Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 24 కరెంట్‌ అఫైర్స్‌

DA-CAs-Feb-24

Russia-Ukraine Crisis: ఉక్రెయిన్‌లో బాంబుల మోత.. మొదలైన యుద్ధం..

Ukraine-Russia war

Russia-Ukraine War: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌పై మిలిటరీ ఆపరేషన్‌ మొదలైందని ప్రకటించారు. ఈ సందర్భంగా డోన్భాస్‌లో ఉక్రెయిన్‌ బలగాలు వెనక్కి వెళ్లాలని పుతిన్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఉక్రెయిన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్నారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై ఇప్పటికే రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. మరో వైపు పుతిన్‌ ప్రకటనతో ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ జనరల్ అత్యవసరంగా భేటీ అయ్యింది.

  • ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్‌ మొదలైందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. దీంతో డోన్సాస్‌లో ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లాలని పుతిన్  హెచ్చరించారు. ఇప్పటికే ఉక్రెయిన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ఉక్రెయిన్‌కు 3 వైపులా బలగాలను రష్యా మోహరించింది. ఉక్రెయిన్‌ సరిహద్దులకు యుద్ధ ట్యాంక్‌లను తరలించింది. తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతాలకు తమ బలగాలను పంపుతూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆదేశాలు జారీచేశారు. డొనెట్స్‌క్‌, లుహాన్స్‌క్‌ ప్రాంతాల్లో రష్యా బలగాల మోహరించింది.
  • రష్యా బలగాల నుంచి తమను తాము రక్షించుకొనేందుకు ఉక్రెయిన్‌ పౌరులు తుపాకులు చేతబట్టడానికి అనుమతించాలని ఉక్రెయిన్‌ యోచిస్తుంది. దీనికి ఆ దేశ పార్లమెంటు అమోదం తెలుపాల్సి ఉంది. ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. రష్యా సైనిక చర్య నిలిపేయాలని ఐక్యరాజ్యసమితి విజ్ఙప్తి చేసింది.
  • దక్షిణ బెలారస్‌లో ఉక్రెయిన్‌ సరిహద్దులకు అత్యంత సమీపంలోకి రష్యా బలగాలు చేరుకున్నాయి. మాక్సర్‌ సంస్థ సేకరించిన శాటిలైట్‌ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడయింది. దక్షిణ బెలారస్‌లోని మెజ్యార్‌ ఎయిర్‌ఫీల్డ్‌ వద్ద 100కుపైగా మిలిటరీ వాహనాలు, డజన్ల కొద్దీ గుడారాలు వెలిశాయి. ఈ విమానాశ్రయం ఉక్రెయిన్‌కు 40 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉంది. రష్యా స్వతంత్ర దేశంగా గుర్తించిన డోన్‌బాస్‌లోకి రష్యా సేనలు చేరుకున్నాయి.
  • ఉక్రెయిన్‌ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హెచ్చరించాడు. ఉక్రెయిన్‌ స్వాధీనం చేసుకునే ఉద్ధేశ్యం రష్యాకు లేదన్నారు. రక్తపాతానికి ఉక్రెయిన్‌ పాలకులే బాధ్యత వహించాలని అన్నారు. వేర్పాటువాద ప్రాంతాల్లో పౌరులకు రక్షణకు మిలటరీ ఆపరేషన్‌ మొదలైనట్లు తెలిపారు. ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చవద్దనేది తమ డిమాండ్‌ అని పేర్కొన్నారు. అయితే తమ డిమాండ్‌ను అమెరికా, మిత్ర దేశాలు విస్మరించాయని పేర్కొన్నారు.

Russia-Ukraine Crisis: రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య మొదలైన యుద్ధం.. అసలు ఈ యుద్ధం ఎందుకు?

Ukraine-Russia War

రష్యా ఉక్రెయిన్‌ల మధ్య పరిస్థితులు తీవ్ర రూపం దాల్చినప్పటికీ యుద్ధం వరకు అడుగులు పడవని అందరూ అనుకున్నారు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఉక్రెయిన్‌ విషయంలో తాము వెనకడుగు వేసేది లేదంటూ ఏకంగా ఆ దేశంపై మిలిటరీ ఆపరేషన్‌ చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు ప్రపంచ దేశాలు ఇందులో జోక్యం అనవసరమంటూ గట్టి సంకేతాలే పంపారు. మొన్నటి వరకు చర్చలకు సిద్ధమన్న రష్యా అకస్మాత్తుగా మిలిటరీ ఆపరేషన్‌కి చేపట్టింది. అసలు ఈ పరిణామాలకు కారణాలేమంటే!

యుద్ధం ఎందుకు?
ఉక్రెయిన్‌ను, మాజీ సోవియట్‌ దేశాలను నాటోలో చేర్చుకోవద్దని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ ప్రధాన డిమాండ్‌. అయితే ఈ డిమాండ్‌ని అగ్రరాజ్యం అమెరికా, నాటో మాత్రం అంగీకరించలేదు. గతంలో ఉక్రెయిన్‌ రష్యా నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉక్రెయిన్‌ నాటోలో చేర్చుకుని పశ్చిమ దేశాలు రష్యాను చుట్టుముట్టేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని రష్యా వాదిస్తోంది. ఉక్రెయిన్‌ని నాటోలో చేర్చడం వల్ల రష్యా భద్రతకు పెద్ద ముప్పు వాటిల్లే ప్రమాదముందని పుతిన్‌ వాదన.

అందుకే ఉక్రెయిన్‌ను నాటో చేర్చేందుకు తాము అంగీకరించమని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే యూరప్‌లో, మా సరిహద్దుల సమీపంలో మోహరించిన నాటో సైన్యాన్ని, మధ్య శ్రేణి క్షిపణులను తగ్గించడం, సైనిక మోహరింపుల్లో, కవాతుల్లో పారదర్శకత పాటించడంతో సహా అన్ని అంశాలపైనా చర్చించేందుకు పుతిన్‌ సిద్ధమని చెప్పారు. అయితే తమ ప్రధాన డిమాండ్లను నెరవేర్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా మరో వైపు ఉక్రెయిన్‌ మాత్రం నాటోలో చేరేందుకు రెడీగా ఉంది. చివరకి రష్యా కోరుకున్న విధంగా సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడకపోయే సరికి గురవారం పుతిన్‌ ఉక్రెయిన్‌పై మిలిటరీ ఆపరేషన్‌ ప్రకటించారు.

IPL 2022: అజిత్‌ అగార్కర్‌ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందాడు?

Ajit Agarkar

ఐపీఎల్‌ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా భారత మాజీ పేసర్‌ అజిత్‌ అగార్కర్‌ ఎంపికయ్యాడు. హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ నేతృత్వంలోని సహాయక సిబ్బంది బృందంలో అగార్కర్‌ కూడా పని చేస్తాడని ఫిబ్రవరి 23న ఢిల్లీ యాజమాన్యం ప్రకటించింది. ఏ స్థాయిలోనైనా కోచ్‌గా వ్యవహరించడం అగార్కర్‌కు ఇదే తొలిసారి. క్యాపిటల్స్‌కు ప్రవీణ్‌ ఆమ్రే బ్యాటింగ్‌ కోచ్‌గా, హోప్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. అగార్కర్‌ ఎంపికను ప్రకటించడంతో ఇప్పటి వరకు అసిస్టెంట్‌ కోచ్‌లుగా పని చేసిన కైఫ్, అజయ్‌ రాత్రాలతో ఒప్పందం రద్దయినట్లు స్పష్టమైంది.

1998– 2007 మధ్య కాలంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన అగార్కర్‌ 26 టెస్టుల్లో 58 వికెట్లు, 191 వన్డేల్లో 288 వికెట్లు తీశాడు. 2007 టి20 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో సభ్యుడైన అతను ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్ల తరఫున ఆడాడు. ప్రస్తుతం బీసీసీఐ కామెంటేటర్‌గా ఉన్న 44 ఏళ్ల అగార్కర్‌ శ్రీలంకతో సిరీస్‌ ముగిసిన తర్వాత ఢిల్లీ టీమ్‌తో కలుస్తాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    
: ఐపీఎల్‌ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా ఎంపిక 
ఎప్పుడు : ఫిబ్రవరి 23
ఎవరు    : భారత మాజీ పేసర్‌ అజిత్‌ అగార్కర్‌  
ఎందుకు : ఐపీఎల్‌ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణయం మేరకు..

Union Minister Rajeev Chandrasekhar: ఐబీఎం సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఎక్కడ ప్రారంభమైంది?

IBM Cyber Sequirty Command Center in Bengaluru

కర్ణాటక రాష్ట్ర రాజధాని నగరం బెంగళూరులో ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మెషిన్స్‌ కార్పొరేషన్‌(ఐబీఎం) ఏర్పాటు చేసిన ‘‘సైబర్‌ సెక్యూరిటీ కమాండ్‌ సెంటర్‌’’ ప్రారంభమైంది. ఫిబ్రవరి 23న కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఈ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం మంత్రి  మాట్లాడుతూ.. కంపెనీలు ఏదైనా సైబర్‌ దాడికి గురైతే దాన్ని ప్రభుత్వానికి వెల్లడించాలన్న చట్టాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు.  ఇప్పటి వరకు 10 కోట్ల సైబర్‌ దాడుల ఘటనలను కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (ఇండియా సీఈఆర్‌టీ) గుర్తించినట్టు చెప్పారు. సైబర్‌ దాడుల పరంగా భారత్‌ ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశమని పేర్కొన్నారు.

ఆసియా పసిఫిక్‌లో మొదటి కేంద్రం..
బెంగళూరులో ఏర్పాటు చేసిన సెబర్‌ సెక్యూరిటీ కమాండ్‌ సెంటర్‌’’ భారతదేశంలోనే కాకుండా ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోనే తమ కంపెనీ మొదటి కేంద్రం అని ఐబీఎం ఇండియా ఎండీ సందీప్‌ పటేల్‌ తెలిపారు. ఈ కేంద్రంలో సైబర్‌ భద్రత విషయంలో టెక్నిక్‌లపై శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ కేంద్రంలోనే కొత్త సెక్యూరిటీ ఆపరేషన్‌ సెంటర్‌ ద్వారా ప్రపంచవ్యాప్త క్లయింట్లకు సెక్యూరిటీ రెస్పాన్స్‌ సేవలను అందించనున్నట్టు పేర్కొన్నారు. ఐబీఎం ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది. ప్రస్తుతం దీని చైర్మన్, సీఈవోగా భారతీయ–అమెరికన్‌ అరవింద్‌ కృష్ణ ఉన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఐబీఎం ఏర్పాటు చేసిన ‘‘సైబర్‌ సెక్యూరిటీ కమాండ్‌ సెంటర్‌’’ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 23
ఎవరు    : కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌
ఎక్కడ    : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : ప్రపంచవ్యాప్త క్లయింట్లకు సైబర్‌ సెక్యూరిటీ రెస్పాన్స్‌ సేవలను అందించేందుకు..

5G Technology: దేశంలోనే తొలిసారిగా 5జీ డేటా కాల్‌ అభివృద్ధి చేసిన సంస్థ?

దేశంలో 5జీ సాంకేతికత పరిశోధనలో కీలక ముందడుగు పడింది. తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన 5జీ వైర్‌లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ టెక్నాలజీని వైసిగ్‌ నెట్‌వర్క్స్‌ (డబ్ల్యూఐఎస్‌ఐజీ) అనే స్టార్టప్‌ కంపెనీతో కలసి ఐఐటీ హైదరాబాద్‌ సంయుక్తంగా అభివృద్ధి చేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన 5జీ ఒరాన్‌ (ఓపెన్‌ రేడియో యాక్సెస్‌ నెట్‌వర్క్‌) టెక్నాలజీ సాయంతో తొలి డేటా కాల్‌ను చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఫిబ్రవరి 22న ప్రకటన విడుదల చేసింది. 3.3–3.5 జీహెచ్‌జెడ్‌ (గిగాహెర్ట్‌జ్‌) ఫ్రీక్వెన్సీ (పౌనఃపున్యం) బ్యాండ్‌లో 100 ఎంహెచ్‌జెడ్‌ (మెగా హెర్ట్‌జ్‌) బ్యాండ్‌విడ్త్‌కు సపోర్ట్‌ చేసే మల్టిపుల్‌ ఇన్‌పుట్‌–మల్టిపుల్‌ అవుట్‌పుట్‌ (మిమో) సామర్థ్యంగల బేస్‌స్టేషన్‌ను ఉపయోగించి డేటా కాల్‌ను అభివృద్ధి చేసినట్లు ఐఐటీ వర్గాలు వెల్లడించాయి. 5జీ స్వదేశీ పరిజ్ఞానం అభివృద్ధిలో ఇదో కీలక ఘట్టమని పేర్కొన్నాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
దేశీయంగా అభివృద్ధి చేసిన 5జీ ఒరాన్‌ (ఓపెన్‌ రేడియో యాక్సెస్‌ నెట్‌వర్క్‌) టెక్నాలజీ సాయంతో తొలి డేటా కాల్‌ను చేసిన సంస్థలు?
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు    : వెసిగ్‌ నెట్‌వర్క్స్‌ (డబ్ల్యూఐఎస్‌ఐజీ), ఐఐటీ హైదరాబాద్‌ 
ఎందుకు : 5జీ సాంకేతిక అభివృద్ధిలో ప్రక్రియలో భాగంగా..

Millets: ఎన్‌ఐఆర్‌డీపీఆర్, ఐఐఎంఆర్‌ మధ్య కుదిరిన ఒప్పంద లక్ష్యం?

Millets

గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తృణధాన్య (మిల్లెట్స్‌) ఆధారిత జీవనోపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచా యతీరాజ్‌(ఎన్‌ఐఆర్‌డీ–పీఆర్‌), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రీసెర్చ్‌(ఐఐఎంఆర్‌) సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.  ఈ మేరకు ఎంవోయూపై ఎన్‌ఐఆర్‌డీ–పీఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ నరేంద్రకుమార్, ఐసీఏఆర్‌–ఐఐఎంఆర్‌ డైరెక్టర్‌ విలాస్‌ ఎ టోనాపి సంతకాలు చేశారు. మిల్లెట్‌ ఆధారిత జీవనోపాధి అంశాలతోపాటు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల ద్వారా మిల్లెట్‌ ఆధారిత స్థానిక ఆహార వ్యవస్థలు, వ్యవసాయం–పోషకాహార అనుసంధానాలను ప్రోత్సహించడం ఈ ఒప్పందం ఉద్దేశం.

అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఏ ఏడాదిని ప్రకటించారు?
ఒప్పందం కార్యక్రమం సందర్భంగా.. నరేంద్రకుమార్‌ మాట్లాడుతూ.. 2023 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్‌ మిల్లెట్స్‌ ఇయర్‌ (అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం)గా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన నేపథ్యంలో రెండు సంస్థల మధ్య సహకారం అవసరమని గుర్తించి ఈ ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్‌ఐఆర్‌డీ–పీఆర్, ఐసీఏఆర్‌–ఐఐఎంఆర్‌ ల ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్‌లో ఉన్నాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచా యతీరాజ్‌(ఎన్‌ఐఆర్‌డీ–పీఆర్‌)తో అవగాహన ఒప్పందం చేసున్న సంస్థ?
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు    : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రీసెర్చ్‌(ఐఐఎంఆర్‌)
ఎందుకు : గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తృణధాన్య (మిల్లెట్స్‌) ఆధారిత జీవనోపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో..

Epigraphy: దేశంలోనే తొలి శాసనాల ప్రదర్శనశాల ఎక్కడ ఏర్పాటు కానుంది?

Epigraphy

దేశంలోనే తొలి శాసనాల ప్రదర్శనశాల హైదరాబాద్‌ నగరంలో ఏర్పాటు కానుంది. హైదరాబాద్‌ కేంద్రంగా నేషనల్‌ ఎపిగ్రఫీ మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యాటక, సాంస్కతిక శాఖ తాజాగా నిర్ణయించింది. దీంతో  శాసనాలను వెలుగులోకి తెచ్చి పదిలం చేసే వ్యవస్థ ఏర్పడేందుకు మార్గం సుగమం కానుంది. జాతీయ స్థాయిలో లభించిన, కొత్తగా వెలుగు చూసే ముఖ్యమైన శాసనాలను ఈ మ్యూజియంలో భద్రపరిచి, వాటి ప్రాధాన్యాన్ని సరికొత్త సాంకేతికతతో సందర్శకుల ముందుంచుతారు.

న్యూడెమోక్రసీలో చీలిక.. ప్రజాపంథా పార్టీ ఆవిర్భావం
సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీలో చీలిక ఏర్పడింది. సీపీఐ (ఎంఎల్‌) ప్రజాపంథాగా కొత్త పార్టీ ఆవిర్భవించింది. ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లో జరిగిన పార్టీ ఆవిర్భావ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా డి.వి.కృష్ణ, సహాయ కార్యదర్శిగా పోటు రంగారావును ఎన్నుకున్నారు. కొత్త పార్టీలోకి మాజీ ఎమ్మె ల్యే గుమ్మడి నర్సయ్య కూడా వచ్చారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
దేశంలోనే తొలి శాసనాల ప్రదర్శనశాల ‘‘నేషనల్‌ ఎపిగ్రఫీ మ్యూజియాన్ని’’ ఏర్పాటు చేయాలని నిర్ణయం
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు    : కేంద్ర పర్యాటక, సాంస్కతిక శాఖ
ఎక్కడ    : హైదరాబాద్‌
ఎందుకు : జాతీయ స్థాయిలో లభించిన, కొత్తగా వెలుగు చూసే ముఖ్యమైన శాసనాలను ఈ మ్యూజియంలో భద్రపరిచి, వాటి ప్రాధాన్యాన్ని సరికొత్త సాంకేతికతతో సందర్శకుల ముందు ఉంచేందుకు..

GDP Growth Rate: ఇండియా రేటింగ్స్‌ అంచనాల ప్రకారం.. 2021–22లో భారత్‌ వృద్ధి రేటు?

భారత జీడీపీ వృద్ధి రేటు 2021–22 ఆర్థిక సంతవ్సరంలో 8.6 శాతంగా నమోదు కావచ్చని రేటింగ్‌ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ తెలిపింది. ‘‘ఎన్‌ఎస్‌వో 2021–22 సంవత్సరానికి వాస్తవ స్థూల జాతీయ ఉత్పత్తి రూ.147.2 లక్షల కోట్లుగా ప్రకటించొచ్చు. దీని ప్రకారం జీడీపీ వృద్ధి రేటు 8.6 శాతంగా ఉంటుంది. 2022 జనవరి 7న విడుదల చేసిన మొదటి ముందస్తు అంచనా 9.2 శాతం కంటే తక్కువ’’ అని ఇండియా రేటింగ్స్‌ తెలిపింది. జాతీయ గణాంక కార్యాలయం అంచనా 9.2 శాతంగా ఉంది.

ఏఎస్‌సీఐ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
క్రిప్టో కరెన్సీలు, నాన్‌–ఫంజిబుల్‌ టోకెన్ల ప్రకటనలకు సంబంధించి అడ్వర్టైజింగ్‌ ప్రమాణాల మండలి(అడ్వర్టైజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా–ఏఎస్‌సీఐ) మార్గదర్శకాలు ప్రకటించింది. వీటి ప్రకారం ఇకపై ఈ సాధనాల ప్రకటనల్లో ఇవి ‘అవ్యవస్థీకృతమైనవి, అత్యధిక రిస్కులకు అవకాశమున్నవి‘ అని పేర్కొనడం తప్పనిసరి కానుంది. 2022, ఏప్రిల్‌ 1 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయి. క్రిప్టోలుగా వ్యవహరించే అన్ని వర్చువల్‌ డిజిటల్‌ అసెట్స్‌ (వీడీఏ), నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్స్‌ (ఎన్‌ఎఫ్‌టీ)కు ఇవి వర్తిస్తాయి. వివాదాస్పద క్రిప్టో సాధనాలు, సర్వీసుల ప్రకటనలు మార్కెట్‌ను ముంచెత్తుతున్న నేపథ్యంలో ఏఎస్‌సీఐ తాజా గైడ్‌లైన్స్‌ రూపొందించింది. ఏఎస్‌సీఐ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది.

Maharashtra: రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిని ఏ కేసులో అరెస్టు చేశారు?

Nawab Malik

మహారాష్ట్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి, ఎన్‌సీపీ సీనియర్‌ నేత నవాబ్‌ మాలిక్‌ను అక్రమార్జన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఫిబ్రవరి 23న అరెస్టు చేసింది. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో భాగంగా మాలిక్‌ను అరెస్టు చేశారు. దక్షిణ ముంబైలోని ఈడీ కార్యాలయానికి మాలిక్‌ను ఈడీ అధికారులు తీసుకొచ్చారు. దావూద్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాఖలు చేసిన ఒక ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ మాలిక్‌పై కేసు నమోదు చేసింది.

ప్రముఖ సాహితీవేత్త గురుప్రసాదరావు కన్నుమూత
ప్రముఖ సాహితీవేత్త, పీబీ సిద్ధార్థ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్‌ నాగళ్ల గురుప్రసాదరావు(89) ఫిబ్రవరి 21న విజయవాడలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా కావూరులో జన్మించిన ఆయన.. తాడికొండ, గుంటూరు, విజయవాడలలో తెలుగు అధ్యాపకుడిగా వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. రెండు వేలకు పైగా సాహిత్య వ్యాసాలను తెలుగు వారికి అందించారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర సాహిత్య అకాడమీ 2017లో భాషా సమ్మాన్‌ పురస్కారంతో సత్కరించింది. సీఆర్‌ రెడ్డి స్మారక పురస్కారం, సుధీరత్న పురస్కారం, కేంద్ర సాంస్కృతిక శాఖ ఫెలోషిప్‌లను ఆయన అందుకున్నారు.

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 23 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 24 Feb 2022 06:12PM

Photo Stories