Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 17 కరెంట్‌ అఫైర్స్‌

DA-CAs-Feb-17

Andhra Pradesh Public Service Commission: ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియ‌మితులైన ఐపీఎస్ అధికారి?

Gowtham Sawang

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌(ఏపీపీఎస్సీ) చైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్‌ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసుగా(డీజీపీ) సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి దామోదర్‌ గౌతమ్‌ సవాంగ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 17న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎస్‌ 1986 బ్యాచ్‌కు చెందిన సవాంగ్‌ ఏఎస్పీగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఏఎస్పీ, ఎస్పీగా పనిచేశారు. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌లో వెస్ట్‌ జోన్‌ ట్రాఫిక్‌ డీసీపీగా సేవలందించిన ఆయన 2000లో డీఐజీగా పదోన్నతి పొంది వరంగల్, కరీంనగర్‌ రేంజ్‌ల్లో పనిచేశారు. 2005 నుంచి 2008 వరకు సీఆర్‌పీఎఫ్‌ డీఐజీగా కేంద్ర సర్వీసుకు వెళ్లారు. అంతర్రాష్ట్ర ఆపరేషన్‌లో భాగంగా వామపక్ష తీవ్రవాదాన్ని నియంత్రించేందుకు జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఏపీలో పనిచేశారు.

ఐక్యరాజ్యసమితి తరపున..
అస్సాంకు చెందిన సవాంగ్‌ 2008 నుంచి 2012 వరకు ఐక్యరాజ్యసమితి తరపున లైబిరియాలో పోలీస్‌ కమిషనర్‌గా పనిచేశారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత ఏడీజీగా పదోన్నతి పొంది ఏపీఎస్పీలో పనిచేశారు. తర్వాత 2015 నుంచి విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌గా పనిచేశారు. 2016 జూన్‌లో డీజీగా పదోన్నతి పొందారు. అనంతరం 2019 ఏడాదిలో ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. 2022, డిసెంబర్‌ 15న డీజీపీ పోస్టు నుంచి బదిలీ అయ్యారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌(ఏపీపీఎస్సీ) నూతన చైర్మన్‌గా నియమితులైన ఐపీఎస్‌ అధికారి?
ఎప్పుడు : ఫిబ్రవరి 17
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసుగా(డీజీపీ) దామోదర్‌ గౌతమ్‌ సవాంగ్‌
ఎక్కడ    : విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు..

WSDS 2022: ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు థీమ్‌ ఏమిటీ?

Modi at WSDS-2022

21వ ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు–2022(డబ్ల్యూఎస్‌డీఎస్‌–2022)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 16న ప్రారంభించారు. వర్చువల్‌ విధానం ద్వారా ఫిబ్రవరి 18 వరకు జరిగే ఈ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. వచ్చే రెండు దశాబ్దాల్లో భారతీయుల ఇంధన అవసరాలు రెట్టింపవుతాయని అంచనా వేశారు. ఇతర దేశాలకు ఆర్థిక, సాంకేతిక సాయం అందిస్తామన్న మాటను అభివృద్ధి చెందిన దేశాలు నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. ప్రపంచ జాతుల్లో 8 శాతం జీవజాతులకు భారత్‌ ఆవాసమని, అందువల్ల ఆవరణ వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత అందరిదని ఆయన హితవు చెప్పారు. ది ఎరర్జీ అండ్‌ రీసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌(టీఈఆర్‌ఐ) నిర్వహిస్తున్న ఈ సదస్సులో 100 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. టీఈఆర్‌ఐ ప్రధాన కార్యాలయం భారత రాజధాని నగరం న్యూఢిల్లీలో ఉంది.

డబ్ల్యూఎస్‌డీఎస్‌–2022 థీమ్‌..
టువర్డ్స్‌ ఏ రీసైలెంట్‌ ప్లానెట్‌: ఎన్సూరింగ్‌ ఏ సస్టెయినబుల్‌ అండ్‌ ఈక్వీటబుల్‌ ఫ్యూచర్‌(Towards a Resilient Planet: Ensuring a Sustainable and Equitable Future)

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
21వ ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు–2022(డబ్ల్యూఎస్‌డీఎస్‌–2022 ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు    : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ    : వర్చువల్‌ విధానంలో..
ఎందుకు : సుస్థిరాభివృద్ధి అంశాలపై చర్చించేందుకు..

Cured Of HIV: ఎయిడ్స్‌ సంపూర్ణంగా నయమైన తొలి పేషెంట్‌ ఎవరు?

HIV

మానవ వైద్య చరిత్రలో మరో అద్భుతం చోటు చేసుకుంది. తొలిసారి ఒక మహిళకు ఎయిడ్స్‌ పూర్తిగా నయమైంది. స్టెమ్‌సెల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ (మూలకణ మార్పిడి) చికిత్సతో సదరు మహిళ సంపూర్ణంగా ఎయిడ్స్‌ కారక హెచ్‌ఐవీ వైరస్‌ నుంచి విముక్తి పొందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో మానవ చరిత్రలో ఎయిడ్స్‌ సంపూర్ణంగా నయమైన మూడో పేషెంట్‌గా, తొలి మహిళా పేషెంట్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. ఈ కేసు వివరాలను పరిశోధకులు ఫిబ్రవరి 16న 29వ కాన్ఫరెన్స్‌ ఆర్‌ రెట్రోవైరసెస్‌ అండ్‌ ఆపర్చునిస్టిక్‌ ఇన్‌ఫెక్షన్స్‌(సీఆర్‌ఓఐ) అనే సదస్సులో వెల్లడించారు. అమెరికాలోని కొలరాడో రాష్ట్రం, డెన్‌వర్‌ నగరంలో ఫిబ్రవరి 12 నుంచి 16వ తేదీ వరకు సీఆర్‌ఓఐ సదస్సును నిర్వహించారు.

స్టెమ్‌ సెల్‌ మార్పిడి అనంతరం సదరు మహిళ(అమెరికా) 14 నెలలుగా ఏఆర్‌టీ(యాంటీ వైరల్‌ థెరపీ) తీసుకోవడం లేదని, అయినా ఆమెలో హెచ్‌ఐవీ వైరస్‌ కనిపించలేదని పరిశోధకులు తెలిపారు. బొడ్డుపేగు నుంచి తీసిన స్టెమ్‌ సెల్స్‌తో హెచ్‌ఐవీ రెమిషన్‌ సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ పరిశోధనను యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, జాన్స్‌హాప్‌కిన్స్‌ యూనివర్సిటీలకు చెందిన రిసెర్చర్లు ఐఎంపీఏఏసీటీ పీ1107 (ఇంటర్నేషనల్‌ మాటర్నల్‌ పీడియాట్రిక్‌ అడాలసెంట్‌ ఎయిడ్స్‌ క్లీనికల్‌ ట్రయిల్‌ నెట్‌వర్క్‌) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ నెట్‌వర్క్‌ను 2015లో ఆరంభించారు.

తొలి పేషెంట్‌..
గతంలో ‘బెర్లిన్‌ పేషెంట్‌’ గా పిలిచే టిమోతీ రే బ్రౌన్‌ అనే మగ పేషెంటు 12 ఏళ్ల పాటు హెచ్‌ఐవీ రెమిషన్‌ (అంటే యాంటీ వైరల్‌ మందులు వాడటం ఆపేసినా వైరస్‌ ప్రబలకపోవడం) పొందాడు. దీంతో ఎయిడ్స్‌ సంపూర్ణంగా నయమైన తొలి పేషెంట్‌గా టిమోతీ గుర్తింపు పొందాడు. అనంతరం ‘లండన్‌ పేషెంట్‌’ అనే ఆడమ్‌ కాసిల్జో అనే వ్యక్తి 30 నెలల నుంచి హెచ్‌ఐవీ రెమిషన్‌లో ఉన్నాడు. వీరి తర్వాత ప్రస్తుత మహిళా పేషెంటే హెచ్‌ఐవీ రెమిషన్‌ లేదా ఎయిడ్స్‌ నుంచి ఉపశమనం పొందింది.

5G Networks CoE: ఐఐటీ–హెచ్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్న సంస్థ?

CYIENT

ఇంజనీరింగ్, తయారీ, డిజిటల్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ సంస్థ సైయంట్‌ తాజాగా తమ ప్రైవేట్‌ 5జీ నెట్‌వర్క్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను (సీవోఈ) ఏర్పాటు చేసింది. దీనికి పరిశోధన భాగస్వామిగా హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ–హెచ్‌)తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. హైదరాబాద్‌లోని సైయంట్‌ కేంద్రంలో ఈ సీవోఈని ఏర్పాటు చేశారు. ప్రైవేట్‌ 5జీ నెట్‌వర్క్‌ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసేందుకు, పరీక్షించేందుకు ఇది ఉపయోగపడనుంది. ఐఐటీ–హెచ్‌ అభివృద్ధి చేసిన 5జీ కోర్‌ ప్లాట్‌ఫామ్‌.. వివిధ అవసరాలకు ఏ విధంగా ఉపయోగపడగలదో ఇందులో ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ–హెచ్‌)తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకున్న సంస్థ?
ఎప్పుడు   : ఫిబ్రవరి 16
ఎవరు    : ఇంజనీరింగ్, తయారీ, డిజిటల్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ సంస్థ సైయంట్‌ 
ఎందుకు : హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రైవేట్‌ 5జీ నెట్‌వర్క్స్‌ సీవోఈకి పరిశోధన భాగస్వామిగా..

Research and Development: ధన్‌బాద్‌ ఐఐటీ(ఐఎస్‌ఎం)తో ఎంవోయూ చేసుకున్న సంస్థ?

ISM Dhanbad

మెటల్‌ రంగ దిగ్గజం జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ లిమిటెడ్‌(జేఎస్‌ఎల్‌) తాజాగా ధన్‌బాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌)తో అవగాహనా ఒప్పందాన్ని (ఎంవోయూ) చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా ధన్‌బాద్‌ ఐఐటీ(ఐఎస్‌ఎం)తో కలిసి సంయుక్తంగా వివిధ ప్రాజెక్టులపై పరిశోధన, అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ) కార్యక్రమాలను జేఎస్‌ఎల్‌ చేపట్టనుంది. రీసెర్చ్, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్, పర్యావరణ పరిరక్షణ, నైపుణ్యాభివృద్ధి తదితరాలపై దృష్టి పెట్టనున్నట్లు పేర్కొంది. జార్ఖండ్‌ రాష్ట్రంలో ధన్‌బాద్‌ ఐఐటీ(ఐఎస్‌ఎం) ఉంది.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌–2022(ఐపీఎస్‌–2022) సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ నియమితులయ్యాడు. 2020లోనే ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అయ్యర్‌ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. 2021 సీజన్‌ అనంతరం అయ్యర్‌ను ఢిల్లీ విడుదల చేయగా... మెగా వేలంలో కోల్‌కతా అయ్యర్‌ను రూ. 12 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ధన్‌బాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌)తో ఎంవోయూ చేసుకున్న సంస్థ?
ఎప్పుడు   : ఫిబ్రవరి 16
ఎవరు    : మెటల్‌ రంగ దిగ్గజం జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ లిమిటెడ్‌(జేఎస్‌ఎల్‌) 
ఎందుకు : వివిధ ప్రాజెక్టులపై పరిశోధన, అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ) కార్యక్రమాలను చేపట్టేందుకు..

Bappi Lahiri: ప్రముఖ గాయకుడు బప్పీ లహిరి ఇక లేరు

ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు బప్పీ లహిరి(69) కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో ముంబైలోని జుహూలోని క్రిటికేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఫిబ్రవరి 16న తుదిశ్వాస విడిచారు. 1952 నవంబర్‌ 27న పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం, జల్‌పాయ్‌గురి జిల్లా, జల్‌పాయ్‌గురి నగరంలో జన్మించిన బప్పి.. అసలు పేరు అలోకేష్‌ లహిరి. ‘బప్పీ దా’ అని అందరూ ఆత్మీయంగా పిలుచుకునే బప్పీ లహిరి.. తన మొత్తం కెరీర్‌లో 460 హిందీ, తెలుగు, బెంగాలీ, తమిళ, కన్నడ సినిమాలకు పని చేశారు. తెలుగులో సింహాసనం, స్టేట్‌ రౌడీ, సామ్రాట్, గ్యాంగ్‌ లీడర్, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్‌ చిత్రాలకు సంగీతం అందించారు. తెలుగులో చివరిగా డిస్కో రాజా చిత్రంలో పాటపాడారు. కాగా 2014లో బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేసి, ఓడిపోయారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు    : బప్పీ లహిరి(69)
ఎక్కడ    : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : వయో సంబంధిత సమస్యలతో..

Vice-Chancellor: డాక్టర్‌ అబ్దుల్‌ హాక్‌ ఉర్దూ వర్సిటీ ఎక్కడ ఉంది?

Dr. Abdul Haq Urdu University

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, కర్నూలు జిల్లా, కర్నూలు నగర సమీపంలో ఉన్న డాక్టర్‌ అబ్దుల్‌ హాక్‌ ఉర్దూ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ (వీసీ)గా హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ) ప్రొఫెసర్‌ ఫజుల్‌ రహమాన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. ప్రొఫెసర్‌ ఫజుల్‌ మనూలో యూజీసీ–మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 1993లో అలీఘడ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం నుంచి నెమటాలజీలో పీహెచ్‌డీని పొందిన ఫజుల్‌.. 2013లో ప్రొఫెసర్‌గా, స్కూల్‌ ఆఫ్‌ సైన్సెస్, డైరెక్టర్‌గా పనిచేశారు. 2019లో యూజీసీ హెచ్‌ఆర్‌డీసీలో డైరెక్టర్‌ తదితర విధులను నిర్వర్తించారు.

స్టేట్‌ బ్యాంబూ మిషన్‌ ఏ శాఖ పరిధిలో పని చేస్తోంది?
స్టేట్‌ బ్యాంబూ మిషన్‌ (రాష్ట్ర వెదురు మిషన్‌)ను పర్యావరణ, అటవీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ నుంచి వ్యవసాయ, సహకార (హార్టికల్చర్‌) శాఖ పరిధిలోకి తీసుకువస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఫిబ్రవరి 16న ఉత్తర్వులిచ్చారు. అటవీ ప్రాంతాల వెలుపల వ్యవసాయ భూముల్లో వెదురు పెంచడాన్ని ప్రోత్సహించేందుకు మార్పు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర వెదురు మిషన్‌ డైరెక్టర్‌గా ఉద్యాన కమిషనర్‌ ఉంటారని తెలిపారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
డాక్టర్‌ అబ్దుల్‌ హాక్‌ ఉర్దూ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ (వీసీ)గా నియామకం
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు    : మనూ ప్రొఫెసర్‌ ఫజుల్‌ రహమాన్‌ 
ఎక్కడ    : కర్నూలు, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు..

Telangana: ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసీ జాతర ఏది?

Medaram Jatara

తెలంగాణ కుంభమేళా, ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరొందిన ‘‘మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర’’ ఫిబ్రవరి 16న ఘనంగా ఫ్రారంభమైంది. కన్నెపల్లి(ములుగు జిల్లా) నుంచి సారలమ్మ, కొత్తగూడ మండలం(మహబూబాబాద్‌)లోని పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూరునాగారం మండలం(ములుగు జిల్లా)లోని కొండాయి నుంచి గోవింద రాజులు మేడారం గద్దెల పైకి చేరారు. ముగ్గురి వన దేవతల రాకతో మేడారం వన జాతర వైభవంగా మొదలైంది. జాతరలో కీలక ఘట్టంగా భావించే సమ్మక్కను గద్దెలపైకి ఫిబ్రవరి 17న చేరుస్తారు. మేడారం సమీపంలోని చిలకల గుట్ట(ములుగు జిల్లా)పై నుంచి సమ్మక్కను తీసుకొస్తారు. ఫిబ్రవరి 19వ తేదీ వరకు జాతర సాగుతుంది.

కోటి మందికి పైగా..
తెలంగాణలో జరిగే సమ్మక్క–సారలమ్మ జాతర దేశంలోనే అత్యంత ఎక్కువ మంది సందర్శించే గిరిజన ఉత్సవం. ములుగు జిల్లా తాడ్వాయి మండంలోని మేడారంలో జరిగే ఈ జాతరను ప్రతి రెండేళ్లకొకసారి నిర్వహిస్తారు. పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణా నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్‌ రాష్ట్రాలనుండి సుమారు కోటికి పైగా భక్తులు వస్తారు. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. మేడారం జాతర–2022కు నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ.2.5కోట్లు విడుదల చేశాయి. 
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభం 
ఎప్పుడు : ఫిబ్రవరి 16 
ఎక్కడ   : మేడారం, తాడ్వాయి మండం, ములుగు జిల్లా, తెలంగాణచ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 16 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 17 Feb 2022 06:19PM

Photo Stories