Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 25 కరెంట్‌ అఫైర్స్‌

DA-CAs-Feb-25

Andhra Pradesh: ఏపీపీఎస్సీ నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అధికారి?

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నూతన చైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్‌ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసుగా(డీజీపీ) సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి దామోదర్‌ గౌతమ్‌ సవాంగ్‌ ఫిబ్రవరి 24న బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాల యంలోని ఆయన చాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తొలిసారిగా కమిషన్‌ సభ్యులతో సమా వేశమై పలు అంశాలపై చర్చించారు. ఐపీఎస్‌ 1986 బ్యాచ్‌కు చెందిన సవాంగ్‌ ఏఎస్పీగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఏఎస్పీ, ఎస్పీగా పనిచేశారు. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌లో వెస్ట్‌ జోన్‌ ట్రాఫిక్‌ డీసీపీగా సేవలందించిన ఆయన 2000లో డీఐజీగా పదోన్నతి పొంది వరంగల్, కరీంనగర్‌ రేంజ్‌ల్లో పనిచేశారు. 2005 నుంచి 2008 వరకు సీఆర్‌పీఎఫ్‌ డీఐజీగా కేంద్ర సర్వీసుకు వెళ్లారు. అంతర్రాష్ట్ర ఆపరేషన్‌లో భాగంగా వామపక్ష తీవ్రవాదాన్ని నియంత్రించేందుకు జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఏపీలో పనిచేశారు.

ఐక్యరాజ్యసమితి తరపున..
అస్సాంకు చెందిన సవాంగ్‌ 2008 నుంచి 2012 వరకు ఐక్యరాజ్యసమితి తరపున లైబిరియాలో పోలీస్‌ కమిషనర్‌గా పనిచేశారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత ఏడీజీగా పదోన్నతి పొంది ఏపీఎస్పీలో పనిచేశారు. తర్వాత 2015 నుంచి విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌గా పనిచేశారు. 2016 జూన్‌లో డీజీగా పదోన్నతి పొందారు. అనంతరం 2019 ఏడాదిలో ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. 2022, డిసెంబర్‌ 15న డీజీపీ పోస్టు నుంచి బదిలీ అయ్యారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌(ఏపీపీఎస్సీ) నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్‌ అధికారి?
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసుగా(డీజీపీ) దామోదర్‌ గౌతమ్‌ సవాంగ్‌
ఎక్కడ    : విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు..

BioAsia 2022: బయో ఆసియా 19వ వార్షిక సదస్సు థీమ్‌ ఏమిటి?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘‘బయో ఆసియా’’ 19వ వార్షిక సదస్సు(బయో ఆసియా–2022) ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. హైదరాబాద్‌ వేదికగా ఫిబ్రవరి 25వ తేదీ వరకు వర్చువల్‌ పద్ధతిలో జరిగే ఈ సదస్సును తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. ఈ సదస్సులో 70కి పైగా దేశాల నుంచి సుమారు 30 వేలకు పైగా ప్రతినిధులతోపాటు పలువురు నోబెల్‌ గ్రహీతలు కూడా పాల్గొంటున్నారు. మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ సదస్సులో పాల్గొని మంత్రి కేటీఆర్‌తో చర్చలు జరిపారు.

ఫ్యూచర్‌ రెడీ..
‘ఫ్యూచర్‌ రెడీ’ నినాదంతో జరుగుతున్న బయో ఆసియా–2022 సదస్సు.. లైఫ్‌ సైన్సెస్‌ రంగం ప్రస్తుత స్థితిగతులతో పాటు భవిష్యత్‌ అవకాశాలపై చర్చిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫార్మా, బయోటెక్‌ కంపెనీలు, బయోటెక్‌ స్టార్టప్‌లు, విధాన నిర్ణేతలు తదితరులు లైఫ్‌సైన్సెస్‌ రంగానికి సంబంధించిన అంశాలపై సదస్సులో విశ్లేషిస్తారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 
19వ బయో ఆసియా సదస్సు ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు    : తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు
ఎక్కడ    : హైదరాబాద్‌ వేదికగా వర్చువల్‌ విధానంలో..
ఎందుకు : లైఫ్‌ సైన్సెస్‌ రంగం ప్రస్తుత స్థితిగతులతో పాటు భవిష్యత్‌ అవకాశాలపై చర్చించేందుకు..

Telangana: మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను ఏ జిల్లాలో నిర్మించారు?

Mallanna Sagar

తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట జిల్లా, తొగుట మండలం, తుక్కాపూర్‌ వద్ద నిర్మించిన శ్రీ కొమురవెల్లి మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను ఫిబ్రవరి 23న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌.. సిద్దిపేటకే కాకుండా హైదరాబాద్‌ నగరానికి శాశ్వతంగా దాహార్తిని తీర్చే ప్రాజెక్టు అని పేర్కొన్నారు. దీని ద్వారా 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్‌ రిజర్వాయర్, ఏడుపాయల వనదుర్గామాత వద్ద టూరిజం అభివృద్ధికి రూ.1,500 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఈ ఐదు ప్రాంతాల్లో అద్భుతమైన టూరిజం అభివృద్ధి చేయాలన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
శ్రీ కొమురవెల్లి మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 23
ఎవరు    : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు
ఎక్కడ    : తుక్కాపూర్, తొగుట మండలం, సిద్దిపేట జిల్లా,  తెలంగాణ రాష్ట్రం
ఎందుకు : సిద్దిపేట జిల్లాకు సాగునీరు, హైదరాబాద్‌ నగరానికి తాగునీరు అందించేందుకు.. 

Economy: తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌–2021 ఆవిష్కరణ

TS Economy

తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తితోపాటు తలసరి ఆదాయంలోనూ ఏటేటా వృద్ధి నమోదవుతోంది. రాష్ట్రం ఏర్పాటైన 2014–15లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.5,05,849 కోట్లు కాగా, 2020–21 నాటికి అది రూ.9,80,407 కోట్లకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘‘తెలంగాణ రాష్ట్ర గణాంక సంగ్రహణ–2021(తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌–2021)లో ఈ విషయం వెల్లడైంది. రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖలు సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదికను ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఆవిష్కరించారు.

నివేదికలోని కొన్ని అంశాలు..

  • 2014–15 నుంచి 2020–21 మధ్యకాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 93.8 శాతం వృద్ధి నమోదైంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 5 శాతంగా నమోదైంది. 2014–15లో ఇది 4 శాతం మాత్రమే. 
  • రాష్ట్రం ఏర్పాటైన తొలి రెండేళ్లలో జీడీపీ కంటే జీఎస్‌డీపీ పెరుగుదల తక్కువ కాగా, ఆ తర్వాత జీడీపీ కంటే ప్రతియేటా జీఎస్‌డీపీలో పెరుగుదల నమోదవుతోంది.
  • తెలంగాణ ఏర్పాటైన తర్వాత జీఎస్‌డీపీ వార్షిక సగటు పెరుగుదల 11.8 శాతం కాగా, జీడీపీ పెరుగుదల 8.5 శాతమే. 
  • కోవిడ్‌ క్లిష్ట సమయంలోనూ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వృద్ధి నమోదైంది. 2020–21లోనే జీఎస్‌డీపీ పెరుగుదల 2.4 శాతం నమోదైంది. అదే సమయంలో జీడీపీ మాత్రం మైనస్‌ 3 శాతానికి తగ్గింది.

2020–21 ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత?

  • స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌–2021 గణాంకాల ప్రకారం దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయం ముందంజలో ఉంది.  2020–21 ఆర్థిక సంవత్సరానికి దేశ తలసరి ఆదాయం రూ.1,28,829 కాగా, రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,37,632కు చేరింది.
  • రాష్ట్రం ఏర్పాటైన 2014–15 ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 91,121 కాగా, దేశ తలసరి ఆదాయం రూ. 63,462గా నమోదైంది.
  • రాష్ట్రం ఏర్పాటైన తొలి రెండేళ్లలో సగటు వార్షిక తలసరి ఆదాయం పెరుగుదల తెలంగాణలో 10.9, జాతీయస్థాయిలో 11.7 శాతంగా నమోదయ్యాయి. ఆ తర్వాత వార్షిక సగటు పెరుగుదల 11.3 శాతం కాగా, దేశ సగటు 7.3 శాతంగా నమోదైంది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌–2021 ఆవిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 23
ఎవరు    : తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌
ఎక్కడ    : ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ, హైదరాబాద్‌
ఎందుకు : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితి, గతులను గురించి వెల్లడించేందుకు..

Demographics: తెలంగాణ జనాభాలో ఎంత శాతం మంది మహిళలు ఉన్నారు?

Women Population in Telangana

తెలంగాణ రాష్ట్రంలో రానున్న 15 ఏళ్లలో యువశక్తి తగ్గిపోనుంది. రాష్ట్ర జనాభాలో 2021 ఏడాది నాటికి 15–40 ఏళ్లలోపు యువత 43.6 శాతం ఉండగా, 2036 నాటికి ఇందులో 15.9 శాతం తగ్గి.. 27.7 శాతం కానున్నట్లు అంచనా. ఫిబ్రవరి 23న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌–2021లో ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదిక ప్రకారం..

  • రానున్న 15 ఏళ్లలో 40 ఏళ్ల పైబడిన వారి జనాభా 42.5 శాతానికి పెరగనుంది.
  • 15–40 ఏళ్లలోపు గణాంకాలను పరిగణనలోకి తీసుకునే 6 శ్లాబుల్లో 35–39 ఏళ్ల శ్లాబు మినహా అన్ని శ్లాబుల్లోనూ తగ్గుదల నమోదు కానుంది.  80ఏళ్ల పైబడిన వారి సంఖ్య 82 శాతం పెరగనుంది. 
  • 2021 నాటికి రాష్ట్ర జనాభా 3,77,25,000 కాగా దేశ జనాభాలో ఇది 2.8 శాతమని అంచనా.
  • రాష్ట్రంలో 50.3 శాతం మంది పురుషులు కాగా, 49.7 శాతం మంది మహిళలున్నారు.

విద్యుత్‌ వినియోగం ఇలా..
తాజా ప్రభుత్వ నివేదిక ప్రకారం... తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో వరుసగా ఆరేళ్లపాటు విద్యుత్‌ వినియోగం పెరగ్గా, 2020–21లో స్వల్పంగా తగ్గింది. 2014–15లో 39,519 మిలియన్‌ యూనిట్లు (ఎంయూ) ఉన్న విద్యుత్‌ వినియోగం, క్రమంగా పెరుగుతూ 2019–20 నాటికి 58,515 ఎంయూలకు చేరింది. 2020–21లో 57,006 ఎంయూలకు పడిపోయింది. కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌ విధించడంతో పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు మూతపడటమే ఇందుకు కారణం.

రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం (మిలియన్‌ యూనిట్లలో..)

TS-State-Power-Uses

Telangana: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సేవల రంగం వాటా ఎంత శాతం?

Service Sector

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సేవల రంగానిదే అధిక భాగస్వామ్యం ఉంది. రాష్ట్ర మొత్తం రాష్ట్ర స్థూల విలువలో ఈ రంగం వాటా 59.4 శాతంగా ఉంది. ప్రాథమిక సెక్టార్‌ కిందకొచ్చే జీవ సంపద, పంటల భాగస్వామ్యం 24.1 శాతం కాగా, నిర్మాణ, తయారీ రంగాలతో కూడిన సెకండరీ సెక్టార్‌ భాగస్వామ్యం 16.5 శాతంగా ఉంది. ఫిబ్రవరి 23న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌–2021లో ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదిక ప్రకారం..  

  • ప్రాథమిక సెక్టార్‌లో జీవసంపద రంగం 43.6, పంటల రంగం 37.3 శాతం స్థూల విలువను కలిగి ఉన్నాయి. ఇక మాధ్యమిక సెక్టార్‌లో తయారీ రంగం 63.6 శాతం, నిర్మాణ రంగ స్థూల విలువ 25 శాతంగా నమోదయ్యాయి.
  • సేవల రంగం పరిధిలోకి వచ్చే రియల్‌ ఎస్టేట్, ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌ భాగస్వామ్యం 34.7 శాతం కాగా, వ్యాపారం, హోటళ్లు, రెస్టారెంట్ల సబ్‌సెక్టార్‌ భాగస్వామ్యం 25.6 శాతం ఉంది.
  • రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మత్స్యసంపదతో పాటు పాలు, మాంసాహార ఉత్పత్తి, వినియోగం 2018–19 నుంచి 2020–21 నాటికి 19 శాతం పెరిగింది.

Telangana: మిషన్‌ భగీరథను ఎప్పుడు, ఎక్కడ ప్రారంభించారు?

తెలంగాణ రాష్ట్రంలో తాగునీరు, పారిశుధ్య సౌకర్యాల మెరుగునకు ప్రభ్యుత్వం అనేక ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో మిషన్‌ భగీరథది కీలకపాత్ర. ఈ పథకాన్ని 2016, ఆగస్టు 6వ తేదీన గజ్వేల్‌ నియోజకవర్గం, కోమటిబండ గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలోని నల్లాల ద్వారా అన్ని కుటుంబాలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీటిని అందించాలనేది మిషన్‌ భగీరథ లక్ష్యం. దీని ఫలితాలను ఫిబ్రవరి 23న తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌–2021లో ప్రభుత్వం పేర్కొంది. ఆ వివరాలు ఇలా..

మిషన్‌ భగీరథ.. 

  • రాష్ట్రంలోని వందశాతం గ్రామీణ నివాస ప్రాంతాల (24,028 రూరల్‌ హాబిటేషన్లు)కు 2021 నాటికి పైపుల ద్వారా నీటి సరఫరా
  • 2020–21కల్లా అన్ని రూరల్‌ హాబిటేషన్లలో నల్లాల ద్వారా రోజుకు వందలీటర్ల తలసరి నీరు సరఫరా 
  • దీనికింద అత్యధికంగా లబ్ధి పొందుతున్న జిల్లాల్లో నల్లగొండ (7.07%), భద్రాద్రి కొత్తగూడెం (6.39%), మహబూబాబాద్‌ (5.67%), ఆదిలాబాద్‌ (5.02%) ఉన్నాయి. 
  • గ్రామీణ జనాభాలోని 2.07 కోట్ల మందిలో వందశాతం ప్రజలు భగీరథ పథకం కింద లబ్ధిపొందారు.

64.9లక్షల ఎకరాలకు సాగునీరు
మేజర్, మీడియం, మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో పాత, కొత్త కలిపి 64.9 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోందని తాజా నివేదికలో ప్రభుత్వం పేర్కొంది. నివేదిక ప్రకారం.. కొత్త ప్రాజెక్టుల ద్వారా అదనంగా 14.2 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. నిర్మాణం పూర్తి చేసుకున్న 9 నీటిపారుదల ప్రాజెక్టుల కింద 16.9 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి సరఫరా జరుగుతోంది. నిర్మాణంలో ఉన్న 24 నీటిపారుదల ప్రాజెక్టుల కింద 16.9 లక్షల ఆయకట్టుకు నీరందనుంది.

Telangana: రాష్ట్రంలోని మొత్తం రోడ్లలో జాతీయ రహదారుల వాటా?

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల వాటా క్రమంగా పెరుగుతోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2020–21 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం.. రాష్ట్రంలోని మొత్తం రోడ్లలో జాతీయ రహదారుల వాటా 3.6 శాతంగా ఉంది. మొత్తం రోడ్ల నిడివి 1,07,871.2 కిలోమీటర్లు ఉండగా ఇందులో జాతీయ రహదారులు 3,910 కిలోమీటర్ల మేర ఉన్నాయి.

2021–22 ఏడాది లెక్కల ప్రకారం..
2021–22 ఆర్థిక ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మరో వెయ్యి కిలోమీటర్ల రోడ్డు అందుబాటులోకి వచ్చింది. దీంతో జాతీయ రహదారుల మొత్తం నిడివి 4,983 కి.మీ. కు చేరింది. అంటే మొత్తం రోడ్లలో వీటి వాటా 4.6 శాతానికి చేరింది. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ. ప్రస్తుతం దేశంలో ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు జాతీయ రహదారులు 4.06 కిలోమీటర్లు ఉండగా రాష్ట్రంలో 4.45 కిలోమీటర్లు ఉన్నాయి.

నల్గొండ టాప్‌.. పెద్దపల్లి లాస్ట్‌: రాష్ట్ర సర్కారు లెక్కల ప్రకారం జాతీయ రహదారుల్లో నల్గొండ జిల్లా వాటా ఎక్కువుంది. ఈ జిల్లాలో 273 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులున్నాయి. నాగర్‌కర్నూలు, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో జాతీయ రహదారులే లేకపోవటంతో అట్టడుగు స్థానంలో ఉంది.

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 24 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 25 Feb 2022 06:12PM

Photo Stories