Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 2 కరెంట్‌ అఫైర్స్‌

PM Modi

Swachh Bharat, AMRUT: అర్బన్‌ 2.0, అమృత్‌ 2.0 పథకాలు ప్రారంభం

స్వచ్ఛభారత్‌ మిషన్‌–అర్బన్, అటల్‌ మిషన్‌ ఫర్‌ రెజువెనేషన్‌ అండ్‌ అర్బన్‌ ట్రాన్సఫర్మేషన్‌ (అమృత్‌) పథకాల రెండో దశకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అక్టోబర్‌ 1న ఢిల్లీలోని అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో స్వచ్ఛభారత్‌ మిషన్‌–అర్బన్‌ 2.0, అమృత్‌ 2.0ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి, ప్రసంగించారు. దేశంలోని నగరాలను చెత్త రహితమైన నగరాలుగా, సురక్షితమైన తాగునీరు లభించే నగరాలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధన కోసం కేంద్రం ఈ రెండు పథకాలకు రూపకల్పన చేసింది. దేశంలో పట్టణీకరణ విసురుతున్న సవాళ్లను ప్రభావవంతమైన రీతిలో ఎదుర్కోవడంతోపాటు 2030 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ఈ రెండు కార్యక్రమాలు దోహదపడతాయని కేంద్రం భావిస్తోంది.

అర్బన్‌ 2.0..
అన్ని నగరాలను ‘చెత్త రహితం’గా మార్చడమే అర్బన్‌ 2.0 లక్ష్యం. ఇందులో భాగంగా ఆయా నగరాల్లో మురుగు నీటి నిర్వహణకు చర్యలు చేపడతారు. బహిరంగ మల విసర్జన రహిత నగరాలుగా తీర్చిదిద్దుతారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌–అర్బన్‌ 2.0కు దాదాపు రూ.1.41 లక్షల కోట్లు నిధులు ఖర్చవుతాయని అంచనా.

అమృత్‌ 2.0..
దాదాపు 2.68 కోట్ల కుళాయి కనెక్షన్లను ఇవ్వడం ద్వారా 4,700 పట్టణ స్థానిక సంస్థల్లోని అన్ని కుటుంబాలకు 100 శాతం మంచినీరు అందించేందుకు అమృత్‌ 2.0ను రూపొందించారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో 10.5 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. ఉపరితల, భూగర్భ జలాల పరిరక్షణ, పునరుజ్జీవనాన్ని అమృత్‌ 2.0 ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమ వ్యయం రూ.2.87 లక్షల కోట్లు అని కేంద్రం ప్రకటించింది.

ప్రధాని ప్రసంగం – ముఖ్యాంశాలు

  • –2014లో స్వచ్ఛభారత్‌ని బహిరంగ మల విసర్జనకి వ్యతిరేకంగా చేపట్టి, 10 కోట్లకు పైగా టాయిలెట్లు నిర్మించాం. ఈ సారి పట్టణాల్లో చెత్త నుంచి ప్రజల్ని విముక్తి చేయడమే లక్ష్యం.
  • దేశంలో ప్రతీ రోజూ లక్ష టన్నుల చెత్త వస్తోంది. పట్టణాల్లో ఎక్కడికక్కడ కొండల్లా పేరుకుపోతున్న ఈ చెత్తను తొలగించడమే తమ ముందున్న లక్ష్యం.
  • 2014లో స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ప్రారంభమైనప్పుడు చెత్తలో 20 శాతం కంటే తక్కువ మాత్రమే శుద్ధి అయ్యేది. ఇప్పుడు 70 శాతం చెత్తను శుద్ధి చేస్తున్నాం. త్వరలోనే దానిని 100 శాతానికి తీసుకువెళతాం. 
  • పట్టణాభివృద్ధి శాఖకి 2014లో 1.25 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తే, ప్రస్తుతం రూ.4 లక్షల కోట్లు కేటాయిస్తున్నాం. అర్బన్‌ 2.0కి 1.41 లక్షల కోట్లు కేటాయిస్తున్నాం. ఆ మిషన్‌ని మూడు ఆర్‌లు (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్‌) ద్వారా ముందుకు తీసుకువెళతాం.
  • అమృత్‌లో భాగంగా మురుగునీటిని శుద్ధి చేయకుండా నదుల్లోకి వదలం. అత్యంత ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుంటూ మురుగు నీరు భూగర్భంలోకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : స్వచ్ఛభారత్‌ మిషన్‌–అర్బన్, అటల్‌ మిషన్‌ ఫర్‌ రెజువెనేషన్‌ అండ్‌ అర్బన్‌ ట్రాన్సఫర్మేషన్‌ (అమృత్‌) పథకాల రెండో దశ ప్రారంభం
ఎప్పుడు  : అక్టోబర్‌ 1
ఎవరు    : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ    : అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్, ఢిల్లీ
ఎందుకు : దేశంలోని నగరాలను చెత్త రహితమైన నగరాలుగా, సురక్షితమైన తాగునీరు లభించే నగరాలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధన కోసం...


Expo 2020: మధ్యప్రాచ్యంలో ఏర్పాటైన తొలి అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌?

Dubai Expo-2020

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌లోని దుబాయ్‌లో దుబాయ్‌ ఎక్స్‌పో–2020(వరల్డ్‌ ఫెయిర్‌–అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌) ప్రారంభమైంది. ఒకప్పుడు ఇసుకతో ఎడారిగా కనిపించిన ప్రదేశం ఇప్పుడు ప్రపంచంలోని నలుమూలల ఉన్న అద్భుతాల నమూనాలకు వేదికైంది. 2021, అక్టోబర్‌ 1న ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్‌ 2022, మార్చి 31 వరకు జరగనుంది. ఎనిమిదేళ్ల పాటు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ఈ ఎగ్జిబిషన్‌లో భారత్‌తో సహా మొత్తం 190 దేశాలకు సంబంధించిన పెవిలియన్స్‌ (విభాగాలు) ఉన్నాయి. మొత్తం 192 దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. మధ్యప్రాచ్యంలో ఏర్పాటైన తొలి అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌గా ఇది రికార్డులకెక్కింది. ఇప్పటి వరకూ అమెరికా, యూరోప్‌ తప్ప మధ్యప్రాచ్యంలో ఎప్పుడూ ఈ ఎగ్జిబిషన్‌ నిర్వహించలేదు.

దుబాయ్‌ ఎక్స్‌పో 2020 – విశేషాలు...

  • వాస్తవానికి 2020 ఏడాది ప్రారంభం కావల్సిన ఈ ఎగ్జిబిషన్‌.. కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడింది. 2021లో ప్రారంభమైనా... మార్కెటింగ్, బ్రాండింగ్, ఇతర కారణాల వల్ల దుబాయ్‌ ఎక్స్‌పో 2020గానే పరిగణిస్తున్నారు.
  • మొత్తం 1080 ఎకరాల్లో నిర్మించిన ఈ ఎగ్జిబిషన్‌ దాదాపు ఆర్నెళ్ల పాటు దేశవిదేశాలకు చెందిన పర్యాటకులను ఆకర్షించనుంది.
  •  స్పేస్‌ ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రెప్లికా, అమెరికా మూడో అధ్యక్షుడు వాడిన ఖురాన్, ట్రాన్స్‌ఫార్మర్‌లా మారే చైనా కారు, 20 లక్షల ప్లాస్టిక్‌ బాటిళ్లతో తయారైన 70 కిలోమీటర్ల ఇటలీ తాడు, మైఖెలాంజెలో చెక్కిన బైబిల్‌ హీరో డేవిడ్‌ త్రీడీ బొమ్మ వంటివి ఇందులో ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.
  • –భవిష్యత్తులో చూడబోయే టెక్నాలజీల ప్రొటోటైప్‌లు కూడా ఎగ్జిబిషన్‌లో ఉండనున్నాయి.

దుబాయ్‌ ఎక్స్‌పో 2020...
మోటో(Motto): కనెక్టింగ్‌ మైండ్స్, క్రియేటింగ్‌ ద ఫ్యూచర్‌
మేనిజింగ్‌ డైరెక్టర్‌: రీమ్‌ అల్‌ హషేమి
మస్కట్‌(Mascot): సలమా, రషీద్, లతిఫా, అలీఫ్, ఓప్టి, టెర్రా

ఒసాకాలో ఎక్స్‌పో 2025...
1851లో తొలిసారిగా లండన్‌లో  ప్రారంభమైన ఈ విధమైన ఎగ్జిబిషన్‌లు ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాల ప్రతినిధుల కలయిక, అభిప్రాయాలు పంచుకోవడం, ఆవిష్కరణల ప్రదర్శన, సంస్కృతి, వాణిజ్యాన్ని పెంపొదించుకునేందుకు దోహదపడుతున్నాయి. మనిషి అద్భుత ఆవిష్కరణలు, ఆలోచనలు, ఊహాజనిత అంశాలకు వేదికగా మారాయి. వరల్డ్‌ ఎక్స్‌పో–2015కు ఇటలీలోని మిలాన్‌ నగరం వేదిక కాగా, ఎక్స్‌పో–2025కు జపాన్‌లోని ఒసాక నగరం ఆతిథ్యం ఇవ్వనుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : దుబాయ్‌ ఎక్స్‌పో–2020(వరల్డ్‌ ఫెయిర్‌–అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌) ప్రారంభం
ఎప్పుడు  : అక్టోబర్‌ 1
ఎవరు    : యూఏఈ ప్రభుత్వం
ఎక్కడ    : దుబాయ్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్, దుబాయ్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌(యూఏఈ)   
ఎందుకు  : ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాల ప్రతినిధుల కలయిక, అభిప్రాయాలు పంచుకోవడం, ఆవిష్కరణల ప్రదర్శన, సంస్కృతి, వాణిజ్యాన్ని పెంపొదించుకునేందుకు...


Industrial Security: రక్షణ రంగ సాంకేతికత అంశంలో ఒప్పందం చేసుకున్న దేశాలు?

అత్యాధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో భారత్‌–అమెరికాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య రక్షణ రంగ కర్మాగారాలకు సంబంధించిన సమాచారం పంచుకోనున్నారు. రక్షణ రంగ కర్మాగార భద్రతపై ఉమ్మడి కార్యాచరణ బృందం ఏర్పాటు చేసేందుకు కూడా ప్రణాళిక సిద్ధమవుతోంది. అమెరికా–భారత్‌ల మధ్య ఢిల్లీ వేదికగా జరిగిన అయిదు రోజుల ఇండో–యూఎస్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ అగ్రీమెంట్‌ (ఐఎస్‌ఏ) సమావేశంలో ఈ మేరకు ఒప్పందాలు జరిగాయని అక్టోబర్‌ 1న అధికారులు వెల్లడించారు.

యూకేపై ఆంక్షల విధింపు
భారత్‌కు వచ్చే బ్రిటిష్‌ ప్రయాణికులు టీకా తీసుకున్నా, తీసుకోకున్నా 10 రోజులు తప్పక క్వారంటైన్‌లో గడపాలని భారత్‌ నిర్ణయించింది. బ్రిటన్‌కు వచ్చే భారతీయులు టీకా తీసుకున్నా సరే క్వారంటైన్‌లో గడపాలన్న నిర్ణయంపై తీవ్రంగా మండిపడ్డ భారత్‌ అందుకు ప్రతిచర్యగా ఈనిర్ణయం తీసుకుంది. బ్రిటన్‌ విధించిన గడువు అక్టోబర్‌ 4నుంచే భారత్‌ ఆదేశాలు కూడా అమల్లోకి రానున్నాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారత్‌–అమెరికాల మధ్య ఒప్పందం 
ఎప్పుడు  : అక్టోబర్‌ 1 
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు  : రక్షణ రంగ కర్మాగారాలకు సంబంధించిన సమాచారం పంచుకోనేందుకు...


Venkaiah Naidu: ఎస్‌ఏసీఆర్‌ఈడీ పోర్టల్‌ను రూపొందించిన మంత్రిత్వ శాఖ?

Venkaiah Naidu

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోధికుల దినోత్సవం(అక్టోబర్‌ 1) సందర్భంగా అక్టోబర్‌ 1న ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఏర్పాటుచేసిన ‘వయోశ్రేష్ఠ సమ్మాన్‌ – 2021’ అవార్డుల ప్రదానోత్సవానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలో వయోధికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు.. స్టార్టప్‌లు వినూత్నమైన విధానాలతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని వెంకయ్య సూచించారు.

ఎస్‌ఏసీఆర్‌ఈడీ పోర్టల్‌ ఆవిష్కరణ...
వయోధికులకు ప్రైవేటు రంగంలో ఉపాధికల్పించేందుకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ రూపొందించిన ఎస్‌ఏసీఆర్‌ఈడీ (సీనియర్‌ ఏబుల్‌ సిటిజెన్స్‌ ఫర్‌ రీ–ఎంప్లాయ్‌మెంట్‌ ఇన్‌ డిగ్నిటీ) పోర్టల్‌ను,  సేజ్‌ (సీనియర్‌ కేర్‌ ఏజింగ్‌ గ్రోత్‌ ఇంజన్‌) పోర్టల్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య ప్రారంభించారు.

షహీన్‌ తుపాను ఏ సముద్రంలో ఏర్పడింది?
అరేబియా సముద్రంలో ఏర్పడిన షహీన్‌ తుపాను క్రమంగా బలపడుతోంది. ఏడు రాష్ట్రాల్లో ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపనుందని భారత వాతావరణ శాఖ అక్టోబర్‌ 1న హెచ్చరించింది. గుజరాత్, బిహార్, పశ్చిమబెంగాల్, సిక్కిం, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఎస్‌ఏసీఆర్‌ఈడీ (సీనియర్‌ ఏబుల్‌ సిటిజెన్స్‌ ఫర్‌ రీ–ఎంప్లాయ్‌మెంట్‌ ఇన్‌ డిగ్నిటీ) పోర్టల్‌ ఆవిష్కరణ
ఎప్పుడు  : అక్టోబర్‌ 1 
ఎవరు    : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ    : విజ్ఞాన్‌ భవన్, ఢిల్లీ
ఎందుకు : వయోధికులకు ప్రైవేటు రంగంలో ఉపాధికల్పించేందుకు...

 

MNS ADG: మిలటరీ నర్సింగ్‌ సర్వీస్‌ ఏడీజీగా బాధ్యతలు చేపట్టిని అధికారిణి?Smita Devrani

మిలటరీ నర్సింగ్‌ సర్వీస్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌(ఏడీజీ)గా మేజర్‌ జనరల్‌ స్మితా దేవరాని అక్టోబర్‌ 1న న్యూఢిల్లీలో బాధ్యతలు చేపట్టారు. సికింద్రాబాద్‌ మిలటరీ హాస్పిటల్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌ పూర్వ విద్యార్థిని అయిన దేవరాని  ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పట్టభద్రురాలు అయ్యారు. 1983లో మిలటరీ నర్సింగ్‌ సర్వీస్‌లో చేరారు. సింగపూర్‌లోని నేషనల్‌ హెల్త్‌కేర్‌ అకాడమీ నుంచి క్వాలిటీ కంట్రోల్‌ మేనేజ్‌మెంట్, ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ మేనేజ్‌మెంట్‌లకు ఆరు సిగ్మా సర్టిఫికెట్‌లు పొందారు.

ఎల్‌ఐసీ ఎండీగా పట్నాయక్‌...
ఎల్‌ఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బీసీ పట్నాయక్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా అక్టోబర్‌ 1న ప్రకటించింది. ఈ బాధ్యతలకు ముందు.. కౌన్సిల్‌ ఫర్‌ ఇన్సూరెన్స్‌ అంబుడ్స్‌మన్‌ (ముంబై)కు సెక్రటరీ జనరల్‌గా పట్నాయక్‌ పనిచేశారు. ప్రస్తుతం ఎల్‌ఐసీకి ఒక చైర్మన్, నలుగురు ఎండీలు పనిచేస్తున్నారు.

టెలికం కార్యదర్శిగా కే రాజారామన్‌...
టెలికం కార్యదర్శిగా తమిళనాడు కేడర్‌ ఐఏఎస్‌ అధికారి కే రాజారామన్‌ అక్టోబర్‌ 1న ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. అన్షూ ప్రకాశ్‌ సెప్టెంబర్‌ 30న పదవీ విరమణ నేపథ్యంలో రాజారామన్‌ నియామకం జరిగింది. ఈ నియామకానికి ముందు ఆయన ఆర్థిక వ్యవహారాల శాఖలో పెట్టుబడులకు సంబంధించి విభాగం అదనపు కార్యదర్శిగా పనిచేశారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : మిలటరీ నర్సింగ్‌ సర్వీస్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌(ఏడీజీ)గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : అక్టోబర్‌ 1
ఎవరు    : మేజర్‌ జనరల్‌ స్మితా దేవరాని
ఎక్కడ    : న్యూఢిల్లీ 


Retirement: అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలికిన ఆటగాడు?

SV Sunil

భారత స్టార్‌ ప్లేయర్‌ ఎస్‌వీ సునీల్‌(సౌమార్‌పేట్‌ విఠలాచార్య సునీల్‌) అంతర్జాతీయ హాకీ కెరీర్‌కు అక్టోబర్‌ 1న వీడ్కోలు పలికాడు. యువకులకు అవకాశమివ్వాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సునీల్‌ పేర్కొన్నాడు. కర్ణాటకకు చెందిన 32 ఏళ్ల సునీల్‌... తన 14 ఏళ్ల కెరీర్‌లో 264 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి 72 గోల్స్‌ చేశాడు. 2012, 2016 ఒలింపిక్స్‌లో ఆడిన సునీల్‌ టోక్యో గేమ్స్‌కు మాత్రం ఎంపిక కాలేదు. 2014 ఆసియా క్రీడల్లో పసిడి నెగ్గిన భారత టీమ్‌లో సునీల్‌ సభ్యుడిగా ఉన్నాడు.

శరత్‌ కమల్‌ ఏ క్రీడకు చెందినవాడు?
ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ఖతార్‌ రాజధాని దోహాలో అక్టోబర్‌ 1న జరిగిన సెమీఫైనల్లో భారత్‌ 0–3తో దక్షిణ కొరియా చేతిలో ఓడింది. టోర్నీలో సెమీస్‌ చేరిన జట్లకు కనీసం కాంస్య పతకం దక్కుతుంది. భారత జట్టులో సత్యన్‌ జ్ఞానశేఖరన్, ఆచంట శరత్‌ కమల్, హర్మీత్‌ దేశాయ్‌ ఉన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : అంతర్జాతీయ హాకీ కెరీర్‌కు వీడ్కోలు
ఎప్పుడు  : అక్టోబర్‌ 1
ఎవరు    : భారత స్టార్‌ ప్లేయర్‌ ఎస్‌వీ సునీల్‌(సౌమార్‌పేట్‌ విఠలాచార్య సునీల్‌)
ఎక్కడ    : యువకులకు అవకాశమివ్వాలనే ఉద్దేశంతోనే...


Kinetic Green Energy: కైనెటిక్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీ యూనిట్‌ ఎక్కడ ఏర్పాటుకానుంది?

Kinetic-AP CM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలో రూ.1,750 కోట్లతో ఎలక్ట్రిక్‌ టూ వీలర్స్, త్రీ వీలర్స్, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ బ్యాటరీ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌తోపాటు బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్స్‌ ఏర్పాటుచేసేందుకు కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ అండ్‌ పవర్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ ముందుకొచ్చింది. సంస్థ వ్యవస్థాపకులు, సీఈఓ అయిన సులజ్జ ఫిరోదియా మొత్వాని, సహ వ్యవస్థాపకులు రితేష్‌ మంత్రి అక్టోబర్‌ 1న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా విశాఖలో బ్రాండెడ్‌ ప్రీమియం ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ నెలకొల్పేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వారు సీఎంకు తెలిపారు. అలాగే, స్కిల్‌ డెవలప్‌మెంట్, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటుచేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పూణె సమీపంలోని అహ్మద్‌నగర్‌లో నెలకు 6,000 ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తి సామర్ధ్యంగల ప్లాంట్‌ని ఈ సంస్థ ఏర్పాటుచేసింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీ యూనిట్‌ ఏర్పాటుకు ఆసక్తి
ఎప్పుడు  : అక్టోబర్‌ 1
ఎవరు    : కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ అండ్‌ పవర్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ 
ఎక్కడ    : విశాఖపట్నం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ 


Haritha Haram: తెలంగాణ హరిత నిధి ఏర్పాటు ముఖ్య ఉద్దేశం?

KCR

తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం పెంచడం కోసం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగించడానికి తెలంగాణ హరిత నిధి (తెలంగాణ గ్రీన్‌ఫండ్‌)ను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రతినెలా కొంత మొత్తాన్ని ఈ ఫండ్‌కు జమ చేయాలని కోరారు. దీనితోపాటు పలు ఇతర మార్గాల ద్వారా గ్రీన్‌ఫండ్‌కు నిధులు సమకూర్చుతామని వెల్లడించారు. అక్టోబర్‌ 1న శాసనసభలో హరితహారం అంశంపై చేపట్టిన చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఈ విషయాలు వెల్లడించారు. సీఎం తెలిపిన వివరాల ప్రకారం...

  • నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌)కు ప్రభుత్వం నుంచి అందుతున్న మాదిరిగానే.. ప్రభుత్వ పనులు చేపట్టే సివిల్, ఇతర కాంట్రాక్టుల నిధుల్లోంచి విధిగా 0.1 శాతాన్ని హరిత నిధికి జమచేయాలి. దీనిద్వారా ఏటా రూ.20–30 కోట్లు వస్తాయని అంచనా.
  • నియోజకవర్గ అభివృద్ధి నిధి నుంచి 10 శాతాన్ని హరితనిధికి జమ చేయాలి. 
  • రాష్ట్రంలో జరుగుతున్న అన్నిరకాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రతీ లావాదేవీకి రూ.50 చొప్పున హరిత నిధికి జమచేయాలి.
  • వ్యాపార సంస్థల లైసెన్సు రెన్యువల్‌ సందర్భంగా రూ.1,000 జమ చేయాలి. 
  • విద్యార్థుల అడ్మిషన్ల సందర్భంగా: పాఠశాల విద్యార్థులు రూ.10, ఇంటర్‌ విద్యార్థులు రూ.15, డిగ్రీ విద్యార్థులు రూ.25 జమ చేయాలి
  • వృత్తి విద్య అడ్మిషన్ల సమయంలో రూ.100 చొప్పున హరిత నిధికి జమచేయాలి.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : తెలంగాణ హరిత నిధి (తెలంగాణ గ్రీన్‌ఫండ్‌)ను ఏర్పాటు చేయనున్నాం
ఎప్పుడు  : అక్టోబర్‌ 1
ఎవరు    : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
ఎందుకు : తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం పెంచడం కోసం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగించడానికి...


Telangana: ఉద్యాన విశ్వవిద్యాలయ సవరణ బిల్లు ఉద్దేశం?

Telangana Assembly

తెలంగాణ రాష్ట్ర శాసనసభ అక్టోబర్‌ 1న నాలుగు బిల్లులను ఆమోదించింది. బిల్లుల వివరాలు ఇలా...
1. గృహ నిర్మాణ మండలిని రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థగా గుర్తించడంతోపాటు ముగ్గురు సభ్యులను నామినేట్‌ చేసేలా సవరించిన తెలంగాణ గృహ నిర్మాణమండలి (సవరణ) బిల్లు–2021ను గృహ నిర్మాణమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రతిపాదించగా సభ ఆమోదించింది.
2. కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్‌ఆర్‌ఐ), హార్టీకల్చర్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల అనుబంధాన్ని అనుమతించేందుకు ఉద్దేశించిన ఉద్యాన విశ్వవిద్యాలయ సవరణ బిల్లు– 2021కు సభ ఆమోదం తెలిపింది.
3. జాతీయ న్యాయ శాస్త్ర అధ్యయనాలు, పరిశోధనల అకాడమీ విశ్వవిద్యాలయం (నల్సార్‌)లో తెలంగాణ విద్యార్థుల కోటాను 20 నుంచి 25 శాతానికి పెంచడంతోపాటు ఈ 25 శాతం కోటాలో బీసీలు, ఈబీసీలకు రిజర్వేషన్లు కల్పించే నల్సార్‌ సవరణ బిల్లు–2021కు సైతం శాసనసభ ఆమోదం తెలిపింది.
4. కొత్త గ్రామాల ఏర్పాటు, ఏదైనా గ్రామం విస్తీర్ణాన్ని పెంచడం లేదా తగ్గించడం, పేరు, హద్దుల మార్పునకు ఉద్దేశించిన పంచాయతీరాజ్‌ సవరణ బిల్లును కూడా సభ ఆమోదించింది.

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 1 కరెంట్‌ అఫైర్స్‌

 

Published date : 02 Oct 2021 06:27PM

Photo Stories