Daily Current Affairs in Telugu: 2022, జూన్ 15th కరెంట్ అఫైర్స్
Defence Minister Rajnath Singh introduces the 'Agnipath' scheme: రక్షణ నియామకాల్లో అగ్నిపథ్
రక్షణ నియామకాల్లో అగ్నిపథ్
- త్రివిధ దళాల్లో సంస్కరణల్లో భాగంగా అగ్నిపథ్ పేరుతో స్వల్పకాలిక నియామక కాంట్రాక్టు పథకాన్ని కేంద్రం తెరపైకి తెచ్చింది. వేతనాలు, పెన్షన్ల భారాన్ని తగ్గించుకోవడం, సైన్యంలో మరింతగా యువ రక్తాన్ని నింపడం లక్ష్యంగా తెచ్చిన ఈ పథకానికి మంగళవారం ప్రధాని నేతృత్వంలో జరిగిన రక్షణపై కేబినెట్ కమిటీ భేటీ ఆమోదముద్ర వేసింది.
- అనంతరం వివరాలను త్రివిధ దళాధిపతులతో కలిసి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మీడియాకు వెల్లడించారు. దేశభక్తి, స్ఫూర్తి కలిగిన యువతకు జాతిసేవకు వీలు కల్పించే అద్భుత పథకంగా దీన్ని అభివర్ణించారు. తద్వారా దేశ రక్షణ కూడా మరింత బలోపేతమవుతుందన్నారు. ‘‘నాలుగేళ్ల సర్వీసు అనంతరం అత్యంత క్రమశిక్షణ, అంకితభావం, నైపుణ్యాలున్న యువత సమాజంలోకి తిరిగొస్తుంది.
- దేశానికి వెల కట్టలేని ఆస్తిగా మారుతుంది. ఇలా రెండు రకాలుగా ప్రయోజనం’’ అని వివరించారు. సైన్యంలో ప్రస్తుతం పదేళ్ల షార్ట్ సర్వీస్ కమిషన్ నియామకాలు అమల్లో ఉన్నాయి. టూర్ ఆఫ్ డ్యూటీ (టీఓడీ)గా కూడా పిలిచే అగ్నిపథ్‌కు వచ్చే ఆదరణను బట్టి వీటితో పాటు ప్రస్తుత నియామక పద్ధతులన్నింటినీ నిలిపేస్తారని సమాచారం.
-
కొత్త శకానికి నాంది: త్రివిధ దళాధిపతులు
త్రివిధ దళాల్లో మానవ వనరుల విధానంలో కొత్త శకానికి అగ్నిపథ్ నాంది పలుకుతుందని రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పథకం తక్షణం అమల్లోకి వస్తుందని చెప్పింది. దీనిపై త్రివిధ దళాధిపతులు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. సైనిక నియామక ప్రక్రియలో సమూల మార్పులకు అగ్నిపథ్ శ్రీకారం చుట్టనుందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే అన్నారు. ‘‘భవిష్యత్తు సవాళ్లకు సైన్యాన్ని సర్వ సన్నద్ధంగా ఉంచడంలో, సైన్యం సగటు వయసును ప్రస్తుత 32 ఏళ్ల నుంచి 26 ఏళ్లకు తగ్గించడంలో అగ్నిపథ్ ప్రధాన పాత్ర పోషించనుంది’’ అన్నారు. కొత్త నియామకాల్లో అర్హత ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని చెప్పారు. సైన్యం పనితీరు, సామర్థ్యం, సరిహద్దుల వెంబడి సన్నద్ధత తదితరాలను యథాతథంగా కొనసాగిస్తామని వివరించారు. ఈ పథకం కింద మహిళలను కూడా తీసుకుంటామని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ వివరించారు. యువ ప్రతిభను వాయుసేన అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌధురి అన్నారు. అగ్నిపథ్‌ను దేశ యువతకు గొప్ప అవకాశంగా యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ అభివర్ణించారు. వారి సర్వీసు నైపుణ్యాలకు యూజీసీ గుర్తింపు కల్పించేందుకు కృషి చేస్తామని ప్రకటించారు.
-
విపక్షాల పెదవి విరుపు
అగ్నిపథ్ పథకాన్ని విప్లవాత్మక నిర్ణయంగా బీజేపీ అభివర్ణించగా విపక్షాలు మాత్రం పెదవి విరిచాయి. యువతకు భారీ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రధాని మోదీ సంకల్పానికి ఇది, ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాల ప్రకటన కార్యరూపమని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బంగారు భవిత కోసం యువతకు ఇదో అద్భుత అవకాశమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, పార్టీ అగ్ర నేతలు అన్నారు. రక్షణ రంగంలో పెన్షన్ల భారం తదితరాలను తగ్గించుకోవడానికి దేశ భద్రతను కేంద్రం పణంగా పెడుతున్నట్టు కన్పిస్తోందని కాంగ్రెస్, ఇతర విపక్షాలు విమర్శించాయి.
పథకం స్వరూపం...
- ఇది ఆఫీసర్ దిగువ ర్యాంకు సిబ్బంది (పీబీఓఆర్) నియామక ప్రక్రియ.
- త్రివిధ దళాలకు సంయుక్తంగా ఆన్‌లైన్ సెంట్రలైజ్డ్ విధానంలో ర్యాలీలు, క్యాంపస్ ఇంటర్వ్యూ తదితర మార్గాల్లో నాలుగేళ్ల కాలానికి నియామకాలు చేపడతారు.
- ఈ ఏడు 46,000 నియామకాలుంటాయి. 90 రోజుల్లో ప్రక్రియ మొదలవుతుంది.
మాజీల మిశ్రమ స్పందన
కొత్త పథకంపై మాజీ సైనికాధికారులు మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. ఇది త్రివిధ దళాలకు మరణ శాసనంతో సమానమని లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) వినోద్ భాటియా విమర్శించారు. సైన్యంలో తరాలుగా కొనసాగుతూ వస్తున్న సంప్రదాయాలు, నైతిక విలువలు, చిత్తశుద్ధి తదితరాలు ఇకపై లోపిస్తాయని మేజర్ జనరల్ (రిటైర్డ్) సత్బీర్‌సింగ్ అన్నారు. సైన్యం సామర్థ్యాన్ని కూడా ఈ పథకం దెబ్బ తీస్తుందన్నారు. రక్షణ రంగంలో దీర్ఘకాలిక సంస్కరణలకు ఇది తొలి అడుగని మేజర్ జనరల్ (రిటైర్డ్) బీఎస్ ధనోవా అభిప్రాయపడ్డారు.
Defense Sector: రక్షణ రంగంలో ‘ఆత్మనిర్భర్ భారత్’కు పెద్దపీట
- త్రివిధ దళాల్లో ప్రస్తుతమున్న అర్హత ప్రమాణాలే వర్తిస్తాయి. వయో పరిమితి 17.7–21 ఏళ్లు. ఆర్నెల్ల శిక్షణ, మూడున్నరేళ్ల సర్వీసు ఉంటాయి.
- సైన్యంలో ఇప్పటిదాకా జరుగుతున్న ప్రాంతాలు, కులాలవారీ నియామకాలకు భిన్నంగా ‘ఆలిండియా–ఆల్ క్లాస్’ విధానంలో రిక్రూట్‌మెంట్ ఉంటుంది. దీంతో రాజ్‌పుత్, మరాఠా, సిక్కు, జాట్ వంటి రెజిమెంట్ల స్వరూప స్వభావాలు క్రమంగా మారతాయి.
- విధుల్లో చేరేవారిని అగ్నివీర్‌గా పిలుస్తారు. వీరికి ప్రస్తుత ర్యాంకు లు కాకుండా ప్రత్యేక ర్యాంకులిస్తారు.
- వేతనం తొలి ఏడాది నెలకు రూ.30,000. రూ.21 వేలు చేతికిస్తారు. రూ.9,000 కార్పస్ నిధికి వెళ్తుంది. కేంద్రమూ అంతే మొత్తం జమ చేస్తుంది. నాలుగో ఏడాదికి రూ.40,000 వేతనం అందుతుంది.
- నాలుగేళ్ల సర్వీసు పూర్తయ్యాక రూ.11.71 లక్షల సేవా నిధి ప్యాకేజీ అందుతుంది. దీనిపై ఆదాయ పన్నుండదు.
- సర్వీసు కాలావధికి రూ.48 లక్షల ఉచిత జీవిత బీమా కవరేజీ ఉంటుంది.
- గ్రాట్యుటీ, పెన్షన్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు.
- ప్రతిభ, ఖాళీల ఆధారంగా 25 శాతం మందిని శాశ్వత సర్వీసుకు పరిగణనలోకి తీసుకుంటారు.
- మిగతా వారికి రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు రంగ నియామకాల్లో ప్రాధాన్యం.
Adani group join hands with Total Energies : అదానీ గ్రూప్ టోటల్ ఎనర్జీస్‌తో చేతులు కలిపింది
- బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ తాజాగా ఫ్రాన్స్‌కు చెందిన టోటల్‌ఎనర్జీస్‌తో చేతులు కలిపింది. తద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి వెంచర్‌ను ఏర్పాటు చేయనుంది. దీంతో అదానీ గ్రూప్ కర్బనరహిత ఇంధన తయారీని చేపట్టనుంది. రానున్న దశాబ్ద కాలంలో ఈ రంగంలో అనుబంధ విభాగాలతో కలిపి 50 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలున్నట్లు అదానీ గ్రూప్ పేర్కొంది.
- అదానీ గ్రూప్ కొత్త ఇంధన బిజినెస్ విభాగం అదానీ న్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఏఎన్‌ఐఎల్)లో టోటల్‌ఎనర్జీస్ 25 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. అయితే డీల్ విలువను రెండు సంస్థలూ వెల్లడించకపోవడం గమనార్హం. ఏఎన్‌ఐఎల్‌లో 25 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు టోటల్‌ఎనర్జీస్ ప్రకటించింది.
- 2030కల్లా ఏఎన్‌ఐఎల్ వార్షికంగా మిలియన్ మెట్రిక్ టన్నుల(ఎంటీపీఏ) గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టోటల్‌ఎనర్జీస్ పేర్కొంది. తొలి మైలురాయికింద 30 గిగావాట్ల కొత్త పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుకునే ప్రణాళికలున్నట్లు తెలియజేసింది. ఈ జనవరిలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ కోసం అదానీ గ్రూప్ ఏఎన్‌ఐఎల్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
దశాబ్ద కాలంలో..
నూతన ఇంధన విభాగంలో రానున్న 10 ఏళ్ల కాలంలో 70 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు అదానీ గ్రూప్ గతేడాది నవంబర్‌లో ప్రకటించింది. దీనిలో భాగంగా 2022–23కల్లా అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్(ఏజీఈఎల్) ఏడాదికి 2 గిగావాట్ల సోలార్ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని నెలకొల్పే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెచ్చిస్తోంది. కాగా.. టోటల్ ఎనర్జీస్ ఇప్పటికే అదానీ గ్రీన్ ఎనర్జీతో జట్టు కట్టింది.
Russia is the second largest supplier of oil to India : భారత్‌కు చమురు సరఫరాలో రెండో స్థానానికి రష్యా..
- భారత్‌కు ముడిచమురు అత్యధికంగా సరఫరా చేస్తున్న దేశాల జాబితాలో సౌదీ అరేబియాను దాటి రష్యా రెండో స్థానానికి చేరింది. మే నెలలో భారతీయ రిఫైనరీలు రష్యా నుంచి 25 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌ను కొనుగోలు చేసినట్లు గణాంకాల్లో వెల్లడైంది. మొత్తం చమురు దిగుమతుల్లో ఇది 16 శాతం పైగా ఉంటుంది. సముద్రమార్గంలో భారత్ చేసుకునే మొత్తం దిగుమతుల్లో రష్యా నుంచి వచ్చే ఉత్పత్తుల వాటా ఏప్రిల్‌లో తొలిసారిగా 5 శాతానికి చేరింది.
- 2021 సంవత్సరం ఆసాంతం, 2022 తొలి త్రైమాసికంలోనూ ఇది 1 శాతం కన్నా తక్కువే నమోదైంది. ప్రస్తుతం భారత్‌కు అత్యధికంగా చమురు సరఫరా చేసే దేశాల్లో ఇరాక్ అగ్రస్థానంలో ఉంది. ఉక్రెయిన్‌తో యుద్ధ పరిణామాల నేపథ్యంలో భారత్‌కు రష్యా భారీ డిస్కౌంటుపై చమురు సరఫరా చేస్తోంది. గతంలో రవాణా చార్జీల భారం కారణంగా రష్యా చమురును భారత్ అంతగా కొనుగోలు చేయలేదు. అయితే, ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు ఆకాశాన్నంటుతున్న తరుణంలో తక్కువ రేట్లకు కొనుగోలు చేసే అవకాశాన్ని అందిపుచ్చుకుని రష్యా నుంచి చమురు దిగుమతులను పెంచుకుంటోంది.
Life Achievement Award for Hanuman Chaudhary: హనుమాన్ చౌదరికి జీవిత సాఫల్య పురస్కారం
- బహుముఖ ప్రజ్ఞావంతుడు, ప్రజ్ఞాభారతి చైర్మన్ డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరికి ప్రతిష్టాత్మక జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. 49వ వార్షికోత్సవాల్లో భాగంగా ‘ది హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్’ 2021–22 సంవత్సరానికిగాను ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేసింది.
- ఇటీవల నగరంలోని నోవాటెల్‌లో జరిగిన కార్యక్రమంలో డీఆర్‌డీఓ చైర్మన్ జి.సతీష్‌రెడ్డి, హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డిలు ముఖ్యఅతిథులుగా పాల్గొని, వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు అవార్డులను ప్రదానం చేసినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
- ‘మేనేజర్ ఆఫ్ ది ఇయర్’అవార్డును జయతీర్థ్ ఆర్.జోషి (డిఫెన్స్ ఆర్ అండ్ డీ ల్యాబ్), ‘హెచ్‌ఆర్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్’అవార్డు ప్రవీణ్ తివారీ(పల్స్ ఫార్మా), ‘ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’అవార్డు దేశిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి (ఆప్టిమస్ డ్రగ్స్)లు అందుకున్నారు. ‘సీఎస్‌ఆర్ అవార్డ్ ఆఫ్ ది ఇయర్’చిన్నబాబు సుంకవల్లి(గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్)కి, మంజూష కొడియాల(ఫార్మా ఆర్ అండ్ డీ)కి ‘యంగ్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్’, ఉమ కాసోజి(ది స్టార్ ఇన్‌మి)కి ‘ఉమెన్ అచీవర్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్’, ప్రొఫెసర్ రామచంద్ర(జేఎన్‌టీయూ)కు ‘అకడమీషియన్ ఎక్సలెన్స్’పి.కృష్ణ చైతన్య(మోటివేషనల్ స్పీకర్)కు ‘మెంబర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులను ప్రదానం చేశారు.
5G soon in India, to be 10 times faster than 4G: 5జీ కమింగ్ సూన్: దాదాపు 10 రెట్ల వేగంతో
- 5జీ టెలికాం సేవల కోసం ఎదురుచూస్తున్న వారికి కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎప్పటినుంచో ఊరిస్తున్న 5జీ సేవలు 4జీ కంటే దాదాపు 10 రెట్లు వేగంతో త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన స్పెక్ట్రమ్ వేలానికి క్యాబినెట్ బుధవారం తుది ఆమోదం తెలిపింది.
- 5జీ సేవల బిడ్డర్‌లకు స్పెక్ట్రమ్‌ను కేటాయించే స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించాలనే టెలికమ్యూనికేషన్స్ శాఖ ప్రతిపాదనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల వ్యాపార వ్యయాన్ని తగ్గించేందుకు జూలై చివరి నాటికి 20 సంవత్సరాల చెల్లుబాటుతో మొత్తం 72097.85 MHz స్పెక్ట్రమ్‌ను వేలం వేయనున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రైవేట్ 5జీ నెట్‌వర్క్‌లను ఆపరేట్ చేయడానికి వారికి మార్గం సుగమం చేస్తూ, సంస్థలకు నేరుగా ఎయిర్‌వేవ్‌లను కేటాయించే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూలై నెలాఖరులోగా 5జీ స్పెక్ట్రమ్ వేలాన్నినిర్వహించనుంది. దేశంలోని మూడు ముఖ్య టెలికాం సేవల సంస్థలు జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా ఈ వేలంలో పాల్గొంటాయని భావిస్తున్నారు.
- ఎయిర్‌వేవ్‌ల కోసం ముందస్తు చెల్లింపును కూడా రద్దు చేసింది ప్రభుత్వం. అలాగే ప్రస్తుతం ఉన్న 13, 15, 18, 21 GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లలో సాంప్రదాయ మైక్రోవేవ్ బ్యాక్‌హాల్ క్యారియర్‌ల సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. నిర్దేశిత సొమ్మును 5జీ స్పెక్ట్రమ్ బిడ్డర్లు 20 నెలవారీ వాయిదాలలో (EMI) చెల్లించవచ్చు. లో, మిడ్, హై అనే మూడు విభాగాల్లో ఈ 5జీ స్పెక్ట్రమ్ వేలం జరగనుంది.
కొత్త శకానికి నాంది
5జీ సేవల స్పెక్ట్రమ్ వేలం భారత టెలికాం రంగంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.5జీ స్పెక్ట్రమ్ వేలం జూలై 26న ప్రారంభమవుతుందన్నారు. ప్రధాని డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రకటించిన స్పెక్ట్రమ్ వేలం భారత్‌కా 5జీ ఈకో సిస్టం సాధనలోఅంతర్భాగమని మంత్రి చెప్పారు.
APSSDC: ఏపీఎస్‌ఎస్‌డీసీకి జాతీయ గుర్తింపు.. ఎందుకంటే?
- నైపుణ్యాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) అమలు చేస్తోన్న కొత్త విధానాలకు జాతీయ గుర్తింపు లభించింది. కర్ణాటకలో జరుగుతున్న 2వ ఇండిగ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న నూతన స్కిల్ విధానాలను అభినందిస్తూ అవార్డు వచ్చినట్లు ఏపీఎస్‌ఎస్‌డీసీ సోమవారం ప్రకటన విడుదల చేసింది.
- 5 రాష్ట్రాలకు చెందిన 20కిపైగా యూనివర్సిటీ విద్యార్థులు, 20 రంగాలకు చెందిన పరిశ్రమలు పాల్గొన్న ఈ సమ్మిట్‌లో న్యూ ఆక్టివిటీస్ అండ్ క్యాస్కేడింగ్ స్కిల్ సిస్టమ్ గురించి ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రెజెంటేషన్ ఇచ్చింది. దానికి అవార్డు లభించడంపై ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ ఎస్ సత్యనారాయణ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.