Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జూన్‌ 9th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu June 9th 2022(డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Telugu Current Affairs daily
Telugu Current Affairs daily

World Directory of Modern Military Aircraft: ప్రపంచంలోని ఉత్తమ ఎయిర్‌ఫోర్స్‌లలో.. భారత వైమానిక దళం

world directory of modern military aircraft ranking

                         world directory of modern military aircraft ranking

ప్రపంచంలో ఎక్కడైనా, ఏ యుద్ధమైనా ఇప్పుడు వైమానిక దళాలే కీలకం. వేగంగా, సులువుగా చొచ్చుకుపోయి శత్రువును తుద ముట్టించడం ఎయిర్‌ఫోర్స్‌కే సాధ్యం. మరి ఈ విషయంలో భారత వైమానిక దళం మరో రికార్డు సృష్టించింది. ప్రపంచంలోని ఉత్తమ ఎయిర్‌ఫోర్స్‌లలో.. దేశాల వారీగా చూస్తే మూడో స్థానంలో, వైమానిక దళాల వారీగా చూస్తే ఆరో స్థానంలో నిలిచింది. మొత్తంగా చైనా కన్నా మన ఎయిర్‌ ‘ఫోర్స్‌’ పైన ఉండటం గమనార్హం. ‘వరల్డ్‌ డైరెక్టరీ ఆఫ్‌ మోడర్న్‌ మిలటరీ ఎయిర్‌ క్రాఫ్ట్‌ (డబ్ల్యూడీఎంఎంఏ)’ సంస్థ క్షుణ్నంగా అధ్యయనం చేసి ఈ ర్యాంకులను ఇచ్చింది. ఈ వివరాలు ఏమిటో చూద్దామా..    

అన్ని అంశాలనూ పరిశీలించి..

  • ప్రతిదేశానికి నేరుగా ఎయిర్‌ఫోర్స్‌తోపాటు పదాతిదళం (ఆర్మీ), నావికా (నేవీ) దళాలకు కూడా అనుబంధంగా ప్రత్యేకంగా వైమానిక దళ విభాగాలు ఉంటాయి. ‘డబ్ల్యూడీఎంఎంఏ’ ఇలాంటి వాటన్నింటినీ కూడా ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని అధ్యయనం చేసింది. కేవలం యుద్ధ, రవాణా విమానాలు, హెలికాప్టర్ల సంఖ్యను మాత్రమేగాకుండా.. విమానాలు, సాంకేతికతల ఆధునీకరణ, రవాణా సౌకర్యం, తక్షణ యుద్ధ సన్నద్ధత, వేగంగా దాడులు చేయడంతోపాటు స్వీయ రక్షణ చర్యలు, భవిష్యత్తులో రానున్న కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లు, సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ సదుపాయాలు, స్థానికంగా వైమానిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలన్నింటినీ పరిశీలించింది. వీటి ఆధారంగా 98 దేశాలకు చెందిన 124 వైమానిక/అనుబంధ దళాలకు.. ‘ట్రూవ్యాల్యూ రేటింగ్‌ (టీవీఆర్‌)’లను ఇచ్చింది.
  • క్వాంటిటీ (సంఖ్య)తోపాటు క్వాలిటీ రెండింటి లోనూ అమెరికా దళాలు ప్రపంచంలోనే టాప్‌లో నిలిచాయి. తొలి రెండు స్థానాల్లో యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌ (టీవీఆర్‌ 242.9), యూఎస్‌ నేవీ (142.4) నిలవగా.. రష్యన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (114.2) మూడో స్థానం సాధించింది. తిరిగి నాలుగు, ఐదో స్థానాల్లో యూఎస్‌ ఆర్మీ ఏవియేషన్‌ (112.6), యూఎస్‌ మెరైన్‌ కార్ప్స్‌ (85.3) నిలిచాయి. ఆరో స్థానంలో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (69.4) నిలిచింది.
  • ఇదే దేశాల వారీగా చూస్తే మన ఎయిర్‌ఫోర్స్‌ ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలవడం గమనార్హం. 
  • మన కన్నా ఎక్కువ సంఖ్యలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఉన్న చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఎయిర్‌ఫోర్స్‌ (63.8) ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే చైనా పీఎల్‌ఏ నేవీ ఎయిర్‌ఫోర్స్‌ (49.3) 15వ స్థానంలో నిలిచింది.
  • మన ఇండియన్‌ నేవీ ఏవియేషన్‌ (41.2 స్కోర్‌) 28వ స్థానంలో, ఆర్మీ ఏవియేషన్‌ (30 స్కోర్‌) 36వ స్థానంలో ఉండిపోయాయి.

రాశి కాదు.. వాసి ముఖ్యం

  • ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు.. శత్రువులపై పైచేయి చూపించుకోవడం కోసం యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, ఇతర సాంకేతికలను విచ్చలవిడిగా పోగేసి పెట్టుకుంటున్నాయి. కానీ ఏళ్లు గడుస్తున్నా వాటి ఆధునీకరణ, ఆధునిక సాంకేతికతలను సమకూర్చుకోవడం, సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వడం వంటివి చేపట్టడం లేదు. అందుకే ‘అసలు’ సామర్థ్యంలో వెనుకబడిపోయినట్టు డబ్ల్యూడీఎంఎంఏ స్పష్టం చేసింది.
  • యుద్ధ విమానాల సంఖ్య ఇండియాలో కంటే చైనాలో 30 శాతం ఎక్కువ. అయినా ర్యాంకింగ్స్‌లో చైనా ఎయిర్‌ఫోర్స్‌ ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ వెనుక నిలిచింది.
  • దక్షిణ కొరియా ఎయిర్‌ఫోర్స్‌కు 890 విమానాలున్నా.. బ్రిటిష్‌ (475 విమానాలు11వ ర్యాంకు), ఇజ్రాయెల్‌ (581 విమానాలు9వ ర్యాంకు), ఫ్రాన్స్‌ (658 విమానాలు 10వ ర్యాంకు), జపాన్‌ (779 విమానాలు8వ ర్యాంకు)లకన్నా వెనుకబడి 12వ స్థానంలో నిలిచింది.
  • ఇలాగే ఈజిప్ట్‌ ఎయిర్‌ఫోర్స్‌ (1,066 విమానాలు 22వ ర్యాంకు), ఉత్తర కొరియా ఎయిర్‌ఫోర్స్‌ (951 విమానాలు45వ ర్యాంకు) బాగా వెనుకబడి ఉన్నాయి. 

దేశం    

యుద్ధవిమానాలు/హెలికాప్టర్ల సంఖ్య

 అమెరికా

13,247

రష్యా

4,173

 చైనా

 3,285

 ఇండియా

 2,186

 దక్షిణ కొరియా

 1,595

 జపాన్

 1,449

 పాకిస్తాన్

 1,386

 ఈజిప్ట్

 1,062

 టర్కీ

 1,057

 ఫ్రాన్స్

 1,055

 Mountaineer Malavath Purna creates history again: ప్రపంచంలో 7 ఎత్తైన శిఖరాలను అధిరోహించిన మాలావత్‌ పూర్ణ

Mountaineer Malavath Purna creates history again
Mountaineer Malavath Purna creates history again
  • మాలావత్‌ పూర్ణ అరుదైన ఘనత సాధించి మరోసారి చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో 7 ఎత్తైన శిఖరాలను అధిరోహించి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసింది. ఈ నెల 5న ఉత్తర అమెరికాలోని దెనాలి పర్వత శిఖరం (6,190 మీటర్లు/20,310 అడుగులు) అధిరోహించడంతో ప్రపంచస్థాయి 7–సమ్మిట్‌ చాలెంజ్‌ను పూర్తి చేసింది. ఈ ఘనత సాధించిన ‘యంగెస్ట్‌ ఫిమేల్‌ ఇన్‌ ఇండియా’గా రికార్డు సృష్టించింది. పూర్ణ మే 18న ఇండియా నుంచి బయల్దేరి, మే 19న అలస్కాలోని ఎంకరేజ్‌ నగరానికి చేరుకుంది. ఈ పర్వతారోహణలో పూర్ణతోపాటు మనదేశం నుంచి మరో నలుగురు సభ్యులున్నారు.
  • మే 23న బేస్‌ క్యాంప్‌కు చేరుకున్నవారు శిఖర అధిరోహణ ప్రారంభించి, ఈనెల 5న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆమె కోచ్‌ శేఖర్‌ బాబు ధ్రువీకరించారు. శిఖరం నుంచి కిందికి వస్తూ పూర్ణ శాటిలైట్‌ ఫోన్‌ ద్వారా ఈ సమాచారాన్ని పంచుకుంది. ఈ యాత్రకు స్పాన్సర్‌ చేసిన ఏస్‌ ఇంజనీరింగ్‌ అకాడమీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ వైవీ గోపాలకృష్ణమూర్తి, తన గురువు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఐపీఎస్‌(వీఆర్‌ఎస్‌), సహకరించిన హైదరాబాద్‌ బీఎస్‌బీ ఫౌండేషన్‌ చైర్మన్‌ భూక్యా శోభన్‌బాబులకు పూర్ణ కృతజ్ఞతలు తెలిపింది.
  • పూర్ణ సాహస యాత్రకు హైదరాబాద్‌కు చెందిన ‘ట్రాన్సెండ్‌ అడ్వెంచర్స్‌’ సంస్థ తోడ్పాటునందించింది. ప్రపంచవ్యాప్తంగా ఆమె సాహస యాత్రలను నిర్వహించేందుకు అవసరమైన లైసెన్స్‌లు ఇప్పించి, 7–సమ్మిట్స్‌ చాలెంజ్‌ను పూర్తి చేయడంలోనూ కీలకపాత్ర పోషించింది. దెనాలి పర్వతారోహణలో పూర్ణతోపాటు అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌లో పద్మశ్రీ అవార్డు గ్రహీత అజీత్‌ బజాజ్, ఆయన కుమార్తె దియా బజాజ్, విశాఖపట్నానికి చెందిన అన్మిష్‌ వర్మ కూడా ఉన్నారు. 

దక్షిణభారత దేశం నుంచి తొలి యువతి..

 ప్రస్తుతం పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చదువుతున్న పూర్ణ 2014లో ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన ‘ప్రపంచంలోని అతి పిన్న వయస్కురాలు’గా చరిత్ర సృష్టించింది. ఆమె ఇప్పటివరకు ఎవరెస్ట్, ఆఫ్రికాలోని కిలిమంజారో, యూరప్‌లోని ఎల్‌బ్రస్, దక్షిణ అమెరికాలోని అకోన్‌కాగస్, ఓసెనియాలోని కార్టెన్జ్‌ పిరమిడ్, అంటార్కిటికాలోని విన్సన్, తాజాగా ఉత్తర అమెరికాలోని దెనాలి శిఖరాలను అధిరోహించింది. దక్షిణ భారతదేశం నుంచి ఈ 7–సమ్మిట్‌ ఘనతను సాధించిన మొదటి యువతి పూర్ణ కావడం విశేషం. 
Download Current Affairs PDFs: Click Here

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu >> 2022, జూన్‌ 07 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్(Telugu Current Affairs), స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

The Cabinet Committee on Economic Affairs has approved increase: అన్నదాతకు కేంద్ర కేబినెట్‌ శుభవార్త

The Cabinet Committee on Economic Affairs has approved increase

తొలకరి పలకరిస్తున్న వేళ అన్నదాతకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఖరీఫ్‌ సీజన్‌ ఆంరభమవుతున్న తరుణంలో 2022–23 సీజన్‌కు వరి సహా 14 రకాల పంటల మద్దతు ధరలను పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జూన్‌  8(బుధవారం) జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వరి సాధారణ, గ్రేడ్‌–ఏ రకాలపై మద్దతు ధరను రూ.100 పెంచారు. సాధారణ రకం క్వింటాల్‌ రూ.1,940 ఉండగా తాజా నిర్ణయంతో రూ. 2,040కు పెరగనుంది. గ్రేడ్‌–ఏ రకం రూ.1,960 నుంచి రూ.2,060కు పెరగనుంది. రైతులకు మరింత ఆర్థ్ధిక ప్రోత్సాహమిచ్చేందుకు వరి విస్తీర్ణాన్ని పెంచేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 

పప్పుధాన్యాలు..నూనె గింజల సాగుకు ప్రోత్సాహమిచ్చేలా... 

కొన్నేళ్లుగా నూనెగింజలు, పప్పుధాన్యాల ధరలు దేశీయంగా అనూహ్యంగా పెరగడం, దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు తీసుకుంది. వంట నూనెల దిగుమతిని తగ్గించేందుకు, దేశీయంగా నూనె గింజల దిగుబడిని పెంచేలా రైతులను ప్రోత్సహించేందుకు వాటి మద్దతు ధరలను గణనీయంగా పెంచింది. నువ్వుల మద్దతు ధర గరిష్టంగా రూ.523, సోయాబీన్‌ రూ.350, సన్‌ఫ్లవర్‌ రూ.300, వేరుశనగ రూ.300 పెరిగాయి. పెసర ధర రూ.480, కంది, మినప రూ.300 పెరిగాయి. జాతీయ సగటు ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్లుండేలా మద్దతు ధరను నిర్ణయించినట్టు కేంద్రం ప్రకటించింది. తాజా పెంపుతో ఎనిమిది పంటలకు మద్దతు ధర ఉత్పత్తి వ్యయం కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉంటుందని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. పప్పుధాన్యాలు, నూనెగింజల సాగును మరింతగా ప్రోత్సహించడం, డిమాండ్‌–సరఫరా అసమతుల్యతను సరిచేయడానికి మద్దతు ధరలను పెంచామన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, వ్యవసాయ రంగ సమగ్రాభివృధ్ధికి మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. 

కేబినెట్‌ ఇతర నిర్ణయాలు 

భారత్‌–యూఏఈ మధ్య పరిశ్రమలు, అధునాతన పరిజ్ఞానాల్లో సహకారానికి అవగాహన ఒప్పంద ప్రతిపాదనను కేబినెట్‌ ఆమోదించింది. 10 సమాచార ఉపగ్రహాలను అంతరిక్ష శాఖ అధీనంలోని ఎన్‌ఎస్‌ఐఎల్‌కు బదిలీ చేసే ప్రతిపాదనను కూడా ఆమోదించింది. వాతావరణ మార్పులపై సంయుక్త పరిశోధన కోసం ఏరిస్, జపాన్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎన్విరాన్మెంటల్‌ స్టడీస్‌ ఒప్పందానికీ ఆమోదముద్ర వేసింది.

Download Current Affairs PDFs: Click Here

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu >> 2022, జూన్‌ 07 కరెంట్‌ అఫైర్స్‌

Published date : 10 Jun 2022 05:18PM

Photo Stories