Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 21 కరెంట్ అఫైర్స్
Andhra Pradesh IT Minister: ఏపీ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(50) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 21న కన్నుమూశారు. వైద్యులు గౌతమ్‌రెడ్డిని ఐసీయూలో చేర్చి అత్యవసర సేవలు అందించినా ప్రాణాలు దక్కలేదు. 1971 నవంబర్2న జన్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచిఎమ్మెస్సీ పూర్తి చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికలతో రాజకీయ అరంగేట్రం చేశారు. నెల్లూరు జిల్లా అత్మకూరు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి గెలుపొందారు. రెండుసార్లు ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచారు.
100 Kisan Drones: దేశంలోని ఎన్ని ప్రాంతాల్లో కిసాన్ డ్రోన్‌లను ప్రారంభించారు?
పంట భూముల్లో క్రిమిసంహారకాలు, వ్యవసాయ ఉత్పత్తులను చల్లేందుకు వాడే ‘కిసాన్ డ్రోన్’లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశంలోని 100 ప్రాంతాల్లో ఒకేసారి ఢిల్లీ నుంచి వర్చువల్ పద్ధతిలో ఫిబ్రవరి 18న ఈ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. డ్రోన్ రంగం భారత్‌లో వేగంగా విస్తరిస్తోందని, ప్రపంచ డ్రోన్ విపణిలో కొత్త నాయకత్వ స్థాయికి ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘రానున్న రోజుల్లో రైతులు తమ పంటను తక్కువ సమయంలోనే డ్రోన్ల సాయంతో మార్కెట్లకు తరలించవచ్చు. ఆదాయం పెరుగుతుంది. 21వ శతాబ్దిలో అధునాతన సాగు విధానాల్లో డ్రోన్ అనే కొత్త అధ్యాయం మొదలైంది.’’ అని పేర్కొన్నారు.
2022–23 బడ్జెట్‌లో..
వ్యవసాయ రంగంలో కిసాన్ డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించనున్నట్లు ‘‘కేంద్ర బడ్జెట్ 2022–23’’లో ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం... పంటల మదింపు, పురుగుల మందుల పిచికారీ, ఎరువులు జల్లడం వంటివన్నీ కిసాన్ డ్రోన్లు చేస్తాయి. వ్యవసాయ రంగం మరింత పారదర్శకంగా ఉండేందుకు భూ రికార్డుల్ని డిజిటలైజేషన్‌కి కూడా డ్రోన్ల సాయంతో చేస్తారు. ఇక డ్రోన్ శక్తి కార్యక్రమాన్ని మరింత శక్తిమంతంగా అమలు చేయడానికి స్టార్టప్‌లు ఏర్పాటు చేయనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలోని 100 ప్రాంతాల్లో కిసాన్ డ్రోన్‌ల ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎందుకు : పంట భూముల్లో పురుగుల మందుల పిచికారీ, ఎరువులు జల్లడం వంటి వాటి కోసం..
IMLD 2022 Theme: అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
2000 ఏడాది నుంచి భాషలు, సంస్కృతుల వైవిధ్యాన్ని మరియు బహుళ భాషల వాడకాన్ని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం నిర్వహించుకుంటారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఆలోచనను ప్రతిపాదించింది బంగ్లాదేశ్. ఇది 1999లో యునెస్కో సర్వసభ్య సమావేశంలో ఆమోదం పొంది, 2000 నుంచి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (యుఎన్‌జీఏ) 2008ను అంతర్జాతీయ భాషల సంవత్సరంగా ప్రకటించింది. ప్రపంచ జనాభాలో 40 శాతం మంది వారు మాట్లాడే లేదా అర్థమయ్యే భాషలో చదవలేరు. బహుభాషా విద్యలో, ముఖ్యంగా ప్రారంభ విద్యలో మాతృభాషలో చదువు గురించి గురించి ప్రజల్లో అవగాహన పెరిగింది. దేశంలో మానవ వనరుల, అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ రోజును విద్యాసంస్థలు, భాషా సంస్థలతో కలిసి మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటుంది.
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం-2022 థీమ్: “యూజింగ్ టెక్నాలజీ ఫర్ మల్టీలింగ్వల్ లెర్నింగ్: ఛాలెంజెస్ అండ్ అపార్చునిటీస్”(“Using technology for multilingual learning: Challenges and opportunities”)
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రతి ఏటా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు : ప్రపంచ దేశాలు..
ఎందుకు : భాషలు, సంస్కృతుల వైవిధ్యాన్ని మరియు బహుళ భాషల వాడకాన్ని ప్రోత్సహించడానికి..
Tennis Tournament: ఐటీఎఫ్ డబుల్స్ విభాగంలో చాంపియన్‌గా నిలిచిన జోడీ?
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీ డబుల్స్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన భమిడిపాటి శ్రీవల్లి రష్మిక–హుమేరా బహార్మస్ జంట చాంపియన్‌గా నిలిచింది. హరియాణాలోని గురుగ్రామ్‌లో ఫిబ్రవరి 19న ముగిసిన ఈ టోర్నీ డబుల్స్ ఫైనల్లో రష్మిక–హుమేరా జంట 6–3, 1–6, 10–3తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ పునిన్ కొవాపితుక్‌డెట్ (థాయ్‌లాండ్)–అనా ఉరెకె (రష్యా) జోడీపై గెలిచింది. రష్మిక–హుమేరాలకు ఇదే తొలి ఐటీఎఫ్ డబుల్స్ టైటిల్ కావడం విశేషం.
సాకేత్ మైనేని ఏ క్రీడకు చెందినవాడు?
బెంగళూరు ఓపెన్–2 ఏటీపీ చాలెంజర్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేనికి నిరాశ ఎదురైంది. డబుల్స్ ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ (భారత్) జంట రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో సాకేత్–రామ్‌ద్వయం 3–6, 7–6 (7/4), 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో ఎర్లెర్ (ఆస్ట్రియా)–అర్జున్ ఖడే (భారత్) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీ డబుల్స్ విభాగంలో చాంపియన్‌గా నిలిచిన జోడీ?
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : భమిడిపాటి శ్రీవల్లి రష్మిక(హైదరాబాద్)–హుమేరా బహార్మస్ జంట(హైదరాబాద్)
ఎక్కడ : గురుగ్రామ్, హరియాణ
ఎందుకు : డబుల్స్ ఫైనల్లో రష్మిక–హుమేరా జంట 6–3, 1–6, 10–3తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ పునిన్ కొవాపితుక్‌డెట్ (థాయ్‌లాండ్)–అనా ఉరెకె (రష్యా) జోడీపై గెలిచినందున..
Andhra Pradesh's new DGP: రాష్ట్ర డీజీపీగా అత్యధిక కాలం పని చేసిన అధికారి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి(కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి) నియమితులయ్యారు. పూర్తి అదనపు బాధ్యతలతో రాష్ట్ర డీజీపీగా ఫిబ్రవరి 19న ఆయన మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో గౌతం సవాంగ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు పూర్తి భద్రత కల్పించడమే తన ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.
డీజీపీగా అత్యధిక కాలం పని చేసిన సవాంగ్
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం అత్యధిక కాలం డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించిన పోలీసు అధికారిగా గౌతం సవాంగ్ రికార్డు సృష్టించారు. ఆయన రెండు సంవత్సరాల ఎనిమిది నెలల 18 రోజులపాటు రాష్ట్ర పోలీస్ బాస్‌గా కీలకమైన స్థానంలో కొనసాగారు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి అంటే 2014 జూన్ 2 నుంచి 2022 ఫిబ్రవరి 18 వరకు ఏపీలో ఐదుగురు డీజీపీలుగా వ్యవహరించారు.
రాష్ట్ర విభజన తర్వాత డీజీపీలు |
||
పేరు |
పని చేసిన కాలం |
పని చేసిన రోజులు |
జేవీ రాముడు |
2014 జూన్ 2 – 2016 జూలై 23 |
25 నెలల 21 రోజులు |
ఎన్.సాంబశివరావు |
2016 జూలై 23 – 2017 డిసెంబర్ 31 |
17 నెలల 8 రోజులు |
ఎం.మాలకొండయ్య |
2017 డిసెంబర్ 31 – 2018 జూన్ 30 |
6 నెలలు |
ఆర్పీ ఠాకూర్ |
2018 జూన్ 30 – 2019 మే 31 |
11 నెలలు |
గౌతం సవాంగ్ |
2019 జూన్ 1 – 2022 ఫిబ్రవరి 19 |
32 నెలల 18 రోజులు |
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి(కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి)
ఎక్కడ : మంగళగిరి, గుంటూరు జిల్లా
ఎందుకు : ఇప్పటివరకు రాష్ట్ర డీజీపీగా ఉన్న గౌతం సవాంగ్ బదీలీ నేపథ్యంలో..
ISRO: చిన్న ఉపగ్రహాల కోసం ఇస్రో రూపొందించిన రాకెట్ పేరు?
అతి తక్కువ వ్యయంతో ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపిస్తూ ప్రపంచ దేశాలను ఆకర్షించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఇప్పుడు చిన్న చిన్న ఉపగ్రహాలపై దృష్టి పెట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్(ఎస్‌ఎస్‌ఎల్‌వీ)ను కూడా తయారు చేసింది. 2022, మార్చి నెలలోనే దీనిని ప్రయోగించేందుకు సిద్ధమైంది. 2022 ఏడాది చివరి నాటికి ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా వంద కిలోల నుంచి 500 కిలోల బరువు కలిగిన 6,000 ఉపగ్రహాలను ప్రయోగించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.
34 మీటర్ల ఎత్తు.. రెండు మీటర్ల వ్యాసార్థం..
ఇప్పటిదాకా ఇస్రో ఎస్‌ఎల్‌వీ, ఏఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ మార్క్3 అనే ఐదు రకాల రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను రోదసీలోకి పంపిస్తోంది. తాజాగా వీటి సరసన ఎస్‌ఎస్‌ఎల్‌వీ చేరబోతోంది. దీన్ని నాలుగు దశల్లో ప్రయోగించే విధంగా డిజైన్ చేశారు. 34 మీటర్ల ఎత్తు, రెండు మీటర్ల వ్యాసార్థం కలిగి ఉంటుంది. ప్రయోగ సమయంలో 120 టన్నుల బరువు ఉండే ఈ రాకెట్‌ను.. 500 కిలోల బరువు కలిగిన ఉపగ్రహాలను భూమికి అతి దగ్గరగా వున్న లియో ఆర్బిట్‌లో ప్రవేశపెట్టే విధంగా డిజైన్ చేశారు.
కొత్తగా వెలాసిటీ టైమింగ్ మాడ్యూల్..
ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను వర్టికల్ పొజిషన్‌లో పెట్టి ప్రయోగించనున్నారు. ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్‌లోని మొదటి, రెండు, మూడు దశలను ఘన ఇంధనంతో ప్రయోగించే విధంగా డిజైన్ చేశారు. ఇందులో ద్రవ ఇంధనం దశ ఉండదు. వెలాసిటీ టైమింగ్ మాడ్యూల్ అనే దశను కొత్తగా అమర్చారు. ఆ దశలోనే ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెడతారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్(ఎస్‌ఎస్‌ఎల్‌వీ) తయారీ
ఎప్పుడు : ఫిబ్రవరి 20
ఎవరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)
ఎందుకు : చిన్న చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు..
Andhra Pradesh: పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్‌స్టిట్యూట్‌ను ఎక్కడ ప్రారంభించారు?
వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలోని రిమ్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పుష్పగిరి కంటి ఆస్పత్రి(పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్‌స్టిట్యూట్)ని ఫిబ్రవరి 20న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. 2.05 ఎకరాల స్థలంలో రూ.20 కోట్లతో నిర్మించిన ఈ ఆస్పత్రిని ప్రారంభించడం ద్వారా ప్రజలకు అత్యాధునిక కంటి వైద్యం అందుబాటులోకి వచ్చింది.
విశాఖలో రాష్ట్రపతి..
భారత నౌకాదళ శక్తి పాటవాలను సమీక్షించేందుకు సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేరుకున్నారు. ఫిబ్రవరి 20న ఆయనకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఫిబ్రవరి 21న విశాఖలో ప్రారంభమయ్యే ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్‌ఆర్)లో ప్రెసిడెన్షియల్ యాచ్‌గా ఉన్న ఐఎన్‌ఎస్ సుమిత్ర నుంచి మొత్తం 60 యుద్ధనౌకలను త్రివిధ దళాధిపతి హోదాలో రాష్ట్రపతి కోవింద్ సమీక్షించనున్నారు. చివరిగా భారతీయ నౌకాదళాలకు చెందిన యుద్ధ విమానాలన్నీ ఏకకాలంలో పైకి ఎగిరి రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పిస్తాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పుష్పగిరి కంటి ఆస్పత్రి(పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్‌స్టిట్యూట్) ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 20
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : రిమ్స్, కడప, వైఎస్సార్ జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ప్రజలకు అత్యాధునిక కంటి వైద్యం అందించేందుకు..
Startups: ప్రస్తుతం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు?
స్టార్టప్‌ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. 20 శాతం వరకు పరిమిత వాటాలను తీసుకోవడం ద్వారా స్టార్టప్‌లకు అదనపు నిధులను సమకూర్చనున్నట్టు ఫిబ్రవరి 20న చెప్పారు. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ఇప్పటికే ప్రకటన చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇతర ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్ మాదిరే ఈ నిధిని ప్రైవేటు ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తారని సీఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా చెప్పారు. ప్రస్తుతం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ ఉన్నారు.
గుజరాత్ టైటాన్స్ లోగో ఆవిష్కరణ..
2022 ఏడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేయబోతున్న గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ జట్టు లోగోను విడుదల చేసింది. ఎగిరే గాలిపటం ఆకారం స్ఫూర్తిగా ఈ లోగోను రూపొందించినట్లు జట్టు వర్గాలు వెల్లడించాయి. గుజరాత్ సాంస్కృతిక వారసత్వంలో గాలిపటాలు భాగమని, ఉత్తరాయణ పండుగలో గాలిపటాలు ఎగరవేయడం ఆనవాయితీ అని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్టార్టప్‌ల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 20
ఎవరు : కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
ఎందుకు : 20 శాతం వరకు పరిమిత వాటాలను తీసుకోవడం ద్వారా స్టార్టప్‌లకు అదనపు నిధులను సమకూర్చేందుకు..
Russia-Ukraine Crisis: బెలారస్‌తో కలిసి సైనిక విన్యాసాలు చేపట్టిన దేశం?
యూరప్‌లో యుద్ధ ఘంటికలు మోగుతున్నాయి. సైన్యానికి, రష్యా అనుకూల రెబెల్స్‌కు మధ్య నానాటికీ పెరుగుతున్న కాల్పుల మోతతో తూర్పు ఉక్రెయిన్ సరిహద్దులు దద్దరిల్లుతున్నాయి. దాంతో రెబల్స్ ఆక్రమిత ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు రష్యా బాట పడుతున్నారు. ఉక్రెయిన్‌కు మూడువైపులా రష్యా సైనిక మోహరింపులు రెండు లక్షలకు చేరాయన్న వార్తలు యూరప్ దేశాలను మరింత ఆందోళన పరుస్తున్నాయి. ఫిబ్రవరి 19వ తేదీనాటి అణు, సంప్రదాయ సైనిక విన్యాసాలకు కొనసాగింపుగా నల్లసముద్ర తీరంలో రష్యా జోరుగా నావికా విన్యాసాలకు కూడా దిగింది. బెలారస్‌తో ఫిబ్రవరి 20న ముగియాల్సిన సంయుక్త సైనిక విన్యాసాలు మరికొద్ది రోజులు కొనసాగుతాయని ప్రకటించి ఉద్రిక్తతలను మరింత పెంచింది. విన్యాసాలను పొడిగించినట్టే ఏదో సాకుతో రష్యా యుద్ధానికీ దిగుతుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆరోపించారు.
రష్యా–ఉక్రెయిన్ బలాబలాలు
రష్యా, ఉక్రెయిన్ మిలటరీ బలాబలాలను చూస్తే ఎక్కడా పొంతన కుదరదు. రష్యా మిలటరీని ఉక్రెయిన్ నామమాత్రంగా కూడా ఢీ కొనలేదు. అయినప్పటికీ అమెరికా, బ్రిటన్ అండదండలతో ఆ దేశం ధీమాగా ఉంది. అగ్రరాజ్యాలు తమ రక్షణ కోసం నాటో బలగాల్ని తరలిస్తారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ఆశతో ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 12 దేశాలు సభ్యులుగా మొదలైన నాటోలో ప్రస్తుతం 30 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, డెన్మార్క్ వంటి దేశాలతో కూడిన నాటో బలగాలు ఉక్రెయిన్‌కి అండగా నిలిస్తే ఇరు పక్షాల మధ్య భీకర పోరు జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మిలటరీ ఉన్న దేశాల్లో రష్యా అయిదో స్థానంలో ఉంది.
చదవండి: Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 19 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్