృద్ధిలో రాష్ట్రం దూకుడు కొనసాగిస్తోంది. 2021–22లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,78,833 కాగా, జాతీయ సగటు రూ.1,49,848 మాత్రమే. జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయం 1.9 రెట్లు అధికంగా ఉంది. 2020–21లో రాష్ట్రం రూ.2,37,632 తలసరి ఆదాయంతో 14 పెద్ద రాష్ట్రాల్లో రెండో స్థానంలో నిలిచింది.  

Per capita of TS

జిల్లాల వారీగా తలసరి ఆదాయం (రూ.లలో)

రంగారెడ్డి

6,58,757

హైదరాబాద్‌

3,51,332

మేడ్చల్‌–మల్కాజ్‌గిరి

2,40,008

మెదక్‌

2,29,833

మహబూబ్‌నగర్‌

2,23,348

యాదాద్రి

2,22,100

సిద్దిపేట

2,19,292

జయశంకర్‌ భూపాలపల్లి

2,13,735

సంగారెడ్డి

2,04,692

నల్లగొండ

2,01,144

కరీంనగర్‌

1,91,205

సూర్యాపేట

1,83,810

భద్రాద్రి

1,83,368

ఖమ్మం

1,83,318

నిర్మల్‌

1,79,169

వరంగల్‌ రూరల్‌

1,75,951

ఆదిలాబాద్‌

1,75,171

జనగామ

1,74,636

పెద్దపల్లి

1,73,981

ములుగు

1,67,769

నిజామాబాద్‌

1,66,766

నాగర్‌ కర్నూల్‌

1,63,462

రాజన్న సిరిసిల్ల

1,56,150

కామారెడ్డి

1,55,032

మంచిర్యాల

1,54,955

మహబూబాబాద్‌

1,52,577

వనపర్తి

1,51,458

జగిత్యాల

1,50,048

జోగుళాంబ గద్వాల

1,49,606

నారాయణపేట

1,43,428

వరంగల్‌ అర్బన్‌

1,38,387

కుమ్రం భీమ్‌

1,37,488

వికారాబాద్‌

1,32,479

సేవల రంగానిదే అత్యధిక వాటా​​​​​​​

రాష్ట్రాల జీఎస్డీపీకి మూడు ప్రధాన రంగాలైన వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవల రంగాలు ఊతమిస్తాయి. తెలంగాణ ఆవిర్భావం నుంచి రాష్ట్ర స్థూల విలువ జోడింపు (జీఎస్‌వీఏ)నకు సేవల రంగమే ప్రధాన చేయూత ఇస్తోంది. తర్వాతి స్థానంలో పరిశ్రమలు, వ్యవసాయ, అనుబంధ రంగాలున్నాయి. 2021–22లో జీఎస్‌వీఏలో 61.3 శాతం వాటా సేవల రంగానిదే కాగా, 20.4 శాతం వాటా పారిశ్రామిక, 18.3 శాతం వాటా వ్యవసాయ, అనుబంధ రంగాలది.

2014–15లో 16.3 శాతం ఉన్న వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా 2021–22లో 18.3 శాతానికి పెరిగింది. 2014–15లో మైనస్‌ 0.66 శాతం రుణాత్మక వృద్ధి రేటు కలిగిన రాష్ట్ర వ్యవసాయ, అనుబంధాల రంగాలు.. 2021–22లో 9.09 శాతం వృద్ధి రేటును సాధించడం దీనికి నిదర్శనమని నివేదికలో ప్రభుత్వం పేర్కొంది. గ్రామీణ తెలంగాణకు వెన్నుముకగా ఉన్న వ్యవసాయం 48 శాతం జనాభాకు ఉపాధి కల్పిస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతల, మిషన్‌ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ వంటి పథకాలు సాగు అభివృద్ధికి దోహదపడ్డాయి.

Sector wise Growth

పెరిగిన పురుగు మందుల వినియోగం

Pesticide

తెలంగాణ రాష్ట్రంలో ఎరువులు, పురుగుమందుల వినియోగం భారీగా పెరిగిందని తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2021–22 వెల్లడించింది. రాష్ట్రంలో ఎరువుల వినియోగం 2018లో 28లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి 2020లో 39లక్షల మెట్రిక్‌ టన్నులకు పెరిగిందని తెలిపింది. సాగులో ఉన్న భూమి విస్తీర్ణం, పంట రకం, పంట విధానం, పంట తీవ్రత, నేల రకం, దాని పరిస్థితి, వ్యవసాయ, వాతావరణ పరిస్థితులు, రైతుల సామర్థ్యం వంటి అనేక కారణాల వల్ల ఎరువులు, పురుగు మందుల వినియోగం నిర్ణయిస్తారు. నీటి పారుదల సౌకర్యం గణనీయంగా పెరగడంతో సాగు విస్తీర్ణం అధికమైంది. దీంతో ఎరువుల వినియోగం పెరిగిందని తెలిపింది.

రైతుబంధు..
2021–22 యాసంగిలో దాదాపు 63 లక్షల మంది రైతులు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పొందారు. వీరిలో 72.58 శాతం మంది సన్నకారు రైతులు. 18.30 శాతం మంది చిన్న రైతులు. మిగిలినవారు పెద్దరైతులు. రైతుబంధు కింద ఇప్పటివరకు ఎనిమిది సీజన్లలో కలిపి రూ.50,448 కోట్లు రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేసింది. 2021–22 యాసంగిలో మొత్తం 63 లక్షల మంది లబ్ధిదారులలో 53 శాతం మంది బీసీలున్నారు. 13 శాతం మంది ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందినవారున్నారు. రైతుబంధు మొత్తం సొమ్ములో 48 శాతం బీసీలకు, 30 శాతం ఇతరులకు, 13 శాతం ఎస్టీలకు, 9 శాతం ఎస్సీలకు పంపిణీ చేశారు.

రైతు బీమా..
2018 నుండి తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ఏ కారణం చేతనైనా రైతు ప్రాణాలు కోల్పోతే సంబంధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక ఉపశమనంగా రూ.5 లక్షల బీమా మొత్తం అందజేస్తుంది. ఈ ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. 2018–19 నుండి ప్రభుత్వం రూ.3,763.80 కోట్ల మేరకు క్లెయిమ్‌లను పరిష్కరించింది. ఆ మొత్తాన్ని 75,276 పేద కుటుంబాలకు బదిలీ చేసింది. 2020–21సంవత్సరంలో రైతు బీమా కింద 32.7లక్షల మంది రైతులు నమోదు చేసుకున్నారు.

49 శాతం సాగు భూమి..
తెలంగాణ రాష్ట్రం 276.96లక్షల ఎకరాలకు పైగా భౌగోళిక విస్తీర్ణంతో భారతదేశంలో 11వ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. మొత్తం విస్తీర్ణంలో 49.07 శాతం విస్తీర్ణం నికర సాగు ప్రాంతం. 24.07 శాతం అటవీ విస్తీర్ణంలో ఉంది. వ్యవసాయేతర ఉపయోగాలకు కింద భూమి దాదాపు 7.46 శాతం, బీడు భూములు 9.02 శాతం, బంజరు, సాగుకు యోగ్యత లేని భూమి 5.42 శాతం ఉంది. ఇతరత్రా సాధారణ భూములున్నాయి.​​​​​​​

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu >> 2022, మార్చి 09 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 11 Mar 2022 07:10PM

Photo Stories