Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, సెప్టెంబర్‌ 29 కరెంట్‌ అఫైర్స్‌

Crop Varieties

Agricultural: ప్రధాని ఆవిష్కరించిన 35 నూతన వంగడాలను అభివృద్ధి చేసిన సంస్థ?

భారత వ్యవసాయ పరిశోధనా సమాఖ్య(ఐసీఏఆర్‌) అభివృద్ధి చేసిన 35 రకాల నూతన వంగడాలను సెప్టెంబర్‌ 28న ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఐసీఏఆర్‌ సంస్థలతోపాటు కేంద్రీయ, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన్‌ కేంద్రాలలో వర్చువల్‌ విధానం ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో కొత్త వంగడాలను మోదీ విడుదల చేశారు. అనంతరం ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో నిర్మించిన జాతీయ బయోటిక్‌ స్ట్రెస్‌ టాలరెన్స్‌ సంస్థ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే నాలుగు యూనివర్సిటీలకు గ్రీన్‌ క్యాంపస్‌ అవార్డులను ప్రదానం చేశారు. ‘సైంటిస్టులు 1300 రకాలకు పైగా విత్తన వెరైటీలను అభివృద్ధి చేశారు. ఈ రోజు మరో 35 వెరైటీలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి’ అని ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు.

ప్రధాని విడుదల చేసిన కొత్త వంగడాల్లో వర్షాభావ పరిస్థితులను, చీడలను తట్టుకొనే కంది, సెనగ, సోయా, వరి, సజ్జ, మొక్కజొన్నతో పాటు అధిక పోషకవిలువల గోధుమ రకాలు ఉన్నాయి. కరవు తదితర కఠిన వాతావరణ పరిస్థితులను, వివిధ రకాల వ్యాధులను తట్టుకొని అధిక పోషక విలువలున్న ఆహారాన్ని అందించే వీటిని అభివృద్ధి చేశారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారత వ్యవసాయ పరిశోధనా సమాఖ్య(ఐసీఏఆర్‌) అభివృద్ధి చేసిన 35 రకాల నూతన వంగడాల ఆవిష్కరణ
ఎప్పుడు : సెప్టెంబర్‌ 28
ఎవరు    : ప్రధాని నరేంద్ర మోదీ  
ఎందుకు : సాగు రంగంలో సమస్యలను సాంకేతికతతో అధిగమించేందుకు...


NDMA: కేంద్రం ప్రారంభించనున్న ఆపద మిత్ర కార్యక్రమం ఉద్దేశం?

Aapda Mitra

జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ) సెప్టెంబర్‌ 28న న్యూఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మాట్లాడారు. ఎలాంటి విపత్తు సంభవించినా తక్షణం స్పందించేలా పౌరులకు శిక్షణ ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా 350 జిల్లాల్లో ‘ఆపద మిత్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోందని వెల్లడించారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం... విపత్తులు సంభవించినప్పుడు తక్షణం ఎలా స్పందించాలి, ప్రజలను ఆపద నుంచి ఎలా కాపాడాలి వంటి విషయాలపై ఆపద మిత్ర కార్యక్రమంలో శిక్షణ ఇస్తారు. దీనికి సంబంధించి 28 రాష్ట్రాలతో కేంద్రం ఒప్పందం చేసుకుంది. వరదలు తరచూ సంభవించేందుకు అవకాశం ఉన్న 25 రాష్ట్రాల్లోని 30 జిల్లాల్లో చేపట్టిన ‘ఆపద మిత్ర’ పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైంది. ప్రాజెక్టులో పాలుపంచుకునే వారికి బీమా సౌకర్యం ఉంటుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆపద మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 28
ఎవరు    : కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా
ఎక్కడ    : దేశవ్యాప్తంగా 350 జిల్లాల్లో...
ఎందుకు  : విపత్తులు సంభవించినప్పుడు తక్షణం ఎలా స్పందించాలి, ప్రజలను ఆపద నుంచి ఎలా కాపాడాలి వంటి విషయాలపై పౌరులకు శిక్షణ ఇచ్చేందుకు...


FM Nirmala Sitharaman: గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌–2021ను ఎక్కడ నిర్వహించారు?

FM Nirmala-Fintech Fest 2021

ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఐఎంఏఐ) సెప్టెంబర్‌ 28న న్యూఢిల్లీలో నిర్వహించిన ‘గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌ 2021’ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రసంగించారు. అనంతరం ‘బాధ్యతాయుత చెల్లింపుల విషయమై ఐక్యరాజ్యసమితి సూత్రాలు’ అనే నివేదికను ఆవిష్కరించారు. డిజిటల్‌ చెల్లింపులు పెరుగుతున్న నేపథ్యంలో క్లయింట్ల డేటా గోప్యత విషయంలో రాజీ పడకూడదని ఈ సందర్భంగా మంత్రి నిర్మల పేర్కొన్నారు. డిజిటల్‌ మోసాలను నివారించడంలో ఫిన్‌టెక్‌ (ఫైనాన్షియల్‌ టెక్నాలజీ కంపెనీలు) సంస్థలు కీలక పాత్ర పోషించగలవని కార్యక్రమంలో పాల్గొన్న ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ టి.రవిశంకర్‌ అన్నారు.

రూ.71.4 లక్షల కోట్లకు రాష్ట్రాల రుణ భారం: క్రిసిల్‌
రాష్ట్రాల రుణ భారం 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.71.4 లక్షల కోట్లకు చేరుతుందని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ తన నివేదికలో పేర్కొంది. రాష్ట్రాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో చూస్తే వాటి రుణ భారం 2021–22లో 33 శాతంగా ఉంటుందని తెలిపింది. 2020–21 ఆర్థిక సంవత్సరంతో (34 శాతం) పోల్చితే ఇది దాదాపు సమానమేనని వివరించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌ 2021 కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 28
ఎవరు    : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
ఎక్కడ    : న్యూఢిల్లీ


TISS: టాటా ఇన్‌స్టిట్యూట్‌తో భాగస్వామ్యం చేసుకున్న సంస్థ?

TISS

వాహన తయారీ రంగంలో ఉన్న మారుతి సుజుకీ తాజాగా ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌తో (టీఐఎస్‌ఎస్‌)  భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఆటోమోటివ్‌ రిటైల్‌ స్పెషలైజేషన్‌తో రిటైల్‌ మేనేజ్‌మెంట్‌లో మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సును  టీఐఎస్‌ఎస్‌కి చెందిన స్కూల్‌ ఆఫ్‌ వొకేషనల్‌ ఎడ్యుకేషన్‌ అందిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా ఆటోమొబైల్‌ రిటైల్‌ రంగంలో యువత సులభంగా ఉపాధి దక్కించుకునేలా పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను కల్పిస్తారు.

బీహెచ్‌ఈఎల్‌కు గోవా షిప్‌యార్డ్‌ నుంచి ఆర్డర్‌
ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) తాజాగా గోవా షిప్‌యార్డ్‌ నుంచి ఆర్డర్‌ పొందింది. ఇందులో భాగంగా ఆధునీకరించిన సూపర్‌ ర్యాపిడ్‌ గన్‌ మౌంట్‌ (ఎస్‌ఆర్‌జీఎం) ఆయుధ వ్యవస్థను బీహెచ్‌ఈఎల్‌ సరఫరా చేయనుంది. భారత నావికాదళంలోని చాలా యుద్ధ నౌకలలో ప్రధాన తుపాకీగా ఎస్‌ఆర్‌జీఎంను వినియోగిస్తున్నారు. బీహెచ్‌ఈఎల్‌కు చెందిన హరిద్వార్‌ ప్లాంట్‌ వీటిని తయారు చేయనుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌తో (టీఐఎస్‌ఎస్‌)  భాగస్వామ్యం చేసుకున్న సంస్థ?
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 28
ఎవరు    : మారుతి సుజుకీ  
ఎందుకు : ఆటోమొబైల్‌ రిటైల్‌ రంగంలో యువత సులభంగా ఉపాధి దక్కించుకునేలా పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను కల్పించేందుకు...


Andhra Pradesh: ప్రభుత్వ సలహాదారుగా నియమితులుకానున్న పద్మశ్రీ అవార్డీ?

Dr Dattatreyudu Nori

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్‌ వైద్య నిపుణుడు, పద్మశ్రీ డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు సమావేశమయ్యారు. సెప్టెంబర్‌ 28న తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ప్రజారోగ్యం, ముఖ్యంగా క్యాన్సర్‌ నివారణ, చికిత్సలు, ఆధునిక విధానాలపై సుదీర్ఘ సమాలోచనలు జరిగాయి. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో క్యాన్సర్‌ చికిత్స కోసం ప్రత్యేకంగా ఆస్పత్రులను ఏర్పాటు చేయడంతో పాటు అందులో ఒకటి అత్యాధునికంగా తీర్చిదిద్దాలని సీఎం జగన్‌ సంకల్పించారని డాక్టర్‌ నోరి తెలిపారు.

సలహాదారుగా...    
క్యాన్సర్‌ చికిత్సకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వానికి సలహాదారుగా ఉండాలని డాక్టర్‌ నోరిని ఈ సందర్భంగా సీఎం జగన్‌ కోరారు. ఈ మేరకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారుగా నియమితులుకానున్న పద్మశ్రీ అవార్డీ?
ఎప్పుడు : సెప్టెంబర్‌ 28
ఎవరు    : ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్‌ వైద్య నిపుణుడు, పద్మశ్రీ డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు 
ఎందుకు : క్యాన్సర్‌ చికిత్సకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించేందుకు...


Andhra Pradesh: రాష్ట్రంలోని ఏ జిల్లాలో బ్లూ స్టార్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటవుతోంది?

Blue Star

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో రూ.520 కోట్ల పెట్టుబడితో బ్లూ స్టార్‌ ఏసీల తయారీ యూనిట్‌ ఏర్పాటవుతోంది. 25 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న యూనిట్‌ తొలి దశకు బ్లూస్టార్‌ ఎండీ బి.త్యాగరాజన్‌ సెప్టెంబర్‌ 29న భూమి పూజ చేయనున్నారు. తొలి దశలో రూ.250 కోట్ల పెట్టుబడితో ఐదు లక్షల రూమ్‌ ఏసీల సామర్థ్యంతో యూనిట్‌ ఏర్పాటు చేయనున్నారు. రెండో దశలో రూ.270 కోట్ల పెట్టుబడితో ఏడాదికి 7 లక్షల రూమ్‌ ఎసీల సామర్థ్యంతో యూనిట్‌ను విస్తరించనున్నారు. ప్రస్తుతం బ్లూ స్టార్‌కు హిమాచల్‌ప్రదేశ్‌లో రెండు యూనిట్లు ఉండగా ఇప్పుడు ఏపీలో ఏర్పాటు చేసే యూనిట్‌తో మూడోది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద బ్లూ స్టార్‌ యూనిట్‌ ఏర్పాటవుతోంది.

పాలవెల్లువ, మత్స్య శాఖలపై సమీక్ష
జగనన్న పాలవెల్లువ, మత్స్య శాఖలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సెప్టెంబర్‌ 28న తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆక్వా హబ్‌ల్లో చిన్న సైజు రెస్టారెంట్‌ ఏర్పాటు చేసే ఆలోచన చేయాలని సూచించారు. ఆక్వా రైతులకు మంచి ధరలు కల్పించేలా ఆక్వాహబ్‌లు, రిటైల్‌ వ్యవస్థలను తెస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య రూపొందించిన పాలవెల్లువ మార్గదర్శకాలు, శిక్షణ కరదీపిక పుస్తకాలను సీఎం ఆవిష్కరించారు. ‘ఫిష్‌ ఆంధ్రా’ లోగోను విడుదల చేశారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : రూ.520 కోట్ల పెట్టుబడితో ఏసీల తయారీ యూనిట్‌ ఏర్పాటు
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 29
ఎవరు    : బ్లూ స్టార్‌ సంస్థ
ఎక్కడ    : శ్రీసిటీ, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 


Computer Science: భారత్‌లో ఫ్యూచర్‌ ఇంజనీర్‌ ప్రోగ్రాం చేపట్టనున్న సంస్థ?

Amazon Future Engineer

భారత్‌లో అమెజాన్‌ ఫ్యూచర్‌ ఇంజనీర్‌ (ఏఎఫ్‌ఈ) ప్రోగ్రాంను చేపట్టాలని ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ నిర్ణయించింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా తక్కువ ప్రాతినిధ్యం, వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే నాణ్యమైన కంప్యూటర్‌ సైన్స్‌ (సీఎస్‌) విద్యను అందిస్తారు. అలాగే భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు పొందేందుకు సాయం చేస్తారు. తొలి ఏడాది లక్ష మందికిపైగా విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, హరియణ, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశాలోని 900 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలను ఎంపిక చేస్తారు.

6–12 తరగతి విద్యార్థులకు...
అమెజాన్‌ ఫ్యూచర్‌ ఇంజనీర్‌ కార్యక్రమంలో భాగంగా 6–12 తరగతి విద్యార్థులకు బోధన ఉంటుంది. కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులను భారతీయ భాషల్లో బోధిస్తారు. రాబోయే కాలంలో ఇతర రాష్ట్రాలకూ ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తారు. కార్యక్రమ అమలు కోసం లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలతో అమెజాన్‌ భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. భారత్‌లో నాణ్యమైన సీఎస్‌ను పరిచయం చేసేందుకు కంపెనీ అంతర్జాతీయ నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌ కోడ్‌.ఓఆర్‌జీ అనే స్వచ్చంద సంస్థతో కలిసి అమెజాన్‌ పనిచేస్తోంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : అమెజాన్‌ ఫ్యూచర్‌ ఇంజనీర్‌ (ఏఎఫ్‌ఈ) ప్రోగ్రాంను చేపట్టనున్న సంస్థ?
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 28
ఎవరు    : ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌
ఎక్కడ    : భారత్‌
ఎందుకు : వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే నాణ్యమైన కంప్యూటర్‌ సైన్స్‌ (సీఎస్‌) విద్యను అందించేందుకు...


Zojila Tunnel: ఆసియాలోనే అతిపెద్ద సొరంగ మార్గాన్ని ఎక్కడ నిర్మిస్తున్నారు?

NItin Gadkari-Zozila Tunnel

జమ్మూ, కశ్మీర్‌లోని శ్రీనగర్, లద్దాక్‌లోని లేహ్‌ల మధ్య ప్రయాణ కాలాన్ని మూడున్నర గంటల నుంచి 15 నిమిషాలకు తగ్గించే జోజిలా పాస్‌ సొరంగ మార్గం(జోజిలా టన్నెల్‌) నిర్మాణ పనులను సెప్టెంబర్‌ 28న కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పరిశీలించారు. అంతకుముందు శ్రీనగర్‌–లేహ్‌ మార్గంలో నిర్మిస్తున్న మరో టన్నెల్‌ ప్రాజెక్టు అయిన జెడ్‌–మోర్‌ పనులను కూడా మంత్రి పరిశీలించారు. జోజిలా టన్నెల్‌ ప్రాజెక్టు పనుల పూర్తికి గడువు 2026 అయినప్పటికీ 2023లోనే పూర్తి చేసేందుకు కృషి చేయాలని ఎంఈఐఎల్‌ ఎం.డి. కృష్ణారెడ్డికి గడ్కరీ సూచించారు.

ఏడాది పొడవునా ప్రయాణాలు...
శ్రీనగర్‌ నుంచి లేహ్‌ ప్రాంతంలో ఉన్న రహదారిని హిమపాతం కారణంగా ఏడాదిలో 6 నెలలపాటు(శీతాకాలంలో) పూర్తిగా మూసివేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో సుదీర్ఘ దూరం ప్రయాణించడానికి అత్యధిక వ్యయ ప్రయాసలతో పాటు సమయం కూడా వృధా అవుతోంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా సోనామార్గ్‌ నుంచి కార్గిల్‌ మీదుగా లేహ్, లడఖ్‌కు ఈ రహదారి జోజిలా టన్నెల్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏడాది పొడవునా ప్రయాణాలకు వీలవుతుంది.

జోజిలా టన్నెల్‌ విశేషాలు...

  • ఇన్‌ఫ్రా దిగ్గజం మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ (ఎంఈఐఎల్‌) పోటీ సంస్థల కన్నా అత్యంత తక్కువగా కోట్‌ చేసి ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. ఎంఈఐఎల్‌ రూ. 4,509.5 కోట్లకు బిడ్‌ వేసింది.
  • నిర్మాణ పనులను 2020, అక్టోబర్‌ 15న మంత్రి గడ్కరీ ప్రారంభించారు.
  • సుమారు 14.15 కి.మీ. పొడవుండే ఈ టన్నెల్‌ను షెడ్యూల్‌ ప్రకారం ఆరేళ్లలో పూర్తి చేయాలి.
  • ఈ టన్నెల్‌ పూర్తయితే ఆసియాలోనే అత్యంత పొడవైన టన్నెల్‌గా నిలుస్తుంది. శ్రీనగర్‌–లేహ్‌ మధ్య ప్రయాణ సమయం 3 గం.ల నుంచి 15 నిమిషాలకు తగ్గిపోతుంది.
  • శ్రీనగర్‌–కార్గిల్‌–లేహ్‌ జాతీయ రహదారిపై 11,578 అడుగుల ఎత్తున ఉండటంతో ఇది వ్యూహాత్మక ప్రాజెక్టుగా మారింది.
  • ఈ సొరంగం అందుబాటులోకి వస్తే శ్రీనగర్, కార్గిల్, లేహ్‌ మధ్య అనుసంధానత సాధ్యమవుతుంది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : జోజిలా పాస్‌ సొరంగ మార్గం(జోజిలా టన్నెల్‌) నిర్మాణ పనులు పరిశీలన
ఎప్పుడు : సెప్టెంబర్‌ 28
ఎవరు : కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ
ఎక్కడ : జోజిలా, లద్దాఖ్‌
ఎందుకు : శ్రీనగర్, లేహ్‌ను అనుసంధానించేందుకు...

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, సెప్టెంబర్‌ 28 కరెంట్‌ అఫైర్స్‌

 

Published date : 29 Sep 2021 06:27PM

Photo Stories