Skip to main content

తెలంగాణ సీఎల్పీ నేతగా భట్టివిక్రమార్క

కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేతగా ఖమ్మం జిల్లా మధిర శాసన సభ్యుడు మల్లు భట్టివిక్రమార్క నియమితులయ్యారు.
ఈ పదవి కోసం పార్టీలోని సీనియర్ నేతలు తీవ్రంగా పోటీపడినప్పటికీ.. భట్టి వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపింది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఆయన్ను సీఎల్పీ నేతగా నియమిస్తూ జనవరి 18న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎన్నికల సమయంలో పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా పనిచేసిన భట్టి వైపే రాహుల్ మొగ్గుచూపారు. సామాజిక సమీకరణాల కోణంలోనూ దళిత వర్గాలకు చెందిన భట్టిని ప్రతిపక్ష నాయకుడిగా నియమిస్తే బాగుంటుందనే ఆలోచనతో రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రచార కమిటీ చైర్మన్‌ను సీఎల్పీ నేతగా ఎన్నుకునే ఆనవాయితీ కాంగ్రెస్‌కు ఉంది. అయితే.. ఈసారి సీఎల్పీ నేత పదవి కోసం చాలా మంది నేతలు ప్రయత్నించారు.

గతంలో ఎమ్మెల్సీగా, డిప్యూటీ స్పీకర్‌గా..
గతంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన మల్లు అనంత రాములు సోదరుడైన భట్టి విక్రమార్క 1961లో జన్మించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఖమ్మం జిల్లాలో పనిచేసిన ఆయన ఆంధ్రాబ్యాంక్ డెరైక్టర్‌గా 1996-2000 నామినేటెడ్ (తొలిసారి) పదవి చేపట్టారు. 1990-92 వరకు పీసీసీ కార్యవర్గ సభ్యుడిగా, 2000-03 వరకు పీసీసీ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత 2007-2009 వరకు ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో మధిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన భట్టి.. 2014, 18 ఎన్నికల్లో కూడా అక్కడి నుంచే విజయం సాధించారు. 2009లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా, 2014లో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 2015లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. ఐఏఎస్ అధికారి కావాలని కలలుగన్న భట్టి.. ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో రాణిస్తున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి: తెలంగాణ సీఎల్పీ నేత ఎంపిక
ఎప్పుడు: జనవరి 18
ఎవరు: మల్లు భట్టివిక్రమార్క
ఎక్కడ: తెలంగాణ
Published date : 19 Jan 2019 07:42PM

Photo Stories