Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 11 కరెంట్ అఫైర్స్
Karnataka High Court: ‘హిజాబ్’పై ఏర్పాటైన ధర్మాసనానికి ఎవరు సారథ్యం వహిస్తున్నారు?
హిజాబ్–కాషాయ కండువా గొడవతో కొద్ది రోజులుగా అట్టుడికిన కర్ణాటకలో విద్యా సంస్థల మూసివేత నేపథ్యంలో ఫిబ్రవరి 9న ప్రశాంతత నెలకొంది. దీనిపై విచారణకు విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తూ కర్ణాటక హైకోర్టు సీజే జస్టిస్ రితురాజ్ అవస్థీ నిర్ణయం తీసుకున్నారు. ఆయన సారథ్యంలో ఏర్పాటైన ఈ ఫుల్ బెంచ్‌లో న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీ కూడా ఉంటారు. వివాదంపై ఫిబ్రవరి 8, 9న విచారణ జరిపిన జస్టిస్ దీక్షిత్ నివేదన మేరకు సీజే ఈ నిర్ణయం తీసుకున్నారు.
పాక్ స్పందించడం సిగ్గుచేటు: భారత్
భారత్‌లో దారుణం జరుగుతోందని, హిజాబ్‌ను అనుమతించకపోవడం హక్కుల ఉల్లంఘనేనని పాకిస్తాన్ మంత్రులు షా మహమూద్ ఖురేషీ, ఫవాద్ çహుస్సేన్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ తీవ్రంగా ఖండించారు. దేశ ప్రతిçష్టకు మచ్చ తెచ్చే దురుద్దేశంతోనే కొందరు హిజాబ్ గొడవకు మతం రంగు పులిమారని ఆరోపించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘హిజాబ్’పై ఏర్పాటైన ధర్మాసనానికి ఎవరు సారథ్యం వహిస్తున్నారు?
ఎప్పుడు : ఫిబ్రవరి 9
ఎవరు : కర్ణాటక హైకోర్టు సీజే జస్టిస్ రితురాజ్ అవస్థీ
ఎందుకు : హిజాబ్–కాషాయ కండువా గొడవపై విచారణ జరిపేందుకు..
Glenmark Pharma: కోవిడ్ చికిత్సకి భారత్‌లో అందుబాటులోకి వచ్చిన తొలి నాజల్ స్ప్రే?
కోవిడ్–19 మహమ్మారితో బాధపడేవారికి చికిత్స అందించడానికి తొలిసారిగా భారత్‌లో నాజల్ స్ప్రే అందుబాటులోకి వచ్చింది. ముంబైకి చెందిన అంతర్జాతీయ ఫార్మా కంపెనీ గ్లెన్‌మార్క్ ఫిబ్రివరి 9న ముక్కు ద్వారా చికిత్స చేసే నిట్రిక్ ఆక్సైడ్ స్ప్రే విడుదల చేసింది. ఫ్యాబీ స్ప్రే అనే బ్రాండ్ నేమ్‌తో విడుదల చేసిన ఈ స్ప్రేని కరోనా సోకిన వయోజనుల్లో వాడితే మంచి ఫలితాలు వస్తున్నాయని, ఇది అత్యంత సురక్షితమైనదని కంపెనీ స్పష్టం చేసింది.
సానోటైజ్ కంపెనీతో కలిసి..
కోవిడ్–19పై పోరాటంలో ఇప్పటికే ఎన్నో వినూత్న ఆవిష్కరణలు చేసిన సానోటైజ్ కంపెనీతో కలిసి సంయుక్తంగా గ్లెన్‌మార్క్ సంస్థ.. ఈ ఫ్యాబీ స్ప్రేను తయారు చేసింది. కరోనా వైరస్ ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా నిరోధించడమే లక్ష్యంగా ఈ నాజల్ స్ప్రేని రూపొందించారు. ఈ ఔషధానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతులు కూడా లభించాయని గ్లెన్‌మార్క్ సీఓఓ రాబర్ట్ క్రోకర్ట్ చెప్పారు. ఇప్పటికే పలు దశాల్లో చేసిన ప్రయోగాలతో ఈ స్ప్రే సమర్థవంతంగా పని చేస్తుందని తేలింది.
ఉటా యూనివర్సిటీ అధ్యయనంలో..
- ఈ స్ప్రే వాడడం వల్ల 24 గంటల్లో 94 శాతం వైరస్ లోడు తగ్గుతోంది
- 48 గంటల్లో ఏకంగా 99 శాతం వైరస్ తగ్గిపోతుంది.
- కరోనా వైరస్‌ని భౌతిక, రసాయన చర్యల ద్వారా ఈ వైరస్ ఎదుర్కొంటుంది.
- వైరస్ ఊపిరితిత్తుల్లోకి చేరకుండా నిరోధిస్తుంది.
- అమెరికాలో ఉటా యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో ఈ స్ప్రే కరోనాలోని ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వంటి అన్ని వేరియెంట్‌లపై రెండు నిముషాల్లోనే పని చేస్తుందని తేలింది. 99.9 శాతం సమర్థంగా పని చేస్తున్నట్టుగా వెల్లడైంది.
- కరోనా తగ్గుముఖం పట్టడంతో పాటు వైరస్ వ్యాప్తిని కూడా ఈ స్ప్రే నిరోధిస్తుంది. వైరస్ సోకినట్టుగా వెంటనే గుర్తించగలిగితే, వ్యాప్తిని కూడా అరికట్టే అవకాశాలుంటాయి. ఈ స్ప్రే వాడిన రెండు రోజుల్లోనే ఆర్‌టీపీసీఆర్ పరీక్షల్లో కూడా నెగిటివ్ వస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తొలి నాజల్ స్ప్రే అయిన నిట్రిక్ ఆక్సైడ్ స్ప్రేను ఫ్యాబీ స్ప్రే అనే బ్రాండ్ నేమ్‌తో అందుబాటులోకి తెచ్చిన సంస్థ?
ఎప్పుడు : ఫిబ్రవరి 9
ఎవరు : అంతర్జాతీయ ఫార్మా కంపెనీ గ్లెన్‌మార్క్
ఎక్కడ : భారత్
ఎందుకు : కోవిడ్–19 చికిత్స కోసం..
Space: 2022లో 140 స్పేస్‌క్రాఫ్ట్‌లను అంతరిక్షంలోకి పంపనున్న దేశం?
2022 సంవత్సరం 50కి పైగా స్పేస్ లాంచ్‌లు జరపాలని చైనా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంతోపాటు తన స్పేస్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేసేందుకు ఆరు సార్లు మానవ సహిత అంతరిక్ష యాత్రలు సైతం 2022 ఏడాది చైనా చేపట్టనుంది. నూతన సంవత్సరం అంతరిక్షంపై పట్టుకు రూపొందించుకున్న విధానాలను చైనా ఫిబ్రవరి 10న ప్రకటించింది. 2022 సంవత్సరం 50కిపైగా స్పేస్ లాంచ్‌లతో 140 స్పేస్‌క్రాఫ్ట్‌లను అంతరిక్షంలోకి పంపుతామని వెల్లడించింది.
ఐఎస్‌ఎస్‌కు పోటీగా..
2021లో ప్రపంచమంతా కలిసి 146 స్పేస్ లాంచింగ్‌లు జరిగాయి. వీటిలో 48 లాంచింగ్‌లు చైనా చేపట్టినవే. 2021 ఏడాది 51 లాంచింగ్‌లతో యూఎస్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం చైనా స్పేస్ స్టేషన్ నిర్మాణంలో ముగ్గురు వ్యోమోగాములు పాలుపంచుకుంటున్నారు. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్(ఐఎస్‌ఎస్)కు పోటీగా చైనా ఈ సీఎస్‌ఎస్ (చైనా అంతరిక్ష కేంద్రం)ను నిర్మిస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2022లో 140 స్పేస్‌క్రాఫ్ట్‌లను అంతరిక్షంలోకి పంపనున్న దేశం?
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : చైనా
ఎందుకు : అంతరిక్షంపై పట్టు సాధించేందుకు..
United Nations: ఐసిస్ అకృత్యాలపై ఐరాస విడుదల చేసిన నివేదిక పేరు?
అఫ్గానిస్తాన్‌లో ఐసిస్ ఉగ్రవాద సంస్థ అకృత్యాలపై ‘‘14వ సెక్రటరీ జనరల్ రిపోర్టు’’ను ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసింది. అయితే ఈ నివేదికపై భారత్ అసహనం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ స్థావరంగా కార్యకలాపాలు నిర్వహించే లష్కరేతోయిబా, జేషే మహ్మద్ సంస్థలకు ఐసిస్‌కు మధ్య ఉన్న సంబంధాల గురించి పలు మార్లు హెచ్చరించినా నివేదికలో పేర్కొనలేదని భారత్ అసంతృప్తి తెలిపింది. పాక్ మద్దతుతో హక్కానీ నెట్‌వర్క్ విస్తరించడాన్ని, పలు ఉగ్రసంస్థలకు ఆల్‌ఖైదా, ఐసిస్‌తో ఉన్న సంబంధాలను విస్మరించకూడదని ఐరాసలో భారత ప్రతినిధి తిరుమూర్తి వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లోనైనా సభ్యదేశాల ఆందోళనను పట్టించుకొని నివేదికలు రూపొందించాలని కోరారు.
ఐరాస దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
మొదటి ప్రపంచ యుద్దానంతరం ఏర్పడిన నానాజాతి సంస్థ (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండో ప్రపంచ యుద్దాన్ని ఆపలేకపోయింది. ఫలితంగా ప్రపంచ శాంతి, దేశాల మధ్య సహకారం పెంపొందించేందుకు 1945, అక్టోబరు 24న ఐక్యరాజ్య సమితి (యునెటైడ్ నేషన్స్ ఆర్గనైజేషన్) ఏర్పడింది. ఈ రోజును ప్రతి ఏటా ఐరాస దినంగా నిర్వహిస్తారు. ఐరాస ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది. అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ ‘యునెటైడ్ నేషన్స్’ అనే పదాన్ని తొలిసారి ప్రవేశపెట్టాడు.
ఐరాస అధికార భాషలు ఏవి?
ఐరాస పతాకాన్ని 1947 అక్టోబరు 20న ఆమోదించారు. ఈ పతాకం లేత నీలం, తెలుపు రంగుల్లో ఉంటుంది. పతాకం మధ్యలో ఐరాస చిహ్నమైన ప్రపంచ పటం రెండు ఆలివ్ కొమ్మల మధ్య ఉంటుంది. ఆలివ్ కొమ్మలు శాంతికి చిహ్నం. ఐరాసాకి ఆరు అధికారిక భాషలున్నాయి అవి.. అరబిక్, చైనీస్, ఇంగ్లిష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్, అరబిక్. 1973లో అరబిక్‌ను ఆరో అధికార భాషగా చేర్చారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 14వ సెక్రటరీ జనరల్ రిపోర్టు విడుదల
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : ఐక్యరాజ్య సమితి
ఎందుకు : అఫ్గానిస్తాన్‌లో ఐసిస్ ఉగ్రవాద సంస్థ అకృత్యాలను ప్రపంచానికి వెల్లడించేందుకు..
RBI Monetary Policy Highlights: ప్రస్తుతం ఆర్‌బీఐ రివర్స్ రెపో ఎంత శాతంగా ఉంది?
కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్ రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) యథాతథంగా కొనసాగించింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆధ్వర్యంలో ముంబైలో ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు వరుసగా మూడు రోజులు సమావేశమైన ఆరుగురు సభ్యుల ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (మానిటరీ పాలసీ కమిటీ–ఎంపీసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వృద్ధే లక్ష్యంగా సరళతర వడ్డీరేట్ల విధానాన్ని అనుసరించింది. దీంతో ఆర్‌బీఐ రెపో రేటు 4.00 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగానే కొనసాగనున్నాయి.
ముఖ్యాంశాలు..
- దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 2021–22లో 9.2 శాతం ఉంటే, 2022–23లో ఈ రేటు 7.8 శాతానికి తగ్గుతుందని ఆర్‌బీఐ అంచనా.
- పాలసీ నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా అంచనా వేయగా, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని అంచనా.
- ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో కొనసాగేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
- వృద్ధి రికవరీ, పటిష్టత లక్ష్యంగా అవసరమైనంతకాలం ‘సరళతర’ విధానాన్నే అనుసరించడం ఉత్తమమని ఐదుగురు సభ్యులు అభిప్రాయపడ్డారు. ‘సరళతర’ వైఖరిని ‘తటస్థం’కు మార్చాలన్న ప్రతిపాదనను ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు వ్యతిరేకించగా, ఒక్కరు మాత్రమే అనుకూలంగా ఓటు చేశారు.
- దేశానికి వచ్చీ–పోయే విదేశీ మారకపు ద్రవ్యం మధ్య నికర వ్యత్యాసాన్ని తెలియజేసే కరెంట్ అకౌంట్– ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2 శాతం (జీడీపీ విలువలో) లోటును నమోదుచేస్తుందని ఆర్‌బీఐ అంచనా వేసింది.
- వచ్చే ఆర్థిక సంవత్సరం (2022–23)లో తొలి ద్వైమాసిక పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం ఏప్రిల్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరుగుతుంది.
మరికొన్ని కీలక నిర్ణయాలు..
- కోవిడ్–19 సంక్షోభం నేపథ్యంలో అత్యవసర ఆరోగ్య సేవల రంగానికి గత ఏడాది మేలో ప్రకటించిన రూ.50,000 కోట్ల ఆన్–ట్యాప్ లిక్విడిటీ రుణ సౌలభ్యతను మరో 3 నెలలు అంటే 2022 జూన్ 30 వరకు పొడిగించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.
- ప్రస్తుత అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొనడానికి బ్యాంకులు, బ్యాంకింగ్ యేతర ఫైనాన్షియల్ కంపెనీలు మూలధన పెంపు ప్రక్రియపై నిరంతరం దృష్టి సారించాలని సూచించింది.
10 సమావేశాల నుంచి యథాతథం
రెపో రేటును ఆర్‌బీఐ ఎంపీసీ వరుసగా పది ద్వైమాసిక సమావేశాల నుంచి యథాతథంగా కొనసాగిస్తోంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో 2019 ప్రారంభం నుంచి 135 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు 1 శాతం) రుణ రేటును తగ్గించిన ఆర్‌బీఐ, కరోనా కష్టకాలం నేపథ్యంలో 2020 మార్చి తరువాత 115 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో 2020 ఆగస్టునాటికి రెపో రేటు రికార్డు కనిష్టం 4 శాతానికి దిగివచ్చింది. ఇక అప్పటి నుంచి (2020 ఆగస్టు ద్వైమాసిక సమావేశం) రెపో రేటును యథాతథంగా కొనసాగించడానికే ఆర్‌బీఐ ఎంపీసీ నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. 2019 ప్రారంభంతో పోల్చితే ఇప్పుడు రెపో రేటు 2.5 శాతం తక్కువగా ఉంది.
రెపో, రివర్స్ రెపో రేటు అంటే ఏమిటీ?
ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీని రెపో రేటు అంటారు. ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై పొందే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటుగా వ్యవహరిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్‌బీఐ రెపో రేటు(4.00 శాతం), రివర్స్ రెపో రేటు(3.35 శాతం)ను యథాతథంగా కొనసాగింపు
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (మానిటరీ పాలసీ కమిటీ–ఎంపీసీ)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడేందుకు వీలుగా సరళతర ద్రవ్య విధానాన్నే కొనసాగించాలని..
RBI Monetary Policy Highlights: ఈ–రూపీ గరిష్ట పరిమితిని ఎన్ని రూపాయలకు పెంచారు?
ఈ–రూపీ (ప్రీ–పెయిడ్ డిజిటల్ ఓచర్) గరిష్ట పరిమితిని రూ. 10,000 నుండి రూ.1 లక్షకు పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పరపతి విధాన కమిటీ (మానిటరీ పాలసీ కమిటీ–ఎంపీసీ) నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ ఎంపీసీ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఫిబ్రవరి 10న వెల్లడించారు. ఈ–రూపీ పరిమితిని రూ. లక్షకు పెంచడంతో.. లబ్దిదారుడు బ్యాంక్ అకౌంట్, ఇంటర్‌నెట్ లేకుండా కేవలం ఫీచర్ ఫోన్ ద్వారా కూడా రూ. 1 లక్ష వరకు ప్రభుత్వ ప్రయోజనాలను పొందవచ్చు.
ఎన్‌పీసీఐ రూపకల్పన..
ప్రభుత్వ పథకాల ప్రయోజనాల సమర్థ పంపిణీకి ప్రస్తుతం ఈ–రూపీ కీలకంగా ఉంది. కేవైసీ, కార్డ్, డిజిటల్ చెల్లింపుల యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ వంటి వాటితో సంబంధం లేకుండా వోచర్‌ను రిడీమ్ చేయడంలో లబ్దిదారులకు సహాయపడే వన్–టైమ్ (ఇప్పటివరకూ... ఇకపై పూర్తిగా రీడీమ్ అయ్యే వరకూ) కాంటాక్ట్‌లెస్, నగదు రహిత వోచర్ ఆధారిత చెల్లింపు విధానమే– ఈ–రూపీ. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) రూపొందించిన ఈ–రూపీ నగదు రహిత డిజిటల్ ఓచర్‌ను ‘వ్యక్తిగత వినియోగం, సింగిల్ టైమ్ రెడెమ్షన్ సౌలభ్యంతో’ 2021 జూలైలో ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఈ–రూపీ (ప్రీ–పెయిడ్ డిజిటల్ ఓచర్) గరిష్ట పరిమితిని రూ. 10,000 నుండి రూ.1 లక్షకు పెంచుతూ నిర్ణయం
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (మానిటరీ పాలసీ కమిటీ–ఎంపీసీ)
ఎందుకు : లబ్దిదారులకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు..
Andhra Pradesh: రాష్ట్రంలోని ఏ జిల్లాలో నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటు కానుంది?
కర్నూలు జిల్లా, కర్నూలు నగర సమీపంలోని జగన్నాథ గట్టుపై 50 ఎకరాల్లో రూ.88.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల, క్లస్టర్ విశ్వవిద్యాలయం పరిపాలన భవన సముదాయ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో కలిసి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఫిబ్రవరి 10న భూమి పూజ చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. జగన్నాథ గట్టులో ‘‘నేషనల్ లా యూనివర్సిటీ’’ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. స్టేట్ ఆర్కిటెక్ట్ బోర్డు ద్వారా క్లస్టర్ వర్సిటీ భవనాలను అత్యంత నాణ్యంగా నిర్మిస్తున్నట్టు చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : త్వరలో నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
ఎక్కడ : జగన్నాథ గట్టు, కర్నూలు నగర సమీపం, కర్నూలు జిల్లా
Andhra Pradesh: రాష్ట్రంలోని ఏ నగరంలో అంబేడ్కర్ స్మృతివనం ఏర్పాటు చేయనున్నారు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, విజయవాడ నగరంలో.. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం, స్మృతివనం ఏర్పాటు చేయనున్నారు. వీటికి సంబంధించిన పనులు చేసేందుకు వీలుగా ఇక్కడి స్వరాజ్ మైదాన్‌లో ఉన్న 42 కట్టడాలను తొలగించగా ఆ భూమిని జిల్లా కలెక్టర్ జె. నివాస్.. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖకు ఇప్పటికే అప్పజెప్పారు. 18 ఎకరాల విస్తీర్ణంలో రూ.249 కోట్లతో ఇక్కడ అంబేడ్కర్ స్మృతివనం ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ఈ పనుల నిర్వహణ బాధ్యతను కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. పనుల పర్యవేక్షణకు నోడల్ ఏజెన్సీగా సాంఘిక సంక్షేమ శాఖ, కార్యనిర్వహణ ఏజెన్సీగా ఏపీఐఐసీ వ్యవహరిస్తున్నాయి. స్మృతి వనంలో మెమోరియల్ పార్కు, అధ్యయన కేంద్ర నిర్మాణం చేపట్టనున్నారు. అన్ని పనులు పూర్తిచేసుకుని మార్చి 31, 2023 నాటికి విగ్రహాన్ని ఏర్పాటుచేసే విధంగా కాల పరిమితిని నిర్ణయించారు.
దుబాయ్ ఎక్స్‌పోలో ఏపీ పెవిలియన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం దుబాయ్ ఎక్స్‌పో–2020 వేదికను వినియోగించుకుంటోంది. దుబాయ్‌లో ఫిబ్రవరి 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరిగే పెట్టుబడుల సదస్సులో ఏపీ పెవిలియన్ పేరిట ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి రాష్ట్రంలోని పెట్టుబడుల అవకాశాలను విదేశీ ఇన్వెస్టర్లకు వివరించనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాష్ట్రంలోని ఏ నగరంలో బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం, స్మృతివనం ఏర్పాటు ఏర్పాటు చేయనున్నారు?
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ : విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
Supreme Court Collegium: ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టు సీజేగా ఎవరు ఉన్నారు?
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురు న్యాయవాదుల పేర్లను సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన తీర్మానానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఫిబ్రవరి 10న ఆమోద ముద్ర వేశారు. కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, తర్లాడ రాజశేఖరరావు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, వడ్డిబోయన సుజాతలను న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. వీరి వీరి చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ప్రమాణం చేయించనున్నారు. వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 27కి చేరనుంది.
ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు..
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి అదే రోజు అక్కడి నుంచి పరిపాలన, కలెక్టర్లు, ఎస్పీల కార్యకలాపాలు కొనసాగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని ఫిబ్రవరి 10న అధికార యంత్రాంగానికి నిర్దేశించారు.
Geomagnetic storm: సౌర తుఫాన్ల కారణంగా ఏ సంస్థ శాటిలైట్లు కాలిపోయాయి?
సౌర తుఫాన్ల( జియోమాగ్నటిక్ తుఫాన్లు) కారణంగా తమ కొత్త శాటిలైట్లలో కనీసం 49 దాకా తమ కక్ష్యల నుంచి జారి తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోయినట్టు ఫిబ్రవరి 9న స్పేస్ ఎక్స్ ప్రకటించింది. ‘‘గత వారం ప్రయోగించిన వీటిలో చాలావరకు తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోయాయి. మిగతావీ కూడా అదే బాటలో ఉన్నాయి’’ అని చెప్పింది.
ఉగ్రవాదులకు అపరిమిత స్వేచ్ఛ: ఐరాస
కల్లోలిత అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాద మూకలు అంతులేని స్వేచ్ఛను అనుభవిస్తున్నాయని, వాటికి ఎదురే లేకుండా పోయిందని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుట్టెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గానిస్తాన్‌లోని ఐసిస్ అనుబంధ సంస్థ ‘ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ లెవాంట్–ఖోరాసన్’కు సనావుల్లా గఫారీ అలియాస్ సాహ బ్ అల్–ముజాహిర్ నేతృత్వం వహిస్తున్నాడు. 2021 ఏడాది కాబూల్ ఎయిర్‌పోర్టుపై దాడికి సంబంధించి గఫారీపై అమెరికా 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది.
కొత్త వేరియంట్ల ముప్పు అధికమే!
ఒమిక్రాన్ వేరియంట్‌తోనే మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగిపోయినట్లు భావించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు చెందిన కోవిడ్–19 టెక్నికల్ లీడ్ మారియా వాన్ కెర్ఖోవ్ చెప్పారు. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ముప్పు అధికంగానే ఉందని తెలిపారు.
అహ్మదాబాద్ ఫ్రాంచైజీ పేరు ‘గుజరాత్ టైటాన్స్’
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అహ్మదాబాద్ ఫ్రాంచైజీని చేజిక్కించుకున్న ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్ తమ జట్టుకు ‘గుజరాత్ టైటాన్స్’ అని పేరు పెట్టింది. ఈ జట్టుకు భారత ప్లేయర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.
చదవండి: Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 09 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్