Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 23 కరెంట్‌ అఫైర్స్‌

DA-CAs-Feb-23

Russia-Ukraine Crisis: ఉక్రెయిన్‌లోని ఏ ప్రాంతాలకు స్వతంత్ర హోదా ఇస్తున్నట్టు రష్యా ప్రకటించింది?

Russia-Ukraine Crisis

ఉక్రెయిన్‌లో వేర్పాటువాదుల అధీనంలోని రెండు ప్రాంతాలు ‘‘డొనెట్‌స్క్, లుహాన్‌స్క్‌’’లకు స్వతంత్ర హోదా ఇస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. ఫిబ్రవరి 21న జరిగిన ప్రెసిడెన్షియల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తూర్పు ఉక్రెయిన్‌లోని ఆ రెండు వేర్పాటువాద ప్రాంతాల్లో రష్యా అనుకూల రెబల్స్‌ ప్రభుత్వాలు నడుçపుతున్నాయి. తమను స్వతంత్ర దేశాలుగా గుర్తించాలని, ఉక్రెయిన్‌ ఆక్రమణల బారినుంచి కాపాడి అన్నివిధాలా ఆదుకోవాలని రెబెల్స్‌ ఇటీవల రష్యాను కోరారు. ఈ నేపథ్యంలో ఆ రెండు ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తున్నామని పుతిన్‌ ప్రకటించారు. రెబల్స్‌ నుంచి ఉక్రెయిన్‌ స్వాధీనం చేసుకున్న ప్రాంతాలకూ ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు.

ఐరాస అత్యవసర సమావేశం
పుతిన్‌ ప్రకటన వెలువడగానే ఉక్రెయిన్, అమెరికా తదితర దేశాల విజ్ఞప్తి మేరకు ఫిబ్రవరి 22న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమై సుదీర్ఘంగా చర్చించింది. తూర్పు ఉక్రెయిన్‌లోని ఈ సమస్యను 2015 నాటి మిన్‌స్క్‌ ఒప్పందానికి లోబడి శాంతియుతంగా పరిష్కరించుకోవాలని రష్యాకు  ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌ సూచించారు. జర్మనీ, ఫ్రాన్స్, టర్కీ, డెన్మార్క్, ఫిన్లాండ్, బెల్జియం, ఆస్ట్రియా తదితర దేశాలన్నీ రష్యా చర్యను తీవ్రంగా తప్పుబట్టాయి. 15 దేశాలతో కూడిన భద్రతా మండలి ఉక్రెయిన్‌ సంక్షోభంపై భేటీ కావడం ఇటీవలి కాలంలో ఇది మూడోసారి.

చర్చలతోనే పరిష్కారం: భారత్‌
ఉక్రెయిన్‌ సంక్షోభంపై భారత్‌ ఆందోళన వెలిబుచ్చింది. ఉద్రిక్తత నివారణే తక్షణ కర్తవ్యమని అభిప్రాయపడింది. అందుకు చర్చలే ఉత్తమ పరిష్కార మార్గమని సూచించింది. ఇరుపక్షాలూ సంయమనం పాటించాలని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టి.ఎస్‌.తిరుమూర్తి అన్నారు. ఉక్రెయిన్‌ పరిణామాలను భారత్‌ నిశితంగా గమనిస్తోందని చెప్పారు. కాగా, సంక్షోభం ముదురుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారతీయులంతా తక్షణం వెనక్కు వచ్చేయాలని భారత ప్రభుత్వం మరోసారి సూచించింది.

దేనికీ భయపడబోం: ఉక్రెయిన్‌
ఉక్రెయిన్‌లోని రెబెల్స్‌ అధీనంలోని డొనెట్‌స్క్, లుహాన్‌స్క్‌ ప్రాంతాల్లోకి ఫిబ్రవరి 22న ‘శాంతి పరిరక్షణ’ పేరిట రష్యా భారీ సంఖ్యలో సైన్యాన్ని పంపి.. వాటిని తన అధీనంలోకి తీసుకుంది. ఇది ఉక్రెయిన్‌ సార్వభౌమాధికారంపై దాడేనని... ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ ఈ సంర్భంగా ప్రకటించారు. ‘దేనికీ భయపడబోం. మా భూభాగంలో అంగుళం కూడా వదులుకోం’ అన్నారు.

ఆంక్షల పర్వం
రష్యా తాజా చర్యలపై.. అమెరికా, యూరప్‌తో పాటు పలు ప్రపంచ దేశాలు మండిపడ్డాయి. అంతర్జాతీయ ఒప్పందాలను, మర్యాదలను రష్యా తుంగలో తొక్కిందంటూ దుయ్యబట్టాయి. రష్యాపై కఠినమైన ఆంక్షలకు సిద్ధమవుతున్నట్టు అమెరికా, యూరప్‌ ప్రకటించాయి.  రష్యా స్వతంత్ర హోదా ప్రకటించిన ప్రాంతాలతో వర్తక వాణిజ్యాలపై అమెరికా నిషేధం విధించింది. ఇంగ్లండ్‌ ఏకంగా ఐదు రష్యా బ్యాంకులపై ఆంక్షలు విధించింది. తమ దేశంలోని ముగ్గురు రష్యా కుబేరుల ఆస్తులను స్తంభింపజేస్తున్నట్టు ప్రకటించింది. నాటో సభ్య దేశాలతో కలిసి కనీవిని ఎరగని ఆంక్షలతో విరుచుకుపడతామని రష్యాను హెచ్చరించింది. రష్యాపై విధించాల్సిన ఆంక్షల జాబితాను సిద్ధం చేస్తున్నట్టు యూరోపియన్‌ యూనియన్‌ కూడా ప్రకటించింది.

Supreme court: పెగసస్‌ను కేసును ఎవరి నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది?

వీఐపీలపై నిఘా ఉదంతంలో సంచలనంగా మారిన ఇజ్రాయెలీ స్పైవేర్‌ పెగసస్‌ కేసులో ఫిబ్రవరి 23న జరగాల్సిన విచారణను ఫిబ్రవరి 25కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది.

ప్రస్తుతం కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు?
విద్యార్థుల్లో శాస్త్రీయ విజ్ఞాన కుతూహలాన్ని పెంచేందుకు దేశవ్యాప్తంగా 18 కొత్త శాస్త్రీయ విజ్ఞాన ప్రదర్శనశాలలు (మ్యూజియంలు) ఏర్పాటు చేయనున్నట్లు ‘‘కేంద్ర సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి గంగాపురం కిషన్‌ రెడ్డి’’ ఫిబ్రవరి 22న చెప్పారు. రాబోయే 25 సంవత్సరాల్లో దేశ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఈ మ్యూజియంలు మైలురాళ్లుగా నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు.

టాంజానియా రాజధాని నగరం ఏది?
సోషల్‌ మీడియాలో బాలీవుడ్‌ పాటలకు లిప్‌సింక్‌ (పాటకు తగ్గట్లు పెదాలు కదపడం) వీడియోలతో పాపులర్‌గా మారిన కిలి పౌల్‌ను టాంజానియాలోని భారత ఎంబసీ సత్కరించింది. కిలిని ఎంబసీలో సత్కరిస్తున్న ఫొటోలను భారత హైకమిషనర్‌ బినయ ప్రధాన్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. టాంజానియా దేశస్థుడైన కిలికి ఇన్‌స్టాలో దాదాపు 22 లక్షల మంది ఫాలోయర్లున్నారు.

యునెటైడ్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ టాంజానియా..
రాజధాని:
డొడొమా; కరెన్సీ: టాంజానియన్‌ షిల్లింగ్‌
ప్రస్తుత అధ్యక్షుడు: సమియా సులుహు
ప్రస్తుత ప్రధానమంత్రి: కాసిమ్‌ మజలివా

Former American President: డొనాల్డ్‌ ట్రంప్‌కి చెందిన సోషల్‌ మీడియా యాప్‌ పేరు?

Donald Trump - Truth Social

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సొంత సామాజిక మాధ్యమ వేదిక(సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌) ‘ట్రూత్‌ సోషల్‌’ ఫిబ్రవరి 21న ప్రారంభమైంది. ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ  గ్రూప్‌ ఆధ్వర్యంలో ‘ట్రూత్‌ సోషల్‌’ యాప్‌ను ప్రారంభించారు. గతంలో అమెరికా అధ్యక్షుడిగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఫాలోయింగ్‌ ఉన్న నేతగా డొనాల్డ్‌ ట్రంప్‌ కొనసాగారు. 2021, జనవరి 6న అమెరికాలోని కేపిటల్‌ భవనంపై జరిగిన దాడిలో ప్రమేయం ఉందంటూ ట్రంప్‌ను ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థలు ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లు బహిష్కిరించాయి. ట్రంప్‌ విద్వేష పోస్టులు చేస్తున్నారంటూ పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో తన మద్దతుదారులకు సొంత సోషల్‌ మీడియా యాప్‌ ద్వారా చేరువవుతానని ట్రంప్‌ గతంలో ప్రకటించాడు. ఈ మేరకు యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో ట్రూత్‌ సోషల్‌ అందుబాటులోకి వచ్చింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
సామాజిక మాధ్యమ వేదిక ‘ట్రూత్‌ సోషల్‌’ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు    : ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ  గ్రూప్‌ 
ఎందుకు : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. తన మద్దతుదారులకు సొంత సోషల్‌ మీడియా యాప్‌ ద్వారా చేరువయ్యేందుకు..

BPCL, Hero MotoCorp: బీపీసీఎల్‌ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?

BPCL and Hero Motocorp

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల (ఈవీ) కోసం చార్జింగ్‌ మౌలిక సదుపాయాలను కల్పించే దిశగా ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌), టూ వీలర్‌ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ జట్టు కట్టాయి. ‘మొదటి దశలో ఢిల్లీ, బెంగళూరుతో మొదలుపెట్టి తొమ్మిది నగరాల్లో చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత చార్జింగ్‌ స్టేషన్లను విస్తృత స్థాయిలో అందుబాటులోకి తెచ్చే దిశగా నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తాం‘ అని ఇరు సంస్థలు ఫిబ్రవరి 22న ఒక ప్రకటనలో తెలిపాయి. ప్రణాళిక ప్రకారం రెండు సంస్థలు.. ముందుగా బీపీసీఎల్‌కు ప్రస్తుతం ఉన్న పెట్రోల్‌ బంకుల్లో చార్జింగ్‌ సదుపాయాలను ఏర్పాటు చేయనున్నాయి. ఆ తర్వాత ఎలక్ట్రిక్‌ వాహనాల వ్యవస్థకు సంబంధించి మిగతా అంశాల్లోనూ కలిసి పనిచేయనున్నాయి. బీపీసీఎల్‌ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ప్రస్తుతం బీపీసీఎల్‌ చైర్మన్, ఎండీగా అరుణ్‌ కుమార్‌ సింగ్‌ ఉన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌)తో జట్టు కట్టిన సంస్థ?
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు    : టూ వీలర్‌ దిగ్గజం హీరో మోటోకార్ప్‌
ఎందుకు : దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల (ఈవీ) కోసం చార్జింగ్‌ మౌలిక సదుపాయాలను కల్పించేందుకు..

Unicorn Startups: మూడో పెద్ద స్టార్టప్‌ ఎకోసిస్టవ్‌గా ఆవిర్భవించిన దేశం?

Startup

దేశీయంగా స్టార్టప్‌లు వేగంగా పుట్టుకొస్తున్నట్లు నాస్కామ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్, ఐవోటీ, ఏఐ విభాగాల సీఈవో సంజీవ్‌ మల్హోత్రా పేర్కొన్నారు. వార్షికంగా వీటి సంఖ్యలో 10 శాతం వృద్ధి నమోదవుతున్నట్లు ఫిబ్రవరి 22న తెలియజేశారు. 2021–22కల్లా గుర్తింపు పొందిన కొత్త స్టార్టప్‌లు 14,000ను మించాయి. 2016–17లో ఇవి 733 మాత్రమే. తద్వారా ప్రపంచంలో అమెరికా, చైనా తదుపరి మూడో పెద్ద స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌గా దేశం ఆవిర్భవించినట్లు మల్హోత్రా తెలియజేశారు.

ఎన్ని డాలర్లకుపైగా విలువ చేసే కంపెనీని యూనికార్న్‌గా పిలుస్తారు?
పటిష్ట ఎకోసిస్టమ్, ప్రోత్సాహకర పెట్టుబడుల కారణంగా దేశంలో మరిన్ని యూనికార్న్‌లు ఆవిర్భవించనున్నట్లు మల్హోత్రా పేర్కొన్నారు. స్టార్టప్‌ వ్యవస్థలో బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ. 7,500 కోట్లు) విలువను అందుకున్న కంపెనీలను యూనికార్న్‌గా వ్యవహరించే సంగతి తెలిసిందే. 2021లో దేశీయంగా 44 స్టార్టప్‌లు యూనికార్న్‌ హోదాను అందుకున్నాయి. దీంతో వీటి సంఖ్య 83ను తాకింది.

యూనికార్న్‌ క్లబ్‌లో హసురా..
క్లౌడ్‌ సేవల్లో ఉన్న బెంగళూరు కంపెనీ హసురా సుమారు రూ.746 కోట్లను సమీకరించింది. గ్రీనోక్స్‌తోపాటు పాత ఇన్వెస్టర్స్‌ అయిన నెక్సస్‌ వెంచర్‌ పార్ట్‌నర్స్, లైట్‌స్పీడ్‌ వెంచర్‌ పార్ట్‌నర్స్, వెర్టెక్స్‌ వెంచర్స్‌ సైతం ఈ డీల్‌లో పాలుపంచుకున్నాయి. తాజా డీల్‌ ప్రకారం కంపెనీని రూ.7,460 కోట్లుగా (బిలియన్‌ డాలర్‌) విలువ కట్టారు. దీంతో యూనికార్న్‌ క్లబ్‌లో హసురా చేరింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
మూడో పెద్ద స్టార్టప్‌ ఎకోసిస్టవ్‌గా ఆవిర్భవించిన దేశం?
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు    : భారత్‌
ఎక్కడ    : ప్రపంచంలో..
ఎందుకు : దేశీయంగా స్టార్టప్‌లు వేగంగా పుట్టుకొస్తున్నందున..

Data Policy: ప్రస్తుతం కేంద్ర ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు?

Data Policy

ప్రభుత్వ శాఖలు, వివిధ విభాగాల డేటా బహిరంగంగా అందుబాటులో ఉంచే విధంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ కసరత్తు చేస్తోంది. డేటా అందుబాటులో ఉండటం, వినియోగానికి సంబంధించి రూపొందించిన ‘‘డేటా పాలసీ’’ ముసాయిదా(భారత ప్రభుత్వ విధానం ముసాయిదా)ను ఆవిష్కరించింది. దీనిపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. ముసాయిదా ప్రకారం.. వివిధ శాఖలు, డిపార్ట్‌మెంట్‌లు, అధీకృత ఏజెన్సీలకు సంబంధించిన సమాచారంతో పాటు వాటి ద్వారా ప్రభుత్వం సేకరించే డేటా కూడా బహిరంగంగా అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర రైల్వే శాఖ; కమ్యూనికేషన్స్‌ శాఖ; ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖల మంత్రిగా అశ్విని వైష్ణవ్‌ ఉన్నారు.

ఇండియా డేటా ఆఫీస్‌ ఏర్పాటు ఉద్దేశం?
డేటా యాక్సెస్, షేరింగ్‌ కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకు ’ఇండియా డేటా ఆఫీస్‌’ను ఏర్పాటు చేయాలని ముసాయిదాలో ఐటీ శాఖ ప్రతిపాదించింది. వివిధ శాఖలు, విభాగాలు, రాష్ట్రాల ప్రభుత్వాలతో ఇది సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. ఇండియా డేటా ఆఫీసర్, వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విభాగాల చీఫ్‌ డేటా ఆఫీసర్లు ఇందులో భాగంగా ఉంటారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ముసాయిదా డేటా పాలసీ ఆవిష్కరణ
ఎప్పుడు  : ఫిబ్రవరి 22
ఎవరు    : కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ
ఎందుకు : ప్రభుత్వ శాఖలు, వివిధ విభాగాల డేటా బహిరంగంగా అందుబాటులో ఉంచే ప్రక్రియలో భాగంగా..

World Trade Organization: డబ్ల్యూటీవో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

WTO

కరోనా మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు వర్ధమాన దేశాలు అమలు చేసిన వాణిజ్య చర్యలను అభివృద్ధి చెందిన దేశాలు వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌(డబ్ల్యూటీవో) వివాద పరిష్కార ప్యానెల్‌ ముందుకు తీసుకెళ్లరాదంటూ భారత్, క్యూబా, ఆఫ్రికా యూనియన్‌ కోరాయి. ఈ మేరకు ఒక కాన్సెప్ట్‌ పేపర్‌ను డబ్ల్యూటీవోకు సమర్పించాయి. ట్రేడ్‌ చర్యలపై విరామం, మేధో సంపత్తి హక్కుల పరంగా వెసులుబాటు అన్నది కరోనా సంక్షోభం వరకు తాత్కాలికంగా కొనసాగించాలని కొరాయి. డబ్ల్యూటీవో ప్రధాన కార్యాలయం స్విట్జర్‌ల్యాండ్‌లోని జెనీవా నగరం ఉంది.

శ్రీలంక కరెన్సీ పేరు?
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాలుస్తోంది. నిధుల లేమితో దేశ అవసరాలకు తగ్గ ఇంధనం దిగుమతి చేసుకోలేక ప్రభుత్వం చేతులెత్తింది. దీంతో దేశమంతా విద్యుత్‌ కోతలు విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 22న దేశ పవర్‌ గ్రిడ్‌ను రెండుగంటలు నిలిపివేస్తున్నట్లు శ్రీలంక ప్రజావసరాల కమిషన్‌ ప్రకటించింది. ఒకపక్క విద్యుత్‌ సంక్షోభం కొనసాగుతున్న వేళ డ్యాముల్లో నీటి నిల్వలు తగ్గడంతో జలవిద్యుదుత్పత్తి తగ్గింది.

శ్రీలంక..
శాసన రాజధాని:
శ్రీ జయవర్ధనేపుర కొట్టే
కార్యనిర్వహక, న్యాయ రాజధాని: కొలంబొ
కరెన్సీ: శ్రీలంకన్‌ రూపీ
ప్రస్తుత అధ్యక్షుడు: గోటబాయ రాజపక్స
ప్రస్తుత ప్రధానమంత్రి: మహింద రాజపక్స

ప్రధాని మోదీతో చర్చలకు సిద్ధం: ఇమ్రాన్‌
భారత్, పాకిస్తాన్‌ మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారానికి భారత ప్రధాని మోదీతో టీవీ చర్చలో పాల్గొనేందుకు సిద్ధమని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చెప్పారు. రష్యా పర్యటనలో భాగంగా ఆర్‌టీ టెలివిజన్‌ నెట్‌వర్క్‌కు ఆయన ఫిబ్రవరి 22న ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘మోదీతో టీవీలో చర్చకు ఇష్టపడతాను’అని వ్యాఖ్యానించారు. రెండు దశాబ్దాల అనంతరం తొలిసారి పాక్‌ ప్రధాని రష్యాలో పర్యటిస్తున్నారు. ఇరు దేశాల మధ్య విబేధాలు చర్చలతో పరిష్కారమైతే భారత ఉపఖండంలోని కోట్లాదిమంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.

Andhra Pradesh: రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌గా నియమితులైన అధికారి?

PSR Anjaneyulu

ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌గా పి.సీతారామాంజనేయులు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్నారు. రవాణా శాఖ కమిషనర్, ఏపీపీఎస్‌సీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీటన్నింటి నుంచి ఆయన్ను రిలీవ్‌ చేసి ఇంటెలిజెన్స్‌ డీజీగా కీలక బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు ఫిబ్రవరి 22న ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఇంటెలిజెన్స్, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా ఉన్న కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి డీజీపీగా నియమితులైన విషయం తెలిసిందే.

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా బాగ్చి..
ఇప్పటివరకు సీతారామాంజనేయులు నిర్వహిస్తున్న రవాణా కమిషనర్‌ బాధ్యతలను ఎం.టి.కృష్ణబాబుకి, ఏపీపీఎస్‌సీ కార్యదర్శి బాధ్యతల్ని ఎ.బాబుకి ప్రభుత్వం అప్పగించింది. ఏసీబీ డీజీ బాధ్యతల్ని డీజీపీకి అదనంగా అప్పగించారు. ఏపీఎస్‌పీ బెటాలియన్స్‌ అదనపు డీజీగా ఉన్న శంఖబ్రత బాగ్చిని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా నియమించారు.

ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు ఉన్నారు? 
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి నియమితులయ్యారు. టీటీడీ ఈవో అదనపు బాధ్యతలను ఆయనకే కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో ఎనిమిదిమంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఫిబ్రవరి 22న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఉత్తర్వులు జారీచేశారు.
క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    :
ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌  డైరెక్టర్‌ జనరల్‌గా నియమితులైన అధికారి?
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు    : పి.సీతారామాంజనేయులు
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 22 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 23 Feb 2022 05:45PM

Photo Stories