Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 29 కరెంట్‌ అఫైర్స్‌

DA CAs January 29

Wuhan University: కొత్తరకం కరోనా వైరస్‌ నియోకోవ్‌ను ఎక్కడ గుర్తించారు?

NeoCov

ఆఫ్రికా దేశం దక్షిణాఫ్రికాలో కొత్తరకం కరోనా వైరస్‌ ‘నియోకోవ్‌’ను గుర్తించినట్టు చైనాలోని వుహాన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. నియోకోవ్‌ వైరస్‌తో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్‌తో మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని, ఈ వైరస్‌ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే ముప్పు ఉందని అంచనా వేస్తున్నారు. ఈ కథనాన్ని రష్యా అధికారిక మీడియా సంస్థ స్పుత్నిక్‌ ప్రచురించింది.

మెర్స్‌ కోవ్‌తో సంబంధం.. పీడీఎఫ్‌2180సీఓవీ రకం..
అయితే నియోకోవ్‌ వైరస్‌ కొత్తదేమీ కాదని, 2012, 2015లో పశ్చిమాసియాలో వ్యాపించిన మెర్స్‌ కోవ్‌తో దీనికి సంబంధం ఉందని వుహాన్‌ శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడించింది. దక్షిణాఫ్రికాలోని గబ్బిలాల్లో నియోకోవ్‌ను గుర్తించినట్లు.. ఇప్పటివరకు ఇది మనుషులకు సోకలేదని వివరించింది. ప్రస్తుతం జంతువుల నుంచి జంతువులకు మాత్రమే వ్యాప్తిచెందే ఈ వైరస్‌లోని ఓ మ్యూటేషన్‌ కారణంగా జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని తెలిపింది. నియోకోవ్‌ వైరస్‌.. పీడీఎఫ్‌2180సీఓవీ రకానికి చెందినదని సైంటిస్టులు నిర్ధారించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : కొత్తరకం కరోనా వైరస్‌ ‘నియోకోవ్‌’ను చైనా వుహాన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు
ఎప్పుడు  : జనవరి 28
ఎవరు    : రష్యా అధికారిక మీడియా సంస్థ స్పుత్నిక్‌ 
ఎక్కడ    : దక్షిణాఫ్రికాలోని గబ్బిలాల్లో..

Defence Deal: బ్రహ్మోస్‌ క్షిపణుల్ని కొనుగోలు చేయనున్న దేశం?

Brahmos 650x400

భారత్‌ తయారీ బ్రహ్మోస్‌ మిస్సైళ్లను ఫిలిప్పీన్స్‌ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు భారత్, ఫిలిప్పీన్స్‌ మధ్య 37.4 కోట్ల డాలర్ల (రూ.2800 కోట్లకు పైనే) విలువైన ఒప్పందం కుదిరింది. బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో (బీఏపీఎల్‌) ఫిలిప్పీన్స్‌ రక్షణ శాఖ కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేసినట్టుగా భారత రక్షణ మంత్రిత్వ శాఖ జనవరి 28న ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో ఆయు«ధాలను, క్షిపణి వ్యవస్థల్ని ఎప్పుడూ దిగుమతి చేసుకునే భారత్‌ ఎగుమతి చేసే దిశగా తొలి అడుగు వేసినట్లయింది.

ముఖ్యాంశాలు..

  • విమానాలు, నౌకలు, జలాంతర్గాములు, నేల మీద నుంచి నిర్దేశించిన లక్ష్యాలను బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌  క్షిపణులు  ఛేదించగలవు.  ఫిలిప్పీన్స్‌ నేవీకి యాంటీ–షిప్‌ బ్రహ్మోస్‌ క్షిపణుల సరఫరా చేయడానికి ఒప్పందం కుదిరిందని భారత రక్షణ శాఖ తెలిపింది.
  • భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఒ)తో కలిసి బీఏపీఎల్‌ బ్రహ్మోస్‌ క్షిపణుల్ని తయారు చేస్తోంది. ఇండో–రష్యన్‌ జాయింట్‌ వెంచర్‌లో భాగంగా బ్రహ్మోస్‌ను అభివృద్ధి చేసిన విషయం విదితమే.
  • ఫిలిప్పీన్స్‌ నావికాదళం ఎన్ని క్షిపణుల్ని కొనుగోలు చేయనుందో రక్షణ శాఖ వెల్లడించలేదు. ఈ కొనుగోలు ఒప్పందంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టం కానున్నాయి. ఇటీవల కాలంలో సైనిక విభాగాల ఆధునీకరణకు ఫిలిప్పీన్స్‌ పలు చర్యలు తీసుకుంటోంది. 
  • స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ్, అస్త్ర, రాడార్లు, యాంటీ ట్యాంక్‌ మిస్సైల్స్‌ కొనుగోలు కోసం కూడా పలు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని డీఆర్‌డీఒ చైర్మన్‌ జి.సతీశ్‌ రెడ్డి తెలిపారు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
బ్రహ్మోస్‌ క్షిపణుల్ని కొనుగోలు చేసేందుకు భారత్‌తో ఒప్పందం చేసుకున్న దేశం?
ఎప్పుడు : జనవరి 28
ఎవరు    : ఫిలిప్పీన్స్‌
ఎందుకు : సైనిక విభాగాల ఆధునీకరణ చర్యల్లో భాగంగా..

Central Government: ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులైన ఆర్థికవేత్త?

Dr Venkatraman Anantha Nageswaran

కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ)గా ఆర్థికవేత్త డాక్టర్‌ వెంకట్రామన్‌ అనంత నాగేశ్వరన్‌ నియమితులయ్యారు. జనవరి 28న ఆయన బాధ్యతలు స్వీకరించారని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. తన మూడేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత డిసెంబర్‌ 2021లో సీఈఏ బాధ్యతల నుంచి వైదొలిగిన కేవీ సుబ్రమణియన్‌ స్థానంలో నాగేశ్వరన్‌ నియామకం జరిగింది. ఆర్థిక రంగంలో విశేష అనుభవం ఉన్న నాగేశ్వరన్‌ ఇంతక్రితం క్రెడిట్‌ సూసీ గ్రూప్‌ ఏజీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు.

నాజల్‌ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌కు డీసీజీఐ ఆమోదం
కోవిడ్‌– 19కు అడ్డుకట్ట వేసేందుకు భారత్‌ బయోటెక్‌ రూపొందించిన నాసల్‌ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌కు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపింది. దీన్ని బూస్టర్‌ డోసుగా ఇవ్వడం కోసం తుదిదశ ప్రయోగాలు జరిపేందుకు డీసీజీఐ అనుమతించింది. సాధారణ వ్యాక్సిన్‌ కంటే ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్‌ చాలా ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ)గా నియమితులైన ఆర్థికవేత్త?
ఎప్పుడు : జనవరి 28
ఎవరు    : డాక్టర్‌ వెంకట్రామన్‌ అనంత నాగేశ్వరన్‌
ఎందుకు : మూడేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత.. సీఈఏ బాధ్యతల నుంచి కేవీ సుబ్రమణియన్‌ వైదొలిగిన నేపథ్యంలో..

Tech Synergy: టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఏ టెలికం సంస్థలో పెట్టబడులు పెట్టనుంది?

Google - Airtel

టెక్‌ దిగ్గజం గూగుల్‌ తాజాగా దేశీ టెలికం భారతి ఎయిర్‌టెల్‌లో దాదాపు 1 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. ఇందులో భాగంగా సుమారు 700 మిలియన్‌ డాలర్లతో 1.28 శాతం వాటాలు కొనుగోలు చేయనుండగా, మిగతా 300 మిలియన్‌ డాలర్ల మొత్తాన్ని రాబోయే సంవత్సరాల్లో సర్వీసుల విస్తరణపై వెచ్చించనుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినట్లు జనవరి 28న ఎయిర్‌టెల్‌ తెలిపింది. గూగుల్‌ తాజా పెట్టుబడుల ప్రకారం ఎయిర్‌టెల్‌ విలువ సుమారు రూ. 4.1 లక్షల కోట్లుగా (54.7 బిలియన్‌ డాలర్లు) ఉండనుంది.

5జీ సొల్యూషన్స్‌పై కృషి..
తాజా ఒప్పందం మేరకు.. కొత్త ఉత్పత్తులతో భారత్‌ డిజిటల్‌ లక్ష్యాల సాకారానికి రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయని భారతి ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ భారతి మిట్టల్‌ తెలిపారు. వ్యూహాత్మక లక్ష్యాల్లో భాగంగా ఇరు సంస్థలు భారత్‌ కోసం ప్రత్యేకమైన 5జీ సొల్యూషన్స్‌ను కనుగొనడంపై కృషి చేయనున్నాయి.

ఇప్పటికే జియోలో గూగుల్‌..
దేశీయంగా డిజిటలీకరణ ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్న గూగుల్‌ .. రాబోయే 5–7 ఏళ్లలో భారత్‌లో 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. 2020 జూలైలో జియో ప్లాట్‌ఫామ్స్‌లో దాదాపు 4.5 బిలియన్‌ డాలర్లు వెచ్చించి 7.73 శాతం వాటాలు కూడా కొనుగోలు చేసింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
దేశీ టెలికం భారతి ఎయిర్‌టెల్‌లో దాదాపు 1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్న సంస్థ?
ఎప్పుడు : జనవరి 28
ఎవరు    : అమెరికన్‌ టెక్‌ దిగ్గజం గూగుల్‌
ఎందుకు : కొత్త ఉత్పత్తులతో భారత్‌ డిజిటల్‌ లక్ష్యాల సాకారం కోసం.. కలిసి పనిచేసేందుకు..

Tennis Tournament: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నిలో మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ గెలిచిన జంట?

Kristina Mladenovic, Ivan Dodig

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌–2022లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో ఇవాన్‌ డోడిగ్‌ (క్రొయేషియా)–క్రిస్టినా మ్లాడెనోవిచ్‌ (ఫ్రాన్స్‌) జంట విజేతగా నిలిచింది. జనవరి 28న మెల్‌బోర్న్‌ వేదికగా ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో డోడిగ్‌–మ్లాడెనోవిచ్‌ ద్వయం 6–3, 6–4తో జేసన్‌ కుబ్లెర్‌(ఆస్ట్రేలియా)–జైమీ ఫోర్లిస్‌ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన డోడిగ్‌–మ్లాడెనోవిచ్‌ జంటకు 1,90,000 ఆస్ట్రేలియన్‌ డాలర్లు (రూ. 99 లక్షల 65 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

బ్రెండన్‌ టేలర్‌పై మూడున్నరేళ్లు నిషేధం
అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అవినీతి నిరోధక నిబంధనలను ఉల్లంఘించడం ... 2021 సెప్టెంబర్‌లో డోపింగ్‌ టెస్టులో పట్టు బడటం... వెరసి జింబాబ్వే క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ బ్రెండన్‌ టేలర్‌పై ఐసీసీ మూడున్నరేళ్లు నిషేధం విధించింది. ఈ నిషేధం 2025 జూలై 28 వరకు ఉంటుంది. 35 ఏళ్ల టేలర్‌ జింబాబ్వే తరఫున 34 టెస్టులు, 205 వన్డేలు, 45 టి20 మ్యాచ్‌లు ఆడి 2021లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌–2022లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ గెలుచుకున్న జోడీ?
ఎప్పుడు : జనవరి 28
ఎవరు    : ఇవాన్‌ డోడిగ్‌ (క్రొయేషియా)–క్రిస్టినా మ్లాడెనోవిచ్‌ (ఫ్రాన్స్‌) జంట
ఎక్కడ    : మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
ఎందుకు : ఫైనల్లో డోడిగ్‌–మ్లాడెనోవిచ్‌ ద్వయం 6–3, 6–4తో జేసన్‌ కుబ్లెర్‌(ఆస్ట్రేలియా)–జైమీ ఫోర్లిస్‌ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచిందున..

Muscat: ఆసియా కప్‌ మహిళల హాకీ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు?

ఆసియా కప్‌ మహిళల హాకీ టోర్నమెంట్‌–2022లో జపాన్‌ జట్టు విజేతగా అవతరించింది. ఒమన్‌ రాజధాని నగరం మస్కట్‌ వేదికగా జనవరి 28న ఫైనల్లో జపాన్‌ 4–2 గోల్స్‌ తేడాతో దక్షిణ కొరియాపై నెగ్గి మూడోసారి చాంపియన్‌గా నిలిచింది. ఇదే టోర్నీలో భారత జట్టు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. చైనా జట్టుతో జరిగిన కాంస్య పతక పోరులో భారత్‌ 2–0 గోల్స్‌ తేడాతో విజయం సాధించి, కాంస్యాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటివరకు 10 సార్లు జరిగిన ఆసియా కప్‌లో భారత జట్టు రెండుసార్లు విజేతగా (2004, 2017), రెండుసార్లు రన్నరప్‌గా (1999, 2009), మూడుసార్లు మూడో స్థానంలో (1993, 2013, 2022) నిలిచింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆసియా కప్‌ మహిళల హాకీ టోర్నమెంట్‌–2022లో విజేతగా అవతరించిన జట్టు?
ఎప్పుడు : జనవరి 28
ఎవరు    : జపాన్‌ జట్టు
ఎక్కడ    : మస్కట్, ఒమన్‌
ఎందుకు : ఫైనల్లో జపాన్‌ 4–2 గోల్స్‌ తేడాతో దక్షిణ కొరియాపై గెలవడంతో..

Hyderabad Black Hawks: ఏ నగరం వేదికగా ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌-2022 జరగనుంది?

Hyderabad Black Hawks

2022, ఫిబ్రవరి నెలలో హైదరాబాద్‌ వేదికగా జరిగే రూపే ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌లో పాల్గొనే హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ జట్టు జెర్సీని తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ జనవరి 28న హైదరాబాద్‌లోని తన క్యాంప్‌ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ జట్టు యజమాని అభిషేక్‌ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో ఫిబ్రవరి 5 నుంచి 27 వరకు జరిగే ఈ లీగ్‌కు ఏ23 కంపెనీ సహ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది.

మొత్తం ఏడు జట్లు..
రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో జరిగే ఈ లీగ్‌లో మొత్తం ఏడు జట్లు హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్, కాలికట్‌ హీరోస్, కొచ్చి బ్లూ స్పైకర్స్, అహ్మదాబాద్‌ డిఫెండర్స్, చెన్నై బ్లిట్జ్, బెంగళూరు టార్పెడోస్, కోల్‌కతా థండర్‌ బోల్ట్స్‌ పాల్గొననున్నాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
రూపే ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌లో పాల్గొనే హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ జట్టు జెర్సీ ఆవిష్కరణ
ఎప్పుడు : జనవరి 28
ఎవరు    : తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌
ఎక్కడ    : హైదరాబాద్‌

Telugu Poet: కథానాయకుడు జాషువా పుస్తకాన్ని ఎవరు రచించారు?

Yendluri Sudhakar

ప్రముఖ కవి, సాహితీవేత్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ (63) హఠాన్మరణం చెందారు. గుండెపోటు కారణంగా జనవరి 28న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. 1959 జనవరి 21న నిజామాబాద్‌లోని పాములబíస్తీలో జన్మించిన ఎండ్లూరి సుధాకర్‌.. హైదరాబాద్‌లోని ఓయూలో ఎంఏ, ఎంఫిల్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలంలో పీహెచ్‌డీ చేశారు. తెలుగు ఉపాధ్యాయుడిగా తన ప్రస్థానం ప్రారంభించి.. ఎంతో మంది విద్యార్థులకు, పరిశోధకులకు మార్గదర్శకులుగా వ్యవహరించారు. రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయంలో విశేష సేవలందజేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలోని తెలుగు విభాగంలో సీనియర్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ సభ్యుడిగానూ పనిచేశారు.

ఎండ్లూరి రచనలు...: వర్తమానం, కొత్త గబ్బిలం, నా అక్షరమే నా ఆయుధం, మల్లెమొగ్గల గొడుగు, నల్లద్రాక్ష పందిరి, వర్గీకరణీయం, గోసంగి, కథానాయకుడు జాషువా(జీవిత చరిత్ర), తెలి వెన్నెల.. మొదలైనవి.

ఎండ్లూరిని వరించిన పురస్కారాలు: 1980లో లలితకళా పరిషత్‌ పురస్కారం, కవికోకిల జాషువా పురస్కారం, సినారె పురస్కారం, అధికార భాషా సంఘం పురస్కారం, ఉగాది విశిష్ట సాహిత్య పురస్కారం, ఎన్టీఆర్‌ ప్రతిభా పురస్కారం, డాక్టర్‌ జీఎన్‌ రెడ్డి మెమోరియల్‌ అవార్డు, అరుణ్‌ సాగర్‌ ట్రస్ట్‌ మెమోరియల్‌ అవార్డు.. మొదలైనవి.

మిళింద కథా సంపుటిని ఎవరు రచించారు?
ఎండ్లూరి సుధాకర్‌ సతీమణి హేమలత, రచయిత్రి సామాజిక సేవకురాలు. ఆయన కుమార్తె మానస కథా రచయిత్రి. మానస రచించిన ‘మిళింద’ కథా సంపుటికి 2020లో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రముఖ కవి, సాహితీవేత్త కన్నుమూత
ఎప్పుడు : జనవరి 28
ఎవరు    : ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ (63)
ఎక్కడ    : హైదరాబాద్‌
ఎందుకు : గుండెపోటు కారణంగా..

73rd Republic Day: శౌర్యచక్ర అవార్డుకు ఎంపికైన అమర జవాను?

Shaurya Chakra

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన అమర జవాను మరుప్రోలు జస్వంత్‌ కుమార్‌ రెడ్డి(23)కి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన శౌర్యచక్ర అవార్డు ప్రకటించింది. దేశ 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును ప్రకటించారు. గుంటూరు జిల్లా, బాపట్ల మండలం, దరివాదకొత్తపాలెం గ్రామానికి చెందిన జశ్వంత్‌ రెడ్డి ఇంటర్మీడియట్‌ తరువాత చిన్న వయసులోనే భారత సైన్యంలో మద్రాస్‌ రెజిమెంట్‌లో సిపాయిగా చేరాడు. ఐదేళ్లగా ఆర్మీలో పనిచేస్తుండగా 2021, జూలై 8వ తేదీన జమ్మూకశ్మీర్‌లోని రాజోరి జిల్లా సుందర్‌బాని సెక్టార్‌లో గస్తీ విధులు నిర్వర్తిస్తూ దట్టమైన అటవీప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు గుర్తించాడు. వెంటనే తమ రెజిమెంట్‌ను అప్రమత్తం చేయడమే కాకుండా ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందాడు.

ఏపీకి రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవాపతకం
73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా విశిష్ట, ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు కేంద్రప్రభుత్వం పతకాలను ప్రకటించింది. వీటిలో ఏపీకి ఒక రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవాపతకం, పలు రాష్ట్రపతి పోలీసు ప్రతిభా పతకాలు లభించాయి. ఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ భావనా సక్సేనాకు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవాపతకం లభించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
శౌర్యచక్ర అవార్డుకు ఎంపికైన అమర జవాను?
ఎప్పుడు : జనవరి 26
ఎవరు    : మరుప్రోలు జస్వంత్‌ కుమార్‌ రెడ్డి(23, ఆంధ్రప్రదేశ్‌)
ఎందుకు : విధులు నిర్వర్తిస్తూ ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి వీరమరణం..

73rd Republic Day: పరమ విశిష్ట సేవా పతకానికి ఎంపికైన క్రీడాకారుడు?

టోక్యో ఒలింపిక్స్‌–2020లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం నీరజ్‌ చోప్రాను పరమ విశిష్ట సేవా పతకానికి ఎంపిక చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశిష్ట, ఉత్తమ సేవలందించిన మొత్తం 384 మంది రక్షణ సిబ్బందికి గ్యాలంటరీ మరియు ఇతర అవార్డులను జనవరి 25న ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డులలో 12 శౌర్య చక్ర, 29 పరమ విశిష్ట సేవా పతకాలు, నాలుగు ఉత్తమ యుద్ధ సేవా పతకాలు ఉన్నాయి.

టోక్యో ఒలింపిక్స్‌–2020 జావెలిన్‌ త్రో విభాగంలో నీరజ్‌ చోప్రా స్వర్ణ పతకం సాధించాడు. దీంతో భారత్‌కు వ్యక్తిగత విభాగంలో స్వర్ణం తెచ్చిన రెండో ఆటగాడిగా నీరజ్‌ చరిత్రలోకెక్కాడు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో షూటింగ్‌ విభాగంలో అభివన్‌ బింద్రా భారత్‌కు తొలి స్వర్ణం అందించాడు. నీరజ్‌ 2021 ఏడాదిలోనే దేశ అత్యున్నత క్రీడా పురస్కారం, మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న అవార్డును అందుకున్నాడు. ఇక ఇండియన్‌ ఆర్మీలో సుబేదార్‌గా నీరజ్‌ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
పరమ విశిష్ట సేవా పతకానికి ఎంపికైన క్రీడాకారుడు?
ఎప్పుడు : జనవరి 25
ఎవరు    : జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా 
ఎందుకు : ఆర్మీలో సుబేదార్‌గా ఉత్తమ సేవలందించిన..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 28 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 29 Jan 2022 06:16PM

Photo Stories