Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 22 కరెంట్ అఫైర్స్
Border Infrastructure and Management: బీఐఎం పథకాన్ని ఎప్పటి వరకు కొనసాగించనున్నారు?
2021–22 నుంచి 2025–26 వరకు (15వ ఫైనాన్స్ కమిషన్ పదవీ కాలం) బోర్డర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మేనేజ్‌మెంట్(బీఐఎం) పథకాన్ని రూ.13,020 కోట్లతో కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు, నిఘాను మరింత బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని ఫిబ్రవరి 21న ప్రభుత్వం ఒక ప్రకటనను వెలువరించింది. బీఐఎం పథకం కింద.. సరిహద్దుల్లో ఫెన్సింగ్, లైట్లు, రోడ్లు, ఔట్‌పోస్టులు, కంపెనీ ఆపరేటింగ్ బేసులను అభివృద్ధి చేస్తారు.
భారత్‌తో అత్యధిక భూసరిహద్దును పంచుకుంటున్న దేశం ఏది?
భారత్‌కు పాకిస్తాన్‌తో 3,310 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌తో 4,096, చైనాతో 3,488, నేపాల్‌తో రూ.1,752, భూటాన్‌తో 578, మయన్మార్‌తో 1,643 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం చైనా, నేపాల్, భూటాన్ సరిహద్దుల్లో వ్యూహాత్మక రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, మయన్మార్ సరిహద్దుల్లో ఫెన్సింగ్, ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేస్తోంది. అంతేకాకుండా సరిహద్దుల వెంట హైటెక్ ఎలక్ట్రానిక్ నిఘా పరికరాలను బిగిస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021–22 నుంచి 2025–26 వరకు (15వ ఫైనాన్స్ కమిషన్ పదవీ కాలం) బోర్డర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మేనేజ్‌మెంట్(బీఐఎం) పథకాన్ని రూ.13,020 కోట్లతో కొనసాగించడానికి ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : బీఐఎం పథకం కింద.. సరిహద్దుల్లో ఫెన్సింగ్, లైట్లు, రోడ్లు, ఔట్‌పోస్టులు, కంపెనీ ఆపరేటింగ్ బేసులను అభివృద్ధి చేసేందుకు..
Astronomy: విశ్వంలోకెల్లా అతి పెద్ద గెలాక్సీ పేరు?
విశ్వంలోకెల్లా అతి పెద్ద గెలాక్సీని నెదర్లాండ్స్‌లోని లైడెన్ అబ్జర్వేటరీకి చెందిన శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. ఇది ఏకంగా 1.63 కోట్ల కాంతి సంవత్సరాల విస్తీర్ణంలో పరుచుకుని ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మన పాలపుంత కంటే 153 రెట్లు, సూర్యుని కంటే 24,000 కోట్ల రెట్లు పెద్దదిగా ఉందని తెలిపారు. ఈ భారీ రేడియో గెలాక్సీకి ‘‘అల్సియోనెస్’’ అని పేరు పెట్టారు. ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం.. అల్సియోనెస్ గెలాక్సీ భూమి నుంచి 300 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉందని అంచనా. దీని మధ్యలో కేంద్రకం వద్ద చురుకైన ఓ భారీ కృష్ణబిలం కూడా ఉంది. దాని సమీపం నుంచి భారీ ద్రవ్యరాశితో కూడిన పలు ఖగోళ పదార్థాలు ఎగజిమ్ముతున్నాయి.
ఖగోళానికి సంబంధించి ఇప్పటిదాకా ఉన్న పలు సందేహాలకు, భారీ గెలాక్సీలు ఎలా పుట్టుకొస్తాయన్న ప్రశ్నలకు కూడా అల్సియోనెస్‌పై జరిగే పరిశోధనల్లో సమాధానాలు దొరకొచ్చని లైడెన్ అబ్జర్వేటరీకి చెందిన మార్టిజిన్ ఒయ్ అన్నారు. యూరప్‌లో ఏర్పాటు చేసిన లో ఫ్రీక్వెన్సీ అర్రే (లోఫర్) డేటాను విశ్లేషించే క్రమంలో ఒయ్, ఆయన బృందం యాదృచ్ఛికంగా అల్సియోనెస్ గెలాక్సీని కనిపెట్టింది.
International Cricket Council: టి20 టీమ్ ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానానికి చేరిన జట్టు?
ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు అగ్రస్థానానికి చేరుకుంది. ఫిబ్రవరి 20న వెస్టిండీస్‌తో సిరీస్‌ను 3–0తో గెలుచుకున్న అనంతరం భారత్ నంబర్‌వన్‌గా (269 రేటింగ్ పాయింట్స్) నిలిచింది. ఇప్పటి వరకు నంబర్‌వన్‌గా ఉన్న ఇంగ్లండ్‌ను రెండో స్థానానికి పడేసింది. ఇంగ్లండ్‌కు కూడా సమానంగా 269 రేటింగ్ పాయింట్లే ఉన్నా... 39 మ్యాచ్‌ల ద్వారా పాయింట్లపరంగా భారత్ (10,484), ఇంగ్లండ్‌కంటే (10,474) పది పాయింట్లు ఎక్కువగా ఉండటంతో అగ్రస్థానం దక్కింది. ఈ జాబితాలో పాకిస్తాన్ (266) మూడో స్థానంలో నిలిచింది. గతంలో భారత్ 2016లో చివరిసారిగా నంబర్‌వన్‌గా నిలిచింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 టీమ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరిన జట్టు?
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు : భారత జట్టు
ఎందుకు : ఫిబ్రవరి 20న వెస్టిండీస్‌తో సిరీస్‌ను 3–0తో గెలుచుకున్న అనంతరం భారత్‌కు 269 రేటింగ్ పాయింట్స్ లభించడంతో..
Cairn Oil & Gas: దుర్గా చమురు నిక్షేపాన్ని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?
రాజస్తాన్ రాష్ట్రం, బార్మేర్ జిల్లాలోని క్షేత్రంలో చమురు నిక్షేపాన్ని కనుగొన్నట్లు వేదాంత గ్రూప్ సంస్థ కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ వెల్లడించింది. డబ్ల్యూఎం–బేసల్ డీడీ ఫ్యాన్–1 అన్వేషణ బావిలో ఇది బయటపడిందని ఫిబ్రవరి 21న తెలియజేసింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్)కి సమాచారం ఇచ్చినట్లు పేర్కొంది. ఈ చమురు నిక్షేపానికి ’దుర్గా’ అని పేరు పెట్టినట్లు వివరించింది. ఆర్‌జే–ఓఎన్‌హెచ్‌పీ–2017/1 బ్లాక్‌లో బావిని 2615 మీటర్ల లోతు వరకు తవ్వినట్లు పేర్కొంది. ఈ క్షేత్రానికి పొరుగునే ఉన్న బ్లాక్ నుంచి కెయిర్న్ సంస్థ రోజుకు 1,50,000 బ్యారెళ్లకు పైగా చమురు, గ్యాస్ ఉత్పత్తి చేస్తోంది.
కోర్బెవాక్స్ అత్యవసర వినియోగానికి అనుమతి
దేశీయ ఫార్మా సంస్థ బయోలాజికల్–ఈ 12–18 ఏళ్ల గ్రూపు వారి కోసం రూపొందించిన కరోనా టీకా ‘‘కోర్బెవాక్స్’’ అత్యవసర వినియోగానికి డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) అనుమతులు మంజూరు చేసింది. కోర్బెవాక్స్‌ను పరిమితులతో వినియోగించేందుకు బయోలాజికల్–ఈకి అనుమతి లభించినట్లు ఫిబ్రవరి 21న అధికారవర్గాలు వెల్లడించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దుర్గా చమురు నిక్షేపాన్ని కనుగొన్న సంస్థ?
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు : వేదాంత గ్రూప్ సంస్థ కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్
ఎక్కడ : బార్మేర్ జిల్లా, రాజస్తాన్
Internet Services: ఎస్‌ఈఏ–ఎంఈ–డబ్ల్యూఈ–6తో జట్టు కట్టిన సంస్థ?
నిరంతరాయ, వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీసులు అందించడంపై దేశీ టెలికం దిగ్గజాలు మరింతగా దృష్టి పెడుతున్నాయి. ఇందులో భాగంగా సముద్రగర్భంలో కేబుల్స్ వేసే కన్సార్షియం ’ఎస్‌ఈఏ–ఎంఈ–డబ్ల్యూఈ–6’తో ఎయిర్‌టెల్ చేతులు కలిపింది. దీనికి సంబంధించిన మొత్తం పెట్టుబడుల్లో 20 శాతం మేర ఇన్వెస్ట్ చేయనుంది.
ఎస్‌ఈఏ–ఎంఈ–డబ్ల్యూఈ–6 గురించి కొన్ని అంశాలు..
- వ్యవస్థ 2025 నాటికి అందుబాటులోకి రానుంది.
- సింగపూర్‌ను ఫ్రాన్స్‌కు అనుసంధానం చేసే ఈ కేబుల్ నెట్‌వర్క్ దాదాపు 19,200 ఆర్‌కేఎం (రూట్ కిలోమీటర్ల) పొడవు ఉంటుంది. ప్రపంచంలోనే ఇది అత్యంత పొడవైన అండర్‌సీ కేబుల్ వ్యవస్థ కానుంది.
- ఎస్‌ఈఏ–ఎంఈ–డబ్ల్యూఈ–6లో బంగ్లాదేశ్, సింగపూర్, మలేసియా, ఇండోనేసియా, థాయ్‌లాండ్, శ్రీలంక, ఇండియా, పాకిస్తాన్, సౌదీ అరెబియా, ఖతర్, ఒమన్, యూఏఈ, జిబౌటి, ఈజిప్ట్, టర్కీ, ఇటలీ, ఫ్రాన్స్, మయన్మార్, యెమెన్ దేశాలు సభ్యులుగా ఉన్నాయి.
- ఈ కన్సార్షియంలో బంగ్లాదేశ్ సబ్‌మెరీన్ కేబుల్ కంపెనీ(బీఎస్‌సీసీఎల్), ధిరాగు (మాల్దీవులు), మొబిలి (సౌదీ), సింగ్‌టెల్ (సింగపూర్) తదితర 12 సంస్థలు ఉన్నాయి.
- ఈ వ్యవస్థలో భాగంగా సింగపూర్–చెన్నై–ముంబై మధ్య కేబుల్ నెట్‌వర్క్‌ను ఎయిర్‌టెల్ సహ నిర్మిస్తుంది.
ఎస్‌ఈఏ–ఎంఈ–డబ్ల్యూఈ–6 విపులీకరణ ఇలా..: సౌత్ ఈస్ట్ ఆసియా–మిడిల్ ఈస్ట్–వెస్ట్రన్ యూరప్ 6
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎస్‌ఈఏ–ఎంఈ–డబ్ల్యూఈ–6తో చేతులు కలిపిన సంస్థ?
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు : దేశీ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్
ఎందుకు : ఎస్‌ఈఏ–ఎంఈ–డబ్ల్యూఈ–6 వ్యవస్థలో భాగంగా సింగపూర్–చెన్నై–ముంబై మధ్య కేబుల్ నెట్‌వర్క్‌ను ఎయిర్‌టెల్ సహ నిర్మించేందుకు..
India-Asia-Xpress: ఓషియన్ కనెక్ట్ మాల్దీవ్స్‌తో జత కట్టిన సంస్థ?
ఇండియా–ఆసియా–ఎక్స్‌ప్రెస్(ఐఏఎక్స్) అండర్‌సీ కేబుల్ సిస్టమ్‌ను మాల్దీవుల్లోని హల్‌హమాలే వద్ద భూభాగంపైకి చేర్చనున్నట్లు దేశీ టెలికం రిలయన్స్ దిగ్గజం జియో తాజాగా తెలిపింది. ఇందుకోసం ఓషియన్ కనెక్ట్ మాల్దీవ్స్(ఓసీఎమ్) ప్రైవేట్ లిమిటెడ్‌తో జియో జత కట్టింది. ఫిబ్రవరి 21న రిలయన్స్ జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్, ఓసీఎమ్ చైర్‌పర్సన్ రియాజ్ మన్సూర్ ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశారు. అత్యంత సమర్థమంతమైన, వేగవంతమైన ఈ ఐఏఎక్స్ సిస్టమ్.. హల్‌హమాలేను భారత్, సింగపూర్ వంటి ప్రధాన ఇంటర్నెట్ హబ్‌లకు అనుసంధానం చేస్తుందని జియో తెలిపింది.
ముంబైలో ప్రారంభమై..
ఐఏఎక్స్ సిస్టమ్ ముంబైలో ప్రారంభమై మలేషియా, థాయ్‌లాండ్ మీదుగా సింగపూర్ చేరుతుంది. ఇక ఇండియా–యూరప్–ఎక్స్‌ప్రెస్ (ఐఈఎక్స్) సిస్టమ్.. ముంబై నుంచి మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా దేశాల మీదుగా ఇటలీలోని మిలన్‌కి చేరుతుంది. ఐఏఎక్స్ 2023 ఆఖరు నాటికి, ఐఈఎక్స్ 2024 మధ్యలో అందుబాటులోకి రావచ్చని అంచనా. ఇవి 16,000 కిలోమీటర్ల మేర సెకనుకు 100 గిగాబైట్ల వేగంతో నెట్ అందించగలవు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఓషియన్ కనెక్ట్ మాల్దీవ్స్(ఓసీఎమ్) ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్న టెలికం సంస్థ?
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు : రిలయన్స్ జియో
ఎందుకు : ఇండియా–ఆసియా–ఎక్స్‌ప్రెస్(ఐఏఎక్స్) అండర్‌సీ కేబుల్ సిస్టమ్‌తో మాల్దీవుల్లోని హల్‌హమాలేను అనుసంధానం చేసే ప్రక్రియలో భాగంగా..
PFR-2022: 12వ ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూను ఎక్కడ నిర్వహించారు?
తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రమైన విశాఖపట్నం సముద్ర జలాల్లో ఫిబ్రవరి 21న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ–2022(పీఎఫ్‌ఆర్–2022)ను నిర్వహించారు. భారతదేశ చరిత్రలో పన్నెండవది అయిన ఈ ఫ్లీట్ రివ్యూలో త్రివిధ దళాధిపతి హోదాలో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొన్నారు. భారత యుద్ధనౌక ఐఎన్‌ఎస్ సుమిత్రలో ప్రయాణిస్తూ.. లంగరు వేసిన యుద్ధ నౌకలు, జలాంతర్గాములను ఆయన సమీక్షించారు. అనంతరం ప్రసంగిస్తూ.. ‘సముద్ర జలాల్లో ఎదురవుతున్న సమస్యల్ని తిప్పికొట్టేందుకు స్నేహపూర్వక దేశాలతో కలిసి భారత నౌకాదళం రాజీలేని పోరాటం చేయాలి. హిందూ మహా సముద్రంలో ప్రధాన భద్రతా భాగస్వామిగా భారత్ వ్యవహరించాలి’ అని ఆకాంక్షించారు. 70 శాతం నౌకలు స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతుండటం శుభ పరిణామం అని పేర్కొన్నారు.
12వ ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ–ముఖ్యాంశాలు
- భారతదేశ చరిత్రలో ఇది 12వ ఫ్లీట్ రివ్యూ. దేశ తూర్పు తీరంలో మూడో సమీక్షగా విశాఖలో జరిగింది.
- విశాఖలోని హార్బర్‌కు చేరుకున్న రాష్ట్రపతి కోవింద్‌కి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్, నాలుగు నౌకాదళ కమాండ్‌ల చీఫ్‌లు వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా, వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్, వైస్ అడ్మిరల్ హంపిహోలి, లెఫ్టినెంట్ జనరల్ అజయ్ సింగ్ తదితరులు స్వాగతం పలికారు.
- తొలుత 21 తుపాకులతో భారత నౌకాదళం సమర్పించిన గౌరవ వందనాన్ని స్వీకరించిన రాష్ట్రపతి.. ప్రెసిడెన్షియల్ యాచ్‌గా సిద్ధంగా ఉన్న ఐఎన్‌ఎస్ సుమిత్ర యుద్ధనౌకలో సతీసమేతంగా సమీక్షకు బయలుదేరారు.
- రెండు గంటలకు పైగా సాగిన నౌకాదళ సమీక్షలో ఇండియన్ నేవీ.. తన సామర్థ్యాల్ని ఘనంగా ప్రదర్శించింది.
- పీఎఫ్‌ఆర్–2022కు తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా సమన్వయకర్తగా వ్యవహరించారు.
- ప్రతి పీఎఫ్‌ఆర్ లేదా ఐఎఫ్‌ఆర్ నిర్వహించిన తర్వాత దాని పేరుతో పోస్టల్ స్టాంప్, కవర్ విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 21న పీఎఫ్‌ఆర్–2022 జ్ఞాపకార్థం తపాలా శాఖ రూపొందించిన స్టాంప్, పోస్టల్ కవర్‌ని నేవల్ బేస్‌లో రాష్ట్రపతి ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ–2022 నిర్వహణ
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు : భారత నావికాదళం
ఎక్కడ : విశాఖపట్నం సముద్ర జలాలు, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : నౌకాదళంపై సమీక్ష నిర్వహించేందుకు..
Chess: ప్రపంచ నంబర్‌వన్ కార్ల్‌సన్‌పై గెలుపొందిన భారతీయుడు?
ఐదుసార్లు ప్రపంచ చాంపియన్, వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)పై భారత టీనేజ్ గ్రాండ్‌మాస్టర్, చెన్నైకి చెందిన ఆర్. ప్రజ్ఞానంద సంచలన విజయం సాధించాడు. ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో 16 ఏళ్ల ప్రజ్ఞానంద దిగ్గజ గ్రాండ్‌మాస్టర్ కార్ల్‌సన్‌కు చెక్ పెట్టాడు. ఎనిమిదో రౌండ్ గేమ్‌లో 39 ఎత్తుల్లో 2013 నుంచి ప్రపంచ టైటిల్‌ను నిలబెట్టుకుంటున్న కార్ల్‌సన్‌ను ఓడించాడు. గతంలో ఇద్దరు భారత గ్రాండ్‌మాస్టర్లు మాత్రమే అతన్ని ఓడించగలిగారు. కానీ ఓ జూనియర్ ఆటగాడు ఓడించడం ఇదే తొలిసారి. 16 మంది గ్రాండ్ మాస్టర్ల మధ్య 15 రౌండ్ల పాటు జరిగే ఈ ర్యాపిడ్ చెస్ టోర్నీలో ప్రస్తుతం ప్రజ్ఞానంద ఉమ్మడిగా 12వ స్థానంలో కొనసాగుతున్నాడు.
మూడో భారత ఆటగాడిగా..
క్లాసికల్ / ర్యాపిడ్ / ఎగ్జిబిషన్... ఇలా ఏ ఫార్మాట్ గేమ్‌లలోనైనా కలిపి కార్ల్‌సన్‌ను ఓడించిన మూడో భారత ఆటగాడిగా ప్రజ్ఞానంద నిలిచాడు. గతంలో విశ్వనాథన్ ఆనంద్ 19 సార్లు, పెంటేల హరికృష్ణ 2 సార్లు కార్ల్‌సన్‌పై విజయం సాధించారు.
చదవండి: Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 22 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్