Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 12 కరెంట్ అఫైర్స్
Quadrilateral Security Dialogue: నాలుగో క్వాడ్ విదేశాంగ మంత్రుల సదస్సు ఎక్కడ జరిగింది?
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో నాలుగో క్వాడ్ విదేశాంగ మంత్రుల సదస్సు జరిగింది. ఫిబ్రవరి 11న జరిగిన ఈ సదస్సులో సభ్య దేశాల విదేశాంగ మంత్రులు జై శంకర్ (భారత్), ఆంటోనీ బ్లింకెన్ (అమెరికా), మారిస్ పైన్ (ఆస్ట్రేలియా), యొషిమాసా హయాషీ (జపాన్)తో పలు అంశాలపై లోతుగా చర్చించారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంను బెదిరింపులు, నిర్బంధ ఆర్థిక విధానాల బారినుంచి విముక్తం చేయాలని సదస్సు తీర్మానించింది. సీమాంతర ఉగ్రవాద వ్యాప్తికి పరోక్ష మద్దతిస్తున్న కొన్ని దేశాల తీరును తీవ్రంగా ఖండించింది. అఫ్గాన్ భూ భాగాన్ని ఇతర దేశాలను బెదిరించేందుకు, వాటిపై దాడులకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోరాదని అభిప్రాయపడింది. తూర్పు, దక్షిణ చైనా సముద్ర తీర దేశాల హక్కులకు తలెత్తుతున్న సవాళ్లను సంయుక్తంగా ఎదుర్కొంటామని చైనాను ఉద్దేశించి మంత్రులు పేర్కొన్నారు. సదస్సు అనంతరం తర్వాత మంత్రులంతా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌తో భేటీ అయ్యారు.
క్వాడ్ ఏర్పాటును వ్యతిరేకిస్తోన్న దేశం?
క్వాడ్‌పై చైనా అక్కసు వెల్లగక్కింది. తమను నిలువరించే లక్ష్యంతో ఏర్పాటైన ఈ గ్రూపు విఫల ప్రయోగంగా మిగిలిపోతుందని శాపనార్థాలు పెట్టింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో పలు దేశాలతో సరిహద్దు వివాదాలున్న చైనా క్వాడ్ ఏర్పాటును తొలి నుంచీ వ్యతిరేకిస్తోంది.
క్వాడ్ లక్ష్యాలేంటి?
క్వాడ్(Quadrilateral Security Dialogue-Quad).. అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో తమ ప్రయోజనాలు కాపాడుకుంటూ భద్రతలో ఒకరికొకరు సహకరించుకోవడం దీని లక్ష్యం. 2004లో సునామీ అల్లకల్లోలం తర్వాత విపత్తుల సమయంలో సహకరించుకోవడానికి ఏర్పడిన ఈ కూటమి.. 2007లో అప్పటి జపాన్ ప్రధాని షింజో అబె చొరవతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతల స్థాపనే లక్ష్యంగా రూపాంతరం చెందింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నాలుగో క్వాడ్ విదేశాంగ మంత్రుల సదస్సు నిర్వహణ
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : క్వాడ్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు జై శంకర్ (భారత్), ఆంటోనీ బ్లింకెన్ (అమెరికా), మారిస్ పైన్ (ఆస్ట్రేలియా), యొషిమాసా హయాషీ (జపాన్)
ఎక్కడ : మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
ఎందుకు : ఇండో–పసిఫిక్ ప్రాంతం, ఉగ్రవాదం వంటి అంశాలపై చర్చించేందుకు..
Military Coup: బుర్కినా ఫాసో అధ్యక్షుడిగా ఎవరు పదవీ స్వీకారం చేయనున్నారు?
పశ్చిమాఫ్రికా దేశం బుర్కినాఫాసో దేశ కొత్త అధ్యక్షుడిగా లెఫ్టినెంట్ కల్నల్ పాల్ హెన్నీ సాండోగో డామిబా ప్రకటించుకున్నారు. ఇటీవలే ఈ దేశంలో ఆర్మీ తిరుగుబాటు జరిపిన సంగతి తెలిసిందే. తిరుగుబాటు సైనిక జుంటాకు పాల్ అధిపతిగా ఉన్నారు. తాజాగా దేశాధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టారని రాజ్యాంగ సమాఖ్య ప్రకటించింది. ఫిబ్రవరి 16న పాల్ అధికారికంగా పదవీ స్వీకారం చేస్తారు. ప్రస్తుతానికి జుంటాకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది.
క్రిస్టియన్ కబోరెను బంధించి..
పశ్చిమాఫ్రికా దేశం బుర్కినా ఫాసో అధ్యక్షుడు రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోరెను బంధించామని ఆ దేశంలో తిరుగుబాటు చేసిన సైనికులు 2022, జనవరి 24న ప్రకటించారు. జనవరి 23న సైనిక శిబిరాల వద్ద మొదలైన కాల్పుల కలకలం జనవరి 24న కూడా కొనసాగింది. అధ్యక్ష భవనం వద్ద చిన్నపాటి యుద్దం జరిగింది. రాజధానిలో తిరుగబాటు సైనికులు గస్తీ కాస్తున్నారు. తొలుత ఇది తిరుగుబాటు కాదని ఆ దేశ ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కానీ చివరకు సైనికుల చేతికి ప్రెసిడెంటే బందీగా చిక్కారు.
2015 నుంచి..
2015 నుంచి బుర్కినాకు కబోరె అధిపతిగా ఉన్నారు. దేశంలో జరుగుతున్న ఉగ్రచర్యలతో మిలటరీ తీవ్రంగా నష్టపోతోంది. తమకు సరైన సదుపాయాలు లేవని సైనికులు అసంతృప్తిగా ఉన్నారు. ఇది చివరకు తిరుగుబాటకు దారితీసింది. తిరుగుబాటుకు ప్రజల్లో కూడా మద్దతు ఉన్నట్లు కనిపిస్తోందని రాజకీయ నిపుణులు తెలిపారు.
బుర్కినా ఫాసో..
రాజధాని: ఔగాడౌగౌ; కరెన్సీ: వెస్ట్ ఆఫ్రికన్ సీఎఫ్‌ఏ ఫ్రాంక్
అధికార భాష: ఫ్రెంచ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : బుర్కినా ఫాసో అధ్యక్షుడిగా ఎవరు పదవీ స్వీకారం చేయనున్నారు?
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : బుర్కినా ఫాసో మిలటరీ అధిపతి, లెఫ్టినెంట్ కల్నల్ పాల్ హెన్నీ సాండోగో డామిబా
ఎందుకు : సైన్యం తిరుగుబాటు నేపథ్యంలో..
TATA Group: టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎవరు ఉన్నారు?
పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ.. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ రెండో విడత కొనసాగనున్నారు. గత అయిదేళ్ల పనితీరును సమీక్షించి, ఆయన్ను తిరిగి చైర్మన్‌గా కొనసాగించే అంశాన్ని చర్చించేందుకు ఫిబ్రవరి 11న సమావేశమైన టాటా సన్స్ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం చంద్రశేఖరన్ మరో అయిదేళ్ల పాటు ఆ పదవిలో ఉంటారు. చంద్రశేఖరన్ పునర్నియామకానికి టాటా సన్స్‌లో మెజారిటీ వాటాలు ఉన్న టాటా ట్రస్ట్స్ చైర్మన్ రతన్ టాటా గట్టిగా మద్దతు పలికారు.
సంక్షోభ సమయంలో సారథ్యం..
2016లో సైరస్ మిస్త్రీ ఉద్వాసనకు గురైన తర్వాత, టాటా సన్స్‌కి నాయకత్వ సంక్షోభం తలెత్తిన తరుణంలో .. చంద్రశేఖరన్ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టారు. అప్పటిదాకా ఆయన టాటా గ్రూప్‌లో కీలకమైన టీసీఎస్‌కు సారథ్యం వహించారు. 2016లో టాటా సన్స్ బోర్డులో చేరిన చంద్రశేఖరన్.. 2017 జనవరిలో చైర్మన్‌గా నియమితులయ్యారు. 2017 ఏడాది ఫిబ్రవరిలో అధికారికంగా బాధ్యతలు తీసుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా రెండో విడత(ఐదేళ్లు) కొనసాగింపు
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : ఎన్ చంద్రశేఖరన్
ఎందుకు : టాటా సన్స్ బోర్డు నిర్ణయం మేరకు..
Reserve Bank of India: ఆర్‌బీఐ అక్షరాస్యతా వారోత్సవాలను ఎప్పుడు నిర్వహించనున్నారు?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఫిబ్రవరి 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ ఆర్థిక అక్షరాస్యతా వారోత్సవాలను నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఫైనాన్షియల్ రంగం పట్ల అవగాహన కల్పిస్తూ, దేశ వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. ‘గో డిజిటల్, గో సెక్యూర్’ అన్న ప్రధాన థీమ్‌తో డిజిటల్ ఆర్థిక లావాదేవీల ప్రాతపై విస్తృత ప్రచారం జరగనుంది. 2016 నుంచి సెంట్రల్ బ్యాంక్ వార్షికంగా ఆర్థిక అక్షరాస్యతా వారోత్సవాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2020–25 ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ జాతీయ వ్యూహంలో ‘గో డిజిటల్, గో సెక్యూర్’ అనే థీమ్ ఒకటని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
డాక్టర్ రెడ్డీస్‌తో నోవార్టిస్ జోడీ
ఔషధ తయారీలో ఉన్న నోవార్టిస్ ఇండియా తాజాగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా నోవార్టిస్ తయారీ వావెరాన్, మెథర్జీన్‌తోపాటు క్యాల్షియం తదితర ఔషధాలను రెడ్డీస్ భారత్‌లో అమ్మకాలు, పంపిణీ చేపట్టనుంది. నోవార్టిస్ సంస్థ.. దేశంలో పరిశోధన, అభివృద్ధి మద్దతు కేంద్రం, సేవల కోసం అయిదేళ్లలో రూ.2,220 కోట్లు వెచ్చించింది. మేఘాలయలో రూ.360 కోట్లతో కొత్త ప్లాంటును స్థాపిస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్థిక అక్షరాస్యతా వారోత్సవాల నిర్వహణ
ఎప్పుడు : ఫిబ్రవరి 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ..
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)
ఎక్కడ : దేశవ్యాప్తంగా..
ఎందుకు : ఫైనాన్షియల్ రంగం పట్ల అవగాహన కల్పించేందుకు..
Skin-to-Skin Verdict: వివాదాస్పద న్యాయమూర్తి జస్టిస్ పుష్ప రాజీనామా
బాలలపై లైంగిక దాడికి వివాదాస్పద నిర్వచనమిచ్చి వార్తల్లోకెక్కిన బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ అదనపు న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేడివాలా ఫిబ్రవరి 10న రాజీనామా చేశారు. దానికి వెంటనే ఆమోదం లభించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మైనర్ చేతులు పట్టుకోవడం, ప్యాంటు జిప్పు విప్పడం లైంగిక దాడి కావంటూ 2021 ఫిబ్రవరిలో పుష్ప తీర్పు ఇచ్చారు. లైంగికపరమైన కోరికతో నేరుగా శరీరాన్ని తాకితే మాత్రమే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) చట్టం కింద లైంగిక దాడిగా పరిగణనలోకి వస్తుందన్నారు. ఇది దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ నేపథ్యంలో ఆమెను శాశ్వత న్యాయమూర్తిగా నియమించాలన్న సిఫార్సులను అప్పట్లో సుప్రీంకోర్టు కొలీజియం వెనక్కు తీసుకుంది. ఏడాది పాటు అదనపు న్యాయమూర్తిగానే కొనసాగించింది. అది ఫిబ్రవరి 11న ముగియనున్నా పొడిగింపు గానీ, పదోన్నతి గానీ ఇవ్వలేదు.
Supreme Court: రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు?
దేశంలో ప్రతి పౌరుడి రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విద్యాసంస్థల్లో హిజాబ్ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును సవాలు చేస్తూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్‌ఎల్పీ) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సరైన సమయంలో విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఫిబ్రవరి 11న వెల్లడించింది. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వు దేశ పౌరుల ప్రాథమిక హక్కును భంగపరిచేలా ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద ప్రజలు తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చని గుర్తుచేశారు. వారి తరపున సీనియర్ అడ్వొకేట్ దేవదత్ కామత్ వాదనలు వినిపించారు. మరోవైపు కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం ఇప్పుడు రాజస్తాన్‌కు సైతం పాకింది.
కర్ణాటక హైకోర్టు మధ్యంతర తీర్పు..
హిజాబ్ వివాదంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితురాజ్ అవస్తీ నేతృత్వంలోని ధర్మాసనం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వు ఫిబ్రవరి 11న అందుబాటులోకి వచ్చింది. ‘‘ప్రతి పౌరుడు తమకు ఇష్టమైన వస్త్రాలను ధరించటం, విశ్వాసాలను అనుసరించటం రాజ్యాంగం ద్వారా పొందిన హక్కు అయినా వాటిపై పూర్తి స్వేచ్ఛ లేదు. అవి రాజ్యాంగ నిబంధనలకు లోబడే ఉంటాయి’’ అని కోర్టు తన ఉత్తర్వుల్లో తెలిపింది. తుది తీర్పు వెల్లడించేంత వరకు సంప్రదాయ వస్త్రాలతో విద్యా సంస్థలకు హాజరుకారాదని పేర్కొంది.
Maritime Exercise: మిలాన్ నౌకా విన్యాసాలను ఎక్కడ నిర్వహించనున్నారు?
నౌకాదళ విభాగంలో ప్రతిష్టాత్మకమైన మిలాన్ (బహుపాక్షిక నావికా విన్యాసాలు)కు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదిక కానుంది. విశాఖలోని ఈస్ట్రన్ నేవల్ కమాండ్ (ఈఎన్‌సీ) ప్రధాన స్థావరంలో మిలాన్–2022 విన్యాసాలు నిర్వహించనున్నారు. 2022, ఫిబ్రవరి 25 నుంచి జరిగే విన్యాసాల్లో అమెరికా, రష్యాతో పాటు దాదాపు 40 నుంచి 45 దేశాలు పాల్గొననున్నాయి. ఈ మేరకు ఆయా దేశాలకు ఆహ్వానం పంపామని, ఇప్పటికే పలు దేశాలు అంగీకరించాయని భారత నౌకాదళ అధికారులు చెప్పారు. సీ ఫేజ్, హార్బర్ ఫేజ్‌లలో రెండు ఫేజ్‌లలో విన్యాసాలు నిర్వహించనున్నారు. మిలాన్ విన్యాసాలతో పాటు 2022, ఫిబ్రవరి 21 నుంచి విశాఖపట్నం వేదికగానే ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్‌ఆర్)ను కూడా భారత నావికాదళం నిర్వహించనుంది.
కోవిడ్ కారణంగా..
వాస్తవానికి 2020, మార్చి 19 నుంచి 27 వరకూ విశాఖ కేంద్రంగా మిలాన్ విన్యాసాలు జరగాల్సి ఉంది. కోవిడ్ కారణంగా వాయిదా వేశారు. 2021 మార్చిలో నిర్వహించాలని భావించినా కరోనా పరిస్థితులు అనుకూలించకపోవడంతో మరోమారు వాయిదా వేశారు. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ–2016కు విశాఖ నగరం వేదికగా నిలిచిన విషయం విదితమే.
సమావేశం అని అర్థం..
వివిధ దేశాల మధ్య సహృద్భావ వాతావరణంలో స్నేహ పూర్వక సత్సంబంధాల్ని మెరుగు పరుచుకోవడంతో పాటు శత్రుసైన్యానికి బలం, బలగం గురించి తెలియజేసేందుకు మిలాన్ విన్యాసాలు నిర్వహిస్తుంటారు. మిలాన్ అంటే.. హిందీలో సమావేశం అని అర్థం.
1995లో తొలిసారి..
- 1995లో తొలిసారి జరిగిన మిలాన్ విన్యాసాల్లో భారత్‌తో పాటు ఇండోనేసియా, సింగపూర్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలు మాత్రమే పాల్గొన్నాయి.
- సాధారణంగా రెండేళ్లకోసారి నిర్వహించే మిలాన్‌లో 2010 వరకు 8 దేశాలు మాత్రమే పాల్గొనగా.. 2012లో 16 దేశాలు పాల్గొన్నాయి.
- 2014లో 17 దేశాలు పాల్గొని అతి పెద్ద మిలాన్‌గా చరిత్రకెక్కింది. 2018లో అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగిన విన్యాసాల్లోనూ 17 దేశాలు పాల్గొన్నాయి.
- 2005లో సునామీ రావడం వల్ల మిలాన్ విన్యాసాలు రద్దు చేయగా, 2001, 2016 సంవత్సరాల్లో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)లు నిర్వహించడం వల్ల మిలాన్ విన్యాసాలు జరగలేదు.
- మొత్తంగా ఇప్పటి వరకూ 10 సార్లు మిలాన్ విన్యాసాలు జరిగాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫిబ్రవరి 25 నుంచి మిలాన్–2022 విన్యాసాలు నిర్వహణ
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : భారత నౌకాదళం
ఎక్కడ : ఈస్ట్రన్ నేవల్ కమాండ్ (ఈఎన్‌సీ) ప్రధాన స్థావరం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : వివిధ దేశాల మధ్య సహృద్భావ వాతావరణంలో స్నేహ పూర్వక సత్సంబంధాల్ని మెరుగు పరుచుకోవడంతో పాటు శత్రుసైన్యానికి బలం, బలగం గురించి తెలియజేసేందుకు..
United States: మానవీయ సాయానికి అఫ్గాన్ కేంద్ర బ్యాంకు నిధులు
అమెరికాలో స్తంభించిన అఫ్గానిస్తాన్ కేంద్ర బ్యాంకు నిధులను(దాదాపు 700 కోట్ల డాలర్లు)... అఫ్గాన్‌లో మానవీయ సాయానికి, ఉగ్రవాద బాధితులకు పరిహారానికి వినియోగించాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆదేశాలిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంలో త్వరలో అధ్యక్షుడు బ్యాంకులకు ఆదేశాలిస్తారని, దీంతో యూఎస్ ఫైనాన్స్ సంస్థలు ఈ నిధులను విడుదల చేస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు. వీటిలో 350 కోట్ల డాలర్లను అఫ్గాన్‌లో సహాయానికి కేటాయిస్తారని, 350 కోట్ల డాలర్లను అమెరికా వద్దే ఉంచుకొని ఉగ్రవాద దాడుల బాధితులకు అందిస్తారని చెప్పారు.
మరో 200 కోట్ల డాలర్లు..
గతంలో అమెరికా సహా పలు దేశాలు అఫ్గాన్‌కు సాయం కోసం కోట్లాది డాలర్ల నిధులను అందించాయి. వీటిని అఫ్గాన్ కేంద్రబ్యాంకు అమెరికా బ్యాంకుల్లో దాచింది. తాలిబన్లు దేశాన్ని వశం చేసుకున్నప్పటినుంచి ఈ నిధులు తమకు అప్పగించాలని కోరుతున్నారు. అయితే తాలిబన్లు అధికారంలోకి వచ్చాక ఈ నిధులను అమెరికా స్తంభింపజేసింది. అమెరికాలో ఉన్న 700 కోట్ల డాలర్లు కాకుండా మరో 200 కోట్ల డాలర్ల అఫ్గాన్ నిధులు జర్మనీ, యూఏఈ, స్విట్జర్లాండ్, ఖతార్‌లో ఉన్నాయి. అమెరికా తాజా నిర్ణయాన్ని తాలిబన్లు వ్యతిరేకిస్తారని అంచనా.
చదవండి: Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 11 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్