Daily Current Affairs in Telugu: 2022, జనవరి 27 కరెంట్ అఫైర్స్
PETA India: హీరో టు యానిమల్స్ అవార్డుకు ఎంపికైన చిరు వ్యాపారి?
గుజరాత్‌కు చెందిన చిరుతిండ్లు అమ్ముకునే చేతన్ పటేల్‌కు పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ ఎనిమల్స్ ఇండియా(పెటా ఇండియా).. హీరో టు యానిమల్స్ అవార్డును ప్రకటించింది. చిన్న వ్యాపారైనా పెద్ద మనసుతో పక్షుల సంరక్షణకు చేతన్ కృషి చేశాడని కొనియాడింది. సూరత్‌లోని వేసు ప్రాంతంలో చిరుతిండ్లు అమ్మే చేతన్.. గాలిపటాల్లో వాడే మాంజా(నైలాన్ దారం) కారణంగా పక్షుల ప్రాణాలు పోతున్నాయని పలువురికి నచ్చజెప్పేవారు. అంతేకాకుండా ఉత్తరాయణ పండుగ అనంతరం బజార్లో పడేసిన కిలో మంజాను ఎవరు తెచ్చిఇచ్చినా వారికి కిలో చిరుతిండి ఫ్రీగా ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. దీంతో రోడ్లపై అడ్డదిడ్డంగా ఈ దారాలు పడిపోకుండా పక్షులకు ఇబ్బంది కలగకుండా చేతన్ యత్నించారని పెటా తెలిపింది. ఈ మేరకు చేతన్‌కు సర్టిఫికెట్‌ను అందించింది. మంజా దారం చాలా పదునుగా ఉంటుంది. దీనివల్ల పక్షుల కాళ్లు, రెక్కలు తెగిపోతూఉంటాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పెటా ఇండియా హీరో టు యానిమల్స్ అవార్డుకు ఎంపికైన చిరు వ్యాపారి?
ఎప్పుడు : జనవరి 26
ఎవరు : గుజరాత్‌లోని సూరత్‌కి చెందిన చేతన్ పటేల్
ఎందుకు : గాలిపటాల్లో వాడే మాంజా(నైలాన్ దారం) కారణంగా పక్షులకు ఇబ్బంది కలగకుండా ప్రయత్నించినందుకు..
Republic Day 2022: అశోక చక్ర అవార్డును ఎవరికి ప్రదానం చేశారు?
జమ్ము, కశ్మీర్‌కు చెందిన పోలీసు అధికారి బాబూరామ్ మరణానంతరం అశోక చక్ర అవార్డుకు ఎంపికయ్యారు. న్యూఢిల్లీలో జరిగిన 73వ గణతంత్ర వేడుకల్లో ఆయన భార్య రీనారాణి, కుమారుడు మాణిక్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అవార్డును అందజేశారు. జమ్మూలోని పూంఛ్ జిల్లాకు చెందిన బాబూ రామ్ 1999లో పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా చేరారు. 2002 శ్రీనగర్‌లో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్‌లో బాధ్యతలు చేపట్టి, 14 ఎన్‌కౌంటర్లలో పాల్గొని 28 మంది ఉగ్రవాదులను అంతమొందించడంలో కీలకంగా ఉన్నారు.
2020 ఆగస్టులో..
2020 ఆగస్టు నెలలో శ్రీనగర్‌లో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో అసిస్టెంట్ సబ్ ఇనస్పెక్టర్ బాబూరామ్ అమరుడయ్యారు. ఆరోజు ఆయన చాకచక్యంగా వ్యవహరించి ఉగ్రవాదులున్న ఇంటిపక్క పౌరులను కాపాడారు. అనంతరం ధైర్యంగా ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నించి ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందారు. ఈ సాహసానికి ఆయనకు మరణానంతరం అత్యున్నత గాలెంటరీ పురస్కారాల్లో ఒకటైన అశోక చక్ర దక్కింది. కాగా, శౌర్యచక్ర అవార్డు మరణానంతరం సుబేదార్ శ్రీజిత్, హవల్దార్ అనిల్ కుమార్, కాశీరాయ్, పింకు కుమార్, జశ్వంత్ కుమార్ రెడ్డికి దక్కింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జమ్ము, కశ్మీర్‌కు చెందిన పోలీసు అధికారి బాబూరామ్‌కు మరణానంతరం అశోక చక్ర అవార్డు ప్రదానం
ఎప్పుడు : జనవరి 26
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : న్యూఢిల్లీలో జరిగిన 73వ గణతంత్ర వేడుకల్లో..
ఎందుకు : ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ సందర్భంగా చేసిన సాహసానికి..
Republic Day 2022 Highlights: భారత 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
భారతదేశ 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26న దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో ప్రతీ ఏడాది మాదిరిగా ఆర్భాటంగా సంబరాలు నిర్వహించలేదు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, దేశ సామాజిక, ఆర్థిక పురోగతి, మన సైనిక సత్తాని ప్రపంచానికి చాటి చెప్పే విన్యాసాలతో రాజ్‌పథ్‌లో నిర్వహించిన పెరేడ్ దేశానికే గర్వకారణంగా నిలిచింది.
ముఖ్యఅతిథి లేకుండానే..
73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కోవిడ్–19 ముప్పుతో విదేశీ ముఖ్య అతిథి లేకుండానే నిర్వహించారు. గతంలో 1952, 1953, 1966, 2021 సంవత్సరాలలో ముఖ్య అతిథి లేకుండా గణతంత్ర వేడుకలు జరిగాయి. కరోనా నేపథ్యంలో వీక్షకుల సంఖ్యను కూడా పరిమితం చేశారు. అయితే ఫ్రంట్‌లైన్ వర్కర్లు, ఆటోడ్రైవర్లు, నిర్మాణ కార్మికులను ప్రత్యేక అతిధులుగా గౌరవించారు.
విశేషాలు..
- గణతంత్ర వేడకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్‌కు పత్య్రేకమైన టోపీ ధరించారు. దీనిపై ఆ రాష్ట్ర పుష్పం బ్రహ్మకమలం చిత్రీకరించారు. అలాగే మణిపూర్ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా శాలువా ధరించారు.
- పెరేడ్‌లో ఎన్‌సీసీ కేడెట్లు షహీదోం కో శత్ శత్ నమాన్ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయా రాష్ట్రాలకు చెందిన శకటాల ప్రదర్శన జరిగింది.
- పెరేడ్‌లో బీఎస్‌ఎఫ్‌కు చెందిన మహిళా జవాన్లతో కూడిన సీమా భవానీ మోటర్‌సైకిల్ టీమ్ చేసిన విన్యాసాలు వీక్షకులను మంత్రముగ్దులను చేశాయి.
- కేంద్ర ప్రజాపనుల శాఖ నేతాజీ 125వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయనకు నివాళినర్పిస్తూ శకటాన్ని ప్రదర్శించింది. ఈ ఏడాది కొత్తగా లోక్ అదాలత్ శకటం పెరేడ్‌లో అడుగుపెట్టింది.
- ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భారతీయులు 73వ గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బ్రిటన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ సహా పలు దేశాధినేతలు ఈ సందర్భంగా భారత్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
- భారత 73వ గణతంత్ర సంబరాలు అన్ని రాష్ట్రాల్లో అంబరాన్నంటాయి.
- కాశ్మీర్‌లో ప్రఖ్యాత లాల్‌చౌక్ క్లాక్ టవర్‌పై మువ్వన్నెల జెండాను ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు సాజిద్ యూసుఫ్, సాహిల్ బషీర్ పాల్గొన్నారు. ఈ క్లాక్ టవర్‌పై గత 30 ఏళ్లలో త్రివర్ణ పతాకం ఎగరడం ఇదే తొలిసారి.
Republic Day 2022: చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ కమాండేషన్ పురస్కారాన్ని పొందిన తొలి గుర్రం?
భారత రాష్ట్రపతి అంగరక్షక దళంలో సేవలందించిన నల్ల గుర్రం ‘‘విరాట్’’ భారత 73వ గణతంత్ర దినోత్సవం రోజున రిటైర్మెంట్ తీసుకుంది. జనవరి 26న న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. విరాట్‌కు ఘనంగా వీడ్కోలు జరిపారు. ఇది ఇప్పటికి 13 సార్లు గణతంత్ర దినోత్సవ పరేడ్‌లలో పాల్గొంది. వయసు మీద పడటంతో ఇప్పుడు దీని సేవలకు ముగింపు పలికారు. విశేష సేవలందించిన విరాట్‌కు జనవరి 15న ఆర్మీ డే సందర్భంగా ‘చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ కమాండేషన్’ పురస్కారాన్ని ప్రకటించారు. విశిష్ట సేవలు, సామర్థ్యాలతో ఈ గౌరవాన్ని పొందిన తొలి అశ్వం ఇదే.
ప్రెసిడెంట్ బాడీగార్డ్ ఛార్జర్..
హనోవేరియన్ జాతికి చెందిన ఈ గుర్రాన్ని 2003లో రాష్ట్రపతి అంగరక్షక దళంలో చేర్చారు. దీన్ని ప్రెసిడెంట్ బాడీగార్డ్ ఛార్జర్ అని కూడా పిలుస్తారు. గణతంత్ర పెరేడ్‌లో అత్యంత నమ్మకంగా వ్యవహరించే గుర్రంగా దీనికి పేరుంది. వయసు మీద పడినా, 2021లో గణతంత్ర దినోత్సవ వేడుక, బీటింగ్ ది రిట్రీట్ వేడుకలో విరాట్ మంచి పనితీరు కనబరిచింది. భారత సైన్యంలో రాష్ట్రపతి అంగరక్షక దళానికి ప్రముఖ స్థానం ఉంది. వేల గుర్రాల సమూహం నుంచి మంచి ఎత్తు, వారసత్వం ఉన్న వాటిని ఇందుకోసం ఎంపిక చేస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రిటైర్మెంట్ తీసుకున్న భారత రాష్ట్రపతి అంగరక్షక దళంలోని గుర్రం
ఎప్పుడు : జనవరి 26
ఎవరు : విరాట్
ఎక్కడ : న్యూఢిల్లీలో జరిగిన 73వ గణతంత్ర వేడుకల్లో..
ఎందుకు : వయసు మీద పడటంతో..
World's Oldest Fish: అత్యంత వయసైన అక్వేరియం చేప పేరు?
భూమ్మీది అక్వేరియంలన్నింటిలోకెల్లా అత్యంత వయసున్న చేప ‘‘మెథుసెలా’’. శాన్‌ఫ్రాన్సిస్కోని మ్యూజియంలో ఉన్న అక్వేరియంలో ఇది జీవిస్తోంది. దీని వయసు దాదాపు 90 ఏళ్లని కాలిఫోర్నియా అకాడమీ ఆఫ్ సైన్సెస్ బయాలజిస్టులు తెలిపారు. నాలుగడుగుల పొడవు, 40 పౌండ్ల బరవుండే ఈ చేపను శాన్‌ఫ్రాన్సిస్కో మ్యూజియంకు 1938లో ఆస్ట్రేలియా నుంచి తెచ్చారు. అప్పటికి దీని వయసు ఆరేళ్లని ఓ అంచనా. ఆస్ట్లేలియన్ లంగ్ ఫిష్ జాతికి చెందిన ఈ చేప ఉభయచరాలకు, చేపలకు మధ్య వారధిలాంటిది. దీని గురించి 1947లోనే మీడియాలో కథనాలు వచ్చాయి. దీనికన్నా వృద్ధురాలు గ్రాండ్ డాడ్ అనే చేప 95ఏళ్ల వయసులో 2017లో మరణించింది. దీంతో ప్రస్తుతం అత్యంత వయసైన అక్వేరియం చేప హోదా దీనికి దక్కింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భూమ్మీది అక్వేరియంలన్నింటిలోకెల్లా అత్యంత వయసున్న చేప?
ఎప్పుడు : జనవరి 26
ఎవరు : మెథుసెలా
ఎక్కడ : శాన్‌ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, అమెరికా
Brand Finance: ఐటీ రంగంలో రెండో అత్యంత విలువైన కంపెనీ ఏది?
అంతర్జాతీయంగా ఐటీ రంగంలో రెండో అత్యంత విలువైన కంపెనీగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) అవతరించింది. అలాగే టాప్–25 కంపెనీల్లో ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్ (ఎల్‌టీఐ)కు చోటు దక్కింది. జనవరి 26న బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
నివేదికలోని ముఖ్యాంశాలు..
- 36.2 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో యాక్సెంచర్ మొదటి స్థానాన్ని కాపాడుకుంది.
- ఐబీఎం నాలుగో స్థానానికి పడిపోయింది.
- వార్షికంగా టీసీఎస్ బ్రాండ్ విలువ 12 శాతం పెరిగింది. 2020 నుంచి చూస్తే 24 శాతం వృద్ధితో 16.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
- టీసీఎస్ మొదటిసారి 25 బిలియన్ డాలర్ల ఆదాయ స్థాయికి చేరకుంది.
- ఇన్ఫోసిస్ మూడో స్థానంలో ఉంటే, విప్రో 7వ స్థానం, హెచ్‌సీఎల్ టెక్ 8, టెక్ మహీంద్రా 15, ఎల్‌టీఐ 22వ స్థానాల్లో ఉన్నాయి.
- ఇన్ఫోసిస్ బ్రాండ్ విలువ గత ఏడాది కాలంలో 52 శాతం పెరగ్గా, 2020 నుంచి 80 శాతం పెరిగి 12.8 బిలియన్ డాలర్లకు చేరింది.
- విప్రో బ్రాండ్ విలువ 6.3 బిలియన్ డాలర్లుగా ఉంది. గడిచిన ఏడాది కాలంలో 48 శాతం పెరిగింది.
- హెచ్‌సీఎల్ టెక్ బ్రాండ్ విలువ 10 శాతం వృద్ధితో 6.1 బిలియన్ డాలర్లుగా ఉంది.
- టెక్ మహీంద్రా బ్రాండ్ విలువ గడిచిన రెండేళ్లలో 45 శాతం వృద్ధితో 3 బిలియన్ డాలర్లకు చేరింది.
- భారత ఐటీ బ్రాండ్లు 2020–22 మధ్య 51 శాతం వృద్ధిని నమోదు చేస్తాయని బ్రాండ్ ఫైనాన్స్ అంచనా.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఐటీ రంగంలో రెండో అత్యంత విలువైన కంపెనీ ఏది?
ఎప్పుడు : జనవరి 26
ఎవరు : టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)
ఎక్కడ : ప్రపంచంలో..
Telugu Poet: శ్రీ విరించి అనే కలం పేరుతో రచనలు చేసిన రచయిత?
శ్రీ విరించి అనే కలం పేరుతో అనేక రచనలు చేసిన ప్రముఖ కథా రచయిత డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల రామానుజాచారి (87) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా జనవరి 26న చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1935లో విజయవాడలో జన్మించిన రామానుజాచారి రాజనీతి శాస్త్రంలో ఎంఏ, పారిశ్రామిక వాణిజ్య చట్టాలలో బీఎల్‌తో పాటు డాక్టరేట్ కూడా చేశారు. తులనాత్మక తత్వశాస్త్రంలోనూ పట్టభద్రులు.
థియోసాఫికల్ సొసైటీలో సేవలు..
- రామానుజాచారి 1958 నుంచి థియోసాఫికల్ సొసైటీలో సభ్యులుగా ఉన్నారు. చెన్నై సమీపం అడయార్‌లోని సంస్థ ప్రపంచ ప్రధాన కార్యాలయంలో అనేక హోదాలలో బాధ్యతలు నిర్వర్తించారు.
- తెలుగు, ఇంగ్లిష్‌లో అనేక కథలు రాశారు. తెలుగులో 100, ఇంగ్లిష్‌లో 50కిపైగా విమర్శనాత్మక వ్యాసాలు రాశారు. వందలాది గ్రంథ సమీక్షలు చేశారు.
- కేంద్ర సాహిత్య అకాడమీకి, నేషనల్ బుక్‌ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు అనువాదకులు.
- మధ్యమావతి, కొత్తనక్షత్రం (1982), అర్థం, కారనిæ కన్నీరు, మెట్లులేని నిచ్చెన (1995), కనకపు గట్టు (1997); గంధపు చుక్క (2000) వంటి పలు కథా సంపుటాలు వెలువరించారు.
- ఇంగ్లిష్‌లో అవేకనింగ్ టూ ట్రూత్, సీక్రెట్స్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్, ద ట్రూ పాత్ ఆఫ్ థియోసాఫీ, వర్డ్స్ ఆఫ్ విజ్‌డమ్ తదితర రచనలు చేశారు. సముద్ర శిఖర్ అనే హిందీ రచన కూడా చేశారు.
- తెలుగు యూనివర్శిటీ అవార్డు, డాక్టర్ దాశరథి రంగాచార్య, శ్రీమతి కమలా సాహిత్య పురస్కారం (2004) వంటి పలు పురస్కారాలను అందుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : శ్రీ విరించి అనే కలం పేరుతో అనేక రచనలు చేసిన ప్రముఖ కథా రచయిత కన్నుమూత
ఎప్పుడు : జనవరి 26
ఎవరు : డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల రామానుజాచారి (87)
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : గుండెపోటు కారణంగా..
Andhra Pradesh: వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ మహిళల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జనవరి 25న తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ పథకాన్ని ప్రారంభించారు. కంప్యూటర్ బటన్ నొక్కి 3,92,674 మంది అర్హులైన అగ్రవర్ణ పేద మహిళల ఖాతాల్లో రూ.589 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేరుగా జమ చేశారు. ఈబీసీ నేస్తం పథకం ద్వారా బ్రాహ్మణ, వెలమ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, ముస్లిం ఇతర అగ్రవర్ణ పేద మహిళలందరికీ ఏటా రూ.15 వేల చొప్పున వచ్చే మూడేళ్లలో రూ.45 వేలు అందించనున్నారు. 45 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న మహిళలకు పథకం వర్తిస్తుంది. మహిళల ఆర్ధిక సాధికారిత, ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు ఈబీసీ నేస్తం దోహదం చేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు.
ఆదిలాబాద్‌లో ఐటీ టవర్, టైక్స్‌టైల్ పార్క్..
ఆదిలాబాద్‌లో త్వరలో ఐటీ టవర్‌తోపాటు టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామరావు అన్నారు. ఎన్‌డీబీఎస్ ఇండియా ఎండీ, సంజీవ్ దేశ్‌పాండే ఐటీ టవర్ ఏర్పాటుకు ముందుకు వచ్చారని జనవరి 26న వెల్లడించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
ఎప్పుడు : జనవరి 26
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు జిల్లా
ఎందుకు : బ్రాహ్మణ, వెలమ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, ముస్లిం ఇతర అగ్రవర్ణ పేద మహిళల ఆర్ధిక సాధికారిత కోసం..
చదవండి: Daily Current Affairs in Telugu: 2022, జనవరి 26 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్