Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 19 కరెంట్‌ అఫైర్స్‌

DA-CAs-Feb-19

2008 Ahmedabad Serial Blasts Case: 38 మందికి మరణశిక్ష, 11 మందికి జీవితఖైదు

2008 Ahmedabad bombings

2008 Ahmedabad Bombings: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని లక్ష్యం చేసుకుని జరిగిన 2008 అహ్మదాబాద్‌ వరుస పేలుళ్ల కేసులో 38 మంది ఇండియన్‌ ముజాహిదీన్‌ ముష్కరులకు మరణశిక్ష పడింది. వాళ్లను చనిపోయేదాకా ఉరి తీయాలని ప్రత్యేక కోర్టు జడ్జి ఏఆర్‌ పటేల్‌ ఆదేశించారు. మరో 11 మందికి జీవితఖైదు విధించారు. ఈ మేరకు ఫిబ్రవరి 18న ఆయన 7,000 పేజీల పైచిలుకు తీర్పు వెలువరించారు. ఒకే కేసులో ఏకంగా ఇంతమందికి మరణ శిక్ష పడటం మన దేశ న్యాయ చరిత్రలో ఇదే తొలిసారి. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో 26 మందికి మరణ శిక్ష విధించడమే ఇప్పటిదాకా రికార్డు.

ఈ పేలుళ్ల ద్వారా..
అహ్మదాబాద్‌ పేలుళ్ల ద్వారా అప్పుడు గుజరాత్‌ సీఎంగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీని చంపాలన్నది కూడా కుట్రదారుల లక్ష్యమని జడ్జి తన తీర్పులో చెప్పారు. నాటి గుజరాత్‌ హోం మంత్రి, ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో పాటు అప్పటి మోదీ మంత్రివర్గ సహచరులు ఆనందీబెన్‌ పటేల్, నితిన్‌ పటేల్, స్థానిక ఎమ్మెల్యే ప్రదీప్‌సింగ్‌ జడేజా తదితరులను కూడా చంపాలన్నది ఉగ్రవాదుల ప్లాన్‌ అని పేర్కొన్నారు.

14 ఏళ్ల పాటు విచారణ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి 2009లో విచారణ మొదలైంది. ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన 78 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వారిలో ఒకరు 2019లో అప్రూవర్‌గా మారారు. 49 మందిని దోషులుగా ఫిబ్రవరి 8న కోర్టు తేల్చింది. మరో 28 మందిని వదిలేసింది. దోషుల్లో 48 మందికి రూ.2.85 లక్షలు, మరొకరికి రూ.2.88 లక్షలు జరిమానా విధించారు. మరణశిక్ష పడ్డ వాళ్లలో ప్రధాన కుట్రదారులైన మధ్యప్రదేశ్‌కు చెందిన సఫ్దర్‌ నగోరీ, కమ్రుద్దీన్‌ నగోరీ, గుజరాత్‌కు చెందిన ఖయాముద్దీన్‌ కపాడియా, జహీద్‌ షేక్, షంషుద్దీన్‌ షేక్‌ తదితరులున్నారు.

ఏం జరిగింది?

  • 2008 జూలై 26న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ను వరుస బాంబు పేలుళ్లు వణికించాయి. 
  • సాయంత్రం 6.45 నుంచి గంటంపావు పాటు 14 చోట్ల 21 పేలుళ్లతో నగరం దద్దరిల్లిపోయింది. 
  • 56 మంది చనిపోగా 200 మందికి పైగా గాయపడ్డారు. మరో రెండు బాంబులు పేలలేదు. 
  • ఇది తమ పనేనని సిమి కనుసన్నల్లో నడిచే ఇండియన్‌ ముజాహిదీన్‌ ప్రకటించుకుంది. 
  • తర్వాత రెండు రోజుల్లో సూరత్‌లో 29 లైవ్‌ బాంబులు దొరకగా నిర్వీర్యం చేశారు. 
  • 2002 గోధ్రా అనంతర అల్లర్లకు ప్రతీకారంగా పేలుళ్లకు పాల్పడ్డట్టు నిందితులు పేర్కొన్నారు. 
  • పేలుళ్ల కుట్ర 2007లో కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో అడవుల్లో ఐఎం క్యాంపులో జరిగింది. 
  • దేశవ్యాప్తంగా రిక్రూట్‌ చేసుకున్న 50 మందికి అక్కడ పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చారు. 
  • పేలుళ్లకు పాల్పడుతున్నట్టు సరిగ్గా 5 నిమిషాల ముందు మీడియా సంస్థలకు ఉగ్రవాదులు ఇ–మెయిళ్లు పంపారు.

విచారణ–విశేషాలు

  • అహ్మదాబాద్‌లో నమోదైన 20 ఎఫ్‌ఐఆర్‌లు, సూరత్‌లో నమోదైన 15 ఎఫ్‌ఐఆర్‌లను కలిపి విచారణ చేపట్టారు.
  • ప్రస్తుత గుజరాత్‌ డీజీపీ ఆశిష్‌ భాటియా సారథ్యంలో విచారణ మొదలైంది. 
  • విచారణ కోసం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. బేలా త్రివేది నుంచి ఏఆర్‌ పటేల్‌ దాకా మొత్తం 9 మంది జడ్జీలు విచారణ జరిపారు.
  • నిందితుల్లో 24 మంది 213 అడుగుల సొరంగం తవ్వి పారిపోయే ప్రయత్నం చేశారు.

Centre Govt: నేషనల్‌ డామ్‌ సేఫ్టీ అథారిటీ కార్యాలయం ఎక్కడ ఉంది?

దేశంలో నదులపై ఆనకట్టల భద్రతా ప్రమాణాల నిర్వహణకు ఉద్దేశించిన జాతీయ ఆనకట్ట భద్రతా అథారిటీ(నేషనల్‌ డామ్‌ సేఫ్టీ అథారిటీ) ఏర్పాటైంది. డ్యామ్‌ సేఫ్టీ చట్టం ప్రకారం కొత్త అథారిటీ ఫిబ్రవరి 18వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర జల్‌ శక్తి  శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆనకట్టలకు సంబంధించి అంతరాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించడం, ఆనకట్టల సంబంధిత విపత్తుల నివారణ తదితర బాధ్యతలను ఈ అథారిటీ నిర్వహిస్తుంది. ఇందులో ఒక చైర్మన్, ఐదుగురు సభ్యులుంటారు. అథారిటీ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
జాతీయ ఆనకట్ట భద్రతా అథారిటీ(నేషనల్‌ డామ్‌ సేఫ్టీ అథారిటీ) ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు    : కేంద్ర జల్‌ శక్తి  శాఖ
ఎక్కడ    : ఢిల్లీ
ఎందుకు : దేశంలో నదులపై ఆనకట్టల భద్రతా ప్రమాణాల నిర్వహణకు..

Storm Eunice: యూకేను వణికిస్తున్న ‘యూనిస్‌’

Strom Eunice

గంటకు 90 మైళ్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో యూనిస్‌ తుపాను బ్రిటన్‌ను భయపెడుతోంది. వారం వ్యవధిలోనే దూసుకొచ్చిన ఈ రెండో తుపాను తీవ్రతపై యూకే ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. తీర ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ప్రయాణాలను మానుకుని ఇళ్లకే పరిమితం కావాలని ప్రజలను హెచ్చరించింది. యూనిస్‌ తుపాను ప్రభావంతో జర్మనీ, పోలండ్‌లలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఆస్ట్రేలియాలో తుపానులను ఏ పేరుతో పిలుస్తారు?
చక్రవాతాలు లేదా తుపానులను స్థానికంగా వివిధ పేర్లతో పిలుస్తారు. అవి.. 
కరేబియన్‌ సముద్రం – హరికేన్లు
దక్షిణ చైనా సముద్రం – టైఫూన్లు
ఆస్ట్రేలియా తీరం – విల్లీ విల్లీ
ఫిలిప్పైన్‌ సముద్రం – బాగీలు
జపాన్‌ సముద్రం – కైఫూలు
బంగ్లాదేశ్‌ తీరం – గురింద్‌లు
భారత తీరం – తుపానులు/చక్రవాతాలు

అణు విన్యాసాలు చేయనున్నట్లు ప్రకటించిన దేశం?
ఉక్రెయిన్‌ వివాదం నేపథ్యంలో.. తమ బలగాల సన్నద్ధతను, అణు, సంప్రదాయ ఆయుధాలను పరీక్షించుకునేందుకు ఫిబ్రవరి 19న భారీ సాయుధ కసరత్తుకు దిగుతున్నట్టు రష్యా సైన్యం పేర్కొంది. అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లగల ఖండాంతర బాలిస్టిక్‌ మిసైళ్లు, క్రూయిజ్‌ మిసైళ్లతో పాటు పూర్తిస్థాయి సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ జరిగే ఈ విన్యాసాలను అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారని రక్షణ శాఖ పేర్కొంది. యుద్ధమే జరిగితే వినాశనానికే దారితీస్తుందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఫిబ్రవరి 18న హెచ్చరించారు.

Tennis Tournament: ఖతర్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన జంట?

Rohan Bopanna and Denis Shapovalov

ఖతర్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీలో రోహన్‌ బోపన్న (భారత్‌)– డెనిస్‌ షపోవలోవ్‌ (కెనడా) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. ఖతర్‌ రాజధాని నగరం దోహాలో ఫిబ్రవరి 18న జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో బోపన్న–షపోవలోవ్‌ జోడీ 6–7 (4/7), 1–6తో వెస్లీ కూలాఫ్‌ (నెదర్లాండ్స్‌)–నీల్‌ స్కప్‌స్కీ (బ్రిటన్‌) జంట చేతిలో ఓడిపోయింది. రన్నరప్‌గా నిలిచిన బోపన్న–షపోవలోవ్‌ జోడీకి 29,240 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 21 లక్షల 80 వేలు) లభించింది.

బిహార్‌ బ్యాటర్‌ సకీబుల్‌ ప్రపంచ రికార్డు
2021–22 రంజీ ట్రోఫీ రెండో రోజు వ్యక్తిగత విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. కోల్‌కతాలో మిజోరం జట్టుతో జరుగుతున్న ‘ప్లేట్‌’ గ్రూప్‌ మ్యాచ్‌లో ఫిబ్రవరి 18న బిహార్‌ బ్యాటర్‌ సకీబుల్‌ గని ట్రిపుల్‌ సెంచరీతో చెలరేగాడు. తద్వారా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ చరిత్రలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్‌ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా సకీబుల్‌ నిలిచాడు. 405 బంతులు ఎదుర్కొన్న సకీబుల్‌ 56 ఫోర్లు, 2 సిక్సర్లతో 341 పరుగులు సాధించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు భారత్‌కే చెందిన అజయ్‌ రొహెరా (267 నాటౌట్‌–మధ్యప్రదేశ్‌; 2018లో హైదరాబాద్‌పై) పేరిట ఉంది. బిహార్‌ తరఫున 14 దేశవాళీ వన్డేలు, 11 టి20 మ్యాచ్‌లు ఆడిన సకీబుల్‌ ఈ మ్యాచ్‌తోనే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఖతర్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన జంట?
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు    : రోహన్‌ బోపన్న (భారత్‌)–డెనిస్‌ షపోవలోవ్‌ (కెనడా) ద్వయం
ఎక్కడ    : దోహా, ఖతర్‌
ఎందుకు : పురుషుల డబుల్స్‌ ఫైనల్లో బోపన్న–షపోవలోవ్‌ జోడీ 6–7 (4/7), 1–6తో వెస్లీ కూలాఫ్‌ (నెదర్లాండ్స్‌)–నీల్‌ స్కప్‌స్కీ (బ్రిటన్‌) జంట చేతిలో ఓడిపోయినందున..

CEPA: భారత్‌తో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం చేసుకున్న దేశం?

Piyush Goyal-Abdulla bin Touq Al-Marri

భారత్‌–యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు మరింత పటిష్టమయ్యే కీలక ఒప్పందం ఫిబ్రవరి 18న జరిగింది. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) పేరుతో జరిగిన స్వేచ్చా వాణిజ్య ఒప్పంద (ఎఫ్‌టీఏ) పత్రాలపై భారత్‌ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్, యూఏఈ ఆర్థిక వ్యవహారాల మంత్రి అబ్దుల్లా బిన్‌ తౌక్‌ అల్‌ మరీ.. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సంతకాలు చేశారు. ఒప్పంద పత్రాలను ఒకరికొకరు మార్చుకున్నారు. అనంతరం  మాట్లాడుతూ, ఈ ఒప్పందం వల్ల రెండు దేశాలకూ బహుళ ప్రయోజనాలు ఒనగూరుతాయని పేర్కొన్నారు.

ఒప్పందం ప్రకారం..
తాజా ఒప్పందం ప్రకారం.. రెండు దేశాల మధ్య గరిష్ట స్థాయి ఉత్పత్తులపై కస్టమ్స్‌ సుంకాలు తగ్గుతాయి. సేవలు, పెట్టుబడులకు సంబంధించి పలు నిబంధనలను సరళతరం అవుతాయి. వస్తువులు, సేవలు, నిబంధనలు, కస్టమ్స్‌ విధానాలు, ప్రభుత్వ సేకరణ, మేధో సంపత్తి హక్కులు, ఈ–కామర్స్‌తో సహా పలు అంశాలు తాజా ఒప్పందం పరిధిలోకి వస్తాయి.

సంయుక్త విజన్‌ ప్రకటన..
2021, సెప్టెంబర్‌లో భారత్, యూఏఈ వాణిజ్య ఒప్పంద చర్చలను  లాంఛనంగా ప్రారంభించాయి. తాజా ఒప్పందంపై సంతకాలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అబుదాబి క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌లు ఒక వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు ‘‘భారతదేశం–యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం: కొత్త హద్దులు, మైలురాయి‘ అనే పేరుతో సంయుక్త విజన్‌ ప్రకటనను విడుదల చేశారు.

100 బిలియన్‌ డాలర్లకు..
ప్రస్తుతం భారత్, యూఏఈ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ దాదాపు 60 బిలియన్‌ డాలర్లు ఉంటే, ఇది వచ్చే ఐదేళ్లలో 100 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా. ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ప్రపంచంలోని ఇతర దేశాలకు యూఏఈ ఒక గేట్‌వేగా ఉండడం మరో కీలక అంశం.

స్మారక స్టాంప్‌ ఆవిష్కరణ:
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవడం, యూఏఈ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఇరు దేశాల నాయకులు పీయూష్‌ గోయెల్, బ్దుల్లా బిన్‌ తౌక్‌ అల్‌ మరీ సంయుక్త స్మారక స్టాంప్‌ను విడుదల చేశారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) చేసుకున్న దేశాలు?
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు    : భారత్‌–యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు మరింత పటిష్టమయ్యేందుకు..

Electric Vehicles: కామన్‌ సర్వీస్‌ సెంటర్స్‌తో ఒప్పందం చేసుకున్న సంస్థ?

CSC

ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ తాజాగా ప్రభుత్వ సంస్థ కామన్‌ సర్వీస్‌ సెంటర్స్‌తో (సీఎస్‌సీ) భాగస్వామ్యం కుదుర్చుకుంది. సీఎస్‌సీ సహకారంతో మహీంద్రా తయారీ ట్రియో, ఆల్ఫా వాహనాలను ఔత్సాహిక కస్టమర్లకు చేరుస్తారు. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరిగేందుకు, మారుమూల ప్రాంతాల్లో కంపెనీ విస్తరణకు ఈ భాగస్వామ్యం దోహదం చేస్తుందని మహీంద్రా ఎలక్ట్రిక్‌ తెలిపింది. ఉద్యోగావకాశాలను కల్పించేందుకు గ్రామీణ భారత్‌లో సీఎస్‌సీ కృషిచేస్తోంది.

ఇంటర్‌గ్లోబ్‌ బోర్డుకు గంగ్వాల్‌ రాజీనామా
ఇండిగో బ్రాండు విమానయాన కంపెనీ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ బోర్డుకు కంపెనీ సహవ్యవస్థాపకుడు రాకేష్‌ గంగ్వాల్‌ రాజీనామా చేశారు. రానున్న ఐదేళ్లలో కంపెనీలోగల వాటాను నెమ్మదిగా తగ్గించుకోనున్నట్లు వెల్లడించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రభుత్వ సంస్థ కామన్‌ సర్వీస్‌ సెంటర్స్‌తో (సీఎస్‌సీ) భాగస్వామ్య ఒప్పందం చేసుకున్న సంస్థ?
ఎప్పుడు  : ఫిబ్రవరి 18
ఎవరు    : మహీంద్రా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ
ఎందుకు : ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరిగేందుకు, మారుమూల ప్రాంతాల్లో కంపెనీ విస్తరణకు..

Electronic Chip: చిప్‌ల తయారీలో రూ.1,49,200 కోట్ల పెట్టుబడి పెట్టునున్న సంస్థ?

Vedanta

ఎలక్ట్రానిక్‌ చిప్, డిస్‌ప్లే తయారీ విభాగాల కోసం రూ.1,49,200 కోట్ల వరకు పెట్టుబడి చేయనున్నట్టు పారిశ్రామిక దిగ్గజ సంస్థ వేదాంత ఫిబ్రవరి 18న ప్రకటించింది. 2024 కల్లా డిస్‌ప్లే ఉత్పత్తి కేంద్రం, 2025 నాటికి చిప్స్‌ తయారీ ప్లాంట్‌ సిద్ధం కానుంది. మొత్తం ఉత్పత్తిలో 25–30 శాతం ఎగుమతి చేయనున్నారు. తయారీ కేంద్రాల స్థాపనకై ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్టు కంపెనీ తెలిపింది.

ప్రోత్సాహకాలను ప్రకటించిన తర్వాత..
భారత్‌లో సెమీకండక్టర్ల ఉత్పత్తికై జాయింట్‌ వెంచర్‌ కంపెనీని ఏర్పాటు చేయడానికి ఎలక్ట్రానిక్స్‌ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్‌తో వేదాంత గ్రూప్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అయితే గ్రూప్‌ అనుబంధ కంపెనీ అవాన్‌స్ట్రేట్‌ డిస్‌ప్లే వ్యాపారాన్ని నిర్వహిస్తుంది. దేశంలో ఎలక్ట్రానిక్‌ చిప్, డిస్‌ప్లే తయారీ వ్యవస్థను పెంచడానికి ప్రభుత్వం రూ.76,000 కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించిన తర్వాత.. ఈ విభాగంలో పెట్టుబడి ప్రకటన చేసిన మొదటి కంపెనీ వేదాంతనే.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
రూ.1,49,200 కోట్ల వరకు పెట్టుబడి చేయనున్నట్టు ప్రకటించిన సంస్థ?
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు    : పారిశ్రామిక దిగ్గజ సంస్థ వేదాంత
ఎక్కడ    : భారత్‌
ఎందుకు : ఎలక్ట్రానిక్‌ చిప్, డిస్‌ప్లే తయారీ విభాగాల కోసం..

Andhra Pradesh: రాష్ట్రంలో కేంద్రీకృత వంటశాలను ఎక్కడ ప్రారంభించారు?

YS Jagan at Centralized Kitchen

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నం పూట నాణ్యమైన భోజనం అందించేందుకు ఏర్పాటు చేసిన అధునాతన వంటశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 18న ప్రారంభించారు. గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, ఆత్మకూరు వద్ద  అక్షయపాత్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రెండు గంటల్లో 50,000 మందికి భోజనం అందించేలా ఈ వంటశాలను నిర్మించారు. అలాగే ఈ  వంటశాలలో తయారైన ఆహార పదార్థాలు వేడి తగ్గకుండా, నాణ్యత దెబ్బతినకుండా వేగంగా పాఠశాలలకు అందించడానికి ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. సామాజిక సేవలో భాగంగా ఎయిర్‌ ఇండియా సహకారంతో అక్షయపాత్ర ఫౌండేషన్‌ ఈ కేంద్రీకృత వంటశాలను (సెంట్రలైజ్డ్‌ కిచెన్‌) అభివృద్ధి చేసింది.

గోకుల క్షేత్ర నిర్మాణ పనులకు భూమి పూజ
గుంటురూ జిల్లా, తాడేపల్లి మండలం, కొలనుకొండలో ఇస్కాన్‌ ఏర్పాటు చేస్తున్న రాష్ట్రంలోనే అతిపెద్ద హరేకృష్ణ గోకుల క్షేత్ర నిర్మాణ పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ భూమి పూజ చేశారు. సుమారు ఆరున్నర ఎకరాలలో జాతీయ రహదారి పక్కన రూ.70 కోట్ల వ్యయంతో ఈ గోకుల క్షేత్రాన్ని నిర్మిస్తున్నారు.

నకిలీ మార్కెట్ల జాబితాలో ఇండియమార్ట్‌..
‘ప్రపంచ నకిలీ మార్కెట్ల జాబితా 2021’ను యూఎస్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌ (యూఎస్‌టీఆర్‌) ఫిబ్రవరి 18న విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 42 ఆన్‌లైన్, 35 భౌతిక మార్కెట్లకు ఇందులో చోటు కల్పించింది.  ఇవన్నీ పెద్ద ఎత్తున నకిలీ ట్రేడ్‌మార్క్‌లు, కాపీరైట్‌ హక్కుల ఉల్లంఘనకు వీలు కల్పిస్తున్నట్టు నివేదిక పేర్కొంది. భారత్‌కు చెందిన బీటుబీ ఈ కామర్స్‌ పోర్టల్‌ ఇండియమార్ట్‌.కామ్‌ను ఈ జాబితాలోకి చేర్చింది. భారత్‌ నుంచి మరో నాలుగు మార్కెట్లు.. ముంబైలోని హీరా పన్నా, ఢిల్లీలోని ట్యాంక్‌ రోడ్, పాలికా బజార్, కోల్‌కతాలోని కిడ్డర్‌పోర్‌ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
కేంద్రీకృత వంటశాల (సెంట్రలైజ్డ్‌ కిచెన్‌) ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు    : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ    : ఆత్మకూరు, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా
ఎందుకు : రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నం పూట నాణ్యమైన భోజనం అందించేందుకు..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 18 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 19 Feb 2022 05:54PM

Photo Stories