Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 09 కరెంట్‌ అఫైర్స్‌

DA-CAs-Feb-9th

Mahabharat’s Bheem: గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన భారత అథ్లెట్‌?

Praveen Kumar Sobti

దిగ్గజ క్రీడాకారుడు, నటుడు ప్రవీణ్‌ కుమార్‌ సోబ్టీ(74) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఫిబ్రవరి 7న న్యూఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ క్రీడల్లో డిస్కస్‌ త్రో, హ్యామర్‌ త్రో ఈవెంట్లలో పతకాలు నెగ్గిన ప్రవీణ్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి. పంజాబ్‌ రాష్ట్రం, టార్న్‌ తరణ్‌ జిల్లా, సర్హలి కలాన్‌ పట్టణంలో 1947, డిసెంబర్‌ 6న ఆయన జన్మించారు.

ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం..

  • ప్రవీణ్‌ 1960 నుంచి 1974 వరకు పలు మెగా ఈవెంట్లలో పతకాలతో మెరిశారు.
  • 1966 బ్యాంకాక్‌ ఆసియా క్రీడల్లో డిస్కస్‌ త్రోలో చాంపియన్‌గా నిలిచి స్వర్ణం సాధించిన ప్రవీణ్‌ హ్యామర్‌ త్రోలో కాంస్యం నెగ్గారు.
  • 1966 ఏడాది కింగ్‌స్టన్‌లో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో హ్యామర్‌ త్రోలో రజతం గెలుపొందారు. 
  • 1970 బ్యాంకాక్‌ ఆసియా క్రీడల్లో డిస్కస్‌ త్రో ఈవెంట్‌లో టైటిల్‌ నిలబెట్టుకున్న ప్రవీణ్‌ 1974 టెహ్రాన్‌ ఆసియా క్రీడల్లో రజతం గెలిచారు. 
  • 1968 మెక్సికో, 1972 మ్యూనిక్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లోనూ ప్రవీణ్‌ భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.

భారతంలో భీముడు
దూరదర్శన్‌లో 90వ దశకంలో ప్రసారమైన సుప్రసిద్ధ పౌరాణిక ధారావాహిక ‘మహాభారత్‌’లో పంచ పాండవుల్లో భీముడిగా ప్రవీణ్‌ దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. తదనంతరం పలు హిందీ, తమిళ్, తెలుగు చిత్రాల్లో  నటించారు. 2013లో రాజకీయాల్లోనూ ప్రవేశించి ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున ఢిల్లీలోని వాజిర్‌పూర్‌ అసెంబ్లీ నియోజక వర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
దిగ్గజ అథ్లెట్, నటుడు కన్నుమూత
ఎప్పుడు   : ఫిబ్రవరి 7
ఎవరు    : ప్రవీణ్‌ కుమార్‌ సోబ్టీ(74)
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : గుండెపోటు కారణంగా..

BBC Indian Sportswoman of the Year Award: లవ్లీనా బొర్గొహైన్‌ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందింది?

BBCISWOTY

రెండు ఒలింపిక్‌ పతకాల విజేత, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పూసర్ల వెంకట సింధు(పీవీ సింధు) రెండోసారి ‘బీబీసీ ఇండియన్‌ స్పోర్ట్స్‌ఉమన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు రేసులో నిలిచింది. 2020లో సింధుకు ఈ అవార్డు లభించింది. ప్రముఖ బ్రాడ్‌కాస్టింగ్‌ నెట్‌వర్క్‌ బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌(బీబీసీ) ఫిబ్రవరి 8న విడుదల చేసిన 2022 నామినీల్లో తెలుగు తేజంతో పాటు టోక్యోలో రజతం నెగ్గిన వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను, బాక్సింగ్‌లో కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్, గోల్ఫర్‌ అదితి అశోక్, పారాలింపియన్‌ షూటర్‌ అవనీ లేఖరా ఉన్నారు. ఆన్‌లైన్‌ ఓటింగ్‌ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు. 2022, ఫిబ్రవరి 28 వరకు ఓటింగ్‌ నిర్వహిస్తారు. మార్చి 28న ఏర్పాటు చేసే కార్యక్రమంలో విజేతను ప్రకటిస్తారు. 2021 సంవత్సరంలో భారత చెస్‌ దిగ్గజం కోనేరు హంపికి ఈ అవార్డు లభించింది. భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారులను సత్కరించే లక్ష్యంతో ఏటా బీబీసీ ఇండియన్‌ స్పోర్ట్స్‌వుమన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును అందిస్తున్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
బీబీసీ ఇండియన్‌ స్పోర్ట్స్‌ఉమన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు రేసులో నిలిచిన బ్యాడ్మింటన్‌ స్టార్‌?
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు    : పూసర్ల వెంకట సింధు(పీవీ సింధు) 
ఎందుకు : క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించినందున..

94th Academy Awards: ఆస్కార్‌ ఫైనల్‌కు నామినేట్‌ అయిన భారతీయ చిత్రం?

Writing With Fire

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న 94వ ఆస్కార్‌ అవార్డ్స్‌ నామినేషన్స్‌ ఫిబ్రవరి 8న వెల్లడయ్యాయి. ట్రెసీ ఎల్లిస్‌ రాస్, లెస్లీ జోర్డాన్‌ ఆస్కార్‌ నామినేషన్స్‌ ప్రకటనకు హోస్ట్స్‌గా వ్యవహరించారు. ఈ నామినేషన్స్‌లో ‘ద పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌’ చిత్రం ఏకంగా 12 నామినేషన్లు దక్కించుకోగా, ‘డ్యూన్‌’ చిత్రం 10, ‘వెస్ట్‌ సైడ్‌ స్టోరీ’, ‘బెల్‌ఫాస్ట్‌’ చిత్రాలకు ఏడేసి చొప్పున నామినేషన్లు లభించాయి. 2022, మార్చి 27న ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే.

భారత్‌ నుంచి..
భారత్‌ నుంచి ఢిల్లీకి చెందిన ఫిల్మ్‌మేకర్స్‌ రిటు థామస్, సుస్మిత్‌ ఘోష్‌ తీసిన ‘రైటింగ్‌ విత్‌ ఫైర్‌’ ఆస్కార్‌ నామినేషన్‌ను దక్కించుకుంది. బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీలో చోటు దక్కించుకుంది. ఈ డాక్యుమెంటరీ ఇప్పటికే పదిహేనుకు పైగా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులు సొంతం చేసుకుంది.

జై భీమ్, మరక్కర్‌ సినిమాలకు నిరాశ..
బెస్ట్‌ ‘ఫీచర్‌ ఫిల్మ్స్‌ ఇన్‌ కన్సిడరేషన్‌ ఫర్‌ 94 ఆస్కార్‌ అవార్డ్స్‌’ అంటూ కొన్ని రోజుల క్రితం నామినేషన్‌ ఎంట్రీ పోటీలో ఆస్కార్‌ ఆకాడమీ ప్రకటించిన 276 చిత్రాల్లో తమిళ ‘ౖజై భీమ్‌’, మలయాళ ‘మరక్కర్‌: అరబికడలింటే సింహమ్‌’ చిత్రాలు చోటు దక్కించుకోగలిగాయి. కానీ ఆస్కార్‌ ఫైనల్‌ నామినేషన్స్‌లో మాత్రం ఈ చిత్రాలకు నిరాశ తప్పలేదు.

మొత్తం 23 విభాగాలు..

మొత్తం 23 విభాగాలకు సంబంధించిన నామినేషన్లను అవార్డు కమిటీ ప్రకటించింది. వాటిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, నటి, నటీమణి నామినేషన్లు ఈ విధంగా...

  •  ఉత్తమ చిత్రం: బెల్‌ ఫాస్ట్, కోడా, డోన్ట్‌ లాకప్, డ్రైవ్‌ మై కార్, డ్యూన్, కింగ్‌ రిచర్డ్, లికోరైస్‌ పిజా, నైట్‌మేర్‌ అల్లీ. ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్, వెస్ట్‌ సైడ్‌ స్టోరీ  
  • ఉత్తమ దర్శకుడు: జాన్‌ కాంపియన్‌ (ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌), పాల్‌ థామస్‌ ఆండ్రూసన్‌ (లికోరైస్‌ పిజ్జా), స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ (వెస్ట్‌ సైడ్‌ స్టోరీ), ర్యూసుకీ హమగుచి (డ్రైవ్‌ మై కార్‌), కెన్నెత్‌ బ్రానాగ్‌ (బెల్‌ఫాస్ట్‌) 
  • ఉత్తమ నటుడు: ఆండ్రూ గార్‌ఫీల్డ్‌ (టిక్, టిక్‌ ... బూమ్‌), విల్‌ స్మిత్‌ (కింగ్‌ రిచర్డ్‌), బెనెడిక్ట్‌ కంబర్‌ బ్యాచ్‌ (ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌), డెంజిల్‌ వాషింగ్టన్‌ (ది ట్రాజెడీ ఆఫ్‌ మెక్‌బెత్‌), జేవియర్‌ బార్డెమ్‌ (బీయింగ్‌ ది రికార్డోస్‌)
  • ఉత్తమ నటి: నికోల్‌ కిడ్‌మెన్‌ (బీయింగ్‌ ది రికార్డోస్‌), ఓలీవియా కోల్మన్‌ (ది లాస్ట్‌ డాటర్‌), క్రిస్టెన్‌ స్టీవర్ట్‌ (స్పెన్సర్‌), జెస్సికా కాస్టెయిన్‌ (ది ఐస్‌ ఆఫ్‌ టమ్మీ ఫేయీ), పెనెలోప్‌ క్రజ్‌ (సమాంతర తల్లులు)

అత్యధిక వయసు ఉన్న నటిగా..

  • దర్శకురాలు జేన్ కాంపియన్‌ రెండు విభాగాల్లో ఆస్కార్‌ అవార్డ్స్‌కు నామినేటయ్యారు. ‘ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌’ సినిమాకు సంబంధించి ఉత్తమ దర్శకురాలు, బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే విభాగాల్లో నామినేషన్స్‌ దక్కించుకున్నారు. ఈ ఫీట్‌ సాధించిన తొలి మహిళ కాంపియనే.
  • డేమ్‌ జూడీ డెంచ్‌ (87) ‘బెల్‌ ఫాస్ట్‌’ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా నామినేషన్‌ దక్కించుకున్నారు. ఆస్కార్‌ చరిత్రలో నామినేషన్‌ దక్కించుకున్న అత్యధిక వయసు ఉన్న నటిగా జ్యూడీ డెంచ్‌ చరిత్ర సృష్టించారు.
  • తాజాగా కెన్నెత్‌ బ్రానాగ్‌ దర్శకత్వం వహించిన ‘బెల్‌ఫాస్ట్‌’కి బెస్ట్‌ పిక్చర్, ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే విభాగంలో నామినేషన్‌ దక్కింది. దీంతో ఏడు విభాగాల్లో ఆస్కార్‌ నామినేషన్స్‌ దక్కించుకున్న తొలి వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. కెన్నెత్‌ ఇంతకుముందు డైరెక్టర్, యాక్టర్, సపోర్టింగ్‌ యాక్టర్, అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే, లైవ్‌ యాక్షన్, షార్ట్‌ ఫిలిం విభాగాల్లో ఆస్కార్‌ నామినేషన్స్‌ దక్కించుకున్నారు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
94వ ఆస్కార్‌ అవార్డ్స్‌కు నామినేట్‌ అయిన భారతీయ చిత్రం?
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు    : రైటింగ్‌ విత్‌ ఫైర్‌
ఎక్కడ    : బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీలో..

Andhra Pradesh: చేదోడు పథకం కింద ఎంత మొత్తాన్ని ఆర్థిక సాయంగా అందిస్తారు?

CM YS Jagan - Jagananna Chedodu Scheme

జగనన్న చేదోడు పథకం కింద రెండో విడతగా.. రాష్ట్రవ్యాప్తంగా 2,85,350 మంది నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీలకు రూ.285.35 కోట్ల ఆర్థ్ధిక సాయాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 8న తన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకం ద్వారా షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. 21 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న వారు చేదోడు పథకం కింద లబ్ధిపొందడానికి అర్హులు. వీరికి అందిచే ఆర్థిక సాయాన్ని వృత్తిపరమైన పనిముట్లు, పెట్టుబడి కోసం ఈ మొత్తాన్ని వారు ఉపయోగించుకోవచ్చు.

యూనికార్న్‌ సంస్థగా లివ్‌స్పేస్‌..
హోమ్‌ ఇంటీరియర్, రినొవేషన్‌ ప్లాట్‌ఫామ్‌ లివ్‌స్పేస్‌ యూనికార్న్‌గా ఆవిర్భవించింది. పీఈ దిగ్గజం కేకేఆర్‌సహా వివిధ సంస్థల నుంచి తాజాగా 18 కోట్ల డాలర్లు(సుమారు రూ. 1,350 కోట్లు) సమీకరించడం ద్వారా ఈ హోదాను అందుకుంది. బిలియన్‌ డాలర్ల(రూ. 7,500 కోట్లు) విలువలో నిధుల సమీకరణను చేపట్టినట్లు కంపెనీ వెల్లడించింది. బిలియన్‌ డాలర్ల విలువను అందుకున్న స్టార్టప్‌లోనూ యూనికార్న్‌గా వ్యవహరించే సంగతి తెలిసిందే.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
జగనన్న చేదోడు పథకం కింద రెండో విడతగా.. రూ.285.35 కోట్ల ఆర్థ్ధిక సాయం విడుదల
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి
ఎక్కడ    : సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు జిల్లా
ఎందుకు  : షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించేందుకు...

Telangana: రాష్ట్రంలోని ఏ జిల్లాలో పత్తి పరిశోధన కేంద్రం ఏర్పాటు కానుంది?

Cotton Crop

ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలు, వ్యవసాయ ప్రగతి, రైతులకు మరింత చేరువ కావడం, విధానాలను వారికి చేరవేయడం వంటి అంశాలపై అధికారులతో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 8న హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. పంటల వైవిధ్యీకరణతోపాటు వ్యవసాయ పరిశోధనాకేంద్రాలలో పరిశోధనలు జరగాలన్నారు. అంతర్జాతీయంగా తెలంగాణ పత్తికి డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో ఆదిలాబాద్‌లో పత్తి పరిశోధనా కేంద్రం తక్షణ ఏర్పాటుకు నిర్ణయించామన్నారు. వికారాబాద్‌ జిల్లాలోని తాండూరులో కంది విత్తన పరిశోధనాకేంద్రం ప్రత్యేకంగా అభివృద్ధి పరచాలని నిర్ణయించామని చెప్పారు.

హైదరాబాద్‌లో ‘బాష్‌’ సాఫ్ట్‌వేర్‌ సెంటర్‌..
హైదరాబాద్‌లో తమ సాఫ్ట్‌వేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు అంతర్జాతీయ దిగ్గజ సంస్థ, జర్మనీకి చెందిన ‘బాష్‌’ ప్రకటించింది. దీని ద్వారా హైదరాబాద్‌ కేంద్రంగా 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు కంపెనీ సీనియర్‌ ప్రతినిధులతో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు ఫిబ్రవరి 8న వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మొబిలిటీ, ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్, గృహోపకరణాల రంగంలో ప్రపంచంలోనే దిగ్గజ సంస్థగా ‘బాష్‌’కు పేరుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    
: పత్తి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయం
ఎప్పుడు  : ఫిబ్రవరి 8
ఎవరు    : తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి
ఎక్కడ    : ఆదిలాబాద్‌
ఎందుకు : పత్తి పంటపై పరిశోధనలు చేసేందుకు..

Eminent Scientist of the Year 2021: నెసా ఎమినెంట్‌ అవార్డుకు ఎంపికైన ప్రొఫెసర్‌?

Professor Dr. Lakawat Ramsingh

హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ లకావత్‌ రాంసింగ్‌కు ఢిల్లీకి చెందిన నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అకాడమీ (నెసా) అవార్డు దక్కింది. ఈ మేరకు ఎమినెంట్‌ సైంటిస్ట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డ్‌– 2021కు రాంసింగ్‌ను ఎంపిక చేసినట్టు నెసా అధ్యక్షుడు డాక్టర్‌ జావెద్‌ అహ్మద్‌ ఫిబ్రవరి 8న వెల్లడించారు. పాడి రైతుల కోసం తెలంగాణ  రాష్ట్రవ్యాప్తంగా సదస్సుల నిర్వహణ, గోపాల మిత్రలకు శిక్షణ కార్యక్రమాలు, వెటర్నరీ వైద్య కోర్సు ఫైనలియర్‌ విద్యార్థులకు అవగాహన కల్పించడం, బొవైన్‌ బ్రీడింగ్‌లో జాతీయ స్థాయి ప్రాజెక్టు పర్యవేక్షణ లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అవార్డుకు ఎంపిక చేశారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
నెసా ‘‘ఎమినెంట్‌ సైంటిస్ట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డ్‌– 2021’’కు ఎంపిక
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు    : హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ లకావత్‌ రాంసింగ్‌ 
ఎందుకు    : పాడి రైతుల కోసం విశేష కృషి చేసినందున..

US President - Germany Chancellor: నార్డ్‌ స్ట్రీమ్‌ 2 పైప్‌లైన్‌ను ఎందుకోసం ఏర్పాటు చేశారు?

Olaf Scholz - Joe Biden

ఉక్రెయిన్‌ను రష్యా ఆక్రమిస్తే రష్యా, జర్మనీ మధ్య గ్యాస్‌ సరఫరాకు ఉద్దేశించిన నార్డ్‌ స్ట్రీమ్‌ 2 పైప్‌లైన్‌ను అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు జోౖ బెడెన్‌ హెచ్చరించారు. జర్మనీ చాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌తో ఆయన ఫిబ్రవరి 7న అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్‌లో సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌ విషయంలో రష్యా మరొక్క అడుగు ముందుకేసినా నార్డ్‌ స్ట్రీమ్‌ 2 ఉండదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

అడ్డుకుంటే..
నార్డ్‌ స్ట్రీమ్‌ 2 పైప్‌లైన్‌ అడ్డుకుంటే రష్యా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది, కానీ అదే సమయంలో జర్మనీకి కూడా ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే ఈ పైప్‌లైన్‌ నిర్మాణం పూర్తయింది, కానీ ఇంకా కార్యకలాపాలు మొదలుపెట్టలేదు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ విషయం విషమించకుండా ఉండేందుకు జర్మనీ, ఫ్రాన్స్‌ యత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా జర్మనీ చాన్స్‌లర్‌ షుల్జ్‌ అమెరికా ప్రెసిడెంట్‌తో వాషింగ్టన్‌లో సమావేశమవగా, అదే సమయంలో రష్యా అధ్యక్షుడితో ఫ్రాన్స్‌ అధిపతి మాక్రాన్‌ మాస్కోలో ఐదుగంటల పాటు చర్చలు జరిపారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అమెరికా అధ్యక్షుడు జోౖ బెడెన్‌తో చర్చలు
ఎప్పుడు  : ఫిబ్రవరి 7
ఎవరు    : జర్మనీ చాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌
ఎక్కడ    : వాషింగ్టన్, అమెరికా
ఎందుకు : ప్రపంచ దేశాలను కలవరపరుస్తున్న ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలను చల్లార్చేందుకు.. \

Senior journalist: ఇండియా మార్ట్‌గేజ్డ్‌ పుస్తకాన్ని ఎవరు రచించారు?

Nimmakayala Sriranganath

సీనియర్‌ పాత్రికేయుడు నిమ్మకాయల శ్రీరంగనాథ్‌ (78) హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 8న తుదిశ్వాస విడిచారు. తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం మునిపల్లికి చెందిన శ్రీరంగనాథ్‌ పాత్రికేయ ప్రస్థానం నాలుగు దశాబ్దాల పాటు సాగింది. ఉదయం దిన పత్రిక స్టాఫ్‌ రిపోర్టర్‌గా, వార్త దిన పత్రిక ఢిల్లీ బ్యూరో చీఫ్‌గా, ఏపీ టైమ్స్‌ ఆంగ్ల పత్రిక బ్యూరో చీఫ్‌గా, ఆంధ్రప్రభ దినపత్రిక న్యూస్‌ నెట్‌ వర్క్‌ ఇన్‌ఛార్జిగా, సాక్షి దినపత్రిక కాలమిస్ట్‌గా పనిచేశారు. కమ్యూనిస్ట్‌ నేత తరిమెల నాగిరెడ్డి ఆంగ్లంలో రాసిన ‘‘ఇండియా మార్ట్‌గేజ్డ్‌’’ పుస్తకాన్ని తెలుగులో శ్రీరంగనాథ్‌ ‘‘తాకట్టులో భారతదేశం’’ పేరుతో అనువదించారు.

ఆర్‌బీఐ సమీక్షా సమావేశం ప్రారంభం
గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం ఫిబ్రవరి 8న ప్రారంభమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) చిట్టచివరి, ఆరవ ద్వైమాసిక సమావేశం ఇది. మూడు రోజుల పాటు ఈ సమావేశం జరుగుతుంది. 
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
సీనియర్‌ పాత్రికేయుడు కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు    : నిమ్మకాయల శ్రీరంగనాథ్‌ (78)
ఎక్కడ    : హైదరాబాద్‌
ఎందుకు  : అనారోగ్యం కారణంగా..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2022, ఫిబ్రవరి 08 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 09 Feb 2022 05:31PM

Photo Stories