Skip to main content

రాష్ట్రంలో ఎంత శాతం మంది విద్యార్థులు పొగాకు వినియోగిస్తున్నారు?

తెలంగాణ రాష్ట్రంలో 13 నుంచి 15 ఏళ్ల వయసు పాఠశాల విద్యార్థులు ఎంత స్థాయిలో పొగాకు వినియోగిస్తున్నారనే దానిపై గ్లోబల్ యూత్ టొబాకో సర్వే (జీవైటీఎస్) జరిగింది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సర్వే వివరాలను కేంద్రం తాజాగా ప్రకటించింది. సర్వే వివరాల ప్రకారం... పాఠశాలలకు వెళ్లే 13 నుంచి 15 ఏళ్ల వయసు వారు తెలంగాణలో 5.2 శాతం మంది పొగాకు ఉత్పత్తులు వినియోగిస్తున్నారు. 13 నుంచి 15 ఏళ్ల విద్యార్థులు పొగాకు ఉత్పత్తులను వినియోగించడంలో దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణ 20వ స్థానంలో ఉంది.

దేశంలో 2003, 2006, 2009, 2019లో నాలుగు రౌండ్లలో జీవైటీఎస్‌ సర్వే జరిగింది. పొగాకు వినియోగం, మానేయడం, పడేసిన సిగరెట్‌ పీకలు తాగడం, మీడియా సందేశాలు, ప్రకటనలు, పొగాకు ఉత్పత్తుల లభ్యత, పొగాకు వినియోగానికి సంబంధించిన పరిజ్ఞానం వంటి అంశాలపై 2019లో సర్వే జరిగింది. దేశవ్యాప్తంగా 987 పాఠశాలల (544 ప్రభుత్వ, 443 ప్రైవేటు)కు చెందిన 97,302 మంది విద్యార్థులు సర్వేలో పాల్గొన్నారు. అయితే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సర్వే జరిగినా రాష్ట్రాల వారీగా అన్ని వివరాలను ప్రకటించలేదు. ఆయా రాష్ట్రాల్లో ఎంత శాతం మంది పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారన్న సమాచారాన్నే కేంద్రం వెల్లడించింది.

సర్వేలోని ముఖ్యాంశాలు...

  • అరుణాచల్‌ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల్లో అత్యధికంగా 57.9 శాతం చొప్పున పొగాకు ఉత్పత్తులను 13 నుంచి 15 ఏళ్ల వయసు విద్యార్థులు వినియోగిస్తుండగా, హిమాచల్‌ప్రదేశ్‌లో అత్యల్పంగా 1.1 శాతం మంది వినియోగిస్తున్నారు.
  • 7.3 శాతం విద్యార్థులు పొగాకు వినియోగిస్తుండగా, అందులో 8.3 శాతం అబ్బాయిలు, 6.2 శాతం అమ్మాయిలు ఉన్నారు.
  • 2003లో సిగరెట్‌ తాగేవారు 4.2 శాతం ఉండగా, 2006లో 3.8 శాతం, 2009లో 4.4 శాతం, 2019లో 2.6 శాతం ఉన్నారు.
  • పట్టణాల్లో 5.5 శాతం మంది, పల్లెల్లో 9.4 శాతం మంది పొగాకు వినియోగిస్తున్నారు.
  • 71 శాతం మంది విద్యార్థులు సిగరెట్‌ తాగడం తమకు హానికరమని భావించారు.
  • పొగతాగే వారిలో 25 శాతం మంది అబ్బాయిలు, 13 శాతం మంది బాలికలు పొగ మానేయడానికి ప్రయత్నిస్తున్నారు.


క్విక్‌ రివ్యూ :
ఏమిటి : పాఠశాలలకు వెళ్లే 13 నుంచి 15 ఏళ్ల వయసు వారు 5.2 శాతం మంది పొగాకు ఉత్పత్తులు వినియోగిస్తున్నారు.
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన గ్లోబల్‌ యూత్‌ టొబాకో సర్వే (జీవైటీఎస్‌)
ఎక్కడ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా...

Published date : 20 Aug 2021 06:29PM

Photo Stories