Skip to main content

తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి కన్నుమూత

తెలంగాణ రాష్ట్ర మాజీ హోంమంత్రి, కార్మిక నాయకుడు నాయిని నర్సింహారెడ్డి(80) కన్నుమూశారు.
Current Affairs
ఇటీవల కోవిడ్-19 నుంచి కోలుకున్న ఆయన నిమోనియా కారణంగా హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో అక్టోబర్ 22న తుదిశ్వాస విడిచారు. 1940, ఫిబ్రవరి 12న నల్లగొండ జిల్లా చందంపేట మండలం నేరేడుగొమ్మ గ్రామంలో నాయిని నర్సింహారెడ్డి జన్మించారు. హెచ్‌ఎస్‌సీ వరకు చదువుకున్న ఆయన 1958 జనవరి 26వ తేదీన సోషలిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం సోషలిస్టు పార్టీ జాయింట్ సెక్రటరీగా, ఆ తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా పదోన్నతి పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో ట్రేడ్ యూనియన్ లీడర్‌గా మారి కార్మిక సమస్యలపై అనేక పోరాటాలు చేసి కార్మిక నాయకుడిగా ముద్ర వేసుకున్నారు. 1975లో దేశంలో విధించిన ఎమర్జెన్సీ సమయంలో 18 నెలల పాటు జైల్లో గడిపారు.

రాజకీయ అరంగేట్రం...
ముషీరాబాద్ నియోజకవర్గంలో 1978లో జరిగిన సాధారణ ఎన్నికల్లో హేమాహేమీలైన అప్పటి కార్మికమంత్రి టి.అంజయ్య, మాజీ కార్మికమంత్రి జి.సంజీవరెడ్డిలను ఒకే ఎన్నికల్లో ఓడించి నర్సింహారెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. 1985లో రెండోసారి, 2004లో మూడోసారి అదేస్థానం నుంచి గెలుపొందారు. 2004లో వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ మంత్రిగా సేవలందించారు. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికై తొలి హోంమంత్రిగా, కార్మిక శాఖల మంత్రిగా పనిచేశారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : తెలంగాణ రాష్ట్ర మాజీ హోంమంత్రి, కార్మిక నాయకుడు కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : నాయిని నర్సింహారెడ్డి(80)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అనారోగ్య కారణాలతో
Published date : 22 Oct 2020 05:52PM

Photo Stories