రాష్ట్రపతి ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులు ఎన్ని?
Sakshi Education
న్యూఢిల్లీ: పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో రైతుల ఆందోళనలకు కారణమైన మూడు వ్యవసాయ బిల్లులు చట్టరూపం దాల్చాయి.
సెప్టెంబర్ 27న విడుదలైన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మూడు బిల్లులను ఆమోదించారు. అవి.. రైతు ఉత్పత్తుల వాణిజ్యం, వ్యాపారం (ప్రోత్సాహం, వసతుల కల్పన) బిల్లు-2020, రైతు(సాధికారత, రక్షణ) ధరల హామీ, వ్యవసాయ సేవల బిల్లు-2020, నిత్యావసరాల(సవరణ) బిల్లు-2020. వీటిలో.. రైతు ఉత్పత్తుల వాణిజ్యం, వ్యాపారం (ప్రోత్సాహం, వసతుల కల్పన) బిల్లు అమల్లోకి వస్తే రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను రాష్ట్రాల ఆధీనంలోని మండీలకు వెలుపల విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది. అదేవిధంగా, రైతు(సాధికారత, రక్షణ) ధరల హామీ, వ్యవసాయ సేవల చట్టంతో కాంట్రాక్టు వ్యవసాయానికి దారులు తెరుచుకుంటాయి. మూడోది.. నిత్యావసరాల(సవరణ) బిల్లు. దీని ద్వారా బంగాళా దుంపలు, ఉల్లిగడ్డలు, వంటనూనెలు, చిరుధాన్యాల సరఫరా, ఉత్పత్తి, పంపిణీపై నియంత్రణలు తొలిగిపోతాయి. ఈ బిల్లులను నిరసిస్తూ అధికార ఎన్‌డీఏ నుంచి శిరోమణి అకాలీదళ్ పార్టీ బయటకు వచ్చింది.
Published date : 29 Sep 2020 01:18PM