Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 28 కరెంట్‌ అఫైర్స్‌

Covishield, Covaxin

Covid-19 Vaccines: దేశంలో విక్రయానికి అనుమతి పొందిన వ్యాక్సిన్లు?

భారత్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ల మార్కెట్‌ విక్రయానికి అనుమతి లభించింది. బహిరంగ మార్కెట్‌లో అమ్మకానికి సంబంధించి భారత ఔషధ నియంత్రణ సంస్థ జనవరి 27న షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. ఈ రెండు టీకాలు ఇకపై సాధారణ మార్కెట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ విషయాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ తెలిపారు.

2021, జనవరిలో అత్యవసర వినియోగానికి..
2021, జనవరిలో భారత ప్రభుత్వం కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ టీకాలు అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చింది. అయితే బహిరంగ మార్కెట్‌లో విక్రాయానికి అనుమతించాలంటూ కోవాగ్జిన్‌ అభివృద్ది చేసిన భారత్‌ బయోటెక్, కోవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్‌ సంస్థలు.. 2021, అక్టోబర్‌ 25న డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కి దరఖాస్తు చేసుకున్నాయి. వీటిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ, షరతులతో కూడిన అనుమతులు ఇవ్వొచ్చని సిఫార్సు చేసింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
బహిరంగ మార్కెట్‌లో అమ్మకానికి సంబంధించి భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతులు పొందిన వ్యాక్సిన్లు
ఎప్పుడు : జనవరి 27
ఎవరు    : కోవాగ్జిన్, కోవిషీల్డ్‌
ఎక్కడ    : దేశంలో..
ఎందుకు : కోవిడ్‌–19 నియంత్రణ కోసం..

Five Central Asian Countries: మధ్య ఆసియా దేశాలతో ఉమ్మడి సదస్సును నిర్వహించిన దేశం?

India-Central Asia Summit

India-Central Asia Summit: మధ్య ఆసియా దేశాలైన కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, కిర్గిజ్‌ రిపబ్లిక్‌లతో భారత్‌ తొలి ఉమ్మడి సదస్సును వర్చువల్‌ విధానంలో నిర్వహించింది. ఈ ఐదు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలకు 30 ఏళ్లైన సందర్భంగా జనవరి 27న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉమ్మడి సదస్సును ప్రారంభించారు. సదస్సుకు నేతృత్వం వహిస్తూ మోదీ కీలక ప్రసంగం చేశారు. మధ్యఆసియా దేశాలు, భారత్‌ మధ్య సహకారం ప్రాంతీయ భద్రతకు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. అఫ్గానిస్తాన్‌లో పరిణామాల దృష్ట్యా ఈ ప్రాంతానికి భారత్‌కు మధ్య బంధం మరింత బలపడాలని కోరారు.

సదస్సులో కజకిస్తాన్‌ అధ్యక్షుడు కాసెమ్‌ జోమార్ట్‌ టొకయేవ్, ఉజ్బెకిస్తాన్‌ అధిపతి షావక్త్‌ మిర్జియోయేవ్, తజకిస్తాన్‌ నేత ఇమోమాలి రహమన్, తుర్క్‌మెనిస్తాన్‌ అధ్యక్షుడు గుర్బంగ్లీ బెర్డిముహమెదోవ్, కిర్గిజ్‌ రిపబ్లిక్‌ అధ్యక్షుడు సడేర్‌ జపరోవ్‌ పాల్గొన్నారు. సదస్సు ఏర్పాటుపై ఐదుగురు అధ్యక్షులు ప్రధానిని ప్రశంసించారు. 2015లో మోదీ ఈ దేశాల్లో పర్యటించారు. మోదీ సూచించిన ‘వన్‌ ఎర్త్‌–వన్‌ హెల్త్‌’ విధానాన్ని నేతలు స్వాగతించారు. సదస్సు అనంతరం నేతలు ‘ఢిల్లీ డిక్లరేషన్‌’ పేరిట నిర్ణయాలను వెలువరించారు.

ఢిల్లీ డిక్లరేషన్‌–ముఖ్యాంశాలు..

  • ఉగ్రవాద రహిత ప్రపంచాన్ని ఆవిష్కరించేందుకు సమగ్ర విధానంతో దాన్ని ఎదుర్కోవాలి.
  • ప్రపంచ ఆరోగ్య సవాళ్లు, మహమ్మారులకు సంబంధించి పారదర్శకమైన, వివక్షకు తావులేని, సమర్థవంతమైన అంతర్జాతీయ ప్రతిస్పందన అవసరం. తద్వారా ఔషధాలు, సంక్లిష్టమైన ఆరోగ్య వ్యవస్థలు అందరికీ దరిచేరుతాయి.
  •  అఫ్గాన్‌ విషయంలో సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలి.
  • విదేశాంగ, వాణిజ్య, సాంస్కృతిక శాఖల మధ్య చర్చలు, సంప్రదింపులను యథావిధిగా కొనసాగిస్తూనే... రెండేళ్లకోసారి దేశాధినేతలతో సదస్సు నిర్వహించాలి.

క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    :
మధ్య ఆసియా దేశాలైన కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, కిర్గిజ్‌ రిపబ్లిక్‌లతో తొలి ఉమ్మడి సదస్సును నిర్వహించిన దేశం?
ఎప్పుడు : జనవరి 27
ఎవరు    : భారత్‌
ఎక్కడ    : వర్చువల్‌ విధానం ద్వారా..
ఎందుకు : ఈ ఐదు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలకు 30 ఏళ్లైన సందర్భంగా..

Tennis Tournament: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నీలో ఫైనల్‌ చేరిన ఆసీస్‌ క్రీడాకారిణి?

Ashleigh Barty, Danielle Collins

టెన్నిస్‌ సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో 2022 ఏడాది మహిళల సింగిల్స్‌ విభాగంలో కొత్త చాంపియన్‌ అవతరించనుంది. ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), 27వ సీడ్‌ డానియల్‌ కొలిన్స్‌ (అమెరికా) తొలిసారి ఈ మెగా టోర్నీలో ఫైనల్‌కు అర్హత సాధించారు. మెల్‌బోర్న్‌ వేదికగా జనవరి 27న జరిగిన సెమీఫైనల్స్‌లో యాష్లే బార్టీ 62 నిమిషాల్లో 6–1, 6–3తో అన్‌సీడెడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా)పై... కొలిన్స్‌ 78 నిమిషాల్లో 6–4, 6–1తో ఏడో సీడ్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌)పై విజయం సాధించారు. జనవరి 29న జరిగే ఫైనల్లో బార్టీతో కొలిన్స్‌ తలపడనుంది. బార్టీకిది మూడో గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ కాగా... 28 ఏళ్ల కొలిన్స్‌ తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో టైటిల్‌ పోరుకు చేరింది. 25 ఏళ్ల బార్టీ 2019లో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో, 2021లో వింబుల్డన్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచింది.

42 ఏళ్ల తర్వాత..
తాజా విజయంతో 42 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ విభాగంలో ఫైనల్‌ చేరిన ఆసీస్‌ ప్లేయర్‌గా యాష్లే బార్టీ గుర్తింపు పొందింది. 1980లో చివరిసారిగా వెండీ టర్న్‌బుల్‌ రూపంలో ఆసీస్‌ మహిళా క్రీడాకారిణి ఈ మెగా టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది.
క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    :
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌–2022 మహిళల సింగిల్స్‌ విభాగంలో ఫైనల్‌ చేరిన ఆసీస్‌ ప్లేయర్‌?
ఎప్పుడు : జనవరి 27
ఎవరు    : యాష్లే బార్టీ
ఎక్కడ    : మెల్‌బోర్న్‌
ఎందుకు : సెమీఫైనల్స్‌లో యాష్లే బార్టీ 62 నిమిషాల్లో 6–1, 6–3తో అన్‌సీడెడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా)పై విజయం సాధించినందున..

Hockey Captain: అనారోగ్యంతో కన్నుమూసిన భారత హాకీ దిగ్గజం?

Charanjit Singh - Hockey

భారత హాకీ మాజీ ఆటగాడు, 1964 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన జట్టు కెప్టెన్‌ చరణ్‌జిత్‌ సింగ్‌(90) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా జనవరి 27న హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రం, ఉనా జిల్లా, ఉనాలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1964 ఒలింపిక్స్‌ ఫైనల్లో భారత్‌ 1–0తో పాక్‌ను ఓడించి బంగారు పతకం గెలుచుకుంది. 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లోనే రజత పతకం సాధించిన జట్టులో సభ్యుడైన చరణ్‌జిత్‌... 1962లో ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన టీమ్‌లోనూ ఉన్నారు.

ఇషా సింగ్‌ ఏ క్రీడలో ప్రావీణ్యం కలిగి ఉంది?
2022, ఫిబ్రవరిలో ఈజిప్టు రాజధాని నగరం కైరో వేదికగా జరిగే ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. హైదరాబాద్‌ యువ షూటర్‌ ఇషా సింగ్‌ 25 మీటర్ల స్పోర్ట్స్‌ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగాలలో... 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. జాతీయ చాంపియన్‌షిప్‌లో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా జట్టును ఎంపిక చేశారు.
క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    :
భారత హాకీ మాజీ ఆటగాడు కన్నుమూత
ఎప్పుడు : జనవరి 27
ఎవరు    : చరణ్‌జిత్‌ సింగ్‌(90)
ఎక్కడ    : ఉనా, ఉనా జిల్లా, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రం
ఎందుకు : అనారోగ్యం కారణంగా..

Air India Takeover: ఎయిరిండియా సొంతం చేసుకున్న సంస్థ?

తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయిన ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియాను పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్‌ సొంతం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎయిరిండియాను టాటా గ్రూపునకు జనవరి 27న అప్పగించింది. టాటాలు ప్రారంభించిన ఎయిరిండియాను 1953లో కేంద్రం జాతీయం చేసింది. 69 ఏళ్ల తర్వాత ఎయిరిండియా మళ్లీ మాతృ సంస్థ నిర్వహణలోకి వచ్చింది. ఢిల్లీలోని ఎయిరిండియా కేంద్ర కార్యాలయంలో కంపెనీ అప్పగింత కార్యక్రమాలు పూర్తయ్యాయి. టాటా గ్రూప్‌ గూటిలో ఇది మూడో విమానయాన సంస్థకాగా.. ఇప్పటికే భాగస్వామ్యంలో.. విస్తారా, ఎయిరేషియాలను నిర్వహిస్తున్న విషయం విదితమే.

ఇదే తొలి ఎయిర్‌లైన్స్‌..

టాటా గ్రూపు వ్యవస్థాపకుడైన జహంగీర్‌ రతన్‌జీ దాదాబాయ్‌ (జేఆర్‌డీ) టాటా 1932లో ‘టాటా ఎయిర్‌లైన్స్‌’ను ప్రారంభించారు. దేశంలో ఇదే తొలి ఎయిర్‌లైన్స్‌. కరాచి, ముంబై మధ్య సర్వీసులు నడిపించింది. తర్వాత జరిగిన పరిణామాలు ఇవి..

  • 1946: టాటాసన్స్‌ ఏవియేషన్‌ విభాగాన్ని ‘ఎయిరిండియా’గా మార్చారు.
  • 1948: ఎయిరిండియా ఇంటర్నేషనల్‌ను ప్రారంభించడం ద్వారా యూరోప్‌కు సర్వీసులు మొదలుపెట్టింది. ఎయిరిండియా ఇంటర్నేషనల్‌ అన్నది ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైంది. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం, టాటా సన్స్‌కు 25 శాతం ఉంటే, మిగిలినది ప్రభుత్వ వాటాకు కేటాయించారు. 
  • 1953: ఎయిరిండియా టాటాల చేతి నుంచి జాతికి అంకితమైంది. ప్రభుత్వం జాతీయం చేసింది. ఇక అప్పటి నుంచి దేశంలో ఏకైక సంస్థగా ఎయిరిండియా సాగిపోయింది.
  • 1994–95: ఏవియేషన్‌ రంగంలోకి ప్రైవేటు సంస్థలను అనుమతించే నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. మార్కెట్‌ వాటా కోసం ప్రైవేటు సంస్థలు చౌక ధరలకు మొగ్గుచూపడంతో, ఎయిరిండియా మార్కెట్‌ వాటాను కోల్పోతూ వచ్చింది.
  • 2017 జూన్‌: ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థల్లో వాటాల ఉపసంహరణకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. 
  • 2018 మార్చి: ఎయిరిండియాలో 76 శాతం వాటా కొనుగోలుకు ఆసక్తి కలిగిన వారి నుంచి కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. కానీ ఒక్క బిడ్‌ కూడా రాలేదు.
  • 2020 జనవరి: మరో విడత ప్రభుత్వం ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణ యత్నాలను తెరపైకి తీసుకొచ్చింది. ఈ విడత నూరు శాతం వాటా విక్రయ ప్రతిపాదన చేసింది. 
  •  2019 మార్చి నాటికి సంస్థ అప్పుల భారం రూ.60,074 కోట్లుగా ఉంది.
  • 2021 ఏప్రిల్‌: ఎయిరిండియాకు ఆర్థిక బిడ్లను ఆహ్వానించారు. సెప్టెంబర్‌ 15 చివరి తేదీ.
  • 2021 సెప్టెంబర్‌: టాటా గ్రూపు, స్పైస్‌జెట్‌ ప్రమోటర్‌ అజయ్‌ సింగ్‌ నుంచి బిడ్లు వచ్చాయి.
  • 2021 అక్టోబర్‌ 8: రూ.18,000 కోట్లకు ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూపు బిడ్‌ విజేతగా నిలిచినట్టు కేంద్రం ప్రకటించింది.
  • 2021 అక్టోబర్‌ 25: టాటాగ్రూపు, ప్రభుత్వం మధ్య వాటాల కొనుగోలు ఒప్పందం జరిగింది.
  • 2021 జనవరి 27: ఎయిరిండియా యాజమాన్యం టాటా గ్రూపు వశమైంది.

క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    :
ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియాను సొంతం చేసుకున్న సంస్థ?
ఎప్పుడు  : జనవరి 27    
ఎవరు    : పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్‌
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా..

Andhra Pradesh: ప్రభుత్వం ప్రారంభించిన ఏపీ సేవ 2.0 పోర్టల్‌ ఉద్దేశం?

AP Seva Portal 2.0

గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను మరింత మెరుగు పరుస్తూ ప్రజలకు వేగంగా సేవలందించేందుకు ఉద్దేశించిన ‘‘ఏపీ సేవ 2.0 పోర్టల్‌’’(ఏపీ సిటిజన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌)ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. జనవరి 27న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. అనంతరం సీఎం ప్రసంగిస్తూ.. ఇవాళ ప్రారంభించిన సిటిజన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ (సీఎస్‌పీ)ను పలకడానికి అనువుగా ఏపీ సేవ అంటున్నామని చెప్పారు. దీని వల్ల మారుమూల గ్రామాల్లో కూడా వేగంగా, పారదర్శకంగా, జవాబుదారీతనం పెంచే విధంగా.. మనకున్న వ్యవస్థను మెరుగు పరుస్తున్నామన్నారు.

సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

  • కొత్త సాఫ్ట్‌వేర్‌ ద్వారా అందించే విస్తృత సేవల వల్ల ప్రజలు తమకు అవసరమైన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. పారదర్శకత పెరిగి అవినీతి దూరం అవుతుంది.
  • ప్రజలు వారి దరఖాస్తును ట్రాక్‌ చేసుకునే (ఏ దశలో ఉందో చూసుకునే) వెసులుబాటు ఉంటుంది. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం సాధ్యపడుతుంది.
  • ఏపీ సేవ పోర్టల్‌ ద్వారా రెవిన్యూ, భూ పరిపాలనకు సంబంధించిన దాదాపు 35 రకాల సేవలను కూడా తీసుకు వచ్చాం.
  • దరఖాస్తుదారుడు తమ సమీపంలోని సచివాలయంలోనే కాకుండా.. ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఒకచోట దరఖాస్తు చేస్తే.. వేరే చోట నుంచి కూడా సర్టిఫికెట్‌ పొందవచ్చు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఏపీ సేవ 2.0 పోర్టల్‌(ఏపీ సిటిజన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌) ప్రారంభం
ఎప్పుడు : జనవరి 27
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 
ఎక్కడ    : సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు జిల్లా
ఎందుకు : గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను మరింత మెరుగు పరుస్తూ ప్రజలకు వేగంగా సేవలందించేందుకు..

Andhra Pradesh: రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో నోవా ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటైంది?

Oxgen plant in sir city

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, తిరుపతి సమీపంలోని శ్రీ సిటీలో నోవా ఎయిర్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో రూ.130 కోట్ల పెట్టుబడితో మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటైంది. ఈ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జనవరి 27న తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో మెడికల్‌ ఆక్సిజన్‌కు లోటులేకుండా చూసే చర్యల్లో భాగంగా ఈ ప్లాంట్‌ ఏర్పాటైంది. ప్లాంట్‌ ఏర్పాటు కోసం నోవా ఎయిర్‌తో రాష్ట్ర ప్రభుత్వం 2020 జనవరి 24న ఏంఓయూ చేసుకున్న విషయం విదితమే. రోజుకు 220 టన్నుల ఆక్సిజన్‌ తయారీ సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్‌లో మెడికల్‌ ఆక్సిజన్, లిక్విడ్‌ ఆక్సిజన్, లిక్విడ్‌ నైట్రోజన్, లిక్విడ్‌ ఆర్గా్గన్‌ వాయువులు తయారవుతాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఎయిర్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ ప్రారంభం   
ఎప్పుడు : జనవరి 27
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 
ఎక్కడ    : శ్రీ సిటీ, తిరుపతి సమీపం, చిత్తూరు జిల్లా,  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం
ఎందుకు  : కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో మెడికల్‌ ఆక్సిజన్‌కు లోటులేకుండా చూసే చర్యల్లో భాగంగా..

Cartoonist and Poet: బుజ్జాయి అనే కలం పేరుతో ప్రసిద్ధి చెందిన రచయిత?

Bujjayi

చిట్టిపొట్టి బొమ్మలు, బాలల కథల సంపుటితో బుజ్జాయిగా బహుళ ప్రాచుర్యం పొందిన ప్రముఖ కార్టూనిస్టు, చిన్నపిల్లల కథారచయిత దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి(90) కన్నుమూశారు. వయోభారంతో జనవరి 27న చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురంలో ప్రముఖ రచయిత, కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి, రాజహంస దంపతులకు 1931 సెప్టెంబర్‌ 11న ఆయన జన్మించారు. బుజ్జాయి అనే కలంపేరుతో ఫ్రీలాన్స్‌ కార్టూనిస్టుగా, చిన్నపిల్లల కథారచయితగా ప్రసిద్ధి చెందారు. ఆయన బొమ్మల కథల్లో ‘డుంబు’ చిన్నారులను బాగా అలరించింది. అలాగే ‘పంచతంత్ర’ ధారావాహిక కథలు ‘ది ఇలస్ట్రేటెడ్‌ వీక్లీ’లో 1963–68 వరకు ప్రచురితమయ్యాయి. గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం కథానికను బొమ్మలద్వారా పాఠకులకు పరిచయం చేశారు. భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆయన పలు రచనలకు అవార్డులు అందించాయి.

కేంద్ర న్యాయమంత్రిగా ఎవరు ఉన్నారు?
ఇటీవల అదృశ్యమైన అరుణాచల్‌ప్రదేశ్‌ యువకుడు మిరమ్‌ తరోన్‌ను భారతీయ సైనికులకు చైనా ఆర్మీ (పీఎల్‌ఏ) అప్పగించిందని కేంద్ర న్యాయమంత్రి కిరణ్‌ రిజుజు జనవరి 27న ప్రకటించారు. అరుణాచల్‌లోని వాచా– దమాయ్‌ సరిహద్దు ప్రాంతం వద్ద తరోన్‌ను అప్పగించారన్నారు. 2022, జనవరి 18న తరోన్‌ చైనా భూభాగంలోకి వెళ్లి అదృశ్యమయ్యాడు. అతన్ని వెతికి అప్పగించాలని పీఎల్‌ఏను భారత ఆర్మీ కోరింది.

తూర్పు సముద్రంలో క్షిపణుల ప్రయోగం చేసిన దేశం? 
ఉత్తర కొరియా మరోసారి రెండు బాలిస్టిక్‌ మిసైళ్లను తూర్పు సముద్రంలోకి ప్రయోగించింది. దీంతో ఈ నెలలో ఆ దేశం చేపట్టిన ప్రయోగాల సంఖ్య ఆరుకు చేరుకుందని దక్షిణ కొరియా మిలటరీ వెల్లడించింది. ఉత్తర కొరియాలోని హామ్‌హంగ్‌ టౌన్‌ నుంచి జనవరి 27న ఈ ప్రయోగాలు జరిగాయని పేర్కొంది. అమెరికాతో ఆగిపోయిన అణ్వస్త్ర దౌత్య చర్చలు మళ్లీ జరిగేలా, తమపై విధించిన ఆంక్షలను ఎత్తేసేలా ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతో ఉత్తర కొరియా ఇలా ప్రయోగాలు చేస్తోందని అంచనా. 2016 నుంచి అంతర్జాతీయ ఆంక్షలు కొనసాగుతుండటంతో ఉత్తర కొరియా ప్రధాన ఎగుమతి కార్యకలాపాలు చాలా వరకు ఆగిపోయాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
బుజ్జాయిగా బహుళ ప్రాచుర్యం పొందిన ప్రముఖ కార్టూనిస్టు, చిన్నపిల్లల కథారచయిత కన్నుమూత
ఎప్పుడు : జనవరి 27
ఎవరు    : దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి(90)
ఎక్కడ    : చెన్నై, తమిళనాడు
ఎందుకు : వయోభారం కారణంగా..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2022, జ‌న‌వ‌రి 27 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 28 Jan 2022 05:43PM

Photo Stories