తెలుగు భాషకు అధికార భాష హోదా కల్పించిన రాష్ట్రం?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో డిసెంబర్ 23న సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి తెలుగు భాషకు అధికార భాష హోదా కల్పించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అలాగే తెలుగు ప్రజలను భాషాపరమైన మైనారిటీలుగా గుర్తించే ప్రతిపాదనను కూడా కేబినెట్ ఆమోదించింది.
10కి పైగా అధికార భాషలు...
తెలుగును అధికార భాషగా ప్రకటించాలని బెంగాల్‌లోని తెలుగు ప్రజలు కొన్నేళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మమత ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బెంగాల్‌లో 10కి పైగా అధికార భాషలు ఉన్నాయి. బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ ప్రాంతంలో తెలుగు ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. అందుకే ఖరగ్‌పూర్‌ను మినీ ఆంధ్రాగా పిలుస్తారు.
ప్రశ్న: ‘‘దేశ భాషలందు తెలుగు లెస్స’’ అని అన్నది ఎవరు?
అత్యంత సుప్రసిద్ధమైన ‘‘విజయనగర సామ్రాజ్య’’ చక్రవర్తి శ్రీ కృష్ణదేవ రాయలు తాను రచించిన ‘‘ఆముక్త మాల్యద’’ కావ్యంలో దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికారు. అలాగే కాకతీయుల కాలపు కవి అయిన వినుకొండ వల్లభరాయుడు.. తాను రచించిన నాటకం ‘‘క్రీడాభిరామం’’లో దేశ భాషలందు తెలుగు లెస్స వాక్యాన్ని ఉటంకించారు.
తెలుగదేల యన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ, తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెరుగవే బాసాడి,
దేశభాషలందు తెలుగు లెస్స
- శ్రీ కృష్ణదేవ రాయలు
జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశ భాషలందు తెలుగు లెస్స
జగతి దల్లికంటె సౌభాగ్య సంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె?