Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, సెప్టెంబర్‌ 30 కరెంట్‌ అఫైర్స్‌

PM-POSHAN

PM-POSHAN: ఏ పథకంగా మధ్యాహ్న భోజన పథకం పేరును మార్పు చేశారు?

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత మధ్యాహ్న భోజన పథకం పేరును ‘‘నేషనల్‌ స్కీమ్‌ ఫర్‌ పీఎం పోషణ్‌ ఇన్‌ స్కూల్స్‌(ప్రధానమంత్రి పోషణ్‌ శక్తి నిర్మాణ్‌ పథకం)’’గా మారుస్తూ మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలన్న ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ(సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సెప్టెంబర్‌ 29న సమావేశమైన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లలకు సైతం పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు.

పీఎం పోషణ్‌ పథకం – ముఖ్యాంశాలు

  • 2021–22 నుంచి 2025–26 వరకూ ఐదేళ్లపాటు పథకాన్ని కొనసాగిస్తారు. ఇందుకు కేంద్రం రూ.54,061.73 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.31,733.17 కోట్ల మేరకు వ్యయాన్ని భరించనున్నాయి.
  • ఆహార ధాన్యాల కోసం కేంద్రం రూ.45 వేల కోట్లు అదనంగా వెచ్చించనుంది.
  • మొత్తంగా ఐదేళ్లలో పీఎం పోషణ్‌ పథకం అమలుకు రూ.1,30,794.90 కోట్లు ఖర్చు చేయనున్నారు.
  • ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడ్‌ పాఠశాలల్లో వండి, నిత్యం ఒకపూట వేడిగా భోజనం అందించే ఈ పథకంతో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
  • గతంలో ఈ పథకం పేరు ‘నేషనల్‌ స్కీమ్‌ ఫర్‌ మిడ్‌డే మీల్‌ ఇన్‌ స్కూల్స్‌’గా ఉండగా ఇప్పుడు ‘నేషనల్‌ స్కీమ్‌ ఫర్‌ పీఎం పోషణ్‌ ఇన్‌ స్కూల్స్‌’గా మార్చినట్టు కేంద్రం వెల్లడించింది.
  • 2007 వరకు ఈ పథకం పేరు ‘నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఆఫ్‌ న్యూట్రిషనల్‌ సపోర్ట్‌ టు ప్రైమరీ ఎడ్యుకేషన్‌’ అని ఉండగా, 2007లో ‘నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఆఫ్‌ మిడ్‌ డే మీల్‌ ఇన్‌ స్కూల్స్‌’గా మార్చారు.
  • దేశవ్యాప్తంగా 11.20 లక్షల పాఠశాలల్లో చదువుతున్న 11.80 కోట్ల మంది విద్యార్థులకు పీఎం పోషణ్‌ స్కీమ్‌ వర్తిస్తుందని కేంద్రం వెల్లడించింది. 
  • స్కూళ్లలో మధ్యాహ్న భోజనం కోసం 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.24,400 కోట్లు వెచ్చించినట్టు కేంద్రం తెలిపింది.

పిల్లలకు ‘తిథి భోజనం’

  • పీఎం పోషణ్‌ పథకాన్ని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్‌ ప్రీ–ప్రైమరీ లేదా బాల వాటికలకు కూడా వర్తింపజేయాలని కేంద్రం యోచిస్తోంది. 11.80 కోట్ల విద్యార్థులకు ఇది అదనం.
  • తిథి భోజనం కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.
  • ప్రత్యేక సందర్భాలు, పండుగల సమయాల్లో ప్రత్యేకమైన ఆహారాన్ని పిల్లలకు అందించేందుకు ఉద్దేశించిన సామాజిక భాగస్వామ్య కార్యక్రమం ఈ తిథి భోజనం.
  • పాఠశాలల్లో న్యూట్రిషన్‌ గార్డెన్స్‌ అభివృద్ధి చేయడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. తోటల పెంపకాన్ని విద్యార్థులకు పరిచయం చేయడమే దీని ఉద్దేశం. ఇప్పటికే 3 లక్షల పాఠశాలల్లో అమలు చేస్తున్నారు.
  • అన్ని జిల్లాల్లో సామాజిక తనిఖీలు తప్పనిసరిగా అమలు చేయాలి. పిల్లల్లో రక్తహీనత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో అనుబంధ పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తారు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : మధ్యాహ్న భోజన పథకం పేరును ‘నేషనల్‌ స్కీమ్‌ ఫర్‌ పీఎం పోషణ్‌ ఇన్‌ స్కూల్స్‌’గా మార్చేందుకు ఆమోదం
ఎప్పుడు : సెప్టెంబర్‌ 29
ఎవరు    : కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ(సీసీఈఏ)
ఎందుకు : మధ్యాహ్న భోజన పథకానికి కొత్త రూపు తెచ్చి... మరింత మంది చిన్నారులకు పోషకాహారాన్ని అందించేందుకు...

Fumio Kishida: జపాన్‌ నూతన ప్రధానమంత్రిగా ఎన్నికైన నేత?

Fumio Kishida

జపాన్‌ నూతన ప్రధానమంత్రిగా ఫ్యుమియో కిషిడా ఎన్నికయ్యారు. దేశంలో అధికారంలో ఉన్న లిబరల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకోవడానికి నిర్వహించిన సంస్థాగత ఎన్నికల్లో ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి కిషిడా మరో మంత్రి తారో కోనోపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. దేశ తదుపరి ప్రధానిగా ఆయన అక్టోబర్‌ మొదటి వారం బాధ్యతలు స్వీకరించనున్నారు. కరోనా సంక్షోభం, దాని కారణంగా ఛిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థ, జనాభా తగ్గుదల, ప్రాంతీయంగా చైనా నుంచి ఏర్పడుతున్న భద్రతాపరమైన సమస్యలు వంటి సవాళ్లను కిషిడా ఎదుర్కోవాల్సి ఉంది.

ప్రస్తుత ప్రధాని యొషిహిడే సుగా ఏడాది మాత్రమే ప్రధానిగా ఉన్నారు. కరోనా కట్టడిలో వైఫల్యం, కేసులు తీవ్రతతో పాటు, ఒలంపిక్స్‌ నిర్వహణ వంటి వాటితో విమర్శల్ని మూటగట్టుకున్న సుగా ప్రజాదరణ కోల్పోయారు. 2021, సెప్టెంబర్‌ నెలాఖరుకి తాను బాధ్యతల నుంచి తప్పుకుంటానని సుగా ప్రకటించారు. దీంతో కొత్త నాయకుడి కోసం ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది.

జపాన్‌ రాజధాని: టోక్యో; కరెన్సీ: జపనీస్‌ యెన్‌
జపాన్‌ ప్రస్తుత ఎంపరర్‌: నరుహితో
జపాన్‌ ప్రస్తుత ప్రధాని: యోషిహిడే సుగా
జపాన్‌ కొత్త ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి: ఫ్యుమియో కిషిడా
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : జపాన్‌ నూతన ప్రధానమంత్రిగా ఎన్నిక
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 29
ఎవరు    : ఫ్యుమియో కిషిడా
ఎందుకు: జపాన్‌ ప్రస్తుత ప్రధాని యొషిహిడే సుగా రాజీనామా చేయనున్న నేపథ్యంలో...

Defence Ministry: ఎఎల్‌హెచ్‌ మార్క్‌–3 హెలికాప్టర్లను తయరు చేస్తోన్న సంస్థ?

Defence Ministry

భారత ఆర్మీ ఆధునీకరణ, సామర్థ్యం పెంపు కోసం అవసరమైన కొనుగోళ్లు చేయడానికి రూ.13,165 కోట్ల కేటాయింపులకు భారత రక్షణ శాఖ సెప్టెంబర్‌ 29న ఆమోదముద్ర వేసింది. సైనిక అవసరాలతో పాటు ఆర్మీలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించే ఎఎల్‌హెచ్‌ మార్క్‌–3 హెలికాప్టర్లు 25 కొనుగోలు చేయనుంది. హెలికాఫ్టర్ల కోసం రూ. 3,850 కోట్లు, రాకెట్లు, ఇతర ఆయుధాల కోసం రూ.4,962 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. భారత ప్రభుత్వానికి చెందిన హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) మార్క్‌–3 హెలికాప్టర్లను తయారు చేస్తోంది. డబుల్‌ ఇంజిన్‌తో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారయ్యే ఈ హెలికాప్టర్లు 5.5 టన్నుల బరువున్న కేటగిరీలోకి వస్తాయి. మొత్తం రూ.13,165 కోట్లలో రూ.11,486 కోట్లు స్వదేశీ సంస్థలకే వెళతాయని కేంద్రం తెలిపింది.

హెచ్‌ఏఎల్‌... 
ప్రధాన కార్యాలయం: బెంగళూరు
ప్రస్తుత చైర్మన్, ఎమ్‌డీ: ఆర్‌ మాధవన్‌
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : సైన్యానికి అవసరమైన కొనుగోళ్లు చేయడానికి రూ.13,165 కోట్ల కేటాయింపులకు
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 29
ఎవరు    : భారత రక్షణ శాఖ
ఎందుకు : ఆర్మీ ఆధునీకరణ, సామర్థ్యం పెంపు కోసం...


Human Papillomavirus: హెచ్‌పీవీ టీకా గార్డ్‌సిల్‌9ను అభివృద్ధి చేసిన సంస్థ?

Human Papillomavirus

జెండర్‌ న్యూట్రల్‌(ఆడా, మగా అందరూ తీసుకోదగిన) హెచ్‌పీవీ టీకా గార్డ్‌సిల్‌9ను ఎంఎస్‌డీ(మెర్క్‌ షార్ప్‌–డొహ్మె) ఫార్మా సెప్టెంబర్‌ 29న దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. 9 వాలెంట్‌ టీకా హెచ్‌పీవీ టైప్స్‌ 6, 11,16, 18, 31, 33, 45, 52, 58 రకాలపై పనిచేస్తుందని తెలిపింది. హెచ్‌పీవీ వైరస్‌ కారణంగా వచ్చే పులిపర్లలాంటివాటి నిరోధంలో, ఈ వైరస్‌ల కారణంగా కలిగే క్యాన్సర్ల నిరోధంలో టీకా ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంది. మగ(9–15 సంవత్సరాలు), ఆడ(9–26 సంవత్సరాలు)వారికి ఈ టీకాను ఇవ్వవచ్చని వివరించింది. గార్డ్‌సిల్‌9ను ఎంఎస్‌డీ సంస్థ తయారు చేసింది. హెచ్‌పీవీ(హ్యూమన్ పాపిల్లోమావైరస్) వైరస్‌లు ఆడవారికి, మగవారికి సోకుతాయి.

స్పుత్నిక్‌–వి..
కోవిడ్‌–19 మహమ్మారి నియంత్రణ కోసం రష్యా స్పుత్నిక్‌–వి పేరుతో కరోనా టీకాను అభివృద్ధి చేసింది. భారత్‌లో ఈ టీకా పంపిణీ బాధ్యతలను డాక్టర్‌ రెడ్డిస్‌ ల్యాబోరేటరీస్‌ సంస్థ స్వీకరించింది. దేశంలో 2021, మే నెలలో దీన్ని ఆవిష్కరించారు. కేవలం ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోనే అందుబాటులో ఉన్న స్పుత్నిక్‌–వి వ్యాక్సిన్‌కు డిమాండ్‌ పడిపోయిందని వైద్య వర్గాలు తెలిపాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :  హెచ్‌పీవీ టీకా గార్డ్‌సిల్‌9 విడుదల
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 29
ఎవరు    : ఎంఎస్‌డీ(మెర్క్‌ షార్ప్‌–డొహ్మె) ఫార్మా సంస్థ
ఎక్కడ    : భారత్‌
ఎందుకు : హెచ్‌పీవీ వైరస్‌ కారణంగా వచ్చే పులిపర్లలాంటివాటి నిరోధంలో, ఈ వైరస్‌ల కారణంగా కలిగే క్యాన్సర్ల నిరోధంలో టీకా ఉపయుక్తంగా ఉంటుందని...


ECGC Listing: ప్రస్తుత ఏడాది ఎన్ని డాలర్ల విలువైన ఎగుమతుల లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది?

Piyush Goyal

ప్రభుత్వ రంగంలోని ఎగుమతుల రుణ హామీ బీమా సేవల సంస్థ– ఈసీజీసీ(ఎక్స్‌పోర్ట్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) ఐపీవో లిస్టింగ్‌కు సెప్టెంబర్‌ 29న కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. వచ్చే ఐదేళ్లలో (2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025–2026 ఆర్థిక సంవత్సరం వరకూ)మూలధనంగా కంపెనీకి రూ.4,400 కోట్లు సమకూర్చడానికి కూడా కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. తద్వారా సంస్థ మరింత మంది ఎగుమతిదారులకు రుణ హామీ బీమా సేవలను అందజేయగలుగుతుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌ గోయెల్‌ తెలిపారు.

400 బిలియన్‌ డాలర్ల లక్ష్యం...
తక్షణం ఈసీజీసీకి రూ.500 కోట్లు మూలధనంగా సమకూర్చుతున్నామని, వచ్చే ఆర్థిక సంవత్సరం మరో రూ.500 కోట్లను సమకూర్చడం జరుగుతుందని మంత్రి గోయెల్‌ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 400 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతుల లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుందన్నారు.

ఎన్‌ఈఐఏ స్కీమ్‌ కొనసాగింపు
నేషనల్‌ ఎక్స్‌పోర్ట్‌ ఇన్సూరెన్స్‌ అకౌంట్‌ (ఎన్‌ఈఐఏ) స్కీమ్‌ కొనసాగింపునకు, అలాగే వచ్చే ఐదేళ్లలో రూ.1,650 కోట్ల మేర గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ అందించడానికి కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదముద్ర వేసినట్లు మంత్రి గోయెల్‌ తెలిపారు. ఈ చర్య ద్వారా మొత్తం 2.6 లక్షల నూతన ఉద్యోగ కల్పన జరుగుతుందని వివరించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ప్రభుత్వ రంగంలోని ఎగుమతుల రుణ హామీ బీమా సేవల సంస్థ– ఈసీజీసీ లిస్టింగ్‌కు ఆమోదం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 29
ఎవరు    : కేంద్ర కేబినెట్‌
ఎక్కడ    : భారత్‌
ఎందుకు : మరింత మంది ఎగుమతిదారులకు రుణ హామీ బీమా సేవలను అందజేసేందుకు...


External Debts: భారత్‌ విదేశీ రుణ భారం ఎన్ని బిలియన్‌ డాలర్లకు చేరింది?

External Debts

కరోనా లాక్‌డౌన్‌లతో ఆర్థికంగా దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎంఎస్‌ఎంఈ) ఆదుకునేందుకు అత్యవసర రుణ హామీ పథకాన్ని (ఈసీఎల్‌జీఎస్‌) మరింత కాలం పాటు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయంచింది. 2020లో తీసుకొచ్చిన ఈ పథకం గడువు వాస్తవానికి 2021 సెప్టెంబర్‌ 30తో ముగిసిపోవాలి. కానీ, 2022 మార్చి 31 వరకు అంటే మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సెప్టెంబర్‌ 29న ప్రకటన విడుదల చేసింది.

జీడీపీలో 21.1 శాతానికి రుణభారం
భారత్‌ విదేశీ రుణ భారం 2021 మార్చి నాటికి వార్షికంగా 2.1 శాతం పెరిగి 570 బిలియన్‌ డాలర్లకు చేరిందని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. ఈ మేరకు సెప్టెంబర్‌ 29న ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం 2020 మార్చి ముగిసే నాటికి భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో విదేశీ రుణ భారం 20.6 శాతం ఉంటే, 2021 మార్చి నాటికి ఈ విలువ 21.1 శాతానికి చేరింది. ఒక్క సావరిన్‌ డెట్‌ వార్షికంగా 6.2 శాతం పెరిగి 107.2 బిలియన్‌ డాలర్లకు చేరింది. నాన్‌ సావరిన్‌ రుణాలు 1.2 శాతం పెరిగి 462.8 బిలియన్‌ డాలర్లకు ఎగసింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఎంఎస్‌ఎంఈల అత్యవసర రుణ హామీ పథకాన్ని (ఈసీఎల్‌జీఎస్‌) మరో ఆరు నెలల పాటు(2022 మార్చి 31 వరకు) పొడిగించాలని నిర్ణయం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 29
ఎవరు    : కేంద్ర ఆర్థిక శాఖ 
ఎందుకు : కరోనా లాక్‌డౌన్‌లతో ఆర్థికంగా దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎంఎస్‌ఎంఈ) ఆదుకునేందుకు...


Telugu Poet: మాగ్జిమ్‌ గోర్కీ ‘మదర్‌’ నవలను తెలుగులోకి అనువదించిన వ్యక్తి?

Ex Mla Dr MV Ramana Reddy

వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, రాయలసీమ ఉద్యమ నేత, సాహితీవేత్త డాక్టర్‌ ఎంవీ రమణారెడ్డి(ఎంవీఆర్‌)(78) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా సెప్టెంబర్‌ 29న కర్నూలులోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. సామాజిక, సాహిత్య అంశాలపై వ్యాసకర్తగా, కరపత్ర, కథా రచయితగా, అనువాదకునిగా, విమర్శకునిగా, చరిత్రకారునిగా, పత్రికా నిర్వాహకుడిగా విభిన్న విశిష్టతలు కలిగిన వ్యక్తిగా ఆయన పేరు గడించారు.

డాక్టర్‌ నుంచి రాజకీయ నేతగా..
ప్రొద్దుటూరులో 1944 ఏప్రిల్‌ 4న జన్మించిన ఎంవీఆర్‌.. గుంటూరు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. తర్వాత ఎల్‌ఎల్‌బీ చదివారు. ప్రొద్దుటూరులో ఒక్క రూపాయికే వైద్య సేవలు అందించారు. కొంత కాలం న్యాయవాదిగా పని చేసిన ఆయన... 1983లో ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత కాలంలో రామారావుతో రాయలసీమ సమస్యలపై విభేదించి.. రాయలసీమ విమోచన సమితి స్థాపించారు.

సాహిత్య పరిచయం

  • ‘కవిత’ అనే సాహిత్య మాస పత్రిక, ‘ప్రభంజనం’ అనే రాజకీయ పక్ష పత్రికను నడిపారు. 1983లో రాయలసీమ కన్నీటి గాథ అనే పుస్తకాన్ని ప్రచురించారు.
  • తెలుగు సినిమా – స్వర్ణయుగం, పురోగమనం, పరిష్కారం, ఆయుధం పట్టని యోధుడు, తెలుగింటికి వచ్చిన ద్రౌపది, చివరకు మిగిలింది, పెద్దపులి ఆత్మకథ, మాటకారి, శంఖారావం, తెలుగింటి వ్యాకరణం తదితర పుస్తకాలు రాశారు.
  • మాగ్జిమ్‌ గోర్కీ(రష్యా రచయిత) ‘మదర్‌’ నవలను తెలుగులో ‘కడుపు తీపి’ పేరుతో అనువదించారు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : మాజీ ఎమ్మెల్యే, రాయలసీమ ఉద్యమ నేత, సాహితీవేత్త కన్నుమూత 
ఎప్పుడు : సెప్టెంబర్‌ 29
ఎవరు    : డాక్టర్‌ ఎంవీ రమణారెడ్డి(78)
ఎక్కడ    : కర్నూలు, కర్నూలు జిల్లా
ఎందుకు : గుండెపోటు కారణంగా..


NSO Report: ఉద్యోగాల్లో గ్రామీణ మహిళల సంఖ్య ఎంత శాతం?

Woman

సీనియర్, మధ్యస్థాయి మేనేజ్‌మెంట్‌ పొజిషన్ల(ఉద్యోగాల)లో పట్టణాలకంటే గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఉన్నట్లు జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్‌ఎస్‌వో) వెల్లడించింది. ఈ మేరకు సెప్టెంబర్‌ 29న ఒక నివేదికను విడుదల చేసింది. 2019 జులై– 2020 జూన్‌ మధ్యకాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ గణాంకాలను రూపొందించారు.
నివేదిక ప్రకారం... 

  • 2019–20 ఏడాదికిగాను మేనేజ్‌మెంట్‌ స్థాయి సిబ్బంది మొత్తంలో గ్రామీణ ప్రాంతాలలో మహిళల సంఖ్య 21.5 శాతంగా నమోదైంది. ఇదే సమయంలో పట్టణాలలో ఈ సంఖ్య 16.5 శాతమే.
  • పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే(పీఎల్‌ఎఫ్‌ఎస్‌) ప్రకారం మొత్తం సీనియర్, మధ్యస్థాయి మేనేజ్‌మెంట్‌ సిబ్బందిలో పట్టణాలు, గ్రామాలలో కలిపి మహిళా వర్కర్ల నిష్పత్తి 18.8 శాతంగా నమోదైంది.

అథారిటీలదే బాధ్యత..
చేత్తో మలమూత్రాలను ఎత్తిపోసే కార్మికుల(మాన్యువల్‌ స్కావెంజర్లు) మరణాలపై సంబంధిత అథారిటీలదే బాధ్యత అని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ) పేర్కొంది. దేశంలో ఈ వ్యవస్థను గతంలోనే నిషేధించినా ఇంకా కొనసాగుతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సదరు కార్మికుల రక్షణ, భద్రతకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక సంస్థలకు సెప్టెంబర్‌ 29న ఎన్‌హెచ్‌ఆర్సీ పలు సిఫారసులు చేసింది.


Covid Vaccine: కొవాగ్జ్‌ కార్యక్రమం ఏ సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతోంది?

Vaccination

కరోనాపై పోరాటంలో సరైన సమయంలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసుల్ని ప్రపంచ దేశాలకు పంపిణీ చేసినందుకు గాను ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి వేదికగా భారత్‌కు వివిధ దేశాలు కృతజ్ఞతలు తెలిపాయి. సెప్టెంబర్‌ 21–27 వరకు జరిగిన సదస్సులో వివిధ దేశాధినేతలు భారత్‌కు ధన్యవాదాలు చెప్పారు. భారత్‌ సహకారం లేనిదే ప్రపంచంలో ఎన్నో దేశాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సక్రమంగా జరిగేది కాదని నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్‌ బుహారి ప్రశంసించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘‘కొవాగ్జ్‌’’ కార్యక్రమంలో భాగంగా భారత్‌ 100కిపైగా దేశాలకు 6.6 కోట్ల టీకా డోసుల్ని ఎగుమతి చేసింది.

కొవాగ్జ్‌...
అన్ని దేశాలకు(ముఖ్యంగా నిరుపేద దేశాలకు) కరోనా టీకాలను సమానంగా అందజేయాలనే ఉద్దేశంతో డబ్ల్యూహెచ్‌ఓ, వ్యాక్సిన్‌ గ్రూప్‌ గవీ వంటి పలు సంస్థలు కొవాగ్జ్‌(COVAX) కార్యక్రమాన్ని చేపట్టాయి. డబ్ల్యూహెచ్‌వో ఆధ్వర్యంలో ఇది కొనసాగుతోంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన ప్రపంచ దేశాలు
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 28
ఎక్కడ    : సెప్టెంబర్‌ 21–27 వరకు జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో...
ఎందుకు : కరోనాపై పోరాటంలో సరైన సమయంలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసుల్ని ప్రపంచ దేశాలకు పంపిణీ చేసినందుకు గాను..

 

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, సెప్టెంబర్‌ 29 కరెంట్‌ అఫైర్స్‌

 

Published date : 30 Sep 2021 07:43PM

Photo Stories