Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జూన్‌ 08 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu June 08th 2022(డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Telugu Current Affairs daily

Sticky Bomb: స్టికీ బాంబుల్ని తొలిసారి ఎప్పుడు ఉపయోగించారు?

Sticky Bomb

హిందువులకు అత్యంత పవిత్రమైన అమర్‌నాథ్‌ యాత్రను భగ్నం చేయడానికి ఉగ్రవాదులు స్టికీ బాంబులతో సవాల్‌ విసురుతున్నారు. ఇందులో భాగంగా వాటిని డ్రోన్ల ద్వారా తరలిస్తుండగా జమ్ము పోలీసులు జూన్‌ 6న స్వాధీనం చేసుకున్నారు. జమ్ము శివార్లలో పాకిస్తాన్‌ డ్రోన్‌ ఒకటి ఓ పేలోడ్‌ను జారవిడిచింది. స్టికీ బాంబులతో కూడిన టిఫిన్‌ బాక్సులు అందులో దొరికాయి.

స్టికీ బాంబుల్ని తొలిసారి వాడిందెప్పుడు?
స్టికీ బాంబుల్ని తొలిసారిగా బ్రిటన్‌ రెండో ప్రపంచ యుద్ధంలో వినియోగించింది. అప్పట్లో ఇది గ్రెనేడ్‌లా ఉండేది. గోళాకారపు గాజు ఫ్లాస్క్‌లో నైట్రో గ్లిసరిన్‌ నింపి తయారు చేసేవారు. దాన్ని లోహంతో కవర్‌ చేసి అంటించేవారు. బాంబును ప్రయోగించేటప్పుడు దాని రక్షణ కవచాన్ని బయటకు లాగి విసిరేవారు. ఐదు సెకండ్లలో బాంబు పేలేది.

ఏమిటీ స్టికీ బాంబులు?
చిన్న సైజుల్లో ఉండే బాక్సుల్లో పేలుడు పదార్థాలుంచి ఈ బాంబుల్ని తయారు చేస్తారు. వాటికి నాణెం ఆకారంలోని మాగ్నెట్లను అతికిస్తారు. దాంతో ఈ బాంబులు వాహనాలకు సులభంగా అతుక్కుంటాయి. టైమర్‌తో అనుకున్న సమయానికి వీటిని పేల్చవచ్చు. వీటి తయారీ చౌకే గాక తరలించడమూ సులభమే. వీటిని వాడే ప్రక్రియ ఒకప్పుడు కాస్త సంక్లిష్టంగా ఉండేది. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చాక  అదీ సులభంగా మారింది. పార్క్‌ చేసిన వాహనాలకు వీటిని అతికించి రిమోట్‌తో పేలుస్తారు.

India's 101st Unicorn: భారత్‌లో 101వ యూనికార్న్‌గా అవతరించిన కంపెనీ?

Physics Wallah

Physics Wallah Became India's 101st Unicorn: ఎడ్‌టెక్‌ కంపెనీ ఫిజిక్స్‌వాలా యూనికార్న్‌ జాబితాలో చేరింది. సిరీస్‌–ఏ కింద కంపెనీ రూ.777 కోట్ల నిధులను సమీకరించింది. వెస్ట్‌బ్రిడ్జ్, జీఎస్‌వీ వెంచర్స్‌ ఈ మొత్తాన్ని సమకూర్చాయి. డీల్‌లో భాగంగా ఫిజిక్స్‌వాలాను రూ.8,663 కోట్లుగా విలువ కట్టారు. దీంతో భారత్‌లో 101వ యూనికార్న్‌గా ఫిజిక్స్‌వాలా చోటు సంపాదించింది. అలాగే సిరీస్‌–ఏ ఫండ్‌ ద్వారా ఈ ఘనతను సాధించిన మొదటి సంస్థ కూడా ఇదే. సంస్థ యాప్‌ను 52 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. యూట్యూబ్‌లో 69 లక్షల మంది చందాదార్లు ఉన్నారు. వృద్ధి ప్రయాణంలో భాగంగా తెలుగుసహా కొత్తగా తొమ్మిది స్థానిక భాషల్లో కంటెంట్‌ను పరిచయం చేయనున్నట్టు జూన్‌ 7న ఫిజిక్స్‌వాలా వెల్లడించింది. ఒక స్టార్టప్‌ విలువ ఒక బిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు చేరితే దానిని యూనికార్న్‌ స్టార్టప్‌ అంటారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారత్‌లో 101వ యూనికార్న్‌గా చోటు సంపాదించిన కంపెనీ?
ఎప్పుడు    : జూన్‌ 7
ఎవరు    : ఫిజిక్స్‌వాలా
ఎందుకు    : సిరీస్‌–ఏ కింద కంపెనీ రూ.777 కోట్ల నిధులను సమీకరించడంతో...

Khelo India Youth Games: ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ను ఎక్కడ నిర్వహిస్తున్నారు?

Rajita, Sirisha
పతకాలతో రజిత, శిరీష 

హరియాణా రాష్ట్రం, పంచ్‌కుల జిల్లాలోని పంచ్‌కుల వేదికగా జరుగుతోన్న ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌–2022లో జూన్‌ 7న ఆంధ్రప్రదేశ్‌కు రెండు స్వర్ణాలు, ఒక కాంస్యం లభించాయి. అండర్‌–18 మహిళల అథ్లెటిక్స్‌ 400 మీటర్ల విభాగంలో కుంజా రజిత పసిడి పతకం సొంతం చేసుకోగా... ముగద శిరీష కాంస్య పతకాన్ని దక్కించుకుంది. రజిత 56.07 సెకన్లలో రేసును ముగించి అగ్రస్థానంలో నిలువగా ... శిరీష 58 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానాన్ని సంపాదించింది.

మరోవైపు మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ 64 కేజీల విభాగంలో సానపతి పల్లవి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. పల్లవి మొత్తం 189 కేజీలు బరువెత్తి తొలి స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఈ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌ రెండు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఆరు పతకాలు సాధించి 14వ స్థానంలో ఉంది.  

మాయావతికి కాంస్యం
అండర్‌–18 మహిళల అథ్లెటిక్స్‌ 100 మీటర్ల విభాగంలో నకిరేకంటి మాయావతి(తెలంగాణ) కాంస్య పతకం సొంతం చేసుకుంది. మాయావతి 12.23 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఈ క్రీడల్లో ఒక రజతం, మూడు కాంస్యాలు నెగ్గిన తెలంగాణ మొత్తం నాలుగు పతకాలతో 25వ స్థానంలో ఉంది. 

WHO: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు జ‌రుపుకుంటారు?

పొగాకు ఉత్పత్తుల నుంచి వచ్చే వ్యర్థాల గురించి షాకింగ్‌ నిజాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) బయట పెట్టింది. మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని.. డబ్ల్యూహెచ్‌వో కీలక విషయాలను వెల్లడించింది. పొగాకు పరిశ్రమ ప్రతి సంవత్సరం ప్రపంచంలోని ఎనిమిది మిలియన్లకు పైగా మానవ జీవితాలను హరిస్తోందని తెలిపింది. అంతేకాకుండా పొగాకు ఉత్పత్తుల కారణంగా 600 మిలియన్‌ల చెట్లను, 200,000 హెక్టార్ల భూమిని, 22 బిలియన్‌ టన్నుల నీరు, 84 మిలియన్‌ టన్నుల CO2ను కోల్పోతున్నామని పేర్కొంది. పొగాకు ఉత్పత్తులు కలిగించే విధ్వంసానికి పరిశ్రమను జవాబుదారీగా చేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. పొగాకు ఉత్పత్తుల నుంచి వచ్చే వ్యర్థాలను శుభ్రపరచడానికి భారతదేశానికి ప్రతి సంవత్సరం $766 మిలియన్లు(రూ.5,900 కోట్లకు పైగా) ఖర్చవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అంతేకాకుండా డబ్ల్యూహెచ్‌వో అంచనా ప్రకారం–భారతదేశంలోని అన్ని ఉత్పత్తుల వ్యర్థాల నుంచి వచ్చే మొత్తం చెత్తను శుభ్రపరచడానికి సుమారు $8 బిలియన్ల వ్యయం అవుతుంది. ఇందులో దాదాపు 9.57శాతం పొగాకు ఉత్పత్తుల చెత్తను శుభ్రపరచడానికి వెళ్తుందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. 

Download Current Affairs PDFs: Click Here

Missile Test: జిర్కాన్‌ హైపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణి పరీక్షను నిర్వహించిన దేశం?

ఉక్రెయిన్‌ పై దాడులను ముమ్మరం చేసిన నేపథ్యంలో.. రష్యా తన ఆయుధ పాటవాన్ని ప్రదర్శించింది. ధ్వని వేగం కన్నా 9 రెట్లు(గంటకు 11వేల కిలోమీటర్లు) వేగంగా దూసుకెళ్లే శక్తిమంతమైన జిర్కాన్‌ హైపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణిని తాజాగా పరీక్షించింది. బేరంట్స్‌ సముద్రంలో అడ్మిరల్‌ గోర్ష్‌ఖోవ్‌ యుద్ధనౌక నుంచి జిర్కాన్‌ ను రష్యా ప్రయోగించింది. ఇది వెయ్యి కిలోమీటర్ల దూరంలోని వైట్‌ సీలో ఉంచిన లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. 

Countries of Europe: యూరప్‌.. తన గ్యాస్‌ అవసరాల్లో ఏకంగా 40 శాతం ఏ దేశంపై ఆధారపడి ఉంది?

రష్యాపై ఆంక్షలకు కొనసాగింపుగా యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి చమురు దిగుమతులను వచ్చే ఆర్నెల్లలో ఏకంగా 90 శాతం తగ్గించుకునేందుకు ఈయూ దేశాలన్నీ అంగీకరించాయి. ఇటీవల జరిగిన ఈయూ కీలక భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఇతర సరఫరా మార్గాలను వెతుక్కోవడం, వీలైనంత త్వరగా సంప్రదాయేతర ఇంధన వనరులకు మళ్లడం తదితరాల ద్వారా కొరతను అధిగమించాలని నిర్ణయించాయి. ఈ నిర్ణయంతో రష్యా నుంచి సముద్ర మార్గాన యూరప్‌కు ఇంధన సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది. హంగేరి వంటి మధ్య, తూర్పు యూరప్‌ దేశాలకు పైప్‌లైన్‌ ద్వారా జరుగుతున్న సరఫరాలు మాత్రం కొనసాగుతాయి. యూరప్‌ తన చమురు అవసరాల్లో 25 శాతం, గ్యాస్‌ అవసరాల్లో ఏకంగా 40 శాతం రష్యాపైనే ఆధారపడి ఉంది. అందుకే ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌ పై రష్యా యుద్ధానికి దిగినప్పటి నుంచీ ఆ దేశం నుంచి చమురు, గ్యాస్‌ దిగుమతుల్ని పూర్తిగా నిలిపేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నా.. చాలా యూరప్‌ దేశాలు సమ్మతించలేదు. 

RIMPAC Exercise 2022: రిమ్‌పాక్ నౌకా విన్యాసాలకు వేదిక కానున్న దేశం?

ప్రపంచంలోనే అతిపెద్ద నౌకా విన్యాసాలకు రంగం సిద్ధమైంది. జూన్‌ 29 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు జరగనున్న ఈ యుద్ధ విన్యాసాలకు అమెరికాలోని హోనోలులు, శాన్‌ డియాగో వేదిక కానున్నాయి. ఈ యుద్ధ విన్యాసాల్లో మొత్తం 26 దేశాలు పాల్గొననున్నాయి. నాలుగు క్వాడ్‌ సభ్యదేశాలతోపాటు ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనై ఇండోనేషియా, సింగపూర్‌లు కూడా ఈ యుద్ధ విన్యాసాల్లో భాగస్వాములు కానున్నాయి. ఈ విన్యాసాల్లో 38 నౌకలు, నాలుగు జలాంతర్గాములు, 170 విమానాలు వినియోగించనున్నారు. వివిధ దేశాలకు చెందిన సాయుధ బలగాల్లోని 26,000 మంది దీనిలో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని అమెరికా నౌకాదళం ఓ ప్రకటనలో వెల్లడించింది. రిమ్‌పాక్‌ 2022లో పాల్గొనే ఇతర దేశాలు: కెనడా, చిలీ, కొలంబియా, డెన్మార్క్, ఈక్వెడార్, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇజ్రాయెల్, మెక్సికో, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పెరూ, దక్షిణ కొరియా, శ్రీలంక, థాయ్‌లాండ్, టోంగా, యూకే. 

PMJJBY: పీఎం జీవన్‌ జ్యోతి, సురక్ష బీమా... ప్రీమియం పెంపు

ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన(పీఎంజేజేబీవై), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన(పీఎంఎస్‌బీవై)ల కింద చెల్లించాల్సిన వార్షిక ప్రీమియం జూన్‌ 1వ తేదీ నుంచి పెరగనుంది. ఈ రెండు పథకాలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ప్రతికూలతలను దృష్టిలో ఉంచుకొని జీవనజ్యోతి బీమా యోజన ప్రీమియంను రూ.330 నుంచి రూ.436కు, సురక్ష యోజన ప్రీమియంను రూ.12 నుంచి రూ.20కి పెంచారు. 

Download Current Affairs PDFs: Click Here

Bilateral Trade: భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచిన దేశం?

2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం–గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య విలువ 119.42 బిలియన్‌ డాలర్లు(రూ.9.27 లక్షల కోట్లు)గా నమోదైంది. ఇది అంతకుముందు 2020– 21లో 80.51 బిలియన్‌ డాలర్లు(రూ.6.25 లక్షల కోట్లు) ఉంది. దీంతో ఇప్పటివరకు భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్న చైనాను అమెరికా అధిగమించింది. గత ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి అమెరికాకు 76.11 బిలియన్‌ డాలర్ల(రూ. 5.91 లక్షల కోట్ల) విలువైన ఎగుమతులు నమోదయ్యాయి. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 51.62 బిలియన్‌ డాలర్ల(రూ.4.01 లక్షల కోట్ల) కంటే 47 శాతం అధికం. అదే సమయంలో దిగుమతుల విలువ 29 బిలియన్‌ డాలర్లు(రూ.2.25 లక్షల కోట్ల) నుంచి 43.31 బిలియన్‌ డాలర్ల (రూ.3.36 లక్షల కోట్ల)కు పెరిగింది. అలాగే, 2021–22 ఆర్థిక సంవత్సరంలో చైనాతో భారత ద్వైపాక్షిక వాణిజ్య విలువ 115.42 బిలియన్‌ డాలర్లు(రూ.8.96 లక్షల కోట్లు)గా ఉంది. 2020–21లో ఇది 86.4 బిలియన్‌ డాలర్లు(రూ.6.71 లక్షల కోట్లు)గా ఉంది. మన దేశం నుంచి చైనాకు చేసే ఎగుమతుల విలువ 21.25 బిలియన్‌ డాలర్లు(రూ.1.65 లక్షల కోట్లు) కాగా, దిగుమతులు 94.16 బిలియన్‌ డాలర్లు (రూ.7.31 లక్షల కోట్లు) గా ఉంది. గత దశాబ్దంలో 2013–14 నుంచి 2017–18 వరకు భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా కొనసాగింది. ఆ తర్వాత రెండు ఆర్థిక సంవత్సరాల్లో యూఏఈ ఉండగా.. మళ్లీ చైనా అగ్రస్థానంలో నిలిచింది. ఇక, 2021–22లో యూఏఈ మూడో స్థానానికి చేరగా.. ఆ తర్వాత స్థానాల్లో సౌదీ అరేబియా, ఇరాక్, సింగపూర్‌లు ఉన్నాయి. 

Goods and Service Tax: రూ.86,912 కోట్ల జీఎస్‌టీ బకాయిల విడుదల

రాష్ట్రాలకు చెల్లించాల్సిన వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) బకాయిలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మే 31, 2022 వరకు మొత్తం రూ.86,912 కోట్ల బకాయిలను ఒకేసారి విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ వెల్లడించింది. జీఎస్‌టీ అమలువల్ల ఏర్పడే రెవెన్యూ లోటును పూడ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వీటిని రాష్ట్రాలకు అందిస్తోంది. మూలధన వ్యయంతోపాటు ఆర్థిక వనరుల నిర్వహణ, వివిధ కార్యక్రమాల అమలుకు తాజా నిర్ణయం దోహదపడుతుందని ఆర్థిక శాఖ తెలిపింది. దేశంలో వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)ని జూలై 1, 2017లో ప్రవేశపెట్టారు. జీఎస్‌టీ అమలు వల్ల ఏర్పడే రెవెన్యూ లోటు భర్తీకి ఆయా రాష్ట్రాలకు రెండు నెలలకోసారి కేంద్రం పరిహారం చెల్లించాలని 2017 జీఎస్‌టీ చట్టం చెబుతోంది. 2017 నుంచి ఐదేళ్ల పాటు ఈ సహాయాన్ని అందజేయాల్సి ఉంది. ఈ ఏడాది(2022) జూన్‌ తో ఈ గడువు ముగియనుంది. 

Download Current Affairs PDFs: Click Here

PM CARES Fund: పీఎం–కేర్స్‌ నిధి నుంచి ఎంత మొత్తాన్ని సాయంగా అందించనున్నారు?

కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు 23ఏళ్లు వచ్చేసరికి పీఎం–కేర్స్‌ నిధి నుంచి రూ.10లక్షల మొత్తం సాయంగా అందించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. పీఎం–కేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ ఇనీషియేటీవ్‌ పథకాన్ని మే 29, 2021న ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన పిల్లలకు పాఠశాలల్లో చదువుకొనే సమయంలో రూ.20,000 స్కాలర్‌షిప్, ప్రతినెలా రూ.4,000 ఖర్చుల నిమిత్తం అందించనున్నారు. ఈ పథకం కింద పిల్లలు ఉన్నత విద్యాభ్యాసానికి రుణాలు తీసుకొనేందుకు కూడా అర్హులు. దీంతోపాటు ఈ చిన్నారులకు రూ.5లక్షల విలువైన హెల్త్‌కవరేజీ లభించేలా ఆయుష్మాన్‌ కార్డులను కూడా అందజేయనున్నారు. 2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28లోపు కరోనా కారణంగా తల్లిదండులు ఇద్దర్నీ లేదా ఒకరిని, చట్టపరమైన సంరక్షకులను, దత్తత తీసుకొన్న పేరెంట్స్‌ను కోల్పోయిన వారికి ఈ పథకం వర్తిస్తుంది. 

RBI Report: దేశంలో పెరిగిన నకిలీ నోట్లు

ఆర్‌బీఐ నివేదిక ప్రకారం–2021–22లో అన్ని డినామినేషన్ల నకిలీ నోట్లు పెరిగాయి. ముఖ్యంగా రూ.500 నకిలీ నోట్లు 101.9 శాతం, రూ.2,000 ఫేక్‌ నోట్లు 54.16 శాతం పెరిగాయి. రూ.50, రూ.100 నోట్లు తప్ప మిగిలిన అన్ని నోట్ల నకిలీ అధికమైందని నివేదిక స్పష్టం చేసింది. మరోవైపు నగదు చలామణి కూడా గత మూడేళ్లలో 28.28 శాతం పెరిగింది. అన్ని డినామినేషన్లు కలిపి 2020లో రూ.24,20,975 కోట్ల విలువైన బ్యాంకు నోట్లు చలామణిలో ఉండగా, 2021 నాటికి ఈ విలువ రూ.28,26,863 కోట్లకు, 2022 నాటికి రూ.31,05,721 కోట్లకు చేరింది. చలామణిలో ఉన్న కరెన్సీలో రూ.2000 నోట్ల వాటా 1.6 శాతానికే పరిమితమైంది. 2016లో కేంద్ర ప్రభుత్వం అప్పటి రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. 

Tobacco: వరల్డ్‌ నో టొబాకో డే అవార్డు–2022కు ఎంపికైన రాష్ట్రం?

పొగాకు వినియోగాన్ని నియంత్రించడంలో జార్ఖండ్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. రాష్ట్రంలో పొగాకు వినియోగాన్ని తగ్గించడంలో చేసిన కృషికి గానూ ’వరల్డ్‌ నో టొబాకో డే అవార్డు–2022’కు జార్ఖండ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపిక చేసింది. మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును అందజేశారు. గ్లోబల్‌ అడల్ట్‌ టొబాకో సర్వే (జీఏటీఎస్‌)–1 నివేదిక ప్రకారం–2012లో జార్ఖండ్‌లో పొగాకు నియంత్రణ కార్యక్రమం ప్రారంభమైంది.

Download Current Affairs PDFs: Click Here

IFFCO: ప్రపంచంలోనే మొట్టమొదటి నానో యూరియా లిక్విడ్‌ ప్లాంట్‌ను ఎక్కడ ప్రారంభించారు?

ప్రపంచంలోనే మొట్టమొదటి నానో యూరియా లిక్విడ్‌ ప్లాంట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. దీనిని గుజరాత్‌లోని కలోల్‌లో ఇండియన్‌ ఫార్మర్స్‌ ఫెర్టిలైజర్‌ కోఆపరేటివ్‌ లిమిటెడ్‌ (ఇఫ్కో) ద్వారా ఏర్పాటు చేశారు. రూ.175 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేసిన ఈ ప్లాంట్‌ రోజుకు 1.5 లక్షల 500 ఝ∙నానో యూరియా బాటిళ్లను ఉత్పత్తి చేయగలదు.చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu >> 2022, జూన్‌ 07 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్(Telugu Current Affairs), స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 08 Jun 2022 06:30PM

Photo Stories