Daily Current Affairs in Telugu: 2022, జూన్ 25th కరెంట్ అఫైర్స్
DRDO: వీఎల్–ఎస్‌ఆర్‌ఎస్‌ఏఎం ప్రయోగ పరీక్షను ఎక్కడ నిర్వహించారు?
Telugu Current Affairs - Science & Techonology: ఒడిశా తీరం చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) నుంచి జూన్ 24న చేపట్టిన వెర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ క్షిపణి (వీఎల్–ఎస్‌ఆర్‌ఎస్‌ఏఎం) ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. నేవీ షిప్ నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి నిర్దేశించిన పరిమితుల ప్రకారం ఛేదించిందని అధికారులు తెలిపారు. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో), ఇండియన్ నేవీ సంయుక్తంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించాయి.
వీఎల్–ఎస్‌ఆర్‌ఎస్‌ఏఎం.. ఆయుధ వ్యవస్థ అత్యంత సమీపంలోని వివిధ రకాల లక్ష్యాలను అడ్డుకుంటుంది. రాడార్ తదితరాలకు దొరక్కుండా తప్పించుకునే వాటిని కూడా ఎదుర్కొంటుంది. తాజా ప్రయోగం విజయవంతం అవడంతో భారత నావికాదళం.. గగనతలం నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనే సామర్థ్యం మరింత పెరుగుతుందని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వెర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ క్షిపణి (వీఎల్–ఎస్‌ఆర్‌ఎస్‌ఏఎం) ప్రయోగ పరీక్ష విజయవంతం
ఎప్పుడు : జూన్ 24
ఎవరు : భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో), ఇండియన్ నేవీ
ఎక్కడ : చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్), బాలసోర్ జిల్లా, ఒడిశా
ఎందుకు : భారత నావికాదళం.. గగనతలం నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనే సామర్థ్యం మరింత పెరుగుతుందని..
NITI Aayog: నీతి ఆయోగ్ నూతన సీఈవోగా ఎవరు నియమితులయ్యారు?
Telugu Current Affairs - Persons: నీతి ఆయోగ్ సీఈవోగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పరమేశ్వరన్ అయ్యర్ నియమితులయ్యారు. ఆయన నియమాకాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం జూన్ 24న అధికారికంగా ప్రకటించింది. పరమేశ్వరన్ అయ్యర్ రెండేళ్ల పాటు నీతి ఆయోగం సీఈవోగా కొనసాగనున్నారు. 2022, జూన్ 30న పదవీ విరమణ చేయనున్న అమితాబ్ కాంత్ స్థానంలో అయ్యర్ బాధ్యతలు చేపట్టనున్నారు. నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
1981 ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన పరమేశ్వరన్ అయ్యర్ పారిశుద్ధ్య నిపుణుడిగా గుర్తింపు పొందారు. 2009లో ఐఏఎస్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన.. ఐక్యరాజ్యసమితిలో సీనియర్ గ్రామీణ నీటి పారుదల, పారిశుద్ధ్య నిపుణుడిగా పని చేశారు. ఆ తర్వాత 2016లో భారత్‌కు తిరిగి వచ్చారు. వెంటనే డ్రింకింగ్ అండ్ శానిటేషన్ విభాగానికి అధిపతిగా కేంద్రం నియమించింది. అంతకు ముందు 2014లో కేంద్రం ప్రవేశ పెట్టిన స్వచ్ఛ భారత్ మిషన్‌కు నాయకత్వం వహించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నీతి ఆయోగ్ నూతన సీఈవోగా ఎవరు నియమితులయ్యారు?
ఎప్పుడు : జూన్ 24
ఎవరు : రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పరమేశ్వరన్ అయ్యర్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : నీతి ఆమోగ్ ప్రస్తుత సీఈవో జూన్ 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో..
Bharat NCAP: భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్‌కు ఆమోదం
Telugu Current Affairs - National: క్రాష్ టెస్టుల్లో కార్లు చూపించే భద్రతా సామర్థ్యాలకు అనుగుణంగా వాటికి స్టార్ రేటింగ్‌ను ఇచ్చే ‘భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్’(భారత్–ఎన్‌సీఏపీ)కు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. ఇందుకు సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్‌పై సంతకం చేసినట్టు ప్రకటించారు. స్టార్ రేటింగ్‌ల ఆధారంగా వినియోగదారులు సురక్షితమైన కార్లను ఎంపిక చేసుకునే వీలుంటుందని మంత్రి చెప్పారు. సురక్షిత వాహనాలను తయారు చేసే దిశగా ఓఈఎం తయారీదారుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ఈ విధానం ప్రోత్సహిస్తుందన్నారు. ఇప్పటివరకు మన దేశంలో తయారవుతున్న కార్లు గ్లోబల్ ఎన్‌సీఏపీ రేటింగ్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. మన దేశ రహదారులు, ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా ప్రామాణిక క్రాష్ టెస్టింగ్ విధానం మనకు లేదు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్(భారత్–ఎన్‌సీఏపీ)కు ఆమోదం
ఎప్పుడు : జూన్ 24
ఎవరు : కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ
ఎందుకు : భద్రతా విషయంలో కార్లకు రేటింగ్ ఇవ్వడం ద్వారా.. వినియోగదారులు సురక్షితమైన కార్లను ఎంపిక చేసుకునే వీలుంటుందని..
Presidential Election: ఎన్డీయే తరపున నామినేషన్ వేసిన ద్రౌపది ముర్ము
ఎన్డీయే కూటమి తరపున ఒడిశాకు చెందిన బీజేపీ నేత, గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ వేశారు. జూన్ 24న ప్రధాని మోదీ, కేబినెట్ మంత్రులు సహా మద్దతు పార్టీల ప్రతినిధుల సమక్షంలో రాజ్యసభ సెక్రటరీ జనరల్, రిటర్నింగ్ అధికారి పీసీ మోదీకి నామినేషన్ పత్రాలను అందజేశారు. ద్రౌపది ముర్ము నామినేషన్‌ను ప్రధాని మోదీ ప్రతిపాదించారు. ఇక ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు.
ద్రౌపది ముర్ము ప్రస్థానం
సొంతూరు : ఒడిశాలోని మయూర్‌భంజ్
పుట్టిన తేదీ : 1958 జూన్ 20 (64 ఏళ్లు)
తండ్రి : బిరంచి నారాయణ్ తుడు (చనిపోయారు)
భర్త : శ్యామ్ చరణ్ ముర్ము (మరణించారు)
విద్య : భువనేశ్వర్‌లోని రమాదేవి వుమెన్స్ యూనివర్సిటీ నుంచి బీఏ
సంతానం : ఇద్దరు కుమారులు (మరణించారు)
కూతురు : ఇతిశ్రీ ముర్ము
పార్టీ : బీజేపీ
పదవులు :
- ఒడిశా ఎమ్మెల్యే(2000–09), జార్ఖండ్ గవర్నర్ (2015–21), 2000లో ఏర్పాటైన జార్ఖండ్‌కు ఐదేళ్ల పూర్తికాలం పనిచేసిన మొదటి గవర్నర్
- శ్రీ అరబిందో ఇంటెగ్రల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో ఆనరరీ అసిస్టెంట్ టీచర్.
- అనంతరం ఒడిశా నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్ పనిచేశారు.
- 1997లో బీజేపీలో చేరడం ద్వారా రాజకీయ రంగ ప్రవేశం.
- 1997లో రాయ్‌రంగాపూర్ కౌన్సిలర్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నిక
- 2000లో రాయ్‌రంగాపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక
- 2002 వరకు కేబినెట్‌లో రవాణా, వాణిజ్య శాఖ మంత్రిగా
- 2002 నుంచి 2004 వరకు మత్య్స, పశుసంవర్థక శాఖ బాధ్యతలు
- 2002–09 మధ్యకాలంలో మయూర్‌భంజ్ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్
- 2004–09 మధ్య రాయ్‌రంగాపూర్ ఎమ్మెల్యేగా చేశారు
- 2006–09లో ఒడిశా బీజేపీ షెడ్యూల్ తెగల మోర్చా అధ్యక్షురాలిగా
- 2010–15 కాలంలో మయూర్‌భంజ్ బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ పదవి
- 2007 సంవత్సరానికి గాను ఉత్తమ ఎమ్మెల్యేగా ఎంపికైన ఆమెకు ఒడిశా అసెంబ్లీ నీలకంఠ అవార్డు బహూకరించింది.
Sahitya Akademi Prize: కేంద్రసాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన రచయిత్రి?
Telugu Current Affairs - Awards: రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి కాకర్ల సజయకు 2021 సంవత్సరానికి సంబంధించి అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం(Sahitya Akademi Prize for Translation) లభించింది. ప్రముఖ రచయిత్రి భాషాసింగ్ రచించిన అదృశ్య భారత్(నాన్ ఫిక్షన్) హిందీ పుస్తకాన్ని సజయ ‘అశుద్ధ భారత్’ పేరిట తెలుగులోకి అనువదించారు. దేశంలోని పారిశుధ్య కార్మికుల వాస్తవ జీవన చిత్రాన్ని అశుద్ధ భారత్ పుస్తకం ఆవిష్కరించింది. అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కాంబర్ నేతృత్వంలోని కార్యనిర్వాహక బోర్డు జూన్ 24న సమావేశమై 22 పుస్తకాలను సాహిత్య అకాడమీ అనువాద అవార్డులకు ఎంపిక చేసింది. జనవరి 1, 2015 నుంచి డిసెంబరు 2019 మధ్య ప్రచురితమైన పుస్తకాల నుంచి అవార్డు గ్రహీతలను ఎంపిక చేశారు. త్వరలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డు గ్రహీతలకు రూ.50 వేల నగదు, తామ్రపత్రం అందజేయనున్నారు.
నలుగురికి భాషా సమ్మాన్ అవార్డు: అకాడమీ కార్యనిర్వాహక బోర్డు 2019కిగానూ నాలుగు రీజియన్ల భాషా సమ్మాన్ అవార్డులను ప్రకటించింది. సంప్రదాయ, మధ్యయుగ సాహిత్యంపై చేసిన కృషికిగానూ ప్రొఫెసర్ దయానంద్(ఉత్తరం) ఎ.దక్షిణామూర్తి (దక్షిణం), సత్యేంద్ర నారాయణ్ గోస్వామి(తూర్పు), మహమ్మద్ అజం (పశ్చిమ)లను ఎంపిక చేసినట్లు పేర్కొంది. త్వరలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డు గ్రహీతలకు రూ.లక్ష నగదు, తామ్రపత్రం అందజేయనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021 సంవత్సరానికిగానూ కేంద్రసాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన రచయిత్రి?
ఎప్పుడు : జూన్ 24
ఎవరు : రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి కాకర్ల సజయ
ఎందుకు : ప్రముఖ రచయిత్రి భాషాసింగ్ రచించిన అదృశ్య భారత్(నాన్ ఫిక్షన్) హిందీ పుస్తకాన్ని సజయ ‘అశుద్ధ భారత్’ పేరిట తెలుగులోకి..
World Competitiveness Index 2022: పోటీతత్వ సూచీలో భారత్‌కు ఎన్నో ర్యాంకు లభించింది?
పోటీతత్వ సూచీలో ఆరు స్థానాలు మెరుగుపర్చుకున్న భారత్.. ప్రపంచ పోటీతత్వ సూచీలో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ఇన్‌స్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్(ఐఎండీ) అధ్యయనంలో భారత్ ఆరు స్థానాలు ఎగబాకి.. 43వ ర్యాంకు నుంచి 37వ ర్యాంకుకు చేరింది. దీంతో ఆసియా ఆర్థిక వ్యవస్థల్లో మన దేశం వేగవంతమైన పెరుగుదలను కనబరిచింది. ఈ పోటీతత్వ సూచీలో 63 దేశాల జాబితాలో డెన్మార్క్ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. అంతకుముందు ఏడాది అది మూడో స్థానంలో ఉంది. స్విట్జర్లాండ్ మొదటి స్థానాన్ని కోల్పోయి.. రెండో స్థానానికి పరిమితమైంది. సింగపూర్ ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకుంది. ఆసియాలో ఆర్థిక వ్యవస్థల్లో సింగపూర్(3), హాంకాంగ్(5), తైవాన్ (7), చైనా(17) మెరుగైన స్థానాలు పొందాయి.
Foreign Direct Investment: ఎఫ్‌డీఐల సాధనలో భారత్‌కు ఎన్నో ర్యాంకు లభించింది?
గతేడాది నుంచి భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఎఫ్‌డీఐలను సాధిస్తున్న దేశాలలో భారత్ గతం కంటే ఒక మెట్టు పైకెదిగి 7వ స్థానంలో నిలిచిందని ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి సదస్సు(యూఎన్ సీటీఏడీ) వెల్లడించింది. యూఎన్ సీటీఏడీ తాజా ప్రపంచ పెట్టుబడుల గణాంకాల ప్రకారం–2021లో భారత్‌కు వచ్చిన ఎఫ్‌డీఐలు రూ.4.97లక్షల కోట్ల నుంచి రూ.3.50 లక్షల కోట్లకు తగ్గాయి. ఎఫ్‌డీఐలు పొందడంలో అమెరికా రూ.28.55లక్షల కోట్లతో అగ్రస్థానంలో ఉండగా.. చైనా రూ. 14 లక్షల కోట్లతో రెండో స్థానంలో.. హాంకాంగ్ రూ.10.97 లక్షల కోట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. ఎఫ్‌డీఐలకు సంబంధించి టాప్–10 జాబితాలో భారత్ మాత్రమే క్షీణతను నమోదు చేయడం గమనార్హం. గతేడాది భారత్ నుంచి వెనక్కి వెళ్లిన ఎఫ్‌డీఐలు 43 శాతం పెరిగి.. రూ.1.20 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
Warning: ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక ఉండే విధానాన్ని ప్రవేశపెట్టనున్న తొలిదేశం?
సిగరెట్ ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక.. పొగతాగే వారికి చేరేలా కెనడా ఒక సరికొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక ఉండే విధానాన్ని త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు కెనడా మానసిక ఆరోగ్య మంత్రి కరోలిన్ బెన్నెట్ తెలిపారు. అంతేకాదు ఇలాంటి కొత్త విధానాన్ని తీసుకువచ్చిన తొలిదేశం కెనడానే అని చెప్పారు. దీనివల్ల ప్రజల్లో చైతన్యం పెరగడమే కాకుండా.. ప్రతి ఒక్కరికి ఈ సందేశం చేరువవుతుందన్నారు.
Crude Oil: భారత్‌కు అత్యధికంగా ముడిచమురు సరఫరా చేస్తున్న రెండో దేశం?
భారత్‌కు ముడిచమురు అత్యధికంగా సరఫరా చేస్తున్న దేశాల జాబితాలో సౌదీ అరేబియాను దాటి రష్యా రెండో స్థానానికి చేరింది. మేలో భారతీయ రిఫైనరీలు రష్యా నుంచి 25 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌ను కొనుగోలు చేసినట్లు గణాంకాల్లో వెల్లడైంది. మొత్తం చమురు దిగుమతుల్లో ఇది 16 శాతానికిపైగా ఉంటుంది. సముద్రమార్గంలో భారత్ చేసుకునే మొత్తం దిగుమతుల్లో రష్యా నుంచి వచ్చే ఉత్పత్తుల వాటా ఏప్రిల్‌లో తొలిసారిగా 5 శాతానికి చేరింది. భారత్‌కు అత్యధికంగా ముడి చమురు సరఫరా చేస్తున్న జాబితాలో మొదటి స్థానంలో ఇరాక్ ఉంది.
United Nations: ఐరాస బహుభాషల వినియోగంలో ఏ భాషకు చోటు కల్పించారు?
ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ బహుభాషల వినియోగంపై ఆమోదించిన తీర్మానంలో మొదటిసారిగా హిందీని కూడా చేర్చింది. 193 దేశాలతో కూడిన సర్వప్రతినిధి సభలో.. ఈ ప్రతిపాదనకు భారత్ సహా 80కి పైగా దేశాలు మద్దతిచ్చాయి. ఆరు అధికార భాషలైన ఇంగ్లిష్, ఫ్రెంచి, చైనీస్, స్పానిష్, అరబిక్, రష్యన్ తోపాటు అనధికారిక భాషలైన హిందీ, స్వాహిలీ, పర్షియన్, బంగ్లా, ఉర్దూలను కూడా ఐరాస ఉత్తరప్రత్యుత్తరాల్లో ఉపయోగించాలని తీర్మానం పేర్కొంది. ఐరాస తన కార్యకలాపాల్లో సమగ్రత సాధించేందుకు బహుళ భాషలను సమంగా స్వీకరించాలని భారత్ పేర్కొంది.
Marijuana Cultivation: గంజాయి సాగును చట్టబద్ధం చేసిన తొలిదేశం?
ప్రపంచంలోనే తొలిసారిగా థాయిలాండ్ దేశం.. గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిని ఔషధాల తయారీకి మాత్రమే వాడతారు. నొప్పి, అలసట నుంచి ఉపశమనం పొందేందుకు గంజాయిని ఉపయోగించే సంప్రదాయాన్ని కలిగి ఉన్న థాయ్‌లాండ్.. ఔషధ గంజాయిని చట్టబద్ధం చేసింది.
Gautama Buddha: బుద్ధుని అవశేషాలను ఏ దేశంలో ప్రదర్శనకు ఉంచారు?
బుద్ధ భగవానుడి నాలుగు పవిత్ర కపిలవస్తు అవశేషాలను 11 రోజులపాటు మంగోలియాలో ఓ మఠంలో ప్రదర్శన కోసం ఉంచారు. వీటిని భారత్ నుంచి కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలోని బృందం తీసుకువెళ్లింది. భారత్‌లోని హిమాలయ పర్వతాల నుంచి మంగోలియా వరకు అనేక శతాబ్దాల క్రితమే బౌద్ధ మతం విలసిల్లిందని రిజిజు ఈ సందర్భంగా చెప్పారు.
Bharat Gaurav: భారత్ గౌరవ్ పథకం కింద ప్రవేశపెట్టిన తొలి ప్రైవేటు రైలు?
కోయంబత్తూరు నార్త్ నుంచి సాయినగర్ షిర్డీకి తొలి ప్రైవేటు రైలు బయలుదేరింది. కేంద్రం ‘భారత్ గౌరవ్’ పథకం కింద ప్రవేశపెట్టిన తొలి ప్రైవేటు రైలు ఇదే కావడం విశేషం.
Google: మహిళలకు గూగుల్ ‘అంకుర’ పథకం
మహిళా వ్యవస్థాపకుల కోసం టెక్ దిగ్గజం గూగుల్ ప్రత్యేకంగా ఒక అంకుర పథకాన్ని ప్రకటించింది. నిధుల సమీకరణ, నియామకాల్లో సవాళ్లను పరిష్కరించేందుకు ఈ యాక్సెలరేటర్ ప్రోగ్రామ్ మహిళలకు సహకరిస్తుంది. ‘గూగుల్ ఫర్ స్టార్టప్స్ యాక్సెలరేటర్–ఇండియా ఉమెన్ ఫౌండర్స్’ ప్రారంభ బ్యాచ్ కింద మహిళలు స్థాపించిన/సహ స్థాపకులుగా ఉన్న 20 అంకురాలను ఈ కార్యక్రమానికి స్వీకరిస్తుంది. అమెరికా, చైనాల తర్వాత భారత్‌లోనే అతిపెద్ద అంకుర వ్యవస్థ ఉంది. భారత్‌లో 100కు పైగా యూనికార్న్(100 కోట్ల డాలర్ల విలువైన) సంస్థలున్నాయి. ఇందులో 2022లోనే 22 జత అయ్యాయి. 15 శాతం భారత యూనికార్న్‌లు మాత్రమే ఒకటి లేదా అంత కంటే ఎక్కువమంది మహిళా వ్యవస్థాపకులను కలిగి ఉన్నాయని గూగుల్ పేర్కొంది. తాజాగా ప్రకటించిన పథకం ద్వారా నెట్‌వర్క్‌లు, మూలధనం, నియామకాలు, మెంటార్‌షిప్, వర్క్‌షాపులు, క్లౌడ్, ఆండ్రాయిడ్, వెబ్, ప్రొడక్ట్ వ్యూహాలు తదితరాల అంశాల్లో గూగుల్ మద్దతునిస్తుంది.
Diabetes Patients: మధుమేహ బాధితులకు 3డీ ప్రింటెడ్ చెప్పులు
మధుమేహ(డయాబెటిస్) బాధితుల కోసం బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ).. డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ పరిశోధకులు వినూత్నమైన పాదరక్షలు తయారు చేశారు. ఇందుకు కర్ణాటక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అండ్ రిసెర్చ్(కేఐఈఆర్) సహకారం అందించింది. డయాబెటిస్ బాధితుల్లో కాళ్లకు పుండ్లు పడితే త్వరగా మానవు. దాంతో ఇన్‌ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది.
PCI: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్‌పర్సన్‌గా ఎంపికైన మహిళ?
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) ఛైర్‌పర్సన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్(72) ఎంపికయ్యారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పీసీఐ సభ్యుడు ప్రకాశ్ దూబేలతో కూడిన కమిటీ ఈమేరకు ఆమె నియామకానికి ఆమోదం తెలిపింది. జస్టిస్ రంజనా దేశాయ్ జమ్మూ–కశ్మీర్ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజన కమిషన్ కు ఇటీవల నేతృత్వం వహించారు. పీసీఐ ఛైర్‌పర్సన్‌గా ఉన్న జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ గత ఏడాది నవంబరులో పదవీ విరమణ పొందారు.
Dinosaur Eggs: అరుదైన డైనోసార్ల గుడ్లు ఏ దేశంలో బయటపడ్డాయి?
డైనోసార్లు(రాక్షస బల్లులు).. మిలియన్ల సంవత్సరాల కిందటే అంతరించినా.. భూమ్మీద వీటి అవశేషాలు శిలాజాల రూపంలో బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా భారత్‌లో రాక్షస బల్లుల అరుదైన గుడ్లను వెలికితీశారు పరిశోధకులు. ఒక గుడ్డులోనే మరొక గుడ్డు ఏర్పడి ఉండటంతో పరిశోధకులు ఆశ్చర్యపోయారు.శాస్త్ర పరిభాషలో ఈ స్థితిని ‘ఓవమ్ ఇన్ ఓవో’ అంటారు. సాధారణంగా గుడ్డులోనే గుడ్డు ఉండటం అనే స్థితి పక్షుల్లో అధికంగా కనిపిస్తుందని..కాబట్టి టిటానోసారస్ డైనోసార్లకు, పక్షులకు మధ్య దగ్గరి సంబంధం ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ధార్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో ఇప్పటికే 52 టిటానోసారస్ సారోపోడ్స్ డైనోసార్ గూడులను(పక్షుల మాదిరి) వెలికితీశారు. లక్షల సంవత్సరాల క్రితం భూమిపై సంచరించి,ప్రతికూల వాతావరణం కారణంగా డై నోసార్లు అంతరించి పోయాయని భావిస్తున్నారు.
Football: ఫిఫా ఈ–నేషన్స్ కప్ 2022 టోర్నీకి అర్హత సాధించిన దక్షిణాసియా దేశం?
ఫిఫా ఈ–నేషన్స్ కప్ 2022 టోర్నీకి భారత్ అర్హత సాధించింది. ఈ పోటీల్లో భారత్ తొలిసారి పాల్గొనబోతుంది. వచ్చే నెల(జులై) 27 నుంచి 30 వరకు ఈ ఈ–ఫుట్‌బాల్ జట్ల మధ్య పోరు డెన్మార్క్‌లోని కోపెన్ హేగెన్ లో జరుగుతుంది. ఫిఫా ఈ–నేషన్స్ సిరీస్ ప్లేఆఫ్స్‌లో కొరియా, మలేసియాలను ఓడించిన భారత్.. టోర్నీలో పోటీపడే అవకాశం దక్కించుకుంది.
Javelin throw: జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా కొత్త రికార్డు
టోక్యో ఒలింపిక్స్ తర్వాత తొలిసారి బరిలోకి దిగిన జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా సత్తా చాటాడు. కొత్త జాతీయ రికార్డును నెలకొల్పుతూ.. ఫిన్లాండ్‌లో జరుగుతున్న పావో నుర్మి గేమ్స్‌లో రజతం గెలుచుకున్నాడు. 89.30 మీటర్లు త్రో చేసిన నీరజ్ తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు (87.58)ను బద్దలు కొట్టాడు. 87.58 మీటర్లు విసిరి టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాడు.
Daily Current Affairs in Telugu: 2022, జూన్ 23rd కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్(Telugu Current Affairs), స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్