Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, డిసెంబ‌ర్ 16 కరెంట్‌ అఫైర్స్‌

Blood Saunders-The Great Forest Heist book

CJI Justice NV Ramana: బ్లడ్‌ శాండర్స్‌: ద గ్రేట్‌ ఫారెస్ట్‌ హీస్ట్‌ పుస్తక రచయిత ఎవరు?

ప్రముఖ పాత్రికేయుడు ఉడుముల సుధాకర్‌రెడ్డి రచించిన ‘బ్లడ్‌ శాండర్స్‌: ద గ్రేట్‌ ఫారెస్ట్‌ హీస్ట్‌’ పుస్తకాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఆవిష్కరించారు. డిసెంబర్ 15న వర్చువల్ విధానం ద్వారా జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జస్టిస్‌ ఎన్‌వీ రమణ మాట్లాడుతూ... రచయిత, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పరిశోధన విభాగం సంపాదకుడు సుధాకర్‌రెడ్డి రచయిత, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పరిశోధన విభాగం సంపాదకుడు సుధాకర్‌రెడ్డి రెండు దశాబ్దాల సుదీర్ఘ పరిశోధన అనంతరం ఈ పుస్తకం తీసుకొచ్చారన్నారు. ఎర్రచందనం, శేషాచల అటవీ పర్యావరణ వ్యవస్థ రక్షణ, పరిరక్షణ నిమిత్తం రచయిత పుస్తకంలో మంచి సూచనలు చేశారని అభినందించారు. అత్యంత విలువైన కలప అయిన ఎర్ర చందనాన్ని ఎర్ర బంగారం అని కూడా అంటారు. ఎర్ర చందనం వృక్ష శాస్త్రీయ నామం టెరోకార్పస్ సంటాలినస్(Pterocarpus santalinus). ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప మరెక్కడా పెరగదు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
బ్లడ్‌ శాండర్స్‌: ద గ్రేట్‌ ఫారెస్ట్‌ హీస్ట్‌ పుస్తక రచయిత ఎవరు?
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు    : ప్రముఖ పాత్రికేయుడు ఉడుముల సుధాకర్‌రెడ్డి
ఎందుకు : ఎర్రచందనం, శేషాచల అటవీ పర్యావరణ వ్యవస్థ రక్షణ, పరిరక్షణ నిమిత్తం సూచనలు చేసేందుకు..

Ram Nath Kovind: ఏ దేశ స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు?

Kovind in Bangladesh

బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ డిసెంబర్ 15న ఢాకా చేరుకున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రత్యేక విమానంలో సతీసమేతంగా తొలిసారిగా వచ్చిన ఆయనకు బంగ్లాదేశ్‌ త్రివిధ దళాలు స్వాగతం పలికాయి. బంగ్లా  అధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ హమీద్ సతీసమేతంగా విమానాశ్రయానికి వచ్చి కోవింద్‌కు ఆహ్వానం పలికారు. 1971లో పాకిస్తాన్‌ నుంచి బంగ్లా విముక్తి పొందింది. బంగ్లా విముక్తి యుద్ధంలో అసువులు బాసిన వీరులకు కోవింద్‌ నివాళులర్పించారు. అనంతరం బంగబంధు, బంగ్లాదేశ్‌ జాతిపిత, దివంగత షేక్‌ ముజీబుర్‌ రెహ్మాన్‌ మ్యూజియంను సందర్శించారు. కరోనా విజృంభణ తర్వాత కోవింద్‌ విదేశీ పర్యటన చేయడం ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా  బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్ హసీనాతో రాష్ట్రపతి  కోవింద్ చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సహా పలు అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
మూడు రోజుల బంగ్లాదేశ్‌ పర్యటన ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు    : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 
ఎందుకు : బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు... 

Chopper Crash: శౌర్యచక్ర అవార్డీ గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్ కన్నుమూత

భారత వాయుసేన (ఐఏఎఫ్‌) గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ మృత్యువుతో పోరాటంలో ఓడిపోయారు. డిసెంబర్ 8న తమిళనాడు రాష్ట్రం, నీలగిరి జిల్లా, కూనూర్‌ అటవీ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన బెంగళూరులోని ఆర్మీ ఆస్పత్రిలో లైఫ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌పై చికిత్స పొందుతూ డిసెంబర్ 15న తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని భారత వాయుసేన వెల్లడించింది. 2020 ఏడాది జరిపిన సాహస ప్రదర్శనకు వరుణ్‌ 2021 ఏడాది ఆగస్టులో శౌర్యచక్ర పురస్కారం అందుకున్నారు.

సైనిక కుటుంబం..

  • ఐఏఎఫ్‌ గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ తండ్రి కేపీ సింగ్‌ ఏఏడీలో కల్నల్‌గా పనిచేసి రిటైరయ్యారు. వీరి స్వగ్రామం యూపీలోని ఘజియాపూర్‌ కాగా మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో ప్రస్తుతం నివసిస్తున్నారు. వరుణ్‌ సోదరుడు సైతం సైన్యంలోనే ఉన్నారు.   
  • గత ఆరునెలలుగా తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లా వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ స్టాఫ్‌ సర్వీసెస్‌ కాలేజీలో వరుణ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు తేజాస్‌ స్క్వాడ్రన్‌లో ఆయన విధులు నిర్వహించారు. 
  • ప్రస్తుతం పనిచేస్తున్న కాలేజీ తరఫున దేశ మొదటి చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్ బిపిన్‌ రావత్‌ను ఆహ్వానించేందుకు 2021, డిసెంబర్ 8న వరుణ్‌ సూలూర్‌ ఎయిర్‌బేస్‌(తమిళనాడు)కు వచ్చారు. అక్కడ బిపిన్‌కు స్వాగతం పలికి ఆయనతో కలిసి ఎంఐ– 17వీహెచ్‌ హెలికాప్టర్‌లో వెల్లింగ్టన్‌ బయలుదేరారు. మార్గమధ్యంలో హెలికాప్టర్‌ కుప్పకూలడంతో జనరల్ రావత్‌ దంపతులు సహా 13 మంది మరణించారు. వరుణ్‌ ఒక్కరే ఈ ప్రమాదంలో తీవ్రగాయాలతో బయటపడ్డారు. తొలుత ఆయనకు వెల్లింగ్టన్‌ మిలటరీ ఆస్పత్రిలో చికిత్సనందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని కమాండ్‌ ఆస్పత్రికి తరలించారు. డిసెంబర్ 17న ఆయన అంత్యక్రియలు భోపాల్‌లో నిర్వహించనున్నారు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
శౌర్యచక్ర అవార్డీ కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు    : భారత వాయుసేన (ఐఏఎఫ్‌) గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ 
ఎక్కడ    : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : డిసెంబర్ 8న తమిళనాడు రాష్ట్రం, నీలగిరి జిల్లా, కూనూర్‌ అటవీ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినందున..

Union Cabinet: పీఎంకేఎస్‌వై గడువును ఎప్పటిదాకా పొడిగించారు?

PMKSY

ప్రధాన్‌మంత్రి కృషి సించాయి యోజన(పీఎంకేఎస్‌వై) పథకాన్ని 2026దాకా పొడిగిస్తూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ డిసెంబర్ 15న నిర్ణయం తీసుకుంది. దీంతో రెండు జాతీయ ప్రాజెక్టులయిన హిమాచల్‌ ప్రదేశ్‌లోని రేణుకాజీ డ్యామ్‌ ప్రాజెక్ట్, ఉత్తరాఖండ్‌లోని లఖ్వర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్ట్‌లకు 90 శాతం నిధులు మంజూరు చేసేందుకు మార్గం సుగమమైంది. దీంతో 22 లక్షల మంది రైతుల సాగు నీటి కష్టాలు తీరనున్నాయి. దీంతోపాటే యమున నది బేసిన్‌లో నీటి నిల్వ సాధ్యమవుతుంది. యమునా ఎగువ బేసిన్‌లోని ఆరు రాష్ట్రాలకు లబ్ధిచేకూరనుంది. హిమాచల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌ సహా ఢిల్లీకి నీటి సరఫరా బాగా మెరుగుపడుతుంది. యమునా నది పునరుజ్జీవనానికి ఇది ముందడుగు అని కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. 

ఎన్నికల సంస్కరణలకు ఆమోదం...
దేశ ఎన్నికల ప్రక్రియలో కీలక సంస్కరణలకు ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. బోగస్‌ ఓట్లను తొలగించడం కోసం ఓటర్‌ ఐడీని ఆధార్‌ కార్డుతో స్వచ్ఛందంగా లింకు చేయడం, ఏడాదికి నాలుగుమార్లు కొత్త ఓటర్లకు ఓటు నమోదు అవకాశం ఇవ్వడంతో పాటు సర్వీసు ఓటర్లకు సంబంధించిన సంస్కరణలు ఈ బిల్లులో ఉన్నాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రధాన్‌మంత్రి కృషి సించాయి యోజన(పీఎంకేఎస్‌వై)ను 2026దాకా పొడిగిస్తూ  నిర్ణయం 
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు    : కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ 
ఎందుకు : నీటి సరఫరా ప్రాజెక్ట్‌లకు నిధులు మంజూరు చేసేందుకు..

Formula One: నైట్‌హుడ్‌ పురస్కారం పొందిన రేసింగ్‌ డ్రైవర్‌?

Lewis Hamilton-Knighthood

ఫార్ములావన్‌ (ఎఫ్‌1) రేసింగ్‌ చరిత్రలో అత్యధికంగా 103 విజయాలు సాధించిన  బ్రిటన్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ బ్రిటన్‌ ప్రభుత్వం నైట్‌హుడ్‌ పురస్కారంతో గౌరవించింది. డిసెంబర్ 15న విండ్సర్ లోని విండ్సర్ కాజిల్ లో జరిగిన కార్యక్రమంలో ప్రిన్స్‌ చార్లెస్‌ చేతుల మీదుగా హామిల్టన్‌ ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. ఎఫ్‌1 రేసింగ్‌లో ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన లూయిస్‌ హామిల్టన్‌ను ఇక నుంచి ‘సర్‌’ లూయిస్‌ హామిల్టన్‌గా పిలవనున్నారు. 2007 నుంచి ఎఫ్‌1లో ఉన్న హామిల్టన్‌ ఇప్పటివరకు 288 రేసుల్లో పాల్గొన్నాడు.

ఐఎఫ్‌ఏ షీల్డ్‌ విజేత?
భారత్‌లో రెండో అతి పురాతనమైన ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ ఐఎఫ్‌ఏ షీల్డ్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎస్‌డీఎఫ్‌సీ) జట్టు రన్నరప్‌గా నిలిచింది. డిసెంబర్ 15న కోల్‌కతాలో జరిగిన ఫైనల్లో ఈ టోర్నీలో తొలిసారి పాల్గొన్న శ్రీనిధి డెక్కన్‌ జట్టు 1–2 గోల్స్‌తో డిఫెండింగ్‌ చాంపియన్‌ రియల్‌ కశ్మీర్‌ ఎఫ్‌సీ జట్టు చేతిలో ఓడింది. శ్రీనిధి డెక్కన్‌ క్లబ్‌ గోల్‌కీపర్‌ సీకే ఉబైద్‌కు టోర్నీ ‘ఉత్తమ గోల్‌కీపర్‌’ పురస్కారం లభించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
బ్రిటన్‌ ప్రభుత్వం నుంచి నైట్‌హుడ్‌ పురస్కారం పొందిన రేసింగ్‌ డ్రైవర్‌?
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు    : బ్రిటన్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌
ఎక్కడ    : విండ్సర్ కాజిల్, విండ్సర్
ఎందుకు : ఫార్ములావన్‌ (ఎఫ్‌1) రేసింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను..

Cricket: మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2022కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?

ICC Women's World Cup 2022

2022,  మార్చిలో న్యూజిలాండ్‌ వేదికగా జరిగే మహిళల వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ డిసెంబర్ 15న విడుదలైంది. ఈ షేడ్యూల్ ప్రకారం... 2017 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టు మార్చి 6న జరిగే తమ తొలి పోరులో పాకిస్తాన్‌తో తలపడుతుంది. మార్చి 4న న్యూజిలాండ్, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభ మవుతుంది. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనే ప్రపంచకప్‌ను ఆరు వేదికల్లో నిర్వహిస్తుండగా ... ప్రతీ జట్టు మిగిలిన ఏడు టీమ్‌లతో లీగ్‌ దశలో తలపడాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో టాప్‌–4లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. ఏప్రిల్‌ 3న క్రైస్ట్‌చర్చ్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది.

మహిళా క్రికెటర్లతో ‘హ్యుందాయ్‌’ ఒప్పందం... 
ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ ‘హ్యుందాయ్‌ మోటార్స్‌’ నలుగురు భారత మహిళా క్రికెటర్లతో జత కట్టింది. ఏడాది కాలానికి బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరించేందుకు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, తానియా భాటియాలతో హ్యుందాయ్‌ ఒప్పందం చేసుకుంది.

Semiconductors: కేబినెట్‌ ఆమోదం తెలిపిన డీఎల్‌ఐ పథక ఉద్దేశం?

Semiconductor

సెమీకండక్టర్ల తయారీ (చిప్‌లు), డిస్‌ప్లే తయారీ ఎకోసిస్టమ్‌కు రూ.76,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన డిజైన్‌ అనుసంధాన ప్రోత్సాహక పథకానికి (డీఎల్‌ఐ) డిసెంబర్ 15న కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తద్వారా స్వీయ సమృద్ధి సాధించడమే కాకుండా, చైనా మార్కెట్‌పై ఆధారపడడం తగ్గుతుందని కేంద్ర సర్కారు భావిస్తోంది. సెమీ కండక్టర్లు, డిస్‌ప్లే తయారీ, డిజైన్‌ కంపెనీలకు అంతర్జాతీయంగా ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను ఈ పథకం కింద అందించడం వల్ల.. ఎలక్ట్రానిక్స్‌ తయారీలో కొత్త శకానికి దారితీస్తుందని కేంద్రం పేర్కొంది.

పథకం: లక్ష్యాలు, ముఖ్యాంశాలు

  • మూలధన, సాంకేతిక సహకారాన్ని డీఎల్‌ఐ పథకం కింద కంపెనీలు పొందొచ్చు. అర్హులైన దరఖాస్తులకు ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం నిధుల సహకారాన్ని ప్రభుత్వం అందించనుంది. అలాగే, ఐదేళ్లపాటు విక్రయాలపై 6–4 శాతం మేర ప్రోత్సాహకాలను ఇవ్వనుంది. 
  • ప్రాజెక్టులకు అవసరమైన మౌలిక సదుపాయాల (భూమి, నీరు, విద్యుత్తు, రవాణా, పరిశోధన సదుపాయాలు) ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి కేంద్రం పనిచేయనుంది. 
  • కనీసం రెండు గ్రీన్‌ఫీల్డ్‌ సెమీ కండక్టర్‌ ఫ్యాబ్‌లు, రెండు డిస్‌ప్లే ఫ్యాబ్‌లను ఏర్పాటు చేయాలన్నది కేంద్రం లక్ష్యం.
  • ఈ ప్రతిపాదిత పథకం కింద కనీసం 15 కాంపౌండ్‌ సెమీకండక్టర్లు, సెమీకండక్టర్ల ప్యాకేజింగ్‌ యూనిట్లు ఏర్పాటవుతాయని ప్రభుత్వ అంచనా.
  • దేశీయంగా 100 వరకు సెమీకండక్టర్‌ డిజైన్‌ ఫర్‌ ఇంటెగ్రేటెడ్‌ సర్క్యూట్స్, చిప్‌సెట్లు, సిస్టమ్‌ ఆన్‌ చిప్స్, సెమీకండక్టర్‌ డిజైన్‌ కంపెనీలకు మద్దతు లభించనుంది. వచ్చే ఐదేళ్లలో రూ.1,500 కోట్ల టర్నోవర్‌ సాధించిన కంపెనీలకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. 
  • ఈ పరిశ్రమ దీర్ఘకాల వృద్ధికి వీలుగా అంతర్జాతీయ నిపుణులతో సెమీకండక్టర్‌ మిషన్‌ను కూడా ఏర్పాటు చేయనుంది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :  
డిజైన్‌ అనుసంధాన ప్రోత్సాహక పథకానికి (డీఎల్‌ఐ) ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు    : కేంద్ర కేబినెట్‌
ఎందుకు : సెమీ కండక్టర్ల తయారీ (చిప్‌లు), డిస్‌ప్లే తయారీ ఎకోసిస్టమ్‌కు రూ.76,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు..

Intangible Heritage: యునెస్కో జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ పండుగ?

Durga Puja - UNESCO

ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ(యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌–UNESCO) కోల్‌కతా దుర్గా పూజను మావనజాతి ‘వర్ణనాతీత సాంస్కృతిక వారసత్వ’ జాబితాలో చేర్చింది. ఈ విషయాన్ని డిసెంబర్ 15న యునెస్కో తెలిపింది.  తాజాగా ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన వర్ణనాతీత సాంస్కృతిక వారసత్వ (ఇంటాంజిబుల్‌ కల్చరల్‌ హెరిటేజ్‌- ఐసీహెచ్‌) కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఆసియాలో ఓ పండగకు ఇలాంటి గుర్తింపు రావడం ఇదే ప్రథమం. పశ్చిమ బెంగాల్‌లో కోల్‌కతా దుర్గా పూజకు ఎంతో ప్రాధాన్యత ఉంది. 

డిజిటల్‌ చెల్లింపులకు మరింత మద్దతు 
దేశంలో డిజిటల్‌ చెల్లింపుల లావాదేవీలు ఇప్పటికే గరిష్టాలకు చేరుకోగా.. వీటిని మరింత ప్రోత్సహించాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు యూపీఐ, రూపే డెబిట్‌ కార్టులతో చేసే చెల్లింపులను ప్రోత్సహించేందుకు రూ.1,300 కోట్ల పథకానికి డిసెంబర్ 15న కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలియజేసింది. వ్యక్తులు వర్తకులకు చేసే డిజిటల్‌ చెల్లింపులకు అయ్యే వ్యయాలను ప్రభుత్వం రీయింబర్స్‌ చేస్తుందని పేర్కొంది. వచ్చే ఏడాది కాలంలో ప్రభత్వం రూ.1,300 కోట్లను ఖర్చు చేయడం వల్ల మరింత మంది డిజిటల్‌ చెల్లింపులకు ముందుకు వస్తారని ప్రభుత్వం భావిస్తోంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
మావనజాతి ‘వర్ణనాతీత సాంస్కృతిక వారసత్వ’ జాబితాలోకి కోల్‌కతా దుర్గా పూజ 
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు    : ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ(యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌–UNESCO)
ఎందుకు : కోల్‌కతా దుర్గా పూజకు ఎంతో ప్రాధాన్యత ఉన్నందున..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, డిసెంబ‌ర్ 15 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 16 Dec 2021 09:04PM

Photo Stories