Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, అక్టోబ‌ర్ 1 కరెంట్‌ అఫైర్స్‌

VR Chaudhari

VR Chaudhari: వైమానిక దళం కొత్త చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎయిర్‌ మార్షల్‌?

భారత వైమానిక దళం నూతన చీఫ్‌గా ఎయిర్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌదరి(వీఆర్‌ చౌదరి) బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు వైస్‌ చీఫ్‌గా ఉన్న ఆయన సెప్టెంబర్‌ 30న న్యూఢిల్లీలో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ రాకేశ్‌ కుమార్‌ సింగ్‌ భదౌరియా నుంచి బాధ్యతలు చేపట్టారు. దీంతో వీఆర్‌ చౌదరి దేశ 27వ ఎయిర్‌ స్టాఫ్‌ చీఫ్‌ అయ్యారు. మూడేళ్ల పాటు ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ పదవిలో కొనసాగనున్నారు.

వాయుసేనలో బాధ్యతలు
నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ) పూర్వ విద్యార్థి అయిన చౌదరి డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. 1982 డిసెంబర్‌లో ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ స్ట్రీమ్‌లో ఫైటర్‌ పైలట్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత మిగ్‌ –21, మిగ్‌ –23 ఎమ్‌ఎఫ్, మిగ్‌–29, సు–30 ఎమ్‌కేఐ వంటి యుద్ధ విమానాలను నడిపారు. 3,800 గంటలకు పైగా యుద్ధ విమానాలు నడిపిన అనుభవం ఉంది. ప్రస్తుతం వాయుసేన చీఫ్‌ అయ్యేముందు ఎయిర్‌ఫోర్స్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఎయిర్‌ స్టాఫ్‌ డిప్యూటీ చీఫ్‌(వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ఎయిర్‌ స్టాఫ్‌)గా, తూర్పు కమాండ్‌లో సీనియర్‌ ఎయిర్‌ స్టాఫ్‌ ఆఫీసర్‌గా పనిచేశారు.

వివిధ హోదాల్లో...

  • పాకిస్తాన్, చైనాతో సరిహద్దులలోని కొన్ని ప్రాంతాల భద్రతకు బాధ్యత వహించే వెస్ట్రన్‌ ఎయిర్‌ కమాండ్‌కు కమాండర్‌–ఇన్‌–చీఫ్‌గానూ చౌదరి పనిచేశారు.
  • తూర్పులద్దాఖ్‌లో భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం నెలకొన్న సమయంలోనే వెస్ట్రన్‌ ఎయిర్‌ కమాండ్‌ చీఫ్‌గా నియమితులయ్యారు.
  • గతంలో ఆపరేషన్‌ మేఘదూత్, ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌ వంటి ఎయిర్‌ ఫోర్స్‌ చేపట్టిన కొన్ని ముఖ్యమైన మిషన్లలో భాగస్వాములయ్యారు.
  • ఫ్రంట్‌లైన్‌ ఫైటర్‌ స్క్వాడ్రన్‌కు కమాండింగ్‌ అధికారిగా వ్యవహరించారు.
  • హైదరాబాద్‌లోని దుండిగల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీ డిప్యూటీ కమాండెంట్‌గా, అసిస్టెంట్‌ చీఫ్‌ ఆఫ్‌ ఎయిర్‌ స్టాఫ్‌ ఆపరేషన్స్‌ బాధ్యతలు నిర్వహించారు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారత వైమానిక దళం నూతన చీఫ్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : సెప్టెంబర్‌ 30
ఎవరు    : ఎయిర్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌదరి(వీఆర్‌ చౌదరి)
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : ఇప్పటివరకు వైమానిక దళం నూతన చీఫ్‌గా ఉన్న ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ రాకేశ్‌ కుమార్‌ సింగ్‌ భదౌరియా పదవీ విరమణ చేసిన నేపథ్యంలో...


Covid Vaccination: జైకోవ్‌–డి వ్యాక్సిన్‌ను తయారు చేసిన సంస్థ?

Zydus-Zycov d

కోవిడ్‌–19 నియంత్రణ కోసం జైడస్‌ కాడిలా కంపెనీ తయారు చేసిన జైకోవ్‌–డి వ్యాక్సిన్‌ దేశంలో అతి త్వరలో అందుబాటులోకి రానుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంజెక్షన్‌రహితంగా మూడు డోసుల్లో ఇవ్వనున్న ఈ వ్యాక్సిన్‌ ధర ఇతర వాటితో పోలిస్తే భిన్నంగా ఉంటుందని తెలిపింది. 12 ఏళ్లు పైబడిన వారికి జైకోవ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వవచ్చు. దేశంలో 18 ఏళ్ల లోపు వారికి ఉపయోగించనున్న తొలి వ్యాక్సిన్‌ ఇదే. జైకోవ్‌–డి ప్రపంచంలోనే తొలి ప్లాస్మిడ్‌ డీఎన్‌ఏ వ్యాక్సిన్‌. పూర్తిగా మన దేశంలోనే అభివృద్ధి చేసి, అందుబాటులోకి వస్తున్న రెండో వ్యాక్సిన్‌.

కస్టమ్స్‌ సుంకం మినహాయింపు...
కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకునే కోవిడ్‌ వ్యాక్సిన్లపై 2021, అక్టోబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు కస్టమ్స్‌ సుంకాన్ని మినహాయించింది. ఫలితంగా దేశంలో వ్యాక్సిన్లు అందరికీ అందుబాటులోకి రావడమే కాకుండా వాటి ధర తగ్గుతుంది. కోవిడ్‌ వ్యాక్సిన్లపై కస్టమ్స్‌ సుంకాన్ని గత ఏప్రిల్‌ నుంచి మూడు నెలల పాటు మినహాయించింది. ఆ తర్వాత 10 శాతం సుంకాన్ని వసూలు చేసింది. ప్రస్తుతం స్పుత్నిక్‌ వి టీకా మాత్రమే భారత్‌లోకి దిగుమతి అవుతోంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : జైడస్‌ కాడిలా కంపెనీ తయారు చేసిన జైకోవ్‌–డి వ్యాక్సిన్‌ త్వరలో అందుబాటులోకి రానుంది
ఎప్పుడు : సెప్టెంబర్‌ 30
ఎవరు    : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ    : దేశ వాప్తంగా...
ఎందుకు : కరోనా వైరస్‌ నియంత్రణ కోసం..


Retirement: హాకీకి వీడ్కోలు పలికిన భారత స్టార్‌ ఆటగాళ్లు?

టోక్యో ఒలింపిక్స్‌–2020లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన డ్రాగ్‌ ఫ్లికర్‌ రూపిందర్‌ పాల్‌ సింగ్, డిఫెండర్‌ బీరేంద్ర లక్డాలు ఒకే రోజు సెప్టెంబర్‌ 30న అంతర్జాతీయ హాకీకి రిటైర్మెంట్‌ ప్రకటించారు. పంజాబ్‌కు చెందిన 30 ఏళ్ల రూపిందర్‌ తన 13 ఏళ్ల కెరీర్‌లో మొత్తం 223 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. యువ ప్లేయర్లకు అవకాశం ఇచ్చేందుకు రిటైర్మెంట్‌ నిర్ణయం తీసుకున్నానని రూపిందర్‌ పేర్కొన్నాడు. ఒడిశాకు చెందిన బీరేంద్ర తన 9 ఏళ్ల కెరీర్‌లో 201 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. టోక్యోలో భారత హాకీ జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : హాకీకి వీడ్కోలు పలికిన భారత స్టార్‌ ఆటగాళ్లు?
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 30
ఎవరు    :  డ్రాగ్‌ ఫ్లికర్‌ రూపిందర్‌ పాల్‌ సింగ్, డిఫెండర్‌ బీరేంద్ర లక్డా 
ఎందుకు : పలు కారణాల రీత్యా...


Hurun India Rich List: దేశీయంగా అత్యంత సంపదపరుల సంఖ్య ఎంత?

Mukes-Adani

 

10వ హరూన్‌ ఇండియా ఐఐఎఫ్‌ఎల్‌ రిచ్‌ లిస్ట్‌ నివేదిక సెప్టెంబర్‌ 30న విడుదలైంది. హరూన్‌ ఇండియా–ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ సంయుక్తంగా రూపొందించిన ఈ జాబితాలోకి రూ.1,000 కోట్లకుపైన సంపద కలిగిన వారిని తీసుకున్నారు. 2021 సెప్టెంబర్‌ 15 నాటికి ఉన్న వివరాలను పరిగణనలోకి తీసుకొని జాబితాను రూపొందించినట్లు హరూన్‌ ఇండియా ఎండీ అనాస్‌ రెహ్మాన్‌ జునైద్‌ తెలిపారు.

నివేదికలోని ముఖ్యాంశాలు...

  • 2021లో భారత్‌లో కొత్తగా 179 మంది అత్యంత సంపన్నులుగా మారిపోయారు.
  • మొత్తం మీద దేశీయంగా అత్యంత సంపదపరుల సంఖ్య 1,007కు చేరుకుంది.
  • కరోనా కారణంగా వేలాది మందికి ఉపాధి లేకుండా పోగా.. ఈ 1,007 మంది ఆస్తుల విలువ సగటున 25 శాతం చొప్పున పెరిగింది.
  • 1,007 మందిలోలో 894 మంది సంపదను పెంచుకోగా.. 113 మంది సంపద గడిచిన ఏడాదిలో క్షీణించింది. 
  • 1007 మందిలో 13 మంది రూ.లక్ష కోట్లకంటే ఎక్కువే సంపద కలిగి ఉన్నారు.
  • 2011 నాటికి 100లోపున్న సంపన్నుల సంఖ్య 1007కు చేరుకుంది. ఈ ప్రకారం వచ్చే ఐదేళ్లలో వీరి సంఖ్య 3,000కు చేరుకోవచ్చు.

హరూన్‌ ఇండియా ఐఐఎఫ్‌ఎల్‌ రిచ్‌ లిస్ట్‌–2021

స్థానం  వ్యక్తి/కుటుంబం   సంపద(రూ. కోట్లలో)
1 రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ 7,18,000    
2 గౌతమ్‌ అదానీ కుటుంబం    5,05,900
3 హెచ్‌సీఎల్‌ శివ్‌నాడార్‌ కుటుంబం  2,36,600
4 ఎస్‌పీ హిందుజా కుటుంబం  2,20,000
5 ఎల్‌ఎన్‌ మిట్టల్‌ కుటుంబం   1,74,400
6  సైరస్‌ పూనవాలా కుటుంబం  1,63,700
7 డీమార్ట్‌ అధినేత రాధాకిషన్‌ దమానీ 1,54,300
8 వినోద్‌ శాంతిలాల్‌ అదానీ కుటుంబం 1,31,600
9 కుమార మంగళం బిర్లా 1,22,200
10 జెడ్‌స్కేలర్‌ కంపెనీ అధినేత జయ్‌చౌదరి 1,21,600
63 జెరోదా నితిన్‌ కామత్‌  25,600
72 ఇన్వెస్టర్‌ రాకేశ్‌ జున్‌జున్‌వాలా కుటుంబం 22,300

 

మరికొన్ని ముఖ్యాంశాలు

  • – 1007 మంది అత్యంత సంపన్నుల్లో 255 మంది ముంబైకి చెందినవారే ఉన్నారు. ఢిల్లీ 167 మంది, బెంగళూరులో 85 మందికి నివాస కేంద్రంగా ఉంది.
  • – 1,007 మందిలో డాలర్‌ బిలియనీర్లు 237 మంది ఉన్నారు. ఫార్మా నుంచి 40 మంది ఈ జాబితాలో నిలిచారు. ఆ తర్వాత కెమికల్స్‌ అండ్‌ పెట్రోకెమికల్స్‌ నుంచి 27 మంది, సాఫ్ట్‌వేర్‌ రంగం నుంచి 22 మంది ఉన్నారు.
  • – 100 మంది అత్యంత సంపన్నుల్లో 13 మంది 1990ల్లో జన్మించిన వారు కాగా.. వీరంతా కూడా సొంత సామర్థ్యాలతోనే(వారసత్వంగా వచ్చింది కాకుండా ఈ స్థాయికి చేరారు.
  • – మహిళా సంపన్నుల్లో స్మితా వి సృష్ణ(గోద్రేజ్‌ కుటుంబం) సంపద రూ.31,300 కోట్లుగా, బయోకాన్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా సంపద విలువ రూ.28,200 కోట్లుగా ఉంది.
  • – అదానీ కుటుంబం సంపద ప్రతి రోజూ రూ.1,000 కోట్ల మేర(దాదాపు రూ.3,65,700 కోట్లు) పెరిగింది. దేశీయంగా స్వల్ప కాలంలో భారీగా సంపదను కూడబెట్టుకున్న ఘనత వీరిదే.ఆసియాలోనూ రెండో అత్యంత సంపన్నుడిగా ముకేశ్‌ తర్వాతి స్థానానికి అదానీ చేరుకున్నారు.

 

Unemployed Youth: డిజిసాక్షం కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చిన మంత్రిత్వ శాఖ?

Ministry of Labour

యువతలో ఉపాధి సామర్థ్యాన్ని పెంచడానికి డిజిసాక్షం పేరుతో నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. డిజిసాక్షంలో భాగంగా నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ పోర్టల్‌ ద్వారా యువతకు డిజిటల్‌ నైపుణ్యాలను కల్పిస్తారు. తొలి ఏడాది మూడు లక్షల పైచిలుకు మందికి శిక్షణ ఇస్తారు. డిజిసాక్షంకు టీఎంఐ ఈ2ఈ అకాడమీ నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌గా ఉండగా... మైక్రోసాఫ్ట్‌ సహకారం అందిస్తోంది.

మోల్డ్‌టెక్‌ మరో రెండు ప్లాంట్లు
ఇంజెక్షన్‌ మోల్డెడ్‌ ప్లాస్టిక్‌ కంటైనర్ల తయారీ దిగ్గజం మోల్డ్‌టెక్‌ ప్యాకేజింగ్‌ మరో రెండు ప్లాంట్లను స్థాపిస్తోంది. హైదరాబాద్‌ సమీపంలోని సుల్తాన్‌పూర్‌ వద్ద ఇంజెక్షన్‌ బ్లో మౌల్డింగ్‌ (ఐబీఎం) ప్యాకేజింగ్‌ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని రూ.50 కోట్లతో నెలకొల్పనుంది. అలాగే రూ.20 కోట్లతో ఉత్తరప్రదేశ్‌లోనూ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్టు మోల్డ్‌టెక్‌ గ్రూప్‌ తెలిపింది.

ప్రపంచంలో ఏకైక సంస్థ...
రోబోలను వినియోగించి ప్లాస్టిక్‌ కంటైనర్లను అలంకరణకు ఇన్‌ మోల్డ్‌ లేబులింగ్‌ (ఐఎంఎల్‌) విధానాన్ని దేశంలో పరిచయం చేసిన తొలి సంస్థగా మోల్డ్‌టెక్‌ ప్యాకేజింగ్‌ రికార్డు సాధించింది. ప్రపంచంలో ఐఎంఎల్‌ డెకోరేషన్‌ కోసం రోబోలను సొంతంగా రూపకల్పన చేసి తయారు చేస్తున్న ఏకైక ప్యాకేజింగ్‌ సంస్థ కూడా ఇదే. భారత్‌లో సంస్థకు 9 తయారీ కేంద్రాలు ఉన్నాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : డిజిసాక్షం కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చిన మంత్రిత్వ శాఖ?
ఎప్పుడు : సెప్టెంబర్‌ 30
ఎవరు    : కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ
ఎక్కడ    : దేశవ్యాప్తంగా...
ఎందుకు : యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు...


Andhra Pradesh Chief Secretary: నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్‌ అధికారి?Sameer Sharma

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా 1985 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన డాక్టర్‌ సమీర్‌ శర్మ సెప్టెంబర్‌ 30న వెలగపడిలోని సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. సీఎస్‌గా పదవీ విరమణ చేసిన ఆదిత్యనాథ్‌దాస్‌ స్థానంలో ఆయన నూతన బాధ్యతలు చేపట్టారు. పదవీ విరమణ చేసిన ఆదిత్యనాథ్‌దాస్‌ ఢిల్లీలో ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమితులైన విషయం తెలిసిందే. సమీర్‌ శర్మ ఇప్పటివరకు రాష్ట్ర ప్రణాళిక, రిసోర్స్‌ మొబిలైజేషన్‌ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

వీకేసీ అంబాసిడర్‌గా అమితాబ్‌
బాలీవుడ్‌ అగ్రనటుడు అమితాబ్‌ బచ్చన్‌ను వీకేసీ పుట్‌వేర్‌ గ్రూప్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంచుకుంది. సంస్థ తర్వలో చేపట్టనున్న ‘‘సెలెబ్రేట్‌ హార్డ్‌ వర్క్‌’’ ప్రచార కార్యక్రమాన్ని అమితాబ్‌తో దేశమంతంటా ప్రారంభించనుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : సెప్టెంబర్‌ 10
ఎవరు    : ఐఏఎస్‌ అధికారి డా.సమీర్‌ శర్మ 
ఎక్కడ     : ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం, వెలగపూడి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు  : ఇప్పటివరకు సీఎస్‌గా ఉన్న ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీ విరమణ చేసిన నేపథ్యంలో...


NITI Aayog: పంటల వృద్ధి రేటులో ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం?

Paddy Crop

పదేళ్లలో వ్యవసాయ పంటల వృద్ధి రేటులో త్రిపుర రాష్ట్ర ప్రథమ స్థానంలో నిలిచింది. 6.87 శాతం వృద్ధి రేటుతో త్రిపుర తొలి స్థానంలో ఉండగా, తెలంగాణ 6.59 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. సిక్కిం కూడా రెండో స్థానంలో ఉంది. అయితే పెద్ద రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణదే మొదటి స్థానమని చెప్పుకోవచ్చు. 2011–20 మధ్య కాలంలో దేశంలో వ్యవసాయ రంగ పురోగతి, వివిధ రాష్ట్రాలు సాధించిన వృద్ధిపై రూపొందించిన విశ్లేషణ పత్రంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ విశ్లేషణ పత్రాన్ని నీతి ఆయోగ్‌ తాజాగా విడుదల చేసింది.

నివేదికలోని ముఖ్యాంశాలు

  • కేవలం 11 రాష్ట్రాల్లో మాత్రమే 3 శాతానికి మించి సగటు పంటల వృద్ధి రేటు నమోదైంది.
  • పది రాష్ట్రాల్లో మైనస్‌ 3.63 శాతం నుంచి ఒక శాతం లోపు వృద్ధి రేటు నమోదైంది.
  • దేశంలో రైతు ఆదాయంలో పంటల వాటా 2011–12లో 65.4 శాతం ఉండగా, 2018–19 నాటికి అది 55.3 శాతానికి పడిపోయింది.
  • సాగుదారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. వ్యవసాయ పరిమాణం క్షీణిస్తోంది.
  • గ్రామీణ మహిళా కార్మికులలో 73 శాతం మంది వ్యవసాయరంగంలో పనిచేస్తున్నారు.
  • ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ రైతులకు ప్రభుత్వాల నుంచి చాలా తక్కువ సహకారం లభిస్తోంది.
  • ఉద్యానం, పాడి, పశుసంవర్థక తదితర అనుబంధ రంగాల వృద్ధి రేటులో తెలంగాణ ఐదో స్థానంలో ఉంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో నిలిచింది.
  • వ్యవసాయంలో సరైన పద్ధతులు అవలంభించకపోవడం వల్ల ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడేవారు దేశంలో 15 శాతం మంది ఉన్నారు.


Andhra Pradesh: ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన పద్మశ్రీ అవార్డీ?

రేడియేషన్‌ ఆంకాలజిస్టుల్లో అత్యంత అనుభవజ్ఞడు, ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వ సలహాదారు (సమగ్ర క్యాన్సర్‌ సంరక్షణ)గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన్ని కేబినెట్‌ హోదాలో రెండు సంవత్సరాల పదవీకాలంతో సలహాదారుగా నియమిస్తూ సాధారణ పరిపాలనశాఖ సెప్టెంబర్‌ 30న ఉత్తర్వులు జారీ చేసింది. రేడియేషన్‌ ఆంకాలజీలో డాక్టర్‌ నోరికి 43 ఏళ్ల అనుభవం ఉంది. వైద్యరంగంలో ఆయన చేసిన కృషికి 2015లో పద్మశ్రీ అవార్డు పొందారు. క్యాన్సర్‌ చికిత్సకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వానికి సలహాదారుగా ఉండాలని డాక్టర్‌ నోరిని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి విజ్ఞప్తి చేసిన విషయం విదతమే.

స్పేస్‌టెక్‌ పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ రూపకల్పన
ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష సాంకేతికత (స్పేస్‌ టెక్నాలజీ)కు తెలంగాణ రాష్ట్రాన్ని తొలి గమ్యస్థానంగా మార్చాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సంబంధిత రంగానికి చెందిన పరిశ్రమలు, విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఇప్పటికే ‘తెలంగాణ స్పేస్‌టెక్‌ పాలసీ ఫ్రేమ్‌వర్క్‌’ను రూపొందించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను తాజాగా విడుదల చేసింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు (సమగ్ర క్యాన్సర్‌ సంరక్షణ)గా నియామకం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 30
ఎవరు    : ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు
ఎందుకు : క్యాన్సర్‌ చికిత్సకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించేందుకు...

 

Daily Current Affairs in Telugu: 2021, సెప్టెంబర్‌ 30 కరెంట్‌ అఫైర్స్‌

 

Published date : 01 Oct 2021 06:27PM

Photo Stories