Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 4 కరెంట్‌ అఫైర్స్‌

Jal Jeevan Mission-Modi

Jal Jeevan Mission App: ప్రధాని మోదీ ప్రారంభించిన రాష్ట్రీయ జల్‌ జీవన్‌ కోష్‌ ఉద్దేశం?

జలజీవన్‌ మిషన్‌లో భాగమైన పథకాల్లో జవాబుదారీతనం, పారదర్శకత ప్రోత్సహించడానికి అక్టోబర్‌ 2న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ‘జల జీవన్‌ మిషన్‌’ యాప్‌ను ప్రారంభించారు. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని ఆవాసాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆశ్రమశాలలతోపాటు సార్వజనిక సంస్థలకు నీటి కనెక్షన్లు అందించడానికి ‘రాష్ట్రీయ జల్‌ జీవన్‌ కోష్‌’ నిధిని కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ నిధికి వ్యక్తులు, సంస్థలు, విదేశాల్లో ఉంటున్న వారు ఎవరైనా చందాలు ఇవ్వొచ్చు.

వీడబ్ల్యూఎస్సీ సభ్యులతో సమావేశం...
ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, తమిళనాడు, మణిపూర్‌ రాష్ట్రాలకు చెందిన గ్రామ పంచాయతీలు, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య కమిటీల(వీడబ్ల్యూఎస్సీ) సభ్యులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమై జల జీవన్‌ మిషన్‌ అమలు తీరుపై చర్చించారు. జల జీవన్‌ మిషన్‌ ద్వారా ఈ రెండేళ్లలో 5 కోట్ల ఇళ్లకు నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు మోదీ తెలిపారు. గృహాలకు నీటి సరఫరా విషయంలో గత 7 దశాబ్దాల్లో సాధించిన దానికంటే కేవలం ఈ రెండేళ్లలో సాధించిందే అధికమన్నారు.

2019, ఆగస్టులో ప్రకటన...
2019, ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ‘జల్‌ జీవన్‌ మిషన్‌’ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రాల భాగస్వామ్యంతో ప్రతి ఇంటికీ కొలాయి నీటి సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఈ క్రమంలో మిషన్‌ అమలుకు కేంద్రం రూ.3.60 లక్షల కోట్లు కేటాయించింది. దీంతోపాటు 15వ ఆర్థిక సంఘం కింద మరో రూ.1.42 లక్షల కోట్లు సమకూర్చుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా దాదాపు 3.5 లక్షల గ్రామాల్లో వీడబ్ల్యూఎస్‌సీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి ఇంటికి కుళాయి సౌకర్యం అందేలా కృషి చేయడం వీటి బాధ్యత.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : జల జీవన్‌ మిషన్‌ యాప్, రాష్ట్రీయ జల్‌ జీవన్‌ కోష్‌ ప్రారంభం
ఎప్పుడు  : అక్టోబర్‌ 2
ఎవరు    : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ    : ఢిల్లీ
ఎందుకు : జలజీవన్‌ మిషన్‌లో భాగమైన పథకాల్లో జవాబుదారీతనం, పారదర్శకత ప్రోత్సహించడానికి మరియు గ్రామీణ ప్రాంతాల్లోని ఆవాసాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆశ్రమశాలలతోపాటు సార్వజనిక సంస్థలకు నీటి కనెక్షన్లు అందించడానికి... 

FIDE Chess Championship: మహిళల టీమ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి రజతం

India Chess Team

ఫిడె ప్రపంచ మహిళల టీమ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు రజత పతకం లభించింది. 2007లో ఈ మెగా ఈవెంట్‌ మొదలయ్యాక భారత్‌కు లభించిన తొలి పతకం ఇదే. గోర్యాక్‌ చినా, కొస్టెనిక్, కాటరీనా లాగ్నో (గ్రాండ్‌ మాస్టర్లు), షువలోవా, కషిలిన్‌స్కాయాలతో కూడిన రష్యా జట్టుతో స్పెయిన్‌లోని సిట్‌గెస్‌ పట్టణంలో అక్టోబర్‌ 2న జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా, భక్తి కులకర్ణి, మేరీ ఆన్‌గోమ్స్‌లతో కూడిన భారత జట్టు 0–2తో ఓడిపోయింది. ఫలితంగా రజత పతకం దక్కింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఫిడె ప్రపంచ మహిళల టీమ్‌ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి రజతం
ఎప్పుడు   : అక్టోబర్‌ 2
ఎవరు    : ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా, భక్తి కులకర్ణి, మేరీ ఆన్‌గోమ్స్‌
ఎక్కడ    : సిట్‌గెస్, స్పెయిన్‌
ఎందుకు  : ఫైనల్లో భారత జట్టు రష్యా జట్టు చేతిలో ఓడిపోయినందున...


Eastern Ladakh: కె–9 వజ్ర శతఘ్నులను తయారు చేస్తోన్న సంస్థ?

K9 Vajra copy

చైనా కవ్వింపు చర్యలతో భారత్‌ అప్రమత్తమైంది. వాస్తవాధీన రేఖ వెంబడి డ్రాగన్‌ దేశం భారీగా సైన్యాన్ని ఆయుధ సంపత్తిని మోహరిస్తుండగా దీటుగా ప్రతిచర్యలు ప్రారంభించింది. లద్దాఖ్‌ సెక్టార్‌లోని ఫార్వర్డ్‌ ప్రాంతాల్లో మొట్టమొదటి కె–9 వజ్ర శతఘ్నులతో కూడిన బలగాలను తరలించింది. ఈ విషయాలను అక్టోబర్‌ 2న సైనిక దళ ప్రధానాధికారి (చీఫ్స్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌) జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవాణే తెలిపారు.

కె–9 వజ్ర విశేషాలు...

  • కె–9 వజ్ర సెల్ఫ్‌ ప్రొపెల్డ్‌ శతఘ్నులకు 50 కిలోమీటర్ల దూరంలోని శత్రు లక్ష్యాలను ఛేదించే శక్తి ఉంది.
  • పర్వతప్రాంతాల్లోనూ కె–9 వజ్ర హొవిట్జర్లు విజయవంతంగా పనిచేస్తున్నట్లు ప్రయోగ పరీక్షల్లో రుజువైంది.
  • దక్షిణకొరియా తయారీ కె–9 థండర్‌కు దేశీయంగా అభివృద్ధి చేసిన రూపమే కె–9 వజ్ర.
  • ఈ శతఘ్నులను ముంబైకి చెందిన లార్సెన్‌ అండ్‌ టూబ్రో సంస్థ దక్షిణకొరియా సంస్థ భాగస్వామ్యంతో ఉత్పత్తి చేస్తోంది.

3,488 కిలోమీటర్ల మేర...
భారత్‌–చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి 3,488 కిలోమీటర్ల మేర వివాదం నడుస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్‌ కూడా తనదేననీ, అది దక్షిణ టిబెట్‌లోని భాగమేనని చైనా వాదిస్తుండగా భారత్‌ ఖండిస్తోంది. 2020 ఏడాది పాంగాంగో సరస్సు ప్రాంతంలో జరిగిన తీవ్ర ఘర్షణల అనంతరం సరిహద్దుల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. రెండు వైపులా వేలాదిగా బలగాలను సరిహద్దుల్లోకి తరలించాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : లద్దాఖ్‌ సెక్టార్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి కె–9 వజ్ర శతఘ్నులతో కూడిన బలగాల తరలింపు
ఎప్పుడు  : అక్టోబర్‌ 2
ఎవరు    : భారత సైన్యం
ఎందుకు : వాస్తవాధీన రేఖ వెంబడి డ్రాగన్‌ దేశం చైనా భారీగా సైన్యాన్ని ఆయుధ సంపత్తిని మోహరిస్తుండటంతో...


Gandhi Jayanti: అతిపెద్ద చేనేత జాతీయ జెండాను ఎక్కడ ఆవిష్కరించారు?

National Flag

225 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు, వెయ్యి కిలోల భారీ చేనేత మువ్వన్నెల పతాకాన్ని అక్టోబర్‌ 2న లద్దాఖ్‌లోని లెహ్‌లో భారత సైన్యం ఆవిష్కరించింది. గాంధీ జయంతి, ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లను పురస్కరించుకుని లెహ్‌ గారిసన్‌లో దీనిని ఒక పర్వతంపై ఆవిష్కరించారు. ముంబైలోని ఖాదీ గ్రామోద్యోగ్‌ చేనేత విభాగం దీనిని తయారు చేసింది. ఇప్పటి వరకు దేశంలో తయారైన అతిపెద్ద చేనేత జాతీయ జెండా ఇదే.

అహింసా దినోత్సవం
భారత జాతిపిత మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్‌ 2ను అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటిస్తారు. 2007 నుంచి ప్రతి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు. గాంధీజీ ఇచ్చిన శాంతి సందేశాన్ని ప్రపంచ సమాజం అందిపుచ్చుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ పిలుపునిచ్చారు. ఆయన పాటించిన అహింసా, శాంతియుత నిరసనలు, గౌరవం, సమానత్వం అనేవి మాటలకు అతీతమైనవని అక్టోబర్‌ 2న ఒక సందేశం విడుదల చేశారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : దేశంలో తయారైన అతిపెద్ద చేనేత జాతీయ జెండా ఆవిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్‌ 2
ఎవరు    : భారతీయ సైన్యం
ఎక్కడ    : లెహ్, లద్దాఖ్‌
ఎందుకు  : గాంధీ జయంతి, ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లను పురస్కరించుకుని...


Venkaiah Naidu: వారసత్వ సాంస్కృతిక కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి ఏ నది ఒడ్డున ప్రారంభించారు?

Venkaiah Naidu at Brahmaputra River

అస్సాంలోని గువాహటిలో బహ్మ్రపుత్ర నది ఒడ్డున వారసత్వ సాంస్కృతిక కేంద్రం ప్రారంభమైంది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అక్టోబర్‌ అక్టోబర్‌ 3న ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం నగరంలోని ప్రదర్శనశాలను సందర్శించిన వెంకయ్య ‘ఫరెవర్‌ గువాహటి’ సచిత్ర పుస్తకాన్ని (కాఫీ టేబుల్‌ బుక్‌) విడుదల చేశారు. అస్సాం రాష్ట్ర కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పీఈటీ–ఎంఆర్‌ఐ యంత్రాన్ని ప్రారంభించారు. అస్సాం ప్రభుత్వం, టాటా ట్రస్టుల భాగస్వామ్యంలో అమలు చేయాలని ప్రతిపాదించిన డిస్టిబ్యూటెడ్‌ కేన్సర్‌ కేర్‌ మోడల్‌ను ఆయన అభినందించారు. నదుల ప్రాధాన్యం ముందు తరాలు తెలుసుకోవాలంటే జలసంరక్షణను పాఠ్యాంశంగా చేర్చాలని సూచించారు.

లీగల్‌ అవేర్‌నెస్, అవుట్‌రీచ్‌ క్యాంపెయిన్‌ ప్రారంభం
జాతిపిత మహాత్మ గాంధీ జయంతిని పురస్కరించుకొని నల్సా(జాతీయ న్యాయసేవల అథారిటీ) ఆధ్వర్యంలో ఆరువారాలు సాగే ‘పాన్‌ ఇండియా లీగల్‌ అవేర్‌నెస్, అవుట్‌రీచ్‌ క్యాంపెయిన్‌’ను రాష్ట్రపతి రామ్‌నా«థ్‌ కోవింద్‌ అక్టోబర్‌ 2న ఢిల్లీలో ప్రారంభించారు. కార్యక్రమంలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ పాల్గొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : వారసత్వ సాంస్కృతిక కేంద్రం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్‌ 3
ఎవరు    : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ    : బహ్మ్రపుత్ర నది ఒడ్డున, గువాహటి, అస్సాం


ICIJ: పండోరా పేపర్స్‌ను ఎవరు బహిర్గతం చేశారు?

Pandora Papers

ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది సంపన్నులు, ప్రముఖులు, రాజకీయ నేతల రహస్య ఆస్తులు, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలను ‘పండోరా పేపర్స్‌’ పేరిట ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌(ఐసీఐజే) అక్టోబర్‌ 3న బహిర్గతం చేసింది. వీరిలో భారత్‌కి చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు. దనవంతుల కంపెనీలు, ట్రస్టులకు సంబంధించిన 12 మిలియన్ల (1.20 కోట్లు) పత్రాలను తాము సేకరించినట్లు ఐసీఐజే వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 117 దేశాల్లో 600 మందికిపైగా పాత్రికేయులు ఎంతో శ్రమించి పరిశోధన సాగించి ఈ ‘పండోరా పత్రాలను’ సేకరించారని వివరించింది. ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద లీక్‌ అని భావిస్తున్నారు.

డొల్ల కంపెనీల సృష్టి...
పన్నుల బెడద లేని పనామా, దుబాయ్, మొనాకో, కేమన్‌ ఐలాండ్స్‌ తదితర దేశాల్లో వారు నల్ల ధనాన్ని దాచుకోవడానికి, రహస్యంగా ఆస్తులు పోగేసుకోవడానికి డొల్ల కంపెనీలను సృష్టించారని ఐసీఐజే తెలిపింది. వీరిలో అమెరికా, ఇండియా, పాకిస్తాన్, యూకే, మెక్సికో తదితర దేశాలకు చెందినవారు ఉన్నారని పేర్కొంది.

పండోరా పేపర్స్‌లోని ముఖ్యాంశాలు

  • జోర్డాన్‌ రాజు, ఉక్రెయిన్, కెన్యా, ఈక్వెడార్‌ దేశాల అధ్యక్షులు, చెక్‌ రిపబ్లిక్‌ ప్రధాని, యూకే మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్‌ ఆస్తులు, ఆర్థిక వ్యవహారాల వివరాలు వెల్లడి.
  • 300 మందికిపైగా భారతీయుల వివరాల వెల్లడి. వీరిలో చాలామంది ఆర్థిక నేరగాళ్లు, మాజీ ఎంపీలే. వీరు ఇప్పటికే దర్యాప్తు సంస్థల నిఘా పరిధిలో ఉన్నారు.
  • ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీకి 18 దేశాల్లో ఆస్తులు ఉన్నాయి.
  • బయోకాన్‌ సంస్థ ప్రమోటర్‌ కిరణ్‌ మజుందార్‌ షా భర్త ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కోసం ఓ ట్రస్టును ఏర్పాటు చేశాడు. 
  • భారత్‌లో బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ సోదరి ట్రస్టును ఏర్పాటు చేసింది. అతడు పారిపోవడానికి నెల రోజుల ముందు ఈ ట్రస్టును నెలకొల్పారు. 
  • 2016లో వెలుగులోకి వచ్చిన పనామా పేపర్ల లీకు తర్వాత నల్ల ధనవంతులు అప్రమత్తమయ్యారు. విదేశాల్లోని తమ ఆస్తులపై నిఘా సంస్థల కన్ను పడకుండా పునర్వ్యస్థీకరించుకున్నారు. వీరిలో మాజీ క్రికెటర్, భారతరత్న సచిన్‌ టెండూల్కర్‌ కూడా ఉన్నాడు. 
  • జోర్డాన్‌ రాజు అబ్దుల్లా2 అమెరికా, యూకేలో 10 కోట్ల డాలర్ల ఆస్తులను కూడబెట్టాడు. 
  • పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులకు, ఆయన కేబినెట్‌ మంత్రులకు కోట్ల డాలర్ల విలువైన కంపెనీలు, ట్రస్టులు ఉన్నాయి. 
  • ఇమ్రాన్‌ ఖాన్‌ మిత్రుడు, పీఎంల్‌–క్యూ పార్టీ నేత చౌదరి మూనిస్‌ ఎలాహీకి అవినీతి వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉంది. 
  • రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు మొనాకోలో ఖరీదైన ఆస్తులున్నాయి. 
  • యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిన్, ఆయన భార్య లండన్‌లో కార్యాలయం కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో 3,12,000 పౌండ్ల మేర స్టాంప్‌ డ్యూటీ ఎగ్గొట్టారు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : పండోరా పేపర్స్‌ బహిర్గతం
ఎప్పుడు  : అక్టోబర్‌ 3
ఎవరు    : ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌(ఐసీఐజే)
ఎందుకు  : ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది సంపన్నులు, ప్రముఖులు, రాజకీయ నేతల రహస్య ఆస్తులు, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలను వెల్లడి చేసేందుకు...


 Nobel Prize 2021: వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ పురస్కారం

2021 Medicine Nobel Prize

వైద్యశాస్త్రంలో 2021 సంవత్సరానికి గాను ఇద్దరు అమెరికన్‌ పరిశోధకులకు నోబెల్‌ బహుమతి లభించింది. శరీరం ఎందుకు వేడెక్కెతుంది.. స్పర్శలో తేడాలపై పరిశోధనకుగాను డాక్టర్‌ డేవిడ్‌ జూలియస్, డా. ఆర్డెమ్‌ పాటపౌటియన్‌ అక్టోబర్‌ 4న ఉమ్మడిగా నోబెల్‌ బహుమతి ప్రకటించారు. వీరి పరిశోధనల వల్ల మన నాడీ వ్యవస్థ వేడి, జలుబు, యాంత్రిక ఉద్దీపనలను ఎలా గ్రహిస్తుందనే దానిపై అవగాహన మరింత బాగా పెరుగుతుందని నోబెల్‌ జ్యూరీ వెల్లడించింది.

డేవిడ్‌ జూలియస్‌...
కాలిఫోర్నియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డేవిడ్‌ జూలియస్‌... వేడిని ప్రతిస్పందించే చర్మం నరాల చివరలలో సెన్సార్‌ను గుర్తించడానికిగాను మితిమీరిన ఘాటు ఉండే మిరపకాయల నుంచి కాప్‌సైసిన్‌ అనే పదార్ధాన్ని ఉపయోగించారు.

ఆర్డెమ్‌ పాటపౌటియన్‌...
కాలిఫోర్నియాలోని స్క్రిస్స్‌ రీసెర్చ్‌లో కేంద్రంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఆర్డెమ్‌ లెబనాన్‌లోని బీరూట్‌లో జన్మించారు. అమెరికాలో స్థిరపడ్డారు. చర్మం మరియు అంతర్గత అవయవాలలో యాంత్రిక ఉద్దీపనలకు ప్రతిస్పందించే నోవల్‌ క్లాస్‌ సెన్సార్‌లను కనుగొనడానికి ఒత్తిడి–సున్నితమైన కణాలను ఆయన ఉపయోగించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : వైద్యశాస్త నోబెల్‌–2021 పురస్కార విజేతలు 
ఎప్పుడు  : అక్టోబర్‌ 4
ఎవరు    : డాక్టర్‌ డేవిడ్‌ జూలియస్, డా. ఆర్డెమ్‌ పాటపౌటియన్‌
ఎందుకు : శరీరం ఎందుకు వేడెక్కెతుంది.. స్పర్శలో తేడాలపై పరిశోధనకుగాను...


Four Gold Medals: భారత క్రీడాకారిణి మనూ భాకర్‌ ఏ క్రీడలో ప్రసిద్ధురాలు?

Manu Bhaker

పెరూ రాజధాని నగరం లిమాలో జరుగుతున్న ప్రపంచ జూనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ అద్భుత ప్రదర్శన చేస్తోంది. అక్టోబర్‌ 3న జరిగిన  ఆరు ఈవెంట్స్‌లో నాలుగు స్వర్ణ పతకాలు, రెండు రజత పతకాలు గెలిచి పతకాల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మహిళల 10మీ ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్, మిక్స్‌డ్‌ 10మీ ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లలో భారత్‌కు రజతాలు దక్కాయి.

నాలుగు స్వర్ణ పతకాలు...
పురుషుల టీమ్‌ ఈవెంట్‌: 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ పురుషుల టీమ్‌ ఫైనల్లో తెలంగాణ షూటర్‌ ధనుశ్‌ శ్రీకాంత్, రాజ్‌ప్రీత్‌ సింగ్, పార్థ్‌ మఖీజాలతో కూడిన భారత జట్టు 16–6తో అమెరికా జట్టును ఓడించి స్వర్ణం సాధించింది.

ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌: 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఫైనల్లో మనూ భాకర్‌–సరబ్‌జిత్‌ సింగ్‌ (భారత్‌) ద్వయం 16–12తో శిఖా–నవీన్‌ (భారత్‌) జోడీ పై గెలిచింది.

ఎయిర్‌ పిస్టల్‌ మహిళల టీమ్‌ ఈవెంట్‌: 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మహిళల టీమ్‌ ఫైనల్లో మనూ భాకర్, రిథమ్, శిఖా నర్వాల్‌లతో కూడిన భారత జట్టు 16–12తో బెలారస్‌ జట్టును ఓడించింది.

పురుషుల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌: పురుషుల ఎయిర్‌ పిస్టల్‌లో నవీన్, శరబ్, శివలతో కూడిన భారత జట్టు 6–14తో బెలారస్‌ త్రయాన్ని ఓడించి స్వర్ణాన్ని గెలుచుకుంది.

 

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 2 కరెంట్‌ అఫైర్స్‌

 

ఇప్పుడే చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌


డౌన్‌లోడ్‌ వయా ఆపిల్‌ ఐ స్టోర్‌

Published date : 04 Oct 2021 07:36PM

Photo Stories