Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 16 కరెంట్ అఫైర్స్
Veteran Singer: బంగ బిభూషణ్ అవార్డును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేస్తోంది?
ప్రముఖ గాయని, పద్మ శ్రీ, బంగ బిభూషణ్ సంధ్యా ముఖర్జీ(91) ఇకలేరు. గుండె సంబంధిత వ్యాధి కారణంగా ఫిబ్రవరి 15న కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు. ఎస్.డి.బర్మన్, నౌషద్, సలీల్ చౌదరి తదితరుల సంగీత దర్శకత్వంలో హిందీ, బెంగాలీ భాషల్లో ఎన్నో మధురైన పాటలు పాడిన సంధ్యా ముఖర్జీ దశాబ్దాలపాటు అభిమానులను అలరించారు. కళారంగంలో ఆమె చేసిన సేవలకు గాను.. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బంగ బిభూషణ్ అవార్డును అందుకున్నారు. సంధ్యా ముఖర్జీ మృతిపట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా సంతాపం ప్రకటించారు.
పంజాబీ నటుడు దీప్ సిద్ధూ మృతి
ప్రముఖ పంజాబీ నటుడు, గణతంత్ర వేడుకల అల్లర్ల కేసులో దోషి దీప్ సిద్ధూ్ధ(37) రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఫిబ్రవరి 15న ఢిల్లీ నుంచి భటింటా వెళ్తుండగా.. హరియాణా రాష్ట్రంలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. 2021 జనవరి 26న గణతంత్ర వేడుకల సందర్భంగా సాగు చట్టాల రద్దు డిమాండ్‌తో రైతులు ఢిల్లీలో చేసిన ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొని సిద్ధు వార్తల్లో నిలిచారు. ఎర్రకోటపై దాడికి రైతులను ప్రేరేపించారంటూ సిద్ధూ్ధపై కేసు నమోదైంది. పంజాబ్‌లోని ముక్త్‌సర్‌కు చెందిన 37 ఏళ్ల దీప్ నటునిగా మారకముందు లాయర్‌గా కూడా పని చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ గాయని, పద్మ శ్రీ, బంగ బిభూషణ్ అవార్డీ కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : సంధ్యా ముఖర్జీ(91)
ఎక్కడ : కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
ఎందుకు : గుండె సంబంధిత వ్యాధి కారణంగా..
Emergency In Canada: ప్రస్తుతం కెనడా ప్రధాన మంత్రిగా ఎవరు ఉన్నారు?
కరోనా నిబంధనలకు నిరసనగా జరుగుతున్న ఆందోళనలకు అడ్డుకట్ట వేసేందుకు కెనడాలో ఎమర్జెన్సీ విధించారు. అత్యవసర అధికారాల చట్టాన్ని అమల్లోకి తెస్తున్నట్టు ఆ దేశ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఫిబ్రవరి 15న ప్రకటించారు. దీనిప్రకారం నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి లభిస్తుంది. అయితే దీన్ని పరిమిత కాలం పాటు, కొద్ది ప్రాంతాల్లో, అవసరం మేరకే ఉపయోగిస్తామని ట్రూడో చెప్పారు. సైన్యాన్ని ప్రయోగించబోవడం లేదని స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్ నిబంధనలను ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ ట్రక్ డ్రైవర్లు రెండు వారాలకు పైగా సరిహద్దులను, ఒట్టావా వీధులను వాహనాలతో దిగ్బంధించారు.
కెనడా..
రాజధాని: ఒట్టోవా; కరెన్సీ: కెనడియన్ డాలర్
అధికార భాషలు: ఇంగ్లిష్, ఫ్రెంచ్
ప్రస్తుత ప్రధానమంత్రి: జస్టిన్ ట్రూడో
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ) విధింపు
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో
ఎక్కడ : కెనడా
ఎందుకు : కరోనా నిబంధనలకు నిరసనగా జరుగుతున్న ఆందోళనలకు అడ్డుకట్ట వేసేందుకు..
Sansad TV YouTube Channel Hacked: ఇథీరియం అనే పేరు దేనికి సంబంధించినది?
Sansad TV YouTube channel hacked: లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారాలు చేసే సంసద్ టీవీకి చెందిన యూట్యూబ్ చానల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. దీంతో అప్రమత్తమైన యూట్యూబ్ సంస్థ.. సమస్యకు కొద్ది గంటల్లోనే చెక్ పెట్టింది. ఫిబ్రవరి 15న సంసద్ టీవీ యూట్యూబ్ చానల్‌ను హ్యాకర్లు హ్యాక్ చేసి చానెల్ పేరును ఇథీరియం(ఒక క్రిప్టో కరెన్సీ పేరు)గా మార్చారు. హ్యాకింగ్ జరిగిన విషయాన్ని ఘటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే సంసద్ టీవీ సంబంధిత అధికారులకు తెలిపామని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్‌టీ–ఇన్) తెలిపింది.
ఆశిష్ మిశ్రా విడుదల
ఉత్తరప్రదేశ్‌లో లఖీంపూర్ ఖేరి ఘటనలో ప్రధాన నిందితుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా నాలుగు నెలల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఒక్కోటి రూ.3 లక్షల విలువైన షూరిటీ పత్రాలను సమర్పించాలంటూ, ఆశిష్‌కు బెయిల్ ఇస్తూ పదో తేదీన అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఉత్తర్వులివ్వడం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 15న ఆశిష్‌ను లఖీంపూర్ ఖేరి జైలు నుంచి విడుదల చేశారు.
GroupM Report: 2022లో అతిపెద్ద మాధ్యమంగా అవతరించనున్న విభాగం?
టెలివిజన్‌ను అధిగమించి డిజిటల్ విభాగం 2022లో అతిపెద్ద మాధ్యమంగా అవతరించనుందని అంతర్జాతీయ ప్రముఖ మీడియా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ గ్రూప్‌ఎమ్ అంచనా వేసింది. 2022లో మొత్తం ప్రకటనల వ్యయం 22 శాతం వృద్ధితో రూ.1,07,987 కోట్లని లెక్కగట్టింది. ఈ మేరకు తన ''దిస్ ఇయర్, నెక్ట్స్ ఇయర్ 2022 (టీవైఎన్‌వై) ప్రకటనల వ్యయ (యాడెక్స్) అంచనాల" నివేదికను ఫిబ్రవరి 15న ఆవిష్కరించింది.
నివేదికలోని ముఖ్యాంశాలు..
- యాడ్ వ్యయాల్లో వేగంగా పురోగమిస్తున్న 10 దేశాల్లో భారత్ ఒకటి. ఈ విషయంలో దేశం తొమ్మిదవ అతిపెద్ద మార్కెట్‌గా ఉంటుంది. ప్రకటనల వ్యయ పరిమాణాల పెరుగుదలకు సంబంధించి ఐదవ స్థానాన్ని ఆక్రమిస్తుంది.
- మొత్తం మాధ్యమంలో డిజిటల్ షేర్ 2022లో 45 శాతానికి చేరుతుంది. ఈ విభాగంలో 33 శాతం పురోగతి ఉంటుంది.
- ఇక అంతర్జాతీయంగా చూస్తే ప్రకటనల వ్యయం 11 శాతం పెరిగి 850 బిలియన్ డాలర్లకు చేరుతుంది. డిజిటల్ వాటా ఇందులో 66 శాతం.
- సంస్థాగత పరిస్థితులు, వినియోగదారు అభిరుచులుస్థిరత్వం, డిజిటల్ అనుభవం, డేటా, వాణిజ్యం, పర్యావరణ వ్యవస్థ, క్రీడా వ్యాపార వృద్ధి, సాంకేతికత వినియోగం, మార్కెటింగ్ పనితీరు, టీవీ ప్రకటనల సాంకేతికత, ఆఫ్‌లైన్ మీడియా పరిణామం వంటి అంశాల్లో మార్పులు వినియోగదారు, పరిశ్రమలో కొత్త ట్రెండ్స్‌ను సెట్ చేస్తాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దిస్ ఇయర్, నెక్ట్స్ ఇయర్ 2022 (టీవైఎన్‌వై) ప్రకటనల వ్యయ (యాడెక్స్) అంచనాల నివేదిక విడుదల
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : అంతర్జాతీయ ప్రముఖ మీడియా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ గ్రూప్‌ఎమ్
ఎందుకు : మీడియా పరిశ్రమకు సంబంధించి చేసిన అధ్యయన వివరాలను వెల్లడించేందుకు..
Dubai Expo 2020: ఏఐ ఫేషియల్ టెక్నాలజీతో కూడిన తొలి స్కూటర్ ఏది?
అవెరా ఏఐ మొబిలిటీ ప్రైవేటు లిమిటెడ్ ‘అవెరా విన్సెరో’ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ‘దుబాయి ఎక్స్‌పో–2020’లో ఆవిష్కరించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫేషియల్ టెక్నాలజీతో కూడిన తొలి స్కూటర్ ప్రపంచంలో ఇదేనని ఫిబ్రవరి 15న సంస్థ ప్రకటించింది. 100 కిలోమీటర్ల వేగంతో ఒక్కసారి చార్జ్ చేస్తే 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల సామర్థ్యం ఈ స్కూటర్‌కు ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్లాంట్‌లో ఈ స్కూటర్లను తయారు చేయడమే కాకుండా, విదేశాలకు ఎగుమతి చేయనున్నట్టు సంస్థ ప్రకటించింది.
దుబాయి ఎక్స్‌పోలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోడ్‌షోలో అవెరా విన్సెరో స్కూటర్‌ను కంపెనీ వ్యవస్థాపకుడు వెంకట రమణ, సహ వ్యవస్థాపకురాలు చాందిని చందన సమక్షంలో.. భారత్‌లో యూఏఈ అంబాసిడర్ అహ్మద్ అబ్దుల్ రెహమాన్ ఆల్బానా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏఐ ఫేషియల్ టెక్నాలజీతో కూడిన తొలి స్కూటర్ ‘‘అవెరా విన్సెరో’’ను దుబాయి ఎక్స్‌పో–2020లో ఆవిష్కరించిన సంస్థ?
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : అవెరా ఏఐ మొబిలిటీ ప్రైవేటు లిమిటెడ్
ఎక్కడ : దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్, దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్(యూఏఈ)
Reserve Bank of India: ఆర్‌బీఐ ఆర్థిక అక్షరాస్యతా వారోత్సవం థీమ్ ఏమిటీ?
ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ‘ఆర్థిక అక్షరాస్యతా వారోత్సవ’ కార్యక్రమం ఫిబ్రవరి 14న ప్రారంభమైంది. ఫిబ్రవరి 18వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. డిజిటల్ బ్యాంకింగ్ సేవలను సురక్షిత పద్ధతుల్లో ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై అవగాహన పెంచేదిలా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా డిజిటల్ లావాదేవీల్లో ఉన్న సౌకర్యం, డిజిటల్ లావాదేవీల భద్రత, కస్టమర్లు తమను తాము రక్షించుకోవడం అనే విషయాలపై అవగాహన కల్పించేందుకు ఆర్‌బీఐ కృషి చేస్తుంది. ‘గో డిజిటల్, గో సెక్యూర్’ అన్న ప్రధాన థీమ్‌తో డిజిటల్ ఆర్థిక లావాదేవీల ప్రాతపై విస్తృత ప్రచారం జరగనుంది.
2016 నుంచి..
2016 నుంచి ఆర్‌బీఐ వార్షికంగా ఆర్థిక అక్షరాస్యతా వారోత్సవాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2020–25 ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ జాతీయ వ్యూహంలో ‘గో డిజిటల్, గో సెక్యూర్’ అనే థీమ్ ఒకటని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్థిక అక్షరాస్యతా వారోత్సవ కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)
ఎక్కడ : దేశవ్యాప్తంగా..
ఎందుకు : డిజిటల్ బ్యాంకింగ్ సేవలను సురక్షిత పద్ధతుల్లో ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై అవగాహన పెంచేందుకు..
One District One Product: ఎంఎస్‌ఎంఈ శాఖతో జట్టు కట్టిన ఈ–కామర్స్ కంపెనీ?
దేశంలో వస్తువుల ఉత్పత్తి పెంపునకు ఈ–కామర్స్ కంపెనీ అమెజాన్‌తో కలిసి పనిచేయనున్నట్టు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ(ఎంఎస్‌ఎంఈ శాఖ) మంత్రి నారాయణ్ రాణే తెలిపారు. అందుబాటు ధరలకు నాణ్యమైన ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేయనున్నట్టు చెప్పారు. అమెజాన్ వేదికగా ఇండియా వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ఓడీఓపీ) బజార్‌ను ఫిబ్రవరి 15న న్యూఢిల్లీలో ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ మేరకు మాట్లాడారు. ఇండియా ఓడీఓపీ బజార్‌లో ప్రాంతీయ భాషల్లో దేశవ్యాప్తంగా పలు జిల్లాల వారీగా పేరొందిన ఉత్పత్తుల వివరాలు ఉంటాయన్నారు.
యస్ బ్యాంక్ అగ్రి ఇన్‌ఫినిటీ కార్యక్రం ఉద్దేశం?
ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్.. ఆహారం, వ్యవసాయ రంగాలకు దన్నుగా డిజిటల్ ఫైనాన్సింగ్ సొల్యూషన్ల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. స్టార్టప్‌లకు ప్రోత్సాహకరంగా ప్రారంభించిన ఈ పథకం కింద కొన్ని ఎంపిక చేసిన వెంచర్స్‌కు ఈక్విటీ పెట్టుబడులను సైతం అందించనుంది. ‘‘యస్ బ్యాంక్ అగ్రి ఇన్‌ఫినిటీ’’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా డిజిటల్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ అభివృద్ధికి స్టార్టప్‌లతో కలసి పనిచేయనున్నట్లు బ్యాంక్ వెల్లడించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియా వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ఓడీఓపీ) బజార్ ఆవిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ(ఎంఎస్‌ఎంఈ శాఖ) మంత్రి నారాయణ్ రాణే
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : దేశంలో వస్తువుల ఉత్పత్తి పెంపునకు..
Vladimir Putin-Olaf Scholz: ఉక్రెయిన్ వివాదంపై చర్చలకు సిద్ధం: రష్యా
యుద్ధ మేఘాలు క్రమంగా చెదిరిపోతున్నాయి. రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతలు కాస్త నెమ్మదిస్తున్న సూచనలు కన్పిస్తున్నాయి. తాము యుద్ధం కోరుకోవడం లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ఈ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు చర్చలకు సిద్ధమని ప్రకటించారు. క్షిపణులు, సైన్యాల మోహరింపును పరస్పరం తగ్గించుకోవడంతో పాటు విశ్వాస కల్పన చర్యలపై అమెరికా, నాటోతో మాట్లాడతామని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 15న రష్యా రాజధాని మాస్కోలో జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ స్కొల్జ్‌తో భేటీ అనంతరం ఈ మేరకు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
నొవాక్ జొకోవిచ్ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందాడు?
ప్రపంచ నంబర్‌వన్, సెర్బియన్ టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ వ్యాక్సినేషన్‌పై తన కచ్చితమైన అభిప్రాయాన్ని వెల్లడించాడు. టీకా తీసుకునే ప్రసక్తేలేదని, ఇది తప్పనిసరంటే ఏ మూల్యం చెల్లించుకునేందుకైనా సిద్ధమేనని, గ్రాండ్‌స్లామ్ టోర్నీలకు దూరమైనా సరేనని ‘బీబీసీ’ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. ‘వ్యాక్సినేషన్‌పై స్వేచ్ఛ ఉండాల్సిందే. నా శరీరానికి ఏది అవసరమో అందరికంటే నాకే బాగా తెలుసు.’’ అని పేర్కొన్నాడు.
చదవండి: Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 15 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్